సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1

-డా. అమృతలత

          చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు.
 
          ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది. 
 
          మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , సరస్వతీ పురంలో వుండే యూనివర్సిటీ స్విమ్మింగ్ పూల్ కు వెళ్ళేవాడు..  మధూ వాళ్ళ నాన్న గారు కొన్ని రోజులు వారి వెంట వెళ్ళి, చివరికి వారికి ఈత  రాదని వదలివేసారు .    
 
          ఆ తరువాత మధూ తల్లిదండ్రులు సరస్వతీపురంలో ఇల్లుకొని అక్కడికే షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంటి నుండి స్విమ్మింగ్ పూల్ పదిహేను నిమిషాల దూరంలో వుంటుంది. 9వ తరగతి చదువుతోన్న మధు ఆ స్విమ్మింగ్ పూల్ లో ఈతలోని వివిధ పద్ధతులనూ , మెళకువలనూ నేర్చుకుని స్విమ్మింగ్ మీద అపారమైన మక్కువని పెంచుకున్నాడు.
 
          కాలేజీ రోజుల్లో మూడుసార్లు యూనివర్సిటీ ఛాంపియన్ గా ఎంపికైన మధు , ఎప్పటికైనా స్విమ్మింగ్ లో ఎన్నో లారెల్స్ సంపాదించాలన్నది తన జీవితాశయంగా ఏర్పరుచుకుని , అందుకు అనుగుణంగా కృషి చేయడం మొదలెట్టాడు.
 
          తర్వాతి రోజుల్లో చదువు పూర్తయి , అమెరికా వెళ్ళాక , సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడ్డారు. 2000 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వచ్చిన రిసెషన్  (recession) కారణంగా, ఆ కంపెనీని మూసేయడంతో ఆయన తన మనసును తిరిగి స్విమ్మింగ్ వైపు మళ్ళించాడు. 
 
          తోటి ఈతగాళ్ళు మధులోని ప్రావీణ్యతని చూసి అతడిని లాంగ్ డిస్టాన్స్ స్విమ్మింగ్ కి ప్రోత్సహించారు. ఆ పరంపరలో ఆయన ఇంగ్లీష్ ఛానల్ ని ఈదాలని సంకల్పించారు. 
 
          నిజానికి మధు ఏ సాహసాలనైనా మొదలెట్టే ముందు .. ముందుగా తను వాటిని నమోదు చేసిన పిమ్మటే ..వారి తల్లిదండ్రులకు తెలియజేసేవారు.
 
          ఆ విషయం తెలియగానే మధూ వాళ్ళ అమ్మగారు సుశీల వాటికి సంబంధించిన పూర్వాపరాల పై పరిశోధన చేసి , ఆయా విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునేవారు.
 
          ‘అవరోధాలన్నీ అధిగమించి గమ్యం చేరే శక్తిని నా కొడుక్కు ఇవ్వు తండ్రీ !’ అని భగవంతుని ప్రార్థించేవారు.
 
          స్విమ్మింగ్ ప్రపంచంలో ‘ఇంగ్లీష్ ఛానెల్’ ఈదడమనేది మౌంట్ ఎవరెస్టుని అధిరోహించడం లాంటిది.
 
          మధు 10 ఆగష్టు 2004లో, 33.08 కిలోమీటర్లని 12. 31 సమయంలో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదిన తొలి కర్ణాటక వ్యక్తిగా పేరు దక్కించుకున్నాడు.
 
          స్విమ్మింగ్ లో విజయం సాధించిన తరువాత వివిధ ఛానల్స్ లో మధూ చెప్పిన మాటలు విన్నప్పుడు , పత్రికల్లో వచ్చిన ఇంటర్వూలు చదివినవుడు ఆ ప్రయత్నంలో అతడికి ఎదురైన కష్టాలూ , స్విమ్మింగ్ చేస్తోన్న సమయంలో అతడి మానసిక పరిస్థితీ మనకి కళ్ళనీళ్ళు తెప్పిస్తాయి.
 
          అబ్దుల్ కలాంగారి ‘వింగ్స్ ఆఫ్ ఫైర్ ‘ తనను ఇంగ్లీష్ ఛానెల్ ఈదడానికి ప్రేరేపించిందనీ , ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతనికన్నా అతడి దేశం చాలా చాలా  గొప్పదనీ, తను ఎల్లప్పుడూ టీమ్ వర్కునే నమ్ముతాననీ అంటారు మధు.
 
          ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదుతోన్న సమయంలో, ఒక దశలో ..
 
          ‘ఆరోజు ఒకటే వర్షం… ఈదటానికి నీళ్ళల్లో దూకగానే .. నాలో అనేక ప్రశ్నలూ , సంశయాలూ. నా ముందు ఓ పెద్ద లక్ష్యం పెట్టుకుని , ఈ సాహసం చేయాలనుకుంటూ .. నన్ను నేను మోసం చేసుకుంటున్నానా ?’ అని కూడా అనుకున్నారు.
 
          ‘ఆ సాహసంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరినీ, నా ఈతకి కావాల్సిన నిధుల సేకరణలో వారు అందించిన సాయాన్నీ, వారికి నా పై ఉన్న విశ్వాసాన్నీ ముఖ్యంగా మా అమ్మా నాన్న, నా కొడుకు వివేక్, నా సహచరి సుమన్ అందించిన సహకారాన్నీ మరువ లేను’  అని చెప్పారు. 
 
          ‘ధైర్యం సడలిపోతోన్న సమయంలో నాకు భగవంతుడు శక్తి సామర్థ్యాలనీ, ధైర్యాన్నీ ప్రసాదించాలని కోరుకున్నాను ‘ అన్నారు.
 
          ‘విదేశాల్లో వున్నప్పుడు ఆ దేశస్థులు మనల్ని భారతీయులుగా మాత్రమే చూస్తారు , ఒక వ్యక్తిగా కాదు. అందుకే మనం విదేశాల్లో ఉన్నప్పుడు …మన దేశ గౌరవాన్నీ , సంస్కృతినీ, వారసత్వాన్నీ కాపాడాల్సిన బాధ్యత మన భుజ స్కంధాల పైనే వుంటుందన్న విషయం మనం గుర్తెరిగి నడుచుకోవాలి ! ” అంటారాయన.
 
          ఇంగ్లీష్ ఛానెల్ స్విమ్ చేసిన తరువాత డోవర్ లో వైట్ హార్స్ పబ్ గోడ పైన వారు రాయాల్సిన సాంప్రదాయం ప్రకారం –
 
‘I dedicate this swim to my family, friends and Rinconada Masters, Palo alto, CA, USA- Madhu Nagaraja, INDIA and my time 12:32, Aug/ 10/2004’ 
 
అని లిఖించడం  అతడు సాధించిన మరో ఘనత !
 
బెందాళం కృ‌ష్ణారావు ప్రజాశక్తి పత్రిక కోసం మధూ తల్లి సుశీలగారిని ఇంటర్వ్యూ చేస్తూ –
 
          ‘అతి కష్టమైన వాతావరణంలో మీ బాబు అన్ని గంటలు ఈదడానికి వెళు తున్నప్పుడు మీకు భయం వెయ్యలేదా? ‘ అని ప్రశ్నించారు .
 
          ‘ అప్పటి నా మానసిక పరిస్థితిని వివరించడం కష్టం ! ఆందోళన, నమ్మకం ఒక దానితో ఒకటి ఢీ కొట్టేవి. నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ , నా కళ్ళు మా వాడి విజయం కోసం వేచి చూసేవి ‘ అంటూ …
     
          ‘ నిజానికి వాడు అమెరికాకు చదువుకోవడానికి వెళ్లి , ఉద్యోగంలో చేరిన తరువాతే .. వాడికి ఈత పట్ల మరింత మక్కువ పెరిగింది. అక్కడి వారు మధులోని ప్రతిభనుగుర్తించి, లాంగ్‌ డిస్టెన్స్‌ స్విమ్మింగ్‌కు తమ అండదండలూ , ప్రోత్సాహం అందించడం మూలంగా .. ఇంగ్లీష్‌ ఛానల్‌ని ఈదడానికి కావాల్సిన ట్రైనింగ్‌ తీసుకోగలిగాడు. ఓ వైపు కుటుంబ బాధ్యతలూ , మరో వైపు ఉద్యోగం. సాహసాలు ! ఇలాంటి సమయాల్లో ఆరోగ్యం, మానసిక దృఢత్వంతో పాటు ఆర్థికంగా కూడా వెన్ను దన్ను వుండాలి . ఇన్ని సమస్యల మధ్య వాడిని అన్ని విధాలుగా  ప్రోత్సహించిన వారందరికీ నా ధన్యవాదాలు ! ‘ అని చెప్పారు.
    
ప్రముఖ రచయిత అరణ్య కృష్ణగారు ఫేస్ బుక్ లో –
 
          ‘అద్భుతాలు చేసేవారెవరూ.. ఎప్పుడూ ఆకాశం నుంచి ఊడిపడరు. వారూ మన లాంటివారే ! మనలాగే వారూ సమాజం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటారు. కానీ వాళ్ళల్లో ఒక అంతరంగ జ్వాల వుంటుంది. అలాంటి వాళ్లు మంచు పర్వతాలెక్కి జెండాలు పాతొచ్చు.. సప్త సముద్రాలను సైతం అవలీలగా దాటేయొచ్చు. 
 
          కొందరు అంతే.. అతిసామాన్యంగా కనిపిస్తూనే.. అద్భుతాలు సాధిస్తుంటారు. అలాంటి వాడే మధు నాగరాజ. 
 
          కెనడాలో స్థిరపడిన మన తెలుగాయనకి సముద్రాల్లో ఈత కొట్టడమంటే మహా సరదా. అలలతాకిడి ఎక్కువగా ఉండే ప్రపంచ ప్రసిద్ధిచెందిన జలసంధుల్లోనూ ఎదు రీదుతూ రికార్డులను తిరగరాసారు ‘ ..
 
అని పేర్కొనడం మధూకి లభించిన మరో సర్టిఫికెట్.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.