
వ్యాధితో పోరాటం-41
–కనకదుర్గ
అమ్మ ట్యూబ్ పెట్టింతర్వాత డా.రొసాటో దగ్గర అప్పాయింట్మెంట్ దొరికాక ఇండియాకి వెళ్ళింది. అమ్మ వచ్చినపుడు అమ్మ దగ్గరకు వెళ్ళనని గొడవ చేసిన పాప అమ్మ వెళ్ళే సమయానికి బాగా అలవాటయ్యింది. అమ్మ కూడా వదలలేక వదలలేక వదిలి వెళ్ళింది. అమ్మ వచ్చి దాదాపు ఏడు నెలలు ఉండి మాకు అండగా నిలిచిన విషయం మేము ఎపుడు మర్చిపోలేదు, చైతన్య కూడా. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ముందు నుండే కానీ ఇపుడు మరీ ఇష్టం.
ట్యూబ్ పెట్టారు కానీ కొన్ని రోజుల్లోనే దాని చుట్టూ చిన్న చిన్న కురుపుల్లా లేచేవి. అవి చాలా నొప్పిగా ఉండేవి. మేము మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అవి చూసి, “ఇది అందరికీ నార్మలే, శరీరం ఈ కొత్త పరికరాన్ని తిరస్కరించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే ఇలా అవుతుంది.” అని ఒక యాసిడ్ ఆ కురుపుల మీద కొన్ని చుక్కలు వేసేవారు, అవి వెంటనే కాలిపోయేవి. వూరికే ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఆ యాసిడ్ పేరు రాసివ్వమంటే ఇచ్చేవారు కాదు, ఆ యాసిడ్ ట్రేయినింగ్ అయిన డాక్టర్లు, నర్సులు మాత్రమే వాడాలని అనేవారు. ఇంతే కాదు జే-ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వస్తుండేవి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా జ్వరం, ట్యూబ్ దగ్గర వాపు రావడం, దురద, నొప్పి, మంట ఉండేవి. ఒకోసారి హాస్పిటల్లో చేర్చుకుని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. నాకు చాలా చిరాగ్గా ఉండేది. ఉన్న సమస్యకు తోడు ఇంకో సమస్య తోడయ్యింది కదా అని. డాక్టర్ రొసాటో దగ్గరికి వెళ్ళే సమయానికి ట్యూబ్ కొంచెం అడ్జస్ట్ అవ్వసాగింది.
***
న్యూట్రిషనిస్టులు ట్యూబ్ ఫీడింగ్స్ రోజూ ఎంత పెట్టుకోవాలి, అస్సలు తీయకుండా అంటే 24 గంటలు ఉంచుకోమన్నారు. రెండు వారాలకోసారి రక్తపరీక్ష చేయించుకుని రమ్మన్నారు. డా. కోచ్మెన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సి.టి. స్కాన్, ఎక్స్ -రేలు తీసుకుని ఒక వారంలోపు రమ్మన్నారు. ముందు డా. కోచ్మెన్ చెప్పినట్టు సి.టి. స్కాన్, ఎక్స్-రేలు తీసుకుని ఆయన దగ్గరకు వారంలోపే వెళ్ళాం. ఈ సారి పిల్లలను జోన్ చూసుకుంటానంది. ఆ అప్పాయింట్మెంట్లో మాకు తెలిసిందేమంటే పాన్క్రియాస్ తల, బాడీ, రెండు రాళ్ళలా గట్టిగా అయిపోయాయని, దాని తోక మాత్రం బాగానే వుందని తెలిసింది. ఈ విషయం చెప్పి ఆయన మేము ఎలా రియాక్ట్ అవుతామా అని ఎదురుచూస్తున్నారు. నేను శ్రీని వైపు చూసాను, అయోమయంగా డాక్టర్ వైపు చూస్తున్నాడు. నేను డాక్టర్ వైపు తిరిగి “ఇపుడేం చేయాలి?” అని అడిగా. ఆయన కొంచెం ఆశ్చర్యంగా, “ఓహ్! యూ వాంట్ టు గో స్ట్రేయిట్ టు ద యాక్షన్!” అన్నారు.
“యస్ ప్లీజ్! ఈజ్ దేర్ ఎనీథింగ్ యూ కెన్ డూ ఆర్ నాట్?” అని అడిగా,
” ఐ కాన్ట్ డూ ఎనీథింగ్… బట్ డా. రొసాటో కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్ అబౌట్ ఇట్.” అన్నారు.
” వాట్ కెన్ హి డూ అబౌట్ ఇట్.”
“నేను ఈ టెస్ట్స్ చేయించుకు రమ్మన్నది లోపల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలని. మేమంతా కలసి పని చేస్తాము. ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా ఐ కెన్ సజెస్ట్ హిమ్ టు పర్ఫార్మ్ ఏ ’విపుల్’ సర్జరీ విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రాబ్లెమ్.” అన్నారు.
“సో దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లెమ్?”
“యస్ అఫ్కోర్స్!” అన్నారు.
“ఎందుకిలా అయ్యింది?” అని శ్రీని అడిగాడు.
“ఇలాంటి సమస్య సామన్యంగా అల్కహాలిక్స్ లోనే చాలా ఎక్కువగా వస్తుంది….”
“తనసలు అల్కాహాల్ టచ్ చేయనే లేదు…మరి తనకెందుకొచ్చింది?”
“రిపీటడ్ గా పాన్క్రియాస్ కి ఇన్ఫ్లమేషన్స్ ( ఇన్ఫెక్షన్ తో వచ్చే వాపు) వస్తే కూడా ఇలా అవుతుంటుంది. ఎక్కడో, ఎప్పుడో ఒకొక్కసారి ఇలా అవుతుంటుంది. కాంప్లికేటడ్ కేసెస్ బట్ వియ్ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. డా. రొసాటో, అద్భుతమైన సర్జన్, ఆయన ఎంతో మందికి చాలా కష్టమైన సర్జరీలు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడినతను. మీరు మంచి సర్జన్ చేతుల్లో వున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీరేం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా ఆయనని కలవండి, ఎవ్విరిథింగ్ విల్ బి ఆల్రైట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.” అని షేక్ హ్యాండ్ ఇచ్చారు డా. కోచ్మెన్.
ఇంటికొచ్చేపుడు ఇద్దరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. శ్రీని నా చెయ్యి మీద తన చెయ్యి వేసి, “మనమనుకున్నదే కదా! సర్జరీ అవసరమవుతుందనే మనం డా.రొసాటో దగ్గరికి వచ్చాం కదా! ఏం పర్వాలేదు, అంతా బాగానే జరుగుతుంది. వచ్చేవారం డా.రొసాటో దగ్గరకి వెళ్తున్నాం కదా! ఆయన బాగా క్లియర్ గా చెప్తాడు. ఎక్కువగా ఆలోచించకు.” అన్నాడు.
“నాకంటే నువ్వే ఎక్కువ ఆలోచిస్తావు. నువ్వేం ఆలోచించకు.” అన్నాను నేను.
ఈ అప్పాయింట్మెంట్లున్నపుడల్లా వాటి కోసం ఎదురు చూడడం, ఆ డాక్టర్లతో ఏం మాట్లాడాలో, ఏం ప్రశ్నలడగాలో ఆలోచించడం, ఆ డాక్టర్లు ఏం చెబ్తారోనని సంశయాలు, ఏం జరుగుతుందోనని భయాలు ఉండేవి.
నేను చాలావరకు సకారాత్మకంగా (పాజిటివ్) వుండడానికి ప్రయత్నించేదాన్ని. మొదటి సర్జరీ పని చేయలేదని చెప్పలేం, అపుడున్న పరిస్థితిలో అంటే పాన్క్రియాటిక్ డక్ట్ కి అడ్డంగా కొన్ని రాళ్ళున్నాయి అవి తీయకపోతే ప్రాణానికి హానీ కాబట్టి ఆ సర్జరీ చేయాల్సివచ్చింది. గాల్ బ్లాడర్ పాడయ్యింది కాబట్టి అది కూడా తీసేసారు. అప్పటికే చాలా సమయం పట్టింది. వాళ్ళకి తెల్సినా అపుడేం చేయలేని పరిస్థితేమో! అందుకే నేను ఎన్నిసార్లు, ’ఇక ఆ భయంకరమైన నొప్పి రాదుగా,’ అని డా.బార్బరాని అడిగినా ఆమె ఏ సమాధానం చెప్పకుండా దాటవేసేవారు. ఇపుడు తెలుస్తుంది ఎందుకలా అన్నారో.
ప్రతిరోజు, ప్రతిసారి సకారాత్మకంగా వుండాలంటే కుదరదు. ఇంత భరిస్తున్నా, ఇంత ట్రీట్మెంట్కూడా ఈ సమస్య ఇంకా పట్టుకుని పీడిస్తుంటుందెందుకు? అని అనిపించినపుడు మాత్రం అసలు ఈ డాక్టర్లకు అర్ధమవుతుందా లోపల ఏం జరుగుతుందోనని? సర్జరీ తర్వాత కూడా నాకు నొప్పి వస్తుంటుంటే డాక్టర్లు అసలు నొప్పి వస్తుందో లేదో, అంతా నా బుర్రలో వుందన్నపుడు సైకియాట్రిస్ట్ ని చూడమన్నపుడు నేనేంత బాధ పడ్డానో నాకే తెల్సు. ఎందుకు వీళ్ళు నమ్మటం లేదని ఒకోసారి విసుగొచ్చేది. ఈ డాక్టర్లెవ్వరూ అసలు సీరియస్ గా తీసుకోవటం లేదని కోపం వచ్చేది.
ఇపుడు వాళ్ళందరూ ఏమంటారో? నేను నొప్పి నొప్పి అని చెబ్తుంటే అది ప్రయత్నం చెయ్యి, ఇది ప్రయత్నం చెయ్యి అన్నారు, అన్నీ చేసాను అయినా తగ్గలేదు, నా బరువు అస్సలు పెరగకుండా తగ్గిపోతూ వుండడంతో అప్పుడు జే-ట్యూబ్ పెట్టి పెద్దాసుపత్రికి పంపించారు. ట్యూబ్ పెడ్తామన్నపుడు మాత్రం నా ధైర్యం, సకారాత్మకంగా ఆలోచించడం అన్నీ కొండకెక్కాయి. ఇక ఈ జబ్బుతో ప్రయాణం ఇప్పట్లో ఆగుతుందో లేదోనని చాలా భయం వేసేది. అసలు నేను కుటుంబానికి భారంగా తయారవుతున్నానేమోనని చాలా బాధ వేసేది. ఎంత మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నా పిల్లల పెంపకం, చదువుల కోసం దాచాల్సిన డబ్బు నా రోగంకి ఖర్చయిపోతుందని ఏదో అపరాధం చేసిన దోషిలా బాధపడేదాన్ని.
ఎంతో ప్రేమగా పెంచుకుందామనుకున్న పాప పెద్దదవుతుంది నేను దగ్గర లేకుండానే. ఇంట్లో వున్నన్ని రోజులు దాని ముద్దు ముచ్చటలు చూస్తూ మురిసిపోవడం, స్నానం చేయించడం, బుజ్జి బుజ్జి బట్టలు మేం కొని తెచ్చి పెట్టుకున్నవి వేసేదాన్ని, తినిపించేదాన్ని, ఆడించడం, పాటలు పాడడం- నేను పాట పాడుతుంటే బాగా వినేది. నేను లేనపుడు చైతన్య, శ్రీని కూడా పాపతో మాట్లాడుతూ, చిన్న పిల్లల పాటలు, తెలుగులో, ఇంగ్లీష్ రైమ్స్ పాడి వినిపిస్తుండేవారు. అందుకే తనకి మాటలు త్వరగా వచ్చాయి. నేను పాట పాడుతుంటే తనూ గొంతు కలిపేది, పదాలు పలకడం రాకున్నా ట్యూన్ పాడుతూ పాడుతూ నిద్ర పోయేది.
శ్రీని, నేను వేరే ఏం మాట్లాడుకునేవాళ్ళం కాదు, కేవలం జబ్బు గురించి, ఎప్పుడు ఏ అప్పాయింట్మెంట్లు ఉన్నాయి, శ్రీని ఎపుడు ఆఫీస్ నుండి రావాలి, నేను తను వచ్చేవరకు రెడీ అయ్యి వుండడం, తను డ్రైవ్ చేస్తుంటుంటే నేను రాత్రి సరిగ్గా నిద్రపోకుంటే కునికిపాట్లుపడేదాన్ని, దగ్గరి అప్పాయింట్మెంట్ అయితే బయటికి చూస్తూ కూచునేదాన్ని. మా ఇద్దరికి బయటికి వెళ్ళడమంటే కేవలం డాక్టర్ల ఆఫీసుల చుట్తూ తిరగడం, హాస్పిటళ్ళకి వెళ్ళడం, మందులెప్పుడు అయిపోతాయి, అన్నీ సరిపోయేవి వున్నాయా, మళ్ళీ ఎపుడు తెచ్చుకోవాలి, ఒక అప్పాయింట్మెంట్ కాగానే మరో అప్పాయింట్మెంట్ ఒకోసారి వారంలో అయిదురోజులు వుండేవి. పాపం శ్రీని ఆఫీస్ నుండి రోజు టైం తీసుకుని రావాల్సి వచ్చేది. ఒక ఫ్రెండ్, ” శ్రీని రోజు ఆఫీస్ నుండి రావడం కష్టం కదా, నేనొచ్చి తీసుకెళ్తాను,” అనేది. ఎపుడైనా తనకి కుదరకపోతేనే పాపను చూసుకునే జోన్ ని తీసుకెళ్ళమనేవాడు అంతే కానీ ఎవ్వరిని అడగటం ఇష్టం ఉండేది కాదు.
పిల్లల గురించి మాట్లాడుకున్నపుడు మాత్రం ఇద్దరం సంతోషపడేవారం. చైతన్య ఎలిమెంటరీ స్కూల్ అయిపోయి మిడిల్ స్కూల్ కి వెళ్తున్నాడు. మేముండే దగ్గర ఎలిమెంటరీ స్కూల్ నాల్గో తరగతి వరకుంటుంది అయిదో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు మిడిల్ స్కూల్, తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు హైస్కూల్ ఉంటుంది. ప్రస్తుతానికి వాడు అన్నిట్లో ముందున్నాడు. పెద్దగా కూర్చో పెట్టి చెప్పవలసిన అవసరం లేదు, తెలివైన వాడు కాబట్టి తనే స్వంతంగా అన్నీ చేసుకుంటాడు, చెల్లిని ప్రేమగా చూసుకుంటాడని శ్రీని చాలా సంతోషపడేవాడు. స్ఫూర్తి గురించి మాట్లాడేపుడు చాలా ఆనందంగా అనిపించేది. నాకు వాళ్ళిద్దరూ ఆరోగ్యంగా పెరుగుతున్నారని సంతోషంగా ఉండేది.
డా.కోచ్మెన్ రిపోర్ట్ లో ఏముందో చెప్పాక వారానికి డా. రొసాటో, పెన్న్ హాస్పిటల్ కి వెళ్ళాం. డా. కోచ్మెన్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, కూడా ఉన్నారు. వెళ్ళగానే డా. రొసాటో, ” వేర్ ఈజ్ యువర్ బేబీ టుడే?” అని అడిగారు. ఇంట్లో ఫ్రెండ్ చూసుకుంటుందని చెప్పాను.
డా. కోచ్మెన్, సి.టి. స్కాన్ లో ఏముందో చెప్పారు ముందు. తర్వాత ఎక్స్-రేలు చూపించారు, దాంట్లో పాన్క్రియాస్ తల, బాడీ ఎలా గట్టిగా అయిపోయాయో చూపించారు.
“ఇపుడు మేము నీకున్న ఈ భయంకరమైన నొప్పి తగ్గించాలి, నువ్వు మామూలు జీవితం గడిపేలా, నీ పిల్లలకు నార్మల్, హెల్ధీ తల్లిలా ఉండాలంటే, విపుల్ సర్జరీ చేయాలి. ఈ సర్జరీలో ఒకవేళ పాన్క్రియాస్ పూర్తిగా పాడయిపోతే మొత్తం తీసేస్తాం, అపుడు ఆ పేషంట్స్ జీవితాంతం ఇన్సులిన్, తిన్నది అరగడానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీలీ ద టెయిల్ (తోక్) ఆఫ్ పాన్క్రియాస్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సో నో ప్రాబ్లెమ్. యూ హావ్ టు టేక్ జస్ట్ ఎంజైమ్స్ ఫర్ డైజెషన్. వాట్ డూ యూ సే మై డియర్? డూ యూ వాంట్ మి టు బి యువర్ సర్జన్ ఆర్ నాట్?” అని అడిగారు.
“అఫ్కోర్స్ వియ్ వాంట్ యూ యాజ్ మై సర్జన్. అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది! మరి టేయిల్ అలా ఉంచితే మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుందా?” అని అడిగాను
“రాకూడదు. నేను ఇంతవరకు సర్జరీ చేసిన పేషంట్స్ అందరూ బాగానే వున్నారు. అయినా బాగున్న పార్ట్ ని తీసేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మొట్టమొదట ఇన్సులిన్ డిపెండెంట్ అవుతారు. ఇపుడు నీకు డయాబిటిస్ లేదు ఎందుకంటే ఆ టేయిల్ వల్లనే ఇంకా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కాబట్టి. అది తీసేస్తే …. నో…నో…నో ఐ కాంట్ డూ దట్! ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ టేయిల్ టూ …. మీరు మరొక సర్జన్ ని చూసుకోవచ్చు.” అన్నారు.
నేను, శ్రీని ఒకేసారి, ” నో! వియ్ వాంట్ యూ డాక్టర్ రొసాటో.” అని శ్రీని ఆగాడు. నేను, ” ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ డా. రొసాటో, మీరేది చెబితే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీ అంత అనుభవమున్న మంచి సర్జన్ కావాలనే మీ దగ్గరికి వచ్చాము.” అన్నాను.
“కొంతమంది మొత్తం ఆర్గన్ తీసేయమంటారు కానీ ఆ తర్వాత ఎంత కష్టమవుతుందో వాళ్ళకి అర్ధం కాదు.”
“వియ్ డెఫినెట్లీ అండర్ స్టాండ్ డా. రొసాటో.” అన్నాం ఇద్దరం.
“నువ్వు చాలా వీక్ గా ఉన్నావు. 70 పౌండ్లంటే చాలా తక్కువ. కనీసం ఇంకో పది పౌండ్లు పెరిగితే కానీ నువ్వీ సర్జరీ తట్టుకోలేవు. అందుకనే న్యుట్రీషనిష్టులను రెగ్యులర్ గా కలుస్తూ వారిచ్చే సలహాలను పాటిస్తుంటే బరువు పెరుగుతుంది అపుడు సర్జరీ చేయొచ్చు…..”
“అన్నిరోజులాగితే ఏం పరవాలేదా? ఇపుడు ఎమర్జన్సీగా చేయక్కర్లేదా?” అడిగాడు శ్రీని ఆయన మాటకు అడ్దు వస్తూ.
” వేరే చాయిస్ లేదిపుడు మనకు. ఇంత తక్కువ బరువుతో సర్జరీ చేయడం చాలా కష్టం. నొప్పి వస్తుంటుంది, తన న్యూట్రిషన్ లెవెల్స్ సర్జరీకి కావాల్సినంత పెరిగితే చేయొచ్చు.” అన్నారు డా. రొసాటో.
డా. కోచ్మెన్, ” ఐ అగ్రీ విత్ డా. రోసాటో. తను చాలా వీక్ గా ఉందిపుడు, కొన్నాళ్ళాగి చేస్తేనే సర్జరీ సక్సెస్ అవుతుంది, ఇప్పటికి న్యూట్రిషనిస్టులను కలవండి.” అన్నారు.
ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పి న్యూట్రిషనిస్టులని కలవడానికి వెళ్ళాం. బ్లడ్ టెస్ట్ చేయించుకుని వచ్చాము.
వాళ్ళిద్దరూ మాకోసం ఎదురు చూస్తున్నారు.
రక్త పరీక్షలో అన్నీ రకాల పోషకాహార విలువలను పరీక్ష చేసారు.
ఇపుడెంత వున్నాయి, ఎంత పెరగాలో చెప్పారు. ప్రతి రెండు వారాలకు బరువు చూస్తారు, కొద్ది కొద్దిగా పెరిగినా చాలు డా.రొసాటో అడిగినా లెవెల్స్ కి చేరుకోవచ్చు అని చెప్పారు.
తింటే నొప్పి వస్తుంటే బలవంతంగా తినవద్దు, కానీ ఎపుడు నొప్పి లేకుంటే అపుడు ఏదైనా కొద్ది కొద్దిగా తినవచ్చు అని చెప్పారు.
వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకుని ఇంటికి వెళ్ళాం.
కానీ అన్ని రోజులు ఎదురు చూడాలంటే చాలా కష్టంగా అనిపించింది. దాని గురించే ఆలోచించకుండా దృష్టి మరల్చుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తే శ్రీని గబుక్కున, “పుస్తకాలు, నేను లైబ్రరీ నుండి నువ్వు ఏది తెమ్మంటే అది తెస్తాను, చదువుతుంటే నీ ఆలోచనలు ఎపుడూ సర్జరీ గురించే వుండవు….”
“కానీ నేను బుక్స్ చదివి చాలా రోజులయ్యింది కదా…”
” చాలా రోజులేం కాలేదు నువ్వు హాస్పిటలైజేషన్స్ కి ముందు ఆరోగ్యంగా వున్నపుడు ఇక్కడికొచ్చిన కొత్తలో చాలా బుక్స్ చదివేదానివి గుర్తుందా? మనం ఇండియాకి వెళ్ళినప్పట్నుండి ఆగిపోయింది అంతే.”
” సరే నువ్వే తీసుకురా చదవగలిగితే రెగ్యులర్ గా తెచ్చుకోవచ్చు.” అలా మరో పని ఎక్కువ పెట్టాను శ్రీనికి.
కానీ ఆ నిర్ణయం మా ఇద్దరికి చాలా ఉపయోగపడింది. మొదట్లో మెల్లిగా చదివినా అయిదు పుస్తకాలు చదివేసరికి స్పీడందుకుంది. ముందు ఒకట్రెండు పుస్తకాలు తెచ్చేవాడు తర్వాత నా స్పీడ్ చూసి అయిదారు పుస్తకాలు తేవడం మొదలుపెట్టాడు. ఒకో పుస్తకం అయిపోగానే శ్రీనికి నేను చదివిన పుస్తకం దేని గురించి, అందులో పాత్రలెలా వున్నాయి, నాకు బాగా నచ్చిన పాత్రలేంటి, నాకు బాగా నచ్చిన కొటేషన్స్ చూపించేదాన్ని. శ్రీని నేను చదివిన పుస్తకాల లిస్ట్ కంప్యూటర్ స్ప్రెడ్ షీట్లో అన్నీ టైప్ చేసి పెట్టడం మొదలు పెట్టాడు. అన్ని రకాల పుస్తకాలు చదవేదాన్ని. అమెరికన్ రచయిత్రుల, రచయితల పుస్తకాలు, బ్రిటీష్ రచయిత్రులు, రచయితల పుస్తకాలు, కొన్ని వేరే భాషల నుండి ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన పుస్తకాలు చదివేదాన్ని.
చలికాలంలో స్నో పడినపుడు పిల్లలను తీసుకుని లైబ్రరీ దగ్గర చాలా ఖాళీ ప్రదేశం ఏటవాలుగా ఉంటుంది. పిల్లలకు రెండు మూడు పొరల బట్టలు, వాటిపైనుండి పెద్ద జాకెట్లు, కాళ్ళకి మందమైన సాక్స్, స్నో షూస్, చేతులకు గ్లోవ్స్, తలకు చెవుల్లోకి చల్ల గాలి వెళ్ళకుండా వులెన్ టోపీలు పెట్టి రెడీ చేసాము. స్ఫూర్తిని నేను ఎత్తుకోలేకపోయాను, తనున్న బరువుకు దానికి వేసిన వాటి బరువు తోడై చాలా బరువుగా అనిపించింది. గుట్టలుగుట్టలుగా పడింది మంచు, స్నో ట్రక్స్ వచ్చి రోడ్లపైనుండి తీసి పక్కకు వేస్తే చిన్న చిన్న కొండలుగా తయారయ్యాయి. మేము కూడా అన్నీ వేసుకుని పిల్లలను తీసుకుని లైబ్రరీ వైపు వెళ్ళాము. అప్పటికే చాలా మంది పిల్లలతో స్నో స్లేడ్స్ తో ఏటవాలుగా వుండే ప్రదేశం కాబట్టి అందరూ పై నుండి క్రిందకి జారుతూ చిన్నా, పెద్దా అందరూ ఆనందిస్తున్నారు. చైతన్యకు వాడు ఒక్కడే జారడానికి స్లెడ్ ఉంది, ఇద్దరు కల్సి జారడానికి ఒక స్లెడ్, ఇద్దరు పెద్దవాళ్ళు కల్సి జారవచ్చు దీనితో. స్పూర్తికి ఇంకా ఏడాది కూడా నిండలేదు అందుకే మనం కూర్చొని దాన్ని వొళ్ళో కూర్చోబెట్టుకుని జారడానికి ఒక స్లెడ్ తీసుకున్నాడు శ్రీని.
చైతన్యకు చెల్లిని కూర్చోబెట్టుకుని జారాలని ఎప్పటినుండో ఎదురు చుస్తున్నాడు. మొట్టమొదట వాడు స్ఫూర్తిని కూర్చోబెట్టుకుని పై నుండి జారాడు, స్ఫూర్తి భయపడుతుందేమోననుకున్నాము. కానీ జారుతుంటే కిల కిల నవ్వింది. కాసేపు చెల్లితో ఆడుకున్నాక చైతన్య తన స్లెడ్ తో జారుతూ అక్కడికి వచ్చిన వాడి స్నేహితులతో సంతోషంగా ఆడుకోసాగాడు.
నేను బాగున్నపుడు అన్నీ ఆటలు వాడితో ఆడేదాన్ని. పార్కులకు వెళ్ళితే ఉయ్యాలలూగడం అక్కడ ఆడుకోవడానికి ఉన్న రక రకాల జారుడుబండలు, ఎక్కి, దిగేవి ఏవైనా చాలా సులభంగా ఎక్కి, దిగేదాన్ని.
ఇపుడు కూడా వాడు, “నాతో అన్నీ చేసావు కదమ్మా! స్ఫూర్తికి కూడా నువ్వు అన్నీ ఆడతావని తెలియాలి కదమ్మా!” అని అంటుంటాడు. నేను రానని అంటే తను వెళ్ళనని అంటుంటాడు. నాకు సర్జరీ అయ్యాక అన్నీ చేస్తాను అని చెబ్తుంటాను. కానీ ఇపుడు మాత్రం ఇద్దరితో కల్సి కాసేపయినా మంచులో ఆడుకోవాలని వచ్చాను. చైతన్య స్నేహితులతో ఆడుకుంటుండగా ముందు శ్రీనిని, స్ఫూర్తిని కూర్చోబెట్టుకుని
జారమన్నాను. దాని నవ్వులు, ఆనందం చూస్తే నాకు సంతోషంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. పిల్లలతో ఆనందంగా ఉండడానికైనా సర్జరీ సక్సెస్ కావాలని అనుకుంటుంటాను.
నేను దాన్ని వొళ్ళో కూర్చోబెట్టుకుని జారుతూ చాలా సేపు ఆడుకున్నాను. తర్వాత వాడొచ్చాక ఇద్దర్ కూర్చుని జారే స్లెడ్ తో ఇద్దరం జారాం, వాడి ఆనందానికి అంతులేదు. మళ్ళీ పాత రోజుల్లాగ నేను వాడితో ఆడుతుంటే ఏ సమస్యల్లేవు అంతా బాగానే ఉందనిపించసాగింది. శ్రీని, చైతన్య కల్సి జారేపుడు నేను స్ఫూర్తిని వొళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళిద్దరిని చూసాం. కాసేపు స్లెడ్స్ పక్కన పెట్టేసి స్నోలో ఆడుకున్నాం పిల్లలతో. నేను అరగంటైనా ఉండగలనో లేదో అనుకున్నా కానీ గంటన్నర పైనే వున్నామక్కడ. చైతన్యకి ఇంకా ఉండాలని ఉన్నా, చలి ఎక్కువవ్వడంతో అందరూ వెళ్ళసాగారు, మేము కూడా ఇంటికి వచ్చాం. ఫోటోలు తీసుకున్నాం. అప్పటికింకా కెమెరాలతోనే ఫోటోలు తీస్తున్నారు. సెల్ ఫోన్లలో ఫోటోలు తీయడం రాలేదు. ఫోటోరీల్స్ కడిగించి అవి వచ్చేదాక ఆగాల్సి వచ్చేది చూడటానికి. కానీ శ్రీని పిల్లల ఫోటోలన్నీ త్వర త్వరగా కడిగించి తెచ్చేవాడు.
ఇంటికొచ్చాక అలసట, ఆ రాత్రికి నొప్పి ఎక్కువయ్యింది. కానీ పిల్లలతో ఒకరోజు ఆనందంగా గడపగలిగినందుకు నాకు తృప్తిగా అన్పించింది.
నేను చదివిన పుస్తకాల్లో జేన్ ఆస్టీన్ రాసిన , “ఎమ్మా” ఒకటి ఇందులో. ఇది సినిమాగా కూడా వచ్చింది. పుస్తకం చదివిన తర్వాత అదే లైబ్రరీ నుండి సినిమా వీడియో తెస్తే పిల్లలు పడుకున్న తర్వాత రోజు గంట చొప్పున చూసేవాళ్ళం.
“గర్ల్ విత్ ఎ పర్ల్ ఇయరింగ్,” ట్రేసీ చెవెలియర్ రాసిన పుస్తకం, మాయా యాంజెలో రాసిన, “ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్స్,” ( 1969) “ది హార్ట్ ఆఫ్ ఎ ఉమన్,” (1981) “గాదర్ టుగెదర్ ఇన్ మై నేమ్,” (1974) ( ఆమె రాసిన ఏడు తన జీవితచరిత్రల్లో ఇది రెండవది) “లెటర్ టు మై డాటర్, (1987) “మామ్&మీ&మామ్ (2013 లో విడుదలయినపుడు చదివాను. (ఇవి కొన్ని మాత్రమే నేను చదివిన పుస్తకాల పేర్లు. ఆ లిస్ట్ దొరికితే దాదాపు డెబ్బై పుస్తకాల పేర్లు దొరుకుతాయి. శ్రీనివాస్ పాత కంప్యూటర్లో వెతికితే తెలుస్తుందేమో. కొన్ని సార్లు ప్రయత్నం చేసాం కానీ ఏమీ దొరకలేదు.)
పాప పడుకున్నపుడు నేను పడుకునేదాన్ని. కానీ పుస్తకాలు చదువుతున్నప్పటి నుండి ఎప్పుడు టైం దొరికినా బుక్ పట్టుకునే ఉండేదాన్ని. చైతన్య శుక్రవారం సాయంత్రం ఫ్యామిలీ సినిమా సమయం అని నిర్ణయించాడు. నేను సరేనన్నాను. కానీ వాళ్ళు అన్నీ రెడీ చేస్తున్నపుడు కూడా నేను చదువుతున్నాను ఒక రోజు. చైతన్యకి కోపం వచ్చింది.
“అమ్మా!ఎప్పుడూ నీకు పుస్తకాలు చదవడమే కావాలా? నీకేం ఫన్ అక్కర్లేదా?” అన్నాడు.
“నువ్వు ఎండాకాలంలో ఎప్పుడూ పుస్తకాలు చదువుతుంటే నేను వద్దన్నానా? మీతో మాట్లాడుతున్నపుడు, ఆడుతున్నపుడు నేను చదవటం లేదు కదా కన్నా!” అన్నాను.
“కాదు నువ్వెప్పుడు చూసినా బుక్స్ చదువుతూనే వుంటావు?”
నాకే ఆశ్చర్యం వేసింది వాడి మాటలకి. అవును పుస్తకాలు చదవడం నాకిష్టం కానీ పిల్లల్ని పట్టించుకోకుండా మరీ చదువుతున్నానా? ఇదేం పిచ్చి? సర్జరీ నుండి దృష్టి మరల్చుకోవడానికి మొదలు పెట్టిన వ్యాపకం ఇది. నేను శ్రీనిని అడిగాను, “నిజంగానా నేను ఎప్పుడూ చదువుతున్నానా? నీక్కూడా కూరలు కోసివ్వడం, పాప పనులు మానేస్తున్నానా? అవునా?”
“రోజూ కాదు, ఎపుడో ఒకసారి చదవడంలో లీనమై వుంటే మేము నీకు అంతరాయం కలిగించం. అయినా పుస్తకాలు చదవడం తప్పేలా అవుతుంది? ఏం పర్వాలేదు. ఇపుడు పిల్లలతో సినిమా చూద్దాం రా.” అన్నాడు శ్రీని.
ఈయనకి నేనేం చేసినా తప్పు అనిపించదు.
“సారీ చైతన్య నేను అట్లా చేయడం తప్పే. ఇక నుండి అట్లా చేయను. చాలా రోజులయ్యింది ఇట్లా బుక్స్ చదివి… అందుకేనేమో…”
” ఇట్స్ ఓకే అమ్మా! ఇపుడు సినిమా చూద్దామా?” అన్నాడు చైతన్య.
నేను చదువుతున్న పుస్తకం పక్కకు పడేసి స్ఫూర్తిని వొళ్ళో కూర్చోపెట్టుకుని సినిమా చూడడం మొదలు పెట్టాను.
జనవరి 5, 2001 స్ఫూర్తి పాప మొదటి పుట్టినరోజు. చూస్తూ చూస్తూనే ఏడాది గడిచిపోయింది. పాప ఏ సమస్యలు లేకుండా ఆడుతూ, పాడుతూ పెరుగుతుంది.
బరువు పెరగడానికి ఎదురు చూసేపుడు ఎక్కువ హాస్పిటల్స్ కి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయడంతో పాపతో సమయం గడపడానికి వచ్చింది. నేను ట్యూభ్ పీడింగ్స్ సెలైన్ పెట్టుకునే పోల్ కి తగిలించుకుని పెట్టుకునేదాన్ని. బయటకు వెళ్ళేపుడు బ్యాక్ ప్యాక్ లా ఉండే బ్యాగ్ లో పెట్టుకునేదాన్ని. పోల్ కి పెట్టుకున్నపుడు స్ఫూర్తికి పాలు పట్టేపుడు, తినిపించేపుడు దాన్ని చూస్తూ ఉండేది. బ్యాగ్ అయిపోయేపుడు పోల్ కి తగిలించిన న్యూట్రిషన్ బ్యాగ్ ని అలా చూస్తూ ఉండేది. తనెందుకలా చూస్తుందని చూసేప్పటికి మేము వేరే బ్యాగ్ రెడీ చేసుకోవాలని తెలిసేది. పాపం నేను ఇలా ఉండడం వల్ల అమ్మలందరూ ఇలానే ఉంటారనుకుంటుందేమో. ఇంకా బయటి ప్రపంచమంతగా తెలియదు కదా! ప్రీ స్కూల్ కి కానీ స్కూల్ కి వెళ్ళేపుడు కానీ మెల్లి మెల్లిగా బయటి ప్రపంచం గురించి తెలియడం మొదలు పెడ్తుంది.
కొన్ని నేను చూడలేకపోయానేమో కాని అది బోర్లా పడ్డపుడు నేనింట్లోనే ఉండడం, బోర్లా పడేపుడు వరసగా ఫోటోలు తీయగలిగాను. పాప గట్టిగా కిల కిలా నవ్వినప్పుడు కూడా నేనున్నాను. శ్రీని దాన్ని ఎత్తుకుని వున్నాడు చైతన్య నవ్వించడానికే క్రింద కుర్చొని, గబ్బుక్కున పైకి లేచినపుడు గట్టిగా నవ్వడం మొదలు పెట్టింది. అది కూడా చూసి ఆనందించడమే కాదు, ఆ ఆనందాన్ని ఫోటోలో బంధించాను. ఎక్కువ రోజులు పాకలేదు, లేచి నిలబడటం ఆ తర్వాత దీపావళి రోజున చైతన్య, జోన్ పిల్లలు వస్తే వాళ్ళతో టపాసులు కాలుస్తున్నారు బాల్కనీలో. నేను లోపల కూర్చోని చూస్తున్నాను. స్ఫూర్తి నిలబడుతూ, క్రింద పడుతూ బయటికి చూస్తంది. సోఫా పట్టుకుని నిల్చుని వుంది, నేను తననే చూస్తున్నాను ఎంతో ముద్దోస్తుందని. సోఫా పట్టుకుని అడుగులు వేయడం మొదలు పెట్టింది. నేనందరినీ లోపలికి పిల్చి చూపిచాను. తన కొత్త విన్యాసాన్ని చూపించింది పాప. అందరు చప్పట్లు కొడితే తనెంతో గొప్పపని చేసినట్టు గట్టిగా నవ్వింది. ఇప్పటికీ ఇద్దరు పిల్లలు నెలల పిల్లలపుడు మొదటిసారి చేసే విన్యాసలు గుర్తొచ్చినపుడల్లా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంటాను. పిల్లలను కనడం ఒక పనిలా అనుకోలేదు… నేను పిల్లల్ని కంటే మాత్రం వాళ్ళ ముద్దు మురిపాలను చూసి ఆనందించాలనుకునేదాన్ని. నాకావకాశం వచ్చింది…. చైతన్య పెరగడం నా చేతుల్లోనే జరిగింది. కానీ స్ఫూర్తి అపుడే ఏడాది లోపల ఎదుగుదల కొంత చూడలేకపోయాను, ఎంతవరకు చూడగలిగానో ఆ సందర్భాలన్నీ మనసులో పదిలంగా దాచుకున్నాను.
(కొంతమంది అమ్మాయిలు ఈ మధ్య పిల్లల గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఒకమ్మాయికి ఉద్యోగం పోయింది, తల్లేమో నాకు వయసు పెరుగుతుంది నాకు ఓపిక ఉన్నపుడే రెండో పిల్లో, పిల్లాడో కనేసేయండి అన్నదట. ఇపుడు ఖాళీగానే ఉన్నా కాబట్టి కనేస్తే ఒక పనయిపోతుందని చెపితే అందరూ నవ్వారు.)
కొంత మంది దగ్గరి స్నేహితులను పిలిచి మొదటి పుట్టినరోజు జరుపుకున్నాం. జోన్ ఆడపిల్లలిద్దరూ వచ్చి స్ఫూర్తితో ఆడుకున్నారు. చైతన్య చాలా ప్రేమగా చూసుకునేవాడు చెల్లిని. ఇప్పటికీ చెల్లెలంటే ఎంతిష్టమో వాడికి.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
