రాగో

భాగం-2

– సాధన 

గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి ఇచ్చుకుంటాడా? లేక సౌమ్యంగా వ్యవహరించి జీవపారె (కన్యాశుల్కం) తీసుకొని వదులుతాడా అన్నదే లచ్చును సతాయిస్తున్న సమస్య. గోటుల్ ముందు కూచున్న దాదలందరికి ఇది మామూలే.

రామ మనసులో మాత్రం క్షోభ క్రమంగా పెరుగుతోంది. రాగో మనసు తనకు తప్ప మరొకరికి తెల్వదనుకుంటాడు రామకాక. పిల్లలో అమాయకత్వం, చలాకీతనం కలగలసి ఉన్నాయి. తను కోరింది చేసి చూపే పట్టుదలా ఉంది. ఐదు వందల రూపాయలు చెల్లించి తన కాపురం నిలిపిన నాటి నుండి అన్నమాట. లక్ష్మణ రేఖలా పాటిస్తున్న రామకు అన్న మాటకు ఎదురు తిరగాలంటే నోరు రావడం లేదు. ఎప్పటికైనా రాగోకే న్యాయం జరుగాలని కోరుకునేవాళ్ళలో తానే మొదటివాడి ననుకుంటాడు రామ.

“ఇళ్ళల్లో చూద్దాం లేవండి” అంటూ లేచాడు దల్సు. ఒకరి వెంట ఒకరు లేచారు. రామ వారందరికి ముందు దారి తీస్తున్నాడు. నాన్సు ఇల్లు తప్పించాలని ఉంది.

బోరింగ్ వద్ద నీళ్ళు నింపుతున్న సుశీల కనపడింది. సుశీల కనపడ్డాక సుశీల ఇల్లు చూడకుండా వీరందరిని ముందుకు పట్టుకువెళ్ళడం ఎలా జరగాలని రామ అనుకుంటుండగానే గుంపులో నుండి ఎవరో సుశీలను పలకరించసాగారు.

“నాన్సు ఇంట్లోనే ఉన్నాడా బాయి” గుంపులో నుంచి వచ్చిన ప్రశ్న. 

“బారాయెనో (ఏమో) లేడు” సుశీల జవాబు. .

టకటక బోరింగ్ కొడుతున్నట్టే ఉంది సుశీల. కానీ ఆ కుండ నిండిందా లేదా కూడా చూడడం లేదు. కుండ నిండి నీళ్ళు పొంగిపోతున్నట్టే సుశీల మనసులోని బాధ క్షణక్షణం అధికమవుతుంది. భూమి లోలోపలి నుండి బోరింగ్ నీళ్లు తోడుతున్నట్టే జరుగుతున్న ఘటనలన్నీ ఒక్కొక్కటి సుశీల మనసులో కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. తన సంసారం ఏం కానున్నదో అన్నదే సుశీలను పీడిస్తున్న సమస్య. సుశీల తన కులంలో ఇప్పటికి ఎందరినో చూసింది. కట్టుకున్న భర్త భార్య ఉండగానే మరో ఆడదానితో సంబంధం పెట్టుకున్నాడంటేనే ఇక ఆ సంసారంలో చిచ్చు పుట్టినట్టే నన్నది తెల్వనిది గాదు. తను చూడనిది గాదు. హీనమైన పనులకు, భారమైన పనులకు ఇప్పటి నుండి సుశీల బలిగావలసి వస్తుంది. ఇంతకాలం ఇంట్లో తను వహించిన పెద్దకోడలు పాత్ర క్రమంగా కొత్త కోడలు స్వీకరిస్తుంది. ఇంత కాలం అత్తారింట్లో వంటింటి నుండి ధాన్యపు కొట్టు వరకు తన కనుసన్నలలో చూసుకున్న ప్రతీది తన నుండి దూరం అవుతాయి అలాగే ఇంతకాలం తన కొంగు పట్టుకొని తిరుగుతున్న వాడు తనతో సంతోషంగా, హాయిగా గడిపిన ఘడియలన్నీ చెల్లు అయిపోయి తన కళ్ళముందే కొత్తగా తెచ్చుకున్న మరో ఆడదానితో గడుపుతుంటే తనలో తాను విలవిల తన్నుకోవడం తప్ప చేయగలిగిందేమిటన్నదే ఆమెలో ఘడియ ఘడియకీ రాజుకుంటున్న ప్రశ్నలకుంపటి. ఒక్క భర్తతోనే కాకుండా ఇంటిల్లిపాదితో ‘కొతొక వింత, పాతొక రోత’ లానే తను చూడబడుతుంది. ఇన్ని రకాల చిత్ర హింసల మధ్య తాను చేయగలిగిందేమిటి? లేదు. ఆ రాగోను చేసుకోకని తన భర్తను పోరుదామంటే తనకు పిల్లలు పుట్టడం లేదు. ఇక పుట్టరేమో కూడా. అయితే తనకే పిల్లలై ఉంటే, పోనీ ముందుకైనా అవుతారని భరోసా ఉంటే నాన్సుకు మనసు లేకపోతే, తనే మరెవరికైనా పోయేది. కానీ, ఇపుడు అందుకైనా భరోసా లేకుండా ఉంది. ‘పంజాన్చడ్’ (గొడ్రాల్) అని ముద్రపడ్డాక తనకు ఆ దారి కూడ ఇక లేదు. రేపు రాగోకు కూడ పిల్లలు కాకపోతేనో? అసలు నాన్సుకే పిల్లలు పుడుతారో లేదో ఎవరు తేల్చాలి? నిలదీసి అడగడం సరే మనసులో అనుకోవడానికి కూడా సుశీలకు భయమే.

* * *

“నాన్సుతో మనకేం పని. ఇల్లు చూద్దాం” అన్నారెవరో. గుంపు అంతా ఇంట్లో దూరింది. తాళం పగలగొట్టి రాగోను బయటకు లాగారు. నాన్సు ఇంటినుండి బరబరా లాక్కెళ్ళుతున్నారు. తన్నులు, గుద్దులు ప్రారంభమైనాయి. రాగో మొత్తుకోళ్ళు కూడా పెరగసాగాయి. రాగో లేత రెక్కలు వెనుకకు విరిచి పావురి తాడుతో కట్టారు. తండ్రి పిడికిలి బిగించి పిచ్చిగా బాదుతున్నాడు. రాగో సిగముడి తప్పి జుట్టు విడిపోయింది. మొగమంతా కందిపోయింది. కళ్ళ నీళ్ళు జాలువారుతున్నాయి. అడుగులు పడడం లేదు. ఈడ్పిస్తున్నారు.

అమ్మలక్కలందరూ గుమ్మాల్లో నిలబడి చూస్తున్నారు. దెబ్బ దెబ్బకు రాగో పడుతున్న అవస్థను నరాలు బిగపట్టి మౌనంగా చూస్తున్నారే తప్ప పల్లెత్తుమాట అనడానికి ధైర్యం లేదు. రాగో కాక రామ పరిస్థితి కూడ అమ్మలక్కలకు భిన్నంగా లేదు.

ఇంత జరుగుతుంటే, రాగో ఊహించినట్టే, నాన్సు జాడ మాత్రం లేదు.

ఇంటికి లాక్కొచ్చిన రాగోను గదిలోకి తోసి బేడెం వేశారు. మళ్ళీ పంజరంలో చిలక. తాను తండ్రి చెప్పినట్టు వినే వరకు తనకు అదే గతి. ఇక మొదలవుతాయి తన పాట్లు.

గదిలో పడి జరిగినవన్నీ నెమరు వేసుకుంటున్న రాగో కళ్ళ ముందు ఇప్పటి వరకు జరిగిందంతా కలలా కదిలిపోయింది. ఇప్పుడేం చేయాలన్నది క్షణాల్లో తేల్చుకోవలసిన సమస్య. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ పెళ్ళి తన మెడకు చుట్టుకుంటుంది. ఇంట్లో ఆ హంగామా జోరుగా సాగుతుంది. తానేం చేయాలన్నా ఆ ఒక్క రోజే మిగిలింది. తాను అడిగినపుడే నాన్సు వెంటేసుకపోయి ఉంటే ఇదంతా ఏదీ జరిగేది గాదు. కథ అంతా మంచిగానే జరిగి ఉండేది. కానీ, అసలు కథ ఇపుడే ప్రారంభం అవుతుందని రాగో గ్రహించుకుంది. తనకు ఇష్టం లేకపోయినా తల్లి తండ్రుల మాటకు కట్టుబడి మేన సంఘిని పెళ్ళాడి జీవితాంతం అయిష్టంగా గడపడమో లేదా గది నుండి బయటపడి, ఆ చీకటి దారి నుండి తప్పుకొని తనకు నచ్చినట్లు చేతనయినట్లు బతకడమో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇక తప్పదు. బయటపడి కష్టాలెదిరించయినా సరే తనకు నచ్చినట్టే తన బతుకు దిద్దుకోవాలనే కోరిక రాగోలో బలపడింది – ఎట్టి పరిస్థితిలోనూ తన పట్టుదల విడిచి రాజీ పడకూడదనే అనుకుంది. ఆ గది నుండి తప్పుకోవడానికి అవకాశాలు వెతుకుతూ, ఈ పరిస్థితుల్లో తను తేలిగ్గా బోల్తా కొట్టించగలిగేది తల్లినే కదా అనుకుంటూ ఆమె తెచ్చే వేడి జావకై ఎదురు చూస్తూ కూచుంది.

2

జువ్వి గడ్ చిరోలిలో ఓ మారుమూల పల్లె. ఆ అడవి తాతలనాడు ఉన్నంత ధట్టంగా లేకపోయినా, ఈనాటికీ అది అడవి కడుపులోని పల్లె. ఆ ఊరికి ఏ రోడ్డు సౌకర్యమూ లేదు. పదేళ్ళ కిందటి వరకు ఆ ఊరికి కాలిబాటలే దిక్కు. అయినా రెండు మూడే. కోసు పెట్టులో ఉన్న నాగుల్వాయి పోయే బాటే కాస్త మెదిగి ఉంటుంది. ఏరు నుండి ఊళ్ళోకి వచ్చేది మరో బాట. మూడు కోసుల దూరంలో కట్టేఝురిలో పేరుపోయిన పూజారున్నడు. కొనూపిరితో ఉన్న బీమారి వాళ్ళను అడపా, దడపా బండిలో మోసుకెళ్ళడానికి ఆ ఊరి వరకూ పడిన బళ్ళబాట మరొకటి. ఆ బళ్ళబాటకి ఆమడ దూరంలో ఇటీవలే ఒక మట్టి రోడ్డు పడింది. ఆ మట్టి రోడ్డు వెళ్ళి భామ్రాఘడ్ నుండి ఆల్లపెల్లికి పోయే కంకర రోడ్డుకి కలుస్తుంది. ఆ క్రమ్రాఘడ్ రోడ్డు చంద్రపూర్ నుండి సిరొంచకెళ్ళే డాంబర్ రోడ్డుకి కలుస్తుంది.

జువ్వి జనం క్రమంగా రోడ్డుకి అలవాటు పడుతున్నారు. మునుపయితే, ఏ చిన్న పనికయినా, ఎంత తక్కువ దూరమైనా, చివరికి ఆటుం (సంత) కైనా సరే సోపతి (తోడు) లేనిదే కాలు కదపని ఆదివాసీ జనం ఇపుడు రోడ్డు పడి, ట్రక్కుల రద్దీ పెరిగాక, భయం తీరి ఒంటరిగానే రాకపోకలకు అలవాటవుతున్నారు.

మట్టి రోడ్డు పట్టుకొని భామ్రాఘడ్ కంకర రోడ్డు వైపు కాకుండా తూర్పుకి పదికోసులు నడిస్తే బీనగొండ వస్తుంది. గతంలో బీనగొండ పోవాలంటే గుట్టలన్నీ ఎక్కుతూ, దిగుతూ వెళ్ళేసరికి కాళ్ళు తీపులు పట్టేవి. కాని ఇపుడు పేపరు మిల్లు వెదురు గాడీలు గడియకొకటి, గంటకొకటి బుర్రుమంటూ పోతూ ఆ రోడ్డు మీద నడిచేవారిని కొంత దూరమైనా చేరవేస్తుంటాయి. మోటార్లో పోవడంతో అడవి జంతువుల భయం కూడ కొంత తగ్గింది. అయితే పెద్దపులి, గుడ్డేళ్లు వంటి అడవి జంతువులు రోడ్డుకు అపుడపుడు అడ్డం బైఠాయించి డ్రైవర్లను బెదిరించే సంఘటనలు ఇప్పటికి కూడ జరుగుతూనే ఉన్నాయి.

మరో మూడు కిలోమీటర్లు పోతేగానీ బీనగొండ రాదు. బతిమాలి జావ తాగించి దారికి తేవడానికి గదిలోకి అడుగు పెట్టిన కూచిని తన ఏడుపుతో, పెడబొబ్బలతో తబ్బిబ్బు చేసి దొడ్డికి పోవడం మిషతో గదిలోనుండి బయటపడ్డ రాగో అందరు తిరిగే చోట్లు వదలిపెట్టి అడవికి అడ్డం పడి ఎవరో తరుముతున్నట్లు పరుగు నడకగా మట్టి రోడ్డు చేరుకుంది. రోడ్డు ఎక్కాక కూడా రాగో నడక పరుగులాగే ఉంది. ఒగరుస్తూ, చెమటలు కారుస్తూ రోడ్డు వెంటే నడుస్తున్న రాగోకి పక్కనుండే పోయిన లారీ లేపిన దుమ్ముతో తోవ కనపడకుండా పోయి కళ్ళు బైర్లు కమ్మినంత పనయింది. తనను దాటుకుంటూ మోటారు పోయిన ప్రతిసారీ మోటార్లో పోదామని అనుకుంటుంది గానీ కైతికాల డ్రైవర్లు, కండాక్టర్లు (క్లీనర్లు) తీరొక్క తీరు వెకిలి వేషాలు వేస్తారనే భయంతో రోడ్డువారకు జరిగి నడక వేగం హెచ్చిస్తూనే ఉంది. వీళ్ళ కళ్ళకు మాడియ అక్కలందరూ పూసి లెక్కనే అగుపడతారని తన మనసులో తానే తిట్టుకుంది.

ఈ రోడ్లన్నీ ఇవ్వాళ బుల్ డోజరే వేస్తున్నది కానీ వెనుకట ఎందరెందరో ఆదివాసీ ప్రజల చెమటలు ధారలు కట్టడంతోనే తయారైనయి. ఈ రోడ్లు వేయించే పేపరు మిల్లు బాబులు, వారి టేకేదార్లు కూలీలందరినీ మెడకు బెడితే కాలుకు, కాలుకు బెడితే మెడకు అన్నట్టుగా ఎటూ ఇరుక రాకుండా కొరుక రాకుండా పనులు చెప్పుతూ హరిఘోష పెట్టేవారు. వాళ్ళకు నచ్చిన ఆడదాన్ని వంట వార్పుకు పెట్టుకొని పని వెళ్ళదీసుకునేవారు. వాళ్ళకు నచ్చిన ఆడదాన్ని ఎంచుకొని, పీల్చి పిప్పి చేసేవాళ్ళు. అలాంటి అనేకుల్లో పూసి ఒకటి.

పూసి కూడ సింగారించుకొని గోల్ సాడి కట్టుకొని కులుకుతూ, వంటకు కుదిరి బాబులను తన చుట్టూ తిప్పుకోవడంలో అలవాటు పడిపోయింది. బట్వాడా నాడు బాబులకంటే బడాయి పోయేది. తన తోటి ఆడపిల్లలెట్లుంటున్నరనే జ్ఞానం కూడా లేకుండా తనేదో తురుమ్ ఖాన్ పని చేస్తున్నట్టు వగలు పోయే పూసి అంటే అందరికీ చీదరే. దొంగ పూసి ఇప్పుడెక్కడ తేలిందో? తనలో తానే పెదవి విరుచుకుంది. నడుస్తున్న రాగోకు వెనుక నుండి జీపు చప్పుడు వినరాగానే ఆలోచనల నుండి తేరుకుంది. ఎదురుగా చూస్తే ఊరు పొలిమేరల్లో ఉండే బొందల గడ్డ కనిపించింది.

పెద్దా, చిన్నా బండలు ఇరవైకి పైగానే నిటారుగా నిలబెట్టి ఉన్నాయి. వాటి పక్కనే పీనుగుల బొందలున్నాయి. కానీ ఆ బండల్లో ఆడ మగ తేడా గుర్తుపట్టగలిగే నిషాన్లు ఏమి లేవు. వాటికొక పది గజాల దూరంలో ‘వంజసైతు నరోటి’ పేరుతో గోరి కట్టబడి ఉంది. పేరు, వసతి ఉన్నవాళ్ళే అటువంటి కట్టడాలు చేస్తుంటారు. అక్కడ నిలబెట్టిన పలక రాళ్ళపై ఏవేవో ఆనవాళ్ళు పెట్టి ఉంచారు. చనిపోయినవారు షికారు పట్ల ప్రేమగలవారైతే, అందుకు నిదర్శనంగా ఓ తుపాకీని లేదా కర్రతో చెక్కిన పక్షులను ఆ బండలకు వేలాడదీసి ఉంచారు. చనిపోయిన వారు విడిచి వెళ్ళిన సామానులను వారు వాడిన పళ్ళెం, వారు ఉపయోగించుకున్న సందుగ, వారింత కాలం పడుకున్న మంచం, బట్టలతో పాటు ఓ నాలుగు చూరు పెంకలు బొందల వద్ద పెట్టి ఉన్నాయి. ఇది మాడియాల రివాజు.

బండలు దాటి నాలుగడుగులు వేస్తే రోడ్డు ఎడమవైపు పదెకరాలు చదును చేసిన భూమి ఉంది. ఇది సర్కారు వారు దురుస్తు చేసిన వ్యవసాయ క్షేత్రం. పోడు వ్యవసాయం చేసుకొనే ఆదివాసీలను స్థిర వ్యవసాయం వైపు తేవడానికి వేలాది రూపాయల ఖర్చుతో బుల్ డోజర్ వాడి ప్రభుత్వం చేసిన వ్యవసాయ క్షేత్రం అది. మొదటేడే అలికిన విత్తనాలకు సరిపడా పంట రాలేదనే నెపంతో ప్రభుత్వమే దాన్ని బందు పెట్టుకుంది.

విప్లవ కార్యక్రమాల పర్యవసానంగానే సంస్కరణ కార్యక్రమాలనేకం మారుమూల కొండల్లోకి కూడా ఎగబాకుతున్నాయి. బళ్ళు, రోడ్లు అంగన్ వాడీలు, బాల్వాడీలు ఒకటేమిటి అన్నీనూ ఒకదానితో ఒకటి పోటీపడ్డట్టే అవతారం ఎత్తుతున్నాయి. కానీ నాలుగు రోజులు కాగానే ఇవి వెలవెలబోతుంటే సర్కార్ మతిలేని పనులకు గొట్టెదాదలు కసిగా నవ్వుకుంటారు. పోడు వ్యవసాయమే మా కన్నతల్లి అన్నది అక్షరాలా రుజువైందంటూ, బీడు పడ్డ స్కూరీ క్షేత్రాలనూ, ప్రభుత్వ పని విధానాన్ని ఎగతాళి చేస్తారు. ఆ క్షేత్రం నీటి పారుదలకై తెచ్చిన ఆయిల్ ఇంజన్ తల్లీ తండ్రి దిక్కులేని పిల్లలా ఇప్ప చెట్టు కింద దిగాలుగా పడుంది. ఆకతాయి పిల్లలు ప్రతి నట్టూ, బోల్డ్ లో సహా తమ ఆట వస్తువుగా మార్చుకున్నారు.

ఆ చెట్టుకింద ఓ ముసలమ్మ కూచుండి కూచున్న చోటు నుండి జరుగకుండానే గంపనిండా పూలేరింది. గుట్టల వరుసలో ఎక్కడా ఆగుపడదు ఇప్పచెట్టు కానీ ఈ పొలంలో మాత్రం ఎట్ల పుట్టిందో? ఆ ఊరి వాళ్ళందరి కళ్ళు ఆ చెట్టు మీదనే. జీలుగుకల్లు ఎంత పుష్కలంగా ఉన్నా, నాలుగు చినుకులు పడ్డాయంటే చాలు మనసు ఇప్పకల్లు పైకి పోకమానదు. ఆ ఊరివాళ్ళందరూ ఇప్పపూల కోసం డోంట్ భూమి (మైదాన ప్రాంతం) వారికి కోసరి, కోల ఇచ్చుకోవలసి వస్తుంటే, ఆ ఒక్క కుటుంబానికి అటువంటి అవసరం రానందున అందరి మనసుల్లో ఏదో మూల అసూయ లేకపోలేదు.

“పేరి (పెద్దవ్వ) ఊళ్ళో మంచేనా? మైని ఇంట్లో ఉందా? ముసలమ్మను దాటుతూ రాగో ఆప్యాయంగా పలకరించింది.

“ఆం! ఆఁ! ఎవరూ! రాగో పొద్దున్నే వస్తున్నావు బిడ్డా. మీరంతా మంచేనా” ప్రేమగా బదులు పలికింది ఆమె.

“ఆం! ఆఁ! నేనే పేరీ! మైనిని చూసిపోదామని” అంటూనే రాగో పెద్దవ్వను దాటేసి ఊళ్ళోకి చరచరా వెళ్ళింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.