నిష్కల – 28

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: నిష్కల, సారా ఒకే తండ్రి బిడ్డ లేనన్న ఎరుకలోకి వచ్చారు. కొన్నాళ్ల ఎడబాటు తరువాత నిష్కలను చేరిన అంకిత్. లోలోన అనేక అగాధాలు, సుడిగుండాలు చుట్టుముట్టిన జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శోభకు కూతురిని జంటగా చూడాలని ఆశ. పెద్దకొడుకు జ్ఞాపకాల్లో అతని చూపుకోసం ఎదురుచూసే నిష్కల నానమ్మ సుగుణమ్మ

***

          ఆ రోజు ఉదయం త్వర త్వరగా తయారవుతున్న కోడలిని గమనిస్తూనే ఉన్నది సుగుణమ్మ. కోడలితో మాట్లాడాలని ఆమె గత రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నది.  
ఒకరోజు తోటి పిల్లల వేధింపుల గురించి ఎవరికీ చెప్పుకోలేని కాలేజీ అమ్మాయి లేఖ రాసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని వెళ్ళింది. మరుసటి రోజు కూడా అటు వంటిదే ఏదో సంఘటన..  క్షణం తీరికలేదు. వాటివల్ల వీసమెత్తు సంపాదన లేదు అన్నట్లున్నది కోడలు వ్యవహారం. పైగా అటు తిరిగి ఇటుతిరిగి ఖర్చు అని అప్పుడప్పుడు గొణుక్కుంటూ ఉంటుంది సుగుణమ్మ. గట్టిగా ఏమన్నా అందామని నోటి దాకా వచ్చినా దాని పీక నొక్కేస్తున్నది. ఒక వేళ తన పెద్దరికాన్ని ప్రశ్నిస్తే, తనను దూరం చేస్తే  అన్న భయం ఆమెలో.. 
 
          శోభకు తండ్రి ఇచ్చిన ఆస్తి, నిలకడైన ఆదాయం లేకపోతే, అత్త మీద ఆధారపడితే పరిస్థితి ఎలా ఉండేదో..!
 
          మేనత్తయినా సొమ్ము దగ్గర చాలా గట్టిది సుగుణమ్మ. పెద్ద కొడుకు వాటాగా వచ్చిన పొలం నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోనిశోభను ఏమనలేక మిన్నకుండి పోతుంది.  అదీకాక కడుపున పుట్టిన వాళ్ల కన్నా బాగా చూసుకుంటున్నదని కృతజ్ఞతాభావం కూడా ఈ మధ్య కలుగుతున్నది. 
 
          ఒకప్పడెంత ఘరానాగా  ఉండేదనీ.. ముత్యాల్లాంటి ముగ్గురు కొడుకులు, ఆకాశాన ఉన్న అన్న, పల్లెత్తి మాట అనని భర్తను చూసుకుని ఎగిరిపడుతూ ఉండే సుగుణమ్మ గురించి అప్పుడు ఆమె చుట్టుపక్కల వాళ్లకు, బంధువులకు బాగా తెలుసు. ఇప్పటి సుగుణమ్మ గురించే వాళ్ళెవరికీ ఏమీ తెలియదు. కొందరు బంధువులు మాత్రం ముగ్గురు కొడుకుల్ని చూసుకుని నేలమీద నడవని సుగుణమ్మ కోడలు దగ్గరకు చేరాక ఆ పొగరు, అతిశయం తగ్గిందనీ, కాస్త సాత్వికంగా మారుతున్నదనీ అనుకుంటూ ఉంటారు. శక్తి తగ్గి కోడలి పై ఆధారపడడం వల్లనా లేక  శోభ చేసే పనుల వల్లనా అని ఆలోచన చేస్తూ ఉంటారు. 
 
          ఏదైతేనేం ఆమెలో చెప్పుకోదగిన మార్పు మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. మనిషి స్వభావాన్ని పరిస్థితులే దిద్దుతాయేమో! పరిస్థితులకనుగుణంగా మనిషి తనను తాను మలుచుకుంటాడేమో! లేకపోతే బతుకు దుర్భరం అయిపోదూ..  
 
          అత్తాకోడళ్లు ఇద్దరు ఉదయం కలిసే కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తారు. ఆ తర్వాత సుగుణమ్మ కాసేపు ఏదో ఒక పుస్తకం తిరగేసేది. ఇప్పుడు అలా చదవలేక పోతున్నది. కోడలుతో ఏవో పాటలు పెట్టించుకుని వినడమో, టీవీ ముందు కూర్చోవడమో చేస్తున్నది. శోభ వంట పూర్తి చేసి అన్నీ టేబుల్ మీద సర్ది శోభ పనుల మీద బయటికి వెళ్లి పోతుంటుంది. మధ్యాహ్నం పన్నెండున్నరకు భోజనం చేసి రెండింటి వరకు టీవీ ముందు కాలక్షేపం చేసి తన రూంలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది సుగుణమ్మ.  సాయంత్రం సుగుణమ్మ పెందలకడనే భోజనం చేసి టీవీ ముందు కూర్చుంటుంది. శోభేమో ఎనిమిది దాటినాక కానీ తినదు. 
 
          ఎప్పటి కంటే కాస్త ముందుగానే ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర చేరింది సుగుణమ్మ. ఆమె కూర్చున్న చోటుకు హలో టీవీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పటి వరకు టీవీ ఛానల్స్ ఏవి తిప్పినా అదే వార్త . నాటు నాటు అంటూ .. సంబరంగా .. ఆనందోత్సాహాల తో.. 
 
          అదేమంత ఆసక్తిగా అనిపించలేదు ఆమెకు. 
 
          నిన్న మొన్న ఆమెను అరెస్ట్ చేస్తారని కాకి గోల చేశాయి ఈ చానెళ్లు. ఆమేమో పిడికిలి బిగించి పైకి లేపి నవ్వుకుంటూ ఇంటికి పోయింది. ఇవ్వాళ ఈ గోల మొదలైంది.  ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ చూస్తూ విసుక్కుంది సుగుణమ్మ. 
 
          కోడలు వంట కూడా సిద్ధం చేసింది.  కిచెన్ లోంచి తెచ్చి అన్ని టేబుల్ మీద చకచకా సర్దుతున్నది.  అంటే ఇప్పుడే బయటికి పోతుందని ఆమెకు అర్థమయింది.  రెండు రోజులుగా కోడలితో మాట్లాడనే లేదు.  ఊరందరి బాధలు నెత్తిమీద వేసుకుని తిండి కూడా సరిగా తినలేదు. 
 
          పోనీలే, చుట్టుపక్కల గ్రామాల్లో ఆపదలో ఉన్నవారికి ధైర్యం చెప్పే దిక్కయింది.  తన లోపలి దుఃఖాన్ని, బరువెక్కిన గుండె భారాన్ని ఇతరుల భారం దించడం ద్వారా తగ్గించుకుంటున్నదని అనుకుంటే తిండీ తిప్పలు కూడా పట్టించుకోకపోతే ఎట్లా అను కుంది సుగుణమ్మ.  
 
          ఒక్కోసారి కోడలి పనులకు కోపం వస్తున్నది. ఊరందరి బాధలు పట్టించుకునే కోడలు తన గోడు వినిపించుకునే స్థితిలో లేదని ఆమె అసహనం. పూరీలు , ఆలుగడ్డ కూర వేసి ప్లేట్ ముందు పెట్టి మంచినీళ్లు అత్తగారికి అందించింది శోభ. 
 
          మూడు రోజులుగా పెద్ద కొడుకు ఆలోచనతో కంటికి కునుకు రావడం లేదు. పెద్ద కొడుకు రూపమే కండ్ల ముందు కదలాడుతున్నది. చిన్న వాళ్లిద్దరికీ ఫోన్ చేసి పెద్ద కొడుకుతో మాట్లాడమని చెప్పాలి. 
 
          పెద్ద అన్నను చూడాలని నా ప్రాణం కొట్టుకుంటుంది. ఎంత ప్రేమగా ఉండేవాడు.  నన్ను ఒక్క మాట అననిచ్చేవాడు కాదు. అలాటిది అసలు మాట పలుకు లేకుండా ఏండ్లకు ఏండ్లు .. కళ్ళొత్తుకుని, నిషి శ్రద్ధ తీసుకుంటే అమెరికాలో ఉన్న తండ్రిని తెచ్చి నీ ముందు నిలబెట్టగలదు. అని మొన్న కూతురు చెప్పినప్పటి నుంచి నిషితో మాట్లాడా లని ఆమె ఆరాటం. 
 
          శోభ ఇంట్లో ఉంటేగా మాట్లాడడానికి. కూతురుతో కూడా మాట్లాడుతుందో లేదో .. 
ఆ విషయం శోభతో మాట్లాడడానికి ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తూ .. టీవీ వైపు చూస్తూ అన్యమనస్కంగా ఉన్నది సుగుణమ్మ. 
 
          అత్త ఏదో చెప్పాలనుకుంటున్నదని శోభకు అర్థమయింది. 
 
          ఏంటత్తా ..  ఏమిటంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు అడిగింది.  
 
          “ఆ.. ఏం లేదు. తరగని ఆస్తులున్నా ఇంకా కోట్లకు కోట్లు కావాలని ఆరాటం ఎందుకో ..  పోయేటప్పుడు మూట కట్టుకుపోతారో ఏం పాడో ..  జైల్లో వేయలేదు కానీ.. వేస్తే ఇజ్జత్ ఉంటదా? ఇప్పటికే లోకమంతా అదే ముచ్చట చెప్పుకుంటున్నారు. ఎంత నామర్దా .. ” అన్నది సుగుణమ్మ వార్తల చానళ్ళు చూసి రాజకీయాలు బాగానే  ఒంటబట్టించు కుంటున్నది అత్త అని లోనే నవ్వుకుంది. 
 
          అత్త ఎవరిని ఉద్దేశించి అంటున్నదో శోభకు అర్ధమైంది. “సొమ్మంటే చేదెవరికి అత్తా” అన్నది, అత్తకి డబ్బుల పై ఉన్న మక్కువను తెలిసిన శోభ. 
 
          “ఏమన్నా ఒళ్ళు కరిగించి చెమట చిందిన సొమ్మా..  కాలుమీద కాలేసుకు కూర్చున్నా తరగంత కూడ బెట్టింది. ఇంకా ఏం చేసుకుంటదో.. ఇంత బతుకు బతికి నలుగుర్లో నవ్వుల పాలాయె…”  నోట్లో పూరి ముక్క పెట్టుకుంది “విచారణకు పోయింది.  నేరం రుజువు అయితే కదా జైలు .. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు ఇవన్నీ మామూలే అత్తా”  తింటూన్న శోభ 
 
          “ఏమోనే.. నాకైతే ఏం మంచిగా లేదు. ఆడవాళ్లంటే ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు పొంగు కొచ్చిందా.. పోయిన దఫా తండ్రి కొలువులో ఒక్కళ్ళంటే ఒక్క ఆడామె లేనప్పుడు నోరులెగవలె.. అప్పుడు తెల్వదా? ఇప్పుడున్న ఆ ఇద్దరు వేరే పార్ట్లీలలోంచి తీసుకున్న వాళ్లేనాయే.. వాళ్లకు తప్పనిసరి అయి ఇచ్చినవేనాయే.. ఆడోళ్ళంటే ప్రేమతో ఇచ్చినవా..నిజంగా ఆడవాళ్లను మగవాళ్ళతో సమానం చూసే వాళ్లయితే ఎన్నికలప్పుడే మగవాళ్ళతో సమంగా కాకపోయినా కనీసం మూడొంతుల సీట్లయినా ఇచ్చేవాళ్ళు” అన్నది 
 
          “అత్త రాజకీయ జ్ఞానానికి అచ్చెరువొందుతూ “అదంతా ఆమె చేతిలో ఉన్నదా “శోభ 
“మనసుంటే మార్గం ఉంటది.  అప్పుడైనా మనసుతో కాదు ఈడీ పిలుపు ఉన్నదని జనం దృష్టి మరల్చడానికే ఈ యవ్వారమంతా అని నాకే తెలిసి పోయింది. ఇక జనానికి తెల్వదా?”
 
          ఆమెను ఏదో అన్నాడని ఈ పార్టీ రంగు కండువాలు రోడ్డెక్కి హంగామా చేస్తున్నారు. లొల్లి లొల్లి చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. మంచిదే. ఎవరైనా నోరు దగ్గర పెట్టు కుని మాట్లాడాలి నిజమే. కానీ ఆమె ఒక్కటే మహిళా… వాళ్ళ వాళ్ళు ఒక ఆడ ఆఫీసర్ను మీటింగ్ లో మంత్రి అన్నప్పుడు అది తప్పుగా కనపడలేదే.. అప్పుడు ఇప్పుడు అదే భాష” సుగుణమ్మ .  
 
          “మన భాష, యాస సంస్కృతి తప్పు కాదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళది తప్పు.” శోభ 
 
          కోడలు పెట్టిన మరో పూరీ ముక్కకి ఆలుగడ్డ కూర అద్దుతూ ఇదేంటి నేను అసలు విషయం మాట్లాడకుండా ఏదేదో మాట్లాడేస్తున్నాను అట్లయితే శోభ బయలుదేరి పోతుంది అనుకున్నది సుగుణమ్మ. అప్పటికే శోభ టిఫిన్ చేయడం పూర్తి కావస్తున్నది ఎలా చెప్పాలా అని కోడలు కేసి చూస్తున్నది. 
 
          అత్త సమాజాన్ని బాగానే పట్టించుకుంటున్నదని అర్ధం చేసుకుంటున్నదని సంతోష పడింది శోభ. 
 
          “నిషి ఫోన్ చేసినట్లు లేదు ” మాట మారుస్తూ మెల్లగా సుగుణమ్మ “రాత్రి మాట్లాడింది”. 
 
          “ఇవ్వాళ ఫోన్ చేస్తే నాకు చెప్పు. నేను దానితో మాట్లాడాలి “
 
          “రెండు మూడు రోజులు చాలా బిజీగా ఉంటాను. ఫోన్ చేయగలనో లేనో అన్నది “
ఆలోచనలో పడింది సుగుణమ్మ. శోభతో చెబితే ఏమంటుంది. ఏమనదులే .. ఈ తల్లి మనసుని అర్థం చేసుకుంటుంది. అని తనకు తాను చెప్పుకుని కోడలి కళ్ళలోకి చూస్తూ నేను బతికుండగా నా పెద్ద కొడుకుని చూడగలనా ..  నేను చచ్చిపోయినా వస్తాడో రాడో .. 
ఒక్కటా రెండా ఇరవై ఐదేండ్లు దాటిపోయే.. మీ మామ దినాలకు రావటమే .. మళ్ళీ ఇటు దిక్కు చూడలేదు.” నీళ్లింకిన కళ్ళొత్తుకున్నది సుగుణమ్మ 
 
          “అత్తా .. ఎందుకంత బాధపడతావ్..  కొడుకని నీకేనా.. తల్లి అని అతనికి కూడా ఉండాలి కదా .. అది లేనప్పుడు ఎంత బాధ పడి ఏం లాభం?” 
 
          తలదించుకుని కూర్చున్న అత్తను చూస్తే శోభకు మనసంతా దిగులుగా ఉంది. నిర్మలాకాశంలో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్మేసినట్టుగా తోచింది. ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలదు. చేతనైనంత వరకు ఆమెను బాధపెట్టకుండా చూడగలదు. కానీ రాని కొడుకును తెచ్చివ్వలేదు కదా.. అని లోలోన మదన పడింది శోభ. 
 
          నిశి ఫోన్ చేస్తే చెప్పాలి. తండ్రి జాడ తెలుసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసుకోమని చెప్పాలి. పండుటాకు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఆమెను తృప్తిగా ఉంచాలంటే ఆమె కొడుకు జాడ కోసం ప్రయత్నించడం తప్పనిసరి.  చిన్న బావలిద్దరికి కూడా చెబితే వాళ్ళు ఏమైనా అతనికి చెప్పగలరేమో అని ఆలోచిస్తూ బయటకు నడిచింది శోభ. 
 
***
 
          “జీవితంలో మధురమైన భావనలు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడానికి, తిరిగి జీవించడానికి ఈ  రోజు లాంటి రోజులు కావాలి నిషీ.. మనం కాలిఫోర్నియాలో ఉన్నప్పటి రోజులు మళ్ళీ వస్తాయా.. అసలు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడచిపోయేవి ఆ రోజులు..
 
          నా జీవితంలోంచి కొన్ని రోజుల్ని ఎరేజ్ చేసేశాను. ఇంకెప్పుడు అటువంటి రోజులు రాకూడదని కోరుకుంటున్నా’ నిషి ఒళ్ళో తల పెట్టుకుంటూ అంకిత్ ఏది జరిగినా మన మంచికే అని చెబుతుంది అమ్మ ఎప్పుడూ.. నిజమేనేమో.. నేను చాలా నేర్చుకున్నాను.  ముఖ్యంగా మనుషులను చదవడం బాగా నేర్చుకున్నాను. ఈ కాలంలోనే నాకో అపురూప మైన కానుక దొరికింది… “
 
          నిశి మాటలు వినిపించుకోకుండా ” గడచిన కాలంలో అన్నీ నెమరు వేసుకోలేం. కొన్ని మాత్రమే.. ”  
  
          ‘అవునవును, ఓ ఆవును తెచ్చిస్తా.. దానితో జత కలిసి నెమరు వేసుకుంటూ  జీవితాంతం మర్చి పోలేనంత మధురానుభూతులు మిగుల్చుకో..  ‘ నవ్వింది నిషి 
ఆ నవ్వులో శృతి కలిపిన అంకిత్. 
 
          రోజూ అయితే నిషి ఆఫీసు నుండి ఇంటికి వచ్చే సరికి అంకిత్ జిమ్ కి వెళ్ళి పోయాడు. ప్రతిరోజు క్రమశిక్షణాయుతమైన దినచర్య అతనిది. నిషి తనకు ఎపుడు ఏది చేయాలనిపిస్తే అప్పుడు చేస్తుంది. ఇద్దరం ఒకేసారి వెళ్లి వచ్చేలా సమయం దొరుకు తుందేమో చూద్దాం అనుకున్నారు కానీ అట్లా కుదరలేదు. నిషి ఎక్కువగా వీకెండ్స్ లో జిమ్ లో గడుపుతుంది. ఒక ప్రత్యేకమైన సమయం అంటూ లేదు. జిమ్ పెద్ద దూరం లేదు ఐదు నిమిషాల దూరమే. 
 
          ఈ రోజు నిషి కొద్దిగా ముందు వచ్చింది ఇంటికి. అంకిత్ తన పని పూర్తి చేసుకుని జిమ్ కి వెళ్లే ముందు ఓ స్మూతీ చేసుకున్నాడు. అంతలో వచ్చిన నిషికి అది షేర్చేసాడు. 
తరువాత తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడతను మొదట్లో తన అంకిత్ ఎలా ఉన్నాడో అట్లాగే ఉంటున్నాడు. ఎందుకిలా చేశావ్, ఇన్నాళ్లు ఏమైపోయావ్? ఎక్కడున్నావ్ అని నిషి అడగ లేదు. నిష్కలకు అతని సంజాయిషీ అవసరం లేదు. 
 
          ప్రతి వారికీ పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్, సీక్రెట్ లైఫ్ ఉంటాయని ఆమె నమ్మకం. వాటిలోకీ ఇతరుల చొరబాటు తగదని ఆమె విశ్వాసం. అతను చెప్పడానికి ప్రయత్ని స్తున్నాడని అర్థమవుతున్నది. ఎలా చెప్పాలో చెబితే నిష్కల ఎట్లా తీసుకుంటుందోనన్న ఆందోళన అతన్ని కలవరపెడుతున్నదని నిషికి అర్ధమవుతున్నది.  
 
          అంకిత్ గురించి సారాకి తెలియదు. ఫోన్ చేసి ఈ వారాంతంలో వాళ్ళ అమ్మను తీసుకుని లంచ్ కి రమ్మని చెప్పాలని ఆలోచన చేస్తున్నది నిష్కల. ఇంతలో ఫోన్ మోగింది. 
 
          చూస్తే అత్తగారు. అత్తగారు అనొచ్చా .. సహజీవనంలో ఉంటే సహచరుడి తల్లి ఏమవుతుంది? అత్తగారే కదా..!
 
          సహజీవనం ప్రకటించిన మొదట్లో ఆవిడ ఒకసారి తనకు ఫోన్ చేసింది. అప్పుడు ఆవిడలో కొడుకు చేసిన పనిపట్ల అసంతృప్తి కనిపించింది. మళ్లీ ఇప్పుడు. 
 
          నా దగ్గరకు తిరిగి వచ్చిన అంకిత్  మీద కోపంతో, నా మీద ద్వేషంతో ఉన్నదేమో.. 
గతంలో కూడా ఆవిడ అప్పుడప్పుడు ఫోన్ చేసేది. అంకిత్ దూరం అయ్యాక మొదటి సారి ఆవిడ నుంచి ఫోన్. 
 
          కాల్ తీసుకోవాలో వద్దో క్షణకాలం ఆలోచించి తీసుకుంది.  
 
          తమ పెద్దరికానికి గుర్తింపు లేకుండా, కట్నకానుకలు లేకుండా సహజీవనంలోకి అడుగు పెట్టిన కొడుకు పై ఏ భారతీయ తల్లి అయినా కోపగిస్తుంది. కొడుకు పెళ్లి చుట్టూ ఆ తల్లి అలుకున్న ఆశలు, ఊహలు అన్నిటిని పక్కకు ఈడ్చి పారేయడంతో పాటు, తన కొడుకు దూరంగా జరిగిపోతున్నాడన్న అసహనం ఆ తల్లి మాటల్లో ఉంటే అది ఆమె తప్పు కాదు. అందుకు ఉక్రోషపడ కూడదు. ఆవేశపడ కూడదు. ఏ తల్లయినా తల్లే కదా .. 
 
          భర్త దాష్టీకానికి చాలా బాధపడిందని గతంలో అంకిత్  చెప్పిన విషయం గుర్తొ చ్చింది. అమెరికా చేరే నాటికి ఆమె డిగ్రీ చదువుతున్నది. చదువుతో పాటు, తన వాళ్లందరినీ వదిలి భర్త చేయి పట్టుకుని సప్తసముద్రాలు దాటుకొచ్చింది. ప్రేమగానే చూసుకుంటాడు, బోలెడు నగలు బట్టలు హ్యాండ్ బ్యాగులు ఇలా అన్ని తెచ్చిపడేస్తాడు. రకరకాల మేకప్ సామాగ్రి ఇది కావాలని అడగకుండానే తెచ్చేస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేకుండా తన ఇష్టం వచ్చినట్లు ఉండమంటాడు. ఆమె మాటకు విలువ ఇవ్వడని అంకిత్ ఏదో సందర్భంలో చెప్పాడు. 
 
          అందుకే అంకిత్ కి చిన్నప్పటి నుంచి ప్రేమించడం నేర్పింది. తోటివారితో ఎలా ఉండాలో నేర్పింది. మరొకరిని ఇబ్బంది పెట్టకుండా కించ పరచకుండా ఉండాలని చెప్పేది. ముఖ్యంగా ఆడవాళ్ళని ఎలా ప్రేమించాలో నేర్పింది. అలాంటి అమ్మ తన సహజీవనాన్ని ఎందుకు అంగీకరించలేక పోతున్నదో అర్ధం కావడం లేదని అంకిత్ బాధపడటం తెలుసు. 
 
          ఒక్క క్షణంలో రకరకాల ఆలోచనలు చుట్టూముట్టుతుండగా  “హలో ” అన్నది నిష్కల. 
 
“సారీ అమ్మా.. 
 
          నీతో ఎప్పుడో మాట్లాడి ఉండాల్సింది. నా కూతురు అయితే ఇట్లాగే ఉండగలిగే దాన్నా.. అని చాలా సార్లు నాకు నేనే ప్రశ్నించుకున్నాను. నా కొడుకు అని కాదు కానీ అంకిత్ చాలా మంచివాడు తల్లీ.. నీవంటే ఆకాశమంత ప్రేమ. అది నాకు బాగా అర్ధ మైంది. నిన్ను ఒకసారి కలవాలని ఉంది. వీలు చూసుకుని ఇద్దరూ ఇంటికి రండి అని చెప్పి పెట్టేసింది ఆవిడ. 
 
          నిష్కలకి అదంతా కలో నిజమో అర్ధం కానట్లుగా ఉంది. ఆవిడ సారీ చెప్పడమే పెద్ద వింతగా తోచింది. 
 
          సహజీవనం చేస్తున్నాని చెప్పిన కొడుకు ఇంటికి ఒక్కడే వచ్చినప్పుడు మొదట సంతోష పడినప్పటికీ తర్వాత ఆలోచించడం మొదలు పెట్టిన ఆ తల్లి ఆడవారిని గౌరవించడం, ప్రేమించడం ఒక్కటే కాదు వారిని గౌరవించడం తమతో సమంగా చూడడం నేర్చుకోవాలని చెప్పింది. ప్రేమ ఒక్కరిది కాదు ఇద్దరిదీ. నేర్చుకుంటే అందరిదీ. ప్రేమించే వ్యక్తిని అహంతో దూరం చేసుకోవడం కాదు లోపలున్న ప్రేమను తట్టి లేపి మరింత ప్రేమను పంచమని ఉద్బోధించింది. కోపతాపాలు వద్దని ఉన్నతమైన మనిషిగా బతకమని సూచించింది. 
 
          అందరం మనుషులమే. కానీ ఎవరి బలాలు, బలహీనతలు, బేషజాలు వారివి. ఇద్దరూ ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరు కలిసి జీవితం పంచుకుందా మనుకున్నాక కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి. కాదనుకుని వదులుకోవడం సరైనది కాదు. అది మన సంప్రదాయం కాదు . 
 
          అయితే, ఒకరినొకరు భరించలేని స్థితిలో ఉంటే ఎవరికి వారు బతకొచ్చు. కానీ మీ బంధం మీకు గుదిబండ కాదని నాకు అర్ధమవుతున్నది. ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో నాకు తెలియదు కానీ నీవు నీ స్వేచ్ఛ నీవు తీసుకుంటూ ఆమె స్వేచ్ఛకు గుదిబండలాగా మారుతున్నావేమో అని నా సందేహం.  
 
          నా లాగా ఈ కాలం ఆడపిల్లలు సర్దుబాటు చేసుకుని బంధంలో ఉండలేరు. అందు లో నిష్కల వంటి స్వతంత్ర భావాలున్న వాళ్ళు తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే అసలు భరించలేరు.  
 
          ఏమైనా నేను ఇక్కడ ఉండి చెప్పటం కాదు. నీకే ఆ అమ్మాయి గురించి బాగా తెలుసు. పంతాలు, పట్టింపులు కాదు. ఆలోచించు నీకే అర్థమవుతుంది. మీ జీవితం ఎలా ఉండాలో మీరే కస్టమైజ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ పరిష్కారాలు ఉండవని గుర్తుంచుకో. 
మగవాళ్లకంటే స్త్రీలు తన స్వాభిమానాన్ని కాపాడుకోవడానికి, వ్యక్తిత్వాన్ని నిలుపు కోవడానికి నానా కష్టాలు పడాల్సిన పరిస్థితులు. ఎన్నో సవాళ్లు,వివక్షతలను ఎదుర్కొంటు ముందుకు నడుస్తున్నాం.  
 
          స్వతంత్ర భావాలు , ఆదర్శ, ఆధునిక భావాలూ కలిగిన అమ్మాయి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ పురుషాధిక్య సమాజంలో బతకడానికి నానా యాతనలు భరిస్తుంది అది మీకు అర్ధం అవుతుందో లేదో .. అర్ధమయినా అర్ధం కానట్లు ఉంటారో .. 
 
          నా పెంపకంలో ఏదో లోపం ఉన్నదని నాకు అర్థమయింది. చిన్ననాటి నుంచి నువ్వు చూసిన మీ నాన్న నీలోనూ ఉన్నదేమోనని నా సందేహం. నేనివన్నీ ఒక తల్లిగానే కాదు ఒక స్నేహితురాలిగా కూడా చెబుతున్న మాటలు. 
 
          చిన్నప్పటి నుండి మై లైఫ్ మై రూల్స్ అనేవాడివి కదా.. నీ జీవితమే.. నీ రూల్సే ..  
కాదని అనటం లేదు. నీ జీవితం పై నేను పెత్తనం చెయ్యడం లేదు. చెయ్యను కూడా. నీ నడక, నడత సరైన దిశలోనే ఉన్నదా అన్నది గమనించుకో.. అడుగు తడబడితే సరిదిద్దుకో.. అని తల్లి అన్నప్పటి నుంచి అంకిత్ మరో కోణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టాడు. 
 
          జ్ఞానోదయం అయిందేమో తాము సహజీవనంలోకి వెళ్లేముందు ఏమయితే ఒప్పందం చేసుకున్నాడో అదే విధంగా ఉంటున్నాడు. ఇదంతా నిష్కలకి తెలియదు. 
 
          కానీ ఆమె మాటలు నిష్కలలో ఉత్సాహం నింపాయి. 
 
          అంతలో బెల్ మోగడంతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయింది. 
 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.