నిష్కల – 10

– శాంతి ప్రబోధ

కావేరి ఇంటికి తన హోండా యాక్టీవ్ పై  బయలు దేరింది శోభ 

ఇన్నాళ్లకు తీరిందా నీకు . 

నీ బిడ్డకే  రాకూడని కష్టం వస్తే అలాగే నిర్లక్ష్యం చేస్తావా .. ఇన్నాళ్లు వెళ్లి చూడకుండా ఉంటావా .. వదిలేస్తావా అని ఆమె మనస్సు మొట్టికాయ వేసింది.   

నిజానికి , శోభకి కావేరి పదే పదే గుర్తు వస్తూనే ఉంది .  వీలు చిక్కినప్పుడల్లా ఫోన్ చేసి పలకరిస్తూనే ఉంది. 

రైతు మహిళల కోసం, కరోనా వల్ల బడికి దూరమైన పిల్లల కోసం  ఎక్కువ సమయం వెచ్చిస్తున్నది శోభ. 

ఈ క్రమంలో మధ్య మధ్య కావేరి దగ్గరకు వెళ్ళ లేకపోతున్నానని చింత పడింది. 

ఒకటి రెండు సార్లు వెళ్లాలని బయలుదేరి వేరే అత్యవసర పనివల్ల ఆగిపోవాల్సి వచ్చింది .   

ఈ రోజు ఎలాగైనా వెళ్లి తీరాల్సిందే అనుకుని బయలుదేరింది.  ఆమె మనసంతా కావేరి నిండిపోయింది.

కావేరి దగ్గరకు వెళ్లి అప్పుడే నెల దాటిపోయింది.  ఎలా ఉందో … 

అత్తమామలు గానీ, తల్లిదండ్రులు గానీ ఎవరు చేరదీయలేదు.  మనుషులు ఇంత కర్కశంగా ఎలా మారిపోతారో.. నిన్నటి వరకు ఉన్న బంధాలు, అనుబంధాలు ఎలా మరిచిపోతారో.. 

మనసుకు నచ్చిన వ్యక్తితో కలసి బతుకుదామనుకోవడమే నేరమైపోయింది.  పెద్దల పంతాలు పట్టింపులు, అహంకారాలు నిలబెట్టుకోవడంలో బిజీ అయితే పిల్లల జీవితాలు బలై పోతున్నాయి. 

ప్చ్ .. ఈ మనుషులు ఎప్పుడు మారతారో ..  

ప్రేమికుల్ని నేరస్థులుగా చూసే సమాజం ఎప్పుడు మారుతుందో .. 

ప్రేమ వివాహంలని ప్రోత్సహిస్తే తనలాంటివాళ్ళకి జీవితకాలపు శిక్షలు పడవు  అని తలపోసింది  శోభ. 

కుల గౌరవం, కుటుంబ గౌరవం , ఆచారం , సంప్రదాయం పోగొట్టారని ప్రేమికుల్ని  వెలివేస్తుంది వారి కుటుంబం.  సమాజంలో అన్ని కుటుంభాల్లాంటి కుటుంబాలే కావేరి, లోక్ నాధ్ కుటుంబాలు.  వాళ్ళని తీవ్రవాదులకంటే  ఎక్కువగా ద్వేషిస్తున్నారు.  కసి, పగ పెంచుకుంటున్నారు.  పరువు హత్యలకు పాల్పడుతున్నారు. 

కావేరి కుటుంబం వారిని వెంటాడి వేటాడకపోయినా వాళ్ళను మాత్రం ప్రేమించలేదు. అభిమానించలేదు. చివరికి రాకూడని కష్టం వచ్చి ఒంటరైన కావేరి విషయం తెలిసినప్పటికీ వాళ్ళ మనసు కరగలేదు. కన్నెత్తి చూడలేదు.  వాళ్ళ దృష్టిలో కావేరి చనిపోయిన మనిషితో సమానం. 

కావేరి కూడా వారి నుండి ఏమీ ఆశించలేదు.  లోక్ నాధ్ కుటుంబం  వారి వివాహాన్ని హర్షించకపోయినా వ్యతిరేకించలేదు. కట్నకానుకలు లేకుండా కొడుకుని కొంగున కట్టుకుందన్న ఆవేదన వారిలో ఉంది . 

కావేరి అతని జీవితంలోకి రావడం వల్లే కొడుకు తమకు దక్కకుండా పోయాడని వారి ఆరోపణ . కొడుకుపోయిన తర్వాత అతని భార్యతో తమకి ఎటువంటి సంబంధం లేదని, లేని తద్దినాన్ని తగిలించుకోవడమేనని వారి భావన. 

చీకట్లో కొట్టుమిట్టాడుతున్న దుర్భరమైన పరిస్థితిలో జీవితంలోకి అడుగుపెట్టిన నక్షత్రం ఆమె బిడ్డ.  పసిగుడ్డును పొత్తిళ్ళలో పట్టుకుని  ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేరదామని అడిగి చూసింది.  వాళ్ళు ఖాళీలు లేవన్నారు. 

పొరుగింటి అవ్వకి పసిదాన్ని అప్పజెప్పి బతుకుదెరువు కోసం కూలి పనికి వెళుతున్నానని చెప్పింది ఓ సారి. 

అంత కష్టం ఏ ఆడపిల్లకు  రాకూడదు.  

అటు పుట్టింటివారు , ఇటు అత్తింటివారు  వెలివేసిన ఆడపిల్ల బతుకు ఎంత దుర్భరమో ..  తెగిన గాలిపటం లాంటి జీవితం . 

ఏ దిశకు కొట్టుకు పోతుందో .. ఏ ఒడ్డున పడేస్తుందో .. 

ప్చ్ .. అతని అద్భుతమైన ప్రేమను వదులుకోలేక అతనే సర్వస్వము గా భావించి అయిన వాళ్ళందర్నీ, వారి ప్రేమను ఎడమకాలితో తన్నేసి వచ్చింది.  అతనే లోకంగా బతికింది. 

ప్రేమ ఫలం అందుకోబోయే క్షణంలో జరిగిందా సంఘటన. జీవితంలో కోలుకోలేని దెబ్బ .. 

ఆమె జీవితాన్ని ఎలా నిలబెట్టాలా అని ఎంతో మదనపడింది శోభ 

ఆమె భర్త లోకనాథ్  చనిపోయినప్పుడు పురిటి నొప్పులు పడుతున్న కావేరి చేతిలో చిల్లిగవ్వ  లేదు. 

తనకోసం అందరినీ వదిలి వచ్చిన తనను వదిలి అతను ఎలా వెళ్లిపోయాడో అర్ధంకాక నివ్వెరపోయింది కావేరి.  అసలు అది నిజమని నమ్మలేక పోయింది.  ఆ భయంకరమైన క్షణాల్లోనే పురిటి నొప్పులు మొదలయ్యాయి. 

ఇప్పటివరకు నానారకాలుగా ఆడిపోసుకునే వాళ్ళలోంచే మానవత్వం ఉన్న మహిళలు కావేరికి పురుడు పోశారు. 

పండంటి బిడ్డని ఆమె చేతిలో పెట్టారు . 

జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చినతను అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయాడని ఏడవాలో , బోసినవ్వుల బిడ్డని చూసి గుండెలకు హత్తుకుని ఆనందించాలో తెలియని అయోమయంలో అచేతనావస్థలో కావేరి . 

కాలం ఎవరికోసం ఆగదుగా .. తన పని తాను చేసుకు పోతూనే ఉంది . 

ఆమె పరిస్థితి తెలుసు కాబట్టి దాతల ఆర్థిక సహాయం చేయడం తో అంతిమ సంస్కారాలు ముగించారు.  కానీ ఆమె భవిష్యత్ ఏమిటి ?

అందరిలోనూ అదో పెద్ద ప్రశ్నగా నిలిచింది. వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్ల జీవితం ఈ లోకంలో ఎంత బీభత్సం గా మారుతుందో అని కొందరు ఆవేదన పడ్డారు. కొందరు జాలి పడ్డారు.  కొందరు అవకాశం కోసం కాచుకు కూర్చున్నారు. కొందరు ఆమె భవిష్యత్ కు మార్గం వేసే పనిలో నిమగ్నమయ్యారు . 

అలా ఆమె భవిత గురించి , ఆమె బిడ్డ  గురించి ఆలోచిస్తూనే ఆత్మహత్య చేసుకున్న వారికి  ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించారు .  

లోక్ నాథ్ పేరున  భూమి లేదు. అతను కౌలు రైతు.  కాబట్టి అతని కుటుంబానికి సహాయం అందించలేమని  మొదటే తేల్చి చెప్పారు అధికారులు.  

తల్లిదండ్రుల నుండి  అతని వాటాగా వచ్చిన ఎకరం భూమి చూపి అతన్ని రైతుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.  ఫలితం శూన్యం . కారణం ఆ ఎకరం భూమి కూడా అతని పేరు మీదకు మారకపోవడం . తండ్రి పేరునే ఉండటం వల్ల అది సాధ్యం కాదన్నారు . 

అభిమానవతి అయిన కావేరికి అదంతా చాలా ఇబ్బందిగా ఉన్నది .  ఉన్నపళాన భూమిలో కూరుకుపోతే బాగుండనుకుంది. 

చంటిదాని ఏడుపు , బోసినవ్వులు ఆమెను ఆ ప్రయత్నాలకు దూరం చేశాయి.   ఆ పసిగుడ్డును ఒళ్ళో పెట్టుకుని నిద్రాహారాలు లేక తల్లడిల్లిన రాత్రిపగళ్ళు ఎన్నో .. 

నీరింకిపోయిన ఆ కళ్ళు , బరువెక్కిన గుండె కోత భరించక తప్పదు. 

శోభక్క వాళ్ళు చెప్పినట్టు తనను తాను నిలబెట్టుకోవాలి. తమ ప్రేమ గుర్తుగా నిలిచిన తన బిడ్డను  పెంచాలి . అన్నీ దిగమింగక తప్పదు అనుకుంటూ కూలీ పనులకు వెళ్లే ప్రయత్నం మొదలు పెట్టింది. 

తాగిన వ్యక్తి అడ్డదిడ్డంగా రావడంతో గజిబిజిగా సాగిపోతున్న శోభ ఆలోచనలకు బ్రేక్ పడింది. 

అంతలో ఫోన్ మోగింది.  

అక్కా రెండు బర్రెలు మరో రెండు గంటల్లో కావేరి దగ్గర ఉంటాయి.  మీరు బయలుదేరారా అని కార్యకర్త రమేష్ ఫోన్ చేశాడు .  అతనికి జవాబు చెప్పి ముందుకు కదిలింది శోభ . 

ఆమెకు ఒక దారి చూపించే క్రమంలో శోభ బృందం  రకరకాల ఆలోచనలు చేశారు.  

ఇప్పటికిప్పుడు ఆమెకు సహాయం అవసరం కాబట్టి  కుట్టు మిషన్ ఇద్దామనుకున్నారు . 

నాకు కుట్టుపని రాదు. అది నేర్చుకున్నా కుట్టించుకోవడానికి ఎంతమంది వస్తారో తెలియదు . అందరూ రెడీ మేడ్  బట్టలకి అలవాటు పడిపోయారు అన్నది కావేరి.  

ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది . 

నీకు జీవనోపాధికి ఏమి పని చేయగలవు? నువ్వే చెప్పు అని కావేరిని అడిగినప్పుడు ఒక పాడి బర్రె ఇప్పించండి. నెమ్మదిగా అప్పు తీర్చుకుంటాను. నా బిడ్డకు నాకు బతుకుదెరువు అవుతుందని చెప్పింది. 

ఒక్క బర్రె తో బతకడం కష్టమేమో  అని ఆలోచిస్తుంటే పర్వాలేదు మేడం నేను ఎంత కష్టమైనా చేయడానికి సిద్దమే మేడం . 

మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్లకు బర్రెలు ఉండేవి . వాటి పనులు తెలుసు . పాలు పితకడం వచ్చు అని చెప్పింది. 

డిగ్రీ చదువుతూ ఆపేసిన కావేరి కూలీ పనులకు పోతున్న అన్నపుడు కావేరి మనసు భారమైంది. 

కూలికి పోతున్నాను ఇప్పుడు .  అట్లా కూలి పనులు చేసుకుంటూ , బర్రెను సాకుతూ బతికేస్తాననే నమ్మకం ఉంది అని చెప్పినప్పుడు ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. అది గమనించింది శోభ . 

అయిన వాళ్ళందరూ ఉండి లేనట్టు ఒంటరి అయిన ఆమెకు  బిడ్డను బాగా పెంచుకోవాలనే కోరిక . 

వీలయినంత త్వరగా సహాయం అందించాలని అనుకున్న శోభకు ఆ సమయం రావడానికి నెల పట్టింది. 

కావేరికి తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పినట్లుగానే ఈ విషయం తన ఎరుకలో కొందరితో చెప్పింది . 

మాటల్లో నిష్కల కు  కావేరి పరిస్థితి వివరించింది . వెంటనే తాను ఒక బర్రె కు సహాయం చేస్తానని సొమ్ము పంపించింది నిష్కల. 

సరిగ్గా అదే సమయంలో ఓ మిత్రుడు కిసాన్ మిత్ర సంస్థ ద్వారా ఒక బర్రె ఇస్తానన్నాడు . 

ఈ రెండు విషయాలు చెప్పి కావేరిని బర్రెలు చూసుకొమ్మని చెప్పింది .  

అయినా ఆ అమ్మాయి ఎక్కడ తిరగ గలుగుతుంది ? ఎక్కడ చూడగలుగుతుంది ? పసిగుడ్డుని  వదిలి అనుకుంది శోభ . 

తనకు తెలిసిన వారికి కూడా మంచి బర్రెలు కావాలని , ఎక్కడ దొరుకుతాయో వాకబు చేసింది .  రమేష్ కి ఆ పనులు పురమాయించింది. 

వ్యవహారం అంతా ఫోన్ లో జరిగిపోయింది. కానీ కావేరిని ప్రత్యక్షంగా కలవలేకపోయింది శోభ

నూరేళ్లు కలసి జీవిస్తానని మాటిచ్చి ఒంటరిని చేసి పోయిన భర్తను తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే చంటి దాని సంగతేంటి .

అతను బంధాలు , బాధ్యతలు వదిలించుకుని మాయమైపోయాడు . 

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను అట్లా వదిలేయలేని కావేరి కన్నీటి సంద్రాలు కళ్ళలో ఇంకించుకుంది. గుండె భారాన్ని భుజాలపైకి తీసుకుంది . 

కూలి  నాలి పనులు చేయడం ఎలాగో  తెలియక పోయినా ఆ పనులకు వెళ్లడం మొదలు పెట్టింది.

మొదట ఇరుగు పొరుగు ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు . 

కానీ శోభ చెప్పిన మాటలు ఆమెలో ధైర్యాన్ని నింపాయి.  

ఎవరేమనుకున్నా అవేవి చెవిన పడినట్లే దుఃఖాన్ని దిగమింగుకుంటూ పనులకు వెళ్ళింది.  ఎవరేమనుకున్నా తనకు అనవసరం అనుకుంది. ఈ రోజు ఇట్లా మాట్లాడిన వాళ్లు నా బిడ్డకు ఒక్కపూటైనా కడుపు నింప గలరా .. లేదు , ఆ పని చేయరు . సందు దొరికితే నానా మాటలు అనడానికి మాట్లాడడానికి వెరువరు .  ఆ విషయం కావేరికి బాగా తెలుసు . 

తన బిడ్డకు ముద్ద పెట్టాల్సిన అవసరం వాళ్ళకేంటి ? అసలు ఎందుకు పెట్టాలి .. 

తన బిడ్డ అనాధ కాదు. తల్లిని నేను బతికే ఉన్నాను . సమాజం అంగీకరించని పనులు చేయనంతవరకు నేనెందుకు భయపడాలి. బాధపడాలి అనుకున్నది కావేరి. 

నిన్నటి వరకు ఆమె బతికిన బతుకు వేరు . అతనిపై ఆధారపడింది . భర్త ప్రేమ తప్ప మరో లోకం తెలియని అమాయక కావేరి . తన చుట్టూ తనకు తెలియకుండానే ఏర్పరచుకున్న గోడలు ఉండేవి.  ఆ గోడల్లోని ప్రేమ సామ్రాజ్యం తప్ప  మరో లోకం , మరో ప్రపంచం ఉంటుందనే మరచిపోయి బతికింది . 

ఇప్పుడు పేర్చుకున్న ప్రేమ ఇటుకలు కూలిపోయాయి .  

గోడలు లేని ప్రపంచంలో .. కూడలిలో నిలబడింది . ఎటు వెళ్లాలో తనే నిర్ణయించుకోవాలి .  ఎటు పోతే ఏమౌతుందో జాగ్రత్తగా గమనించాలి . ఏ మూలన ఏ నక్క కాచుకు కూర్చుందో ,  ఎటునుండి ఏ పాము బుసలు కొడుతుందో .. . ఎటు ముళ్ల జెముళ్ళు ఉన్నాయో … 

అనుక్షణం ఏమరుపాటుగా ఉండాలి. అప్రమత్తంగా మెలగాలి.   జీవితాన్ని ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిలబెట్టుకోవాలి  అనుకుంటున్నది కావేరి.  

శోభ బృందం కలిసినప్పుడల్లా చెప్పిన మాటలు ఆమె లో గొప్ప స్ఫూర్తిని నింపాయి . బలాన్ని ఇచ్చాయి . చీకటిలోంచి బయటికి తెచ్చాయి .  తనను తాను నిలబెట్టుకునే స్థైర్యాన్ని ఇచ్చాయి . 

ఆ క్రమంలోనే ఇప్పుడు అలా కాదు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూడడం నేర్చుకుంటుంది. తనకు తానుగా బతకడానికి సన్నద్ధం అవుతున్నది ఆమె.  

కావేరి తలపుల్లో ఆమె ఇంటికి చేరింది శోభ . 

ఇల్లు మారింది కావేరి.  కావేరి ఉంటున్న ఇంటికి అద్దె బకాయి ఉండడంతో పాటు ఇకముందు అద్దె చెల్లించలేని ఆమె పరిస్థితి కి జాలి పడకపోగా ఇల్లు ఖాళీ చేయించారు ఇంటి యజమాని.  

ఇంట్లో ఉన్న టీవీ ని అద్దెకింద ఉంచుకున్నారు. 

కావేరి ఉంటున్న ఇంటికి రెండిళ్ళ ఆవల ఉంటున్న వృద్ధురాలు రామవ్వ కి ఈ విషయం తెలిసింది . వెంటనే కావేరికి కబురు పెట్టింది .  

తన ఇంట్లో ఓ గదిలో కావేరిని ఉండమని చెప్పింది . మొహమాట పడుతున్న కావేరిని చూసి లంకంత ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేక పోతున్న . నాకు నువ్వు తోడు . నీకు నేను సాయం.  నాకు కిరాయి ఏమీ ఇవ్వనవసరం లేదు. తోడుగా  ఉండమని కోరడంతో కాదనలేకపోయింది కావేరి . 

ఆ అవ్వ ఆమె భవిష్యత్ నే మార్చేసే సోపానం అవుతుందని ఆ క్షణం కావేరికి తెలియదు . బహుశా అవ్వ కూడా అలా అనుకుని ఉండదు . 

కూన పెంకుల మండువా ఇల్లు. ఆ ఇంట్లో కుడివైపు గది కావేరికి కేటాయించింది రామవ్వ.

ఇంట్లోకి వెళ్ళడానికి ఒకటే ద్వారం .  

తనకు కేటాయించిన గదిలోకి తన మకాం మార్చింది కావేరి .  పేరుకు అది ఒక గది . కానీ పెద్ద గది . ఆ గది బయట వరండా .. గదిలోంచి బయటికి వస్తే నోరారా బిడ్డా అని పలకరించే రామవ్వ .  ఏనాటి బంధమో కన్నవాళ్ళు కనికరించకపోయినా ఈ అవ్వ దగ్గర తీసింది.  ఆపదలో ఉన్న ఆడపిల్లను అక్కున చేర్చుకుంది . ఏమిచ్చి ఈ తల్లి ఋణం తీర్చుకోగలదు అనుకుంది కావేరి . 

ఆ ఇంట్లో చేరిన రెండో రోజు 

చంటిదాన్ని అవ్వకు అప్పగించి పనికి బయలుదేరింది.  పచ్చి బాలింత  అలా పనికి  వెళ్లడం మంచిది కాదు . బిడ్డ పాలకు ఏడుస్తుందని ఓ వారం పనికి వెళ్లకుండా ఆపగలిగింది అవ్వ. 

పూట  గడవడం ఎట్లని కావేరి దిగులు . 

అంతలో రామవ్వ కి సహాయం చేసే కమలమ్మ కి కరోనా రావడంతో ఆమె పని మానేసింది.  ఇదివరకు కమలమ్మకు రావడం కుదరకపోతే కూతురిని పంపించేది . ఇప్పుడు కరోనా సమయం కాబట్టి ఎవరూ వచ్చి పనిచేసే పరిస్థితి లేదు .

ఆ సంగతి తెలిసిన కావేరి ఆ బాధ్యత తాను తీసుకుంది . తనకు ఇంత అండగా నిలిచిన రామవ్వకు తాను పనిచేసిపెట్టడంలో తప్పు లేదనుకుంది . 

కావేరి చురుకుగా పని చేస్తున్న తీరు , ఆమె పద్ధతి , నడవడిక రామవ్వ కి చాలా నచ్చాయి. 

బిడ్డా నా వంట నేను చేసుకో లేక పోతున్నాను .. వంట చేసి పెట్టమని అడిగింది .

గతంలో ఎవరు వంట చేసినా ముట్టని రామవ్వ కావేరి చేతి వంట తినడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది 

  రెండు వంటలు చేయడం ఎందుకు బిడ్డా … ఆ వండేదేమో ఇంకో గుప్పెడు వేస్తే ఇద్దరికీ అవుతుంది కదా అనేది రామవ్వ 

చిరునవ్వుతో తిరస్కరించేది కావేరి .  కానీ రామవ్వ ఒప్పుకునేది కాదు . 

ఉచితంగా ఇస్తే తీసుకొని కావేరి అభిమానం అర్థం చేసుకున్న రామవ్వ తనకు తోచిన విధంగా సహాయం అందించడానికి ప్రయత్నిస్తున్నది . 

నా మనవరాలు లాగా ఉన్నావు . అనేది రామవ్వ 

రామవ్వ ఐదుగురు పిల్లల్ని కన్నది. ముగ్గురు కూతుళ్లు , ఇద్దరు కొడుకులు .  పాము కాటుకు బలైన భర్తతో పోలేక బరువెక్కిన గుండె బండరాయి గా చేసుకుని ఎన్నో గ్రీష్మ వసంతాలు చూసింది.  పక్వానికి వచ్చిన పండులాంటి ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. వారి వెనుక పుట్టిన మగ పిల్లలకు చదువు చెప్పించింది. వాళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు.  హైదరాబాద్ లో ఒకరు నిజామాబాదు లో ఒకరు స్థిరపడ్డారు.  కూతుళ్లు కరీంనగర్ లో ఒకరు , మిగతా ఇద్దరు తమ ఊరికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఉన్నారు . 

ఉన్న ఇల్లు వాకిలి వదిలి తమతో ఉండమని కొడుకులు చెప్పి చెప్పి విసిగి పోయారు .  

ఊళ్ళో భూములు అమ్మేసి వారికి రావలసిన వాటా పంచుకోవాలని కోడళ్ల ఆరాటం.  ఒకటి రెండు సార్లు కొడుకులు ఆస్తి విషయం ప్రస్తావించారు . వారి అంతరంగం అర్ధమయిన రామవ్వ ఈ కట్టెలో ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమి , ఇల్లు వాకిలి అన్నీ అట్లా ఉండాల్సిందే .   నా తర్వాత ఏమి చేసుకుంటారో మీ ఇష్టం .  అంటూ ఆస్తి పంపకాలు చేసి రిజిస్టర్ చేసి పెట్టింది ఆమె . 

చదువు సంధ్య లేని ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపోయారు కొడుకులు.  అనుభవించాల్సిన సమయంలో కాకుండా ఎప్పుడో ఇస్తే ఏం లాభం అని గొణుక్కున్నారు కోడళ్ళు .  అప్పటి నుండి  ఈ ముసలి ఎప్పుడు పోతుందో ఆస్తి తమ చేతికి ఎప్పుడు వస్తుందో నని గోతికాడ గుంటనక్కల్లా ఎదురు చూస్తున్నారు.   

ఎవరి దగ్గర ఉండటం ఇష్టం  లేని రామవ్వ వసంతంలో పూసిన జ్ఞాపకాల్ని , శిశిరంలో రాలిన ఆకుల్ని తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నది.   కొడుకులు , బిడ్డల  సంసారాల్లో వేలు పెట్టదు . 

ఎవరి బతుకులు వారివి .  

పండక్కో , పబ్బానికో రమ్మని రామవ్వ  గొడవ పెడితే  గతంలో దసరా పండుగకు వచ్చేవారు.  ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళయి పోయారు . 

మనుమలు , మనుమరాళ్ళతో వాళ్ళ బాధ్యతలు వారివి .  ఇటుకేసి రావడం బాగా తగ్గిపోయింది.  అప్పుడో ఇప్పుడో కూతుళ్లు వచ్చిపోతుంటారు. వచ్చేటప్పుడుతల్లికి ఇష్టమైన వంటలు , పండ్లు ఫలాలు తెస్తుంటారు. 

ఒకప్పుడు రామవ్వ ఇంటినిండా ధాన్యపు రాశులు,   దోడ్డి నిండా గొడ్డు గోదా నిండుగా ఉండేవి .  ఇప్పుడు పాడి బర్రె ఒకటి ఎప్పుడూ ఉంటుంది . మిగతావన్నీ అమ్మేసింది.  పొలం కౌలుకొచ్చేసింది.  వచ్చిన కౌలు ధాన్యాన్ని కొంత ఉంచుకుని మిగతా వాటిని అమ్మేస్తుంది .  ఉంచుకున్న ధాన్యంలో కొన్ని బస్తాలు బియ్యం పట్టిచ్చి కొడుకులకు పంపేది.  ఇప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుపోవడం మానేశారు .  దాంతో తనకు అవసరమైనంత ఉంచుకుని మిగతావి అమ్మేస్తున్నది .  సొమ్ము బ్యాంకులో జమ చేస్తుంది. 

కాళ్లకు వెండి కడియాలతో , చేతికి బంగారు మురుగులు మెడలో బంగారు కంటె ఉండే రామవ్వ సొమ్ములకోసం ఆశగా చూస్తుంటారు ఆడపిల్లలు . ఆమె వాటిని ఎప్పుడు ఒంటినుండి తీయదు. 

మనుమలు , మనుమరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సొమ్ములు చేతిలో పెడుతుంది . మురిపెంగా చూసుకుంటుంది . 

రామవ్వ వయసుకు వృధాప్యం వచ్చిందేమో కానీ మనసుకు కాదు .  పిల్లలతో పిల్లగా కలసిపోయి అల్లరిచేసేది .  వాళ్లందరికీ కూడా రామవ్వ అంటే ప్రేమ . గౌరవం .  చదువులు, ఉద్యోగాల్లో జీవితంలో వారుకూడా ఊపిరి సలపని పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు . 

కావేరి రాక రామవ్వకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది .   కావేరి తల్లితో  ఉంటుందని తెలిసి రామవ్వ పిల్లలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు .  

అత్తను చూసే బాధ్యత , భారం తమ మీదపడనందుకు ఓ పక్క సంతోషంగానే ఉన్నప్పటికీ ఈ ముసలి అంత ఆస్తి ఎవరికిపెడుతుందో అనే అనుమానం కోడళ్ళకి ఉంది. కానీ నోరెత్తి ఏమీ అనలేని స్థితి . 

అతి కొద్ది కాలంలోనే రామవ్వ , కావేరి ఆత్మీయులయ్యారు . 

అందరూ ఉండీ ఎవరు లేనట్టు బతుకుతున్న వాళ్లిద్దరూ దగ్గరయ్యారు 

వృద్దులకు ఉండే ఆరోగ్య సమస్యలు రామవ్వకు కూడా ఉన్నాయి. కాకపోతే ఆర్ధిక పరిస్థితులు బాగున్నాయి . ఎవరి మీద ఆధారపడి బతకాల్సిన పనిలేదు .  

కుటుంబీకుల ఆదరణ ఉన్నది . గృహ హింస లేదు .  హేళన , ఛీత్కారాలు , దూషణలు లేవు .  

బేలగా , బాధగా ఉండదు .  నిరాశ నిస్పృహలు కానరావు .  ఇతరులకు భారం కాకుండా తన జీవితం తన చేతుల్లోనే ఉంచుకున్న ఆత్మన్యూనతకు లోనవడం ఎప్పుడూ లేదు. 

అనుభవాల పరిణతితో, మానసిక పరిపక్వతతో  శారీరక మార్పుల్ని ముది జీవితాన్ని ముచ్చటగా అనుభవిస్తున్నది రామవ్వ .

మగవారితో పోలిస్తే ఆడవాళ్ళకి ఆయుర్దాయం ఎక్కువ  కావచ్చు . రామవ్వ ఆయుర్దాయం కూడా ఎక్కువే . తొంభైకి దగ్గర పడుతున్నది . 

కుంగుబాటు  తెలియని ఆమె జీవితంలో వచ్చే మార్పులతో సర్దుబాటు అయిపొయింది.  కర్ర పట్టుకుని దొడ్డి అంతా తిరుగుతుంది.  దగ్గర ఉండి కమలమ్మతో పని చేయించుకుంటుంది . 

హడావిడిగా అడ్డం దిడ్డం చేసి పోదామని చూస్తే ఊరుకోదు రామవ్వ . 

వాకిళ్లు అద్దం లాగా ఉండాలని అంటుంది . గడ్డి గాదం మొలవనీయదు . 

పని చేయించుకునే దగ్గర ఎంత నిక్కచ్చిగా చేయించుకుంటుందో అదే విధంగా పెట్టే దగ్గర వెనుకాడదు .  పెద్ద చెయ్యి అని అనుకుంటూ ఉంటారు ఊరి జనం. 

రామవ్వ దగ్గర పని చేయడం అంటే కత్తిమీద సాము చేసినట్లే.  అయినా  పూర్తిగా మానుకోదు కమలమ్మ . మొదట్లో కొన్నిసార్లు బెదిరించింది మానేస్తానని . అలా బెదిరిస్తే ముసల్ది తగ్గి ఉంటుందని భావించింది . కానీ రామవ్వ దగ్గర ఆమె ఆటలు సాగలేదు . 

పని  దగ్గర నిక్కచ్చిగా ఉండి చేయించుకున్నట్లు గానే బాగా పెట్టేది . కూరగాయలు కొనుక్కునే పని ఉండేది కాదు . రామవ్వ తాగగా మిగిలిన పాలు కమలమ్మ తీసుకుపోయేది . 

ఏది వండినా పిల్లలకు పెట్టు అంటూ ఇంటికి ఇచ్చేది . జీతం కూడా బాగానే ఇచ్చేది . అందుకే కమలమ్మ ఆ ఇల్లు వదులుకోకూడదు అనుకునేది 

మండువా ఇంటి ముందు ఉన్న అరుగులపై కూర్చుంటుంది రామవ్వ .  రోడ్డమ్మట వచ్చే పోయే వాళ్ళని పలకస్తుంది . ఊళ్ళో కబుర్లన్నీ వాకబు చేస్తుంది . అవసరంలో ఉన్న వాళ్ళకి తనకు చేతనయిన సాయం చేస్తూ ఉంటుంది.   అట్లా కావేరి గురించి రమవ్వ చెవిన పడింది. కావేరి భర్త మరణం విని చాలా బాధపడింది రామవ్వ . 

ఒంటరి ఆడదాని బతుకు ఎట్లా ఉంటుందో రామవ్వకు తెలుసు .  పిల్లలు చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకున్న రామవ్వ కావేరి జీవితం గురించి ఆలోచించింది.  

అత్తమామలు , తల్లిదండ్రులు చేరదీస్తారేమోనని ఎదురుచూసింది . అది జరగకపోవడంతో తానే చేరదీసింది .  అభిమానవతి అయిన కావేరిని ముక్కు మొహం తెలియని తన ఇంట్లో ఉంచుకుంటానంటే ఒప్పుకోదు . ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో కమలమ్మకు కరోనా రావడంతో పని సులువైంది .

జీవితం ఎటునుండి ఎటు పోతుందో .. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది . 

కావేరి రామవ్వ చెంత చేరడం తెలిసి ఊరట చెందింది శోభ 

కాకుల నుంచి , గద్దల నుండి బిడ్డల్ని కాపాడుకునే కోడిపెట్టాలాగా కావేరిని కాపాడుకోగలదు  రామవ్వ  అని అనుకుంది శోభ. 

కావేరి తో మాట్లాడడం కోసం రామవ్వ ఇంటికి  శోభ చేరే సరికి రామవ్వే మొదట ఎదురైంది. 

కష్టజీవి కావడం వల్లేమో ఒళ్ళు లేదు . బక్కపలచగా గాఢమైన రంగులో ఉండే ఆమె ముఖం, శరీరం పడిన ముడతల్లో ఎన్ని జీవితానుభవాలు దాగున్నాయో .. ఎన్ని సంఘటనలకు సజీవ సాక్ష్యమో .. ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొందో .. ఎన్ని ఎత్తుపల్లాలు చూసిందో .. చీకటి వెలుగుల్లో లోకాన్ని చూసిన అనుభవంతో పండిన అవ్వ రామవ్వ . 

శోభ రామవ్వకు నమస్కరించి కావేరిని చేరదీసినందుకు ధన్యవాదాలు తెలిపింది. 

అయ్యో నేను చేసేదేముంది బిడ్డా ..  కడదాకా ఉంటానన్నోడు కాటికిపోతే, అర్ధాంతరాన ఒంటరిని చేసిపోతే ఆ ఆడదాని గోస గోస ఎట్లుంటదో తెలుసు .  

తోడు లేని ఒంటరి బతుకు ఎంత కష్టమో తెలుసు , భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది . ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తె  ఆ ఒంటరి బతుకే  జీవితం ఏంటో నేర్పుతుంది అంటూ బోసినోటితో నవ్వేసింది.   ఆ నవ్వుతున్నప్పుడు విచ్చుకున్న చర్మపు మడతల్లో దాగిన అనుభవాల్లో ఎన్ని కన్నీళ్లు దాగున్నాయో అనుకుంది శోభ..  

శోభను చూసిన కావేరి కళ్ళలో మెరుపు . 

అక్క బాగున్నావా..  అంటూ దగ్గరకొచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బిగ్గరగా పసికందు ఏడుపు.  ఒక్క ఉదుటున లోనికి పరిగెత్తింది కావేరి. 

తల్లి  గుండెకు హత్తుకుని లాలిస్తున్నా బిడ్డ ఏడుపు ఆగడం లేదు .  గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. 

బిడ్డను  ఒళ్లోకి తీసుకుని స్తన్యం అందించబోయిన కావేరి కెవ్వున అరిచింది 

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.