ఒక్కొక్క పువ్వేసి-15

తిరిగి జైలుకు తరమాల్సిందే

-జూపాక సుభద్ర

          యిప్పుడు భారత సమాజము తీవ్ర అభద్రతకు ఆందోళనకు గురవుతున్నది. ముఖ్యంగా మహిళలు. ఈ దేశంలో మహిళలు, ముఖ్యంగా హిందూవేతర మతస్తులైన ముస్లిమ్ మహిళలు, దళిత ఆదివాసీ మహిళలు. ఒక వైపు మహిళలు శక్తి స్వరూపులు, వారి హక్కులు రక్షిస్తామనీ, బేటీ బచావో నినాదానాలను ప్రకటిస్తూ… యింకో వైపు నేరస్తుల్ని అందులోనూ, కరుడు గట్టిన నేరస్తులైన, బిల్కిస్ బానో కేసులో శిక్షలు బడ్డ నేరస్తుల్ని విడుదల చేసి, అధికార రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలే ఆ నేరస్తులకు హారతులు పట్టి, పూలదండలేసి వూరేగించడం. ‘వీరు బ్రాహ్మలు. బ్రాహ్మణులంటే సంస్కారవంతులని కితాబులివ్వడం, ఆనందోత్సవాలు జరుపుకోవడం ఏమి సూచిస్తుంది భారతదేశ మహిళా సమాజానికి,నేర సమాజానికి? అత్యాచారాలు, హత్యలు చేయడం యిక్కడ సాధారణమే, క్షమాభిక్షలు సజావుగా నేరస్తుల కిచ్చి బైటకు తీసుకురావొచ్చనేది. గుజరాత్ ప్రభుత్వము, భారత ప్రభుత్వాలు చెప్తున్నాయంటే… యిక్కడ ముస్లిమ్ లు ఆదివాసులు, దళితులు ఎంత అభద్రతకు గురవుతున్నారో తెలియ చేస్తుంది.

          గుజరాత్లో ఇరవై యేండ్ల కింద బిల్కిస్ బానో అనే ఒక ముస్లిమ్ మహిళను సామూహిక అత్యాచారం చేసి తన చంటి బిడ్డను నేలకేసి బాది చంపి, ఆమె కుటుంబ సభ్యుల్ని పద్నాలుగు మంది మీద అత్యాచారాలు, హత్యలు చేసి చంపేసిన కేసులో పదకొండు మంది నేరస్తులుగా ఋజువై యావజ్జీవ కారాగార శిక్షలు పడినయి. యిదంతా బిల్కిస్ బానో, ప్రగతి కాముక ఎన్జీవోల సహకారంతో దాదాపు ఇరవై యేండ్లు పోరాడితే… అనేక బెదిరింపులు ఎదుర్కొని నిలబడితే, పౌర సమాజాల నుంచి తీవ్ర వ్యతిరేకతల నడుమ కోర్టులకు న్యాయం చేయాల్సిన తప్పని పరిస్థితుల్లో ఆ బ్రాహ్మణ ” సంస్కారవంత ” నేరస్తులకు యావజ్జీవ శిక్ష వేయడం జరిగింది. వీరు ’బ్రాహ్మణ సంస్కారవంతులు’ కాకుంటే, పోలీసులె కాల్చి చంపేసేవారు లేదా వురేసేవారు. ‘బ్రహ్మణ హత్య మహాపాపం’ అనే మను సూత్రంచే వారికి కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. 2002 గుజరాత్ లో హిందూ మతోన్మాద మూకలు ముస్లిమ్ ల యిండ్లు, దుకాణాలు ధ్వంసం చేసి వారి మహిళల్ని అత్యాచారం చేసి చంపేసిన హత్యాకాండలు చేసిన వారు చాలా మందికి శిక్షలు పడలే. సజావుగా తప్పించుకొని ‘జై భజరంగభళీ’ గా వూరేగు తున్నారు. గుజరాత్ ముస్లిమ్ ల మీద హిందుత్వ మూకలు చేసిన హత్యలు, అత్యాచారాల దమనకాండలు తార్కాణం. వారికి ముస్లిమ్ పట్ల ఎంత ద్వేషముందో! ప్రభుత్వాలే భారత రాజ్యాంగ విలువలకు సౌభ్రాతృత్వాలకు లౌకిక సూత్రాలకు కట్టుబడకుండా మనువాదమునే రాజ్యాంగంగా అమలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. హిందుత్వమే ఏకత్వమ్ ఒకే జెండా, ఒకే మతము’ అని దాడులు చేస్తున్నారు. భారతదేశమ్ భిన్న మతాల కూడలి, భిన్న సంస్కృతుల అస్తిత్వమ్. హిందుత్వమ్ రాజకీయాధికారమై కూచుంది. అందుకే రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య విలువ ల్లేకుండా కుల విద్వేషాల్ని,మతవిద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రణాళికతో నడుస్తున్నది. గుజరాత్ లాంటి హత్యాకాండల్ని జరిపించినది. మహిళలు పూజనీయులు, నారీశక్తి, మహిళా శక్తి వారి హక్కులను రక్షణ కల్పిస్తామని స్వాతంత్రదినోత్సవ సాక్షిగా వాగ్దానం చేసి, మహిళలను అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తుల్ని విడుదల చేయడం మహిళా రక్షణా!? గుజరాత్ గవర్నమెంట్ ను నడిపే వాళ్లు ‘ బ్రాహ్మణులు సంస్కార వంతులు అందుకే విడుదల చేశా’ మని చెప్పడం అంటే శూద్రులు, దళితులు కుసంస్కారులు అని చెప్పడం కాదా !? బ్రాహ్మణులు ఎంతటి నేరం చేసినా శిక్షించ కూడదు. శూద్రులు చిన్న నేరం చేసినా శిక్షార్హులు అనే మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నారు కదా? యిట్లాంటి పాలన వల్ల, ధర్మాల వల్ల పౌరులందరికీ ఒకటే న్యాయం, చట్టం ముందు అందరూ సమానులనే రాజ్యాంగ మౌలిక సూత్రాలను పక్కన బెట్టి, మను ధర్మాన్నే కొనసాగిస్తున్నారు అని అనుకోవచ్చు. ప్రభుత్వాలే ప్రజాస్వామ్యాన్ని, పౌరులు, మహిళల హక్కుల్ని ఉల్లంఘిస్తే, భారత పౌర సమాజానికి భద్రత రక్షణ ఏమైపోతుంది?

          భారత పౌర సమాజం అంతా తిరిగి ఆ పదకొండు మంది నేరస్తుల్ని జైలుకు పంపితే గానీ, వారికి చట్టం పట్ల ఒక గౌరవం, నమ్మకం ఏర్పడదు. మతోన్మాద ప్రభుత్వాలు మహిళా వ్యతిరేక విధానాలనే అమలు చేస్తున్నారు. రేపిస్టు ఉన్నావ్ ఎమ్మెల్యేని రక్షిస్తుంది. ఒక ఎనిమిది సంవత్సరాల ముస్లిమ్ అమ్మాయిని గుడిలోనే హత్యాచారం చేసిన పూజర్లను కాపాడ్డం కోసం, బీజేపీ ఎమ్మెల్యేలు ర్యాలీలు చేసి మద్దతు తెలిపారు. యిప్పుడు బిల్కిస్ బానో చంటి బిడ్డతో గర్భవతిగా వున్న ఒక ముస్లిమ్ మహిళ అయినందుకే ఆమెను, ఆమె కుటుంబాన్ని అత్యాచారం చేసి చంపిన సంస్కార వంతమైన బ్రాహ్మణులకు యావజ్జీవ శిక్షలు పడిన ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి, వారిని సత్కరించి, సన్మానం చేయడమంటే, ఈ  దేశమేకాదు, ప్రపంచమే ఆందోళన చెందు తున్నది.

          నేరస్తులకు భరోసా నిచ్చి, విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వము వెంటనే వారిని తిరిగి ఖైదు చేయాలని మానవ హక్కుల సమాజాలు, పౌర సమాజాలు,మహిళా సమాజాలు కోరుతున్నవి, యిప్పటికే ఆరువేల మంది పౌరులు, మహిళా సంగాలు, హక్కుల కార్యకర్తలు సుప్రీం కోర్టుకు లేఖ రాసిండ్రు. యింకా యిద్దరు మహిళా సంఘ నాయకులు వారిని తిరిగి జైలుకు పంపాలి, యావజ్జీవశిక్ష కొనసాగించాలి అని సుప్రీం కోర్టులో కేసు వేశారు.

          బిల్కిస్ బానో ఈ నేరస్థులు విడుదల విషయం తెల్సి తిరిగి ఆత్మరక్షణలో పడి, బతుకు భయంతో, తనున్న వూరి నుంచి వెళ్లి పోయింది. ఆమె ఆరేండ్లు పోరాడి 2008 లో శిక్షలు పడేట్లు చేస్తే…. నేరస్తులు ప్రభుత్వ మద్దతుతో, ఆదరణతో, సత్కారాలతో విడుదలైన విషయం తిరిగి ఆమెను అభద్రతా జీవితంలోకి నెట్టింది. బిల్కిస్ బానో కు అనేక మానవ హక్కులు సంగాలు, మహిళా సంగాలు, పౌర సమాజాలు మద్దతుగా నిలవడం, ఆమె తరపున సుప్రీం కోర్టులో కేసులు వేయడం మానవీయత. నిజానికి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించి, అత్యాచారం, హత్యలు చేసిన నేరస్తుల్ని విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసి, చర్యలు తీసుకొనాల్సి వుండె, నేరస్తుల్ని వెంటనే తిరిగి జైలుకు పంపాల్సి వుండె . కానీ సుప్రీం కోర్టు నుంచి యిదేమి జరగలే. యిప్పటికైనా కోర్టులు స్పందించి, బిల్కిస్ బానో నేరస్తుల్ని యావజ్జీవ ఖైదీలుగా జైలుకు పంపిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల, చట్టాలు, కోర్టుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.