శ్రీరాగాలు-2

‘కలబాష్’

– శ్రీసుధ మోదుగు

          ఇక్కడికి వచ్చాక మనసు ప్రశాంతంగా ఉంది. కొండవాలు మధ్యలో పెద్దగా ఎవరూ లేని చోటు వెతికి మరీ ఇల్లు కట్టుకున్నా. పెద్ద కష్టం కాలేదు. కావల్సినవన్నీ సులభంగానే దొరికాయి. నా యింటి పైన కలబాష్ చెట్టు కొమ్మ నీడ పడేది. పొద్దున్నే చల్లటి గాలి మేల్కొలుపుతో సూర్యుడికి పోటీగా లేచి వెళ్ళేదాన్ని.

          నా ఇంటికి పక్కన ఒక మూలగా పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు కిటికీ కనిపించేది. నేను వచ్చిన దగ్గరనుంచి ఆ కిటికీ తెరిచినట్లు కనబడలేదు. 

* * *

          ఒక రోజు ఊరంతా తిరిగి సాయంకాలం ఇంటికొచ్చేసరికి ఆ కిటికీ తలుపు తెరిచుంది. సన్నటి పాట శ్రావ్యంగా వినిపిస్తోంది. ఆ కిటికీ వెనుక అతను నిలుచొని ఉన్నాడు. అతని చేతివేళ్లు సన్నగా పొడవుగా ఉన్నాయి. అతని ముఖం వైపు చూసా. గడ్డం, కళ్ళజోడుతో ఉన్నాడు. కళ్ళల్లో ఏముందో కనపడలేదు.

          మొదటిసారి అక్కడ మనిషిని చూడటం. అప్పటి వరకు ఎవరూ కనబడకుండా ఉన్న నా ఏకాంతానికి ఇబ్బంది అనిపించింది. అలజడిగా, చిరాకుగా అనిపించింది. ఒక వారం రోజులకు అర్థమైంది అతనేదో లోకంలో ఉన్నట్లు ఉంటాడని. కనీసం నా వైపు కూడా చూస్తున్నట్లు అనిపించలేదు. పోనీలే అనుకున్నా. కొంచెం సంతోషంగా, అతను తోడుగా ఉన్నట్లనిపించింది. నెమ్మదిగా ధైర్యంగా అతని ముందు అటు ఇటు తిరగడం మొదలుపెట్టా. అతనికివేవీ పట్టినట్లు లేవు.

          నా ఇంటి నుంచి చూస్తే కిటికీ నుండి అతని చేతివేళ్లు కనిపించేవి. వాటి మధ్య ఒక్కోసారి కాఫీ కప్పో, పుస్తకమో,పెన్నో ఉండేవి. ఎక్కువసార్లు కాల్తున్న సిగరెట్. ఆ పొగ నాకు అస్సలు పడేది కాదు.  ఆ వాసన నా ఇంటిదాకా వచ్చి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. ఎందుకు సిగరెట్ తాగుతాడని కోపం వచ్చేది.   

          నా ఇంటి నుండి ఆకాశాన్ని చూడటం నాకిష్టం. రాత్రుళ్ళు కలబాష్ కొమ్మ నీడ మధ్య నుండి కనిపించే తునకల ఆకాశం బావుండేది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపించేది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిలో నేను చంద్రుడిని చూస్తూ పాటలు పాడేదాన్ని. నా పాట విన్నప్పుడు ఎప్పుడైనా అతడు కిటికీ పక్కనుంచి బాల్కనీలోకి వచ్చి నా ఇంటివైపు చూసేవాడు. నేను ఇంకొంచెం ఇష్టంగా పాడేదాన్ని.

* * *

          చలికాలం ముగుస్తోంది. పొద్దు తక్కువ రోజులు కావడంతో బయటికెళ్ళిన వాళ్ళు చీకటి పడక ముందే ఇళ్ళకి చేరే వాళ్ళు. మొదటి నుంచి నా సమూహంతో, స్నేహితులతో కలవలేకపోయేదాన్ని. అందుకే దూరంగా ఇలా కొండ మధ్యలో ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు నెమ్మదిగా అతని పై ఇష్టం కలుగుతోంది. అతడి దృష్టిలో పడాలని ఉంది. బహుశా అతను నన్ను పట్టించుకొని, పట్టించుకోనట్లు ఉండటం వల్లేమో! ఉత్సాహంగా పొద్దునే నిద్ర లేవగానే పాడటం మొదలుపెట్టా. అతనికి నచ్చలేదేమో కర్టెన్ వేసుకున్నాడు. నా మనసు చివుక్కుమంది. రాత్రిళ్ళు మాత్రమే అతనికి నా పాట నచ్చుతుందని అర్థమైంది.

          అతన్ని కనిపెట్టి ఉండటం ఇప్పుడు నా దినచర్యలో భాగమైంది. అతను ఎప్పుడైనా బాల్కనీ నుండి కిందకి చూస్తూ లేదా ఆకాశం వైపు చూస్తూ కనిపించేవాడు. ఆకాశం వైపు చూస్తున్నప్పుడు బాధగా ఉన్నట్టుగా, నేలవైపు చూసినప్పుడు కొంచెం సర్దుకొని బ్రతకాలనుకొంటున్నట్లుగా అనిపించేది. అతని పేరు ఏమై ఉంటుందని రకరకాలుగా ఊహించా. రోజుకో పేరు పెట్టుకొనేదాన్ని. అతను నిద్రలేచే సమయం, మేల్కొని ఉండే సమయం తెలిసేది. రాత్రుళ్ళు కిటికీ పక్కన నిల్చొని నక్షత్రాలు లెక్కపెట్టడం చూసేదాన్ని. ఎన్ని నక్షత్రాలు లెక్కపెట్టాడో కూడా అంచనా వేసేదాన్ని. అతను లైట్ ఆర్పి నిద్రపోయినప్పుడు ఎంత సమయం తీసుకొని నిద్రపోయి ఉంటాడో అని ఆలోచించేదాన్ని. అతనికి తెలీకుండా అతని ఇంటికి వెళ్లి ఆ పరిసరాలన్నీ తిరిగి, పడుకొనే మంచం చివర నుంచి చూడాలని, కూర్చొనే కుర్చీని, కాఫీ తాగే కప్‌ని తాకి రావాలనిపించేది.

          అప్పుడప్పుడు నన్ను ఇష్టపడ్డట్టు నావైపు చిరునవ్వుతో చూడటం నచ్చేది. అతనికి నేను, నా పాట  పరిచయం అయ్యామని, నన్ను గమనిస్తున్నాడని తెలిసిపోయింది. నన్ను ఆహ్వానిస్తున్నట్లు చిన్నగా తలూపడం అర్థమైంది. కానీ దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకొనే ధైర్యం లేక ఆగిపోయాను. ఇక ఆగలేక ఒక రోజు వెళ్ళాలని అనుకున్నాను.

* * *

          ఆ రోజు ఆకాశం కొంచెం ముదురు నీలం రంగులో ఉంది. ఆ నీలపు రంగు నాకు ఇష్టం. ఆ రంగుతో నా గిజు జ్ఞాపకాలు పెనవేసుకు ఉన్నాయి. గిజు పోయినేడాది వసంతంలో పరిచయమయ్యాడు. అతనికి నేను ముద్దుగా పెట్టుకున్న పేరు గిజు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. బ్లాక్ నదీతీరంలో పరిచయం అయ్యాడు. చూడటానికి అందంగా కనిపించడు. కానీ అతడు చేసే ప్రతి పనిలో ఎంతో సౌందర్యం ఉండేది. అది నన్ను ఉన్మత్తురాలిని చేసేది. నా చుట్టూ తిరుగుతూ అల్లరి చేసేవాడు, ఆట పట్టించేవాడు. రాత్రుళ్ళు నెమ్మదిగా పక్కన చేరి నిద్రపోయేవాడు.

          గిజుకి ప్రేమ ఎక్కువైనప్పుడు భరించడం కష్టంగా ఉండేది. చుట్టూ తిరుగుతూ ఎటూ పోనివ్వకుండా ప్రేమిస్తున్నాను అని చెప్తూనే ఉండేవాడు. అతని ముద్దుల్లో ఊపిరి తీసుకొనే ఖాళీ కూడా ఇచ్చేవాడు కాదు. ఈ వసంతకాలం వరకే ఉంటానని తరువాత వెళ్ళిపోవాలని చెప్పేవాడు. అప్పుడు భయంతో, దిగులుతో ఏడుపు వచ్చేది. తనే దగ్గరికి తీసుకొని ఓదార్చేవాడు. “మిలి, నేను వెళ్ళడం నీకు మంచిది. నువ్వు అందరిలా కాదు. నీ స్వేచ్ఛకి ప్రేమ కూడా అడ్డవుతుంది. వెళతాను అని బాధపడుతున్నావు. వెళ్ళకపోతే ఎటూ కదలలేని నీ హృదయపు బరువు నువ్వు మోయలేవు. నువ్వు గాలిలో అలలా తేలియాడే మనసు ఉన్నదానివి” అని ఓదార్చేవాడు. “ఆకాశం ముదురు నీలం రంగులో ఉంటే మాటలతో కాదు ప్రేమించుకోనేది” అని చుట్టుకొనే వాడు. దొరకకుండా తప్పించుకొని పరిగెత్తి తిరిగి గిజుకి పట్టుబడటం ఎగసిపడే సంతోషంగా ఉండేది. అనుకున్నట్లే వసంతం రాగానే గిజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు గిజు ఎందుకు గుర్తొస్తున్నాడు?

          ఆ ఇంటివైపు చూసాను. చీకటి. అతడు అప్పటికే నిద్రపోయి ఉంటాడు. రేపు ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను. నిశ్చింతగా నిద్రపోయాను. తెల్లారక ముందే కలబాష్ ఆకుల శబ్దంతో మెలుకువ వచ్చింది. కొమ్మకి కలబాష్ కాయ వేలాడుతూ కనపడింది. గాలికి పడితే ఇంటిమీదే పడుతుందని అనిపించింది.

          అతను లేచి ఈ పాటికి చేతిలో కాఫీ కప్ తోనో, సిగరెట్ పొగతోనో ఉండి ఉంటాడని తొంగిచూసాను. ఎవరో కొత్త మనుషులు కనబడ్డారు. ఒక చిన్ని పాప చేతిలో బొమ్మతో కనిపించింది. తన  పక్కన ఎర్రటి చొక్కాతో, పొడుగు జుట్టుతో ఇంకొక ఆడ మనిషి కిటికీలోంచి పరిశీలనగా చూస్తోంది.  తన కన్ను నా ఇంటిపైన పడింది.  నా ఇంటివైపు చేతులు చూపించి నవ్వుతోంది. అతడూ ఆమెతోబాటు నవ్వుతున్నాడు. నాకు కలవరంగా, కష్టంగా అనిపించింది. బయటికి వచ్చి సూటిగా అతనివైపు చూసా. అతను చూడనట్లు తల తిప్పుకున్నాడు. కానీ ఆ పాప మాత్రం నవ్వుతూ తిరిగి నావైపు చూసి స్నేహంగా చేతులు ఊపింది. భారమైన మనసు కొంచెం తేలికగా అనిపించింది. పాపను చూస్తే వెళ్ళిపోయిన నా పిల్లలు గుర్తొచ్చారు.

* * *

          అతని చుట్టే తిరుగుతున్న ఆమె నాకు నచ్చలేదు.  నావైపు, నా ఇంటివైపు అనుమానంగా చూస్తున్న ఆమె నా నుంచి అతన్ని లాక్కుందనిపించింది. ఆమె బాల్కనీలో బట్టలు ఆరేసేది. అతడు ఆ బట్టల వెనుకకి వచ్చి వెళుతూ ఉండి ఉంటాడు. కిటికీ కర్టెన్స్‌తో మూసివేయబడింది. అతను దాదాపు కనిపించడం మానేసాడు. ఎప్పుడైనా రాత్రుళ్ళు ఒంటరిగా బాల్కనీలోకి వచ్చి ఆకాశం వైపు చూస్తుండేవాడు. అప్పుడు నా పాట కోసమేమో అనిపించేది. కొన్ని రోజులు కోపంతో పాడటం మానేసాను. తరువాత అతను విషాదంగా ఉన్నాడనిపించి పాట పాడేదాన్ని. కాసేపు విని నా ఇంటివైపు ఒకసారి చూసి వెళ్ళేవాడు. 

          రాను రాను అదీ తగ్గిపోయింది. అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ అరుచుకుంటున్నట్లు ఏవేవో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. అప్పుడు బాల్కనీ నుంచి సిగరెట్ పొగ ఎక్కువగా వచ్చేది. కొన్ని రోజులు కనీసం బాల్కనీ తలుపు కూడా తెరుచుకునేది కాదు. దుమ్ము పట్టినట్లు కనిపించేది. పాప మాత్రం కిటికీ నుంచి చూసేది. చూడగానే చేతులు ఊపేది. నేనూ ఆనందంగా నవ్వేదాన్ని. కొన్నిసార్లు పాప మాట్లాడేది. కొన్ని ప్రశ్నలు వేసేది. నా పేరు మిలి అని చెప్పాను. తన పేరు స్వీటీ అని చెప్పింది. మా పరిచయం మంచి స్నేహంగా మారింది. తన మాటలు నన్ను ఓదారుస్తున్నట్లుగా ఉండేవి.

* * *

          కలబాష్ కాయ బాగా పెరిగిపోయి రాత్రుళ్ళు ఇంటిని చీకటి కమ్ముకున్నట్లు ఉండేది. రాత్రుళ్ళు ఎంత పాడినా అతను బయటికి రావట్లేదు. ఇక్కడ ఈ ఇంటిలో ఉండాలనిపించట్లేదు. నా స్నేహితులు గుర్తొచ్చారు. ఈ కొండ లేతాకుపచ్చగా చిగురులు తొడుగుతూ పొద్దున్నే పొగమంచు చుట్టుకొని గుంభనంగా ఉన్నప్పుడు దీన్ని ప్రేమించి ఏకాంతం కోసం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులతో నిండి ఉంది. ఒంటరిగా ఈ కొండపైన ఉండటం ప్రశ్నార్థకంగా ఉంది. అతను పూర్తిగా నన్ను పట్టించుకోవడం మానేసాడనిపించాక చాలా దుఃఖంగా అనిపించింది. ఎంతో ప్రేమించిన ఏకాంతం ఇప్పుడు ఒంటరి తనమై వేధిస్తోంది.

* * *

          ఆ రాత్రి ఆకాశం లేత గోధుమరంగులో ఉంది. చంద్రుడు వెన్నెలంతా తాగి మత్తుగా ఊగుతున్నట్లుంది. నేను సన్నగా పాడుతూ తొంగిచూసాను ఆ ఇంటివైపు. ఆ బాల్కనీలో ఎవరూ నీడలా తచ్చాడారు. ఉత్సాహంగా బయటికి వచ్చాను, అతను వచ్చాడేమోనని.  బొమ్మ నీడ కనపడింది, పాప అని అర్థమైంది. ఆ సమయంలో పాప అక్కడికి రావడం విచిత్రంగా అనిపించింది. తను నెమ్మదిగా బాల్కనీ రైలింగ్ పట్టుకొని పైకి ఎక్కింది. ముందుకి వంగింది. తనేంచేస్తోందో అర్థం కాలేదు. గట్టిగా అరుస్తూ ఆగమని పాప వైపు ఒక్కసారిగా దూసుకువెళ్లాను. కీచుగొంతుతో గోలగోలగా అరిచాను. పాప నవ్వుతూ నావైపు చూస్తోంది.

          ఆ గొడవకి అతను, ఆమె పరిగెత్తుకు వచ్చారు. పాపని పట్టుకున్నారు గట్టిగా. పాప నావైపు వేలెత్తి చూపుతూ “డాడీ! మిలి, మిలి” అని అరుస్తోంది. సంతోషంగా చప్పట్లు కొడుతోంది. “నేను చెప్పానా ఈ పిట్ట కోసమే పాప ఇలా ఎక్కింది” అని అరుస్తోంది ఆమె నన్ను చూస్తూ. నేను అతనివైపు అపనమ్మకంగా చూసాను. అతడు నా వైపు దయగా చూసి చిరునవ్వుతో నా ఎడమ రెక్కని సుతారంగా తాకాడు. మా ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ఒక్కసారి మైమరచి అతని చుట్టూ తిరిగాను. అతనికే తెలిసిన పాటని పాడుతూ ఆకాశం వైపు ఎగిరిపోయాను.

* * *

          కలబాష్ కాయ తెగిపడి ఇల్లు కూలిపోయింది. నాకిక ఆ ఇంటితో పనిలేదు. అతడు నన్ను ప్రేమించాడు ఆరాధించాడు. నన్ను చూడగానే అతని నవ్వు వెలుగుతో నిండిపోయింది. ఆ తడి తేరిన కళ్ళు.

          నేను తూర్పు దిక్కుగా బ్లాక్ నదీతీరం వైపు ఎగరడం మొదలుపెట్టాను.

          వసంత కాలం తిరిగి వస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.