సమ్మోహన ఇంద్రచాపం

-డా.దిలావర్

శేషేంద్ర బడి నుండి బుడి బుడి అడుగులతో మొదలై సొంత ‘కళా శాల ‘వరకూ సాగింది రఘు కవిత్వ  ప్రస్థానం.అగరొత్తుల ధూపం నిలువెల్లా కమ్ముకోవడం ఎప్పుడైనా అనుభవించారా?మనసును పులకింప జేసే హరిచందన గంధాన్ని ఎప్పుడైనా ఆఘ్రాణించారా?మత్తు గొలిపే అత్తరుల గుబాళింపును ఎప్పుడైనా అనుభూతించారా…?లేదా…?ఐతే…రఘు కవిత్వంలోకి డైవింగ్ చేయడానికి సంసిధ్ధంగా ఉండండి….రఘు కవిత్వం ఒలికే వెన్నెల సోనల్ని ఆస్వాదించండి.
      ధ్వనికి రంగును,రంగుకు వాసననూ,వాసనకు రుచినీ భ్రమింప జేశారు ఫ్రెంచ్ సింబలిస్ట్ కవులు.గజి బిజిగా ఉందా? అర్థం కాలేదా?అయితే రఘు ఐంద్రజాలిక వాక్యాలను పలకరించండి.అవి  కొంచెమైనా అనుభూతించడానికి దారి  చూపుతాయేమో…. జాగ్రత్త ఆ మొగిలిపొదల్లో మోహ ధూపం కమ్మి ఉక్కిరి బిక్కిరి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు…..
     ప్రియురాలి హృదయాన్ని నిర్వచించండి అంటే వెర్రిమొహాలు వేయడం తప్ప ఏం చేస్తాం…?దాన్ని ఎవరికి వారు మన్సులోకి అనువదించుకోవలసిన వ్యవహారం.రఘు కవిత్వాన్నైనా  అంతే.అసలు కవిత్వాన్ని క్లాసు రూం లో పాఠాలు చెప్పినట్టు వివరించ  బూనుకోవడం హాస్యాస్పదం.అది కేవలం అనుభవైక వేద్యం మాత్రమే.
        ‘పసిడి వజ్రం తూచలేని  మాట ‘అని ఒక చోట అంటాడు రఘు.పడి కట్టు పదాలతో కవిత్వాన్ని తూచలేం కదా!దాన్ని హృదయం తో మూల్యాంకనం చేయాల్సిందే.
     ఉభయ సంధ్యల్ని ఎర్రమట్టి దిబ్బల్లా చూడటానికి,కుంకుడురసంపులుముకున్న కంటిరంగుల్ని చూడటానికీ కాళిదాసే దిగిరావలసిన పని లేదు.మన రఘు చాలు.
      ఉపమల్ని దాటి రూపకమై, చిత్రమైన భావ చిత్రాల్లోకి తొంగి చూడాలని ఉందా?తచ్చాడే అడుగుల్ని కను బొమ్మలపడవల్ని అరచేతులు కవ్వంతో బింబాలుగా చిలికే సవ్వడిని వినాలంటే మీకు ఏమాత్రం చెవుడు లేకుంటా వుండాలి సుమా!అదట్లా ఉంచండి.కనీసం వరండాలో పేపర్ వాలిన మృదంగ ధ్వని    వినాలన్నా చెవుడు లేకుండా వుండాలి కదా!చెవులే కాదు మీనాలుక రుచిమొగ్గలు కూడా జర్దా పాన్లు నమలడంతో బండ బారి పోకుండా ఉండాలి.లేకుంటే తేనెలో ముంచి ఇచ్చే మాటల రుచిని కూడా తెలుసు కోలేని దురవస్థ ప్రాప్తిస్తుంది
      అయినా ఇప్పుడు మన కొంపల్లో తెల్లవారు ఝామున్నే మజ్జిగ చిలికే అందమైన చప్పుళ్ళు ఎక్కడున్నాయి లేండి. ఆ మనోహర దృశ్యం కళ్ళారా చూసిన వాడికే కన్నుల్లో కాదు,హృదయంలో హత్తుకుపోతుంది……నాకూ రాత్రికి మధ్య నెలవంక కవ్వం లా మారుతుంది.అదినిమిషాల్ని చిలికి చిలికివెన్న గిన్నెలా మారుతుంది అంటాడు రఘు.ఈ సుతారమైన   ప్రాసెస్ అంతా అవగతం కావాలంటే పురా స్మృతుల పల్లెటూళ్ళకు వెళ్ళాల్సిందే…..ధ్వని తడిమిన కాంతి పొరలను పొందికగా    తొంగి చూడటం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే ముందే  చెప్పినట్టు ఫ్రెంచ్ సింబలిస్టులను వెదుక్కుంటూ పోవాల్సిందే.     
      వెన్నెల పన్నీరులో సరిగంగ స్నానాలు చేశారా ఎప్పుడైనా?పోనీ లెండి. చేయకున్నా ఫరవాలేదు.రఘు మాటల వెన్నెల స్నానం మాత్రం మిస్ కాకండి.అప్పుడు ఏటవాలుగా  పడుతున్న వెన్నెలలో లోకం స్నానం చేసే మనోజ్ఞ్ దృశ్యం దర్శనమిస్తుంది.ఇప్పుడీ నేను -కల- వెన్నెల ఒక వైపు అని కవి  ఎందుకన్నాడో తెలుస్తుంది.
       కవిత్వం రాయ నక్కరలేదు.దాన్ని ఎంజాయ్ చేయగల రస హృదయం కావాలి.అప్పుడే మనలో రసప్లావిత సహజాతాలు మేల్కొంటాయి. ఎండపొడ వెన్నెల్ని కొరుక్కుతినడం చూశారా?పోనీ ఊహల్ని కొరకడమంటే ఏంటో తెలుసా?వెన్నెల్ని నమిలే కవి  నీకు అర్థం కాకుంటే నువ్వు కవిత్వ రాహిత్యం అనే జబ్బుతో బాధ పడుతున్నావన్న మాట!లేకుంటే ఎండల్ని కొరికి వెన్నెల్ని పులమటం అంటే ఎందుకు అంతుపట్టదు నీకు?
     ‘అక్వేరియం లో చేప పిల్ల నీ మనసు
      ఒక చోట నిల్చోదు
      తచ్చాడుతుంది పంజరం లో పక్షిలా ‘ అని అంటాడు రఘు. తానొక  ఊహల చేపై కవిత్వపు అలల్లో ఈదుతున్నాడు. కవి  ఆత్మను పట్టుకోవాలాంటే మనమూ అతనితొపాటు ఈదులాడాల్సిందే.
      నాకు తెలిసి మొట్ట మొదటి ‘మనసు కవి ‘కాళిదాసే.అభిజ్ఞాన శాకుంతలంలో ఓ చోట ఇలా అంటాడు:
    గఛ్ఛతి పురశ్శరీరం ధావతి పశ్చాదసంస్తుతం చేత:
    చీనాంశుక మివ కేతా:ప్రతివాతం నీయ మానస్య!
  దుష్యంతుడు, శకుంతలతో నిండా ప్రేమలో మునిగి ఉంటాడు.ఇంతలో పానకం లో పుడకలా నగరం నుండి ఒక  భటుడు వస్తాడు.ఏనుగులు నగరాన్ని ధ్వంసం చేస్తున్నాయి,వచ్చి రక్షిండని అంటాడు.
      అటు రాజ ధర్మం .ఇటు ప్రేమ ధర్మం.దేన్నీ  విస్మరించలేని నిస్సహాయ స్థితి. చివరకు వెళ్ళక  తప్పదు.రథారూఢుడై ముందుకు సాగతాడు.అప్పుడు  రథమ్మీదున్న దుష్యంతుని శరీరం నగరం వైపు వెళ్ళుతుంటే, ఎదురు గాలికి వెనక్కి రెప్ప రెపలాడే కేతనంలా అతని మన్సు వెనక్కి (శకుంతల వైపు) వెళ్ళుతున్నదట.ఓహ్! దుష్యంతుని  మన:స్థితిని ఎంత గొప్పగా వర్ణించాడు కాళిదాసు!
     ఊహల్ని పాపికొండల్ని చేసినా,నీ కోసం సాయంత్రాల్ని మెత్తని తివాచీలా పరచినా, ఎదురు చూపుల పొదుగు నుండి అందంగా రుతుపవనం లా రమ్మని స్వాగతించినా,దిగంతాల ఒంపుల్లో కారుతున్న ధారాళ కాంతితో తడుస్తున్న రాత్రిని చూపించినా, వాన చినుకుల చీపురుపుల్లలు నేలనంతా కడిగి చిత్తడి ముగ్గులు వేసినా……రఘు ఊహలన్నీ ప్రకృతి లోంచి ఒంపుకున్నవే.అసలు కళలన్నీ ప్రకృతి అనురూపాలే కదా!
      దారుల్లో బురదున్నా
      ‘హృదయం లో మధువున్న వాడు కవి ‘అని అంటాడు రఘు.అతని హృదయ చషకం నిండా పొంగులువారే కవిత్వ  మధువే!
   నిజాలు ఇంకి పోయిన ఏ ఇజాలలోనూ రఘు ఇమడడు.తనదారేంటో తనది.అలా అని అంతా తన దారిలోనే   నడవాలన్న వెర్రి ఆకాంక్ష కూడా లేదు.
   ఎడ తెగని తేనెల వరదలా అతని హృదయంలో నిరంతరం  ఒకకవిత్వ రసఝరి ప్రవహిస్తూ ఉంటుంది. రసం చిప్పిల్లే  పదాలను ఏరుకోవడంలోనే రఘు ప్రతిభ ద్యోతక మవుతుంది.కవిత్వం కాని దాన్ని ఓ పట్టాన తన దరికి చేర నీయడు.రాయకుండా ఉండలేని తనమేదొ అగ్ని పర్వతం లోంచి  లావా చిమ్మినట్టు అతని గుండెల్లోంచి కవిత్వమై పెల్లుబుకుతుంది.అందుకే రఘును హృదయపూర్వకంగా  అభినందించకుండా ఉండలేము.
   వృత్తి లాయర్ అయినా ప్రవృత్తి మాత్రం కవిత్వం రాయడమే .లాయరుకూ, కవిత్వానికీ సాపత్య మేంటి అన్న ప్రశ్న  ఊదయించవచ్చు.నేను చెప్పేదొక్కటే…..
       Poet is a lair but he speaks always truth.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.