భారతీయతలో- జడ – ముడి

– రంగరాజు పద్మజ

          వేల సంవత్సరాల నుండి ఆధ్యాత్మికంగానైనా, అందానికైనా స్త్రీ మూర్తుల జడకొక విశిష్టత, ప్రాముఖ్యత, పరమార్ధం ఉన్నదన్నదని అన్నదానికి మనకు పూర్వ కావ్యాలలో ఎన్నో ఉదాహరణలు కనపడతాయి! నేను ఎక్కువ కావ్యాలు చదవలేదు తెలిసిన నాలుగు విషయాలు ముచ్చటిద్దామని అంతే!

          ఋష్యశృంగ మహాముని ‘మాలినీ శాస్త్రాన్ని’ రచించాడట. విచిత్ర విషయమేమి టంటే ఆ ముని అవివాహితుడే కాక స్త్రీ పురుష భేదం తెలియకుండా పెరిగిన ముని. అటు వంటి ఋషి పూలమాలలను ఎలా తయారు చేస్తారని ? పూల గుత్తులు అంటే బొకే [Bouquet] తయారు చేయడం ఎలా అనీ? వివాహాలు, శుభకార్యాలు లేక యజ్ఞయాగాది వేదికలు లేదా విద్వత్ సభలలో వేదికలను అలంకరించడం ఎలా ? అని పూలతో రక రకాల జడలు-ముడులు వేయడం ఎలా? అని ప్రేయసీ ప్రియులు తమ రహస్య సంభాష ణలను పూలరేకుల పై ఎలా? వ్రాయాలనీ రాసిన వాటిని ఎలా? పంపాలని …మొదలైన ఎన్నో విషయాలను తన మాలినీ శాస్రంలో 12 అధ్యాయాలలో రాశాడట. అంటే జడా- ముడీ దాని అలంకరణలు త్రేతాయుగం నాటికే ఎంతో ప్రసిద్ధి పొందాయన్న మాటే కదా!
త్రేతాయుగం అనగానే మనకు సీతమ్మ వారు- ఆమె జడగుర్తుకు వస్తుంది కదా? ఔను ! సీతారాములు వనవాసానికి బయలుదేరే ముందు అనసూయ ఆశ్రమం దర్శించి , ఆమె దీవెనలందు కోవాలని, వెళ్లితే ఆమె ఎన్నో విషయాలు చెప్పి, వాడిపోని పూలమాలను ఇచ్చి, ఎప్పుడూ అలంకరణలో అశ్రద్ధ చేయకు! జడ చక్కగా వేసుకో… ఈమాల వాడిపోదు కనుక ధరించు! అని చెప్తుంది… అంటే జడ లేదా ముడి కేశాలంకరణ అప్పటికే చాలా నైపుణ్యాలతోనూ, ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన్నట్టే కదా!

          రామాయణంలో మరో చోట కూడా జడ ప్రస్తావన వస్తుంది. రావణుడు సీతమ్మను అశోకవనంలో బంధించి, తనకు వశమవ్వాలని నిర్భందిస్తుంటే… ఆ మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది.. ఎలా చేసుకోగలను? నా దగ్గర విషం కానీ పదునైన కత్తికానీ లేదు. ఎలా ? అని చాలా సేపు ఆలోచించి, తన భర్త కెంతో ఇష్టమైన మరియు తన ఆశాపాశమైన జడతోనే ఉరివేసుకుంటానని తీర్మానించుకుంటుంది.అంటే అంత పొడగాటి జడ సీతమ్మ జడ!

          జగద్గురువు ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలోనూ అమ్మ వారి కబురు బంధాన్ని (‘కురులను’) వర్ణిస్తూ ఇలా అంటారు.

ధునోతు ధ్వాన్తం న స్తులిత దళితేన్దీవర వనం
ఘనస్నిగ్ధశ్లక్ల్ణం చికుర నికురంబం తవ శివే
యదీయం సౌరభ్యం సహజముపలబ్దుం సమనసో
వసన్త్యస్మి న్మన్యే వలమథన వాటీ విటపినామ్॥

భావం:- ఓ తల్లీ! అప్పుడే వికసించి ఉన్న నల్ల కలువల సమూహంలాగా, కారుమబ్బుల లాగా, దట్టమై, చిక్కనై సుగంథ తైలాలతో కూడుకుని, మెత్తగా ఉన్న నీ కురులు మా యొక్క అజ్ఞానం తొలగించుగాక! నీ కురుల యొక్క సువాసనలు తమతో తెచ్చుకోవ డానికా? అన్నట్టు ఇంద్రుని నందనోద్యానవనంలోని కల్పవృక్ష పూలు నీ కురుల యందు చేరాయి. అంటే పూవులకు ఆ సువాసన అమ్మ వారి కురుల నుంచే వచ్చిందని అర్ధం. ఇలా అమ్మవారి కురులను దర్శిస్తే తమ పాపరాశి దగ్ధమౌతుందని, అజ్ఞానులు జ్ఞానులౌతారని, కురులను వర్ణించారు.

          మరొక ఉదాహరణలో…. మహాభారతంలోని విరాటపర్వంలో అజ్ఞాత వాసం గడిపేం దుకు విరాటరాజు భార్య సుదేష్ణ దగ్గర ద్రౌపది సైరంధ్రిగా పనిచేస్తానని ధర్మ రాజుతో చెప్తుంది.

          సైరంధ్రి [ Beautician ] అంటే అదొక వృత్తి. ఆ కాలంలో ఈ వృత్తిలో ఉన్నా చిన్న చూపు చూసేవారు కాదు. అందానికంత ప్రాధాన్యత నిచ్చేవారన్న మాట! వారి వారి నైణ్యాలను బట్టి, ఎన్నో ధృవపత్రాలందుకునేవారు (cerificate). ‘మాలిని’ పేరుతో సుదేష్ణ దగ్గర ఉండి సౌందర్యానికి మెరుగులు దిద్దుతానని… అన్నప్పుడు నీకు ఆ విద్య తెలుసునా? అని ప్రశ్నిస్తాడు ధర్మరాజు.

          అందుకు ద్రౌపది ఇలా సమాధానమిస్తుంది.

కలపంబు లభినవ గంధంబులుగ గూర్చి! తనువున
నలదుదు దనుపుగాగ
మృగపదపంకంబు మృదువుగా సారించి!
తిలకంబు వెట్టుదు జెలువు మిగుల బువ్వులు బహువిధంబుల గట్టి ముడికొక్క! భంగిగా నెత్తులు వట్టియిత్తు;
హారముల్ మెఱయ నొయ్యారంబుగా గ్రుచ్చి!
యందంబు వింతగా నలవరింతు;…..

          అంటే నేను చక్కని మైపూతలు తయారు చేస్తాను. అవెప్పుడూ ఘుమఘుమలాడు తుంటాయి. వాటిని రాణి శరీరానికి సున్నితంగా పూస్తాను. కస్తూరిని చందనంతో కలిపి, మెత్తగా మెదుపుతాను. రాణికి అందంగా తిలకం పెడతాను. ఎన్నో రకాల పూల మాలలు కట్టుతాను. ముడికొక తీరున పూలచెండ్లు కట్టిస్తాను. అందంగా హారాలు కూరుస్తాను. వాటితో కొత్త అందాలు విరజిమ్మే విధంగా చేస్తాను. ఎంతో నైపుణ్యంతో అవసరమైన పనులు చేస్తాను. మహారాణికి నా పై ఇష్టం కలిగేలా నడుచుకుంటానంటుంది ద్రౌపది.

          5000 సంవత్సరాల పూర్వమే అలంకరణ, ముఖ్యంగా జడలు- ముడులు- వాటికి పూవుల అలంకరణ మొదలైనవి ఉండి ఈనాటికీ అనుసరిస్తూ అనుకరిస్తున్నాం !

          ఇక సత్యభామ జడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే! ఆ జడలో అలంకరించుకోవడానికి పారిజాత పుష్పం కోరితే కృష్ణుడు ఇంద్రుడినే జయించి, పారిజాత వృక్షాన్నే తెచ్చి, సత్యభామ పెరటిలో నాటిన విషయం ఒక ప్రబంధమై ఎంతో అలరించింది.

          సత్యభామకు నిపుణులైన సైరంధ్రిలు ఎందరో ఉండేవారట. మందార నూనె, సుగంథ ద్రవ్యాలతో తలంటి, మేలైన షీకాయ కషాయంతో జుట్టును మృదువుగా రుద్ది అభ్యంగన స్నానం చేయించి, తరువాత సాంబ్రాణి, అగరు ధూపములను వేసి, ఆమె కురులను ఆరబెట్టేవారట! నల్లటి కురులలో మల్లె.. మొల్లలతో పూలజడలను వేసే వారట.

          ఈ సత్యభామ జడ ప్రాశస్త్యం సిద్దేంద్రుడు రచించి, ప్రదర్శించిన ‘భామా కలాపం’ ప్రదర్శనలో ముందుగా తెర పై జడనే ప్రదర్శించేవారు. ఎందుకో తెలుసునా?నర్తకుడు తనకున్న పాండిత్యాన్ని పరీక్షించుకోవచ్చని పండితులకు ఒక పందెం వలె సంకేతంగా వేసేవాడు. భరతశాస్త్రంలో తమతో సమానమైన వారు కానీ తమవంటివారు లేరని పందెం వేయడమన్న మాట! ఎవరైనా భరతశాస్త్రం చదివిన పండితులుంటే చర్చకు రావాలనీ.. తామోడిపోతే ఆ పండితులు జడ కత్తిరించి వేయవచ్చునని పందెం!

          అంటే కూచిపూడి వారు నాట్యశాస్త్రంలో అంత గొప్పవారట ! అంత నిష్ణాతులట!
నాట్యం ఎలా సాగేదంటే…

భామనే…. భామనే… సత్య భామనే..
సుందర వదనం నాదేనే…
సుందరి అంటే నేనేనే..
భామరో గోపాలమూర్తికి ..
ప్రేమ ధామమైన ముద్దుల భామనే…

          అంటూ జడ పట్టుకొని సత్యభామ పాత్ర హొయలు పోవడం పాత తరానికి బాగానే గుర్తుండి ఉంటుంది.

          పారిజాతాపహరణంలోని ముక్కుతిమ్మన సత్యభామ జడైనా… మనుచరిత్రలో వరూధిని జడైనా, రాణుల వంటి వారి జడైనా నడుము నుండి పిరుదల మీద నడియాడితే ఎందరికో గుండె ఒక్క క్షణం కొట్టుకోవడం మానవలసిందే జడ మహత్మ్యం అటువంటిది!!

          గోదాదేవి తాను రచించీ గానంచేసిన ‘తిరుప్పావు’ లో కూడా జడను ఎంతో అందంగా వర్ణించింది. పిరుదులపై పడిన జడ పుట్టలో నుండి వస్తున్న పామువలె ఉందనీ, అంటే పిరుదులేమో పుట్టవలె అనీ జడ చివర పాము తోక వలె అనీ, జడ మొదటి భాగం వెడల్పైన పడగ వలె ఉందనీ, జడలో అలంకరించిన ఆభరణాలు పడగ మీది మణుల వలె ఉందనీ ఎంతో అందంగా వర్ణించింది…

          ‘జడ జడే సుమా ! ఏ కాలమైనా దాని అందం దానిదే’!!

          నీలా సుందరి పరిణయంలో … కూచిమంచి తిమ్మకవి నాయిక కురులను ఇలా వర్ణిస్తాడు.

ఆటవెలది
కెంపు బెంపడంపసొంపగు వాతెఱ
మిన్ను జెన్ను నెన్ను గన్నె నడుము
మీలనేల జాలు వాలు గన్నుంగవ,
తేటి దాటు మీట బోటి కురులు,
అని అంటారు..

          క్షేత్రయ్య రాసిన గేయ కవిత్వంలోని మువ్వగోపాల అనే పదంతో రాసిన గేయం ఒకటి జడ విశేషం తెలుపుతున్నది.

మగువ తన కేశికా- మందిరము వెడలెన్
వగకాడ మా కంచి – వరద తెల్లవారే ననుచు
॥ మగువ॥
విడజాఱు గొజ్జంగి – విరిదండ ‘జడ’ తోను
కడు చిక్కుబడి పెనగు- కంట సరితోను
నిడుద కన్నుల దేరు- నదుర మబ్బుతోను
తొడరి పదయుగమున – దడబడెడు నడకతోను
॥ మగువ॥

అంటూ జడను భలే వర్ణించాడు.

          ఇక అన్నమయ్య మాత్రం జడను తక్కువ వర్ణించాడా? ‘జడ’ జారి చీకట్లు కమ్ము కున్నాయట!

          శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన ‘ఆముక్తమాల్యద’ గ్రంథంలో  శ్రీవిల్లిపుత్తూరు లోని స్త్రీల సౌందర్య వర్ణన చేస్తూ…

ఉ॥
వేవిన మేడపై వలభి వేణికి జంట వహించి విప్పగా
బూవులు గోటుమీటుతరి బోయెడు తేటుల మ్రోతగామిశం
కావహమోగ్రుతాభ్యసన లేటను దంతపు మెట్లపై వెంబడిం
జేవడి వీణ మీటులు చిక్కెడలించుటలున్సరింబడన్॥

          అంటే… ఆ నగరకాంతలు మిద్దెల మీద నిలబడి తమ జడలను చేతి వేళ్ళతో విప్పుకుంటుంటే రాత్రి జడలో ముడుచుకున్న వాడిపోయిన పూలు తీసేస్తూ ఉంటే ఆ పూల వాసనకు తుమ్మెదలు ఝుమ్మని చేస్తున్న ఆ ధ్వనులను ఆ వీధిలో వెడుతున్న కాముకులకు వీణమీటినట్టు కనపడుతున్నదట! అంతే కాదు ఆ నగర కాంతలు ఆ రెండు జడలను ముందుకు వేసుకొని వయ్యారాలు పోతుంటే జడల కింద ఉన్న వక్షోజాలు వీణ బుర్రల వలె అనిపిస్తున్నాయట!

          అంతే కదా! మగవారి మనసును దోచేది మగువల జడ, ఆ జడలో తురిమిన మల్లెలే కదా!

          ‘శేఖర కాపీడ యోజనము’ అనే కళ పూలతో తలకు చుట్టూ అలంకరించే పూల నగిషీని కూర్చే కళ. ఈ కళ రాజుల కాలంలో 64 కళలలో ఒక కళగా ఎంతో ప్రసిద్ది పొందిన కళ. అలాగే మరో కళ ‘మాల్య గ్రథన వికల్పములు’ [ చిత్ర విచిత్రమైన పూలమాలలు కట్టి జడనలంకరించే విద్య] .

          చక్రవర్తుల, రాజుల అంతఃపురంలో మహిళలకు తలంటు స్నానాలు చేయించ డానికీ, జడలలంకరించడానికీ సైరంధ్రులను నియమించడానికి వారు ‘ఉత్సాధన-కేశమర్దన కౌశలము’ ( Diploma course ) [ ఒళ్ళుపట్టుట; తలంటి అభ్యంగనాలు చేయించుట] ఇది కూడా 64 కళలలో ఒకటైన ఈ అంశంలో నిష్ణాతులై, ధృవపత్రాలు (సర్టిఫికెట్) ఉన్న వారినే నియమించే వారట!

          ఆంగ్లేయ బాలబాలికలు ఇప్పటికీ సంప్రదాయ పండగలలో, వివాహ వేడుకలలో ఇలా తలచుట్టూ పూలను అలంకరించుకుంటారు. వారికి జడ ఉండదు జుట్టు కత్తిరించు కుంటారు కనుక పూల అలంకరణ ఆవిధంగా ఉంటుంది.

          కాళిదాసు శకుంతల కూడా తలచుట్టూ పూలను అలంకరించుకున్నట్టు కవులు రాస్తారు.

          ఇలా నాటి నుండి- నేటి వరకూ జడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టే పెళ్ళి కూతురు అలంకరణలో ‘జడ’ వేయడంలోనూ, దానికి అలంకరించే ఆభరణాల విషయం లోనూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పాటిస్తూ… ఎంతో అందంగా జడను వేస్తారు. ఎన్ని సొమ్ములు పెట్టినా, ఎంత ఖరీదైనా పట్టుచీర కట్టినా.. జడ బాగా వేయక పోతే ఆ అలంకరణ అరకొరగానే ఉందని అనుకుంటారు.

          ఈ జడ ఒక్క పెళ్ళిలోనే కాదు చీరకట్టించే వేడుకలోనూ, సీమంతం రోజు కూడా, వేసి ఆనందిస్తారు. కొంత కాలం కింద వరకూ చిన్న పిల్లలకు మల్లెలు పూచే సమయంలో మల్లెల జడ, మొగిలిరేకుల జడ, బంగారు జడ , ముత్యాల జడలు వేసేవారు.

          ఇక పాయల జడలు, తిరుగ మళ్ళేసిన జడలు, పాకెట్ జడలు ,కాళ్ళా జడలు ఇలా కేవలం వెంట్రుకలతోనే వేసే జడలు ఎన్నో రకాలు. ఈ జడకు నాగరం, జడకుప్పె, కొప్పు మొగ్గలు, రాళ్ళ పిన్నులు, జడగంటలు, కుచ్చులు, ముత్యాల కుచ్చులు, సూర్య బిళ్ళలూ, పాపిట బొట్టు, బిచోడాకైతే చెవుల నుండి కొప్పు వరకు వేలాడే బంగారుపూచేర్లు, బంగారు చామంతి పూలు, నాగ సరాలు , ఇలా ఎన్నో నగలుండేవి.

          ఇప్పుడున్న పరుగుల జీవితంలో పడతులకు ఇలాంటి ముచ్చటలు పెళ్ళిళ్ళ లోనూ, చిన్న వారికి ‘పాడుతాతీయగా’ పాటల కార్యక్రమం టీ.వి.ల లోనూ, బతుకమ్మ ఆటలో కొంత మంది పాటిస్తున్నారు. అలా జడవేసుకుని పూలు పెట్టుకుంటే ఆ అందమే వేరు!

          కొన్ని సందర్భాలలో మాత్రమే జుట్టు విరబోసుకున్నా … మిగతా సమయాలలో విరబోసుకుంటే దరిద్రమనే వారు. విదేశీ సంస్కృతి అనుకరణే ఈ విరబోసుకోవడం. అక్కడ వారికి తప్పని సరి ఎందుకంటే విపరీతమైన చలి, చెవులు మెడ మొదలైన భాగాలు తల వెంట్రుకలతో కప్పడంతో గడ్డకట్టే ఆ చలి నుండి రక్షించుకోవచ్చని వారు అలా విరబోసుకుంటారు. మన దేశ వాతావరణం ప్రకారం మనముంటే అటు సంప్రదాయం ఇటు కాల పరిస్థితులకు తగినట్టుగానూ ఉంటుంది.

          జడ ఎంతో అందాన్ని, సౌకర్యాన్నిస్తుంది. అంతే కాదు ఆరోగ్యం కూడా! ఎందుకంటే జడ మూడు పాయలుగా విడదీసే మెడమీది భాగాన రక్తప్రసరణ చేసే నరాలు, నాడులుం టాయట! అవి సత్వ, రజో, తమోగుణాలను వృద్ధి చేయాలని జడను ముప్పేటలుగా అల్లితే రక్త ప్రసరణ బాగా జరుగుందని నాడీ శాస్త్రం చెప్పుతుంది.

          ఇదండీ జడ కథా కమామిషు!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.