సిలికాన్ వాలీలో శాంతిదేవి!

-ఎన్.ఇన్నయ్య

అంతర్జాతీయంగా శాంతిదేవి చారిత్రక పాత్ర వహించింది. ఆమె అమెరికాలో ప్రతిభావంతురాలుగా పేరొంది, ధనగోపాల్ ముఖర్జీ వద్ద చదివి, రవీంద్రనాథ్ ఠాగోర్ కవిత్వాలను ఆనందించిన మేథావి. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి ముచ్చట. 

శాంతిదేవి అసలు పేరు ఎవిలిన్. 1915 నాటికి ఆమె గ్రాడ్యుయేట్ గా జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. అనుకోకుండా ఆమెకు మానవేంద్రనాథ్   రాయ్ తటస్థించాడు. వారిరువురినీ పరిచయం చేసిన ధనగోపాల్ వారి పెళ్ళికి దారితీశాడు.

బ్రిటిష్ వారిపై పోరాడుతూ, రహస్యంగా ఫ్రాన్సిస్కో చేరిన నరేంద్రనాథ్ యూనివర్సిటీలో వున్న ధనగోపాల్ ను కలిశాడు. ఎవిలిన్ ను కలవడం అలా జరిగింది.

ఎవిలిన్ అప్పటికే రవీంద్రనాథ్ ఠాగోర్ కవితలను చదివి ఆకర్షితురాలై, ఆమెరికాలో ఆయన్ను గురించి చెబుతూ వచ్చింది. ఇండియా పట్ల అలా ఆకర్షితురాలైన ఎవిలిన్ కు అనుకోకుండానే రాయ్ పరిచయమయ్యాడు. అనేక రహస్య పేర్లతో బ్రిటీష్ వారిపై ఇండియాలో పోరాడిన రాయ్ ఆమెరికా చేరిన తరువాత ఎం.ఎన్.రాయ్ గా అవతరించాడు. ఎవిలిన్ – రాయ్ లు పెళ్ళి చేసుకుందామనుకున్నారు. కానీ ఎవిలిన్ తల్లిదండ్రులు తోబుట్టువులు ఒప్పుకోలేదు. కాని దృఢ నిశ్చయంతో వున్న ఎవిలిన్, రాయ్ తో న్యూయార్క్ వెళ్ళింది. అక్కడా రహస్య జీవితం గడిపారు. బ్రిటిష్ గూఢచారులు వెంటబడడమే యిందుకు కారణం.

న్యూయార్క్ లో అప్పటికే (1916) లాలాలజపతిరాయ్ కొలంబియా యూనివర్సిటీ ప్రాంగణంలో వుంటూ, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన్ను రాయ్, ఎవిలిన్ లు కలిశారు. 

ఆర్థిక వనరులు లేని రాయ్ – ఎవిలిన్ జంటకు లజపతిరాయ్ కొంతవరకు తోడ్పడ్డాడు. ఎవిలిన్ ఆయనకు సెక్రటరీ కార్యకలాపాలు నిర్వహించింది. అందుకు కొంత డబ్బు చెల్లించాడు. 

రాయ్-ఎవిలిన్ లు న్యూయార్క్ లో గడుపుతుండగా, పోలీసు పట్టుకొని, రాయ్ ను హెచ్చరించి, పిలిచినప్పుడు హాజరు కావాలని వదిలేశాడు. అంతటితో యిరువురూ రైలులో మెక్సికో సరిహద్దుల వరకు వెళ్ళి, టెక్సస్ దగ్గర మెక్సికోలో ప్రవేశించారు. మెక్సికోలో వారి జీవనం సుఖవంతమైంది. ఎవిలిన్ కు శ్పానిష్ భాష వచ్చు. ట్యూషన్లు చెబుతూ గడిపారు, రాయ్ కు శ్టాన్ ఫర్డ్ ఛాన్సలర్ ఒక పరిచయ లేఖను మెక్సికో రాష్ట్ర గవర్నర్ కు యిచ్చాడు. అది బాగా ఉపకరించింది. రాయ్ సోషలిస్ట్ నాయకుడుగా ఎదిగాడు. పత్రికలలో రచనలు చేశాడు. మెక్సికో నాయకుల స్థాయికి చేరాడు. ఇదంతా రష్యాలో లెనిన్ దృష్టికి వచ్చింది. 

లెనిన్ ఆహ్వానంపై రాయ్ – ఎవిలిన్ లు రష్యా వెళ్లారు. ఎవిలిన్ రష్యాలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పాఠశాలలో విదేశాలనుండి వచ్చిన ప్రవాస కమ్యూనిస్టులకు పాఠాలు చెప్పింది. అందులో హోచ్ మిన్ కూడా వున్నాడు. 

రాయ్ తో పాటు ఎవిలిన్ ఆనాడు లెనిన్ ను కలసింది. అది అప్పట్లో గొప్ప విశేషం. రాయ్ – ఎవిలిన్ లకు అగ్రశ్రేణి కమ్యూనిస్టు నాయకులంతా పరిచయం అయ్యారు.

భారత కమ్యూనిస్టు పార్టీని తాష్కెంట్ లో స్థాపించమని రాయ్ దంపతులకు పంపారు. రైలునిండా ఆయుధాలు పెట్టుకొని తాష్కెంట్  వెళ్ళిన రాయ్ దంపతులు భారత ప్రవాస కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. అది చరిత్ర! ఎవిలిన్ స్థాపకురాలిగా పేరొందినది.

తిరిగి రాయ్ దంపతులు యూరోప్ వచ్చి, ది మాసెస్, ఇంటర్నేషనల్ ప్రెస్ కరస్పాండెంట్ అనే ఇంగ్లీషు పత్రికలు నడిపారు.  

ఆ పత్రికలలో శాంతిదేవి పేరిట ప్రామాణిక వ్యాసాలను ఎవిలిన్ రాసింది. ఇండియా వెళ్ళి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనాలని ఎవిలిన్ ఆశించింది. కాని కుదరలేదు.  యూరోప్ లో ఫ్రాన్స్, కేంద్రంగా ఎవిలిన్ పనిచేసింది.

రాయ్ తరచుగా రష్యా వెళ్ళిరావడంతో పత్రికల పని ఎవిలిన్ చూసింది. బ్రిటిష్ పోలీస్ ఆమెను వెన్నాడుతూ పోయారు. 

1935 నాటికి పార్టీ అంతర్గత వ్యవహారాలు మారిపోయాయి. రాయ్ ను చైనా పనులు చూడమని స్టాలిన్ పంపాడు. ఈలోగా ఎవిలిన్ కు విడాకులివ్వడానికి రాయ్ పూనుకున్నాడు. కారణాలు అడిగితే రాయ్ ఏమీ చెప్పలేదు. ఎవిలిన్ చాలా కుంగిపోయింది.

తప్పనిసరి పరిస్థితులలో ఎవిలిన్ అమెరికా వచ్చింది. ఆమె తల్లి, సోదరీమణులు స్వాగతించారు. కొన్నాళ్ళు శాన్ ఫ్రాన్సిస్ స్కో దిన పత్రికలో అంతర్జాతీయ విలేఖరిగా పనిచేసింది. తరువాత రాయ్ పట్ల నైరాశ్యతతో మరో పెళ్ళి చేసుకున్నది. చివరకు శాక్రమెంటోలో ఎవిలిన్ స్థిరపడింది. అంతర్జాతీయ పరిశోధకులు ఆమె వెంటబడి రాజకీయ విషయాలు అడిగారు. కాని ఆమె రహస్య జీవితం గడపదలచి ఎవరితోనూ మాట్లాడలేదు.  

శాన్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫసర్ నార్త్ ప్రత్యేకంగా రాయ్ పై పరిశోధనలు చేశాడు. అతనితో మాత్రమే ఎవిలిన్ విషయాలు చెబుతుండేది. ఇండియాలో వారెవరైనా ఉత్తరాలు రాయాలంటే ప్రొఫెసర్ వార్త ద్వారానే రాసేవారు. 

ఎం.ఎన్.రాయ్ పై బహిరంగంగా ఎవిలిన్ ఎలాంటి విమర్శ చేయలేదు. రాయలేదు. ఆమె యిల్లు తగలబడగా రికార్డులు అన్నీ కాలిపోయాయి.

ఇండియాలో ఎం.ఎన్.రాయ్ చరిత్రను రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలో వరుసగా రాశాడు. ఆయన రెండో భార్య ఎలెన్ కు చెప్పగా ఆమె షార్ట్ హాండ్ లో రాసేది. ఎవిలిన్ తో పెళ్ళి అయినంత వరకే రాశాడు. కానీ ఎక్కడా ఎవిలిన్ పేరు రాయలేదు!

ఎవిలిన్ ఆశతో రాడికల్ హ్యూమనిస్ట్ ఇంగ్లీషు వారపత్రికకు చందాకట్టి తెప్పించుకున్నది. కాని తన ప్రస్తావనలేకపోవడం ఆమెకు చాలా నిరాశ కలిగించి వుండాలి. ఎవలిన్ తన జ్ఞాపకాలు రాయలేదు. 1955లో రాయ్ చనిపోయిన తరువాత, రాయ్ భార్య ఎలెన్ హుందాగా ఎవిలిన్ తో ఉత్తర ప్రత్యుత్తరాల సంబంధం పెట్టుకున్నది. కాని రాయ్ ను గురించి ఎలాంటి చర్చలేదు. 

శిబ్ నారాయణ్ రే కొంత ప్రయత్నించి ఎవిలిన్ తో సంబంధాలు పెట్టుకున్నా, పరిశోధన ఏమీ జరగలేదు. 1970లో ఎవిలిన్ చనిపోయింది. ఆవిధంగా ఒక మహోన్నత చరిత్ర ముగిసింది! ఎవిలిన్ సోదరీమణులు, ఒక సోదరి కుమారుడి సహాయంతో నేను ఒక పరిశోధనా గ్రంథం వెలువరించాను. ఎవిలిన్ పై ఆ పుస్తకం ఆమెజాన్ లో లభిస్తుంది. 

*****

Please follow and like us:

One thought on “సిలికాన్ వాలీలో శాంతిదేవి!”

Leave a Reply

Your email address will not be published.