దివాణం సేరీ వేట

-వసుధారాణి రూపెనగుంట్ల

 కథా సంకలనం :  దివాణం సేరీ వేట

 రచయిత:  శ్రీ పూసపాటి కృష్ణంరాజు (1928-1994)

రాశితో పనిలేని వాసి కథలు, వాడి కథలు ,1960 లో అచ్చయిన తొలి కథ “ దివాణం సేరీవేట” నుంచి మొదలై 15,16 కథలకు మించని ఈ కథలు ఇప్పటికీ వేడి వేడి కథలు.కథలో వాక్యనిర్మాణం సామాన్యం ,అతిసాధారణం అయినా ఓ గగురుపాటుకు ,ఓ విభ్రమానికి,ఓ విస్మయానికి గురిచేసే కథలు.

ఓ కులానికో,ఓ సామాజిక వర్గానికో చెందిన కథలు చెపుతున్నప్పుడు ఆ వర్గానికి చెందిన వారు నిష్పక్షపాతంగా ఆ కథలను చెపితే ఆ అనుభవాలు ఇంకా పదునుగా, చారిత్రాత్మకంగా ఉంటాయి.ఇటు వంటి చరిత్రని తెలుగుకథల్లో మొదటగా సృష్టించిన వారు పూసపాటి కృష్ణంరాజు గారు . తెలుగు కథల్లో తనదైన బాణీ ఏర్పరిచారు. తక్కువ కథల తోనే ఓ ట్రెండ్ సెటర్ గా నిలిచారు. ఆ బాణీని ముందుకు తీసుకువెళ్లినవారు కె.ఎన్. వై పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజుగారు,  ఇటీవల శ్రీ చిరంజీవి వర్మ గారు.

నా గురువుల్లో ఒకరు అంటూ కె ఎన్ వై  పతంజలి ముందుమాటతో మొదలై నేనెందుకు రాసాను? 

అంటూ పూసపాటి కృష్ణంరాజుగారి సొంతమాటతో  కొనసాగిన పుస్తకం.

ఈ పుస్తకం కథానిలయం వారినుంచి pdf తీసుకుని జిరాక్స్ చేసుకున్న పుస్తకం. బయట లభ్యం అవుతున్నట్లు లేదు.

“అడివి పందిని పొడుచుకొచ్చారు” అన్న వాక్యంతో మొదలైన “ దివాణం సేరీవేట” కథ కృష్ణంరాజుగారి మొదటి కథ. అలా అనిపించనే లేదు.చిన్నరాజులు, వీళ్ళని వేట దిశగా నడపాలని చూసిన ఎనభై ఏళ్ళు దాటిన రాంబధ్రరాజు.కుక్కలను పెంచటం దగ్గరనుంచి పెద్దరాజుగారు ఇచ్చే తర్ఫీదు.దివాణం వర్ణన ఇవన్నీ కలిసి పాఠకులను గరువు దగ్గర చిక్కుకున్న జిగినీ కూన దగ్గరికి తీసుకెళతాయి. ఈ కథ ఈ సంపుటానికి ,కృష్ణంరాజు గారికి తొలికథ.మాండలీకం, కొన్ని పదాలు అర్ధం కావటానికి కొంత ఎక్కువ సమయం పట్టింది చదవటానికి తరువాత కథలన్నీ అలవోకగా చదివేయగలం.

“తెల్లారాజు-నల్లదొర” కథ చదివినాక కొంతసేపు అచేతనం అయిపోయాను. చిన మహారాజు,పెద్ద మహారాజు కలిసి కాఫీ హోటల్లో కాఫీ తాగే దగ్గర మొదలైన కథ కంట్రమెంటు నల్లదొర  దాకా వెళ్ళి, రాజా వారు  సంస్కృత పాఠాలు ఎగరగొట్టి నల్లదొరతో చేరి చేపలు పట్టటం దగ్గరికి వెళుతుంది.వారి ఇద్దరి మధ్యా భాషతో సంబంధంలేని స్నేహం కుదురుతుంది.

రాజా వారి తాత గారికి ఇది నచ్చదు .ఓ రోజు చెరువు దగ్గర నల్లదొర ,రాజా వారు చేపలు పడుతుండగా తాత రాజుగారు కోపంగా వస్తారు .అది చూసి భయపడిన రాజా వారు పరుగుపెడుతూ గట్టుమీద నుంచి కాలు జారి దిగుడు బావిలో పడిపోతారు.ఈత రాజా వారికి,తాత రాజా వారికీ ఇద్దరికీ రాదు.నల్లదొర ఒక్క ఉదుటున నీటిలో దూకి రాజా వారిని రక్షిస్తాడు.తను కోపగించుకునే వ్యక్తే రాజా వారి  ప్రాణాన్ని కాపాడటం తాత రాజా వారిలో మార్పు .అయితే రాజుల హోదా తగ్గకుండా నల్లదొర అడిగింది ఇచ్చి అతన్ని అక్కడ నుంచి పంపించి వేయటం.మానవత్వం,సమాజంలో  దర్పం నిలబెట్టుకోవాలనుకునే గుణం. అలా కాఫీ హోటల్లో మొదలైన కథ ఓ ఉదాత్త ఘటనతో ముగుస్తుంది.కల్లలు లేని స్నేహానికి ఎల్లలు ఏర్పరిచే హోదా చాలా చిన్నదిగా అనిపిస్తుంది.

“మహారాజ యోగం “ నాకు నచ్చిన మరో కథ ఈ సంపుటంలో. నాగులు అనే ఓ కుర్రవాడి నాలుగే నాలుగు రోజుల జీవితం ఈ కథ. కుమార్రాజుతో పాటు వెంకటపతి,కొండారెడ్డి, విశ్వనాధ శాస్త్రి,వెంకటప్పయ్య, మల్లికార్జున రావు వీరంతా ఒక్కో గదిలో ఇద్దద్దరుగా ఓ డాబా లాడ్జ్ లో  ఉండే మిత్రులు.డాబా పక్కగా తోటలో వుండే షెడ్ మెస్ .

పైలాపచ్చీసుగా వీరి జీవితాల్లోకి అరుగు మీద వంటిమీద నిక్కరూ షర్ట్ తప్పితే వేరే లగేజ్ లేని పన్నెండు ఏళ్ళ కుర్రాడు నాగులు ప్రవేశిస్తాడు.కుమార్రాజా నాగులు మీద జాలి పడి మెస్ బాయ్ గా వుండమంటాడు. రెండు రోజుల్లో నాగులు అన్ని పనులు చక్కగా చేసి అందరికీ తలలో నాలికగా మారతాడు.ఓ అర్ధరాత్రి మంచినీళ్లు కోసం మెస్ వైపుకు వెళ్లిన కుమార్రాజా అరుగు మీద పడుకున్న నాగులు తలపై పడిగ విప్పిన నాగుపామును చూస్తాడు.నాగులుకు రాజయోగం అని అందరూ అనుకుంటారు.ఏ కోటీశ్వరుడో  వీడిని పెంచుకుంటాడు,హఠాత్తుగా ధనయోగం అని శాస్త్రి,వెంకటపతి ఇలా అందరూ తలా ఒకరకంగా నాగులు రాజయోగాన్ని ఊహిస్తారు.

ఒకరోజు హఠాత్తుగా నాగులు కపడకుండా పోతాడు .మెస్ లో మాయమవుతున్న గుడ్లు నాగులు అమ్ముకుంటున్నాడని అనుమానించినందుకు అని అందరూ అనుకుంటారు.

నాగుపాము గుడ్లను తింటోందని చూసి పామును పొడిచి చంపేస్తారు.పోలీస్ స్టేషన్ నుంచి కుమార్రాజుకు పిలుపు వస్తుంది.రోడ్డు దాటుతూ నాగులు ప్రమాదవశాత్తు  చనిపోతాడు ,నాగులు దగ్గర ఉన్న చిన్న పుస్తకంలో కుమార్రాజా వివరాలు ఉండటంతో పోలీసులు అతన్ని పిలుస్తారు.ఆ చిన్న పుస్తకం తీసుకుని చూసిన కుమార్రాజాకు అందులో పాలు,కూరలు,గుడ్లు అన్ని మెస్ లెక్కలతో పాటు ఓ పక్కాగా నాగులు రాసుకున్న “రాజయోగం” అన్న నాలుగు అక్షరాలు కనిపిస్తాయి.

ఈ కథలో పడగపట్టిన పాము,నాగులు ఇద్దరూ మరణిస్తారు.విషం ఎక్కడ ఉందో చెప్పే కథ. నమ్మకాలు,రాజయోగాలు పక్కనుంచి జీవితపు అసలు రంగు బయట పెట్టిన కథ .

ఈ సంపుటి మొత్తానికీ తలమానికం “ సీతాలు జడుపడ్డది” కథ.ఈ కథ గురించి రాసేముందు ఈ కథలోని నాలుగు వాక్యాలు యధాతధంగా ఇక్కడ అందించాలి అని అనుకుంటున్నాను.పూసపాటి కృష్ణంరాజు గారి శైలి సొగసు , కథ అల్లిక , పాత్రలను కళ్ళముందు ఉంచే తీరులోని విలక్షణత అంతా ఈ కథలో చాలా బాగా పాఠకులకు అర్ధం అవుతుంది.మహారాజయోగం కథ పిచ్చినమ్మకాలను చూపితే,ఈ కథలో ప్రతి పాత్రా అర్థంలేని భయం వల్ల,అమాయకత్వం వల్ల పొందే నష్టాన్ని తెలిపే కథ. అరే మనుషులు ఇంత చిన్న విషయాలను ఎంత పెద్దవిగా చేసుకుని తమ చిన్ని గుండెలను భయంతో ఆపేసుకుంటారా ? 

అనిపించే కథ.కృష్ణంరాజు గారి వాక్యాలతో ఇలా మొదలవుతుంది చూడండి.

“ గరువు మీద పాకలో దాచుకున్న తాటిబురికెలను అంబటి తట్టలో  పేర్చుకుని “పొయ్యేళ” అయిపోయిందని సీతాలు ఊరు ముఖం పట్టింది.

 పొలంగట్లు దాటి చెరువుగట్టు చేరుకుంది.గట్టుమీద హాయిగా పెరిగిన తాటి చెట్ల మధ్య నడుస్తోంది.కట్టుకున్న ఎర్రగోక గాలికి రెపరెపా కొట్టుకుంటోంది.పొద్దుగూకి పోయింది.అసురసంధ్య.దూరంగా గ్రామాల్లో ఇళ్ళమీద పొగసుళ్ళు తిరుగుతో కనిపిస్తోంది.

చెరువుగట్టు దిగితే వల్లకాడు.వల్లకాట్లో చెట్లు దెయ్యాల్లా విరబోసుకుని కనిపిస్తున్నాయి. కాటి మధ్యనుండే ఊరికి దారి!

ఆ స్మశానంలో యీ మధ్య అఘోరీ తిరుగుతున్నాడన్న మాట సీతాలికి గుర్తొచ్చింది.శవాలను తినేవాణ్ణి తలుచుకుని వణకిపోయింది.”

గరువు,తాటిబురికెలు,అంబటి తట్ట,హాయిగా పెరిగిన తాటిచెట్లు, ఎర్రగోక ,పొయ్యేళ,ఇళ్ల మీద పొగసుళ్ళు తిరగటం కేవలం కొన్ని వాక్యాలలో వచ్చిన    పదాలు ఇవి. ఇంత హాయైన పదాలు ఓ భయానక కథను సృష్టించాయంటే రచయిత భాషపై పట్టు ఎంత బాగా సాధించారని అర్ధం అవుతుంది.ఈ కధ ఓ కథలా కాక పాత్రలు సజీవమై సీతాలు వేళ్ళ మట్టెలు కంకర రాళ్ళమీద చిటుకు చిటుకూ మన్న శబ్దం మనం వింటాం.తాటికమ్మలు గాలికి టపటపా కొట్టుకోవటాన్ని చూస్తాం.

ఇలా స్మశానం మధ్యనుంచి అఘోరీ ఊహతో నడుస్తున్న సీతాలు “ సీతా ఇటు సూడవు ?”

ఎవరో అన్నట్లు అనిపించి భయపడి పరుగుపెట్టి కసివింద మొక్కలు కాళ్లకు చుట్టుకుని కొట్టిన చెట్టులా కూలిపోతుంది. ఇది సీతాలు పడిన భయం.

పశువుల సంతనుండి అటుగా వెళుతున్న బేరగాళ్ళు ఎర్రకోకని దూరం నుంచి చూసి దయ్యమనుకుని భయపడి దోవ కనుక తప్పక దగ్గరగా వచ్చి సీతాలును గుర్తించి ఊర్లోకి తీసుకొస్తారు.స్మశానంలో సీతాలు జడుపడ్డదని ఏ దయ్యం చేస్టోనని ఊరు ఊరంతా భయపడతారు. 

పూజారి వెంకయ్య కర్రి కోడిపిల్లని అలంకరించి పూజ చేసి దాని మెడని సీతాలు ఎదురుగా ఒక్క కొరుకు కొరుకుతాడు .అతని వంటి మీద చిందిన రక్తం చూసి సీతాలు ఉలిక్కి పడుతుంది.రాత్రంతా పలవరించి పలవరించి సీతాలు చనిపోతుంది.

అయితే కథ ఇక్కడితో అయిపోదు.గణాచారికి అమ్మవారు పట్టి ఊగి సీతాలు చనిపోలేదని ,సీతాలును తగలబెట్టకూడని,భూస్థాపితం చెయ్యాలని ,సీతాలు భూమిలో కూర్చుని తిరిగొస్తుందని,సీతమ్మ వారి పుట్టిల్లు భూదేవి కడుపనీ అమ్మవారు చెపుతుంది.

కోనేటి నుంచి కడవల్తో నీళ్లు తెచ్చిపోసి, సీతాలుకు కొత్త కోక కట్టి ,పునిస్త్రీ సీతాలును వల్లకాట్లో భూస్థాపితం చేస్తారు.

సీతాలు భర్త సిరిపురం బావ,పెద్దయ్య ఇద్దరూ వేటకత్తులు భుజం మీద వేసుకుని అఘోరీ సీతాలు శవం తినకుండా ఉండేందుకు కాపలాగా వల్లకాటి మఱ్ఱి చెట్టుకింద కూర్చుంటారు.చిమ్మచీకటి ఇద్దరి దృష్టి సీతాల్ని పాతిపెట్టిన గోతిపై పెట్టి కూర్చుంటారు.నిద్దట్లో ఉన్న పెద్దయ్య మీద గుడ్లగూబ వాలింది .అతని దృష్టి సమాధి మీదకు పోతుంది .సమాధి దగ్గర అఘోరీ సీతాల్ని ఎత్తుకు పోయి పీక్కు తిందామనుకుంటున్నాడని పరుగున పోయి వేటకత్తితో ఎదుటి మనిషి భుజాల మధ్య నరికాడు.

పెద్దయ్య సీతాలూ ! అని కేక పెట్టాడు గోతిలో సీతాలు శవం కట్టెలా కూర్చునివుంది.సిరిపురం బావ గుర్తొచ్చి చెట్టు దగ్గరికి పరుగెత్తితే బావ ఉండడు దుప్పటి మాత్రమే ఉంది.పెద్దయ్యకి అంతా అర్ధం అయ్యింది.సీతాలు మీద భ్రాంతితో బావ ఆమె బ్రతికిందో లేదోనని తవ్వి చూసాడు.తను అఘోరీ అని భ్రమ పడి ఇలా చేసాడు.తెగిన మొండానికి బావ తలని అతికించ లేడు కదా .పెద్దయ్య మతి పోయింది.తెల్లారింది ఊరు ఊరంతా వల్లకాట్లో ,అప్పటికీ ఇప్పటికీ మతి లేని పెద్దయ్య ఎక్కడికో వెళ్ళిపోతాడు.

ఈ కథ ఇప్పటిది కాదు అయినా ఇప్పటికీ ఏదో చెపుతోంది, మనల్ని ఏమో నేర్చుకోమంటోంది అనిపించింది ఈ కథ చదివాక. భయాలు ఎన్ని రూపాలు, ఏ భయం ఏ సందర్భంలో కలిగినా అది సృష్టించే నాశనం యొక్క తీవ్రత తలుచుకుని భయం వేసింది.

“రెండు బంట్లు పోయాయి “ రాజుల పెళ్ళి విశేషాలను చెప్పే కథ. దిగులు,పేరంటాలు గుండం,కుక్కుట చోరులు కథలు కూడా మరువలేనివి.ఈ సంకలనాన చివరి కథ “దారి తప్పినా మాట తప్పినా”వెళుతూ వెళుతూ  హృదయాన్ని ఒక్క ఊపు ఊపి వెళ్ళే కథ.

పూసపాటి కృష్ణంరాజుగారి కథలు ఒకసారి చదివినవారైతే మళ్లీ చదివి మరొక్కసారి మననం చేసుకోవచ్చు. ఇప్పటి దాకా చదవని వారైతే మాత్రం తప్పకుండా చదవాల్సిన కథలు. చదివిన తరువాత మాత్రం అంత తేలికగా వదలని కథలు . నాకు నచ్చిన కథలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.