జగదానందతరంగాలు-5

ఇష్టపది

-జగదీశ్ కొచ్చెర్లకోట

ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి. 
 
ఇవీ నా ఇష్టపది….
 
మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక స్థాయిల్లో మన చిత్రకళ వివిధరూపాల్లో దర్శనమిచ్చింది. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. ఇంట్లో అందరికీ ఆహారం, ఆహార్యం చూసేటప్పటికి నాన్నగారి జీతం జయమాలిని డ్రెస్సులా చాలీచాలకుండా సరిపోయేది.
 
అంచేత మధ్యతరగతి వాళ్లకి కళలు, కలలు వుండకూడదని, ఒకవేళ వున్నా వాటినుంచి త్వరగా మేల్కోవాలనీ మాకు మేఁవే ఒక రాజ్యాంగాన్ని రాసిపడేసుకుని చదువుకుంటూండేవాళ్లం.
 
ఇది ఆయన్ని విమర్శించడం కాదు. ఎలాగైనా సరే నానాయాగీ చేసిమరీ నాన్నచేత బండి కొనిపించుకుని వెనకాల ‘డాడ్స్ గిఫ్ట్’ అంటూ ఓ వెధవ స్టిక్కరేయించుకునే రకమైన పిల్లలం కాదు మేఁవందరం! ఆమాటకొస్తే నూటికి ఎనభైశాతం అందరూ మాలాంటివాళ్లే అనుకోండీ!
 
భోజనాల దగ్గర పప్పన్నం తినేశాకా అమ్మ కూర వడ్డించే వ్యవధిలో కంచంలో పదిపదిహేను బొమ్మలేసేసేవాణ్ణి. అవి అన్నయ్యావాళ్లు చూసి బలేవుందంటూ మెచ్చుకునేవారు.
 
బళ్లో బల్లమీద, నోట్ బుక్స్ వెనకాల, అట్టలమీద, ఛార్టుల మీద ఇలా ఎక్కడంటే అక్కడ బొమ్మలే బొమ్మలు. 
 
మా వీధిలోనే వున్న ఇంజనీరుగారి కారుమీద ఎన్నాళ్లనించో తుడవనైనా తుడవని దుమ్ము చూస్తే అందరికీ అసహ్యమేసేది. కానీ నాకుమాత్రం దాని అద్దాలమీద బోల్డు బొమ్మలెయ్యాలనిపించేది. వేసేవాణ్ణి కూడానూ!
 
ఇక బళ్లో అందరూ నాదగ్గరకొచ్చి బొమ్మలు, పేర్లు వేయించుకునీ రాయించుకునీ వెళుతుండేవారు. మెడికల్ కాలేజీలో ఇది పరాకాష్ఠకు చేరింది. మా కాలేజి కల్చరల్ సెక్రటరీ నన్ను ఈ ప్రక్రియలో చాలా విరివిగా వాడుకున్నాడు.
 
ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం. ఏదో ఒక ఛార్ట్.
 
ఇంత తపన, తన్మయత్వం, తహతహ…అన్నీ కలిసి ఒకరోజులో వృద్ధిచెందినవి కావు. అదంతా జన్యులోపం!!
 
ఇక బాపు చిత్రాల్లో వంపుల్నీ, సూక్ష్మాతిసూక్ష్మమైన అంశాల్నీ చూసిన కళ్లకి వాటినలా వదిలెయ్యడం ఇష్టంలేక అధ్యయనం చేయించేలా చేశాయి. 
 
అనవసరంగా ఎక్కువ భారాన్ని మోస్తున్నట్టుండే పాలిండ్లు, చిక్కి శల్యమైపోయినట్టుండే నడుము, తప్పనిసరిగా దర్శనమిచ్చే నాభి…ఇవికాదు నేను అధ్యయనం చేసింది.
 
ఏదన్నా కథచెప్పి ఒక బొమ్మ వేసిపెట్టమని ఎవరన్నా అడిగితే ‘సామాన్యశాస్త్రం’ పుస్తకంలోలా ఒకాడమనిషి, ఒక మగమనిషీ బొమ్మ వేసేసి ఇచ్చెయ్యకుండా కథంతా చదివేవాడు. ఆ కథలోని ఆత్మను గ్రహించేవాడు. దానికి గీతల రూపంలో ఆకారాన్నిచ్చేవాడు. 
 
అదికాదా నిజమైన కళారాధన? ఆ రచయితకి ఎంత ఆనందం!! ధన్యతనొందిన క్షణం. ‘చాలురా ఈజన్మకి!’ అనిపించేంత కృతజ్ఞతాభావం.
 
అటువంటి రచనలు బొమ్మలవల్లా, ఆ బొమ్మలు రచనవల్లా పరిపూర్ణమైనట్టుగా వుండేవి. 
 
అందుకే అతనంటే ఇష్టం. 
 
జాకీ, బుల్లెట్, సుందరకాండ, రాధాగోపాళం తీసిన బాపు నాకక్కర్లేదు. అవన్నీ ఉనికిని చాటుకునే ప్రయత్నాలనే భావిస్తాను. 
 
సాక్షి, స్నేహం…తీసేటప్పుడు దర్శకత్వంలో ఒకరకమైన అమాయకత్వం కనబడుతుంది బాపులో. 
 
బుద్ధిమంతుడుకొచ్చేటప్పటికి ముగ్ధత్వం బయటికి తొంగిచూసింది. 
 
అందాలరాముడు, ముత్యాలముగ్గు తీసేటప్పుడు చెయ్యి తిరిగిన బాపు, పెన్ను తిరిగిన రవణా మనకి కనిపిస్తారు. 
 
పెళ్లిపుస్తకం ఒక మిఠాయికిళ్లీ. ఆకులెక్కువేసి మరీ కట్టారు. సున్నం మరీ ఎక్కువేస్తే పొక్కుతుందని మోతాదులోనే వుంచారు తోడుదొంగలిద్దరూ. లేకపోతే పడగ్గది శృంగారంతో మనందరికీ మరింత కంగారమైపోను.
 
మిస్టర్ పెళ్లాం? 
 
‘టెన్నిసొచ్చిన వాడికి బ్యాడ్మింటనూ వస్తుంది కదండీ?’ అన్న రవణగారి మాటనే నిజంచేస్తూ తీసిన మరో మధ్యతరగతి మణిపూస. పెళ్లిపుస్తకం లాంటిదే ఇదీనూ. కానీ రెండూ హాయిగా చూసేసేసుకుని, నవ్వేసేసుకోవచ్చు.
 
అరే, గమనించారో లేదో, నేను మొదలెట్టింది బాపు గురించికదా? మధ్యలో ఈ రవణెప్పుడు దూరాడూ? 
 
అదంతే! బూరెల్లో పూర్ణంలా లోపలే వుంటాడు. మొదలెట్టిన కాసేపటికి తియ్యగా తగుల్తాడు. అదీ రవణంటే!
 
వ్యావహారిక భాషకి గిడుగూ, మన బాల్య వ్యవహారాలకి బుడుగూ చేసిన సేవలు అమోఘం. తెలుగింటి బామ్మల్నీ, వాళ్ల తెల్లచీర కొంగుచాటున నిలబడి అల్లరిచేసే బుజ్జి బుడంకాయల్నీ ఎంతో లబ్జుగా వర్ణించాడు. 
 
నడివయసు అమ్మానాన్నల్నీ, 
 
బాధ్యత తెలీని బాబాయినీ, 
 
కేవలం రెండుజెళ్లతో ఒకరకమైన సెక్సప్పీల్ తీసుకొచ్చేసిన సీతనీ…
 
దీన్సిగదరగా! ఏం రాశాడండీ??
 
అంతకంతా అనుభవించమని అమోఘమైన బొమ్మలేసి పడేశాడు బాపు. వెరసి తరతరాలకీ తరగని మణులున్న మడుగు..ఈ బుడుగు!
 
 
 
ఇక యవ్వనంలో చదివే రచనల ప్రభావం మన తదనంతర జీవితంలో చాలా వుంటుంది. 
 
అవి సమాజోద్ధరణకి సంబంధించినవైతే నువ్వు కులాంతర వివాహం చేసుకుంటావు. 
 
రక్తాన్ని మరిగించే విప్లవరచనలైతే అడవులపాలవుతావు. 
 
ప్రేమామృతధారలైతే పదిహేడేళ్లకే ‘ముద్దమందారా’న్నొకదాన్ని ముద్దాడాలని చూస్తావు. 
 
అమ్మకు తోడుగా ప్రతివారమూ మార్నింగ్ షోలకి సంపూర్ణ శివపురాణాలు చూస్తే శిరియాళుడంతటి వాడివౌతావు.
 
మనం పైన చెప్పినవాటన్నిటికీ విభిన్నం. ఖర్మేఁవిటంటే, నేను పైన ఉదహరించిన అన్నిరకాలూ చదివేశాను, చూసేశాను. చివరికి ఏదీ కాలేకపోయాను.
 
కానీ, కొడవటిగంటి కుటుంబరావు గారి ప్రభావం మాత్రం నామీద చాలా బలంగా పడింది. చూసిందీ, అనుభవించిందీ రాయమంటాడు. సమకాలీనతకి ప్రాధాన్యత ఇవ్వమంటాడు. అదే కొన్నాళ్లకి చరిత్రగా మారుతుందంటాడు. 
 
నిరాడంబరంగా రాయడం ఈయన ప్రత్యేకత. వర్ణనలూ తక్కువే. అలాగని చతురత వుండదనుకున్నారా? ఒక్కోసారి చంపేస్తాడు కామెడీతో. ఆ వ్యంగ్యానికి మనం అలవాటు పడకుండా ఒక విభిన్నమైన శైలిలో నడిపిస్తాడు కథనంతటినీ.
 
 
 
ఆనక యద్దనపూడి రచనలు ఏకబిగిన చదివేశాను. అవన్నీ గులాబ్ జాముల్లాంటివి. చూడ్డానికి అన్నీ ఒకేలావున్నా అన్నీ బానేవుంటాయి. వాటి రుచంతా ఆవిడ పట్టే సన్నటి తీగపాకంలోనే వుంది. అదే ఆవిడ శైలి! ఆపాలనిపించదు. 
 
ఒకరోజిలాగే.. పొద్దున్ననగా చదవడం మొదలెట్టి చివరికొచ్చేటప్పటికి అమ్మ ఓ కేకపెడితే అన్నానికి లేచాను. తీరాచూస్తే అది డిన్నర్. లంచ్ కాదు. నేచేసిన పనికి నేనే ఆశ్చర్యపోవడం ఆశ్చర్యకరంగా అనిపించట్లేదూ?
 
 
 
మహిళా రచయిత్రులంతా సాహితీ వినువీధుల్లో చుక్కల్లా ప్రకాశిస్తోంటే ఒక్కసారిగా దట్టమైన మబ్బులొచ్చేసి ఓ మెరుపు మెరిసింది. ఆ తరవాత ప్రళయకాల ఝంఝామారుతమైన వేగంతో పాఠకుల్ని ఒక్క కుదుపు కుదిపింది. ఆ ప్రభంజనం పేరు యండమూరి. 
 
మనకసలే పుస్తకాలంటే అన్నంనీళ్లు మర్చిపోయేంత ఆసక్తి. ఇతగాడొచ్చాకా ‘ఆ’ రెండింటికీ కూడా వెళ్లకుండా చేసేశాడు. అంతా అయ్యాకనే ఒకటైనా రెండైనా! నరాల్ని ఇనుపతీగకి చుట్టి బిగించి లాగి, వదిలేవాడు సస్పెన్స్ తో! నీకు పరిచయమైన ప్రపంచాన్ని కొత్తగాను, పరిచయంలేని లోకాన్ని వింతగాను అక్షరీకరించడం ఇతగాడి ప్రజ్ఞ!!
 
ఫిక్షన్లు, యాక్షన్లు; జబ్బుల గురించి, డబ్బుల గురించి; మానసిక విశ్లేషణ, మనోనేత్రంతో అన్వేషణ; చట్టంలో లోపాలు, చుట్టూ లోకంలో పాపాలు…..
 
ఎన్నిరకాల సిరాలనో నింపుకున్న ఆ కలం రేపిన కలకలం అంతాయింతా కాదు. అతడొక ఇష్టంతో కూడిన వ్యసనం.
 
 
 
ఇవన్నీ సరే, చిన్నప్పుడు చందమామని చూపించి అన్నం తినిపిస్తారుగా ఎవరైనా? కానీ కాస్త పెద్దయ్యాక ‘చందమామ’ పుస్తకాన్ని చూస్తే ఇక అన్నఁవక్కర్లేదనిపించేది.
 
మాచిరాజు కామేశ్వరరావు, బూర్లె నాగేశ్వరరావు, జొన్నలగడ్డ రామలక్ష్మి, కోనే నాగవెంకట ఆంజనేయులు….వీళ్లు రాసిన కథలు, వాటికి శంకర్, జయ, రాజి వేసిన బొమ్మలు…
 
ఏంచెప్పమంటారు? చూస్తూనే వుండిపోతాం ఆ త్రీడైమెన్షనల్ ఊహాశక్తికి. మహాభారత, రామాయణాలు, దేవీభాగవత కథలు….వీటికోసం పేజీ మొత్తం వేసే బొమ్మను చూస్తే  ప్రతినెలా ఒక పుస్తకాన్ని అంతలా లోపరహితంగా తయారుచేసి, మనకందించడానికి ఎంతమంది కృషిచేసి వుంటారో అనిపించేది.
 
అంపశయ్యపై భీష్ముడు, కంసవధ, వాలిసుగ్రీవుల భీకరపోరాటం, మత్స్యయంత్ర ఛేదన…ఇలా పలుఘట్టాలకి సంబంధించిన రంగులబొమ్మలు తరతరాలకు తరగని ఆస్తిలా ముద్రించిపడేశారు.
 
ఇక జానపద ధారావాహికలకి ‘చిత్ర’ బొమ్మలు. అవైతే మనల్ని రెక్కలగుర్రాల మీద ఎక్కించుకుని కోటబురుజుల్ని చూపిస్తున్నట్టే అనిపిస్తాయి. 
 
వడ్డాది పాపయ్య ముఖచిత్ర సుందరాంగనలు మరొక ప్రత్యేక ఆకర్షణ. 
 
అనకాపల్లి వర్తకసంఘం వారి అనుబంధ గ్రంథాలయం ఒకటుండేది. శారదా లైబ్రరీ. అక్కడ ఒక ఏడాదికి చెందిన చందమామలు పన్నెండింటినీ ఒక పుస్తకంగా కుట్టి వుంచేవారు. అలా ‘చందమామ’ ప్రథమసంచిక నుండీ అన్నింటినీ పొందుపరిచారు. ఎంతో శ్రద్ధగా నిర్వహించే ఆ బైండింగ్ కార్యక్రమంలో ఒకరకమైన తపన, తన్మయత్వం కనబడేది నాకు. ఒక్క పేజీకూడా చిరగకుండా, అక్షరాల్ని కుట్టులోకి పోనివ్వకుండా జాగ్రత్తపడేవారు. 
 
ఇతిహాసాలు, భాషాసౌందర్యం, సామెతలు, నుడికారాలు, పురాణపాత్రల పరిచయం, చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచడం…ఇలా ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలున్న ఆ పుస్తకాల్ని పదిమందికీ ఉపయోగపడేలా, అందంగా, భద్రంగా పదిలపరిచి  ఉచితసేవను అందించిన ఆ గ్రంథాలయానికి నేనెప్పుడూ చేతులెత్తి మొక్కుతాను. 
 
నమ్మండి నమ్మకపోండి, ఏడెనిమిది సంవత్సరాల పిల్లల నుంచి అరవయ్యేళ్ల వృద్ధుల వరకు అందరి దగ్గరా తలొక చందమామ బైండూ వుండేది. రాత్రి ఎనిమిదింటివరకూ చదువుకోనిచ్చేవారు. 
 
ఇక పదేళ్లప్రాయంలో ఒకసారి వీర్రాజు టాకీసులో మాయాబజార్ వచ్చిందని అమ్మ మమ్మల్ని తీసుకుని బయల్దేరింది. అదేరకమైన సినిమానో తెలీదు. బజారంటే ఏ జోనరో అర్ధంకాలేదు.
 
తీరా చూస్తోంటే అన్నీ మనకి తెలిసిన పాత్రలే! మా స్కూల్లో ప్రతి శుక్రవారం సాయంత్రం కొన్ని పుస్తకాలిచ్చి చదవమనేవారు. ఆనక వాటిలోంచి కొన్ని ప్రశ్నలడిగేవారు. అవి మన దేశనాయకులు, పురాణపాత్రలు, చరిత్రకెక్కిన వీరుల కథలు.
 
ఆరకంగా పరిచయమైన పౌరాణిక పాత్రలన్నీ కలిసి తెరమీద వినోదాన్ని పండిస్తోంటే చాలా వింతగా కనిపించింది. కాస్తంత ఊహతెలిసిన తరవాత మరోసారి చూస్తే బాగా ఊరిన ఊరగాయలా మరింత మనోరంజకంగా అనిపించింది. ఎలాగయితేనేం, కొన్నాళ్లకి మాయాబజార్ కాస్తా డబ్బాలో దాచుకుని తినే తినుబండారంలా తయారైంది.
 
ఆరారా చూడాలనిపించడం, చూసిన ప్రతిసారీ అనుభూతి చెందడం, తెలిసిన హాస్యానికే తెరలుతెరలుగా నవ్వడం… ఇదంతా తెలుగువాళ్లందరికీ తెలిసిందేకదా?
 
పగలంతా పగలతో హృదయం పగిలినా రాత్రివేళకు మనసు చల్లబడిపోతుంది కదా! దానికితోడు నెలనెలా విరిసే వెన్నెలపూలు అందించే ఆహ్లాదం కలిస్తే ఎంతటి సమస్యనైనా కాసేపలా వెళ్లిరమ్మంటూ సాగనంపొచ్చు.
 
పౌర్ణమినాడు ఆరుబయట మంచాలేసుకుని పడుకున్న రోజులు, డాబాలమీద కొబ్బరాకుల మధ్యలో చంద్రుడితో కలిసి దోబూచులాడుకున్న రోజులు తలుచుకుంటే తన్మయత్వంతో కూడిన తహతహ.
 
ఇప్పటికీ ఆపరేషన్లకని బయల్దేరినవాణ్ణి మధ్యలో కాసేపలా కారు పక్కకాపేసి చందమామతో కబుర్లాడుకుంటూ వుంటాను. కంగారుపడకండి, నాలో నేనే మాటాడుకోడాలవీ ఊహించుకోకండి.
 
వెన్నెలని తనివితీరా చూసేస్తూ, ‘ఆ పక్కనున్న చుక్కగానైనా పుట్టకపోయానే!’ అంటూ బాధపడ్డఁవే నేచేసేది.
 
ఇక ఎన్ని తిన్నా ఎక్కసమనిపించనిది, ఇష్టాలలోకెల్లా ఇష్టమైనది…లడ్డూ!
 
చిన్నతనంలో మా అక్కపెళ్లికి తాతగారు దగ్గరుండి మరీ వండించిన మిఠాయివంట నాకిప్పటికీ గుర్తే. నేనక్కడే నిలబడి చూస్తోంటే  ‘నైవేద్యం పెట్టేశారు. ఫరవాలేదు. వీడికో వుండివ్వండి బ్రహ్మగారూ!’ అంటూ తినిపించిన లడ్డూ రుచి ఇప్పటికీ మర్చిపోలేదు. 
 
ఇక ఉద్యోగరీత్యా తిరుపతిలో వున్నన్నాళ్లూ కొండలడ్లయితే విరివిగా దొరికేవి. అది ఆ దేవదేవుని ప్రసాదం. ముందుగా స్వామికి నివేదించినందువల్లనేమో పవిత్రమైన భావన. గింజకూడా కిందపడకుండా అపురూపంగా ఆస్వాదించేవాళ్లం.
 
ఇష్టాల చిట్టా రాసేముందు పైన ‘శ్రీరామ జయం’ అని రాయలేదేం? అనెవరైనా అడుగుతారేమో? నేనయితే అక్కడ మన బాలు పేరు రాస్తాను.
 
బాల్యం, విద్యాభ్యాసం, యవ్వనం అన్నీ ఆ పాటవింటూండగా గడిచిపోయాయి. మనసుపడిన మనోభినేత్రి కూడా ఆయన పాటలతోనే మరింత దగ్గరయింది. 
 
వారారంభంలో ‘ప్రభుం ప్రాణనాథం’ అంటూ మొదలయ్యే ఆ గాత్రం ‘ఈరోజే ఆదివారము’ అని ముక్తాయింపునివ్వడంతో వారమంతా సాగుతుంది. 
 
డెబ్భయ్యవ దశకంలో వినబడిన ఆ లేతగొంతులో పాటలు ఇప్పటికీ ఆనందాన్నిస్తాయి. ఎలమావితోట మారాకు వేసినట్టుండే ఆ గళం ప్రతియేటా కొత్తసొబగుల్ని సంతరించుకుంటూ తెలుగునేలని తరింపజేస్తోంది.
 
ఇవండీ నా అభీష్టాలు! ఇవేనా అంటే ఇవేకాదనుకోండీ! ఇంకొన్నున్నాయి. ఇవి కుంచెం బోల్డు ఎక్కువిష్టఁవన్నమాట!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.