విజ్ఞానశాస్త్రంలో వనితలు-8

వృక్ష శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్‌టన్ కూక్‌సన్ (1893-1973)

– బ్రిస్బేన్ శారద

          ఏ ప్రాంతంలో ఏ శాస్త్రం వృద్ధిలోకొస్తుందన్నది ఆ ప్రాంతపు భౌగోళిక, నైసర్గిక స్వరూపాల పైన ఆధారపడి వుంటుంది కాబోలు. ఆస్ట్రేలియా విశాలమైన భూ భాగం. రకరకాల వృక్షాలకీ, పశుపక్షజాతులకీ ఆలవాలం. సహజంగానే ఆస్ట్రేలియాలో వృక్ష శాస్త్రంలో చాలా పరిశోధనలు జరిగాయి. అందులోనూ దాదాపు ఇరవయ్యో శతాబ్దం మొదటి వరకూ ఆస్ట్రేలియాలో జనావాసం చాలా తక్కువ. అందువల్ల అడవులూ, చెట్లూ, పక్షులూ, జంతువులూ యథేచ్ఛగా పెరిగాయి. ఎంతో వృక్ష వైవిధ్యానికీ, పశు పక్ష్యాదుల వైవిధ్యానికీ పుట్టినిల్లు ఆస్ట్రేలియా ఖండం. సహజంగా, ఎంతో మంది పేరు పొందిన వృక్ష శాస్త్రజ్ఞూలు (బోటానిస్టులు) ఆస్ట్రేలియా కేంద్రంగా తమ పరిశొధన సాగించారు. రకరకాల
ఆకులూ, వృక్ష భాగాలపైనా పరిశోధనలు సాగించి వాటిని క్రమబద్ధీకరించారు.

          మైక్రోస్కోపులు ఇంకా ప్రాచుర్యానికి రాని రోజుల్లో చాలా వరకు ఈ బొటానిస్టులు చిత్రకారులై వుండేవారు. వారు తాము చుట్టుపక్కల చూసిన ఆకులనీ, చెట్లనీ చిత్రాలుగా గీసి పత్రికల్లో ప్రచురించేవారు. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి బోటనీలోశాస్త్రీయ పరిశొధనలతో వృక్ష శాస్త్రంలో క్రమబద్ధీకరణకు బలం చేకూరింది. బోటానీ చదువుకుని వృక్ష శాస్త్రంలో పరిశోధనలు చేసే వారి సంఖ్యా పెరిగింది.

          జీవ శాస్త్రం (మానవ శాస్త్రంకానీ, వృక్ష శాస్త్రంకానీ, జంతు శాస్త్రం కానీ) గురించిన అధ్యయనం రెండు కాళ్ళ మీద సాగుతుంది. ఒకటి ప్రస్తుత నిర్మాణం. అంటే శరీర నిర్మాణం ఇప్పుడెలా వుందన్నది. దీన్ని మనం అనాటమీ అని పిలుస్తాం. అయితే ఈ శరీర నిర్మాణం యుగయుగాలుగా ఎలా పరిణామం చెందుతూ వొచ్చిందన్నది కూడా
చాలా ముఖ్యమైన అధ్యయనమే. ఈ అధ్యయనం శిలాజాల సహాయంతో నడుస్తుంది.
రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా శిలాజాల వయసెంతో నిర్ధారించి, జీవి శరీర నిర్మాణం కాలంతో పాటుగా ఎలా పరిణామం చెందిందో ఒక నిర్ధారణకు రావొచ్చు. దీన్ని పేలీ ఎంటాలజీ (Palaeontology) అంటారు. పేలిఎంటాలజీ శాస్త్రం యుగాలుగా మనిషి, ఇతర జంతువులదీ శరీర నిర్మాణం యొక్క పరిణామాన్ని అధ్యయనం చేస్తుంది. అలాగేవృక్షాల నిర్మాణ పరిణామాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియోబోటనీ (Paleobotany) అంటారు.

          పేలియోబోటనీలో విశేషమైన కృషి చేసిన ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్టన్ కూక్సన్ (Isabel Clifton Cooksun). వృక్ష శిలాజాలతో ఈమె చేసిన పరిశోధనలు వృక్ష శాస్త్రాన్ని ఎంతో ముందుకు తీసికెళ్ళాయి. ఒక రకమైన వృక్ష ప్రజాతికి ఈమె పేరిచ్చి గౌరవించారంటేనే ఆమె పరిశోధనల ప్రాముఖ్యం అర్థం చేసుకోవచ్చు. యాభై ఎనిమి దేళ్ళ పరిశోధనా కాలంలో ఇసాబెల్ దాదాపు తొంభై మూడు పరిశోధనా పత్రాలు వ్రాసారు. ఇందులో దాదాపు ముఫ్ఫై ఆవిడ పదవీ విరమణ తర్వాతనే వ్రాసారు, అంటే, ఆవిడకి తన పరిశోధనల పట్ల వున్న అంకిత భావం అర్థం చేసుకోవచ్చు.

          పేలియోబోటనీతో పాటు ఇసాబెల్ పేలినోలోజీ అనే శాస్త్రంలో కూడా విస్తృతమైన పరిశోధనలు చేసారు. గాలిలో, నీటిలో, శిలాజాల్లో వుండే చిన్న చిన్న ధూళి కణాలను విశ్లేషించి జీవకణాల పరిణామాన్ని అంచనా వేస్తారు. 

          1893లో మెల్బోర్న్‌లో జన్మించిన ఇసాబెల్ ని ఆస్ట్రేలియాలో మొట్టమొదటిమహిళా వృత్తిపరమైన శాస్త్రవేత్తగా పేర్కొంటారు. అంటే అంతకు ముందు ఆస్ట్రేలియాలో స్త్రీలు విజ్ఞాన శాస్త్రాల్లో ఏ కొద్దిమందో పనిచేసినా వారికెవరికీ వృత్తిపరమైన శాస్త్రవేత్తగా  ఎటు వంటి గుర్తింపూ రాలేదు. ఇంగ్లండు నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చిన మోతుబరి రైతు జాన్ కూక్‌సన్, అడిలైడ్ నగరానికి చెందిన ఎలిజబెత్‌ల మూడో సంతానం ఇసాబెల్
కూక్‌సన్.

          మెథడిస్ట్ లేడీస్ కాలేజీలో ఇసాబెల్ ఎనాటమీ, ఫిజియాలజీ, బోటనీలతో ఇసాబెల్
హైస్కూలు చదువు ముగిసింది. హైస్కూల్లో ఆమె అనాటమీ, బోటనీ, ఫిజియాలజీ
సబ్జక్టుల్లో మంచి మార్కులతో పాసవడమే కాదు, పియానో, టెన్నిస్‌లలో ప్రావీణ్యం కూడా సంపాదించింది. అటు తరవాత జువాలజీ, బాటనీలతో మెల్‌బోర్న్ యూనివర్సిటీలో బీయెస్సీ పట్టా 1916లో పుచ్చుకున్నారు.

          1916 నుండి 1930 వరకు ఇసాబెల్ మెల్‌బోర్న్ విశ్వ విద్యాలయంలో రకరకాల
స్కాలర్‌షిప్పులతో వృక్ష శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు సాగించారు. మెల్‌బోర్న్  యూని వర్సిటీలో 1916 లో మొదలైన ఆమె ప్రస్థానం యాభై యేళ్ళకు పైగా నడిచింది. 1973 వరకూ ఆమె మెల్‌బోర్న్ యూనివర్సిటీ అధ్యాపకురాలిగానే కాలం గడిపారు.

          1917లో ఆల్‌ఫ్రెడ్ ఎవార్ట్, ఫ్రెడెరిక్ చాప్‌మాన్ అనే ఇద్దరు అధ్యాపకుల దగ్గర మొదటగా ఫంగస్ రకాల మీద ఇసాబెల్ పరిశోధన మొదలుపెట్టారు. పరిశోధనా విద్యార్థిగా వున్నప్పుడే ఇసాబెల్ తన సూపర్‌వైజర్ ఆల్‌ఫ్రెడ్ ఎవార్ట్ పూవుల జాతుల గురించి వ్రాస్తున్న పుస్తకానికి ఎన్నో వివరాలు సేకరించి ఇచ్చారు. అటుపైన వాల్‌నట్ వృక్షాల మీదే కాక, వృక్ష శిలాజాల మీదా ఆవిడ ఆ సంవత్సరాల్లో చేసిన పరిశోధన  అంతర్జాతీ యంగా పేరు పొందాయి. 1917 నుంచి 1922 దాకా ఆమెకి యూనివర్సిటీ బోటనీ  డిమాన్స్‌ట్రేటర్‌గా జీతం కొంచెమే వచ్చినా, చాలా అంతర్జాతీయ గ్రాంటులూ, స్కాలర్‌షిప్పులూ సంపాదించుకున్నారు.

          1922లో ఆమెకి ఆ చిన్న డిమాన్స్‌ట్రేటర్ వుద్యోగం కూడా పోయింది. ఎంత ప్రయత్నించినా డిపార్ట్‌మెంటులో ఇంకో వుద్యోగం దొరకక పోవటంతో, తన సూపర్‌వైజర్ ఈథెల్ మెక్‌లెన్నన్ తో కలిసి 1925లో ఇంగ్లండు ప్రయాణమయ్యారు ఇసాబెల్. అక్కడ తాను సంపాదించిన ఫంగస్ నమూనాలన్నీ పాడైపోవడంతో నిరాశ పడ్డ ఇసాబెల్ తన దృష్టి పేలియోబోటనీ వైపు సారించారు.

          1925-27 మధ్యలో ఇసాబెల్ రెండుసార్లు ఇంగ్లండు పర్యటించి ఇంపీరియల్
కాలేజీలోనూ, మేన్‌చెస్టర్ యూనివర్సిటీలోనూ పరిశోధనలు సాగించారు. 

          1927లో మెల్‌బోర్న్ తిరిగొచ్చేనాటికి ఆమెకి ఆస్ట్రేలియాలో ఏ ఉద్యోగమూ లేదు. అయినా బోటనీ డిపార్టుమెంటులో పని చేస్తూనే వున్నారు. అయితే ఆమె ప్రొఫెసర్లూ తమ కొచ్చిన గ్రాంటుల్లో ఆమెకి జీతం యేర్పాటు చేసారు. ఆ సంవత్సరాల్లోనే ఇసాబెల్ పేలియోబోటనీ, పేలినోలోజీ, పాలినోమార్ఫ్, లాటి శాస్త్రాల్లో విశేష కృషి చేసి తన పేరు సుస్థిరం చేసుకున్నారు.

          మేన్‌చెస్టర్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ లాంగ్ తో కలిసి చేసిన పరిశొధనల్లో ఇసాబెల్ 300-400 మిలియన్ యేళ్ళ క్రితం విక్టోరియా ప్రాంతాల్లో వున్న వృక్ష జాతుల గురించి ఎన్నో పేపర్లు ప్రచురించారు. ఈ జ్ఞానమంతా ముందు తరాల శాస్త్రజ్ఞులకెంతో ఉపయోగపడిందని వేరే చెప్పనక్కరలేదు.

          1930 నుంచి ఇసాబెల్ మెల్‌బోర్న్ యూనివర్సిటీలో బోటనీ లెక్చరరుగా, చాలా
తక్కువ జీతంతో నియమితురాలయ్యారు. ఆస్ట్రేలియా చరిత్రలో ఒక మహిళ శాస్త్రవేత్తగా జీత వేతనాలు పొందటం ఇదే మొదలంటారు. అప్పుడామె వయసు ముఫ్ఫై ఆరేళ్ళు. ఉద్యోగం ఇచ్చినా, యూనివర్సిటీ యాజమాన్యం ఆమెకి పెన్షను సౌకర్యాలేవీ వుండవని నిర్మొహమాటంగా స్పష్టం చేసింది. తన తోటి మగవారి జీతంతో పోలిస్తే ఆమె జీతం దాదాపు యాభైశాతమే వున్న రోజుల్లో ఇసాబెల్ బోటనీ విద్యార్థుల సిలబస్ రూపొందించి,
బోధించారు కూడా.

          1932లో ఆమె తన వృక్ష శిలాజాల గురించిన తన థీసిస్ సమర్పించారు. 1940 నుంచి ఇసాబెల్ పుప్పొడి (pollen) గురించి పరిశోధన మొదలుపెట్టారు. 1930లో ఉద్యోగం
సంపాదిస్తే, ఆవిడకి రీడరుగా మొదటి ప్రమోషను 1952లో వచ్చిందంటే నమ్మలేం. ఐనా ఆ సంవత్సరాల్లో ఆమె తిరుగులేని పరిశోధన చేసి ఎన్నో పేపర్లూ, వ్యాసాలూ ప్రచురించారు.

          1947లో లక్నో నగరంలో ప్రారంభించిన బీర్బల్ సహానీ ఇన్స్‌టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఇసాబెల్ ప్రధాన వక్త. 1949లో ఆమె ఆధ్వర్యాన పనిచేసే పోలెన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్‌ని (Pollen Research Institute) ఆస్ట్రేలియా ప్రభుత్వ రంగ సంస్థ కౌన్సిల్ ఫొర్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్‌ట్రియల్ రిసెర్చి (Council for Scientific and Industrial Research) శాఖ ప్రారంభించింది. 1976 నుంచి ప్రతీ యేటా జరిగే  పేలియో బోటనీ కాన్‌ఫరెన్సులో అత్యుత్తమమైన పరిశోధనా పత్రానికి కూక్‌సన్ అవార్డు ఇస్తున్నారు.

          కాన్‌బెర్రాలోని ఒక ప్రాంతాన్ని ఆమె పేరుతో ‘కూక్‌సన్’ అని పిలుస్తారు. చాలా కొద్ది మంది దగ్గరి స్నేహితులున్న ఇసాబెల్‌కి తన పరిశోధనలే కాక, సంగీతమూ, పర్యటనా చాలా ఇష్టముండేవి. తన యవ్వనమంతా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ వున్న తన తల్లి సమ్రక్షణలోనే గడిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత పెరిగిన తన జీతాన్ని పెట్టుబడులలో పెట్టటం కోసం ఇన్వెస్ట్‌మెంట్ లాటి ఆర్థిక విషయాలను సొంతం గా నేర్చుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన డబ్బును ఆవిడ తన పరిశోధనల కోసం చేసిన ప్రయాణాలకై వినియోగించారు.

          జూలై 1, 1973న ఇసాబెల్ మరణించారు. యాభై యేళ్ళకు పైగా సాగించిన నిరంతర పరిశోధనా, తొంభైకి పైగా ప్రచురించిన పరిశోధనా పత్రాలు- వీటన్నిటి ద్వారా ఇసాబెల్ ఆస్ట్రేలియా దేశపు వృక్ష సంపదా, వృక్ష శిలాజాలూ, ఆస్ట్రేలియా ఖండపు భౌగోళిక పరిణా మాలూ గురించిన అపారమైన జ్ఞాన సంపదను ముందు తరాల వారికి అందించారు.

*****

photo : Australian War Memorial

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.