తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం

అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020)

నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం

-రోహిత్ ఆదిపూడి

తెలుగు భాషాచరిత్రలో మనకు లభ్యముగా ఉన్న వాంజ్మయంలో పద్యకవిత్వం అత్యంత దృఢమైన స్థానం సంపాదించుకుంది. అతిప్రాచీన కాలం నాటినుండి, ఆదికవిగా పేరు గాంచిన నన్నయభట్టారకుని ఆంధ్రమహాభారతముతో మొదలుకొని, పోతన ఆంధ్రమహాభాగవతమూ, కవిసార్వభౌమునిగా బిరుదుగొన్న శ్రీనాథుని భీమఖండము, శృంగారనైషథము, కవిత్రయము లో చోటు సంపాదించుకొన్న తిక్కన, యెర్రాప్రగడా మహాభారత స్వేచ్ఛానువాదఘట్టములు, తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగము, ఆధునిక కాలంలో ఝాషువా అనర్ఘరత్నాలైన యెన్నో ఖండకావ్యాలూ, మరెందరో కవులు వ్రాసిన శతకాలు, కావ్యాలు మనకు ఈ నాటి చర్చకు అవలంబించుకొనుటకు న్యస్తముగానుండును.

ఈ పత్రం లో నేను కొన్ని చోట్ల పద్యరూపంలోనే విమర్శ చేయడం సమంజసంగా భావించి పద్యరూపవిమర్శ , పద్యరూప ఉదాహరణలు చేస్తాను. ఇపుడు, పద్యకవిత్వంలో వస్తురూప పరిణామము అన్న అంశము గురించి చర్చిద్దాం. కవిత్వంలో వస్తువు అనబడేది , ఏ కవిత్వంలో ఏ అంశములో(Topic) ఏదైతే విశ్లేషింపబడుతున్నదో (Subject) దానిని వర్ణించడానికి సహకారము గా వాడుకొను పదార్ధమే వస్తువు.(Object)

పద్యకవిత్వం అంటే ఏమిటో చర్చిద్దాం. తెలుగు కవిత్వంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి శైలి, పద్యకవిత్వం. పద్యము అనే శైలిలో ఉన్న కవిత్వము, సాధారణంగా నాలుగు పాదాలతో, చతుష్పాత్ అయ్యి, మరెన్నో వివిధరకాలైనటువంటి ద్విపద, మాలిక, సీసపద్య, వివిధరకాలలో గణయతిప్రాసనియమాదులు కలిగి ఉంటుంది. ఈ గణములు, ప్రాసలు ఎందుకు వచ్చాయో , అసలు పద్యకవిత్వం ఈ రూపంలో ఎందుకుందో మనమిపుడు చూద్దాం. 

ఛందస్సు అనేది తెలుగు పద్యములతో ప్రారంభమైనది కాదు. గీర్వణి అయినటువంటి సంస్కృతంలో నే ఇది యుండును. వేదములూ, పురాణములు, ఇతిహాసములు అన్నీ ఛందోనియమాలుగానే ఉండును. దీనిగూర్చి సాంస్కృతిక మూలములకు వెళితే మనకు యజుర్వేదమునందు ఒక ప్రమాణము నిర్దేశముగా కనబడును. పురుషసూక్తంలో ,

సర్వహుత యజ్ఞమునుండి ఋచా, సామములు జనించినవి, వాటినుండి ఛందస్సు జనించినది 

అని చెప్పబడినది. ఇది ఆధారంగా మనము ఛందస్సు మూలములు సంస్కృతమునందు అనాదిగా వచ్చుచున్నవని చెప్పవచ్చును.

అయితే ఈ ఛందస్సులు అనుష్టుప్ మొదలైనవి సంస్కృతంలో కనబడును. తెలుగు లో మనకు అనేకరకములైన ఛందస్సులు, నూటికి పగా ఉన్నవి. వాటిలో అత్యంత ప్రాథాన్యంగా ఉన్న కొన్నిటిని మనము పరిశీలిద్దాం.

***

పద్యకవిత్వంలో అసలు ఛందస్సు ఎందుకు వచ్చింది? చారిత్రాత్మకంగా చూస్తే, ఛందస్సు ఉద్భవించిన కీలకమైన ఉపయోగము ధారణ. ఎంత ఉత్కృష్ఠమైన గ్రంథమైనా, ఎన్ని పంక్తులున్నా, తగినటువంటి అభ్యాసముతో , తగిన ధారణా ప్రక్రియలతో వాటిని కంఠస్తం చేయవచ్చు. ఆధునికకాలంలో నే మనము శ్రీ గరికపాటి నరసిమ్హారావు గారు మొదలైన వారిని అవధానములలో వెయ్యికిపైగా పద్యాలు ధారణ చేయడం మనం చూస్తున్నాము. ముఖ్యము గా విద్యకు వారి స్వయంకృషి తోడ్పడినప్పటికీ, ఛందస్సు కూడ కీలకంగా తోడ్పడుతుంది

ధారణవల్ల, తరతరాలుగా ఎందరో విజ్ఞానవేత్తలు ఎంతో అధికంగా విద్యను భావితరాలకు పంచగలిగారు. ఐతే ఇక్కడ మనకు ఒక సందేహము కలుగును. ప్రింటింగ్ ప్రెస్స్ (Printing Press) వచ్చాక కూడా ఛందస్సు అవసరమా? ధారణ చేయడం మాత్రమే ఛందస్సుకు ఉన్న ఉపయోగమా

పైన మనం చెప్పుకునే ఉపయోగమే కాక ఛందస్సుకు అనేకమైన ఉపయోగములున్నవి. ముందుగా, రసజ్ఞతాభావముతో మన మనసును చేరిన వస్తువైనా మనని రోమాంచితము చేస్తుంది. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు ఫ్రిస్సన్ (Frission) అని అంటారు. (Physio-psychological response)

మనసు దీనికి గురైనపుడు, మనసు పైపొరలలో ఉన్న ఉద్రేకము ఉద్రిక్తత, మనసుకు బాహ్యజీవితమునకు సంబంధించిన పొరలన్ని ప్రక్కకు తరలి, ఒక శాంతివంతమైన స్థితిని పొందుతుంది. తరుణంలో రసజ్ఞభావములు అలవోకగా పుచ్చుకొనుటయే గాక, ఆధ్యాత్మికమైన దృష్టికోణం తెరుచుకోవడం జరుగుతుంది.

ఆంధ్ర భాగవతంలో వామనోపాఖ్యానంలో పద్యాన్ని చూడండి

శా|| విప్రాయప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే

దప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి యంచున్ క్రియా

క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగున్ జేసాచి పూజించి బ్ర

హ్మప్రీతంబని ధారబోసె భువనంబాశ్చర్యమున్ బొందగన్  

పద్యంలో బలిచక్రవర్తి, వచ్చినది విష్ణువని తెలిసికూడా తన పతనము ముందున్నదని తెలిసి కూడా గురువు వొద్దని చెప్పినా కూడా, మూడడుగులు ధారపోసాడు అన్న తరుణంలో వర్ణన అత్యంత అద్భుతరసప్రథానం. పైకి చదివినపుడు ఇందుగల పదముల వాడుక మన మనసులను కట్టి నిర్బంధించి ఆనందింపచేసి, పద్యం ఐపోయినా కూడా దానిని నెమరు వేసుకునే స్థితి కల్పిస్తుంది.

కవిత్వంలో కవితా నిర్మాణ శిల్ప ప్రయోజనం ఏమిటో చూద్దాము

కేవలం కవిత్వం అందంగా ఉండడానికా? చాలా విస్తృతమైనటువంటి కవితావొస్తువుని ఆవిష్కరించడానికా? పై రెండింటి ద్వారా ఎదైనా లోతైన విస్తారమైన ప్రయోజనాన్ని నెరవేర్చడానికా?   కవి చిత్రించే భావచిత్రాలు , ప్రతీకలు, పదబంధాలుశబ్దసౌందర్యం, భావలయ, భావవైచిత్రుల వలన  శైలీరమ్యత శైలీవిన్యాసం ఏర్పడి ఒక పరిపూర్ణమైన కవితా శిల్పం ఆవిష్కృతమౌతుంది. పరిపూర్ణకవితాశిల్పం కవి చెప్పదలచుకున్న విషయాన్ని, భావాన్ని , అనుభూతిని శక్తిమంతం గా పాఠకుడికి చేరవేస్తుంది. ఇపుడు ఛందస్సు మనకిచ్చే ఉపయుక్తములను పరిశీలనం చేసిన తరువాత, కవిత్వ వస్తువుల గురించి మాట్లాడుకుందాం.

భావకవిత్వం ఐనా అభ్యుదయ కవిత్వం ఐనా ఏదైనా సరే, పాఠకులు వాటిని ఆస్వాదించే ప్రక్రియలో, అందులో మాటలలో మాత్రమే నూటికి నూరుశాతం వశించరు. మాటలతో మొదలుకొని మాటలు చుపించే దృశ్యంలో కానీ, పదాలలో ఉండే లయలో కానీ లీనమైపోయారు.ఛందస్సు లేకపోయినా సరే, కవిత్వం ఔతుంది. “అప్పికట్లకు బాపట్ల ఆరుమైళ్ళు”దీనిలో చందస్సుంది కాని కవిత్వం ఏముంది

శా|| ఆకాశంబుననుండి శంభునిశిరంబందుండి శీతాద్రి శు

శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి య

స్తోకాంబోధి పయోధినుండి పవనాంధోలోకముల్ జేరెగం

గా కూలంకశపెక్కు భంగులువివేకభ్రష్ట సంపాతముల్

అన్నదానిలో కవిత్వం కొల్లలు గా ఉంది. అందులో దృశ్యము లయ అనేవి కీలక పదార్ధాలు

దృక్కు దృశ్యము ఏకమైనప్పుడే కవిత్వంలో రసము కలుగుతుంది. ఒక వ్యక్తి ఉత్తమమైన కవిత్వాన్ని ఆస్వాదించేటప్పుడు అతని లో బుద్ధి కవిత్వంలో మాటలను స్వీకరించి మనసుకు అందిస్తుంది. మనసు మన చిత్తాన్ని ఆనందంలో ముంచుతుంది , తరుణంలో చిద్విసాసములో అహంకారం కనుమరుగౌతుంది. ఇక్కడ రసానందం శిఖరాగ్రాన్నంటుకుంటుంది. అటువంటి గొప్ప రసానుభవాన్ని అందించగల ఉత్తమ కవిత్వం పద్యకవిత్వం లో వస్తువిన్యాసం ఇవ్వగలదు.

***

ఇపుడు వస్తువిన్యాసము, పరిణామాలగురించి మనం చూద్దాం.

పై భతృహరి సుభాషితంలో ఆకాశంబున.. పద్యాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇందులో గంగానది ఆకాశమ్నుండి శివుని జటల పడి, మంచుకొండల మీద పడి, భూమిమీదపడి, సెలయేళ్ళాలో పారి పాతాళానికి చేరిన “యట్లు” , వివేకభ్రష్ఠుని పద్ధతి ఉంటుంది అని అద్భుతం గా వర్ణించారు. ఇందులో వస్తువుగా గంగను వాడుకుని వివేకముతో సమన్వయము చేసారు నాడు సుభాషితములో.

ఇక్కడ ఈ వస్తువునే వాడి కందపద్యం వ్రాసే ప్రయత్నం చేద్దాం.

కం|| ఆకశమునుండి శివుని

నేకంగా మంచుకొండనీభువియందున్

పోకడ పాతళముకు వి

వేకములేనట్టివాని విధములు గల్గున్

ఇందులో మనము ఇదే వస్తువుని వాడుకున్నాము , గంగాప్రవాహమును వివేకముతో పోలుస్తూ. ఐనా ఇందులో రసజ్ఞత, లయవిన్యాసము, వస్తువైచిత్రిని స్పష్ఠంగా చూపించడంలేదు, మనసుకు ఆహ్లాదం కలిగించడంలేదు. ఆ పై శార్ధూలంలో ఉన్న శబ్దవిన్యాసం శబ్దలయ, ఛందోలయ, భావవైచిత్రులు, మనకు ఈ కందపద్యం ప్రయోగములో తగ్గినట్టు కనబడుతుంది. ఈ కందపద్యంలో గణాలన్ని నేను సరిపోయేట్లుగా వ్రాసినప్పటికీ, దీనిలో ఆ పై శార్ధూలపద్యములో వస్తురూపవిన్యాసాన్ని కట్టి చూపినట్టు కనబడదు. వస్తువుయొక్క ప్రామాణికతని కేవలం పద్యరచన వల్ల చూపించడం సాధ్యం కాదు. ఆ పద్యంలో కవిత్వం కలిగి ఉండాలి. ఐతే వృత్తపద్యాలలో తప్ప కందంలో కవిత్వం లుప్తమౌతుందా? ముమ్మాటికీ కాదు. ఈ కందపద్యాన్ని, కొన్ని కవిత్వ వస్తువులను పరిశీలిద్దాం.

కం|| ఎంతదయో దాసులపై

పందంబున మకరిబట్టి బాధింపగ శ్రీ

కాంతుడు చక్రము బంపెను

దంతావళి రాజుగాయ దత్తాత్రేయా

ఈ పైకందపద్యంలో మనకు గజేంద్రునిపై విష్ణుమూర్తి చూపిన కరుణ , రక్షించిన విధానం కనబడతాయి. 

ఇందు అతనిని రక్షించడం అంశంగా తీసుకుంటే, మనకు ఎన్నో వస్తువులు దృశ్యమానం చేసారు ఈ చిన్న కందపద్యంలో. మకరి ఎల పట్టుకుంది అంటే పంతముతో పట్టుకుంది అని, అక్కడ మనకు వర్ణనాత్మకం చేసారు. కందపద్యమైన విస్తారమైన గజేంద్రమోక్షఘట్టాన్ని సిం హావలోకన విధానముగా ఈ పద్యం చెప్పగలిగింది

మరొక్క అడుగు ముందుకు వేసి తిక్కన రచించినటువంటి ప్రాముఖ్యత పొందిన పద్యాన్ని చూద్దాం.

సీ|| ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు

ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొఱపు గఱపు

ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు

ఎవ్వాని గుణలత లేడువారాశుల కడపటి కొండపై గలయ బ్రాకు

పై సీస పద్యంలో ఉన్న దృశ్యశిల్పం అనర్ఘరత్నం. “ధర్మరాజు మామూలువాడా ? కాదు కాదు!”,  అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా, దృశ్యమానం చేయడం లో తిక్కన ఉపయోగించుకున్న వస్తువులు మనం పరిశీలిద్దాం

ధర్మరాజు వాకిట్లో ఆ మత్తగజముల జాలువారే మదము పంకమైందని, ఆ మహారాజులు వారింటికి రావడమును వర్ణించారు. ధర్మరాజు చరిత్ర ఎంత మహోన్నతమైనదో చెప్పడానికి అది లోకానికెల్ల గురుతరమని చెప్పారు. ఆయన సంపన్నతను, ఔదార్యమును, చూపడానికి ఆయన కడకంటి చూపునే వాడుకున్నారు. ఇలా వస్తువిన్యాసమును తిక్కన గారు, వారి కాలంలో చూసేవి, వినేవి, జరిగే విషయాలతో వర్ణనాత్మకం చేసారు.

ఇక్కడ మనము మన అంశం పరిణామము పరంగా ఒక మలుపు తిరుగుదాము. 

పరిణామము: Transformation

పరిణామము అన్న మాటకు అర్థం – Transformation

కాలక్రమేణా సమాజం ఎన్నో మార్పులు చెందింది. ఎన్నో రాజులొచ్చారు, ఎన్నో రాష్ట్రాలు పైకొచ్చాయి, ఎన్నో కనుమరుగయ్యాయి. ఈ కాలక్రమేణా జరిగిన పరిణామము భాష మీదకూడా ప్రభావం చూపించిందన్న మాట వాస్తవము. ఏ కాలంలో జరిగే విషయాలు, లభించే మాటలు, వస్తువులు ఆ కాలం కవిత్వంలోకి చొచ్చుకున్న విషయము మనము కొన్ని కవిత్వాలలో చూడగలము. 

శ్రీనాథుని చాటువులలో 

“దీనారటంకాల తీర్థమాడించితిన్” అంటాడు, 

ఇందులో ‘దీనర్’ (Dinar) అనే మాట పారసీకము (Persian origin) నుంది వచ్చినది. అది సంస్కృతము కాదు, తెలుగు కాదు. ఆయన దానిని ఎటువంటి టంకమో చెప్పగా దీనారటంకము అని టంకా అన్న మాటని ప్రథమావిభక్తీకృతము చేసి భాషలోకి సమ్యోజనం (Integration) చేసారు. ఇది మనం గమనించాల్సిన విషయము. కాలక్రమేణా భాషలో అన్యదేశపాదాల ప్రభావము మనము ఆ 15వ శతాబ్దం కాలమున చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అంతకు ముందు కూడా చేసుకొని ఉండవచ్చు. 

శ్రీనాథుని క్రీడాభిరామం లో కూడా “గడియారము” మీద పద్యము కనిపిస్తుంది. 

మరి కొన్ని శతాబ్దాలు దాటి వస్తే, అభ్యుదయభావపద్యరూపకవిత్వంలో ఝాషువాది ముందడుగు. ఆయన ఫిరదౌసీ, వంటి అనర్ఘరత్నాలు చక్కటి భావజాలముతో , కథాప్రణాలికతో , భావవైచిత్రులతో భావసౌందర్యముతో, రసస్ఫోరకం గా సాగించే ప్రక్రియ ఆయన చేసారు. అనేకమంది ఆధునిక కవులు, పద్యకవిత్వం ఇకపై ఉండబోదని వచనకవిత్వాన్ని శిఖరాగ్రాన్నంటే సామర్ధ్యంతో రాసారు, శ్రీ శ్రీ మొదలైన వారు. 

క్రొత్త ప్రక్రియలు ఐరోపా(Europe), అమెరికా(America) ఖండాలలో చోటుచేస్కున్న విషయం మనమెరుగుదుము.  Renaissance, Industrial revolution, Semiconductor technology వంటి మార్పులో యావద్ప్రపంచాన్ని మార్చి వేయడానికి తయారవుతున్నాయి ఆధునికకాలంతో మొదలుకొని ప్రతి తరానికీ, ప్రతి శతాబ్ధానికీ. 

శాస్త్రవిజ్ఞానంలో క్రొత్త పద్ధతులు, క్రొత్త విషయాలు, క్రొత్తరకాల భావాలు ఆలోచనలు మన దేశంలో కూడా ప్రవేశించి మిశ్రమశైలిని మానవ మనుగడలో, భాషలలో క్రొత్త మాటలుగా, జీవానంలో క్రొత్త పద్ధతులుగా చోటుచేస్కున్నాయి. 

ఆ ఆధునిక కాలం కూడా దాటి మనము అత్యాధునిక యుగానికి సమ్మంధించినవి చూస్తే అసలు భావానికి అందంక ఉన్నవెన్నో మన జీవితాలలో ప్రవేశించాయి. ఈ దృష్టికోణంలో అత్యాధునిక కవిత్వం గురించి మనమిపుడు మాట్లాడుకుందాము.

అత్యాధునిక కవిత్వం:

ఉపయుక్తమైనవని అంగీకరిస్తూ మనము ఎన్నో ప్రక్రియలను స్వీకరించి జీవనం సాగిస్తున్నపుడు , మన కవిత్వభావలో కూడా సాంప్రదాయమను పేరున వాటిని విస్మరించి కొనసాగడం ఎంతవరకు సమంజసము? రొండవ కోణంలో విమర్శాత్మకంగా చూసి, వాటినే తీసుకుని మన పద్యప్రక్రియలో అన్యదేశపదాలను విస్త్రుతం గా వాడడం ఎంతవరకు సమంజసము?  ఈ రొండు పద్ధతులకు మధ్యంతరంగా ఉండే కవిత్వాన్ని మనము అత్యాధునిక కవిత్వం లో అవలంబించుఓవడం తప్పక చేయవలసిన ప్రయత్నము. పూర్వం మనకు వచ్చిన ప్రక్రియలలో శతకాలు, కావ్యాలు, ఖండకావ్యాలు మొదలైన శైలులు కనిపించును. 

ఈ శైలులు మనం ఇప్పటికీ ఈ తరంలో కూడా ఉపయోగించుకుని వ్రాయడం చూస్తాము. 

శతకములలో అనేకకవులు భక్తివైరాగ్యాలను, హాస్యఫోరకంగానూ వ్రాస్తున్నరు. కావ్యములలో మనకు అద్భుతం గా నవయుగానికి సంబంధించిన విషయములతో డా. గరికపాటి నరసిమ్హారావుగారు వ్రాసిన సాగరఘోష కావ్యంలో చూడవచ్చు. 

అందులో ఆయన ప్రస్థావించిన అంశాలు మధ్యయుగము, వివేకానందులు, తిక్కన, విశ్వనాథ సత్యనారయణగారు, మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను వెయ్యికిపైగా ఉన్న పద్యాలలో రచించారు. వారు వాడే పదాలలో మనం అత్యాధునిక వస్తువులను చూడగలము.

ఉ|| హారను లేని కారు సుమహారము వేయని పూజ చిల్లు సిం

గారము లేని గారె మమకారము చూపని బంధువర్గముల్

కారము లేని కూర యవగాహనలేని వివాహబంధముల్ 

ధారణలేనియట్టి యవధానము వ్యర్ధములీ ధరిత్రిలోన్ 

అని ఉత్పలమాలలో , ధారణలేని అవధానము వ్యర్థం అని చెప్పడానికి కారు , హారను అని అన్యభాషాపదాలను వాడారు. ఈ ప్రయోగం ఉదాహరణగా తీసుకుంటే మనకు ప్రాసస్థానంలోనే కాక ‘రా అనే శబ్దప్రయోగం కారు , గారె , కూర అనే పదాలలో కూడ కనిపిస్తాయి. దీనివల్ల శబ్దసౌందర్యన్ని, ఇన్ని ఉపమానాలు వాడడం వల్ల భావవైచిత్రిని పేర్చి ఉన్న విషయాన్ని వర్ణించడం వల్ల, ఈ అన్యభాషాపదాల ఉపయోగంకూడ రసభరితం గా రమ్యంగా కనబడతాయి. ప్రాసస్థానంలో ఎం పెట్టాలో తెలియక కాదు నేను హారను అన్న మాట పెట్టింది, అవసరమయ్యే పెట్టాను అన్న కవిహృదయం దీనిలో మనకు కనిపిస్తుంది. అత్యాధునిక దృష్టికోణం మనకు ఆవిష్కారమౌతుంది.

అనవసరంగా ఆంగ్ల పదాలు పరభాషాపదాలు పెట్టి , సంస్కృతంలోనూ తెలుగులోనూ ఎన్నో పర్యాయాలున్న పదాలను కూడ ఇంగ్లీషుపదాలు వెతికి వాడితే అది రసానందాన్ని భగ్నం చేస్తుంది. 

మరో ఉదాహరణగా , ఆంగ్ల పదాల వాడుకలేకుండానే అత్యాధునిక సామాజిక అంశాలను వర్ణించవచ్చన్న ఉదాహరణ చూద్దాం,  బెంగుళూరు సీ పీ బ్రౌన్ సేవా సమితీ వారు నన్ను గుర్తించిన కవిసమ్మేళనం లో ఆధునిక సంక్షోభమైన కరోనా (Corona Virus) గూర్చి నేను వ్రాసిన పద్యం

ఉ|| పొట్టను జేతబట్టుకుని బుట్టెడు వస్తువులమ్మహోరుచున్

తట్టల క్రొద్ది బాధలను దాల్చగ నెత్తిన వాడవాడలన్

కట్టడి జేయ వర్తనమగాధమునందు కరోన బెట్టగన్

మట్టిని మ్రింగునే సగటు మానవుడీవిధియే బలీఇయమౌ

ఇక, మరొక అంశం – శతకాలు

శతకాలకు మకుటాలు సహజం గా ఉంటాయి. సుమతీ, వేమన , కుమార, భాస్కర, దత్తాత్రేయ, శ్రీకాకుళాంధ్ర దేవా, శ్రీకాళహస్తీశ్వరా, మొదలైన శతకాలతో అనేకం చరిత్రలో మనకు కనిపిస్తాయి. 

శతకంలో మకుటం అవసరమా అని నందీ అవార్డ్ గ్రహీత డా. తెన్నేటి నాగరంజని గారితో మాట్లాడుతున్నపుడు, కొన్ని విషయాలు చర్చలో పైకొచ్చాయి. 

ఒకప్పుడు ప్రింటింగ్ ప్రెస్స్ లేదు. అన్నీ తాటాకు పత్రాలే, బట్టలమేద, వ్రాయడం జరిగింది. ముందు మనం మాట్లాడుకున్నట్టుగా, పద్యరూపంలో ఉన్న రచనలే కాబట్టి ధారణకు ఆటంకము లేదు. శిష్యులు , జిజ్ఞాసులు, మొదలైన వారు నేర్చుకునేవారు. ఆఖరి పాదంలో మకుటం ఉన్నదిగావున ఇది ఫలానా శతకంలోది అని సూచనగా ఉండేది. 

పలుకుబడిలో కొన్ని పద్యాలు కొదరకు లభిస్తే ఇంకొన్ని ఇంకొంతమందికి లభించేవి. అలా ఆ శతకాలు కవిత్వప్రియుల జిహ్వలమీద నాట్యమాడుతూ ఉండి, సీ పీ బ్రౌన్ లాంటి మాహానుభావుల వలన,  మనకు నేడు ప్రింట్ మీడియాలో లభ్యమౌతున్నాయి. 

ఇటువంటి అత్యాధునిక తరంలో సాంప్రదాయరీత్యాకాక సామాన్యమైన మకుటం వల్ల ఉపయోగమేముంది? ఒకవేళ మకుటంవల్ల ఒక పద్య లయ, ఉన్నతభావన కలగలిస్తే దాన్ని వాడుకోవచ్చన్నది భావన.

పైగా, మకుటం మాత్రం వాడుతూ, భావసౌందర్యాన్ని ప్రక్కకు తరలించి నాలుగు పాదాలు ఛందోనియమాలతో వ్రాస్తే అది పద్యరచన అవుతుంది కానీ కవిత్వము కాదు. భావవైచిత్రిని ప్రక్కకు తరలించి వ్రాసే కవిత్వంలో మకుటము అనేది శోభిల్లదు. అటువంటి దానిమీద నా విమర్శ.

కం||

వ్రాతయు గజిబిజి శీత

ప్రాతఃభిక్షాకబళము భావంబగుటన్

రోతగ తోచెడి చతురము

మాతే! చోద్యంబుగాదె మకుటంబిచటన్? 

మకుటమనేది వాడాలనుకుంటే, కవిత్వాన్ని దృశ్యమానము చేయడము, అందులో ఒక శబ్దభావసౌందర్యము కీలకములు గా పెట్టుకోవలసిన అవసరమున్నది.

పద్యకవిత్వం లో వస్తువిన్యాసం, పరిణామం గురించి మనం మాట్లాడుకున్నపుడు , నేడు వ్రాయగల కవిత్వము ఎలా ఉండునో ఒక ఉదాహరణ గా పద్యం వ్రాసే ప్రయత్నం చేద్దాం.

శ్రీనాథుడు ‘దీనారటంకా’ అన్న మాటని ఎల తెలుగు లోకి సమ్యోజనం చేసాడో అలాగే ‘ఆహిస్తా’ , ‘అందాజ్’ , ‘సెహర్’ అన్న మాటలని సమ్యోజనం చేయడానికి ప్రయత్నిస్తూ ఒక యువతి మందారపూవులు తలమీద దాల్చి నడచి వస్తుంటే ఎల ఉంటుందో శార్ధూల పద్యరూపంలో చూద్దాం.

శా||

అందాలూరెడు మోముతో శిశిరమందాహిస్తయుక్తంబుగన్ 

అందాజంజన వచ్చెనిచ్చటకునీయంగారవర్ణాంగి దా

మందారంబులు కూర్చి దాల్చిన శిరోమండమ్ము సెహ్రాకృతిన్ 

సందిగ్ధంబున బెట్టెనన్ను నిజమున్ సంధ్యారవిన్ బోలుచున్ 

ఇందులో ఆహిస్తా అన్న మాటని ఆహిస్తయుక్తంబుగన్ అని, అందాజ్ అన్న మాటని అందాజంజన అని, సెహర్ అన్న మాటని సెహ్రాకృతిన్ అని , ఉపయోగించాను. ఈ మాటలకు తెలుగు లో పదాలున్నాయి, ఇవి లేకుండా తెలుగు లో నే వ్రాయచ్చు. ప్రూడిష్ (Prudish) అన్న మాటకు సంస్కృతంలో కాని తెలుగు లో కేనీ వివరణ ఉంది కాని సరియైన పదం లేదు. అటువంటిపదాలు అత్యాధునిక కవిత్వం వ్రాసేటపుడు వాడదలచినా వాడగలిగి, దానిని వాడి , అతుకుముక్కలా కాక అది ఇమిడిపోయే విధంగా వాడడంలో ఆధునిక కవి సద్యస్ఫురణ, కవితాశక్తి కనబడతాయి.

***

నవతరంలో కవులు ఇటువంటి ప్రయోగాలు చేసి ఎంతవరకు ఇది వాడచ్చో విశ్లేషించి చర్చించి విమర్శించి మన తెలుగు భాషను నేటియుగానికి తగ్గట్టు గౌరవప్రదంగా మలుచుకోవాలన్న భావనలో అత్యధునిక కవులు ప్రయత్నించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.