ట్రావెల్ డైరీస్ -4

దండకారణ్యం

-నందకిషోర్

 

సుక్మాలో రాత్రి పదింటికి జనసంచారం దాదాపు శూన్యం. ఆ నిశ్శబ్ధంలో బాగానే నిద్రపట్టింది. పొద్దున లేసి మొదట తీరథ్‌గడ్, చిత్రకూట్ ఆపైన సమయం ఉంటే కోటంసర్ గుహలు చూడాలని ఆలోచన.  దండకారణ్యంలో మా ప్రయాణం. దండకారణ్యం వింధ్య  పర్వతాలకి, నీల పర్వతాలకి మధ్య ఉన్న అరణ్యమనీ, దండుడి రాజ్యమనీ పురాణ గాథ. రాక్షస లంకలో భాగమని, Land of Punishments అని కథలున్నాయి. తూర్పు కనుమలు, కొండలు దాని దిక్కులు.  ఆదివాసీలు దాని బిడ్డలు. చరిత్రలో ఎవరికి కప్పంగట్టినా అది గోండు రాజ్యం. కాకతీయ వారసుల్ని ఇప్పటికీ కడుపులో దాచుకున్న రాజ్యం.

కాశీఖండంలో ‘ఝాడేశ, బారహ,దొంతి నాది క్షితీశ్వరుల గెలిచి’  అని  పేర్కొన్న దొంతినే దంతేవాడ అని ఎప్పుడో చదివాను. బారహ  Barasur (?) అయి ఉండొచ్చు. గిరిజనుల పలుకుబడిలో సీలేరు  ‘జాడి దేశమనీ’, సీల వంశపు రాజులైన నందపురం రాజులకు ఝాడ్ ఖండ్ పాదుషాలనే బిరుదు ఉందనీ ‘ఝాడేశ గురించి’ శివరామక్రిష్ణగారు చెప్పడం గుర్తొచ్చింది. బస్తర్, దంతేవాడల పేర్లు చిన్నప్పటినుండి వింటున్నవే అయినా ఎప్పుడూ పోలేదు.  UP లో ఉద్యోగం మానేసాక ఇక్కడే నాకో fellowship offer వొచ్చింది. ఇంటికి దగ్గరుండాలని చేరలేదు.  బస్తర్ స్వాతంత్ర్యం రాకముందు ఒక సంస్థానం.  చత్తీస్గడ్ రాష్ట్రం ఏర్పడడానికి కొంచెం ముందు (1999) బస్తర్, దంతేవాడ, కంకేర్ మూడు జిల్లాలు. ఇప్పుడది ఏడు జిల్లాలు.

తుంపరలోనే చింద్ఘడ్, రోకెల్ ఇంకొన్ని చిన్న ఊర్లు దాటుతూపోయాం. ఈతవనాలు, అడవిమామిళ్ళు స్వాగతం పలుకుతున్నాయి. తుంపర చిన్నగా వానవ్వబోతుంది. దారిలో గోచీకట్టుకుని, పైన ఏ ఆచ్చాదన లేకుండా  జంధ్యం వేసుకుని,  భుజమ్మీద గొడ్డలిపెట్టుకుని సైకిలి తొక్కుతున్న మనిషి ఎదురైనాడు. ఆ భుజమ్మీద మీద అదెట్లా ఆగిందో తెలీట్లేదు. నా చూపు అట్లే ఆగిపోయింది. ఆ చినుకులు, ఆ సైకిలు, ఆ మనిషి. కాసేపు వెనక్కి చూస్తూ ఉండిపోయాను. ఊరి ఊరికి కాంపులున్నాయి. కుకనార్ పోలిస్ స్టేషన్ దగ్గర ఎవరో ఆపినారు. ఎటెళ్ళేది అడిగినారు. CRPF శిబిరం పెద్దదిగా ఉంది.

అంతటివానలోనూ తలమీద ఈతబుట్టలు పట్టుకున్న స్త్రీలు ఎదురువస్తున్నారు. కయించి తొక్కుతున్న పిల్లలు ఇద్దరిద్దరుగా ఎదురొస్తున్నారు. చూస్తూ చూస్తూ నేను తడిసిపోతున్నాను. కారు చక్రాలు పల్లాలు దాటుతుంటే చిమ్మే నీళ్లకి నా పరధ్యానం చెదిరిపోతుంది. వెదురు కర్రల్తో,  కంచెల్లో నాకున్న పరిమితులన్నీ కనిపిస్తున్నాయి. నాగరికమైన బతుకు నన్నెట్లా పరిమితిస్తున్నదీ కనిపిస్తోంది. ఝీరం రాగానే అడవిరూపం మారింది.చిక్కటి సాల చెట్ల అడవది. చత్తీస్గడ్ దారులన్నీ ఎక్కువ సాలచెట్లే. ఇంతకుముందు Dudhwa (UP)  లో ఒకసారి చూసాను ఇలాంటి  సాలచెట్ల అడవి.  మళ్లీ ఇప్పుడే.  జగదల్పూర్ ఇంకో నలభై అయిదు కిలోమీటర్లు ఉందనంగా ఘాటీ మొదలైంది. ఒకదగ్గరెక్కడో మా బంజారిన్ మందిర్ తగిలింది. లారీలు ఎదురొస్తున్నాయి.ఇంకా  ఘాటీ పక్కన లోయల్లో ఒకట్రెండు చిన్న చిన్న ఊర్లు. దర్భ కాస్త పెద్ద ఊరు. దానికి అటూ ఇటూ ఘాటీ అంతగా లేదు. అది దాటితే మళ్లీ ఘాటీ. ముందుకుపొతే కామనార్, నెగనార్ పేర్లుగల ఊర్లు.

చిన్న చిన్న గూడేల్లో, పొలాల్లో ఛత్రీలు పట్టుకుని మనుషులు తిరుగుతున్నారు. ముసురులో వాటి రంగు పాలిపోయింది. పొలాలు కొన్ని  నారుపోసి ఉన్నాయి.  పల్చటి నాపరాతి బండలతో కప్పిన ఇల్లు దర్శనమిస్తున్నాయి. కొన్ని ఇల్లైతే చిత్రంగా కట్టుకున్నారు. ఇల్లు గూనతోనూ, సాయెబాన నాపరాతి బండతోనూ కట్టారు.  అప్పుడే కడిగి బోర్లించినట్టు కనిపిస్తున్నాయి ఇల్లు.  ఎర్రటి గూనపైనుండి, నల్లటి బండపైనుండి చూరుమీదుగారాలి పచ్చటి చెట్లమీదకి జారుతోంది వాన. కొద్దిగా కునుకు వొస్తున్నా కనురెప్ప వేయనా వొద్దా అని ఆలోచన. తీర్థగడ్ చేరాం. గూగుల్ మ్యాప్ ని నమ్మడం వల్ల జలపాతం అవతలిపక్కకి ముందుపోయాం. రోడ్డుమీదకే ఆ హోరు వినిపిస్తోంది.కనిపిస్తోంది.

దారి పక్కన కనిపించినప్పుడు అదొక త్రివర్ణదేశం. ఆ ఒడ్డుకు కూర్చుంటే ఎరుపు , ఆకుపచ్చ, నీలం రంగులు భూమి ఆకాశాల్ని సమంగా పంచుకున్నట్టు కనిపించింది. అక్కణ్ణుండే దూరంగా కింద ఒక మందిరం, చదునుగా చెక్కినట్టు ఒక కొండ చరియ కనిపిస్తున్నాయి. నీళ్లు దాటి అవతలి పక్కకి పోదామనిపించింది. అవతలి పక్కకి వెళ్లేందుకు దారి కూడా ఉన్నట్టు అగుపించింది. కార్ వెనక్కి తిప్పి అటువైపుకి వెళ్లాం. అక్కణ్ణుంచి అది మరింత అందం. పచ్చని లోయకన్నులోంచి కన్నీరు జలజలా రాలి పడుతున్నట్టు ఉంది. ‘ముందుకు నడిస్తే అపాయం. మీరే బాధ్యులు’  అని ఉన్నచోటు భయం కల్గించలేదు. అక్కడినుండి కొంతదూరంలో ప్రవాహం వొంపు తిరుగుతున్న చోట ఓ శిలాతోరణం ఉండటం, దాని హృదయంలోంచి ఒక చెట్టు మొలిచి నీటితలం కన్నా పైకి ఎదగడం కనిపిస్తోంది. దాని చిటారు కొమ్మని పట్టుకుని ఊపితే తప్ప నాకు శాంతి కలిగేలా లేదు.

ముందుకు కదిలాను. ఒక మిత్రుడు వెనక వొచ్చాడు. నీళ్ల ప్రవాహంలో నడిచి రాళ్లు దాటి  శిలాతోరణం చెట్టున్న బండ ఎక్కాము. మేఘం కమ్మి మరో పక్క ఏమున్నది కనిపించట్లేదు. అనంతమైన జలరాశి హోరు లోయలోయంతా గింగిర్లు తిరుగుతోంది. మేఘం కాస్త తెరిపయ్యాక తప్ప అడుగు వేయడం వీలుపడలేదు. కొండకొసమీద రెండు క్షణాలు రెప్ప మూసాను. అది ప్రళయ ధ్వనిలాగా గోచరించింది. ఇంతలోఎటునుండి చూసాడో. సాహసాలు కూడదంటూ ఓ కాపలాదారు పరుగెత్తుకొచ్చాడు. కిందకి వెళ్ళే దారి సంగతి చెప్పాడు. పరుగు పరుగున పోవాలని ఉందిగాని లోపలంతా తడి.

జలపాతాన్ని ముఖాముఖి చూసే వీలుండటం అరుదు. తీరథ్గడ్ లో ఆ వీలుంది. జలపాతం కురిసే చోటికి పోయేందుకు మెట్లు ఉన్నాయి. అవి దిగి నీళ్ళకిందకి పోయి కూర్చున్నాను. కాసేపు కూర్చుని, కాసేపు నిల్చుని, కాసేపు పిచ్చివాడిలాగా అరిచి ఆనందపడ్డాను. నట్ట నడిమికి పోదామని ఉందిగాని దాని కింద సుడిగుండం ఏర్పడుతూ ఉన్నాదన్న విషయం గుర్తొచ్చి ఆగిపోయాను.  అక్కణ్ణుంచి మందిరం ఎదురుగా కనిపిస్తుంది. ఎత్తైన దీవి లాగా ఉన్న చిన్న కొండ మీద ఆ ప్రాచీన మందిరం. ఆ కొండే జలపాత ప్రవాహాన్ని రెండు దిక్కులకి చీల్చుతోంది. అప్పటికే ప్రవాహం కొద్దికొద్దిగా పెరుగుతోంది. ఇందాక దారిలో కురిసిన వానంత వరదగట్టి ఇక్కడికే వస్తున్నదేమో.

మందిరం చేరుకోవాలంటే కొన్ని రాతి మెట్లు ఎక్కాలి. అవన్నీ తడిసి ఉన్నాయి. ఒక్కొమెట్టుకి తుంపర పూలు చల్లుతూ, ఆశీర్వదిస్తూ పిలుస్తా ఉన్నది. ఆ చిన్న కొండ నాల్గు దిక్కులకు నాల్గు అలాంటివే చిన్న మందిరాలు ఉన్నాయని పైకెక్కుతుంటే తెలిసింది.  పైకెక్కినాక ఆ ద్వీప మందిరం చుట్టూ పదక్షిణం చేయబోతే తెల్సింది. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో. వాడు నా ఎదురుగా ఉన్నాడు. మందిరం వెనక్కి వొచ్చి నిల్చుంటే నా కళ్లెదురుగా ఉన్నాడు. వాడు సృష్టిలోని సమస్త సౌందర్యంతో, ధీరత్వంతో బాహువులు చాచి  నన్ను పిలుస్తున్నాడు. అనంతమైన భాషలో, అజ్ఞాతమైన సంజ్ఞతో నాతో ఏదో మాట్లాడుతున్నాడు. నేను అర్ధమయ్యీ కానట్టు కనురెప్పలు కదిలిస్తున్నాను.

తీరథ్గడ్ వొట్టి జలపాతమంటే నమ్మబుద్దేయదు. అది జలపాతమందిరం. జలపాతేశ్వరుని జటాజూటంలోంచి రాలిపడే గంగని అక్కడి చూసాను. వింధ్యవాసినై అర్ధభాగం పంచుకు నిల్చున్న  మలయవతిని చూసాను. కోటానుకోట్ల బిందురాసి  ఎగిసి హిమపర్వతాన్ని మించడం చూసాను. ఆ పర్వతం ఎక్కి ఈశ్వరుని సాన్నిధ్యం అనుభవించాను.

ఎన్నో ప్రదేశాలు తిరిగాను. అంతటి జలపాతాన్ని అంతే ఎత్తులో నిల్చుని అన్ని దిక్కులనుండి చూసే భాగ్యం ఇంకోచోట దొరకలేదు. వెనకాముందు సమస్త దేహంతోనూ, అటు పక్క ఇటు పక్క కనుపాపల్తోనూ దాన్ని హత్తుకున్నాను.  ఇంకెన్ని చూసిన తీరథ్గడ్ జీవితకాలపు అనుభవం.

*

తీర్థగడ్ దాటిపోతుంటే కంగేర్వాలి నేషనల్ పార్క్. అక్కడ మేం ఆగలేదు. బస్తర్ హిల్ మైనా అని కనిపించింది బోర్డుమీద. నిన్నంతా దారుల్లో నేల గువ్వలు చాలా కనిపించాయి. హార్న్ బిల్ కూడా.  ఇవ్వాళ వర్షం వల్లేమో ఒక్క పక్షీ లేదు. అదే అరణ్యంలో వన్యప్రాణుల్ని వేటాడవొద్దని ఇంకో బోర్డు చూసాను. ఆదివాసుల్ని, వాళ్ల  అమాయకత్వాన్ని వేటాడుతున్న  నాగరికతని తిట్టుకున్నాను.    బస్తర్, జోడేఘాట్, మన్యం తిరుగుబాట్లనీ, మోసమని తెలిసీ మిత్తులు ఆప్పజెప్పిన గిరిజనుల ఆత్మధనాన్ని తల్చుకున్నాను.

చిత్రకూట్ దారిలో ఊరు తగిలినప్పుడల్లా చూపు ఇళ్ళమీదికి పోతుంది. ఆ ఇళ్ళు నా కళ్ళకి చిన్నప్పటి పరిచయం.  వానకు జడిసి సాయెబానల్లో దాక్కున్నాయ్ మేకలు. స్కూల్లో పిల్లల్లాగ ఉన్నాయవి. చిత్రకూట్ పోయేందుకు జగదల్పూర్ దాకా పోవొద్దు.  ముందే ఎడమకి తిరగాలి. టాటా మోటార్స్ ఆఫీస్ ఉంటాది.అక్కడే ఎడమకి మలగాలి.

కరెంజి అని ఊరికిముందే ఓ పెద్ద వాగు కనిపించింది. వాగులో సన్నగా వాన పడ్తున్న లెక్కచేయక బట్టలు ఉతుక్కునే స్త్రీలు , చేపలు పట్టే స్త్రీలు కనిపించారు. వాళ్ళ రంగురంగుల చీరలు , ఎర్రటి నీళ్ళు, ఆకుపచ్చ అడవి, ధూసర వర్ణాల ఆకాశం అన్ని కలిసి లోకంతో హోళీ ఆడుతున్నాయి. పొలాల్లో కూడా చేపలు పట్టడం ఎక్కువని విన్నాను. ఎక్కడా కనబడలేదు.

దారికి ఇరుపక్కలా గులాబి రంగు కాగితాల పూలు ఉన్నాయి. వాటిపై చినుకులు మెరుస్తున్నాయి. చిత్రకూట్ దారిలోనే  పూలోవాలి పహాడీ అని చిన్న కొండ ఉంది. ఆ పేరుకు తగ్గట్టు ఆ కొండమీదన్నీ పూలు. సమయం వీలుచిక్కక అదెక్కలేదు.  చన్ ప్రకాశ్పురి, బందాజి ఊర్లు దాటి చిత్రకూట్  ఇంకా పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉందనంగా మొదలైంది నీలగిరిచెట్ల దారి. లోహండీ గూడ ఓ బస్తర్ తాలుకా. అదొకటీ పెద్ద ఊరు.ఇంద్రావతి నది పక్కనుండే పోతోందని దగ్గరికి చేరేదాక తెలీలేదు. సూరీడు కొద్దిగా తేరుకున్న సమయానికి చిత్రకూట జలపాతం చేరాము. ఊదారంగు కచ్నార్ పూలు, రక్తసౌందర్యంతో మెరిసే తురాయి పూలు కనిపించాయి. ఇలాంటి తురాయి వర్ణాన్ని ఇష్టమైన కవి ఒకరు రాగరక్తిమ అన్నట్టు గుర్తు.

*

చిత్రకూట్లో ఉన్నది ఆదిమధ్యాంతరరహిత అఖండ జలదృశ్యం. ఎర్రటి సముద్రం. ధూళి వర్ష సరాగం. చిత్రకూటపు సుషమ, సుషుప్తిలోంచి లేచి వొచ్చిన ఇంద్రావతి చేస్తున్న  నాట్యం.

పక్కనే ఉన్న చెట్టుమీదినుండి వందల గబ్బిలాలు జలపాతం మీదికి ఎగురుతూ వొచ్చిపోతున్నాయి.శాంతిపజేయాలని ఆరాట పడుతున్నాయి. అది శాంతించడం లేదు.

అది ఇంద్రావతి. సుమారు వంద అడుగుల ఎత్తునుండి నెలవంక లాంటి కొండ అంచుకు నీటి ధార తెగి పడుతున్నది. తెగిపడుతూ తెగిపడుతూ కంఠమెత్తి నినదిస్తున్నది. అది ఇంద్రావతి. నీటి తరగలు పదాలు చేసి తమ నేలమీద బతికేందుకు పోరాడిన ప్రతీ ఒక్కని కథ పాట కడుతున్నది. పాడుతున్నది. కనుచూపుమేరా తన నేలని కళ్ళతో తడుముతున్నది. తిరిగి ఆక్రమించుకోవడం కుదరదని ఏడుస్తున్నది. జీవితమ్మీది విసిగి కొండమీదనుండి దూకుతున్నది. దాని గద్గద స్వరంతో,  అరుపుతో నా హృదయం అనునాదమై కంపిస్తున్నట్టు ఒంటి వణుకులో తెలుస్తా ఉన్నది. అదో శ్శబ్ధనిశ్శబ్ధం.

చిత్రకూట్ ని కూడా రెండో దిక్కునుండి చూసేవీలుంది. తిరుగుదారిలో ఇంద్రావతిమీద ఒక వంతెన దాటి రెండో పక్కకి వెళ్లొచ్చు. మేం పోలేదు. తీరథ్గడ్లో ఉన్నట్టు మనసు ఆనందంగా లేదు. ఎందుకో కలత కలతగా ఉంది. సెంటర్లో టీ కోసం ఆగాము. అల్లనేరేళ్లు అమ్ముతున్న బడికెళ్లే పాప నన్ను చూసి నవ్వింది. అమ్మాయి పేరు నీలేంద్రి. నేనూ చిర్నవ్వి కాస్త తేలికపడ్డాను.

*

తిరుగుప్రయాణంలో అన్నం తినేందుకు జగదల్పూర్ వెళ్లాం. అది బస్తర్ జిల్లా కేంద్రం. ఆ చుట్టుపక్కల కాస్త పెద్ద ఊరు. దారి తప్పి దంతెవాడ దంతేశ్వరిని దర్శించుకుందామని అనిపించిందిగానీ, వాన మొదలై మధ్యలోనే వెనుదిరిగాం. అదే దారిలో టోకాపల్ దగ్గరలో ఒక ఎద్దుల సంత. అనంతమైన సాల వృక్షాల నడుమ నడిచే అదివారం సంతది. మనుషులు ఎద్దులు కష్టం సుఖం కలిసిపోయిన సంత.  మునెమ్మ నా కళ్ళలో తళుక్కున మెరిసి మాయమైంది.

తిరుగు ప్రయాణంలో మళ్ళీ వొచ్చినదారిలోనే నెగానార్, కామనార్ దాటుతూ, కంగేర్ ఘాట్ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఆగాం. ఈ సమయంలో అనుమతి లేదన్నారు. ఇంకా కిందకి దిగి గుహల దగ్గరికీ పోదామనుకున్నాం. అక్కడా వర్షం. కుకనార్, భండారాస్ దాటి నాక కునుకుతీసాను.  అక్కడక్కడా పారా అని కనిపించే ఊర్ల పేర్లు చూసి కేనా పార, కుట్రా పార గుర్తుకువస్తున్నాయి. ఇంజారం దగ్గర ఎక్కడో మెలకువ వొచ్చింది. పక్కన ఉంది శబరి.

కుంటాలో టీకోసం ఆగాము. దారి దారంతా నవ్వులతో చెక్కిలిగింతలతో వొచ్చిన సంగతి సంధ్యాకాశం నాతో చెప్పినట్టు ఉంది. ఈ ముగ్గురు  లేకుంటే ప్రయాణం, ఇలాంటి స్నేహితులే లేకుంటే జీవితం ఎలా ఉండేవో తెలీదు.  చట్టి దాటి సింగన్న గూడెం,గంగన మెట్టు మొన్న సరిగా గమనించని ఊర్లు మళ్లీ గమనిస్తున్న. గంగనమెట్టుకి ముందేదో వాగు తగిలింది. దానిపైనా పిట్టలు. చివరిగంట కొట్టినాకా ఇంటికి పరుగుతీసే పిల్లలకిమల్లే. తిరుగుదారిలో బేలగా చూసే లేగదూడలు జింకపిల్లకి మల్లే కనిపిస్తున్నాయి. వానలో పశువులు ఈనే దృశ్యం తలపుకు వస్తోంది.

బండిరేవు, లక్ష్మీపురం, నెల్లిపాక దాటి తిరిగి భద్రాచలం చేరుకున్నాం. ఆకాశం అప్పటికే మూడు రంగులు మారింది.  గోదావరిలో ఉన్నదేదో కళ్లలోనూ ఉండిపోయింది.

 

***

వింధ్యగిరి నీలగిరి దండకారణ్యాన

వింధ్యవాసిని మలయవాసినయ్యి

కొలువుదీరిందటా కొండకో తీరుగా

కొలుచుకో జలపాత మందిరాలు

సఖుడెంత ఇష్టమో సగభాగమివ్వంగ

సవతియే జలగంధమంటిపోగ

మంచుతుంపరజల్లు

అంబరాలు

ప్రియసఖీ!

కన్నులా సంబరాలు

ధూళివర్షరాగస్వరజతులమాధురిన

కంఠమెత్తినదెవతి ఇంద్రావతి

ధూళించుగగనశిలలేగించుతాళగతి

నటనమాడినదెవతి ఇంద్రావతి

ధూసరవర్ణమయమేఘదీపోత్సవమ్మి

లకుదించినదెవతి ఇంద్రావతి

ఇరుకన్నులానీటి

ఇంద్రావతి

ప్రియసఖీ!

ఇంద్రాణి ఇంద్రావతి

*****

Please follow and like us:

2 thoughts on “ట్రావెల్ డైరీస్ -4 (దండకారణ్యం)”

  1. మీ దండకారణ్య సంచారం చాలా బావుంది నందకిషోర్

Leave a Reply

Your email address will not be published.