జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-13

   -కల్లూరి భాస్కరం

          ఇప్పటి మన అనుభవానికీ, 29వేల నుంచి 14వేల సంవత్సరాల వెనకటి కాలంలో జీవించిన వ్యక్తుల అనుభవానికీ మధ్య ఒక మౌలికమైన తేడా ఉంది. వాతావరణంతెచ్చిన తేడా అది. భారత ఉపఖండంలో 45వేల సంవత్సరాల క్రితం సూక్ష్మశిలా యుగపు (మైక్రోలిత్స్) ఆనవాళ్ళు కనిపించగా, 35వేల సంవత్సరాల క్రితం నాటికి అవి అన్ని చోట్లకూ విస్తరించాయి. ఆఫ్రికా నుంచి భారత్ కు ఆధునికమానవులు వలస వచ్చేనాటికి ఇక్కడ ఉన్న ప్రాచీన రకం మానవులు అప్పటికి అంతరించడం, దాంతో ఆఫ్రికా వారసత్వం కలిగిన ఆధునిక మానవులు ఉపఖండం అంతటి పై పోటీలేని ప్రాబల్యాన్ని స్థాపించుకోవడం సంభవించాయి.

          అయితే, అప్పటికే ప్రపంచం దీర్ఘకాలంపాటు కొనసాగబోయే మంచుయుగం వైపు అడుగులు వేయడం ప్రారంభించింది. దాంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణంమనుషు ల మనుగడను ప్రభావితం చేస్తూ వచ్చింది. 29వేల సంవత్సరాల క్రితం మొదలైన ఈ మంచు యుగం, 14వేల సంవత్సరాల క్రితం ముగిసి, క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయనుకున్న దశలో మళ్ళీ మంచు ముంచెత్తి 13వందల సంవత్సరాలపాటు కొనసాగింది. దీనిని యంగర్ డ్ర్యాస్ (Younger Dryas) అని పిలిచారు. ఈ దశ కూడా గడిచిన తర్వాతే, అంటే 11, 700 సంవత్సరాల క్రితం నుంచి, ప్రపంచం తిరిగి ఉష్ణ వాతావరణంలోకి వచ్చింది. హలొసీన్ (Holocene) అని పిలిచే ఈ వాతావరణ దశలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం.

          అంటే, పాతరాతియుగానికీ, సూక్ష్మశిలాయుగానికీ చెందిన మానవులకూ మనకూ మధ్య హలొసీన్ ఒక మాదిరి విభజన రేఖ అయిందన్నమాట. అదికూడా ఏదో ఒక్క విషయంలో కాదు- ఆహారపు అలవాట్లు, ఆహారోత్పత్తి పద్ధతులు, సంస్కృతి, కళలు, మత విశ్వాసాలతో సహా మనుగడకు సంబంధించిన అనేక విషయాల్లో (అయితే, అంత్యక్రియ ల వంటి కొన్ని తంతులు హలోసీన్ కు ముందునాటి మానవుల్లోనూ ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి)!

          వీటితోపాటు వాఙ్మయాన్ని కూడా కలుపుకున్నప్పుడు, మన ప్రాచీన వారసత్వమని దేనినంటున్నామో అదంతా కేవలం ఈ పది, పదకొండువేల సంవత్సరాల కాలంలో ఇమిడి పోతుందని పురాచరిత్రకారులు, మానవ శాస్త్రవేత్తలు అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే, మానవగతాన్ని కల్పాలు, మన్వంతరాలు, యుగాలు వగైరా పేర్లతో లక్షలాది సంవత్సరాల పరిమాణంలో ఊహించుకోవడాన్ని మతమూ, దానికి సంబంధించిన వాఙ్మయమూ మనకు అలవాటు చేశాయి. ఇప్పుడాలోచిస్తే, నేత్రభ్రాంతి లానే అది కూడా మెదడు చేసే మాయగా తోస్తుంది.

***

          కనుక, దాదాపు పన్నెండు వేల ఏళ్ళుగా ఒకే వాతావరణంలో ఉంటున్న మనకు, అంతకు ముందు హిమప్రళయాన్ని ఎదుర్కొన్న జనాల అనుభవాలు, అగచాట్లు ఊహకు అందవు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆహారం కోసం వెతుకులాట- కొత్త ఆహారోత్పాదక పద్ధతులకు, ప్రయోగాలకు దారితీసింది. ఆ ప్రయోగాల నుంచి అభివృద్ధి చెందినదే వ్యవసాయం. వలసలను అనివార్యం చేసిన కారణాలలో వ్యవసాయం ఒకటి కావడమే కాదు; అతి ముఖ్యమైనది కూడా అయింది.

          ఈ సందర్భంలో- నేటి లెబనాన్, సిరియా, పాలస్తీనా, ఇరాక్, జోర్డాన్ తదితర ప్రాంతాలలోని ఆహారసేకరణ జనాలను టోనీ జోసెఫ్ ఉదహరిస్తాడు. మంచుయుగంలో తామున్న అనేక ప్రదేశాలు వాసయోగ్యం కాకుండాపోవడం వల్లా, ఆహారపు వనరులు బాగా తగ్గిపోవడం వల్లా వారు తీవ్రమైన ఒత్తిడులకు గురయ్యారు. నివాసానికి ఎంతో కొంత అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు జనం చేరుకోవడంతో అక్కడ జనసాంద్రత పెరిగి ఆహార సమస్యను మరింత పెంచింది. దానితోపాటు, వెనకటితో పోలిస్తే, సంచారజీవనం తగ్గి, మొదటిసారి స్థిరజీవనానికి జనం అలవాటుపడడం ప్రారంభించారు. దాంతో ఆహార సేకరణలోనూ, ఆహార ఉత్పాదనలోనూ మెరుగైన పద్ధతుల వెతుకులాటా, ఆ దిశగా ప్రయోగాలూ ముమ్మరమయ్యాయి. 14వేల సంవత్సరాల క్రితం క్రమంగా వాతావరణం మెరుగుపడడం మొదలయ్యేనాటికి ఈ ప్రయోగాలలో కొన్ని విజయవంతం కాగా, కొన్ని విఫలమయ్యాయి. విజయవంతమైన చోట జనాలు మరింతగా స్థిరజీవనానికి అలవాటు పడగా, మిగిలినవాళ్లు ఎప్పటిలా సంచారజీవనం సాగించే పరిస్థితి  ఏర్పడింది. 

          పురాతత్వ శాస్త్రజ్ఞుల ప్రకారం, మంచుయుగపు ప్రభావాలు, వాటి కారణంగా జరిగిన ప్రయోగాలు, వాటి పర్యవసానాలు నాతూఫియన్ (Natufian) లలో స్పష్టంగా కనిపిస్తాయి. పాలస్తీనాలోని వాడి-అన్ -నాతూఫ్ లోయలో నివసించిన జనాలను ఇలా పిలిచారు. వీరికి చెందిన సంస్కృతి క్రీ.పూ.12,500-క్రీ.పూ.9,500 మధ్యకాలంలో మూడువేల సంవత్సరాల పాటు వర్ధిల్లి ఆ తర్వాత కనుమరుగైంది. స్థిర/సంచార రూపాల్లోని ద్వంద్వ జీవనం నాతూఫియన్లతోనే మొదలైందని అంటారు. వీరు నేరుగా వ్యవసాయం ప్రారంభించక పోయినా, మొక్కలను సేకరించడం, ఆహారం తయారు చేసుకోవడం ప్రారంభించినట్టు- వీరి ప్రాంతంలో దొరికిన రాతి కొడవళ్ళు, రుబ్బురోలు వంటి శిలాసాధనాలు సూచించాయి. శ్మశానాల కోసం ప్రత్యేకంగా స్థలాల కేటాయింపు; వస్తు మార్పిడి రూపంలో రాతిపరికరాలను, ఇతర ఖనిజాలను ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పరచుకున్న వ్యవస్థ లు, కొత్తగా కుటీరపరిశ్రమల అవతరణతో సహా స్థిరజీవనానికి అవసరమైన హంగులు వీరిలో అభివృద్ధి చెందడం కనిపిస్తుంది. అలాగే, మొదట్లో వీరు చిన్నకుటుంబాలు నివసించేవాటికన్నా పెద్దవైన పక్కా నివాసాలను నిర్మించుకున్నారు కానీ, అవి క్రమంగా చిన్నవైపోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యమైపోయి జనం తిరిగి సంచార జీవనం ప్రారంభించిన ఆనవాళ్ళు కనిపించాయి.

          అందుకు కారణం, ఇంతకు ముందు చెప్పుకున్న యంగర్ డ్ర్యాస్ రూపంలో తిరిగి ఏర్పడిన ప్రతికూల వాతావరణం. దాంతో, స్థిర/సంచారజీవనాలూ, ఆహార ప్రయోగాల ద్వారా అస్థిత్వ పోరాటంలో తలమునకలవుతూ వచ్చిన నాతూఫియన్ల సంస్కృతి ఎట్టకే లకు విషమ వాతావరణం ధాటికి పూర్తిగా తలవంచి తప్పుకుంది.

          ఆ యంగర్ డ్ర్యాస్ కూడా ముగిసి, 11, 700 సంవత్సరాల క్రితం తిరిగి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలైనప్పటి నుంచి నడిచినది వేరే కథ. మంచుయుగం నుంచి బతుకు పాఠాలు నేర్చుకున్న మనిషి, ఆహార రంగంలో అప్పటి తన ప్రయోగాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి అంతిమంగా పూర్తిస్థాయి వ్యవసాయం వైపు, పశుపోషణవైపు పయనించాడు. అడవిలో దొరికే రకరకాల ఆహారపు మొక్కల సేకరణతోనూ, సాగుతోనూ; అడవి జంతువులను మచ్చిక చేయడంతోనూ మొదలైన ఈ ప్రక్రియ క్రమంగా పెంపుడు పంటల సాగుకు, పెంపుడు జంతువుల పోషణకు దారితీసింది. ఈ పరిణామం క్రీ.పూ. 9500-6500 మధ్యకాలంలో ఫెర్టైల్ క్రెసెంట్ గా పిలిచే దక్షిణ ఇరాక్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, లెబనాన్, ఈజిప్టు, ఇజ్రాయిల్, టర్కీ, ఇరాన్ లలో చాలా వరకు విస్తరించింది. అడవి మొక్కలూ, జంతువుల మచ్చిక జరుగుతూ ఉన్న దశలోనే, లేదా అంతకు ముందే వాటిని వెంటబెట్టుకుని మరీ జనం కొత్త చోట్లకు వలస వెళ్ళడం ప్రారంభించారు.

          సైప్రస్ లాంటి దీవికి మొక్కలను, జంతువులను పడవల్లో ఎక్కించి తీసుకు వెళ్ళడం మరింత ఆసక్తికరం అంటాడు టోనీ జోసెఫ్. శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణాల్లోని మనువు కథను, బైబిల్ లోని నోవా కథను ఇది గుర్తుచేస్తుంది. జల ప్రళయయం రాబోతున్న సమయంలో మత్స్యావతారం ఎత్తిన విష్ణువు ఆదేశం పై మనువూ, దేవుని ఆదేశం పై నోవా ఓడ నిర్మించి అందులో జంతువులు, ఆహారపు మొక్కలు సహా జీవజాలాన్ని ఉంచి రక్షించినట్టు ఈ కథలు చెబుతాయి.  హిమప్రళయం, దాని అనంతర కాలానికి చెందిన అనుభవాలు పరంపరగా ఆ నోటా ఆ నోటా వ్యాపించే క్రమంలో ఇలాంటి కథలు పుట్టి ఉంటే ఆశ్చర్యంలేదు.

***

          పై నేపథ్యాన్ని వెంటబెట్టుకుని ఇప్పుడు మెహర్ గఢ్ కు వద్దాం. నేటి పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో బొలాన్ కనుమ పాదాల దగ్గర ఉన్న మెహర్ గఢ్ లో ఇప్పుడున్న వాతావరణం దృష్ట్యా చూస్తే, హిమప్రళయ కాలానికీ, ఆ తర్వాతి యంగర్ డ్ర్యాస్ కాలానికీ అది ఎడారి తరహాలో ఉండి ఉండాలని టోనీ జోసెఫ్ అంటాడు. మంచుయుగంముగిసిన తర్వాతే ఆ నేల పచ్చదనం తెచ్చుకోవడం, చెప్పుకోదగిన మేరకు అక్కడికి జనం చేరడం జరిగి ఉండాలి. మొత్తం మీద క్రీ.పూ. 7000 నుంచీ మెహర్ గఢ్ జనావాసంగా ఉన్నట్టు ఆధారాలు కనిపించాయి. ఇంతకీ ఈ జనం ఎవరన్న ప్రశ్న లేవనెత్తిన జోసెఫ్, వీరు తొలి భారతీయులూ, లేదా పశ్చిమాన నేటి ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినవారూ, లేదా ఉభయులూ కావచ్చునని, ఆ తర్వాత ఉభయుల మధ్యా మిశ్రమం జరిగి ఉండడానికీ అవకాశముందని అంటాడు. 

          మెహర్ గఢ్ ఈ రెండు రకాల జనాల మధ్యనే కాదు; రెండు భిన్న వాతావరణ మండలాల మధ్యలో ఉంది. పశ్చిమంగా ఉన్న ఆసియా (పశ్చిమాసియా) భూ భాగం ప్రధానంగా శీతాకాల వర్షాలూ, శీతాకాలపు పంటల పై ఆధారపడితే; తూర్పున ఉన్న భారత భూ భాగంలో ఋతుపవనాలూ, వేసవి వర్షాలూ, వేసవి పంటలదే ప్రాబల్యం. వ్యవసాయ విస్తరణ కోణంలో చూసినా, ఇళ్ళ నిర్మాణం తీరు వగైరాల దృష్ట్యా చూసినా మెహర్ గఢ్ పై తూర్పు ప్రభావం కన్నా పశ్చిమ ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. మెహర్ గఢ్ లో ప్రారంభమైన కొన్ని వేల సంవత్సరాల తర్వాతే భారత్ లోని ఆయా ప్రాంతాలలో వ్యవసాయం మొదలైనట్టు ఆధారాలు సూచిస్తున్నాయి కనుక, అది తూర్పువైపు నుంచి కన్నా పశ్చిమంవైపు నుంచి మెహర్ గఢ్ కు విస్తరించి ఉండడానికే అవకాశం ఎక్కువని, తొలిదశల్లో ఆలోచనల వ్యాప్తి తూర్పు వైపు నుంచి కన్నా పశ్చిమంవైపు నుంచే జరిగి ఉండాలని ఇప్పుడు అందుబాటులో ఉన్న సాక్ష్యాలు సూచిస్తున్నాయని టోనీ జోసెఫ్ అంటాడు.

          అయితే, ఇందుకు ఒక మినహాయింపు ఉంది. అది, మధ్యగంగా ప్రాంతం. ఇంచు మించు మెహర్ గఢ్ కు సమకాలికంగానే, అంటే, క్రీ.పూ.7000నాటికే, నేటి ఉత్తర ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని లాహుర్ దేవా అనే చోట వరికోత ఆనవాళ్ళు కనిపిం చాయి. అడవి వరిని కోసే దశ నుంచి వరిని సాగుచేసే దశకు ఈ ప్రాంతం ఎప్పటికి చేరుకుందో చెప్పలేము కానీ, ఆనాడు దక్షిణాసియాలో జరుగుతున్న వ్యవసాయ ప్రయోగాల్లో మెహర్ గఢ్ తో పాటు ఈ ప్రాంతం కూడా భాగస్వామి అయినట్టు స్పష్టంగా కనిపిస్తోందని టోనీ జోసెఫ్ అంటాడు. అయితే ఒక తేడా ఏమిటంటే, మెహర్ గఢ్ పంటలు గోధుమ, బార్లీ అయితే; లాహుర్ దేవాలోది వరి. విశేషమేమిటంటే, మెహర్ గఢ్ తర్వాతి కాలానికి చెందిన హరప్పా నాగరికతా జనాల ప్రధాన ఆహారపు పంటలు గోధుమ, బార్లీలే. 

          కాకపోతే, పర్యావరణం, తదితర కారణాల వల్ల కావచ్చు, లాహుర్ దేవాలో ప్రయోగా లు పెద్ద ఎత్తున వరి సాగుకు దారితీయించలేక పోయాయి. అక్కడ పెరిగిన వరి రకం కూడా పూర్తిస్థాయి ఉత్పాదకతను అందుకున్నట్టు కనిపించదు. ఆ తర్వాత చాలా కాలాని కి తూర్పు ఆసియా నుంచి వచ్చిన జపోనికా రకంతో సంకరమైన తర్వాతే మనదేశంలో వరి ఉత్పాదకత పూర్తి స్థాయిని అందుకుంది. మొత్తం మీద, అప్పటికి మెహర్ గఢ్ లోనూ, పశ్చిమాసియాలోనూ అభివృద్ధి చెందినన్ని పంట రకాలు కానీ; పెంపుడు జంతువుల రకాలుకానీ లాహుర్ దేవాలో కనిపించవు. ఎద్దుల పెంపకం, నూలు వాడకానికి సంబంధిం చిన తొలి ఆధారాల లభ్యత వంటి కొన్ని ప్రత్యేకతలు మెహర్ గఢ్ కు ఉన్నప్పటికీ; ఇతర అనేక విషయాలలో ఈ ప్రాంతానికి తూర్పుతో కన్నా పశ్చిమంతోనే ఎక్కువ పోలిక కుదురుతోందని పురాతత్వ శాస్త్రజ్ఞులు తేల్చారు. ముఖ్యంగా చెప్పుకోవలసిన పోలికల్లో ఇళ్ళ నిర్మాణం కూడా ఒకటి. ఇరాన్ లోని జగ్రోస్ పర్వతపాదాల దగ్గర క్రీ.పూ. 7900 నాటివిగా గుర్తించిన చతురస్రాకారపు ఇళ్లలాంటివే మెహర్ గఢ్ లోనూ కనిపించాయి.

          ఇంతకీ ఈ పోలికలకు కారణం, పశ్చిమం నుంచి జనాలు మెహర్ గఢ్ కు వలస రావడమా; లేక సంచార జనాల ద్వారా పశ్చిమప్రాంత సంస్కృతి మెహర్ గఢ్ కు వ్యాపించడమా? జన్యుశాస్త్రవేత్తల ప్రకారం, ప్రాచీన DNA ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం రాబట్టింది. దాని గురించి తర్వాత….

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.