జానకి జలధితరంగం-5

-జానకి చామర్తి

దమయంతి

చిన్నప్పుడు రవివర్మ చిత్రం చూసాను, అందమైన మనోహరమైన మహిళ , వయ్యారంగా నిలుచుని , ఓ పక్కగా వాలి, చేతిని ఒక స్తంభానికి ఆన్చి, అందుమీద కిటికీ పక్కగా వాలిన ఒక హంస తో సల్లాపము ఆడుతున్న చిత్రమది. వేసుకున్న ఆభరణాలు రాజసమూ చూస్తే , రాజకుమారి లాగనో, రాణీ లాగానో తోచుతుంది.

ముఖములో కోమలత్వం కంటే గట్టిదనమూ, తేలివితేటలు , పరిణితి కనిపించింది, చిక్కని ఆమె గుబురు కనుబొమలు ధైర్యం కలదానిలాగ ఉంటుందనిపించేట్టు ఉంది.

ఆమె దమయంతి అని తెలిసినపుడు , భారతంలో చదివిన ‘నలోపాఖ్యానం’ , పేరు అది అయినా నేను ‘దమయంతి కధ‘ అనే అంటాను.

ఉపాఖ్యానాలలో ఎన్నిసార్లు చదివినా కొత్తగా కనిపించేది.ఎన్నో మలుపులు , రాజు రాణి గారి కధ అయినా, సామాన్యుడి కష్టాలు , మానసిక చిత్రణ, దమయంతి ధైర్యం , నలమహారాజు దైన్యం .. అన్నీ కలసిన అద్భుత చిత్రణ.

నలుడిని వలచింది, హంస రాయబారం తో తెలుసుకుని , అతనికి తనగురించి ఎరుకపరచింది , బహుశా దమయంతే నేమో , నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు లాగ విడదీసి చూడగల హంసను , పెళ్ళాడగోరే వరుని మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఉపయోగించిన తెలివి గల భామ.

పెళ్ళి సమయంలో కూడా ఇంద్రుడు పెట్టిన పరిక్ష కు తట్టుకుని ఒకేరూపు గల ఐదుగురిలో, అనిముషేయులు ( రెప్పవేయని వారు) దేవతలని విడదీసి, రెప్పవేసే దృష్టి గల మానవుడు , నలుని పెళ్ళాడి, దేవతల మెప్పు పొందింది.

“ ద్యూతము “ , ఎంత చెడ్డది , కారణమేమైతేనేం , రాజుగా నేనాడబోనని చెప్పలేని బలహీనత గల నలుడు , జూదము ఆడి సర్వస్వమూ ఓడి , రాజ్యము శత్రువులపరం చేసి కట్టుబట్టలతో మిగిలాడు.

ఇక్కడ దమయంతి ధైర్యమూ, సమయస్ఫూర్తి, తెలివీ , సహనమూ , ముందచూపు అక్కరకు వచ్చాయి. కడుపున పుట్టిన పిల్లలను తన తల్లితండ్రల వద్దకు వారి రాజ్యము పంపింది . భర్తకు ధైర్యము చెపుతూ, చేయి పట్టుకు నడిచింది వెంట అడవులకు . సర్వస్వమూ కోల్పోయిన భర్త ను పూర్వము ఉన్న ప్రేమతోనే ఆదరించింది, చేసిన పొరపాటుకు నిందించలేదు.

తినడానికి తిండి లేదు , ఆఖరకు నలుని పైవస్త్రం కూడా పక్షులు ఎత్తుకుపోయినా, కృంగిపోక , సరిసమానంగా కష్టసుఖాలను పంచుకునే ఆదర్శ పత్ని లాగ , తన చీర సగం అతనికి కట్టుకోవడానిక ఇచ్చింది.

కాని, అర్ధరాత్రి మానసికవత్తిడి తట్టుకోలేక , భర్త కట్టుకున్న చీర సగాన్ని చింపుకుని, తనని వంటరిగా అరణ్యం లోవదలి పోతే,

ఆ దమయంతికి ఏది దిక్కు. ఆమె కష్టాలలో ఆమె ధైర్యమే దిక్కయ్యింది, సానుకూల దృక్పధమే సాయమయ్యింది , పిల్లలమీది ప్రేమే పాశమయ్యింది, మంచి రోజులొస్తాయన్న ఆశే నడిపించింది.

అన్నిటినీ మించి జీవించి తీరాలన్న పట్టుదల , తిరిగి తన భర్త పిల్లలు తన సుఖమయ జీవితాన్నీ గెలిచి తీరాలన్న మొండి ధైర్యం , దమయంతికి తనకు గలిగిన కష్టాల మీదపోరాటం చేయడానికి కనిపించని ఆయుధాలయ్యాయి.

ద్వితీయ వివాహం .., ఒక సాంప్రదాయపు ఇల్లాలు , ఇద్దరు బిడ్డల తల్లి తలపెట్టిందంటే , ఎంత ధైర్యం ఉండాలి, ఎంత అవహేళనలును ఎదుర్కోవాలి, అప్పటిలోనే ద్వితీయ వివాహం ఆలోచన తప్పు లేదని, దమయంతి తెలియ చెప్పింది కదూ.

దమయంతి కి ద్వితీయ వివాహమా , అనుకుంటూ, ఆత్మ న్యూనత తో బాధపడుతూ రూపం మారి వేదన పడుతూ తమ రాజ్యమునకు వచ్చి ఉన్న నలుడిని,

దమయంతి తెలివి , నేర్పుతో , తన తప్పు తెలుసుకొనేట్టు చేసింది, పిల్లలను దగ్గరకు పంపి వారి మీది ప్రేమను జాగృతం చేసింది, అత్యద్భుతమైన వంట చేయగల నైపుణ్యం , తన ద్వితీయ వివాహమని కలవరంగా అతి శీఘ్రంగా రధం నడిపిన అతని శక్తిని , విద్యను , వెలికి తీసింది.

చిట్టచివరగా “ అర్ధరాత్రి కట్టిన బట్టను చింపి, నిద్రస్తున్నఅమాయకపు భార్యను వదిలేసి పోయిన” అతని నిజాయితీని, వివాహబంధం పట్ల అతని బాధ్యతని నిలదీసి అడిగింది. అతను చేసిన తప్పును అతనికి మెత్తగా ఎత్తి చూపింది.

ఎన్నో పొరపాట్లు ఎందరి పట్లనో చేయవచ్చు, కాని వివాహమాడిన భార్యని మోసం చేసి విడిచి పోయే భర్తల బాధ్యతారాహిత్యాన్ని , దమయంతి ఆ కాలంలోనే ఎలుగెత్తి ప్రశ్నించింది , సూటిగా , మనసులో నాటేటట్టుగా.

తప్పు తెలుసుకుని పూర్వపు మనిషి గా మార్చి దక్కించుకుంది తన పతిని. ద్వితీయవివాహమనే పేరు తో అద్వితీయమైన ఆలోచన చేసి తన వాడినే చేసుకుంది మళ్ళీ. మళ్ళీ రాజ్యాలు భోగాలు గెలిచేట్టు చేయగలిగింది దమయంతి .

కాబట్టి “ దమయంతోపాఖ్యానం” అన్నదే సరియైన మాట నా దృష్టి లో ఈ కధ కు.

తరువాతి కాలం లో ఈ కాలం దాకా కూడా, భర్తలు వదలివేసిన ఎంత మంది మహిళలు , తమ తప్పు ఏమీ లేకుండానే, దుర్భరమైన మానసిక వేదనతో గడిపినవారున్నారు. ఆర్ధిక ఆలంబన లేక పరాయి పంచలలో తలదాచుకుని కృంగినవారున్నారు. పిల్లలను సరిగా పెంచలేక, వారికి మంచి భవిష్యత్ అందించలేక, తండ్రి గురించి వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దుఃఖించినవారున్నారు.

కాని కాలం మారుతోంది, ముఖ్యంగ చదువు వివేకం ఆలోచనాశక్తి , చేస్తున్న ఉద్యోగాల వల్ల వచ్చిన ఆర్ధిక భరోసా తో , ఇప్పటి కాలం మహిళలు ధైర్యం చూపుతున్నారు. భర్తల మనోభావాలు అర్ధం చేసుకుని , వారు నిజమైన మంచివారు అయితే కేవలం ఏ ఆత్మన్యూనత కో గురి అయి , తమని వదిలిపోయే పరిస్తితులు ఎదురైనా , మరే ఇతర పరిష్కరించగల సమస్యల పైనా , సలహాలిచ్చి తెలియచెప్పి నచ్చ చెపుతున్నారు.

అలాకాక భరించ లేని పరిస్తితులు పెళ్ళి చేసుకున్నవాడు కల్పిస్తే, భయపడటం లేదు వదిలి వెడతాను అనే బెదిరింపులకు.

నిజంగా వదిలివెడిపోయినా ఈనాటి స్త్రీ కృంగిపోవడం లేదు . మానసికంగా అది ఒక దెబ్బ అయినా, సమాజం అవహేళనలు చేస్తున్నా , తన దారిని నిర్దుష్టంగా నిర్దేశించుకోగలుగుతోంది, అదరకుండా , బెదరకుండా..

తమ పిల్లలను సింగిల్ పేరంట్ గా పెంచుకోగలుగుతున్నారు, అది ఒక తప్పు విషయం కాదని, తలెత్తుకుని. పిల్లలకు తల్లి తండ్రి , ఇద్దరి ప్రేమను ఒక్కరిగా అందిస్తూ, తమ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు నేటి మహిళలు.

భర్త వదిలేసిన ఆడది ద్వితీయవివాహం చేసుకుని, తన జీవితం లో మరల శుభోదయం తెచ్చికోవడంలో కూడా సామాన్యంగా జరిగే విషయమే ఇప్పుడు. వదిలి వెళ్ళినవానిని తలపోస్తూ కూచోకుండా , న్యాయమార్గం లో విడాకుల పరిష్కారం తీసుకుని, తమ జీవితాలను సరిదిద్దుకునే సమయానుకూలమైన తెలివితేటలు ఇప్పటి మహిళలు చూపగలగడం మంచి మార్పు , ఎంతో హర్షదాయకం.

ఇవన్నీ ఆలోచిస్తుంటే , దమయంతి, ఇటువంటి ఆలోచనలకు , ధైర్యము, ముందుచూపు తెలివితేటలు చూపడంలో..ఇప్పుడు ఇటువంటి మహిళలందరి కంటే , ముందు నడిచినట్టుంది కదూ!

అన్నట్టు దమయంతి చక్కదనం , ఛామనఛాయలో ఉందిట, ఎక్కడో విన్నాను, నాణ్యమైన నలుపురంగు అందాన్ని వికసింపచేసిన నల్లకలువ కూడానుట మన ‘దమయంతి’.

*****

Please follow and like us:

3 thoughts on “జానకి జలధితరంగం-5”

  1. Chala bagundi mee visleshana. Nakkooda enduko sthreelalo andam kanna aatma vishvasam , dhairyame ekkuva nachutayi

Leave a Reply

Your email address will not be published.