కథా మధురం  

చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

చెదిరే ముగ్గు (కథ)   

-ఆర్.దమయంతి

కథా మధుర పరిచయం :

‘ఆకాశమంత ప్రేమకి నిర్వచనం అమ్మ ఒక్కటే!’ 

అని చెప్పిన కథ  – డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రాసిన చెదిరే ముగ్గు కథ!

********

మహిళలు  స్త్రీ పక్షపాతులు కానే కారు. వారికి మగ వారంటేనే గొప్ప నమ్మకం. విశ్వాసం.   వారి  మోసాలు తెలీక ప్రేమించడం , తెలిసాక –  కడ వరకు వగచి వగచి విలపించడంలోనే బ్రతుకు వెళ్ళదీస్తారు. 

కారణం ఏమిటీ అని .. ఎన్ని సార్లు వెతికి చూసినా, ఒక్కటే నిజం  కనిపిస్తుంది. అవసరం తీరాక ఏ మగాడికైనా  – స్త్రీ ఒక పనికిరాని వస్తువు అని!

గట్టు దాటాకా తెప్ప ని తగలేసినట్టు..ఆమె పరిస్థితీ అంతే. 

అతను అంటే ఎవరు? ‘ ఇదిగో ఇతను. ఈ ఫలానా వ్యక్తి. ‘అని చెప్పలేం.

ఆమె జీవన ప్రతి మజిలీ లో నూ నమ్ముకున్న మగాడు ఆమెని నట్టేట ముంచుతూనే వున్నాడు.

కూతురి సంపాదన మరిగిన  తండ్రి కావొచ్చు, సోదరి కాళ్ళు పట్టుకుని అభివృధ్ధిలోకొచ్చి, ఆ పైన ఆమెని మరచిపోయే  సోదరుడు కావొచ్చు, ‘నువ్వంటే పడి చస్తా..అంటూ..’ప్రేమ’ అనే రంగుల  ఎర వేసి, బులపాటం తీరాక ఆమెని అరణ్య రోదన కి గురిచేసే నయవంచకుడు కావొచ్చు,  తాళిని పవిత్రమైన ఉరి గా మార్చి రోజూ ఉరి వేసె యముడు లాటి  మొగుడూ కావొచ్చు..ఎన్ని కష్టాలు పడ్డా పసివాడి కోసం ప్రాణాలు నిలుపుకుని, వాడ్ని పెంచి పెద్ద చేసి, ప్రయోజకుడయ్యాక వాడి నీడ లో విశ్రమిద్దామనుకున్నప్పుడు  నిర్దాక్షిణ్యం గా వదిలేసి వెళ్ళిపోయే –  కొడుకూ కావొచ్చు. 

మరి, స్త్రీలు జాగ్రత్త పడాలి కదా! ఇన్ని యుగాలు గడిచినా ఇకనైనా బుధ్ధి తెచ్చుకోవాలి కదా అని  ఆవేదన తో అనొచ్చు.  అయినా ఆమె అంతే.  – ఎన్ని జన్మలెత్తనీ, ఏ జన్మ కా జన్మే ఆమె అంతే. ఆమె కథా అదే. కాషన్స్  వుండవు. ప్రీ కాషన్స్ అస్సలు పనికి రావు. ఎందుకంటే ఆమె ఉత్తి పిచ్చిది. ప్రేమించడం మాత్రమే తెలిసిన పిచ్చిది ! 

ఈ కథలో ఆ  తల్లి సుబ్బమ్మ కూడా అంతే. 

* కథేమిటంటే :

సుబ్బమ్మ అనాథ అయ్యాక, గుడి పంచన చేరి, బ్రతుకెళ్లదీస్తుంటుంది. పొద్దు వాలిపోతున్న ఆమె జీవితం లో ఓ గొప్ప ఆశా కిరణం లా ఓ పసివాడు దొరుకుతాడు. వాడికి తల్లి గా మారాక, తిరిగి ముసలి మనసున మళ్ళా ఆశలు, ఆనందాలు పరచుకుంటాయి.  బ్రతుకు మీది తీపిని పుట్టిస్తాయి. 

అందరూ అంటారు, బంధాలు శాశ్వతం కాదని.  కానీ, మనిషి బ్రతికేదే బంధం కోసం! మరణించి, మళ్లా పుట్టడం వెనకా కూడా  ఈ బంధాల సంబంధాల కొత్త ముడులే ముడేసుకుని వుంటాయి. జన్మ జన్మ బంధాలు ముడి వేసి పెడతాడు అని అంటారు కవి ఆత్రేయ..అందుకే కామోసు!  

సుబ్బమ్మ కీ ఈ కొత్త అనుబంధం – ఎనలేని ఆనందంతో బాటు, ఎక్కడ్లేని శక్తిని తెచ్చి పెడతాయి. 

కానీ ఎక్కువ కాలం ఆమె సంతోషం నిలవలేదు.  అంతలో నే ఆమె కల చెదిరిపోయింది. ఆ పసివాడి తల్లి తండ్రులు పోలీసుల్ని ఆశ్రయించడం, పోలీస్ ఎంక్వైరీ లో సుబ్బమ్మ  ఆ పసివాణ్ని అపహరించిన  నేరస్తురాలి గా పట్టుబడటం జరుగుతుంది.  అనుకోనిది జరగడమే జీవితం అన్న సత్యాన్ని జీర్ణించుకున్న సుబ్బమ్మ  తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుంది. తను పెంచి పెద్ద చేసిన ఆ బాబుని కన్న వాళ్లకి అప్పచెబుతుంది. 

ఆమె గురించి అంతా తెలుసుకున్న ఆ బాబు తల్లి, సుబ్బమ్మని కూడా  తమతో రమ్మని కోరుతుంది. అప్పుడు సుబ్బమ్మ  చెప్పే జవాబే ఈ  కథా కీలకం.

వాళ్లు బాబుని తీసుకుని వెళ్ళిపోతారు. సుబ్బమ్మ ఒంటరి జీవితం తిరిగి ప్రారంభమౌతుంది. ఎప్పట్లానే బారం గా!  – ఆ రాత్రంతా ఏడుస్తూనే వుంది. పెంచిన మమకారం, కన్న ప్రేమ కంటే నూ ఎక్కువ కదా.. ఎలా తెల్లారిందో..తెల్లారింది. తప్పదన్నట్టు లేచి, వాకిలి చిమ్మబోతున్న సుబ్బమ్మకి ఓ కొత్త సత్యం తెలిసొస్తుంది. అదే ఈ కథ ముగింపులో మెరిసే మెరుపు. 

తప్పక కథ చదవండి. చదివాక, మీ హృదయ స్పందనలను నెచ్చెలి తో పంచుకోవలసిందిగా  నా మనవి. 

***

కథలో సుబ్బమ్మ పాత్ర స్వభావాలు, సుగుణాలు :

సుబ్బమ్మ : కథలో కీలకమైన ప్రధాన పాత్ర సుబ్బమ్మ పాత్ర. కొంతమంది స్త్రీలు  కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేయడం కోసమే పుడతారేమో అనిపిస్తుంది..అలా  అగుపించే స్త్రీ మూర్తి సుబ్బమ్మ. 

కథలో ఆమె ఓ అనాథ స్త్రీ గా పరిచయం అవుతుంది.  ఎవరూ లేని ఆమె గుడి పంచన చేరి, ఆ పరిసరాలను శుభ్రం చేస్తూ బ్రతికే పనిమనిషనుకుంటాం. కానీ, కాదు. ఆమె జీవితాన్ని చదివొచ్చిన అనుభవజ్ఞురాలు. 

ఈ ప్రపంచంలో పాము కాటుకు మందుంది కానీ, మనిషి స్వార్ధం కాటుకి మాత్రం ఎలాటి మందూ లేదు. అంత విషపూరితమైన వ్యక్తులు కుటుంబంలోనే వుంటారు. ‘మన’ అనుకున్న వారు పగ వారెలా అవుతారో, కన్న కొడుకు సైతం కుట్రలు పన్ని తల్లి తండ్రుల్ని ఎలా వదిలించుకుంటారో స్వానుభవం లో తెలుసుకున్న స్త్రీ – సుబ్బమ్మ. 

స్త్రీ ల చివరి ఓటమి ఏమిటంటే -ముదుసలి వయసులో కన్న పిల్లల చేత ‘నువ్వు వేస్ట్’ అనిపించుకోవడం. అప్పటి ఆ ఒక్క  అనుభవం చాలు. ఏ తాత్వికుని బోధనలు అవసరం లేకుండా ..’జీవితం అంటె  ఇదీ శూన్యం.. అని సర్వం బోధపడిపోతుంది. 

సుబ్బమ్మ జీవితం లోనూ అదే జరిగింది.

మనసు బాగోలేకపోతే.. అలా  గుడికెళ్లొస్తుంటాం.  సుబ్బమ్మ మనుగడ కోసం గుడిని ఆశ్రయించుకుంది. జీవితం మన చెప్పు చేతల్లో లేనప్పుడు, అది చెప్పినట్టు విని నడుచుకోవడమొక్కటే మార్గం కదూ? సుబ్బమ్మ పరిస్థితీ అంతే..

మనం ఎలా  బ్రతకాలని అనుకుంటామో  అలా బ్రతకలేనప్పుడు..  ఇక ఎలా బ్రతికినా ఒకటే లే అని అనిపిస్తుంది. విరక్తి లో సాగే బ్రతుకు బండి కి చక్రాలుండవు. దారీ వుండదు. అలా పడి పోతూ వుంటుంది. దిక్కూ దివాణం లేని జీవితాలు అంతే..సుబ్బమ్మ జీవితమూ  అలా సాగిపోతూ వుంది.

‘ఇక సమాప్తం జీవితం’ అనుకునేంతలో..ఏదో ఒక ఆశ పుట్టిస్తాడు ఆ దేవుడు. ఆయనకి అదో వినోదం. ఏమీ లేని వాడి చేతి కి  ఏదో ఒక ఆటబొమ్మ ఇవ్వడం, అన్ని వున్న వాడి చేతిలొంచి  సమస్తం  లాగేసుకోవడం..ఆయనకొక పరిపాటైన ఆట. 

సుబ్బమ్మ చేతికిప్పుడు పసి వాడు చిక్కాడు. ‘నీకు కొడుకు లేడన్న బెంగెందుకు..వీణ్ణి పెంచుకో అన్నప్పుడు సుబ్బమ్మ కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంది.

నేనందుకే అంటుంటాను. స్త్రీలు ఎన్ని సార్లు మోసపోనీ..ఎప్పటికప్పుడు..ఏ మలుపుకా మలుపున..మళ్లా మోసపోడానికి సిధ్ధ పడుతుంటారు. మరో సారి ప్రేమించడం అంటే..మరో సారి మరింత ఘోరం గా గాయపడటానికి సిద్ధపడటం  అని అప్పుడు  ఆ క్షణం లో తెలీకపోవడమే స్త్రీ   స్వచ్చమైన అమాయక ప్రేమ హృదయానికి చిహ్నం అని. అందుకు  గొప్ప నిదర్శనం! అందుకు ప్రతీక గా నిలిచే పాత్ర సుబ్బమ్మ పాత్ర.

‘నా కీ వయసులో బిడ్డ ఎందుకు? నేను పెంచలేను.’ అని అనలేకపోతుంది. తనదే అడుక్కునే బ్రతుకు కదా! నా మీద బిడ్డ భారం నాకింకా బరువు కదా  అనే తన దీన స్థితి తనకు  గుర్తుకు రాదు.  అదీ!  తల్లి హృదయం అంటే. పైసా తో కానీ,  ఆర్ధిక లావా దేవీలు, లాభ నష్టాల బేరీజీలు, ఇవేవీ లేని,..ప్రసక్తి వుండని స్వచ్చమైన ప్రేమ ఏదీ  ప్రపంచంలో అంటే తల్లి ప్రేమ మాత్రమే! ఖచ్చితం గా మాతృ ప్రేమే.  అందుకు నూటికి నూరు పాళ్ళు స్పష్టమైన రూపం తో దర్శనమిస్తుంది సుబ్బమ్మ పాత్రలో ఆ మాతృ మూర్తి! 

 ఈ పాత్రలో విశిష్ట గుణమేమిటంటే – తల్లి పిల్లలని ఎంత గాఢం గా ప్రేమిస్తుందో..ఆనందిస్తుందో.. త్యాగం చేయాల్సివచ్చినప్పుడూ అంతే గుంభనం గా,  గుండెలో సుడిగుండాల సముద్రాన్ని దాచేసుకుంటుంది..అని చెప్పకనే చెప్పే పాత్ర సుబ్బమ్మ వ్యక్తిత్వం.

స్త్రీ – సంతానన్ని ఓ గొప్ప సంపద గా భావిస్తుంది.  పిల్లలే ఆమె కి సిరి సంపదలు. ఆనంద సౌభాగ్యాలు. సంతాన లెమితో బాధపడే వారికి ఈ సత్యం తెలుసు. 

కొడుకు దూరమై ఏమీ లేని ఆ బీద తల్లికి ఈ పసివాడు అలా ఒక నిధి అయాడు. ప్రేమ నిధి. వాడి ఆలన పాలనలో ప్రేమని పంచి ఇవ్వడం తో ఆమె సంపన్నురాలైపోయింది. ముఖాన చెదిరిన సంతోషం, దిగులు నిండిన మనసు, చీకు చింతలతో మరింత కృంగి వొంగిన శరీరం ఇప్పుడామెలో కనిపించడం లేదు. పిల్లాడొచ్చాక నీలో ఇంత మార్పేమిటీ అని అడగనే అడుగుతుంది..పూలమ్మి నరసమ్మ.

మనల్ని ప్రేమించే వారుంటే కలిగే ఆనందం లో స్వార్ధం వుంటుంది. కానీ ఎలాటి ప్రేమా ఆశించ కుండా..ఆశించాలని కూడా తెలీని ప్రేమలో గొప్ప సంతోషం వుంటుంది. సుబ్బమ్మ వదనం లో కూడా సరిగ్గా అదే సంతోషం కనిపిస్తుంది.

తల్లులల్కి అదేం పిచ్చి ప్రేమో తెలీదు, కొడుకులంటే పడి చస్తారు అనే మాటల్ని మనం వింటుంటాం.

ఈ కథలో సుబ్బమ్మని అలా మనం చూస్తాం. 

ఆ పసివాదిలో తాను పోగొట్టుకున్న పెన్నిధేదో పొందినట్టు భావిస్తుంది.

చాలా మంది అమ్ముమ్మలు, నానమ్మలకి మనవళ్లంటే ఎందుకంత అమితమైన ప్రేమ అంటె..వారిలో కొడుకు ని చూసుకుంటారు. వాడి చిన్నతనం లో పంచలేని ప్రేమని మనవళ్లకి పంచుతూ..అప్పుడు వుద్యోగం, బాధ్యతలు సరిపోయాయి..గారం చేయలేకపోయాం అంటూ బాధపడే తల్లులు మనకు తెలుసు.

సుబ్బమ్మ కూడా తాను తిరిగి కొత్త గా తల్లి అయినట్టు సంబరపడిపోతుంటుంది. వాడికి బొమ్మ కొనిచ్చి .. ఈ ప్రపంచాన్ని జయించి వాడి చేతికందించినంత సంబరపడిపోతుంటుంది.

ప్రతి అమ్మకి తన కొడుకొక యువ రాజు. వాడు ఎంత పెద్ద రాజైనా, ఎప్పటికీ ఆ అమ్మకి కొడుకే! అని ఊరికే అంటారా పెద్దలు?

ఎంత గొప్ప గా ప్రేమించే తల్లి అయినా, పరిస్థితుల తీవ్ర ప్రభావాల వల్ల, కొదుకుని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఈ గడ్డు కాలం ఎంత కఠినమైనదైనా ఎద కోత తప్పదు..ఎదుర్కోకా తప్పదు. తట్టుకోవడం తల్లికి తెలుసు. 

స్త్రీ బలహీనురాలే. కానీ ఆమెకి ఆ భగవంతుడిచ్చిన గొప్ప వరమేమిటంటే..గుండె బద్దలయ్యే శోకం లో  సైతమన్ స్త్రీ తనని తాను ఓదార్చుకోగలదు. ముంచే కష్టాన్ని సైతం ఓర్చుకోగలదు. ఈ బలమైన గుణాలు పురుషుడిలో చాలా తక్కువ అని సర్వేలు కూడా చెబుతున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్షి గా సుబ్బమ్మ పాత్ర నిలుస్తుందనడంలో ఎలాటి సందేహమూ లేదు.

స్త్రీలు సత్య మూర్తులు..తమ కెంత కష్టాన్నిచ్చినా, సత్యాన్ని అంగీకరించడానికి వెనకాడరు. ఆత్మ సాక్షి గా స్వచ్చం గా బ్రతికే స్త్రీలకి – ప్రతి రూపం గా నిలుస్తుంది సుబ్బమ్మ.

పోలీస్ స్టేషన్ లో..బాబు తల్లి తండ్రులు చెబుతుంటారు. తాము పిల్లాణ్ణి ఎక్కడ ఎలా పోగొట్టుకుందీఇ, అప్పుడు ధరించిన దుస్తులూ రంగులు..అన్నీ..వరసగా వింటున్న సుబ్బమ్మ అంతరంగం ఘొల్లుమంటుంది. అన్నీ కరక్టే. వీడు వాళ్ల పిల్లాడే..అని. నిజాన్ని అంగీకరించడం, తన తప్పు లేదని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం, అయాచితం గా వారు ఇచ్చే డబ్బుని అంగీకరించకపోవడం..ఇక నించి తాను ఒంటరి అనే సత్యాన్ని జీర్ణించుకోవడం..ఇవన్నీ సుబ్బమ్మ పాత్రలోని ప్రత్యేకమైన సుగుణాలు, పాత్రని మరింత బలోపేతం చేసిన లస్క్షణాలు అని చెప్పాలి.

జీవితం లో ఎదురయ్యే ప్రతి అనుభవమూ నేర్చుకునే  పాఠం లాటింది. ఓ కొత్త విషయం తెలుస్తుంటుంది.

సుబ్బమ్మ కి కూడా ఈ అనుభవం తో ఓ గొప్ప సత్యం బోధపడింది. ఆమె మనసు శాంతించింది. 

ఏమిటా సత్యం అనేది కథ చదివాక తెలుస్తుంది. మీరూ చదివి తెలుసుకోవచ్చు.

కథ ని ఎంతో ఆసక్తి కరం గా రచించి, సందేశాన్ని అందించిన రచయిత్రి  డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారికి నెచ్చెలి తన హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు!!

ఫ్రెండ్స్! వచ్చే నెల మరో కథామృతం తో కలుసుకుందాం.

అందరకీ, దసరా పండగ శుభాకాంక్షలతో…

***

చెదిరే ముగ్గు

-డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

  పొద్దున్నే గుడి పరిసరాలూడ్చి, ముగ్గుని తుడవబోయిన సుబ్బమ్మ, ముందు రోజు  తాను వేసిన ముగ్గు చూసి తెగ మురిసిపోయింది. అది మల్లెపందిరి ముగ్గు. కావడానికి పది చుక్కల ముగ్గైనా, ముగ్గుని వేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. అంత అందంగా ఉన్న ముగ్గుని ఊడ్చేయడనికి మనస్కరించకపోయినా, ‘దేవుడి గుడిముందు ఏరోజుకారోజు ముగ్గు మార్చకపోతే, ఆయనకెలా తెల్లారుద్ది’, అనుకుని, తన ‘పాపపు అలోచన’ని క్షమించమని మనసులోనే వేడుకుని, కొత్త ముగ్గేసి, తన పనిలో పడింది

***

అదే రోజున కాస్సేపటికి

సీతమ్మా, మా ఆనంద్ బాబుకి నీ బొమ్మ నచ్చలేదల్లే ఉంది. ఏనుగు బొమ్మ ఎనక్కి తీసుకుని, పులి బొమ్మ ఇవ్వమ్మా! ప్రతి శనివారం రోజూ వేంకటేశ్వర స్వామి గుడి దగ్గర బొమ్మలమ్ముకునే ఆవిడతో అంది సుబ్బమ్మ.

           ఆవిడ “బాగానే ఉంది వరస. నేను కొత్త బొమ్మలే అమ్ముతాను. వారం రోజుల్లో మీ దొరబాబుకి మొహం మొత్తేస్తే నానేటి సేసేది? డబ్బిచ్చి పులిబొమ్మ కొనుక్కోవమ్మా!” అని, “అన్ని జంతువుల బొమ్మలూ ఉన్నాయి రండి పిల్లలూ రండి”, అని అటు వైపుగా వెళ్తున్న కుటుంబంలోని పిల్లలకేసి ఆశగా చూస్తూ అంది

           గుడి ముందు రోజూ పూలమ్మే నరసమ్మ మాత్రం కలుగజేసుకుంటూ, “అలా అంటే ఎలాగ సీతమ్మా! మనమింకా ఏపారం సేసుకుని బతుకుతన్నాం.. పాపం సుబ్బమ్మకి ఏం సంపాదన ఉందని ప్రతీ వారమూ కొత్త బొమ్మలు కొనగలదు సెప్పు? అయినా, నీకన్నీ తెలియకనా?” అంటూ, పూలు పేర్చిన రబ్బరు గుడ్డ కింద ఉన్న డబ్బులోంచి రెండు పది రూపాయల కాగితాలు ఇస్తూ, “ఇదిగో, సిన్న పులి బొమ్మకీ ఇరవై రూపాయలు సరిపోతాయా?” అని అడిగింది

           ఏమనుకుందో ఏమో సీతమ్మ, “అక్కడికి నేనెందుకు సెడ్డ దాన్ని అవాల్లేమ్మా! ఇదిగో సుబ్బమ్మక్కా, పాత బొమ్మిచ్చి, అయిదు రూపాయలిలా పడెయ్యి. అంటే, పాత బొమ్మకి పదికి బదులు ఐదు రూపాయలు కోసుకున్నట్టు”, అంది. తన తరఫున వాదించబోతున్న నరసమ్మని వారిస్తూ, సుబ్బమ్మ అయిదు రూపాయలూ, ఏనుగు బొమ్మా ఇచ్చి, పులి బొమ్మ కొనుక్కుని వెళ్ళిపోయింది. రోజు ఆమె వేసిన తామరపూల ముగ్గు ఒక మూగ సాక్షిగా ఉండిపోయింది.

***

              ఒక వానాకాలపు సాయంత్రంగుడి ఆవరణలో ముగ్గులన్నీ చెదిరి, నీళ్ళు నిలిచిపోతే శుభ్రం చేయడానికి వెళ్ళింది సుబ్బమ్మ. ఆనంద్‌ని కనుచూపు మేరలో పొడిగా ఉన్న ఒక చోట చాప వేసి కూర్చోబెట్టింది. “ఇక్కడే ఉండు ఆనంద్ బాబూనీటిలోకి రామాక“, అని చెప్పి కూర్చోబెట్టింది. నీళ్ళని బకెట్లోకి తోడుతూ కాసేపటికి ఆనంద్‌కి కనిపించకుండా పోయింది సుబ్బమ్మ

             పాపం, పసివాడు ఆమె కోసం నలుదిక్కులూ కలియజూశాడు. కాసేపటికి ఏడుపు లంకించుకున్నాడు. నీళ్ళు తోడే శబ్దంలో ఆమెకు వాడి ఏడుపు వినబడలేదు. పైగా పని చేసినా శ్రద్ధగా చేయడం ఆమెకలవాటు. చప్పుడులో పిల్లాడి ఏడుపు వినబడలేదు సుబ్బమ్మకి. వాడు పాక్కుంటూ తడిలోకి వచ్చి, దాని వల్ల జారి బొక్కబోర్లా పడి, పెడబొబ్బలు పెట్టాడు. అప్పటికి పనైపోయింది గనుక అవి సుబ్బమ్మ చెవిలోకి చేరి, తడి గురించి కూడా ఆలోచించకుండా చేసి, ఆమె చేత బాబు దగ్గరికి పరుగులు తీయించాయి

           ఆనంద్ ని ఎత్తుకుని చూస్తే, అతని పొడుగైన ముక్కు చితికిపోయి, రక్తం బొటబొటా కారిపోతోంది. ఇంకేమన్నా దెబ్బలు తగిలాయేమో అని చూసుకుంటే, బుగ్గ, కణత కొట్టుకుపోయి, కొంత రక్తం కనిపించింది. వెంటనే పూజారి గారి దగ్గరికి వెళ్ళి, పిల్లాడి సంగతి చెప్పి, డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్తున్నానని చెప్పి బయల్దేరింది

            రోజు వానపడింది గనుక భక్తుల రద్దీ పెద్దగా లేదు. కానీ, దాని వల్ల ఆటో దొరకడం కష్టమైంది. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న తన కొడుకు సుభాష్‌కి నరసమ్మ ఫోన్ చేసి, వెంటనే రప్పించి, సుబ్బమ్మనీ, పిల్లాణ్ణీ దానిలో ఎక్కించి పంపించింది

          డాక్టర్ గారు ఆనంద్‌ని  చూసి, ముక్కుకి మందు పెట్టి, కట్టుకట్టి, ఇంకేమీ కొత్త సమస్యలు రాకుండా బుగ్గపైనా, కణతపైనా టించర్ అంటించారు. పిల్లవాడి ఏడుపు రెండింతలయ్యింది. మందుల చీటీ రాసిచ్చి, మళ్ళీ రెండు రోజుల తరువాత రమ్మన్నారు. వచ్చే దారంట పిల్లాడు ఏడిస్తూంటే, సుబ్బమ్మ శ్రావ్యంగా చందమామ పాట పాడి జోకొ్ట్టి, నిద్రపుచ్చింది. ప్రశాంతంగా నిద్రపోయే ఆనంద్‌ని చూసి, ఆనందం తన జీవితంలోకొచ్చిన ఉదంతాన్ని గుర్తుకి తెచ్చుకుంది.

***

          జగడమాడకుండా ఝామురాత్రి వరకూ జాగారం చేసిన సుబ్బమ్మ మరుసటి రోజున పసిపాప ఏడుపు విని వెంటనే లేచింది. కొన్ని కారణాల వల్ల కొడుకు బతికుండగానే కడుపు కోతకి గురై, నిరాశ్రయురాలయ్యింది తను. ‘చెడి  పుట్టింటికి వెళ్ళకూడద’నే సామెత గుర్తున్నా, పుట్టిల్లు దేవాలయమైనప్పుడు అది వర్తించదని మనసులో రూఢి చేసుకుంది. అప్పటినుంచీ గుడిలోనే పారిశుధ్యపు పనులు చూసుకుంటూ తలదాచుకుంటోంది. తను ముగ్గులు వేయడంలో దిట్ట. శివరాత్రి రోజు వేసిన ముక్కంటి ముగ్గులో అబ్బాయి దొరకడం తన అదృష్టంగా భావించింది

          సంతానాన్ని నిరోధించదానికి ఇన్ని సౌకర్యాలున్నా పిల్లల్ని కని, కుప్పతొట్టి లోనో, గుడిమెట్ల మీదో, గుడి ముందుండే ముగ్గు మీదో, అనాథాశ్రమంలోనో వదిలెయ్యడం ఇంకా జరుగుతోంది ఏవిఁటో అనుకుని ఆర్నెల్ల పండంటి మగ బిడ్డని చేతుల్లోకి తీసుకుంది తను. 

               పిల్లాడు వూరిలో వాళ్ళ పిల్లాడేమోనని పరీక్షగా చూసింది. ఊహూఁ, అతణ్ణి చుట్టుపక్కల ఎక్కడా చూసి ఉండలేదు. ధోవతిలా కుట్టివున్నపట్టు ప్యాంటూ, జుబ్బా పసికందు వేసుకున్న బట్టలు. అవి మంచి నాణ్యతతో ఉన్నాయని గమనించింది. అదేవిఁటో కానీ, ఇంత ఖరీదైన బట్టలు కట్టుకున్నా ఒంటిమీది నగలూ, నట్రా నామమాత్రంగా కూడా లేవు. కుడి చేతికి ఒక కాశీతాడు, ఒక పసుపు పూసిన తోరం మాత్రమే ఉన్నాయి

          ఏమైందో ఏమో గానీ పిల్లాడి అమాయకపు మొహాన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలిగింది తనకి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె తనని తాను మైమరచిపోయింది. వాణ్ణి దేవుడిచ్చిన బిడ్డగా భావించి, వాడికి తల్లవడానికి సిద్ధపడింది విషయమే ఉత్సాహంగా పూజారి గారికి చెప్పింది. ఆయన వెంటనే, “దైవ సన్నిధిలో కాలం గడుపుతున్న నీకు దేవుడిచ్చిన బిడ్డ, ఒక వరం అనుకుని పెంచుకుంటావా?” అనడిగారు. సంతోషంతో తను వాడి సేవలకి పూనుకుంది

           వాడు తనకి తెచ్చిపెట్టిన ఆనందానికి నిదర్శనంగా అతడికి ‘ఆనంద్’ అని పేరు పెట్టుకుంది. వాడు తన జీవితంలోకి వచ్చినప్పటి నుండీ తనకు కాలం ఎలా గడిచిందో తెలియలేదు. పొద్దున్నే లేచి, దేవుడి సేవ పూర్తి చేసి, పసివాడి సేవకి పూనుకునేది తను. వాడికి నువ్వుల నూనెతో మాలిష్ చేసి, నలుగు పెట్టి, వేడి నీళ్ళు కాచి, పిల్లాడు తట్టుకునే వేడితో స్నానం చేయించేది

          ఆనక బట్టలు తొడుగుతూ, “ఈ బీద అమ్మ నీకు ఖరీదైన బట్టలు కొనలేదు దొరబాబూ! నాసి రకం బట్టలైనా వేసుకుంటావా? అని అడిగేది. ఏమీ అర్థం కాని పిల్లాడి బోసి నవ్వు చూసి మురిసిపోయి, “నీకు నా మీద ఎంత ప్రేమో! నేను బట్టలు వేసినా వేయించుకుంటున్నావు… నువ్వెంత మంచోడివో!” అని ముద్దులాడేది. ఎంత నాసిరకం బట్టలు కొంటేనేమిటి, పిల్లాడి ఆలనా, పాలనా చూడ్డానికి ఆమె ముక్కెరకి కాళ్ళొచ్చి, సేఠ్‌జీ దగ్గరకి శాశ్వతంగా వెళ్ళిపోయింది. మరి, పిల్లాడికి మొహమ్మొత్తిన బొమ్మలను మార్చుకోవడానికి తను ప్రయత్నించిందంటే మరింకేం చేస్తుంది! 

           ఒకసారి స్నానం చేయించి తీసుకుని వెళ్తూంటే గుక్కతిప్పుకోకుండా ఒకటే ఏడుపు లంకించుకున్నాడు ఆనంద్. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక తన తల్లి మనసు తల్లడిల్లింది. వాడు నీళ్ళని చూపించాడు. “ఓరి బుడ్డోడా, నీళ్ళు కావాలా! బకెట్లో నీళ్ళింకా ఉన్నాయనా? సర్లే, పోస్తానుండు”, అని నీళ్ళన్నీ కానిచ్చిదిస్నానం చేయడం వాడికి చాలా ఇష్టం అని తెలుసుకుని, రోజుకి రెండు సార్లు నలుగు పెట్టి స్నానం చేయించేది. గుళ్ళో చేసే పనులకి తేడా లేకుండా మిగిలిన సమయమంతా పిల్లాడి కోసం కేటాయింఛి, వాణ్ణి ముద్దులాడేది తను. 

              గుడి బయట పూలమ్మే కొట్టు నడిపే నరసమ్మ, గిరాకీ లేనప్పుడు తనతో బాతాకానీ కొట్టేది. బాబు తనలో తెచ్చిన మార్పు చూసి, “ఏమిటక్కా.. మధ్య రోజురోజుకీ చిన్నపిల్లలా అయిపోతున్నావ్?” అని ఆటపట్టించేది. “పెద్ద తెలియనట్టు! ఇదంతా మా బుడ్డోడు తెచ్చిపెట్టిన ఆనందం“,  బాబుని చూసి మురిసిపోతూ జవాబిచ్చేది తను.

          “కొడుకు వెళ్ళగొట్టినా బ్రతుకుతెరువు ఉంటుందనే పట్టుదల ఇన్నాళ్ళూ నీలో చూశాను. దేవుడిచ్చిన బిడ్డ తెచ్చిన ఆనందం నీలో ఇప్పుడు చూస్తున్నాను. పొట్టపోసుకోవడానికి పట్నానికో పోక దేవుడి పంచన చేరావు చూడు.. అందుకే నీ దగ్గరకు ఆనంద్‌ని పంపించి, నీకు ఆనందాన్నిచ్చాడునీబోటి మంచోళ్ళకి దేవుడు మేలే చేస్తాడక్కా!” అంది సంతోషంగా.

***

            “పెద్దమ్మా, గుడికొచ్చేశాం”, అని సుభాష్ అన్న మాటలకి వర్తమానంలోకి వచ్చి, ఆటో దిగింది సుబ్బమ్మ. కృతజ్ఞతా భావంతో అతడికేసి చూసింది. “ఓ పెద్దమ్మో, అలా చూసి నన్ను పెద్దోణ్ణి చేసెయ్యకు. నీ కొడుకులాంటోణ్ణి”, అన్నాడు సుభాష్. “ఇప్పుడు ఆడి సంగతి ఎందుకులేరాఆనంద్ బాబు బాగుంటే, అదే పదేలు”, అంది సుబ్బమ్మ

***

            రెండు రోజుల తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు, “పిల్లోడు మందకొడిగా ఉన్నాడయ్యా.. ముందు ఉండే చలాకీతనమే లేదు. ఇదివరలో సానం చేయడానికి తెగ సరదాపడేవోడు. నీళ్ళలో పడ్డాక బయపడతన్నాడు”, చెప్పింది సుబ్బమ్మ. చీటీ రాసి, “ఈ స్కానింగ్ చేయించమ్మా”, అన్నారు ఆయన. వెంటనే సేఠ్ గారి దగ్గరకెళ్ళి సన్నపాటి తన బంగారు గొలుసుని, ఇదివరకే అక్కడకు చేరుకున్న తన ముక్కెరకి శాశ్వతంగా తోడుండమని వదిలి, కొన్ని పచ్చ నోట్లు తీసుకుని వచ్చింది.

          స్కానింగ్ చేసే దగ్గర చాలా మంది మనుషులున్నారు. రద్దీని చూసి ఆనంద్ అరునొక్క రాగం అందుకున్నాడు. వాణ్ణి వరండాలోకి తీసుకుని వచ్చి, రోడ్లోని బళ్ళను చూపిస్తే ఊరుకున్నాడు. అప్పుడే లోపలకి వెళ్తున్న ఒకావిడ బాబు కేసి తిరిగి తిరిగి చూస్తోంది. సుబ్బమ్మకి మండిపోయింది. ‘ఇలాంటోల్ల కల్లు బడే మా బుడ్డోడికి దెబ్బ తగిలింది. దీని పాడు కల్లు పేలిపోనూ”, అనుకుంది మనసులో

          రిపోర్ట్ చూసిన డాక్టర్ గారు మరేమీ ఫరవాలేదని హామీ ఇచ్చారు. ఆనందంగా నిట్టూర్చి గుడికి తిరుగు ప్రయాణమైంది సుబ్బమ్మ

***

        ఇది జరిగిన రెండు రోజులకి, సుభాష్ పరుగున వచ్చి, “పెద్దమ్మా, పోలీస్ ఇన్స్పెక్టర్ గోరు నీకోసం వాకబు సేస్తన్నారు”, అన్నాడు. సుబ్బమ్మ కోపంగా, “ఇదంతా ఎదవ పనే అయి వుంటది. నాకాడున్న కూసింత బంగారమూ దొబ్బేద్దామని ఆడి ఆలోసెనయ్యుంటది. సూద్దాం”, అని, కొడుకుని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. 

        ఇన్స్పెక్టర్ ఒక్కడూ రాలేదు; స్కానింగ్ చేసే చోట ఆనంద్ వైపు కళ్ళార్పకుండా చూసినావిడ, ఇంకా ఎవరో తెలియని ఒక ఆవిడా, మగాడూ అతని కూడా ఉన్నారు. గుళ్ళోకి వచ్చి, “సుబ్బమ్మంట ఎవరిక్కడ?” అన్నాడు. పూజారి ఆమెకు కబురు చేశాడు. ఆమె నిద్రపోతున్న ఆనంద్‌ని భుజానికేసుకుని వచ్చింది

        “ బాబు ఎవరు? నీ దగ్గరెందుకున్నాడు? గద్దించాడు ఇన్స్పెక్టర్. “నా కొడుకు”, అంది సుబ్బమ్మ నిర్భయంగా. “నువ్వేమో ముసలిదానివి. వయసులో అంత చిన్న కొడుకేవిఁటి? నిజం చెప్పు, ఎక్కడినుంచి ఎత్తుకొచ్చావ్? రెట్టించాడు. ఆఖరి వాక్యానికి భయపడింది సుబ్బమ్మ. “నేను అట్టాంటి దాన్ని కాను బాబూ. బాబు నాకు దేవుడిచ్చిన బిడ్డ”, అంది అనునయంగా. “కుంతీదేవి పోజులు వద్దు. బాబుని ఎక్కడినుంచి ఎత్తుకొచ్చావ్? మళ్ళీ గద్దించాడు

        ఈసారి పూజారి కలుగజేసుకుని, “కొన్నాళ్ళ క్రితం గుడి వాకిట్లో దొరికాడండీ”, అన్నాడు. వెనుక నుండి స్కానింగ్ సెంటర్లో చూసినావిడ ముందుకొచ్చి, “సార్, వీళ్ళతో చర్చలేవిఁటండీముందీ బాబుని మన పరం చేయమనండి”, అంది. ఆమెను చూసి భయం పోయి, కోపమొచ్చింది సుబ్బమ్మకి. “రెండ్రోజుల ముందు రాకాసి మా దొరబాబు కేసి తిరిగి తిరిగి సూసినప్పుడే బయపడ్డాను, ఇదెవరో పిల్లలని ఎత్తుకెళ్ళే బాపతులా ఉందని. ఈలిద్దరూ ఎవరూ? మావోన్ని కన్నోల్లా? మీ ముటావోల్లు ఏరి? అని నోటికి వచ్చినట్టు మాట్లాడింది సుబ్బమ్మ

         లోగా సుభాష్ నరసమ్మని తీసుకుని అక్కడికొచ్చాడు. స్కానింగ్ సెంటర్ ఆవిడ, “మీరు నమ్మినా, నమ్మకపోయినా, బాబు వాళ్ళ కొడుకే. వూరికి రెండూళ్ళవతల పేరు మోసిన శివాలయం ఉంది. శివరాత్రికి వాళ్ళక్కిడికి వెళ్ళారు. రద్దీలో కారెక్కబోతుండగా, ఎవడో దొంగ వెధవ పిల్లాణ్ణి లాక్కుని పారిపోయాడు. రోజు పిల్లడు ఎలాంటి బట్టలేసుకున్నాడో చెప్పమంటావా? అని అడిగింది

         “అవును, శివరాత్రికి మరుసటి రోజే దొరికాడు బాబు”, అని ఇంచుమించు స్వగతంలా అంది నరసమ్మ. “మెళ్ళో పులిగోరు గొలుసూ, చేతులకి గాజులూ, పట్టుపంచెలాంటి ప్యాంటూ, సిలుకు జుబ్బా వేసుకుని ఉన్నప్పుడు పిల్లాడు తప్పిపోయాడు”, అంది అతని తల్లి. “ఒక్క నిమిసెం ఆగండి”, అని ఆనంద్‌తో పాటుగా లోపలికి వెళ్ళి, దొరికిన రోజు వేసుకున్న బట్టలు తెచ్చి, “ఆ దేవుడి మీదొట్టు. నా దగ్గర ఇయ్యే ఉన్నాయి. నాకు మరేటీ తెలవదు”, అంది

            మళ్ళీ ఏదో ఆలోచన వచ్చిన దానిలా, “బాబు దగ్గర ఇంకేమైనా ఉన్నాయా? అని అడిగింది, ఏమీ లేకపోతే వీళ్ళ బాబు కాకుండాపోతాడేమోనన్న ఆశతో. వెంటనే బాబు తండ్రి, “కుడిచేతికి కాశీతాడు, పసుపుతోరం ఉన్నాయి”, అన్నాడు. నీరుగారిపోయింది సుబ్బమ్మ. బాబు తల్లిదండ్రులకి అతణ్ణి అప్పజెప్పక తప్పదు. మళ్ళీ కడుపుకోత ఎదురైంది

              ఇన్స్పెక్టర్ ఏదో గుర్తు వచ్చిన వాడిలా, “రెండురోజుల క్రితం ఒక నగల దొంగొకడు దొరికాడు. వాడి దగ్గర చాలా నగలు దొరికాయి. వాటిలో ఎక్కువ నగలు శివరాత్రి రోజు దొంగాలించాడట. మీవి ఉన్నాయేమో చూద్దాం”, అంటున్నా ఆమె చెవికి ఎక్కలేదు. మొదటి కడుపుకోత ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది.

***

           తను, భర్త మరీ ధనవంతులు కారు కానీ, తిండికీ గుడ్డకీ లోటు లేకుండా ఉండేవారు. ఎప్పుడైనా పంటలు బాగా పండితే, కూసింత బంగారం ఆమెను అలంకరించేది. భర్త పోయినా పొలం పనులు చేసుకుంటూ, కొడుకుని చదివించింది తను. వాడెప్పుడైనా చెడు సావాసాలు చేస్తే నాలుగు తగిలించేది. అందుకని వాడు బుద్ధిగా చదువుకుని ఎలెక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేశాడు

          కొన్నాళ్ళు పట్నంలో పని చేసిన తరువాత నోట్ల రద్దు వల్ల గిరాకీ తగ్గింది. పల్లెటూరికొచ్చి, చిన్నాచితకా పనులు చేసుకోవడం ఇష్టం లేక దుబాయ్ వెళ్ళాడు. భార్యనీ, కొడుకుని అత్తారింటికి పంపలేదు. తల్లిలా చూసుకునే తన తల్లి వద్దనే ఉంచాడు. తన పెంపకం మీద కొడుక్కున్న ధీమా అని సంబరపడిపోయింది తను. 

        దుబాయ్ నుండి తిరిగి వచ్చిన కొడుకు ఇంటినీ, పొలాన్నీ అమ్మేసి పట్నం పోతానన్నాడు. తను ససేమిరా అంది. అదంతా తాతలనాటి ఆస్తని, దాని మీద మనవడిగా తనకి ఎక్కువ హక్కుందని అనే సరికి నిశ్చేష్టురాలైంది తను. తీరా అమ్మేశాక, “మేం వెళ్తున్నాం. నువ్వు మాతో రావడంలేదు”, అని తన నెత్తిన మరో బాంబు పేల్చాడు వాడు

నోరు వెళ్ళబెట్టి చూస్తున్న తనతో, “నా కొడుకు మీద చెయ్యిచేసుకున్న నీకు దూరంగా వెళ్ళిపోతున్నాం!” అన్నాడు. “వాడు చీట్లపేకాడుతూంటే కొట్టాను. అయినా, నీ మీద కూడా నేను చెయ్యిచేసుకున్నాను కదరా! దానివల్లే నువ్వు మంచోడివయ్యావుగదరా”, అంది

      “నేను నీ కొడుకుని, అంచేత నీ ఇష్టం. నా కొడుకువాళ్ళమ్మ ఇష్టం”, అని నిక్కచ్చిగా చెప్పేసి కుటుంబ సమేతంగా వెళ్ళిపోయాడు

***

       సుబ్బమ్మ మళ్ళీ వర్తమానంలోకి వచ్చేసరికి నరసమ్మ వాళ్ళతో సుబ్బమ్మ బాబునెంత జాగ్రత్తగా పెంచిందో వివరిస్తోంది. అంతా అయ్యాక వాళ్ళు ఆమెకు కొంత డబ్బు ఇవ్వజూశారు. “పెంచిన ప్రేమకు వెల కట్టకండయ్యా!” అని డబ్బుని తిరస్కరించింది సుబ్బమ్మ. బాబు తల్లి ఆప్యాయంగా ఆమెపై చేయి వేసి, “పోనీ, మాతోనే ఉండి, నీకు దేవుడిచ్చిన బిడ్డని సాకమ్మా!” అంది

      “అందరూ ఉన్న అనాథని, కడుపు తీపిలో విలువ, కడుపు కోతలో బాధ నాకు తెలుసు. ఇన్నాళ్ళూ మీరెంత బాధపడుంటారో నేను ఊహించగలను. నేనో పాత కాలం మడిసిని. అక్కడికి వచ్చి, నా వాడన్న ప్రేమ వల్ల బాబుని  తిట్టినా, కొట్టినా, మీకు నచ్చకపోవచ్చు. అప్పుడు మీరు, ‘నువ్వెవరివి? అని నన్నడిగితే తట్టుకోలేనమ్మా

      “పైగా, నాకెవరూ లేనప్పుడు ఇక్కడ నేనున్నానంటూ నన్ను కంటికి రెప్పలా కాపాడే తండ్రి ఉన్నాడు. మంచి సెడ్డలు మాటాడడానికి మనుషులున్నారు. మరొక మాట. నా తండ్రి, నేను పొద్దున్నే ముగ్గేస్తే గాని నిద్ర లేవడు. ఆనంద్ బాబుని మీరు సూసుకోండి, నేనిక్కడే ఉంటాను”, అంది, మనసులోంచి  పెల్లుబుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ!

***

        మరొక సూర్యోదయమయ్యింది. ఏడుపుతో నిద్రలేని సుబ్బమ్మ పాచి చేయడానికి తయారయ్యింది. ముందురోజు వేసిన దీపాల ముగ్గు ఆమెకేసి జాలిగా చూసింది, ముగ్గైనా చెదిరిపోవలసినదే కదా అన్నట్టు!

***సమాప్తం***

రచయిత్రి పరిచయం

పేరు                                :            డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

జననం                             :           మద్రాసు (చెన్నై)లో

తల్లిదండ్రులు                       :          రత్న దుర్గ, సోమసుందర రావు గార్లు

స్వస్థలం                            :           విశాఖపట్నం

విద్య                                :           ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో డాక్టరేటు,     

                                                 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  

                                                (బెంగళూరు)లో ప్రజా విధానం (Public Policy) పై 

                                                 ఎం.బీ..

వృత్తి                                :     భారతీయ రైల్వేలో IRAS ఆఫీసర్ గా పని 

      చేస్తున్నాను. వృత్తి రీత్యా ఆగ్నేయ, తూర్పు 

                                               కోస్తా, దక్షిణ, నైరుతి రైల్వేలలో పని చేసిన పిమ్మట 

ఇప్పుడు దక్షిణ రైల్వేలో ఫైనాన్షియల్  అడ్వైజర్ అండ్          చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)  గా పనిచేస్తున్నాను.

రాతకోతలు                         :            2015 జూన్ లో రచయిత శ్రీ రాజేష్ యాళ్ల  

ప్రోత్సాహంతో తెలుగుభాషలో కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఆగష్టు 2020 నాటికి నలభై ఒక్క  కథలు, ఒక నవల ప్రచురింపబడ్డాయి. రెండవ నవల ప్రచురణకు సిద్ధంగా ఉంది. 

అమూల్యమైన 

అభిప్రాయాలు తెలియజేయడానికి     :    drcslakc@gmail.com

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.