విజయవాటిక-2

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

అయినా మన జాగ్రత్తలో మనముండాలి. సదా అప్రమత్తంగా ఉండాలి!” హెచ్చరికగా చెప్పారు గురుదేవులు.

క్షణంలో వెయ్యోవంతు శ్రీకరుని కళ్ళలో వింత భావము కలిగి మాయమైనది.

 “అవును గురుదేవా!” అన్నాడు. 

“ఎంత వరకు వచ్చాయి విజయవాటిక (బెజవాడ) గుహాలయాలు?” అడిగారు గురుదేవులు. 

“పూర్తి కావచ్చినవి. శివరాత్రి ఉత్సవాలకు ముందే అక్కడ రుద్రయాగంతో కలిపి అశ్వమేధ యాగం చెయ్యాలని మహారాజుగారి వాంఛ. దానికి మిమ్ములను స్వయంగా ఆహ్వానించటానికి వచ్చాను…” 

“అవునా? వీలు చూసుకు వస్తానని మహారాజుకు చెప్పు! ఆశ్రమములో భోజనం చేసి వెళ్ళు!” చెప్పారు గురుదేవులు. 

“మహాప్రసాదం. అటుపై యువరాజు విక్రమేంద్రవర్మను దర్శించి వెడతాను. అమరావతి వెళ్ళాలి…” అన్నాడు శ్రీకరుడు నమస్కరించి లేస్తూ. 

తదనంతరం ఘటికాపురిలో వడ్డించిన శుద్ధమైన శాకాహార భోజనం చేసి గురుదేవుల వద్ద సెలవు తీసుకొని ఇంద్రపురికి బయలుదేరాడు శ్రీకరుడు. 

***

విష్ణుకుండినలు దక్షిణాపథం ఏలుతున్నకాలమది. ప్రజారంజకమైన పాలనలో పేరుగాంచారు విష్ణుకుండిన రాజులు. సత్యసంధులుగా, న్యాయదేవత భక్తులుగా ఉన్నవారు దేశములో వైదిక ధర్మాలకు పెద్దపీట వేశారు. శాతవాహనుల కాలములో ఎంతో ఉచ్ఛస్థితికి చేరినది బౌద్ధం. వారి తదనంతరం అంతర్బేధాల వలన మహాయాన, హీనయాన, తాంత్రిక బౌద్ధంగా విడిపోయింది. తాంత్రిక బౌద్ధం పల్లె ప్రజలలో భయం పెంచింది. మహాతార ఆరాధనలలో జంతు హింస మొదలయి, ప్రధానమైన అహింసను విడనాడింది బౌద్ధం. నాటి నుంచి వైదీకం ప్రాభవం సంతరించుకుంది.

శాతవాహనుల తరువాత వచ్చిన ఇక్ష్వాకులు, ఆనందగోత్రికులు, శాలంకాయనులు ఎక్కువ కాలము మనలేకపోయారు. తెలుగునేలలో వినుకొండ ప్రధాన నగరంగా గోవిందవర్మ నిలబడ్డాడు.
వారు క్షాత్రం స్వీకరించిన బ్రాహ్మణులు. విష్ణుకుండిన గోత్రీయులు.  రెండవ మాధవ వర్మ దక్షిణాపథమంతా జయించి, బలవంతమైన శత్రురాజ్యం వాకాటకులను జయించి, వారి రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. 

ఆయనకు, పట్టపురాణికి కలిగిన వారసుడు దేవవర్మ, వారసత్వముగా రాజ్యానికి వచ్చినా రెండు సంవత్సరాలలో మరణించాడు. అంత వరకూ యువరాజుగా ఉన్న విక్రమేంద్రవర్మకు(ఇతను రెండవ మాధవవర్మ, వాకాటక రాణి మహాదేవికి కలిగిన సంతానం) కాకుండా దేవవర్మ పుత్రుడు, రెండవ మాధవవర్మ మనుమడు అయిన మూడవ మాధవవర్మకు రాజ్యాధికారం అప్పచెప్పాడు మంత్రి విష్ణువర్ధనుడు.

అమిత పరాక్రమవంతుడు, ధర్మవంతుడైన ఈ మూడవ మాధవవర్మ దక్షిణాధిపతి, త్రికూటమలయాధిపతి అన్న బిరుదునామాలు స్వీకరించాడు. నయవినయసత్వ సంపన్నుగా పేరుపొందాండు. భగవత్ శ్రీపర్వత స్వామి(శ్రీశైల) పాదానుదాసుడు, పరమ భక్తుడు. అపరిమితమైన వైదికనిష్ఠ గలవాడు. యాగాలలోఅనురక్తి కలవాడు. ఇంద్రఘటికాపురి పరమేశ్వరశాస్త్రిమాహాస్వామి ప్రియ శిష్యుడు. 

ఆ ఘటికాపురి ఇంద్రపురికి నాలుగు క్రోసుల దూరంఇంద్రపురి విష్ణుకుండిన రెండవ రాజధాని. ముచుకుండా నది ఒడ్డున వెలసిన నగరమది. ఆ నగరాన్ని రెండుగా చేస్తూ నది ప్రవహిస్తూ ఉంటుంది.

విశాలమైన మహానగరము ఆ గుట్టల మీద ఇరువది రెండు బురుజుల ఉన్న మహాకోట. విశాలమైన వీధులు, ఆకాశాన్నంటే మేడల నడుమ మహాదేవుని దేవాలయాలతో దేవనగరులా ఉన్న ఇంద్రపురి భూమి మీద ఇంద్రుని ఆస్థానమే అనిపిస్తుంది. 

దానికి రాజప్రతినిధిగా ప్రస్తుతం విక్రమేంద్రవర్మ ఉన్నాడు. అతను మహారాజు మాధవవర్మకు చిన్నాన్న వరసవుతాడు. మూడవ మాధవవర్మ రాజుగా పట్టాభిషిక్తుడైన సమయములో విక్రమవర్మ కూడా చిన్నవాడు. యువరాజుగా ఉన్న తనను కాదని మూడవ మాధవవర్మను రాజును చెయ్యటము అతనికి నచ్చలేదు. ఎదురుతిరగటానికీ అతనికి అంగబలమూ, అర్థబలమూ లేదు. ఏమీ చెయ్యగలిగినదీ లేదు, అలాగని ఆనాటి పరిస్థితులలో ఒప్పుకోలేకపోయాడు. తన సమయం కోసము ఎదురుచూస్తూ ఉండిపోయాడు. కాలం గడిచే కొద్ది ఆయనలో అసహనము, అవమానము పెరుగుతున్నదే కాని తరుగుటలేదు. ఇలా యువరాజుగానే ఇంద్రపురిలోనే కొనసాగుతున్నాడు. 

మూడవ మాధవవర్మకు ఒక కుమారుడు, మహాదేవవర్మ. ఈ పుత్రుడు తనకు రాజ్యం రాకుండా పెద్ద అడ్డని  విక్రమేంద్రవర్మ అనుమానము. ఆ అనుమానము, అసహనంగా మారి దాదాపు అన్న కుమారుడు మాధవవర్మతో రాకపోకలు మానుకున్నాడు. బయటకు మాత్రం సౌమ్యత నటిస్తున్నాడు. అలా ఎంతకాలము ఉండగలడో మరి…

 శ్రీకరుడు ఇంద్రపురి చేరి యువరాజుల దర్శనం కోరాడు. ఆనాటి సాయంత్రము రాజ్యాంతఃపురము వెనుక ఉన్న ఉద్యానవనంలో యువరాజును కలుసుకోమని అతనికి కబురు వచ్చింది.

 శ్రీకరుడు ఆవిధంగానే ఉద్యానవనములో ప్రవేశించాడు. అక్కడ యువరాజు కోసము ఎదురు చూస్తూ గడిపాడు. 

కొంతసేపటికి వందిమాగధులు యువరాజు వస్తున్నాడని ప్రకటించారు.

“జయ జయ యువరాజ! 

జయ విష్ణుకుండినుల కులదీప!

జయ అతి పరాక్రమ వీర, కరుణాలవాల! 

జయోస్తు! విజయోస్తు!” అంటూ వందిమాగధుల జయనినాదాల నడుమ యువరాజు ప్రవేశించాడు.

“యువరాజులకు జయము, జయము! విష్ణుకుండినుల కులదీపులకు వారి వంశభృత్యడు శ్రీకరుడు  అభివందనములు తెలుపుతున్నాడు…” అంటూ వంగి నమస్కారం చేశాడు శ్రీకరుడు. 

“ఎచ్చటి నుంచి రాక శ్రీకరా?” అడిగాడు యువరాజు ఆదరముగా.

“శ్రీపర్వతము నుంచి యువరాజా!”

“మహాదేవుని సేవించి వస్తున్నావా? శుభం. రాజధానిలో సర్వులు క్షేమమే కదా…”

“శ్రీపర్వత స్వామి కృపన అందరూ క్షేమమే ప్రభూ!”

“శత్రువుల మీద మీ నిఘా ఎలా వుంది?” అడిగాడు యువరాజు.

“బయట ప్రస్తుతం మన మీద కన్ను వేసే ధైర్యం ఎవరికుంటుంది ప్రభూ. పరాక్రమవంతులైన మీరు వెన్నంటి ఉండగా మహారాజుకు మరి బెంగనేది లేదు కదా!” అన్నాడు శ్రీకరుడు. 

నవ్వాడు యువరాజు. “మేము పరిపూర్ణంగా విష్ణుకుండినుల రాజ్యశాంతి కోసము కట్టుబడియున్నాము. ఈ వంశపాలన ఆచంద్రార్కము నిలచి ఉండాలి…” అన్నాడు యువరాజు.

“నిజం. మా చివరి రక్తం బొట్టు వరకూ మేము ఈ రాజ్య క్షేమము కోసము, ఈ వంశ క్షేమము కోసము ప్రాణాలు ధారపోస్తాము ప్రభూ!” అన్నాడు శ్రీకరుడు. 

“శుభం…” అన్నాడు యువరాజు విక్రమేంద్రుడు.

“యువరాజా! ప్రభూ! వచ్చే శివరాత్రికి ముందు విజయవాటిక గుహాలయాలు ఆవిష్కరించి, అశ్వమేథ యాగం, రుద్రయాగం చెయ్య వేద పండితులు నిశ్చయించినారు. మహారాజు తమకు ఈ విషయము చెప్పి మీ అనుజ్ఞ కోరమన్నారు. మిమ్ములను వచ్చి ఈ కార్యక్రమం జరిపించవలసినదిగా ప్రార్థిస్తున్నారు…” వినయంగా చెప్పాడు శ్రీకరుడు.

“అవునా! మంచి మాట. ప్రస్తుతానికి నీవు వెళ్ళిరా శ్రీకరా! చిరంజీవి మాధవునికి మా దీవెనలు అందచేయు!” అని యువరాజు లేచి లోపలికి వెళ్ళిపోయాడు. 

శ్రీకరుడు బయటకు వచ్చి, తన గుర్రం వలుకను ఆ రాత్రికి అశ్వశాలలో ఉంచి, తాను వసతిగృహంలో విశాంత్రి తీసుకున్నాడు. ఆ రాత్రి కొంత సేపు నగరములో తిరిగాడు. తన మిత్రులు, తోటి చారులతో ముచ్చటించాడు. ఏదైనా అనుమానాస్పదమైనది కనపడుతుందా అని వళ్ళంతా కళ్ళుగా తిరిగాడు. ఏమీ తేడా లేకపోయినా ఏదో అసహనము కనపడింది వాతావరణములో. ఎంతగా ఆలోచించినా అర్థం కాలేదు.

మరుసటి ఉదయము తొలిజాములో లేచి, కాలకృత్యాలు తీర్చుకున్నాడు.  మహాదేవుని అర్చించి విభూది ధారణ చేసి వలుకనధిరోహించి అమరావతి వైపుకు సాగిపోయాడు. 

****

విష్ణుకుండినులకు నాలుగు రాజధానులు ఉన్నాయి. 

వారి ప్రథమ రాజధాని వినుకొండ. తరువాత ఇంద్రపురి. తదనంతరం అమరావతి. ప్రస్తుతం విజయవాటికకు మార్చుకున్నారు. మార్చినా, ప్రతి చోటా వారి ప్రతినిధిగా రాజవంశం వారున్నారు. 

ఇంద్రపురిలో విక్రమేంద్రవర్మ, అమరావతిలో మహాదేవవర్మ. మహారాజు విజయవాటికలో ఉండి రాజ్యం చేస్తున్నాడు. 

వారు రాజ్యాన్ని ‘విషయాలు’గా విభజించారు. ప్రతి విషయానికి ఒక విషయాధిపతి ఉంటాడు. ఒక్కో విషయాన్ని కొన్ని ‘రాష్ట్రాలుగా’ విభజించారు. ప్రతి రాష్ట్రాన్ని కొన్ని ‘మండలాలుగా’ విభజన చేశారు. వీరు తమ అధిపతులకు సమాచారము అందచేస్తారు. అది అలా అంచలంచెలుగా మహారాజుకు తెలుస్తుంది. దీనికి పైన రాజుకు తన వేగుల వ్యవస్థ ఉంది. వారు దేశమంతా తిరుగుతూ ఎలాంటి సమాచారమైనా తక్షణమే రాజుకు అందచేస్తారు. అటువంటి చారులలో ఒక విభాగానికి అధికారి శ్రీకరుడు. మహారాజుతో ఉన్న బంధుత్వము వల్ల, యువరాజు మహాదేవవర్మ స్నేహం వలన అతనికి రాజభవనములో ఏ సమయంలోనైనా ప్రవేశం ఉన్నది.

 ముఖ్యమైన పనులకు  మహారాజు కూడా శ్రీకరుడిని పంపుతారు. శ్రీకరుడు ఇంద్రపురి నుంచి అమరావతికి బయలుదేరాడు. భానుడు నడినెత్తి మీదకు వచ్చి వేడిమి కలిగిస్తున్నాడు. మిట్ట మధ్యహ్నం అవుతోంది. దారి ప్రక్కన తోటలు, బావి కనపడితే ఆగాడు శ్రీకరుడు. అశ్వానికి నీరు పట్టి తానూ కొంత త్రాగాడు. అది మల్లె తోట. ఆ బావి గట్టున మామిడి చెట్టు నీడన కూర్చున్నాడు. గుర్రం వలుక గ్రాసము నములుతోంది. 

ఇంతలో ఆ తోట రైతు అటుగా వచ్చాడు. శ్రీకరుని చూచి “వీరుడా! ఎటు నుంచి రాక. ఎందాకా ? పంటి క్రింద తినటానికి కొద్దిగా బువ్వ ఉంది తీసుకో. గడ్డ పెరుగు, కుండ పచ్చడి(ఆవకాయ), అంతకు మించి అతిథికి పెట్టలేను, రా!” అంటూ పిలిచాడు. విష్ణకుండినుల సమయములో రాజభాష సంస్కృతము. ప్రజలు ప్రాకృతము మాట్లాడేవారు.

మధ్యహ్నం వేళ వచ్చిన వారు అతిథులు, మహేశ్వర స్వరూపమని నమ్ముతారు ప్రజలు. 

శ్రీకరుడు వచ్చి ఆ రైతు ఎదురుగా కూర్చుంటూ “ నేను యువరాజు సైన్యంలో భటుడిని. అమరావతి మ్రొక్కు తీర్చుకోవటానికి వెడుతున్నాను. ఎలా ఉంది పంట కర్షకా?”  అంటూ పలకరించాడు. 

“ఏది మన యువరాజు విక్రమేంద్రులేనా? లేక మహాదేవవర్మనా?” అన్నాడు పరిశీలనగా చూస్తూ. 

“విక్రమేంద్ర యువరాజువారేలే. మహాదేవవర్మవారు యువరాజు కాదు. కేవలము రాజకుమారులు మాత్రమే…” చిరునవ్వు నవ్వాడు శ్రీకరుడు. 

“అద్గదీ! వారెప్పుడు మహారాజు అవుతారో. పెద్దవారు కూడా అయిపోతున్నారు…” అన్నాడు రైతు కొద్దిగా విచారంగా.  పల్లెలలో ఉండే జనపదులు రాజకీయాలు పట్టించుకోరు. అలాంటిది రైతు మాట శ్రీకరునికి లోలోలపల కొద్దిగా ఆందోళన కలిగించినా బయటకేమీ కనపడనీయక “నాకూ అదే అర్థమవటంలేదయ్యా!” అన్నాడు. 

“మా వరకూ ఈ ముచుకుండానదీ తీరాన్న మేము… వారే తరువాతి మహారాజ కావాలని చెప్పుకున్నాము…” అన్నాడు.

“ఎలా చెప్పుకున్నారు?” అడిగాడు ఆసక్తిగా శ్రీకరుడు.

“మా జనపదాల నుంచి ప్రతి పండగకు వారికి కానుకలు పంపుకుంటాము. మాకు కష్టంలో సుఖంలోనూ వారే కదా మరి దిక్కు. క్రితం వరదలకు వారు మా ప్రక్కనుండేగా అన్నీ చూసుకున్నారు. అదీగాక  ఈ రాజ్యం అంతా వారిదే. ఎదో కర్మ చాలక వారు యువరాజులా ఉండిపోయారు కానీ!” అన్నాడా రైతు.

వెన్నులో చిన్నపాటి జలదరింపు కలిగింది శ్రీకరునికి. ‘రాజప్రతినిధులు రాజు తరుఫున పనిచెయ్యాలి. యువరాజుకు ప్రజల వెన్నుదన్ను చాలా ఉంది…’ అని అనుకున్నాడు శ్రీకరుడు

ఆలోచనలు కనపడనీయ్యక, అతను పెట్టిన దద్దోజనం, మామిడి ముక్కతో తిని లేచాడు. అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. 

రైతు “ఈ పూలు తీసుకుపో వీరుడా! మహేశ్వరునికి మా పల్లె తరుపున సమర్పించు…” అంటూ గంప నిండా మల్లికలు ఇచ్చాడు. 

ఆ సువాసన శ్రీకరుని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతనికి హృదయంలో గిలిగింత కలిగింది. మనసు గెలిచిన చెలి మల్లికావల్లి తలపులలోనికొచ్చింది. 

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.