సాహసాల రాజా మధు నాగరాజ -3

-డా. అమృతలత

సాహసాలతో సహవాసం

అయితే విజేతల దృష్టి ఎప్పుడూ శిఖరాగ్ర భాగం మీదే వుంటుందన్నట్టు .. మధు సాహసా లు అంతటితో ఆగలేదు.

          ఈ పర్యాయం 2015లో మధు ధక్షిణ అమెరికా ధక్షిణపు చివరి భాగాన ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ‘మెగలాన్ జలసంధి’ని ఈదాలని సంకల్పించారు.
 
          అయితే అత్యల్ప శీతోష్ణస్థితి కారణంగా ప్రాణాంతకమైన హైపోథెర్మియాకి ఆయన గురైనపుడు .. చిలియన్ నేవీ వాళ్ళు నీళ్లల్లోంచి మధును రక్షించి ఒడ్డుకు చేర్చారు.
 
          ఆ ప్రయత్నాన్ని ‘విజయవంతమైన వైఫల్యం ‘ ( A successful failure ) గా పేర్కొం టారు మధు.
 
***
 
          అనంతరం ఏడుగురు సభ్యులున్న తన బృందంతో 2nd అక్టోబర్ 2016న 24 గంటలు ప్రయాణం చేసి, 5 సరస్సులను ఒక్కొక్క  కి.మీ వంతున స్విమ్ చేస్తూ మరో ఘనతని సాధించారు.
  
***
 
          పోతే మొదటిసారి మెగలాన్ జలసంధిని ఈదే  విషయంలో తన వైఫల్యం అతడిని ఏ మాత్రం నీరుగార్చ లేదు సరికదా అతడిలో మరింత పట్టుదలని పెంచింది. 
 
          తన మలి ప్రయత్నంలోని భాగంగా, పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి 2017లో మరింత పట్టుదలతో చెలరేగాడు.
 
          ఈ స్విమ్మింగ్ ఛాలెంజ్ లో 4`C నీటి చల్లదనం గానీ , గంటకు 50కి.మి. గాలి వేగంగానీ, రెండు మీటర్లు ఎత్తున ఎగిసిపడుతున్న అలలు గానీ అతడిని ఏ మాత్రం నిర్వీర్యపరచ లేదు.
 
          చివరకు 29, నవంబరు 2017లో …  గంటా పందొమ్మిది నిముషాల వ్యవధిలో సాహసోపేతమైన మెగలాన్ జలసంధిని ఈది, ప్రపంచ స్థాయిలో ఆ జలసంధిని దాటిన 23వ వ్యక్తిగా, ‘ తొలి కెనడియన్ ‘గా, ‘తొలి ఏషియన్’గా రికార్డ్ సృష్టించి, కెనడా, భారతదేశ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు! 
 
          ఆ సంవత్సరం కెనడా దేశపు 150 జన్మదినం కావడం తనకు మరచిపోలేని అనుభూతి అనీ, ఆ సందర్భంగా కెనడా దేశ గౌరవార్థం తాను సాధించిన విజయాన్ని అర్పిస్తున్నానని చెప్పుకున్నారు మధు.
 
          కెనడా ప్రధానమంత్రి, ఇతర మంత్రి వర్గ సభ్యులు ఆ దేశ పార్లమెంటులో మధు  సాధించిన ఘనతను ప్రకటించి, తమ అభినందనలు తెలియజేస్తూ, మధుకి ఒక అభినందన పత్రాన్ని అందజేసారు.
 
          ‘ఇలాంటి సాహసాల్లో ప్రకృతి సహకరించకపోతే ఎంతటివారైనా ఏమీ చేయలేరు. స్విమ్మింగ్‌లో నేను సాధించిన విజయాలన్నీ నా తోటివారందరికీ చెందుతాయి’ అంటారు మధు
  
***
 
          ‘ఎన్ని కష్టాలు ఎదురైనా ఫర్వాలేదు, ధైర్యంగా నీ అడుగు ముందుకు వెయ్యి , నీ దారి సుగమం అవుతుంది’ అంటారు మధు.
 
          ‘ప్రపంచమంతా నిద్రిస్తోన్న సమయంలో సరస్సులో ఈదటం చాలా ఆనందంగా వుంటుంది. ఆ నిశ్చలత, ప్రశాంతత మనసుకి ఎనలేని సాంత్వనని కలిగిస్తుంది’ అంటూ ఎంతో ఆనందంగా చెప్తారు మధు.
 
  • ఇప్పుడు స్విమ్మింగ్ కూ, సాహసాలకూ మధు నాగరాజ బ్రాండ్ అంబాసిడర్. వివిధ హోదాల్లో తన అనుభవాలను ఔత్సాహికులకు పంచుతున్నారు.
  • మధు నాగరాజ  పేరు ‘ Ontario Swimming Hall of Fame’ లో చేర్చబడింది.
  • మధు అంతర రాష్ట్రీయ మెరథాన్ స్విమ్మింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ కు కార్యనిర్వాహక సభ్యుడయ్యారు.
          ‘నీటిని సంరక్షించడానికి మనం పర్యావరణ నిపుణులు కావలసిన అవసరం లేదు. పరిసరాలను గౌరవించాలన్న అవగాహన, జ్ఞానం వుంటే చాలు. మనకు చెందిన నీటి వనరులను సంరక్షించటం మన బాధ్యత, కర్తవ్యం !’ అంటారు మధు.
 
          క్వీన్ ఎలిజబెత్ II  గౌరవార్థం జరిగిన ప్లాటినం జూబిలీ ఉత్సవాల్లో.. ఉత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను గౌరవించడంలో భాగంగా-
మధునాగరాజ చేసిన విశిష్ట సేవలకు గాను అతడిని ఒక జ్ఞాపికతోనూ, గుర్తింపు పత్రం తోనూ సత్కరించడం మనమంతా హర్షించదగిన విషయం !
 
( మెగలాన్  జలసంధిని ఈది  5  సంవత్సరాలవుతోన్న సందర్భంగా… మధు అచీవ్ మెంట్స్ గుర్తు చేసుకుంటూ .. )

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.