వెనుతిరగని వెన్నెల(భాగం-46)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు.  ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.  హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్లీ ఎదురవుతాడు.

***

          ప్రీ పీ హెచ్ డీ పరీక్షలు కాగానే యూనివర్శిటీ నించి అట్నుంచటే మాస్టారింటికి బయలుదేరి వెళ్లింది తన్మయి.

          “ఏమ్మా, బాబు బావున్నాడా?” అంటూ ఆదరంగా పలకరించేరు మాస్టారి భార్య.

          మరి కాస్సేపట్లోనే మేరీ బాబుని తీసుకుని వచ్చింది.

          “అమ్మో, పొడుగయ్యేడు” అన్నారు మురిపెంగా వాడిని చూస్తూ మాస్టారు. వాళ్ళ ఆదరం చూస్తుంటే కళ్లు చెమర్చేయి తన్మయికి. “ఈ భార్యాభర్తలకి తనేమవుతుంది? ఏ జన్మలోనో తను పుణ్యం చేసుకున్నందు వల్ల మాత్రమే లభ్యమయ్యే అరుదైన ఆత్మీయతలివి” అనుకుంది.

          నిజానికి తన్మయికి పాపపుణ్యాల మీద నమ్మకం లేదు. అయినా ఎందుకో అలా అనిపించింది. అన్నీ మానవ ప్రయత్నాల వల్లే జరుగుతాయన్నది నిజమో, అపోహో తెలీదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తనకు లభించిన వరమే.

          మరో గంట తర్వాత లేవబోతూ టీ.వీలో వస్తున్న స్క్రోలింగుని అప్రయత్నంగా చూసింది తన్మయి. అది అక్కడి లోకల్ ఛానెల్ అట. ఇటీవలే లోకల్ ఛానెళ్లు ప్రారంభ మయ్యేయని ఆవిడ మాటల్లో అన్నారు. రెండు మూత్రపిండాలు పాడయిన వ్యక్తి  ఆపరేష నుకి నెగటివ్ బ్లడ్ గ్రూపు బ్లడ్ కావాలని ఆ ప్రకటన సారాంశం.

          తన్మయికి తెలుసు అదెంత అరుదైన బ్లడ్ గ్రూపో. చప్పున లేచి అడ్రసు, ఫోను నంబరు రాసుకుంది. మేరీకి బాబునప్పగించి అందులోని అడ్రసుకి ఆటో ఎక్కింది.
ఆసుపత్రిలో తను వచ్చిన పనేమిటో చెప్పగానే అప్పటి వరకూ అక్కడే తిరుగుతున్న ఒకామె ఆత్రంగా దగ్గరకు వచ్చింది. కట్టు బొట్టు తీరును బట్టి బెంగాలీ అని తెలుస్తూ ఉంది. తనని చూస్తూనే రెండు చేతులూ జోడించి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కారం చేసింది.

          నర్సు బ్లడ్ తీసుకోవడం అయిపోగానే ఇచ్చిన జ్యూసుని అందుకుంటూ “నేను ఎవరికీ బ్లడ్ ఇస్తున్నానో ఆ పేషంట్ ని చూడొచ్చా?” అనడిగింది తన్మయి.

          తను బయటికి రాగానే అప్పటి వరకూ బయటే కూచున్న ఆమె తమని అనుసరిం చింది. ICU లో ఉన్న పేషంట్ కి బహుశా: నలభైయ్యేళ్ళు ఉంటాయి. రెండు మూత్రపిండాలు పాడయ్యిన అతనికి ఆ రోజు రాత్రి ట్రాన్స్ ప్లాన్ టేషన్ జరగబోతోంది. మరి కొన్ని గంటల్లో జరగబోతున్న ఆపరేషన్ కి చివరి నిమిషం వరకూ బ్లడ్ సమకూర లేదట వాళ్లకి. తన్మయి దేవతలా వచ్చి కాపాడిందని అతి కష్టమ్మీద శ్వాస తీసుకుంటూ అతను ఇంగ్లీషులో మెల్లిగా ఒక్కొక్క పదమే చెప్తూ నమస్కరించాడు. అతని భార్యకి బెంగాలీ తప్ప ఇతర భాషలు తెలియనందున ఆమె కళ్లతోనే సంభాషిస్తూ నమస్కరిం చింది.

          ICU లో ఉన్న వ్యక్తిని మొదటి సారి చూడడమేమో తెలీని బాధ చుట్టుముట్టింది తన్మయికి. పాపం ఆ భార్య అతని కోసం ఎంతో బాధ పడ్తుంది. తన్మయి వస్తున్నపుడు తన అడ్రసు అడిగి తీసుకున్నారు వాళ్లు. అక్కడి నుంచి వస్తున్నపుడు తన్మయికి వాళ్ల బాధతో పోలిస్తే తన బాధ అతి చిన్నదనిపించింది. 

          జీవితంలో అన్నిటి కంటే అత్యంత పెద్ద సమస్య ఆ జీవితమే కోల్పోవడం. మరణంతో పోరాడుతూ బతకాలన్న తపన పడ్తున్న ఆ భర్త, భర్తకేమవుతుందో అనే ఆదుర్దాతో అనుక్షణం నరకాన్ని అనుభవిస్తున్న ఆ భార్య ఎన్నో రోజులు కళ్ల ముందే కదలాడసాగేరు.

          జీవితంలో ఓర్పుతో, సంయమనంతో ఏ సమస్యనైనా చక్కదిద్దుకోవచ్చు అని మేరీ ఎప్పుడూ చెపుతుంది. కానీ, జీవితమే ఒక సమస్య అయితే! మరణంఅంచున పోరాడడమే జీవితమైతే!!

***

          రైల్వేస్టేషనుకి చేరుకునే సరికే హైదరాబాదు వెళ్లే రైలు ప్లాట్ ఫారమ్మీద సిద్ధంగా ఉందని ప్రకటన వినబడుతూ ఉంది.

          తన్మయి వద్దన్నా వినకుండా మేరీ బాబుతో, సామాన్లతో ఎలా వెళ్తావంటూ దిగబెట్ట డానికి వచ్చింది. ఇల్లు ఊడ్చుకోవడానికి మంచి కొండ చీపుర్లు రెండు కొంది తన్మయి. విశాఖపట్నంలో తప్ప ఇటువంటి గుబురు కట్టలు తనున్న చోట ఎక్కడా దొరకడం లేదు.
తమ చిన్నపుడు కేవలం పూతికల చీపుర్లు మాత్రమే చవకగా దొరికేవి. పూతికల చీపురుతో ఇల్లు ఊడ్చిన మొదటి రోజు ఇంటి నిండా పూతికలు ఎగురుతూ బట్టలకు అక్కడక్కడా అతుక్కుపోయి గుచ్చుకుని చంపేవి. కొండ చీపుర్లు ఇప్పటికీ ఖరీదు ఎక్కువే.
“అందుకేగామోసు హైదరాబాదు వైపు ఒక్కొక్క కట్టని మూడేసి కట్టలు చేసి మధ్య ఖాళీ పుల్లలు పెట్టి అమ్ముతారు. అవి రెండ్రోజుల్లో ఊడి వస్తాయి.” అంది తన్మయి మేరీతో అవి కొనేటప్పుడు. దానితో బాటూ మేరీ రెండు దిండ్లు కొనిచ్చింది. వాటికి తనే కవర్లు కుట్టి, అందంగా ఎంబ్రాయిడరీ కూడా చేసింది.

          “ఎందుకివన్నీ ఇప్పుడు” అంటే, “అదేవిటి తన్మయీ అలా అంటావు? నాకున్న ఏకైన ప్రియ మిత్రురాలివి నువ్వు. నాకు యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా నీ కోసం నేను ఆ మాత్రం చెయ్యకూడదా?” అంది.

          ఒకప్పుడు తామిద్దరూ హాస్టలులో కలిసి ఉన్న సమయంలో తను ఏ ఉద్యోగానికి అప్లై చేసినా రాలేదని మేరీ ఎంతో బాధ పడుతూ ఉండేది. తనకి బాగా గుర్తు, చివరికి తనకి ఎలిమెంటరీ స్థాయి ఉద్యోగం కూడా రాలేదని ఒక రాత్రంతా దుఃఖ పడింది కూడా.
ఓర్పుగా ఎదురు చూసినందుకు అన్నిటి కంటే అత్యుత్తమమైన ఉద్యోగం వచ్చింది తనకి. అదే చెప్పి మేరీని కౌగలించుకుంది తన్మయి.

          “కాలం అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉండదనడానికి నీ జీవితమే ఉదాహరణ. సమస్యలు వచ్చినపుడు ‘ఆ రోజుతో జీవితం ఆఖరయిపోతుందని, ఇక భవిష్యత్తు లేదేమో’ అని జీవితాన్ని అంతం చేసుకోవాలనుకునే వాళ్ళు తెలుసుకోవలసిన గాథ. కాలం గాయాల్ని మాన్పడమే కాదు, సమస్యల్ని కూడా పరిష్కరిస్తుందని నిరూపించావు. కష్టాల్ని ఎదిరించి, చక్కగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నువ్వు ఎందరికో స్ఫూర్తి దాయకం, నీ స్నేహం వల్ల నాకూ నీ ఓర్పు అలవడింది” అంది నవ్వుతూ మేరీ.

          మేరీతో ఎప్పుడు మాట్లాడినా వెయ్యేనుగుల బలం వస్తుంది. రైలు పెట్టెలోకి ఎక్కి కూచుని సామాన్లు సర్దుకుని కిటికీ దగ్గరే నిలబడ్డ మేరీని “ఫర్వాలేదులే మేరీ ఇక ఉండు” అంటూ

          “ఆంటీకి “టాటా” చెప్పమ్మా బాబూ” అంది వెనక్కి చూస్తూ.

          పక్కన బాబు లేడు.

          అదిరిపడి ఒక్కసారి లేచింది “బాబూ” అంటూ. తమ పక్కన గానీ, ఎదురు బెర్తులో గానీ ఎవరూ లేకపోవడంతో ఎవర్నడగాలో అర్థం కాలేదు తన్మయికి.

          “అయ్యో అదేవిటి ఇప్పటి వరకూ ఉన్నాడుగా” అంటూ పక్కనే తలుపు ఉండడంతో మేరీ చటుక్కున రైలెక్కింది.

          తన్మయి కంగారుగా రైలులో వరుసగా ఉన్న బెర్తుల మధ్య పరుగెత్తింది “బాబూ” అని పిలుస్తూ. వరసలో నాలుగో బెర్తులో శేఖర్ ఒళ్లో కూచుని ఆడుకుంటున్న బాబు తల్లిని చూస్తూనే పరుగెత్తుకు వచ్చేడు.

          హఠాత్తుగా శేఖర్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే కోపమూ తన్నుకు వచ్చింది.

          “పిల్లాణ్ణి తీసుకెళ్లే ముందు చెప్పాలని తెలీదూ!”

          అతన్ని ఏమీ అనలేక బాబు వీపు మీద ఛెళ్ళున ఒకటేసి, ఒక్క అరుపు అరిచింది

          “నాతో చెప్పకుండా ఎక్కడికి పోయావ్ రా వెధవా” అంటూ.

          శేఖర్ కోపంగా తల పక్కకు తిప్పుకుంటూ, “వాడు నా కొడుకు, నా దగ్గరకు రావడానికి నిన్నడగాల్సిన పని లేదు” అన్నాడు.

          పక్క సీట్లలో వాళ్లు చోద్యం చూస్తుండడంతో తన్మయి మాట్లాడకుండా బాబుని లాక్కుని సీట్లోకొచ్చి కూలబడింది.

          వెనకే వచ్చిన మేరీ పక్కనే కూచుని “బాధ పడకు. అతన్ని స్టేషను బయట చూసేను. మన వెనకే ఆటో దిగేడు. అతనెవరో ఇప్పుడు తెలిసింది. మనం  మాట్లాడు కుంటుండగా పక్క బెర్తు దగ్గర నుంచి బాబుని పిల్చి ఉంటాడు. వీడు బానే గుర్తుపట్టేడు అదే ఆశ్చర్యం! ” అంది.

          ఏడుస్తున్న బాబుని ఒళ్లో పొదువుకున్న తన్మయి కళ్లల్లోంచి అప్రయత్నంగా కన్నీళ్లు ఉబికి వచ్చేయి.

          “అయ్యో! భద్రంగా పెంచుకుంటున్న పిల్లాణ్ణి కొట్టేనే” అని మనసంతా బాధ అలుముకుంది.

          “అతనూ ఇదే రైలుకి వెళ్తూ కాకతాళీయంగా మనల్ని చూసేడా లేక కావాలని వచ్చేడా” అంది సందేహం వెలిబుస్తూ మేరీ.

          తెలీదన్నట్లు పెద్దవి విరిచింది తన్మయి.

          కారణం ఏదయినా అతనూ ఇదే రైలులో ప్రయాణం చేస్తున్నాడనేది ఎందుకో భరించలేకపోతూంది. “ఎందుకు?” దుఃఖం, కోపం, కసి, చేతకానితనం కలగాపులగంగా ఒకదానిమీదొకటి తన్మయి మనసు మీద దాడి చేస్తూ కలవరాన్ని పెంచుతున్నాయి.
తన్మయికి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరవాలనుంది. అతని రెండు చెంపలూ వాయిం చాలనుంది. తనని అతని జీవితంలోంచి సునాయాసంగా బయటికి తోసేసి, నిర్దాక్షిణ్యం గా రోడ్డు పాలు చేసిన అతన్ని రైలు లోంచి వెళ్లగొట్టాలనుంది. ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల దుఃఖం చుట్టుముట్టింది.

          రైలు బయలుదేరబోతున్నట్లు విజిల్ వింటూనే “ఏమీ కాదులే. బాధ పడకు, ఊరుకో. అనుకోకుండా ఇదే రైలులో ప్రయాణిస్తూ మిమ్మల్ని చూసి ఉంటాడు. ముందు నువ్వు ధైర్యంగా ఉండు. బాబు జాగ్రత్త” అంటూ మేరీ రైలు దిగింది.

          రైలు బయలుదేరిన పది నిమిషాల్లో శేఖర్ వచ్చి పెట్టెకి ఆ మూల కిటికీ దగ్గిర కూచుని బాబుని మళ్లీ పిలిచేడు. దెబ్బకి భయపడిన బాబు తల్లి వైపు చూసేడు. తన్మయి కిటికీ లోంచి బయటికి చూస్తూ కళ్లు మూసుకుంది.

          “పర్లేదు రారా నాన్నా. అది నిన్నూ, నన్నూ ఎలా వేరు చేస్తదో చూస్తాను.” అన్నాడు కఠినంగా.

          “ఇన్నాళ్లూ ప్రేమంతా ఎటు పోయిందో. కొడుకు మీద అసలంత ప్రేమ ఉన్నవాడు ఎందుకు వదిలెళ్లిపోయాడో.”

          తన్మయి కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ గుప్పెట గట్టిగా బిగించింది. కోర్టు తనకే బాబు సంరక్షణని ఇచ్చినా, ఎప్పుడైనా వచ్చి చూసే హక్కు అతనికి ఇచ్చింది. ఇప్పుడిక దాన్ని అడ్డుపెట్టుకుని తనని సాధిస్తాడన్నమాట. తన ఎదురుగా కూచున్న అతన్ని చూస్తూ భరించడం కన్నా పిల్లాణ్ణి అతని దగ్గరకే పంపడం మంచిదని అనిపించి ఇంకా తన వైపే దిగులుగా చూస్తున్న బాబుని వెళ్ళమన్నట్లు చూసింది.

          “కొత్త వింత” అన్నట్లు బాబు హుషారుగా అతని వేలు పుచ్చుకుని వెళ్లేడు. నిస్త్రాణగా బెర్తు మీద వాలి పోయింది తన్మయి. “మిత్రమా! నన్ను రక్షించు” అని మనసులో అనుకుంటూ.

          “ఒకప్పుడు అతనితో జీవితాన్ని పంచుకోవడం కోసం ఎంతగానో ఎదురు చూసింది. తల్లికి ఇష్టం లేకపోయినా అతని వేలందుకుని నడవడం కోసం ఎంతో తపించింది.
ఆ రోజుల్లో అతన్ని తల్చుకోగానే తన ముఖమ్మీద ప్రేమైక చిరునవ్వు మెరిసేది. అతన్ని చూడగానే తెలీని సిగ్గు ముంచెత్తేది. రెండు చేతుల్తో ముఖాన్ని కప్పుకున్నప్పుడల్లా “ఎందుకంత సిగ్గు” అని అతను అడిగేవాడు. అతన్ని ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడి గానూ, గొప్ప మనసున్న వాడి గానూ, తమ ప్రేమ ఎంతో అపురూపమైంది గానూ ఊహించు కుంది.

          అవన్నీ కాలరాసి, అతని ఇష్టం వచ్చినట్లు బాధ్యతా రాహిత్యంగా నడచుకుని, పైగా తనేదో అన్యాయం చేసినట్లు చివరకు చిత్రీకరించి, తనని ముప్పుతిప్పలు పెట్టి, నానా కష్టాల, అవమానాల పాలు చేసి మరీ వెళ్లిపోయేడు. విడాకుల కాగితాలు తీసుకుని అతను నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుని బండి స్టార్టు చేసుకెళ్ళిన దృశ్యం ఇప్పటికీ మర్చిపోలేక పోతూంది.

          అతనికి తనేం అన్యాయం చేసిందని తన జీవితంతో ఆడుకున్నాడు? తన వెంట పడి ప్రేమ అని, పెళ్ళి అని ఎందుకు తిరిగాడు? తీరా పెళ్లయ్యాక అనుక్షణం నరకం చూపించి ఎందుకు కక్ష సాధించాడు?”

          మరో గంటలో బాబు వచ్చి పక్కన నిలబడగానే కన్నీళ్లతోనే పక్కకు తిరిగింది. తల్లి దుఃఖం అర్ధమైనట్లు చిన్నారి చేత్తో కళ్లు తుడవసాగేడు. వాణ్ణి కౌగిలించుకుని ‘నన్ను వదిలెళ్ళకురా, ఎప్పుడూ వెళ్లకురా నాన్నా ” అని లోపల్లోపలే కుమిలి ఏడవసాగింది.

***

          పొద్దున్న హైదరాబాదులో రైలు దిగే సరికి శేఖర్ లేడు. బహుశా: అతను వాళ్ల ఊర్లో దిగిపోయి ఉంటాడు.

          “హమ్మయ్య” అని స్థిమితపడింది తన్మయి.

          తమని దాటెళ్లి పోతూ “కూలీ” అని అరుస్తూ వెళ్తున్న ఎర్ర చొక్కా అతన్ని పిలిచింది. బాబునొక చేత్తో పట్టుకుని, మరో చేత్తో పర్సు పట్టుకుని అతని వెనక ఆటో స్టాండు వైపు నడిచింది. దగ్గర్లోని బస్టాండు వరకు ఆటో కట్టించుకున్నా, అక్కణ్ణించి ఇవన్నీ బస్సులో ఎక్కించడం కాస్త కష్టమే. ఆలోచనలతో నడుస్తూ గుమ్మం దగ్గిర టీ.సీ కి టిక్కెట్టు ఇచ్చి ఒక్కడుగు వేసేసరికి

          “అయ్యో, రైలు తొందరగా వచ్చినట్లుంది. ప్రయాణం ఎలా జరిగింది” అంటూ ఎదురొచ్చాడు ప్రభు. రాత్రంతా కలత నిద్దరతో, దుఃఖంతో కళ్లు వాచిపోయిన తన్మయి అతన్నించి తప్పించుకోవడానికన్నట్లు చప్పున కళ్లు దించుకుని వడిగా కూలి వెనక నడిచింది. వడిగా నడుస్తున్న తల్లి నొదిలి బాబు ప్రభు చెయ్యి పట్టుకున్నాడు.

          ఆటోలో ఏమీ మాట్లాడని తన్మయి వైపు చూస్తూ “అంతా బానే ఉందా?” అన్నాడు.
ముభావంగా తలూపింది. తన మనసులో రేగిన అగ్నిజ్వాలని అతనికి ఎలా చెప్పగలదు?
లోపల చెలరేగుతున్న వ్యథావేదనలతో ప్రభుతో మాట్లాడాలని అనిపించడం లేదు. అతని సమక్షం విసుగ్గా, చికాకుగా అనిపించసాగింది. తనని వెంటాడుతూ ఏవిటితను?
కానీ, ఎవరితోనూ ఏవీ మాట్లాడే ఓపిక, ఆసక్తి కూడా లేక అతన్నేం మాట్లాడొద్దన్నట్లు ఒక చూపు చూసింది. అయినా సామాన్లన్నీ బస్సులో సర్దిపెట్టి, కదులుతున్న బస్సు కిటికీ పక్కనే నిలబడి “ఆదివారం వస్తున్నా” అన్నాడు గట్టిగా.

          “వద్దు” అంది ఓపిక లేని స్వరంతో.

          కానీ, ఆ మాట బస్సు బయలుదేరుతున్నట్లు మోగించిన హారను ధ్వనిలో కలిసి పోయింది. బస్సు కదిలి వెళ్తున్నా కనుచూపు మేర వరకూ అతనక్కడే నిలబడ్డాడు.తన కోసం అంత పొద్దున్నే లేచి రైలు స్టేషనుకి వచ్చేడు పాపం. కానీ ఇవన్నీ పట్టించుకునేలా లేదు తన మనసు. కనీసం తను అతను సహాయం చేస్తున్నందుకైనా సరిగా మాట్లాడ లేదు. శేఖర్ మీద కోపంతో ప్రభుని దూరం పెట్టడం న్యాయమో కాదో తెలీదు. హృదయం అర్థం లేని దుఃఖం తో మూలుగుతోంది. 

          ఎవరితోనూ పంచుకోలేని వ్యథ!

          అతని జీవితం పాడు చేసుకోవద్దని ఉత్తరం వేసినా మళ్లీ ఎందుకు స్టేషనుకి వచ్చేడు? ఇప్పుడిప్పుడే కుదుట పడ్తున్న తన జీవితంలోకి అతను వద్దన్నా ఎందుకు వస్తున్నాడు? అతన్ని ఎలా దూరం పెట్టాలో పాలుపోవడం లేదు. శేఖర్ మళ్లీ కనబడే సరికి గతమంతా రీలులా..కాదు కాదు, మనసుని చీరేస్తూ తిరుగుతున్న ముళ్లచక్రంలా కదలాడింది.

          ‘అమ్మా! నాన్న, నెల రోజుల్లో స్కూలుకి వస్తానని చెప్పేడు” అన్నాడు బాబు అంతలో.

          తన్మయి నిస్త్రాణగా సీటుకి జేరబడింది.

          ఇదొక కొత్త సమస్య ఇక మీదట.

          ఇప్పటిదాకా మొత్తానికి వదిలేసిన వాడు మళ్లీ ఎందుకు బాబు జీవితంలోకి అడుగు పెడ్తున్నాడు?

          తనకీ కొత్త పరీక్ష ఏవిటి?

          ఒక సమస్య పరిష్కరించుకుంటే మరొకటి వెంటాడుతూ ఉంది. ఇంతేనా జీవితం!
నిరాసక్తంగా కిటికీలోంచి ఆకాశం వైపు చూడసాగింది. నీలాకాశంలో స్వచ్ఛమైన తెల్లని మేఘాలు పరుగులు పెడ్తున్నాయి. ఈ అనంతకోటి తారల విశ్వంలో చిన్న ఇసుక రేణువంత భూమ్మీద మనిషి ఉనికి ఎంత? జీవితమెంత?

          ఇన్ని కోట్ల మనుషులలో తన బాధ ఎంత?

          ఎందుకు ఇంతగా బాధ పడ్తుంది తను?

          మేరీ మాటలు మళ్లీ జ్ఞాపకం వచ్చాయి. “ఓర్పుతో, సంయమనంతో ఏ సమస్యనైనా చక్కదిద్దుకోవచ్చు”.

          కళ్లు తుడుచుకుంది.

          బాబుని దగ్గరకు తీసుకుని “ఆకాశంలో మబ్బులాట ఆడదామా?” అంది మెల్లిగా.
తల్లి ముఖంలో ప్రశాంతత చూసి హుషారుగా తలూపేడు.

          “దూరంగా.. అదిగో ఆ మబ్బు ఏ ఆకారంలో ఉంది?” అంది.

          “నిన్న నాన్న వేసుకున్న బూటులా ఉంది” అన్నాడు బాబు నవ్వుతూ.

          వెంటనే ఒక్క క్షణం మనసు చివుక్కుమంది.

          “ఒక్కసారి అతన్ని చూడగానే వీడు అతని గురించే ఆలోచిస్తున్నాడు! అయినా చిన్న పిల్లాడు వీడికేం తెలుసనీ! చాక్లెట్టు ఎవరిస్తే వాళ్లని గుర్తుపెట్టుకుంటాడు” అని సమాధానపడి

          “మరి ఆ పక్కనున్న మబ్బు ఎలా ఉంది?” అంది తన్మయి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.