కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం – పుస్తక పరిచయం

పుస్తకాలమ్’ – 7

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

 తెలంగాణ తొలి కమ్యూనిస్టు ఉజ్వల జీవిత గాథ 

          ఈ వారం పరిచయం చేస్తున్న పుస్తకం ఒక జీవిత చరిత్ర. ఇది మూడు స్థాయిలలో పఠనాశక్తిని తీర్చే అద్భుతమైన, అరుదైన రచన. ఇది చరిత్ర పరిశోధనగా ఎన్నో కుతూహలాల్ని రేకెత్తించి, కొన్నిటినైనా తీరుస్తుంది. ఇది ఒక సాంఘిక చరిత్ర శకలాల గుచ్ఛంగా ఒక శతాబ్ది కిందటి మన చరిత్రలోని మహత్తర ఘట్టాల్ని పరిచయం చేస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవిత చరిత్రగా మన పూర్వతరాల వ్యక్తుల జీవితాల్ని వెలిగించిన ఆదర్శాలకు అద్దం పడుతుంది.

          మొట్టమొదట ఇది ఒక గొప్ప చరిత్ర పరిశోధన. తెలంగాణలోకి మార్క్సిస్టు భావాలు ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా ప్రవేశించాయి అనే ప్రశ్నకు ఇది జవాబు చెపుతుంది. ఆ ప్రశ్న కేవలం పరిశోధనార్హమైన గత చరిత్ర ప్రశ్న కాదు. అది వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ప్రాసంగికత ఉన్న ప్రశ్న.

          విశాల ఐక్య సంఘటన అయిన ఆంధ్ర మహాసభలో కనీసం 1940-41 నుంచి కమ్యూనిస్టుల పాత్ర ఉంది. పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల చెర నుంచి విడిపించి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, మొట్టమొదటిసారి దేశానికి రైతాంగ విప్లవోద్యమాన్ని పరిచయం చేసిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51) కమ్యూనిస్టుల నాయకత్వంలోనే జరిగింది. చైనా కమ్యూనిస్టులు విజయం సాధించక ముందే తెలంగాణ కమ్యూనిస్టులు పోరాటం మధ్య నుంచే ‘చైనా మార్గమే మన మార్గం’ అని ప్రకటించారు (1948). శాంతియుత సహజీవనం, వర్గపోరాటం రద్దు అనే వర్గసామరస్య విధానాలను నికిటా కృశ్చెవ్ ప్రకటించడానికి (1956) ఐదు సంవత్సరాల ముందే తెలంగాణ కమ్యూనిస్టులు ఆ దారి చేపట్టి సాయుధ పోరాట విరమణ ప్రకటించారు (1951). కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం కూడా ఎత్తివేయకుండానే, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో మొదటి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లి తెలంగాణ కమ్యూనిస్టులు గణనీయమైన విజయాలు సాధించారు. నాయకత్వపు విరమణ ప్రకటనను ధిక్కరించి ప్రవాసంలోకీ, మౌనంలోకీ వెళ్లి మరొక వేకువ కోసం తమ ఆయుధాలను దాచుకున్న తెలంగాణ కమ్యూనిస్టులూ ఉన్నారు. నక్సల్బరీ వసంత మేఘ గర్జనకూ, శ్రీకాకుళం పిలుపుకూ స్పందించిన నాటి నుంచి ఈ యాబై సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ విప్లవోద్యమ వార్త వచ్చినా మొట్టమొదట వినిపించేది తెలంగాణ కమ్యూనిస్టుల పేరే. మరొకవంక మూడు నాలుగు తరాలుగా తెలంగాణ సమాజపు సామూహిక జ్ఞాపకంలో చెరగని ముద్ర కమ్యూనిస్టులది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎనిమిది దశాబ్దాలకు పైగా తెలంగాణ కమ్యూనిస్టులకు జన్మనిస్తున్నది, పోషిస్తున్నది, కాపాడుతున్నది, విస్తరిస్తున్నది, పర్యాయపదంగా మారింది. మరి తెలంగాణకు ఈ మార్క్సిస్టు భావాలు ఎప్పుడు పరిచయమయ్యాయి? ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు?

          తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రారంభం 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య అమరత్వంతో జరిగిందని అనుకోవచ్చు గాని, అటువంటి ఏ పరిణామమూ అలా హఠాత్తుగా ఒక తేదీన ప్రారంభం కాదు. అంతకు ముందు కొన్ని సంవత్సరాలో, దశాబ్దాలో ప్రజల్లో నిలకడగా పని జరిగి ఉంటుంది. ఆ పని మొదలు పెట్టినదెవరు? వ్యక్తా, బృందమా? ఎప్పుడు? ఇప్పటివరకూ తెలిసిన చరిత్రలో 1939 డిసెంబర్ 13న హైదరాబాద్ లో ఏర్పడిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ తెలంగాణలో తొలి కమ్యూనిస్టు ప్రయత్నంగా, దాని స్థాపకులైన మఖ్దూం మొహియుద్దీన్, ఆలం ఖుంద్ మీరీ, రాజబహదూర్ గౌర్, జవాద్ రజ్వీ తదితరులు తొలి కమ్యూనిస్టులుగా పరిగణించడం జరిగేది. అప్పటికే వీరందరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులా, కొందరు మాత్రమేనా అనేది కూడ స్పష్టత లేదు. 

          కాని ప్రస్తుత పుస్తకం ‘కష్టాల కొలిమి – త్యాగాల శిఖరం సర్వదేవభట్ల రామనాథం జీవితం’ తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రవేశాన్ని రెండు సంవత్సరాలు వెనక్కి జరుపుతున్నది. ఆ తర్వాత సాయుధపోరాట నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీ, కార్మికోద్యమాల నాయకుడిగా, శాసనసభ్యుడిగా ప్రసిద్ధుడైన సర్వదేవభట్ల రామనాథం 1937 మే లోనే బ్రిటిష్ ఇండియాలో మద్రాసు రాష్ట్రం, గుంటూరు జిల్లా కొత్తపట్నంలో జరిగిన మొట్టమొదటి కమ్యూనిస్టు రాజకీయ పాఠశాలకు హాజరైన ఏకైక తెలంగాణ వ్యక్తి అని ఈ పుస్తకం సాధికారంగా చూపుతున్నది. అది ఆహ్వానిత ప్రతినిధుల పాఠశాల గనుక ఆయనకు ఆహ్వానం వచ్చిందని అనుకోవాలి. అప్పటికే ఆయనకు ఆ పాఠశాల నిర్వాహకులైన మద్రాసు రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులతో సంబంధాలు ఉన్నాయనుకోవాలి. ఈ ఒక్క చారిత్రక వాస్తవాన్ని చెప్పినందుకైనా ఈ పుస్తకం విశిష్టమైనదవుతుంది.

          (అయితే ఈ చారిత్రక వాస్తవానికీ కొన్ని మినహాయింపులు ఉండడం చరిత్ర పట్ల మన అశ్రద్ధకు చిహ్నం. కొత్తపట్నం పాఠశాల గురించిన సమకాలీన డాక్యుమెంటేషన్ ఏమీ లభ్యం కావడం లేదు. పాల్గొన్నవారు కొన్ని దశాబ్దాల తర్వాత రాసిన జ్ఞాపకాలో, పరిశోధకులు రాసిన వివరాలో మాత్రమే దొరుకుతున్నాయి. ‘కొత్తపట్నం పాఠశాలకు హాజరైన విద్యార్థులు’ అని ఒక ఫొటో దొరుకుతున్నది. అందులో రామనాథం కూడా ఉన్నారు. కాని అదే ఫొటో ఆ తర్వాతి సంవత్సరం జరిగిన మంతెనవారిపాలెం పాఠశాల ఫొటో అని పేర్కొన్న రచయితలు కూడ ఉన్నారు. ఈ రెండిటిలో ఏది సరైనదో చెప్పగల నిస్సందేహమైన ఆధారాలు ఇప్పటికైతే లేవు. అయితే ఆ ఫొటో మంతెనవారిపాలెం పాఠశాలది అయినప్పటికీ ఆ 1938 పాఠశాలకు తెలంగాణ నుంచి వెళ్లిన ఏకైక వ్యక్తిగా, రామనాథం తెలంగాణలో తొలి కమ్యూనిస్టు అవుతారు). 

          అయితే, ఆ ఒక్క చారిత్రక వాస్తవం చెప్పినందుకు మాత్రమే కాదు, 1930ల నుంచి 1960ల దాకా ప్రధానంగా, ఆ తర్వాత రెండు దశాబ్దాలు స్థూలంగా తెలంగాణ సాంఘిక చరిత్ర శకలాలెన్నిటినో వివరించినందుకు కూడా ఈ పుస్తకం విశిష్టమైనదే.

          సర్వదేవభట్ల రామనాథం అప్పటి వరంగల్ సుబా మానుకోట తాలూకా పిండిప్రోలు గ్రామానికి చెందిన బ్రాహ్మణ భూస్వామ్య కుటుంబంలో 1913లో పుట్టారు. కుటుంబం ఖమ్మంలో వ్యాపారంలో స్థిరపడినందువల్ల ఆయన పాఠశాల విద్య ఖమ్మంలోనే జరిగింది. ఆ తర్వాత వరంగల్ లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, 1928-30 మధ్య ఆర్యసమాజం, ఆంధ్ర మహాసభ ప్రభావాలలోకి వచ్చారు. 1934లో ఆంధ్రమహాసభ మూడో మహాసభలు ఖమ్మంలో జరిగినప్పుడు క్రియాశీల కార్యకర్తగా, నిర్వాహకులలో ఒకరుగా ఉన్నారు. సంఘ సంస్కరణ ప్రయత్నాలలో, విద్యార్థి యువజనుల సమీకరణలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఐదు సంవత్సరాల ఖాళీతో 1935-38 మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదివారు. కొత్తపట్నం/మంతెనవారి పాలెం పాఠశాలకు వెళ్లడం అప్పుడే జరిగి ఉంటుంది. అప్పుడే, 1938లో ఉస్మానియాలో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురయ్యారు. బహిష్కరణకు గురైన ఇతర విద్యార్థుల లాగే నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎం ఎ, ఎల్ ఎల్ బి కోర్సులలో చేరారు. 1939 మే లో హైదరాబాద్ రాజ్య సరిహద్దు సమీపంలోని తునికిపాడు అనే బ్రిటిషాంధ్ర గ్రామంలో జరిగిన రాజకీయ పాఠశాలలో కూడా రామనాథం పాల్గొన్నారు. 1940-41 నాటికి ఆయన ఖమ్మం, మధిర, కొత్తగూడెం, వరంగల్ ప్రాంతాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతలను చూసే నాయకత్వ స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ నిర్మాణ కృషి ప్రవేశించని రంగం లేదు. చేనేత పనివారు, సింగరేణి కార్మికులు, ఆజమ్ జాహీ మిల్లు కార్మికులు, సఫాయి కార్మికులు, తోళ్ల పరిశ్రమ కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు మొదలైన అన్ని ప్రజా జీవన రంగాల్లోనూ; కరువు, వెట్టిచాకిరీ, అధికారుల జులుం, రైతాంగ సమస్యలు, కార్మిక సమస్యలు వంటి అన్ని సమస్యల మీద పోరాటాల లోనూ ఆయన నాయకత్వ పాత్ర ఉంది. చారిత్రాత్మక పదకొండవ ఆంధ్ర మహాసభ (భువనగిరి, 1944 మే) లో కూడ ఆయన కీలక పాత్ర పోషించారు.

          సాయుధపోరాటం ప్రారంభమయిన మూడు నాలుగు నెలల్లోనే అరెస్టయి ఏడాదిన్నర పైన జైలులో ఉన్నారు గాని, విడుదలై రాగానే మళ్లీ సాయుధపోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయం లోనే తన వాటాకు వచ్చిన పద్దెనిమిది వందల ఎకరాల భూమిని దున్నేవారికి పంచిపెట్టారు. ఆయన అజ్ఞాతవాస కాలంలో ఆయన భార్యనూ తల్లినీ కూడా పోలీసులు వేధించారు. 1950 జూలైలో మళ్లీ అరెస్టయి, అప్పటి నిర్బంధ కాలంలో సాధారణమైన కాల్చివేతను తప్పించుకుని, 1952 వరకూ జైలు నిర్బంధాన్ని అనుభవించారు. 1952 ఆగస్ట్ లో జరిగిన ఉప ఎన్నికలకు పదిరోజుల ముందు విడుదలై, శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1957, 1962 ఎన్నికలలో లోకసభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. 1967 ఎన్నికల నాటి నుంచి రాజకీయ జీవితం విరమించుకున్నారు. క్రియాశీలంగా కాకపోయినా సిపిఐ పట్ల అభిమానంతో నిశ్శబ్దంగా ఉంటూ 1992లో మరణించారు.

          ఈ క్రియాశీల, సంఘటనాభరిత జీవితమంతా తెలంగాణ సామాజిక చరిత్రలో భాగం. తెలంగాణ ప్రజా జీవితం ఎంత వైవిధ్యభరితమైనదో, అది ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో ఎన్నెన్ని మలుపులు తిరిగిందో, ఎన్ని గుణాత్మక పరిణామాలకు లోనయిందో, ఎన్నెన్ని సామాజిక శక్తులు ఏయే రకాల ప్రవర్తనలు కనబరచాయో అనేక శకలాలుగా ఒక్క వ్యక్తి జీవితం ద్వారా తెలుస్తుంది. ఆ సామాజిక చరిత్ర శకలాలన్నీ ఒకానొక వ్యక్తి జీవితంలోనే  పూసల్లో దారంలా సాగడమే ఆ వ్యక్తి ప్రత్యేకత. బహుశా అది ఆ ఒక్క వ్యక్తి ప్రత్యేకత కూడ కాదు. గత శతాబ్ది మహావ్యక్తుల జీవిత కథనాలు ఏ ఒక్కటి చూసినా ఈ ప్రత్యేకత కనబడుతుంది. వాళ్లు కావడానికి సాధారణ వ్యక్తులే కావచ్చు. లేదా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తులూ కావచ్చు. కాని నాటి సమాజ గమనపు సంక్షుభిత మహాప్రవాహాలు వారిని అసామాన్యులుగా మార్చివేశాయి, వారి ప్రత్యేక నైపుణ్యాలను సమాజ పరిణామ చోదకశక్తులుగా మార్చివేశాయి.

          వ్యక్తి జీవితం అనివార్యంగా, అవిభాజ్యంగా సమాజ జీవితంతో పెనవేసుకుపోయిన అద్భుత కాలం అది. వేరు చేసి చూడడానికి, చూపడానికి వీలు లేని ఆ వ్యక్తి వయ్యక్తిక జీవితాన్నీ, సామాజిక జీవితాన్నీ కలగలిపి డా. కె ముత్యం అద్భుతమైన జీవిత కథనూ, సామాజిక చరిత్రనూ అక్షరీకరించారు. ఆర్ శివలింగం పది సంవత్సరాలుగా పరిశోధిస్తూ సేకరించిన సమాచారం సహాయం తీసుకుని, ఇప్పటికే గంటి రాజేశ్వరరావు, సుబ్బారావు పాణిగ్రాహి, పుల్లెల శ్యామసుందర రావుల జీవిత చరిత్రలు రాసిన ముత్యం ఈ జీవిత చరిత్ర రాశారు.

తెలంగాణ చరిత్ర విద్యార్థులూ, ప్రజా ఉద్యమాల అభిమానులూ, సాధారణ పాఠకులూ అందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.