జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-1

-వెనిగళ్ళ కోమల

ఈ రచన ఎందుకు ?

అమ్మ, నాన్న అల్లారు ముద్దుగా పెంచారు నన్ను. అన్నయ్య, ముగ్గురు అక్కలు మమతానురాగాలు పంచారు. కొందరు బంధువులు బాగా దగ్గరయ్యారు. ఎంతోమంది స్నేహితులను పొందగలిగాను. మంచి వ్యక్తులతో పరిచయాలయ్యాయి.  నా జీవితానికి పరిపూర్ణతనిచ్చారు నా భర్త నరిసెట్టి ఇన్నయ్య, నా బిడ్డలు నవీన, రాజు. నా యీ సుదీర్ఘ జీవితం ఎన్నో అనుభవాలకూ, జ్ఞాపకాలకూ ఆలవాలమయింది. నా జ్ఞాపకాలను  అక్షరబద్ధం చేయమని ఇన్నయ్య ప్రోత్సహించాడు. జి.వి.కె. మామయ్య (గోగినేని వెంకట కృష్ణారావు) పదే పదే చెపుతూ పోయారు రాయమని. వారిద్దరికీ  కృతజ్ఞతలు. 

నా యీ జ్ఞాపకాలు కాలక్రమానుసారంగా రాయలేదు. ఎప్పుడే విషయం మది నిండితే అదే వరుసలో రాయగలిగాను. సాధ్యమైనంత వరకూ జ్ఞాపకాలను గుదిగుచ్చాలనేదే నా ఉద్దేశ్యం. కొన్ని ముఖ్యమైన విషయాలు మరుగునపడి వుండవచ్చు. అంత ప్రాముఖ్యత లేని సంగతులు ఇందులో చోటు చేసుకునీ ఉండవచ్చు. ఈ రచన కేవలం నా సంతృప్తి కొరకు కొనసాగించినదే. 

***అమ్మ,   నాన్న

నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి!

అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి జరిపించారట. ఆమెకు పాతికేళ్ళు రాకుండానే మేమందరం పుట్టాము. 

అమ్మ మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచింది. ఆమె చిన్న విగ్రహం, బంగారు ఛాయ (ఆమె తండ్రి శేషగిరిగారి రంగట అది) చక్కని నవ్వు. మనిషి, మాట అంతా పొందికే. ఆమెలో కోపం నేనెప్పుడూ చూడలేదు. అక్కయ్యలు, అన్నయ్య నెమ్మదస్తులు. అమ్మ పొందిక హరికి అబ్బింది. నేను గడుగ్గాయలా అల్లరి చేసినా ఎప్పుడూ కోప్పడిగాని, ఒక దెబ్బవేసిగాని ఎరుగదు అమ్మ. అంత ఓపిగ్గా ఎలా నెట్టుకొచ్చిందో తన సంసారాన్ని, పిల్లల్ని!

ప్రతి శుక్రవారం మానలుగురికి నలుగుపెట్టి కుంకుడుకాయ రసంతో తల స్నానాలు చేయించేది. సాంబ్రాణి, పాలమడ్డి పొగలు జుట్టుకు పట్టించేది. అందరిదీ పెద్దజుట్టే. నేను నలుగుకి వంగక ఆవరణ అంతా పరుగులెత్తేదాన్ని. పనిపిల్లతో నన్ను పట్టించి నా ఏడుపు మధ్యలో నా తలంటు ముగించేది అమ్మ – ఇక అయిపోయింది, అయిపోయింది అంటూ. ప్రతి శుక్రవారం అదొక ప్రహసనం మా యింట్లో.

నాన్నతో మాకు చనువు వుండేది కాదు. చనువంతా అమ్మతోనే. నాన్న గంభీరంగా ఉండేవాడు. మంచి పొడవు, చక్కని రూపం. ఎప్పుడూ పరిశుభ్రంగా కనిపించేవాడు. రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడు. ఖద్దరే కట్టేవాడు – తుండుగుడ్డలు, జేబుగుడ్డలతో సహా అంతా ఖద్దరే వాడేవాడు. చాకలి ఆయన బట్టలు ప్రత్యేకంగా ఉతికి, ఇస్త్రీ చేసేవాడు. 

నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా, శ్రద్ధగా పెంచాడు. అడగకుండానే అన్ని అవసరాలు తీర్చేవాడు. మా ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవాడు. మామిడి పళ్ళు, సపోటాలు, అరటిపళ్ళు (గెలలే వేలాడుతుండేవి గదిలో) కలకత్తా జామ, ద్రాక్ష (బెంగుళూరు నుండి ఎర్రకుండలలో వచ్చేవి) పైన్ యాపుల్ తెప్పించేవాడు.

అమ్మ రకరకాల పిండి వంటలు చేసి డబ్బాలలో నింపేది. నేను తిండి ప్రియురాలను. పొట్లాలలో కట్టుకుని స్నేహితులతో పంచుకుని తింటూ ఆడేదాన్ని. ఆటల మధ్యలో వచ్చి అమ్మతో – ఫలానా ఫలానా తిన్నాను, అవిగాక వేరే ఏమన్నా పెట్టు అనేదాన్ని. అమ్మ నవ్వుతూ – అమ్మాయ్, ఇక నేనే మిగిలాను, నన్ను తిను అనేది. ఏ చెరుకు గడో, తేగలో, జామకాయో, వేరు శనగకాయలో (సంచులతో ఉండేవి). దొరకబుచ్చుకొని ఆటలకు పరుగులెత్తేదాన్ని. ఆటలన్నీ మా యింటి ఆవరణలోనో, చావడిలోనో. మా మరోయింటి లోనో సాగేవి. 

నాన్నశాకాహారి, అమ్మ పుట్టింటి వాళ్ళు మాంసప్రియులు. మా యింట్లో ఎప్పుడోగాని మాంసాలు వండేవారు కాదు. మామయ్యల ఇండ్ల నుండి పంపేవారు. 

మా బట్టల విషయం కూడా నాన్న చూసుకునేవాడు. తెనాలి వెళ్ళి, బట్టలు ఎంచి మనిషినిచ్చి యింటికి మూట పంపేవాడు. మాకు నచ్చినవి చెప్పమని. అవి చింపించి టైలర్ కు కబురు పెట్టి యింటివద్దనే కుట్టించేవాడు. అవసరానికి మించి కుట్టించేవాడు. ఇన్ని అవసరం లేదని నేనంటే హాస్టల్లో (చదువురీత్యా ఉండేదాన్ని) చాకలి రాలేదని, ఇస్త్రీ బట్టలు లేవని, బట్టలు ఆరలేదనీ, క్లాసులు మానకూడదు. ఎక్కువ బట్టలుంటే అలాంటి పరిస్థితి ఎదురవ్వదు అనేవాడు. అమ్మకు కూడా ఖరీదైన చీరలు తెచ్చేవాడు. 

నాన్నకు శాస్త్రీయ సంగీతం, వాద్య సంగీతం ఇష్టం. చిన్నప్పుడు మృదంగం నేర్చుకున్నాడట. రేడియో కొన్నాక మేము గూడా వార్తలతోపాటు, ఆ సంగీతాలే వినేవాళ్ళం.

నాన్నగానీ, అమ్మగానీ యిలా నడుచుకోవాలి అని ఎప్పుడూ చెప్పలేదు. కాని చక్కని క్రమశిక్షణ మా అందరికీ అలవడింది. అది ఆ యింటి పద్ధతి.

నాన్న కాలేజి చదువులు చదవలేదు. ఇంగ్లీషు స్వయం కృషితో నేర్చుకున్నారు. తేలిక పాటి ఇంగ్లీషు సంభాషణ అలవరచుకున్నారు. ఇంగ్లీషు పేపరు, తెలుగు పేపరు తెప్పించేవారు. మా అందరికీ వార్తాపత్రికలు చదవటం అలవడింది నాన్నవల్లనే. భారతి, తెలుగు స్వతంత్ర తెప్పించేవారు. ఎంతో శ్రద్ధతో చదివేవాళ్ళం. 

నాన్న మా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. ఎవరికైనా ఏ కొంచెం నలత చేసినా వెంటనే డాక్టరుగారు (ఎర్రడాక్టరుగారనేవాళ్ళం ఆయన్ని. మంచి రంగు పొట్టిగా ధృఢంగా, తెల్లటి బట్టలు ధరించి మెరుస్తూ ఉండేవారు.) రావలసిందే యింటికి. ఆయుర్వేద వైద్యం నడిచేది. మందు మింగననీ, జ్వరంలో గూడా అన్నం తింటాననీ అమ్మను బాగా వేధించేదాన్ని. చెప్పాను గదండీ ఆకాశమంత ఓర్పుల తల్లి మా అమ్మఅని. అన్నీ సహించేది.

మాకు అవసరానికి ముందే అన్నీ అమిరేవి. అందువలన లోటు అనే పదం ఆ యింటి నిఘంటువులో లేదు. 

నాకు బాగా గుర్తు – స్టూలు మీద కూచోబెట్టి చెవులు శుభ్రం చేసేవాడు. గోళ్ళు కత్తిరించి గ్లిజరిన్ ముంచిన దూదితోముఖం తుడిచే వాడు. ముఖం మీద పొక్కుగాని, మొటిమ గానీ రాకుండా ఉండాలని తగు శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన సేవలవల్లనే కాబోలు – మా నలుగురికీ మొటిమల బాధ ఎదురు కాలేదు ఎప్పుడూ.

అక్కలు అంటే ఏ పని చేసినా పద్ధతిగా, నీటుగా, నిలకడగా చేసేవారు. ముగ్గులు పెట్టటం, అల్లికలల్లడం, చక్కగా జడలు వేయడం. పెద్దక్కలిద్దరూ సంగీతం నేర్చుకున్నారు. ఏది చేసినా వారి పనిలో ప్రత్యేకత ఉండేది. నేను గజిబిజిగా, అల్లరిగా, హడావిడిగా చేసి పనులు చెడగొట్టేదాన్ని. చదువులో శ్రద్ధచూపేదాన్నేమో, మిగతావిషయాలలో నన్నెవరూ పట్టించుకునేవారు కాదు.

నేను మా యింట్లో బ్లాక్ షీప్ (black sheep) ని రంగులో, రూపంలో, అన్నివిషయాలలో. అందువల్లనేనేమో అక్కలు, అన్నయ్య నన్నెంతో ముద్దు చేసేవారు. అన్నయ్య నా చదువు విషయంలో, తిండి, ఆటల విషయంలో శ్రద్ధ చూపేవాడు. 

నా బొమ్మల పెళ్ళిళ్ళకి పందిళ్ళు వేసేవారు. బూరలు ఊది మేళాలు అనేవాడు. అమ్మతో పులిహోర, పాయసం చేయించి నా స్నేహితులు (పెళ్ళి పెద్దలు గదా!) తినే ఏర్పాటు చేసేవాడు. నా పుస్తకాలకు అట్టలు వేసి, చక్కగా పేరు, క్లాసు రాసి బడికి పంపేవాడు. 

అమ్మా, నాన్నా పని వారినీ, పొలం చేసే వారినీ పూర్తి పేరులతో పిలిచేవాళ్ళు. అరే, ఒరే అనటం సంస్కారం కాదని మేము వారి వద్దనే నేర్చుకున్నాం. వాళ్ళకు మంచి భోజనం పెట్టేవాళ్ళు. మనం వాళ్ళపట్ల శ్రద్ధ చూపితే మన పని పట్ల వాళ్ళూ శ్రద్ధ చూపుతారనే వాళ్ళు అమ్మా, నాన్న.

నేను ఆదివారం, అమావాస్య (మే 8, 1935) నాడు పుట్టానట. నాన్నకు మామల వరసైన వాళ్ళు – వెంకట సుబ్బయ్యకి దొంగ పుట్టింది అని హాస్యమాడారట. దానికి జవాబుగా నాన్న – దొంగ పుట్టటం మా యింటా ఒంటా లేదు, మా యింటి వెనుక రామస్వామి (పెదనాన్న అనేవాళ్ళం) యింట కూడా లేదన్నాడట. నాన్నకు అంత నమ్మకం తన బిడ్డల మీద. ఆయన నమ్మకం మేము వమ్ము చేయలేదు. ఆయనకు గర్వకారణంగానే ఎదిగాము. ఆయన సభ్యతనూ, సంస్కారాన్నీ అందిపుచ్చుకున్నాం. పెద్దవాళ్ళంటే గౌరవం, అతిథి సత్కారంలో ఆనందం, స్నేహశీలత, ఆప్యాయత అన్నీ అమ్మా, నాన్నల నుండి అబ్బినవే మా ఐదుగురికీ. 

నాన్న నన్ను హాస్టల్లో పెట్టి చదివిస్తుంటే, ఊరిలో పెద్దవారు ఆయనకు సలహాలిచ్చేవారు – నలుగురాడపిల్లల తండ్రివి, వారి పెళ్ళిళ్లూ, పేరంటాలూ, పురుళ్ళూ బోలెడు ఖర్చులుంటాయి నీకు, చిన్నపిల్లని ఇంత చదివిస్తున్నావు ఖర్చు పెట్టి, రేపు ఆమెకంటే పెద్ద చదువు చదివినవాణ్ణి భర్తగా తేవాలి. కట్నమివ్వక తప్పదు. పెళ్ళి ఖర్చు జాస్తి. ఎందుకు జాగ్రర్త పడవు, అని అంటే నాన్న నా పిల్ల చదువే తనకట్నం అనుకుంటాను అనేవాడు. అలాగే నా పెళ్ళిలో కట్నాల ప్రసక్తి రాలేదు.

పెద్దక్క కమలను గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ లో చదివించారు. తరచు మలేరియా వస్తుంటే అక్కని హాస్టల్ నుండి తీసుకువచ్చేశారు. నేను అమ్మ నాన్నతో కలిసి మా గుర్రంబండిలో అక్కను చూడటానికి వెళ్ళేదాన్ని. జాన్ సాయిబు బండి తోలేవాడు. గుర్రం ఆలనా, పాలనా అతనే చూచేవాడు. పెద్దక్కలిద్దరికీ చిన్నవయసులోనే పెళ్ళిళ్ళు చేశాడు నాన్న. పెద్దక్క స్నేహితురాళ్ళు బసవమ్మక్కయ్య, కృష్ణపిన్ని నాకు బాగా ఇష్టమైనవారు. అట్లాగే అన్నయ్య స్నేహితులలో గోగినేని వెంకట కృష్ణారావు మా అందరికీ ప్రీతిపాత్రుడు. అన్నయ్య కిష్టరావ్ అని పిలిచేవారు. మేము జి.వి.కె మామయ్య అంటాము. ఆయన విదేశాలలో చదువులు సాగించి ఉద్యోగాలు చేశారు. హైదరాబాద్ లో పెద్ద ఆఫీసరుగా విధులు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉద్యోగాలిప్పించారు. వారంతా మామయ్యను దేవుడుగా కొలుస్తారు. అన్నయ్య పిల్లల ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ విషయాలలో ఎంతో సహాయపడ్డారు. జి.వి.కె. మామయ్యతో ఇప్పటికీ టచ్ లో ఉన్నాను. నాన్ననూ, అన్నయ్యను ఎంతో ఆర్తితో తలుచుకుంటేగాని మామయ్య ఫోను సంభాషణ ముగించరు. అంతటి సహృదయుడూ స్నేహ పాత్రుడు ఆ మామయ్య. 

ఆయన ప్రోత్సాహంతోనే నా జ్ఞాపకాలకు శ్రీకారం చుట్టాను. మామయ్య పది కాలాపాటు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను. 

మా యింట్లో పరుష పదాలు, దూషణలు, తిట్లు ఎప్పుడూ వినలేదు.

నాన్న మూల్పూరు పంచాయతీ ప్రెసిడెంట్ గా 15 ఏళ్ళు పనిచేసారు. ఆయన ఆధ్వర్యంలోనే రోడ్లు, బస్ సౌకర్యం, పసువుల వైద్యశాల, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పడ్డాయి. ఫండ్స్ తక్కువ పడితే తన సొంత డబ్బు ఖర్చు చేసి ఊరికి సౌకర్యాలు సమకూర్చారని ఇతరులు చెప్పగా విన్నాను. 

మా యింటికి సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో ఏ లోటు చేయలేదు. ఇంటికి కరెంట్ పెట్టించటం, సెప్టిక్ టాంక్ లెట్రిన్ కట్టించటం మా ఊర్లో నాన్నే మొదలు చేయించారు. వర్షంలో బురద తొక్కుతామేమో అని వాక్ వేస్ (నడిచే మార్గం అంతా) నాప బండలు పరిపించాడు. పూలమొక్కలు, కూరగాయ మొక్కలు దండిగా పెంచేవాళ్ళు. యింటి ఆవరణలో మా నిమ్మతోటలో కూరగాయలు విరివిగా పండించేవారు. కానీ ఏ వస్తువూ అమ్మకానికి పెట్టేవారుకాదు. తెలిసినవారందరికీ పనివాళ్ళ చేత పంపకం చేసేవారు. హైబ్రిడ్ టమోటోలు గంపలు కొలది, బారెడు బీరకాయలూ సంచుల కొలదీ మూల్పూరు తోట నుండి దిగేవి. ఇంట్లో చిక్కుడు, దొండ, పొట్ల, కూర అరటి కాసేవి. మా యింటి ములగ చెట్టు కాయలు రుచికి, కండకు ప్రసిద్ధి. అన్నీ పంపకాలు జరిగేవి. అమ్మ పూవులు (మల్లె, సన్నజాజి) మాలలు కట్టించి మరీ పంచేది. అమ్మ పూజలూ, పునస్కారాలు నిష్ఠగా చేసుకునేది. భక్తిమాటెలా ఉన్నా ప్రసాదాలు తినటానికి ముందుండేదాన్ని. 

మాకు రెండు ఇళ్లు ఉండేవి. ఒకటి పెద్ద అరుగులతో ఇల్లంతా నల్లరాయి పరిపించి చాలా సౌకర్యంగా ఉండేది. కాని అది మా అందరికీ సరిపోదని ఎదురుగా ఉన్న పెద్ద యింట్లోకి మారారు. ఇంటి చుట్టూ చాలా స్థలం ఉండేది. పసువులు వాటి మేత సౌకర్యం, వ్యవసాయపుటెడ్లు, బండ్లు విడిగా ఏర్పాటు చేసి, పెద్ద గేటు పెట్టించాడు నాన్న. మా యింటిలో నేను అమ్మా, నాన్న, అక్కయ్యలు, అన్నయ్య ద్వారా పొందిన మమతానురాగాలు నన్ను ఇప్పటికీ ఆ యింటితో పెనవేసుకునేలా చేశాయి. కలల్లో ఆ యింట్లోనే తిరుగాడుతూ, ఇంటి వాళ్ళందరినీ, గొప్పవాళ్ళను కూడా ఆ యింటిలోనే కలిసినట్లు తరచు కలలొస్తుంటాయి. అంత ఆనందం, సౌఖ్యం ఆ యింటిలో పొందాను మరి!

పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో మాకు ఉయ్యాలలు కట్టేవాడు. స్నేహితులందరం ఊగేవాళ్ళం. 

మామయ్య బొడ్లో తాళాల గుత్తిలో చిన్న చాకు వేలాడుతూ ఉండేది. దానితో పెన్సిల్ కి ఎంతో నగిషీలు చెక్కేవాడు మామయ్య. రోజూ బడికి పోతూ పెన్సిల్ ముక్కు విరగదీసి మామయ్యను చెక్కమనేదాన్ని- చాలా రాసినట్లున్నావు కదమ్మా అని ఎగతాళి చేసేవాడు. పెన్సిల్ చెక్కి, రోజూ ఒక కానీ (రూపాయలో 64వ వంతు) యిచ్చేవాడు. ఆ రోజుల్లో కానీ విలువ చాలా ఎక్కువ. ఇంట్లో ఏం టిఫిన్లు చేసినా పెదమామయ్యను పిలిచి పెట్టకపోతే అమ్మా, నాన్నలకు లోటనిపించేది.

ఆవకాయ సీజన్లో, పొరుగూరు పనివాణ్ణి తీసుకుని ఒక ప్రత్యేకమైన చెట్టు మామిడి కాయలు కోయించి తెచ్చేవాడు. ముక్కలుగా కోసేవాడు కూడా. ఒకసారి చెయ్యి తెగ్గోసుకుంటే అందరం బాధపడ్డాం. 

అత్తయ్య నాగేంద్రమ్మ చక్కని వ్యక్తి. ప్రేమగా ఉండేది. అమ్మ, అత్తయ్య అప్పచెల్లెళ్ళలాగా ఉండేవారు.  చినమామయ్య వెంకట్రామయ్య దుడుకు మనిషి, కోపిష్ఠి. ఆయన కోపానికి అత్తయ్య, పిల్లలు బాధపడవలసి కూడా వచ్చేది. ఎవరైనా ఆడపిల్లలను వేధించినా, జులాయితనం పోయినా ముందు వాళ్ళను కొట్టి, తరువాత ఎందుకు కొట్టాడో వాళ్ళకి చెప్పేవాడు అమ్మంటే ప్రేమగా ఉండేవాడు. అత్తయ్యకు చీరలు కొంటే అమ్మకు కూడా ఒకటీ రెండు చీరలు కొనేవాడు అత్తయ్య కిష్టం లేకున్నా. చేపల కూర వండించి అమ్మకు ప్రత్యేకంగా పంపించేవాడు. బడికెళ్ళేటప్పుడు ఎదురుపడితే నాకు పావలా (1/4 రూపాయి) యిచ్చేవాడు. ఊరు తిరణాలప్పుడు రోజుకు రూపాయి ఇచ్చేవాడు. మామయ్య దగ్గర గ్రామఫోను ఉండేది పెద్ద బాక్సు టైపులో. చుట్టుపక్కల పిల్లలంతా మామయ్యని ఫోను మామయ్య అని పిలిచేవారు. అమ్మ ఏదైనా పెడితే మొహమాట పడేవాడు. రోజూ ఒకసారి యింటిలోకి వచ్చి అమ్మను చూచి వెళ్ళేవాడు. 

పిచ్చమ్మత్తయ్య అంత కలివిడిగా ఉండేది కాదు. కొంచెం స్వార్ధం పాలు ఎక్కువ అన్నట్లు ఉండేది. అయినా అమ్మ ఆమెకు అన్ని పనుల్లో సహాయపడుతూ ప్రేమగా ఉండేది. 

ఇక మామయ్యల పిల్లలు మేమూ అరమరికలు లేకుండా ఒకే కుటుంబం వారుగా ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళం. అందరం అమ్మ దగ్గరే గుమిగూడేవాళ్ళం. ఓపిగ్గా వండి మా అందరికీ తినిపించేది. అత్తయ్యలు – ఎప్పుడూ ఏముందో, మేనత్త చుట్టూ చేరతారు తెల్లవారగానే అని మురిపెంగానే అనుకునేవారు. 

వసుమతీ, నేనూ బాగా అల్లరి పనులు చేసేవాళ్ళం. శ్యామల సుకుమారంగా ఉండేది. ఏ దుడుకు పనులకూ మాతో చేరేదికాదు. ఒకసారి వసుమతీ, నేను చేసిన అనాలోచితమైన దుడుకుపని మమ్మల్ని పశ్చాత్తాపపడేలా చేసింది. 

మా చాకలి ముత్తి (ముక్తి అయి ఉండవచ్చు) మంచి వ్యక్తి. చక్కగా బట్టలు ఉతికి, మడిచి అప్పచెప్పేది. అమ్మన్నా, పిల్లలం అన్నా ఎంతో ప్రేమగా ఉండేది. పిల్లలు లేరు. ఎవరినో పెంచుకున్నది – ఆ కోడలు బాధలు పెట్టేది ముత్తిని. అమ్మతో, తన బాధ పంచుకునేది. రోజూ రాత్రి బుట్ట తెచ్చుకుని అమ్మతో వేడిగా అన్నం కూరలు పెట్టించుకుని వెళ్ళేది. ఈనాటికి మరపురాని వ్యక్తి ముత్తి. 

ఒకసారి ముత్తి మా బట్టల పెద్ద మూట నెత్తిన పెట్టి తెస్తుండగా లోన తలుపుల చాటున దాక్కొని నేనూ, వసుమతి ఆమె గడపదాటుతుండగా భౌ అని అరిచాం. అదిరిపోయింది. మూట కిందపడింది. ఆమెకు భయంకరంగా నడుంపట్టి చాలా బాధపడింది. అయినా మా మీద కోపం తెచ్చుకోలేదు. మేము పశ్చాత్తాప పడ్డాం  ఇక ఎప్పుడూ తనను బాధించమని. మా అల్లరి చేష్టలకు ఇదొక ఉదాహరణే. అలాంటివి ఎన్నో!

శేషగిరి నా వయసువాడే. మాతో కలిసిపోయేవాడు. అత్తయ్యలా అందంగా ఉండేవాడు. పావురాలను పెంచేవాడు. నాకు సైకిల్ తొక్కటం నేర్పించబోయాడు. ఏ పనులూ సమంగా పట్టించుకోను కదా. పడతానేమో అని భయపడి సైకిల్ నేర్వలేదు. అన్నయ్యకు శేషగిరి అంటే చాలా యిష్టం. అతని చదువు సంధ్యల విషయంలో శ్రద్ధ వహించింది అన్నయ్యే. డాక్టరు చదివించటానికి మామయ్యను ఒప్పించింది అన్నయ్యే. వరాలు చిన్నది. ఆట్టే మాతో జతకట్టేది కాదు. 

నిర్మల అందరితో చనువుగా ఉండేది. నాన్నతో గూడా హాస్యాలాడేది. ఇద్దరం ఆవకాయతో పెరుగన్నం యిష్టంగా తింటుండేవాళ్లం. చిన మామయ్య అమ్మతో వాళ్ళకి ఆవకాయ పెట్టబోకమ్మాయి, బొంత కాకుల్లా ఎట్లా తయారవుతున్నారో చూడు అనే వాడు. అయినా మా తిండి మాదే. నిర్మల ఎక్కువ పెట్టించుకుని పారేస్తుంటే నాన్న – నిర్మలా అలా, వేస్ట్ చేయగూడదు. కావలసినంతే పెట్టించుకో అన్నాడు. నిర్మల సమాధానం – ఏం చేయను మామయ్యా కళ్ళు కావాలంటున్నాయి. కడుపు వద్దంటున్నది మరి అని. నాన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

నిర్మల బాగా చదవటంలేదని మాన్పించి 15 ఏళ్లకే పెళ్ళి చేశారు మామయ్య.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.