జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-14

   -కల్లూరి భాస్కరం

          ఈ వ్యాసపరంపరను చదువుతున్న క్రమంలో మిత్రులు బి.పి. పడాలగారు కొన్ని రోజుల క్రితం నాలుగు ప్రశ్నలను ముందుకుతెచ్చారు. “హరప్పా, మొహంజెదారో, లోథాల్ నాగరికతా జనాలు ఆర్యులు కారనుకుంటే మరి ఎవరు? వారు స్థానిక సంస్కృతికి చెందినవారా? ఆ తర్వాత వారికి ఏమైంది? వారికి చెందిన ఎలాంటి చిహ్నాలు, సంప్రదాయాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి?” అనేది వాటిలో మూడవది. కిందటి వ్యాస భాగం ముగిసిన ఘట్టం నుంచి ఈ వ్యాసభాగాన్ని ఎత్తుకోడానికి ఇది అనువైన ప్రశ్న కనుక మొదట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెడదాం.

          65వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి వలసదారులు భారత ఉపఖండానికి చేరుకున్నారనీ, అప్పటికి ఇక్కడి మధ్య, తూర్పు భారతాలలో ప్రాబల్యంలో ఉన్నప్రాచీన రకం మానవు (archaic humans) లను తప్పించుకుంటూ వారిలో కొందరు ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాల వైపు వలస కట్టారనీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. అక్కడి నుంచి 45వేల నుంచి 20వేల సంవత్సరాల మధ్యకాలానికి వచ్చేసరికి, భారత్ లోనే ఉండిపోయిన ఆఫ్రికా వలసదారుల వారసులు సూక్ష్మ శిలాసాధనాల సాంకేతికతను ఉపయోగించుకుంటూ మధ్య, తూర్పుభారతాలలో తమ జనాభాను నాటకీయంగా పెంచుకున్నారనీ, వీరినే ‘తొలి భారతీయులు (The First Indians)’ గా సంకేతించారనీ కూడా చెప్పుకున్నాం. వీరి ఉనికితో అప్పట్లో ప్రపంచం మొత్తం మీద దక్షిణాసియాయే అత్యధిక జనాభాకు ఆవాసంగా మారింది.

          అక్కడి నుంచి నేరుగా 7వేల సంవత్సరాల వెనకటి కాలానికి వస్తే, ఈ కాలంలో ప్రాచీనభారత ఉపఖండంలో వ్యవసాయ వికాసానికి మెహర్ గఢ్ తొలి విత్తనాలను సమకూర్చిన సంగతిని కిందటి వ్యాసంలో ప్రస్తావించుకున్నాం. నేటి బెలూచిస్తాన్ లోని బొలాన్ పర్వతపాదాల వద్ద ఒక గ్రామంగా ఉన్న మెహర్ గఢ్ లో ఆనాడు ఏర్పడిన ఒక వ్యవసాయ జనావాసం క్రమంగా సింధు-మధ్యధరా సముద్రాల మధ్య అతిపెద్ద జనావాసంగా మారిందన్న టోనీ జోసెఫ్; ఆనాడు వ్యవసాయ ప్రయోగశాలలుగా మారిన తావుల్లో, మనకు సంబంధించినంత వరకూ ఎంతైనా కీలకంగా చెప్పదగిన మెహర్ గఢ్ ను ఒక అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ పైన జరిగిన మరో అద్భుతం ఏమిటంటే, మెహర్ గఢ్ ఏర్పరచిన పునాదుల మీదే మరో 1500 వందల సంవత్సరాలకు హరప్పానాగరికత అనే మహాసౌధం నిర్మాణం కావడం!

          మెహర్ గఢ్ లాంటి చోట వ్యవసాయం మొదలైన కాలం నుంచి, హరప్పా నాగరికత విచ్ఛిన్నమైన కాలం వరకూ-అంటే 5వేల సంవత్సరాల మధ్యకాలాన్ని చరిత్రకారులు నాలుగు దశలుగా వర్గీకరించారు. మొదటిది,  క్రీ.పూ. 7000-5500 మధ్యకాలానికి చెందిన తొలి వ్యవసాయదశ; రెండవది, క్రీ.పూ. 5500-2600 మధ్యకాలానికి చెందిన తొలి హరప్పా నాగరికతాదశ; మూడవది, క్రీ.పూ. 2600-1900 మధ్యకాలంలో హరప్పానాగరికత అందుకున్న సంపూర్ణ వికాసదశ; నాలుగవది, క్రీ.పూ. 1900-1300 మధ్యకాలానికి చెందిన హరప్పానాగరికతా క్షీణదశ.

          తనకు సమకాలీనమే కాక, తనకు వెయ్యేళ్ళ ముందు నుంచే వర్ధిల్లిన మెసపొ టేమియా [నేటి ఇరాక్, కువాయిట్, సౌదీ అరేబియా ఉత్తరప్రాంతం, టర్కీ ఆగ్నేయ ప్రాంతం, సిరియా తూర్పు ప్రాంతం, ఇరాన్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన యూఫ్రటిస్ –టైగ్రిస్ నదుల మధ్యప్రాంతాన్ని ‘లంక’ అనే అర్థంలో గ్రీకులు ఇలా పిలిచారు] లోని సుమేరు-బాబిలోనియా సంస్కృతి కన్నా, నైలు నదీతీరంలో వర్ధిల్లిన ఈజిప్టు సంస్కృతి కన్నా హరప్పా సంస్కృతీ, నాగరికతలు ఏవిధంగా విలక్షణమైనవో, వీటి మధ్య పోలికలు; వర్తకం సహా వివిధ రంగాలలో జరిగిన ఆదానప్రదానాలు ఎలాంటి వో అనేక మంది చరిత్రకారులు చేసిన విశ్లేషణలు ఇప్పటికే విస్తారంగా అందుబాటులో ఉన్నాయి. అలాగే, ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం, చప్టా చేసిన రహదారులు, ప్రధాన రహదారులతో సమకోణంలో నిర్మితమైన అనుబంధ రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రతి ఒక్క నీటి చుక్కనూ ఒడుపుగా వినియోగించుకునే అత్యంత నిపుణమైన నీటి యాజమాన్య పద్ధతులు, ఇంటింటా మరుగుదొడ్లు, స్నానాల గదులు; వర్తకులు, ఇతర సందర్శకుల కోసం బహిరంగ స్నానశాలలతో సహా అవసరమైన అన్ని సదుపాయాల కల్పన, సమకాలీన నాగరికతలలో వేటిలోనూ కనిపించని ప్రామాణికమైన, ఏకరూపత కలిగిన తూనికల వ్యవస్థ –వగైరా, హరప్పానాగరికతకు చెందిన అనేక విశేషా లు కూడా ఇప్పటికే పాఠక క్షేత్రంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటినలా ఉంచితే, ముందుగా పడాలగారి ప్రశ్నలో రెండవభాగమైన, “హరప్పా నాగరికతకు చెందిన ఎలాంటి సంప్రదాయాలు, చిహ్నాలు ఇప్పటికీ మిగిలి ఉన్నా”యన్న ప్రశ్నకు- టోనీ జోసెఫ్, హిట్టైట్ లిపిని ఛేదించిన ప్రముఖపురాతత్వ, భాషావేత్త బెడ్రిక్ హ్రోజ్నీ తదితరుల వెలుగులో, క్లుప్తంగా సమాధానం చెప్పుకుందాం.

          హరప్పా లిపిని ఛేదించడంలో ఇంత వరకూ ఎవరూ కృతకృత్యులు కాలేక పోయినా, దానిని చదవడంలో కొత్త దృక్కోణాన్ని ఇచ్చిన ఇద్దరు నిపుణుల ప్రయత్నా లను మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుందని టోనీ జోసెఫ్ అంటాడు. వారు, ఐరావతం మహదేవన్, ఆస్కో పార్పోలా. అత్యంత ప్రాచీనకాలపు ద్రవిడ ఆధారాలను పొందుపరచుకున్న తమిళ బ్రాహ్మీలిపిని విజయవంతంగా ఛేదించిన పండితుడు మహదేవన్. ఆయన 2015లో కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ, హరప్పాజనం ఇండో-యూరోపియన్ భాషను మాట్లాడేవారనీ, వారు వేదకాలపు ఆర్యులే ననే వాదనను గట్టిగా తోసిపుచ్చాడు. తాను పరిశీలించినంత వరకూ హరప్పాలిపి తాలూకు భాష ద్రవిడభాష తొలిరూపమనీ,  తాను హరప్పా (ఆయన చాలాచోట్ల ఇండస్ అనే మాటే వాడాడు) లిపిని పూర్తిగా ఛేదించానని చెప్పలేకపోయినా, దానిని అన్వయించ డానికి తోడ్పడే ముఖ్యమైన క్లూలు కనిపెట్ట గలిగాననీ; హరప్పా లిపికి గల ద్రవిడభాషా స్వభావాన్నీ, అనంతర కాలంలో ద్రవిడ, ఇండో-ఆర్యన్ సంప్రదాయాలు రెండింటిలోనూ ఉనికిని నిలుపుకుంటూ వచ్చిన హరప్పా వారసత్వాన్ని అవి నిర్ద్వంద్వంగా స్థాపిస్తున్నా యనీ ఆయన చెప్పుకున్నాడు. హరప్పానాగరికత ప్రధానంగా పట్టణ నాగరికతకాగా; తొలి వేదకాలపు నాగరికత గ్రామీణ, పశుపాలక లక్షణాలు కలిగినదనీ, ఆర్యసమాజాలలో ప్రముఖ భాగాలైన గుర్రం కానీ, చువ్వల చక్రా (spoked wheels) లున్న రథాలు కానీ హరప్పా సీళ్లమీద కనిపించవనీ; అలాగే, హరప్పాసీళ్లమీద కనిపించే పులి, ఋగ్వేదంలో కనిపించదనీ ఆయన అంటాడు.

          ఇప్పటికీ మిగిలి ఉన్న హరప్పా నాగరికుల సంప్రదాయాలు, చిహ్నాలు కొన్నింటిని- అక్కడి తవ్వకాలలో బయటపడిన సీళ్లమీద కనిపించే చిత్రాల ఆధారంగా- మహదేవన్ క్రోడీకరించాడు. అవి: గేదె కొమ్ములు కలిగిన పురుషదేవుడు, అమ్మవార్లు, రావిచెట్టు, సర్పమూ, బహుశా లింగచిహ్నమూ. ఆయన ప్రకారం, ఇవేవీ తొలివేదాల నుంచి సంక్రమించినవి కావు; ఆర్యజనాల రాకకు ముందు నుంచీ జనం ఆరాధిస్తూ వచ్చినవి. వీటిలో అనేకం భారతీయ మతసాంస్కృతిక సంప్రదాయంలో కలిసిపోయి ఇప్పటికీ ఆరాధ్యమవుతున్నాయి. తొలినాటి వేదాలకు; హరప్పానాగరికతా సంస్కృతులకు, ఆచారాలకు ఎలాంటి సంబంధం లేదు; మలి వేదకాలంలో మాత్రమే రెండింటి మధ్యా సంబంధం ఏర్పడింది.

          ప్రపంచమత, సంస్కృతుల పై లోతైన అధ్యయనమున్న మరో నిపుణుడు జోసెఫ్ కాంబెల్ నే ఉదహరించుకుంటే, నేడు హిందూ ధర్మరూపంలో దేశవ్యాప్తమైన విశ్వాసాలు, ఆరాధనా విధానాలు, ఆచారాల మూలాలు హరప్పాసంస్కృతిలో కూడా ఉన్నాయి. అయితే, మహదేవన్ పరిశీలనకూ, జోసెఫ్ కాంబెల్ పరిశీలనకూ ఒక మౌలికమైన తేడా ఉంది. టోనీ జోసెఫ్ ఉటంకించిన మేరకు, మహదేవన్ కేవలం ద్రవిడ, ద్రవిడేతర దృక్కోణం నుంచి హరప్పా నాగరికతా, సంస్కృతులను పరిశీలించినట్టు కనిపిస్తే; జోసెఫ్ కాంబెల్ సుమేరు-బాబిలోనియా-అసీరియా నాగరికతా, సంస్కృతులకు రంగస్థలమైన పశ్చిమాసియా కోణం నుంచి కూడా హరప్పాను చూస్తూ వాటి మధ్యగల పరస్పర ప్రభావా లను, ఆదానప్రదానాలను తులనాత్మకంగా చర్చిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, హరప్పా సీళ్లమీద కనిపించే పై చిత్రాలలోని మూర్తులు, లేదా వాటితో సారూప్యమున్న మూర్తులు పశ్చిమాసియా మతసంస్కృతులలో కూడా కనిపిస్తాయి.

          ఈ విధంగా హరప్పా పరిశీలనలోకి పశ్చిమాసియాను కూడా తీసుకొచ్చినప్పుడు హరప్పా రంగస్థలం పశ్చిమం వైపు విస్తరించడమే కాదు, మన చూపు కూడా విశాలమై కొత్త దృశ్యాలను, కొత్త నిర్ధారణలను ఆవిష్కరిస్తుంది. ఈ సందర్భంలో ప్రముఖంగా ప్రస్తావించుకోవలసిన మరో పండితుడు- పైన పేర్కొన్న బెడ్రిక్ హ్రోజ్నీ.

          హిట్టైట్ లిపిని ఛేదించి(1915), సంస్కృతం, లాటిన్, జర్మన్ తదితర భాషల్లానే అది కూడా ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదని నిర్ధారించిన బెడ్రిక్ హ్రోజ్నీని తెలుగు పాఠకులకు పరిచయం చేసినది, నాకు తెలిసినంత వరకూ, రాంభట్ల కృష్ణమూర్తిగారే. హ్రోజ్నీ అభినందన సంచిక ఒకదానిని నేను చూశాననీ, అందులో ఆయన బహుముఖ పరిశోధనా కృషిని సమీక్షించే వ్యాసాలున్నాయనీ ఆయన నాతో చెప్పేవారు. జనకథ, వేదభూమి మొదలైన తన రచనల్లో ఆయన హ్రోజ్నీని ప్రస్తావించ డమే కాకుండా, ఆయన నిర్ధారణలను తన పరిశీలనలకు అన్వయించుకున్నారు. ఉదాహరణకు, తెలుగు, తమిళం మొదలైన దక్షిణాది భాషలను తమిళానికి సంస్కృతీ కరణమైన ద్రవిడమన్న పేరుతో పిలవకూడదనీ, సుమేరో-అసురభాషలనాలనీ హ్రోజ్నీ అన్న సంగతిని రాంభట్ల తన జనకథలో ప్రస్తావించారు. అలాంటి హ్రోజ్నీ నిర్ధారణల వెలుగులో సుమేరుతో తెలుగు భాషకుగల దగ్గరితనాన్ని, తద్వారా తెలుగుకు పశ్చిమా సియాతో గల చుట్టరికాన్ని వివరిస్తూ విస్తారంగా రాశారు. ఆ క్రమంలోనే పశ్చిమాసియాకు చెందిన ఈలమైట్ భాషతో తమిళానికి గల దగ్గరితనాన్ని కూడా ఆయన సూచిస్తూ వచ్చారు. ఇలాంటి ఆయన రాతలను తెలుగు పాఠక ప్రపంచం పెద్దగా పట్టించుకోకపోగా, అపహాస్యం చేయడం నాకు తెలుసు.

          విశేషమేమిటంటే, తన ‘Early Indians’ పుస్తకంలో, The First Urbanites: The Harappans అనే అధ్యాయంలో టోనీ జోసెఫ్ కూడా తెలుగు, తమిళం మొదలైన దక్షిణాది భాషలకు గల పశ్చిమాసియా సంబంధాన్ని సోదాహరణంగా చర్చించాడు! ఆ విధంగా హ్రోజ్నీతో పాటు, రాంభట్ల రాతలకు టోనీ జోసెఫ్ లో ధ్రువీకరణ లభించడం నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కూడా కలిగించింది.

          మళ్ళీ హ్రోజ్నీ విషయానికి వస్తే, హిట్టైట్ లిపిని విజయవంతంగా ఛేదించిన అనుభవంతో ఆయన హరప్పాలిపిని, క్రీటు లిపిని  కూడా ఛేదించడానికి ప్రయత్నించిన సంగతి ఎంత మంది దృష్టికొచ్చిందో తెలియదు. హ్రోజ్నీ రచనలు ప్రధానంగా జర్మన్ భాషలో ఉండి, ఇంగ్లీష్ అనువాదాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కృషికి మన దగ్గర అంత ప్రాచుర్యం లభించలేదని రాంభట్లగారే అంటుండేవారు. నేను గూగుల్ లో ఎంతో గాలించిన మీదట ఈ మధ్య ఒక పుస్తకం ఆంగ్లానువాదాన్ని పట్టుకోగలిగాను. దాని పేరు, Ancient History of Western Asia, India and Crete. అందులో, A History of Ancient India, An attempt to Decipher Proto-Indian Inscriptions అనే అధ్యాయంలో హరప్పా లిపిని ఛేదించడానికి తను చేసిన ప్రయత్నాలను, వాటి ఫలితాలను హ్రోజ్నీ వివరించాడు.

          హరప్పా నాగరికతకు పశ్చిమాసియా సంబంధాలున్న దృష్ట్యా, ప్రాచీన పశ్చిమాసియా మతసంస్కృతులు, భాషల పై లోతైన అధ్యయనమూ, పరిశోధనా ఉన్న పండితుడిగా హ్రోజ్నీ అభిప్రాయాలకు తప్పనిసరిగా ప్రాసంగికత ఉంటుంది. పై పుస్తకం, 1952లో ఆయన మరణించిన ఏడాది తర్వాత ప్రచురితమైంది, మూలరచన ఆయన ఎప్పుడు చేశారో తేదీ దొరకలేదు. అప్పటికి హరప్పా, మొహంజెదారో శిథిలాలు బయటపడి ఎక్కువ కాలం కాలేదు కనుక; వాటి పై ఆయన అధ్యయనం సహజంగానే ప్రాథమిక దశలో ఉంటుంది. తాజా అధ్యయనాలూ, అవగాహన రీత్యా చూస్తే కొన్ని అంశాలు ప్రామాణికతకు దూరంగా ఉండడమూ సహజమే. విడ్డూరంగా అనిపించే కొన్ని విచిత్రమైన ఊహలు, ప్రతిపాదనలూ కూడా ఆయన చేస్తాడు. ఉదాహరణకు, భారతీయ మూలజనాలు (Proto-Indians) ఉత్తర సిరియా నుంచీ, మెసపొటేమియా నుంచీ భారత్ కు వచ్చారనీ, కాల్చిన ఇటుకల వాడకాన్ని అక్కడే నేర్చుకొని ఉంటారనీ ఒకచోటరాస్తాడు. ఆయన ఊహలు ఇంకా ఎంత వింతగా ఉంటాయంటే, ఆసియా మైనర్ తూర్పు ప్రాంతానికి (నేటి టర్కీ తూర్పుప్రాంతం), ఉత్తర సిరియాకు, వాయవ్య మెసపొటేమియా కు చెందిన మిశ్రమజనాలు మూడవ సహస్రాబ్దిలో, హిట్టైట్ల నాయకత్వంలోగానీ, లేదా వారి సంబంధీకులైన కుశహార పట్టణజనాల నాయకత్వంలో కానీ సారవంతమైన సింధు లోయ పై దాడి చేసి ఆక్రమించుకుని ఉంటారంటాడు. ఆయన ఉద్దేశంలో ప్రోటో-ఇండియన్లు, పరిమితార్థంలో ప్రోటో-ఆర్యులే. వీరు పెంపొందించిన భారతీయ సంస్కృ తిని ఆ తర్వాత, బహుశా భారతదేశానికి వాయవ్యంగా ఉన్న ప్రాంతం నుంచే వచ్చిన ద్రవిడులు ధ్వంసం చేసి ఉంటారనీ,  బెలూచిస్తాన్ కొండల్లో నేటికీ ఉన్న బ్రాహూయి భాష మాట్లాడే జనం వారి తాలూకు అవశేషమేనంటాడు. ఇది చిరకాలంగా ప్రాచుర్యంలో ఉన్న ఆర్య-ద్రవిడ వాదానికి పూర్తిగా తలకిందుల ఊహ.

          అలాగని, పశ్చిమాసియా మత భాషాసంస్కృతుల పై విశేషమైన అధ్యయనం ఉన్న పండితునిగా ఆయన చేసిన కొన్ని ఇతర ప్రతిపాదనలను కొట్టివేయలేం. ఉదాహరణకు, ప్రాచీన కాలంలో పశ్చిమాసియా, భారత్ లు ఒక విధమైన పరస్పర సంబంధం కలిగి, ఏకీకృతంగా ఉండేవనీ, తన సాంస్కృతిక, జాతి సంబంధ అంశాలలో భారతదేశం మొదటి నుంచీ పశ్చిమాసియాకు అనుబంధంగా ఉండేదనీ ఆయన అంటాడు. ఈ మాటల్లో కొంత అతిశయోక్తి ఉందనుకున్నా, పూర్తిగా సత్యదూరం కావు.

          టోనీ జోసెఫ్ ప్రకారం, తాజా జన్యుఆధారాలే కాకుండా, పురావస్తు ఆధారాలు, భాషా సంబంధ ఆధారాలు కూడా ముక్తకంఠంతో ఇదే చెబుతున్నాయి!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.