
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24
– విజయ గొల్లపూడి
జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
***
జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి చేరుకోవడానికి, కొన్ని అవస్థలు తప్పవు. ఆ సమయంలో రోజులు భారంగా గడచినట్లు అనిపించవచ్చు. ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడచిన భావన కలుగుతుంది. కానీ ఆ సంక్రమణ సమయంలో కాస్త సంయమనం పాటించి, ఆలోచనా పథంలో యోచన చేసుకుంటూ పయనిస్తే, చాలా సునాయాసంగా జీవిత నౌకను గమ్యం చేర్చవచ్చు.
విష్ణుసాయి మనసు పరిపరివిధాలా ఎన్నో ఆలోచనలతో తల్లి,దండ్రి ఎలా ఉన్నారో అని మధన పడుతున్న సమయంలో, ఫోన్ ఓయిస్ మెసేజ్ వచ్చినట్లు నోటిఫికేషన్ రావడంతో, ‘విశాలా!’ అని గట్టిగా కేక వేసాడు.
వంటిట్లో పనిలో ఉన్న విశాల చేసే పని ఆపుచేసి, వెంటనే అతని ముందు వాలింది.
“ ఒకసారి ఓయిస్ మెసేజ్ ఓపెన్ చెయ్యి. నాకా పాస్ వర్డ్ తెలీదు. నువ్వే ఎక్కువగా వాడతావు కదా! అమ్మగానీ మెసేజ్ పెట్టి ఉండవచ్చు.” అన్నాడు కాస్త ఆదుర్దాగా విష్ణు.
విశాల స్థిమితంగా ఫోన్ బటన్స్ నొక్కుతూ, “మన పెళ్ళి రోజునే మన పాస్ వర్డ్ గా పెట్టాను, మీకు నాకు మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండనేకూడదు సుమా” అంది నవ్వుతూ విశాల”.
ఇంతలో ఓయిస్ మెసేజ్ నుంచి, అత్తగారు అన్నపూర్ణ గారు ఇద్దరినీ అభినందిస్తూ “ఎలా ఉన్నారర్రా? ఇంటిలో ఫోన్ డెడ్ అయ్యింది. మధ్యలో శెలవులు అవి రావడంతో, ఇంటికి వచ్చి ఫోన్ బాగుచేసే నాధుడే లేకపోయాడు. ఎలాగైతేనేం, నాన్నగారు వెళ్ళి, మనిషిని తీసుకువచ్చి బాగుచేయిస్తే, ఆ ఫోన్ కి ఇప్పటికి విముక్తి కలిగింది. మీ ఇద్దరి యోగ క్షేమాలు తెలియక, కంగారుగా ఉంది. మీకు పంపిన వస్తువులు అన్నీ కొరియర్ లో చేరాయనే అనుకుంటున్నాను. ఇద్దరికి అర్థ సంవత్సర వైవాహికోత్సవ శుభాకాంక్షలు. ఇద్దరూ సంతోషంగా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, జాగ్రత్తగా ఉండండి” ఇద్దరూ ఆ మెసేజ్ విని, ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆనందంగా నవ్వుకున్నారు.
“ఐతే మీ గెస్సింగ్ కరక్ట్, ముందే ఊహించి బాగానే చెప్పారు ఫోన్ డెడ్ అయి ఉండవచ్చునని. అపుడే ఆరు నెలలు అయిపోయిందా మన పెళ్ళి అయ్యి, చాలా వేగంగా గడిచిపోతున్నాయి రోజులు” అంది విశాల.
“విశాలా! నీకో సర్ ప్రైజ్! ఇపుడే చెప్పను. ఈ శనివారం ఒకచోటకి వెళ్ళబోతున్నాము. మాములు ట్రెడిషనల్ లుక్ తో కాకుండా, వెస్ట్రన్ ట్రౌజర్స్ తో ఎనిమిది గంటలకు సిద్ధంగా ఉండాలి” అన్నాడు విష్ణు.
మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండ విష్ణు, చేతిలోకి ఫోన్ రిసీవర్ తీసుకుని ఫోన్ రింగ్ చేసాడు.అవతలినుంచి తండ్రి గొంతు వినగానే, “నాన్నగారు, ఎలా ఉన్నారు? మొన్నటి నుంచి ఫోన్ ప్రయత్నిస్తుంటే ఈ రోజుకి ఫోన్ కలిసింది. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చేస్తే ఈ బాధలుండవు. ఇక్కడ నేను, విశాల బయటకు వెళ్ళినపుడు మొబైల్ ద్వారా ఎక్కడ ఉన్నది కనుక్కుంటూ, మాట్లాడుకుంటాము. ఫోన్ పనిచేయకపోతే, ఈసారి విశాల వాళ్ళ ఇంటి నుంచి అయినా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇండియాలో కూడా
మొబైల్ ఫోన్స్ త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తాయిలెండి నాన్నగారు” అన్నాడు విష్ణు.
విశాల, విష్ణు దాదాపు అరగంట వరకు ఇండియాలో తల్లిదండ్రులిరువురివైపు ఫోన్ చేసి, మనసులోని బెంగను దించుకున్నారు.
విష్ణుసాయి, విశాలను ఊరిస్తూ, ఆశ్చర్యంలో ముంచెత్తిన రోజు రానే వచ్చింది. ఇద్దరూ జీన్స్ ప్యాంట్, పైన ఫుల్ హేండ్స్ షర్డ్ ధరించి రెడీ అయిపోయారు.
కారులో కూర్చుంటూ “మహాశయా! ఇప్పటికైనా ఆ విస్మయమేమిటో వివరించెదరా?” అని గోముగా అడిగింది విశాల.
“తినబోతు రుచుల గురించి అడగనేల, వెళ్ళగానే విషయం నీకే తెలుస్తుంది. అపుడు నీ కళ్ళలో మెరుపుని, నా మనసులో పదిలంగా దాచుకోవాలి” అన్నాడు విష్ణు.
అలా కబుర్లతో యానము చేస్తూ, ఇద్దరూ సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మరొక జంట సిద్దంగా ఉండటం చూసింది విశాల. విష్ణుని చూడగానే ఆ వ్యక్తి కరచాలనం చేసాడు. విష్ణు ఆ జంటకి విశాలని పరిచయం చేసాడు. విశాల, హీ ఈస్ మై కొలీగ్ విలియమ్, హిస్ పార్ట్ నర్ రేచల్ అని ఇద్దరినీ పరిచయం చేసాడు. విశాల ఇద్దరి వైపు నవ్వుతూ చూసి, గ్లాడ్ టు మీట్ యు అని షేక్ హేండ్ ఇచ్చింది.
రెండు జంటలు సిడ్నీ బ్రిడ్జ్ దగ్గర ఆర్చ్ వైపు లోపలకు అడుగు పెట్టారు.
“వావ్, ఏమిటి మనము సిడ్నీ బ్రిడ్జ్ వాక్ కి వెడుతున్నామా?” అని సంభ్రమాశ్చర్యాలతో విశాల ఉబ్బి తబ్బిబ్బయ్యింది.
విష్ణు విశాలవైపు తిరిగి, “యస్ దిసీజ్ ద సర్ ప్రైజ్, నౌ ఐస్ బెర్గ్ బ్రోకెన్. నౌ రిలాక్స్ అన్ద్ ఎంజాయ్ ద సినిక్ వ్యూ” అన్నాడు.
“లెట్స్ గో ఫస్ట్ సీ ద పైలాన్ లుక్ అవుట్” అన్నాడు విలియమ్ ఇద్దరికీ గైడ్ చేస్తూ. అక్కడ మిల్సన్ పాయింట్ దగ్గర ఉన్న లిఫ్ట్ ద్వారా నలుగురు పైలాన్ లుక్ అవుట్ కి చేరుకున్నారు.
అక్కడ 360 డిగ్రీలతో పూర్తిగా సిడ్నీ అందాలు – ఆస్ట్రేలియాకి తలమానికమైన ఒపెరా సౌందర్యం, హార్బర్ బ్రిడ్జ్, ఒలింపిక్ పార్క్ ఇలా మొత్తం సుందర దృశ్యాలు పరుచుకుని కనువిందు చేసాయి.
“నేను ఇంతవరకు ఒక గూటిలో పక్షిలా గువ్వలా ఉన్నాను. ఈ రోజు రెక్కలు విప్పి ఆకాశంలోకి అడుగిడుతున్నట్లుంది. ఈ రోజు అసలు సిసలైన సాహసయాత్ర చేస్తూ, ఆస్ట్రేలియా అందాలను ఆస్వాదిస్తున్నాను. నిజంగానే
గాలిలో తేలె పూలడోలలో, పన్నీరు చల్లే వెన్నెల తీవ
అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో..
అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో..
అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
అలనాడు చిన్నతనంలో తాను విన్న ఘంటసాల, జానకి పాటను గుర్తు చేసుకుంటూ, విశాల గుసగుసగా పాటను హమ్ చేస్తూ, చేతులు రెండూ పూర్తిగా విస్తరింపచేసి, రమణీయ దృశ్యాన్ని చూస్తూ మైమరచి పోయింది. “నేను ఈ యూనివర్స్ కి ఇంతకన్నా ఏమి ఇవ్వగలను? నా మానసిక పరిణితి, పరిధి మరింతగా ఎదగాలి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి అని మనసులో స్వగతంగా అనుకుంది” విశాల.
విశాల అప్రయత్నంగా పాడిన పాటని విని రేచల్ “నాకు పాట భావం పూర్తిగా అర్థం కాకపోయిన, గొంతులో మెలొడీ అద్భుతంగా ఉంది. యూ ఆర్ ఎ ప్యూర్ సౌల్” అని ప్రసంశాపూర్వకంగా చూస్తూ విశాలను మెచ్చుకుంది.
విష్ణు, విశాలవైపు ఆరాధనాపూర్వకంగా చూసాడు. తరువాత అందరూ కలిసి, బ్రిడ్జ్ వాక్ దాదాపు నలబై నిమిషాల పాటు మెట్లు ఎక్కి, సిడ్నీ మహానగరాన్ని, నలువైపులా ఆకాశవీధిలో విహరిస్తూ ఆస్వాదించారు.
అలసట తెలియకుండా విహరించి, నెమ్మదిగా మళ్ళీ సిడ్నీ బ్రిడ్జ్ క్రిందకు వచ్చారు. స్కై ఫీస్ట్ సిడ్నీ రొటేటింగ్ టవర్ దగ్గిర ముందే టేబుల్ బుక్ చేయడంతో లంచ్ కి చేరుకున్నారు. విశాల, విష్ణు ఇటాలియన్ పిజ్జా ఆర్డర్ చేసారు. విలియమ్ పాస్తా ఆర్డర్ చేసాడు.
రెండు జంటలు పరస్పరం పాశ్చాత్య, భారతీయ విలువలు, సంస్కృతి, సంప్రదాయాలు, చూడవలసిన టూరిస్ట్ ప్రదేశాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. చీకటి వెలుగుల కాంతులతో రొటేటింగ్ రెస్టారెంట్ లో 360 డిగ్రీ ల సుందర దృశ్యాలను రెండు జంటలు ఆస్వాదిస్తూ, మళ్ళీ ఎవరి గూటికి వారు వెనుదిరిగారు.
* * * * *
(ఇంకా ఉంది)

నేను సిడ్నీ ఆస్ట్రేలియా లో ఉంటాను. మా తల్లిదండ్రులు శ్రీమతి శ్రీదేవి పెయ్యేటి మరియు శ్రీ రంగారావు పెయ్యేటి గార్లు ఇరువురు రచయితలు. ప్రవృత్తి పరంగా 2000 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియాలో తెలుగు రేడియో కార్యక్రమాలు, రచనా వ్యాసంగం ప్రవృత్తిగా కొనసాగిస్తున్నాను. వృత్తి రీత్యా ప్రభుత్వ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్థానికంగా తెలుగు వాణి రేడియో కన్వీనర్ గా సేవలు అందించాను. వందకు పైగా రేడియో కార్యక్రమాలు 15 రేడియో నాటికలు దర్శకత్వం చేపట్టి ప్రసారం చేశాను. ప్రముఖులతో ముఖా ముఖి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. చిన్నారులకు పాఠశాలలో religious education లో భాగంగా విశ్వహిందూ పరిషత్ ద్వారా హిందూ మత బోధన తరగతులు తీసుకున్నాను. జాగృతి కథల పోటీలో నా కథలు బహుమతులు అందుకున్నాయి. దాదాపు ఇరవై వరకు కథలు రాసాను, కథలు, కవితలు కొత్తవి రాస్తున్నాను. నా కథలు పలు పత్రికలలో, కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు, లలితగీతాలు, పాటలు పాడతాను. పలు వేదికలకు సమన్వయకర్తగా వ్యవహరించాను. సిడ్నీ తెలుగు అసోసియేషన్ ద్వారా వాహిని అంతర్జాల మాసపత్రికకు సంపాదకురాలు గా నాలుగు సంవత్సరాలు సేవలు అందించాను. స్థానికంగా తెలుగువాణి మరియు జనరంజని రేడియో కార్యక్రమాలు, ఇంకా అంతర్జాలంలో తెలుగువన్ రేడియోలో వారం వారం కార్యక్రమాలు చేయటం నాకు అత్యంత ప్రీతికరం. “సకల కళాదర్శిని” వేదిక స్థాపించి, “స్త్రీ హృదయం” శ్రీ పెయ్యేటి రంగారావు గారి కథల సంపుటి పుస్తక ఆవిష్కరణ తొలి కార్యక్రమం అంతర్జాలంలో నిర్వహించాను. మున్ముందు కళా, సాహిత్యం, సాహిత్య కార్యక్రమాలు “సకల కళాదర్శిని” ద్వారా అందచేయాలని భావిస్తున్నాను. వాహిని మాసపత్రిక “సాహితీ సదస్సు” అంతర్జాల మాధ్యమం జూమ్ ద్వారా విజయవంతంగా నాలుగు గంటలకు పైగా మూడు సదస్సులు నిర్వహించాను. దాదాపు ఐదు గంటలకు పైగా విజయవంతంగా విభిన్నమైన తెలుగు అంశాలతో కొనసాగింది. ప్రపంచ తెలుగు సాంస్కృతిక వారోత్సవాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాను. భారతదేశంలో సాహిత్యంలో పలు అంశాలపై పత్ర సమర్పణ అందచేశాను.