“నెచ్చెలి”మాట 

హేపీ న్యూ ఇయర్-2021

-డా|| కె.గీత 

మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టింది…

ఎప్పటిలా 

ముందు రోజే ఇంటి ముందు అందమైన “హేపీ న్యూ ఇయర్” ముగ్గులు తీర్చి దిద్దుకుంటూ 

“హేపీ న్యూ ఇయర్” అని వీథుల్లో అరుచుకుంటూ 

“హేపీ న్యూ ఇయర్” గ్రీటింగు కార్డులు ఇచ్చిపుచ్చుకుంటూ 

“హేపీ న్యూ ఇయర్” చాకొలెట్లు పంచుకుంటూ 

కాకపోయినా 

ఇప్పటిలా

“హేపీ న్యూ ఇయర్” స్టిక్కర్లో, జిఫ్ లో- 

ఎవరో పంపిన 

పువ్వుల బొమ్మలో, నవ్వుల బొమ్మలో –  

వాట్సాపులోనో 

ఫేస్ బుక్కు లోనో 

ఒకరికొకరు 

ఫార్వార్డు చేసుకుంటూ 

“హేపీ న్యూ ఇయర్”

“థాంక్యూ, సేమ్ టు యు”

అవే అవే 

విసుగొచ్చే అక్షరాల్ని 

వేళ్ళు నొప్పెట్టేలా టైపు కొట్టే బాధ లేకుండా 

ఇంచక్కా 

కాపీ, పేస్టు చేసుకుంటూ

సంతోషించాల్సిన 

కొత్త సంవత్సరం కానప్పటికీ-

ఓడినా గద్దె దిగనని పేచీ పెట్టే అమెరికా అధ్యక్షుడి గోలలా

కామెడీగా జరుపుకోవాల్సిన రోజు కానప్పటికీ 

విలయతాండవం తగ్గని 

కరోనా గుబులుతో

ఏ కోశానా 

ఆనందాగమనం కానప్పటికీ-

ఏకంగా చట్టసభ మీదికే దండెత్తిన అధ్యక్షుడి మూకల

సిగ్గు సిగ్గు సంవత్సరంగా

గడ్డకట్టే చలిలో నిరసన రోడ్లపైనే 

నిద్రించాల్సిన  రైతు బతుక్కి కారణభూతమైన 

నిస్సిగ్గు ప్రభుత్వాల  

నిరంకుశ సంవత్సరంగా

అడుగుపెట్టినప్పటికీ-

సరికొత్త కరోనా టీకాలా 

ఏదొక మంచి జరగకపోదా అని 

ఆశావహంగా ఆహ్వానించాల్సిందే!

“హేపీ న్యూ ఇయర్- 2021” 

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.