మా నాయనమ్మ కథలు-3

ఆవ కాయల ప్రహసనం

-లక్ష్మిమదన్

వేసవి వస్తుంది అంటే ఎన్నో జ్ఞాపకాల తరంగాలు. ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో ఉగాది నుండి కొంచెం వేడి మొదలయ్యేది. ఇప్పుడు అన్ని కాలాలాలు వేడిగానే ఉంటున్నాయి.

చిన్న చిన్న మామిడి పిందెలు కాసేవి. వసంతం ఋతువు ఆగమనం. చెట్లన్నీ చిగుళ్లతో పచ్చగా ఉంటాయి. ఎండ వేడి ఎంత ఉన్నా, చల్లని చెట్ల గాలి వీచేది. ఫాన్ల అవసరం లేకుండా ఆరు బయట పడుకునే వాళ్ళము.

మా పెరట్లో కొబ్బరాకుల గల గలలు, కొమ్మల మధ్య నుండి తొంగి చూసే చందమామ, వేప చెట్టు గాలి ఎంతో ఆహ్లాదంగా ఉండేది.

వేసవిలో ముఖ్యమైన ఘట్టం ఆవ కాయలు పెట్టుకోవడం. అది పెద్ద ప్రహసనం ఆ రోజుల్లో

ఆవకాయల ఆరాటం, అవి పెట్టడానికి శ్రమతో కూడిన పోరాటం. వెరసి చక్కని ఆవకాయ. యెంచి తెచ్చుకున్న మంచి మామిడి కాయలు. దంచి తయారు చేసుకున్న కారం, ఆవాల పొడులు. విసుర్రాయిలో విసురుకున్న మెంతులు, జీల కర్ర. ఎప్పుడు తెచ్చుకునే షావుకారు దుకాణం నుండి తెచ్చే నూనె. అక్కడనుండి తెస్తేనే శ్రేష్టం. మా ఊరి అంగడిల తెచ్చిన ఎర్రటి మిరపకాయలు. అవి దంచిన రోజు ఇల్లంతా ఘాటుతో నుండి హచ్ అంటూ తుమ్మడమే! ఇలా ఇంట్లో తయారు చేసుకుంటేనే ఆవకాయ బాగుంటుందని మా నాయనమ్మ నమ్మకం. అన్ని తయారు చేయడం మాటలు కాదు.

రానే వచ్చే ప్రహసనం జరిగే రోజు. మడి కట్టుకుని నాయనమ్మ వాయింపుల పర్వం. చెప్పినట్లు వినే నెమ్మదైన కోడలు మా అమ్మ.

“ఓ పిల్ల! మామిడికాయలు నీళ్లలో వేసినవా”? పిల్లా అని అమ్మను పిలిచేది నాయనమ్మ.

అంతకుముందే చెట్టు నుండి తెంపించిన మామిడికాయలను ఆవకాయ కోసం కొన్ని నీళ్ళల్లో వేసి, మరికొన్నింటిని ఒక చీకటి అర్రలో పండ్ల కోసం ఉంచేది నాయనమ్మ. చక్కగా గడ్డిపరిచి దానిమీద మామిడి ఆకులను పోసి తరగతి గదిలో విద్యార్థులను కూర్చోబెట్టినట్లు వరుసగా అమర్చేది. మా పాఠశాల హెడ్మాస్టరు మా నాయనమ్మనే కదా! ఆ తరువాత ఆ గదికి తాళం పెట్టి, ఎంత మొత్తుకున్న పెట్టిన తాళం చెవి ఇచ్చేది కాదు. ఆ గది నుండి వెళ్తుంటే చక్కని వాసన వచ్చేది అయినా ఇచ్చేది కాదు. కరుణ లేని ముసలమ్మ మా నాయనమ్మ.

“ఆ వేసిన అత్తా” వినయంగా జవాబు చెప్పేది అమ్మ.

“టబ్ బాత్ చేసిన నిగనిగ లాడే మామిడి కాయలు. అందులో నుండి గంపల్లో మెరుస్తూ కూర్చుంటే, బాహుబలి లాగా బాడ్ష పట్టుకుని వచ్చే కమ్మరి బాల నర్సు. నాయనమ్మ ముందు పిల్లి కూననే!  రావడం తోనే కట్ట కట్ట చెక్క మీద కాయలను కొట్టుడే.

” ఇగో, నేను మామిడికాయ ముక్కలను కొట్టి చాపల యేస్తా! మీరు జీడి, పొర తీసేసి మంచిగ పెట్టుండ్రి. మల్ల మీ నాయనమ్మ నన్ను తిడుతుంది” అన్నాడు కమ్మరి బాలనర్సు.

“అసలే నాయనమ్మ చెప్పే పనులకు తిక్క మీదున్న మాకు, ఈయన పెత్తనం అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేస్తాం..

“సరే”అనీ చాపల బుద్ధిగా కూర్చున్నాము.

దూరం నుండి నాయనమ్మ ఆజ మాయిషి “బద్దలు చిన్నగ కొట్టు. అన్ని కంచంలో పారేస్తారు”అని. ఇక పిల్ల కాయలము మేము. పొద్దున ఇంత చద్దన్నమో! అటుకులో పెట్టీ ఆ ముక్కలు అన్ని ఏరించే వాళ్ళు. జీడి పొర తీయాలి. పాల గుల్లలో కెత్తాలి. తిండి మాట తీస్తే మూకుమ్మడి దాడి జరిగే ప్రమాదమని తెలుసుకుని,పేగులు గుర్రు మన్నా అట్లే ఉండే వాళ్ళము. మనసులో మాత్రం..

“ఈ బండ చాకిరీ నశించాలి! నాయనమ్మ డౌన్ డౌన్” అని అనుకునే వాళ్ళము.

ఇక ఆ ముక్కలకు మళ్లీ తానం చేయించేది మా ముసలి. ఇప్పుడు నీళ్ళు పోయ వద్దు అంటున్నారు, కానీ అప్పుడు నీళ్ళు పోసే వాళ్ళు. అయినా ముక్క వయసు పొల్ల గాండ్ల లెక్క కరుకు మీద ఉండేది.

పెద్ద గిన్నెలో వేసి మెంతి ఆవ, బెల్లపు ఆవ, కొబ్బరి ఆవ ఇవన్నీ పెట్టే వాళ్ళు.

ఇక ఆవకాయను మొరటు పల్లె పడుచు లాంటి రా చిప్పలలో, పల్లె పడుచు లాంటి కుండలలో, పట్నం పడుచు లాంటి జాడీలలో ఎత్తి పెట్టీ తెల్లని బట్ట వాయి కట్టి, అప్పుడు అందరికి భోజనాల వడ్డించేవారు. వరుసగా వేసిన పీటలు, చెంబు గ్లాసులతో నీళ్ళు. వాళ్ళు వడ్డన చేస్తుంటే తృప్తిగా తినే వాళ్ళము. ఆలస్యమైన కొద్దీ ఆవురావురుమని తినడమే.

మూడవ రోజున మా నాయనమ్మ చిరునవ్వులు చిందిస్తూ కనిపించేది. మా చిరునవ్వుకు అర్థం ఏమిటో అర్థం అయ్యేది కాదు. తర్వాత ఆవకాయ కలియ బెట్టి అందరికీ మామిడి పండ్లతో భోజనం పెట్టేది. చిరునవ్వుకు అర్థం అదన్నమాట! కొత్త ఆవకాయ, మామిడిపండు. మామిడి పండ్లు ఇవ్వలేదని ఎంతో తిట్టుకున్న నాయనమ్మను చూస్తే ఇప్పుడు బోలెడు ప్రేమ వచ్చేసింది మాకు. ఇంత కఠినంగా ప్రవర్తించింది ఆవకాయతో పాటు ఇవ్వడానికే అని అప్పుడు అర్థమయింది. ఎంతైనా మా నాయనమ్మ మంచి ముసలమ్మ.

ఇక కూరగాయల అవసరమే లేదు. ఆ భోజనం అమృత తుల్యము. ఇదండీ ఆవకాయ ముచ్చట్లు.

ఓ వారం వరకు ఆవకాయ భోజనమే. ఉదయం స్కూలుకు వెళ్ళేటప్పుడు ఆవకాయ కలిపేసి అందరికీ ముద్ధలు పెట్టి పంపించేది అమ్మ. ఇల్లంతా ఆవకాయతో ఘుమ ఘుమ లాడేది. అదండీ ఆవకాయ ప్రహసనం.

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.