జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10 

   -కల్లూరి భాస్కరం

          కేరళలో 1921లో తలెత్తిన ‘మోప్లా’ తిరుగుబాటు చరిత్ర ప్రసిద్ధం. అది ఎందుకు తలెత్తింది, దాని పర్యవసానాలేమిటన్నవి ఇక్కడ మనకు అవసరమైన ప్రశ్నలు కావు; ‘మోప్లా’ అనే పేరుకు గల అర్థంతోనే మనకిక్కడ సంబంధం. తమిళ/మలయాళ మూలా లున్న ‘మాప్పిల’, లేదా ‘మాపిళ్లై’ అనే మాట నుంచి పుట్టిన ఈ మాటకు ‘పెళ్లికొడు’కని అర్థం. వ్యవహారంలో ‘అల్లు’డని కూడా అంటారు.

వాస్కో డ గామా రాకతో…

          దీని వెనకాల కథ తెలుసుకోవడానికి మనం బహుశా 1498కి వరకు వెళ్ళాలి. ఆ సంవత్సరంలోనే పోర్చుగీసు నావికుడు వాస్కో డ గామా కేరళ మలబారు తీరాన్ని సందర్శించాడు. సుగంధ ద్రవ్యాలకు మారుపేరుగా మారిన మలబారు తీరానికి విదేశీ వర్తకులు రావడానికి అదొక ప్రారంభమైంది. అలా వచ్చినవారిలో సిరియన్లు, అరబ్బులు ఉన్నారు. వీరు మలబారు ఉత్పత్తులైన సుగంధ ద్రవ్యాలు, కాఫీ, రబ్బరు, కొబ్బరి, కొబ్బరి పీచు ఉత్పత్తులు మొదలైనవాటిని తమ నౌకల్లో నింపుకుని పశ్చిమదేశాల వరకూ తీసుకెళ్లి అమ్మేవారు.

పెళ్లి, విడాకులు

          ఒక్కోసారి వాతావరణం అనుకూలించనప్పుడు, ఎక్కువ రోజులపాటు మలబారు తీరంలోనే ఓడలకు లంగరేసి ఉండిపోవలసి వచ్చేది. అప్పుడు అరబ్ వర్తకులు స్వల్ప మొత్తాన్ని వధూకట్నం కింద చెల్లించి స్థానికులైన అమ్మాయిలను తాత్కాలికంగా పెళ్లి చేసుకునేవారు. వాతావరణం అనుకూలించగానే ఆ వివాహాన్ని రద్దు చేసుకుని వెళ్లి పోయేవారు. ఆ వధువులు, వారికి పుట్టే సంతానం ఇస్లాంలోకి మారిపోయేవారు. వారే మాప్పిల/మాపిళ్లై/మోప్లా అయ్యారు. ఈ విధంగా కేరళలో ముస్లిములు దాదాపు పాతిక శాతానికి విస్తరించి రెండవ అతిపెద్ద జనాభా అయ్యారు.

వాయవ్య భారతంలో జరిగిందే ఇక్కడా…

          అంటే, ఉత్తరాన ఆ కొసన ఉన్న వాయవ్యభారతంలో అతిప్రాచీన కాలం నుంచీ ఏం జరుగుతూ వచ్చిందో, దక్షిణాన ఈ కొసన ఉన్న మలబారు ప్రాంతంలో ఇటీవలి కాలంలో అదే జరుగుతూ వచ్చిందన్నమాట. మనుషుల మధ్య కలయికలను ఆపగల హద్దులేవీ లేవనడానికి ఇదొక ప్రబల నిదర్శనం. దీనినే వేరే మాటల్లో చెప్పుకుంటే, ఈ స్థానిక వధువులకు కేరళ ‘పుట్టిల్లు’ అయితే, అరబ్ ముస్లింలు కొందరికి ‘అత్తిల్లు’ అయిం దన్నమాట.

ఉమ్మడి వైఫల్యం

          ఎంతటి పేదరికం, ఎలాంటి నిస్సహాయత ఆ అమ్మాయిలను పెళ్లి పేరిట అలాంటి పెటాకులకు నెట్టిందో ఊహించగలం. వారి అవసరమూ, అమాయకత్వమే కాక, దీని వెనుక నాటి సమాజమూ, పాలకుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.ఇప్పుడు ఏ విధంగానూ దిద్దలేని ఒక చారిత్రక ఘటనగా దీనిని భావించి, మరోసారి ఇలాంటివి -ఇక్కడే కాక ఇంకెక్కడా జరగకుండా -తగిన పోలీసింగ్ జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ఈ రోజున మనం చేయగలిగింది.

పురాణ, ఇతిహాసాల్లోనూ ఉదాహరణలు

          ఎప్పుడైనా, ఎక్కడైనా సరే; వధువు సాపేక్షంగా ఉన్నచోటే, పుట్టింటే ఉంటుంది; వరుడే ఆమెను వెతుక్కుంటూ వెడతాడు. మన పురాణ, ఇతిహాస కథల నుంచి కూడా ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వచ్చు. బ్రాహ్మణులు, క్షత్రియులు ఆదివాసీ ప్రాంతాల్లోకి, అటవీ జనాల్లోకి వెళ్ళి అక్కడి స్త్రీలతో సంతానం కని, ఆ తర్వాత వారిని విడిచి పెట్టిన ఉదంతాలు అనేకం కనిపిస్తాయి.

***

          విశేషమేమిటంటే, పైన చెప్పిన కేరళకు సంబంధించిన పాక్షికచిత్రాన్నే జెనెటిక్స్ భారతదేశపు స్థాయికి పెంచి చూపిస్తుంది. దానిని బట్టి స్థూలంగా చెప్పుకోవాలంటే, భారతదేశం మొత్తం స్త్రీకి పుట్టిల్లు అయితే, చాలా మంది పురుషులకు అత్తిల్లు!

ఉపఖండానికే పరిమితమైన మైటో కాండ్రియల్

          భారతీయుల్లో తల్లుల నుంచి సంక్రమించే మైటోకాండ్రియల్ DNAలో అత్యధిక భాగం కేవలం భారత ఉపఖండానికి మాత్రమే ప్రత్యేకమని జన్యుపరిశోధకులు గుర్తించి నట్టు డేవిడ్ రైక్ రాస్తాడు. అంటే, భారతీయుల్లో మైటో కాండ్రియల్ DNA వైపు నుంచి సాంకర్యం దాదాపు లేదని దీనర్థం. భారతీయుల మైటో కాండ్రియల్ DNA రకాలు దక్షిణాసియాకు బయట ఉమ్మడి జన్యు వారసత్వాన్ని అసలే పంచుకోలేదని కాదు; కాక పోతే అది జరిగింది అనేక వేల సంవత్సరాల క్రితం! ఆఫ్రికా నుంచి వ్యాపించే క్రమంలో మాత్రమే అలాంటిది జరిగి ఉండాలి. భారత ఉపఖండంలో స్థిరపడిన తర్వాత మాత్రం భారతీయుల మైటో కాండ్రియల్ DNA ఉపఖండానికి వెలుపలి జనాలతో సాంకర్యం చెందకుండా చిరకాలంపాటు ఉపఖండానికే పరిమితమైపోయింది.

వై-క్రోమోజోమ్ కథ వేరు

          భారత్ లో పురుషుల నుంచి సంక్రమించే వై క్రోమోజోమ్ కథ దీనికి పూర్తిగా భిన్నం. ఇది తగు పరిమాణంలో యూరోపియన్లతోనూ, మధ్య ఆసియన్లతోనూ, పశ్చిమాసియన్ల తోనూ సన్నిహిత సంబంధాన్ని తెలుపుతోంది. అంటే, భారత్ వెలుపలి జన్యువారసత్వం కలిగిన మగవారికి, భారత్ లోపలి స్త్రీలకు మధ్య సంబంధం ఏర్పడిందన్నమాట.

చైనీయ కవళికలకు కారణం

          డేవిడ్ రైక్ ప్రకారం, మిశ్రమం వల్ల ఏర్పడిన విపరీతమైన వైవిధ్యం భారతీయుల రూపురేఖల్లో మామూలు కంటికే కనిపించిపోతూ ఉంటుంది. నలుపు నుంచి చామనచాయ వరకు; యూరోపియన్ కవళికల నుంచి చైనీయ కవళికల వరకు జనాలలో కనిపిస్తాయి. యూరోపియన్ కవళికల సంగతి ప్రస్తుతానికి అలా ఉంచి, చైనీయ కవళికల గురించి చూస్తే, తూర్పు ఆసియా జనాలతో అతి పురాతనకాలంలో జరిగిన సాంకర్యం ఇందుకు కారణం. నేడు దక్షిణాసియాకు బయట ఉన్న జనాలతో ఎలాంటి సంబంధం లేకుండా, అతి ప్రాచీనకాలంలో చీలిపోయి నేటి దక్షిణాసియా జనాభా పుట్టుకకు మూల మైన ఒక శాఖ ఈ సాంకర్యానికి మూలం.

ఉత్తరభారత పూర్వీకులు-దక్షిణభారత పూర్వీకులు

          జన్యుపరంగా నేటి భారతీయులకు వారసత్వాన్ని కల్పించిన జనాలను ప్రధానంగా రెండు రకాలుగా గుర్తించారు. మొదటి రకాన్ని ఉత్తరభారతానికి చెందిన పూర్వీకుల (ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్-ANI)నీ, రెండవ రకాన్ని దక్షిణభారతానికి చెందిన పూర్వీకుల (ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్-ASI)నీ సంకేతించారు. ఉత్తరభారత పూర్వీకుల (ANI) కు యూరేసియా జనాలతో, అంటే- యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, కాకసస్ జనాలతో -సంబంధముంది. అదే దక్షిణభారత పూర్వీకు (ASI) ల విషయానికి వస్తే, నేటి భారతదేశం బయట ఉన్న ఏ జనాభాతోనూ వీరికి చుట్టరికం లేదు.

యూరేసియా సంబంధం లేనిది లిటిల్ అండమాన్ జనానికే

          ఈ రెండు రకాల మధ్యా ఎలా మిశ్రమం జరిగిందో నేటి జన్యుపరిశోధకులు చాలా స్పష్టంగా చూపించారు. ఇంత వరకూ ఎవరికీ అందుబాటులోకి రాని ఒక రకం సమాచారం తమకు లభ్యమైందనీ, ఎవరి పూర్వీకులెవరో తేల్చి చెప్పగల అవకాశం ఈ సమాచారం ద్వారా తమకు మొదటిసారి లభించిందనీ వారు చెప్పుకున్నారు. తమ మధ్య మిశ్రమం జరగక ముందు ఈ ANI, ASI జనాలు ఒకరికొకరు పూర్తిగా విభిన్నులు. ఇప్పుడు భారత్ ప్రధాన భూ భాగం మీద ఉన్న జనాలందరూ ఈ రెండు రకాల జనాల మిశ్రమం నుంచి పుట్టినవారే. యూరేసియా జన్యుమిశ్రమం లేనిది ఒక్క లిటిల్ అండమాన్ దీవి జనంలోనే.

భారత్ లో అందరూ మిశ్రజనాభాయే

          భారత ప్రధాన భూభాగంలో ఉన్న జనాల్లో ఈ  యూరేసియా జన్యుమిశ్రమం 20 శాతం నుంచి 80 శాతం వరకూ ఉన్నట్టు లెక్క కట్టారు. విచిత్రమేమిటంటే, ఈ మిశ్రమం పెద్దా, చిన్నా కులాల్లో మాత్రమే కాదు; కులవ్యవస్థకు బయట ఉన్న గిరిజన జనాభా ల్లోనూ కనిపిస్తుంది. కనుక, భారతదేశంలో మిశ్రమం కాని జనాలు ఎవరూ లేరనీ, జన్యు పరంగా తాము  స్వచ్ఛమైన వాళ్ళమని ఏ ఒక్క కులమూ, లేదా వర్గమూ చెప్పుకొనే అవకాశమే లేదని డేవిడ్ రైక్ అంటాడు.

అగ్రకులాలు ANI-నిమ్నకులాలు ASI

          భారతీయుల జన్యుచరిత్ర, ఇక్కడి వివిధ కులాల నిచ్చెనమెట్ల అమరికకు తూచినట్టు సరిపోవడం కూడా ఒక ఆశ్చర్యమే. స్థూలంగా చెప్పాలంటే, ANI సామాజికంగా ఉన్నత స్థానానికి ప్రతినిధి అయితే, ASI నిమ్నస్థానానికి ప్రతినిధి. కులవ్యవస్థలో పై స్థానాల్లో ఉన్నవారిలో ANI జన్యువారసత్వం హెచ్చుమోతాదులో ఉంటే, కింది స్థానాల్లో ఉన్నవారిలో తక్కువ మోతాదులో ఉంది. ఒకే ప్రాంతంలో ఉంటూ, ఒకే భాష మాట్లాడే వారి మధ్యనే కాదు; ఒకే ఊళ్ళో పక్క పక్కన నివసించేవారి మధ్య కూడా ఈ ANI పాళ్లలో తేడా ఉంటుంది. ఉదాహరణకు,  మిగతా కులాలవారిలో కన్నా బ్రాహ్మణుల్లో ANI జన్యు వారసత్వం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.

స్త్రీ, పురుష వ్యత్యాసాల మూలాలు

          నేటి భారతీయులకు చెందిన జన్యుసమాచారం సామాజిక అధికారంలో స్త్రీ, పురుషుల మధ్య గల వ్యత్యాసాన్ని కూడా తెలుపుతుందంటాడు డేవిడ్ రైక్. భారతీయ పురుషుల్లో 20నుంచి 40 శాతం మేరకూ; తూర్పు యూరప్ కు చెందిన పురుషుల్లో 30నుంచి 50 శాతం మేరకూ, ఒకే పురుష పూర్వీకుని నుంచి సంక్రమించిన వై-క్రోమోజోమ్ రకం కనిపిస్తుంది. వెనకటి 6,800నుంచి 4,800 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన పరిణామం ఇది. ఇందుకు భిన్నంగా, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు,  స్త్రీ వైపు నుంచి సంక్రమించే మైటోకాండ్రియల్ DNA పూర్తిగా ASI కే చెంది, దాదాపు భారతదేశానికే పరిమితమైంది. ASI నుంచి సంక్రమించిన ఈ మైటో కాండ్రియల్ DNA దక్షిణభారతం లోని స్త్రీలలోనే కాక, ఉత్తరభారత స్త్రీలలోనూ కనిపించడం గమనించాల్సిన విశేషం.

          కంచు యుగంలోనో, ఆ తర్వాతో పశ్చిమ యూరేసియా నుంచి భారత్ లోకి పెద్ద ఎత్తున వలసలు జరిగాయని పై సమాచారం తెలియజేస్తోంది. అంతేకాదు, పైన చెప్పిన వై-క్రోమోజోమ్ రకం కలిగిన పురుషులు తమ వారసుల్ని కనడంలో అసాధారణంగా విజయవంతులయ్యారనీ, వారితోపాటు వచ్చిన స్త్రీ వలసదారులు తమవైపు నుంచి జన్యుదోహదం చేయడంలో విజయవంతులు కాలేకపోయారనీ కూడా దీనిని బట్టి అర్థమవుతుందని డేవిడ్ రైక్ అంటాడు.

పెద్ద సంఖ్యలో…చిన్న గుంపులు

          డేవిడ్ రైక్ చేసిన ఒక లోతైన, ఆసక్తికరమైన వ్యాఖ్యను ఈ సందర్భంలో ప్రస్తావించు కోవాలి. భారతదేశాన్ని 130 కోట్ల జనాభా కలిగిన దేశంగానే అనేక మంది భారతీయులూ, విదేశీయులూ కూడా చూస్తారనీ; కానీ జన్యుకోణం నుంచి చెప్పుకున్నప్పుడు ఇది సరైన చూపు కాదనీ ఆయన అంటాడు. నిజంగా అతిపెద్ద జనాభాగా చెప్పదగినవారు హన్ చైనీయులేననీ, కొన్ని వేల సంవత్సరాలుగా వీరి మధ్య  స్వేచ్ఛగా మిశ్రమం జరిగిపోతూ రావడం వల్ల వీరు సంఖ్యాపరంగా అతిపెద్ద జనాభా అయ్యారనీ ఆయన వివరణ. అదే భారత్ విషయానికి వస్తే, అతి పెద్ద జనాభాగా చెప్పదగిన సమూహాలు ఇక్కడ చాలా తక్కువ. ఒకే ఊళ్ళో పక్క పక్కనే ఉంటున్నాసరే, భారతీయ జనాలలో జన్యువైవిధ్యం ఉత్తర, దక్షిణ యూరప్ లలో కన్నా రెండు, మూడు రెట్లు ఎక్కువంటాడు ఆయన.

          “అసలు నిజం ఏమిటంటే, పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న చిన్న గుంపులతో నిండి నదే భారతదేశం” అని ఆయన ముక్తాయిస్తాడు!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.