ఒక్కొక్క పువ్వేసి-26

చుండూరు నెత్తుటి నేరం

-జూపాక సుభద్ర

చుండూర్ హత్యాకాండ మీద వచ్చిన అన్యాయం తీర్పు పట్ల ఉద్యమ శక్తులు, ఉద్యమ సంఘాలు, ముఖ్యంగా హత్యాకాండ బాధితులు దళిత సంఘాలు న్యాయవ్యవస్థ ల పట్ల తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యారు. తీర్పుపట్ల ఆగ్రహం, ఆవేశంతో కూడిన నిరసనలు తెలియజేసారు. సరియైన సాక్ష్యాలు లేవని కేసు కొట్టేయడం జరిగింది.

కారంచేడు జరిగిన (1985) ఆరు సంవత్సరాలకు చుండూరు హత్యాకాండ జరిగింది.
గుంటూరు జిల్లా చుండూర్ గ్రామంలో రెడ్లు మాలపల్లి మీద బడి చేసిన మారణ కాండ (1991). ఈ మారణ కాండలో ఎనిమిది మందిని దొరికినోల్లను దొరికినట్లు నరికి గోనెబస్తాల్లో వేసి తుంగభద్ర కాలువల్లో పడేస్తే, కొమ్మెర అనిల్ కుమార్ అనే యువకుడు బాధిత క్యాంప్ లో పోలీసు కాల్పుల్లో చనిపోతే, మరోసారి దాడికి వస్తున్న రెడ్డి హంతకులను అడ్డుకున్నందుకు
అంగలకుదురు రాజమోహన్ చంపబడినాడు. యీ హత్యాకాండ మీద
డిల్లీకెళ్ళి ధర్నా చేసేటప్పుడు ఆక్సిడెంట్ లో గూడూరు లేయమ్మనే ఒక మహిళ చని పోయింది. మొత్తం చుండూరు మృతులు పదకొండుమంది.
జాలాది ముత్తయ్య – జాలాది ఇమ్మాన్యుల్ -జాలాది ఇసాకు
సంకూరు సమ్ సోను – దేవరపల్లి జయరాజు – మండ్రు రమేష్
మండ్రు పరిశుద్దరావ్ – మల్లెల సుబ్బారావ్ – కొమ్మెర అనిల్ కుమార్
అంగలకుదురు రాజమోహన్ – గూడూరు లేయమ్మ.

దీంట్లో అంగలకుదురు రాజమోహన్ డిగ్రీ చదివే మాదిగ విద్యార్థి. రెండో సారి దాడి చేయడాని కొచ్చె గుంపును అడ్డగించినందుకు చంపేసిండ్రు. కొమ్మెర అనిల్ కుమార్ ని బాదితుల క్యాంపులో పోలీసులు క్యాంపును భయభ్రాంతులు చేసి చెల్లా చెదురు చేయడానికి కాల్చి చంపారు. చుండూర్లో మృతులు పది మంది మాలలు, ఒక మాదిగ.
ప్రకాశం జిల్లా కారంచేడులో తాగే చెరువు నీళ్ళను మురికి చేస్తున్న కమ్మవాల్ల దాష్టి కాలపై మాదిగలు ఎదురు తిరిగినారని కమ్మ భూస్వాములు మాదిగలపై హత్యాకాండకు పాల్పడినారు.

గుంటూరు జిల్లా చుండూరులో రెడ్డి అమ్మాయిలను మాల అబ్బాయిలు కదిలిస్తున్నారని, సినిమాల్లో కాలు తగిలిస్తున్నారనే కారణాలతో మాలపల్లి మీద దాడి చేసి చంపేసినారు. రెడ్లు మాలపల్లి మీద దాడి చేయబోతున్నారని తెల్సిన పోలీసులే ఎలాంటి చర్యలు తీసుకోకుండా ‘పారిపోండి మిమ్మల్ని చంపడానికి రెడ్లు వస్తున్నారని చెప్పడం ఎంతటి విషాదం. అంటే పోలీసులు కూడా రెడ్డిమూక ముందు అసహాయులుగా వుండి పోయినయంటే కులాధిపత్యా లకు పోలీస్ వ్యవస్థ కూడా బాంచగిరి చేయడం ఎంత దారుణం.

అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం హయాంలో యీ హత్యాకాండ జరిగింది. పోలీసు వ్యవస్థ మిన్నకున్నది. కాని, సమాచారమైతే యిచ్చి దులుపు కున్నది. మూక నుంచి మామాలు జనాన్ని రక్షించడం పోలీసుల డ్యూటీ. కానీ చుండూర్ లో వూరికి దూరంగా అంటరాని దుర్మార్గాలకు బలవుతున్న మాలల్ని రెడ్డి గుంపు చంప డానికి వస్తుంటే అడ్డుకొని స్టేషన్లో పెడితే- – చుండూరు హత్య కాండ, మారణ హోమం జరక్క పొయేది.

చుండూరు దుర్ఘటన (6-8-1991) నాటికి రాష్ట్రం లో (AP) కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వుంది. కారంచేడు దుర్ఘటన (17-7-1985) టైమ్ లో రాష్ట్రం లో (AP)టీడీపీ గవర్నమెంట్ వుంది. కేంద్రంలో కాంగ్రెస్ వుంది. ఒక రాజకీయ ఉద్యమ ప్రముఖుడన్నట్లు తెలుగు దేశం పార్టీలో చెప్పుకోదగ్గ మాల లీడర్లు లేరు. కేంద్రంలో వున్న కాంగ్రెస్ గవర్నమెంటు, రాష్ట్రం లోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని యిరకాటంలో పెట్టడానికి, అస్థిరం చేయడానికి కాంగ్రెస్ మాలలు కారంచేడుని విజయ వంతంగా నడిపారు. కాని చుండూరు కు వచ్చేటాలకు యిటు కేంద్రంలో, అటు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే వుంది. రాష్ట్ర కాంగ్రెస్లో బలమైన గ్రూపు రెడ్లు. మాలలు కూడా ప్రముఖంగానే వున్నరు కాంగ్రెస్ లో. రెడ్లను ఢీకొనే బలం ఎస్సీ మాలలకు లేదు. తెలుగు దేశాన్ని అస్థిరం చేసినట్లుగా కాంగ్రెస్ ని చేయలేక పోయారు కాంగ్రెస్ మాలలు.

కారంచేడులో కమ్మలు ప్రతిఘటనా పోరాటానికి అడుగు వేయలేదు. కానీ చుండూర్
కొచ్చేటాలకు రెడ్లు ప్రతి ఘటనా పోరాటానికి దాడులు చేశారు. ఏసి కాలేజీ మీద దాడి చేశారు రెండోసారి.

కారంచేడు కొచ్చినంత మద్దతు సంఘభావం అన్ని కులాల నుంచి, మతాల నుంచి
చుండూర్ కి చేరలేక పోయింది. చివరికి సాక్ష్యం లేదని కొట్టి వేసిన తీర్పు చుండూరు గుండె గాయాలు యింకా పచ్చి సెలవేస్తానే వున్నయి.

చుండూర్ హంతకులు నిర్దోషులైతే యీ నెత్తుటి నేరమెవరిది? అనే ప్రశ్నమేలుకొనే వున్నది. చుండూరు నడిబొడ్డు మీద రెడ్ల యిండ్ల ముందట మృత వీరులను పాతిపెట్టిన మట్టి దిబ్బగా యింకా సజీవంగానే వుంది.

హత్యాకాండ జరిగి ముప్పయి రెండేoడ్లు (32సం. లు) గడిచినా అక్కడ ఒక స్పూర్తి చిహ్నంగానీ, స్థూపాలుగాని ఏర్పాటు కాక పోవడంకు కారణం తెలియదు. యిప్పటికైనా చుండూరు నెత్తుటి ప్రశ్నగా వున్న మృత వీరులను ఖననం చేసిన పెద్ద మట్టిదిబ్బగా వున్నదాన్ని మృతవీరుల స్మారకార్థం ఒక మాన్యుమెంట్ నిర్మించాల్సిన బాధ్యత మిగిలి వుంది.

***

         

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.