అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 9

– విజయ గొల్లపూడి

జరిగినకథ:విశాల అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత ఎం.బి.ఎ చేస్తుండగానే విష్ణుసాయితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. విష్ణు సాయి, విశాల ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి సిడ్నీలో అడుగు పెట్టారు. వినయ్, అనిత వారిద్దరినీ రిసీవ్ చేసుకుని తమ ఇంటికి తీసుకు వచ్చారు.

***

          భారతీయ సంతతి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకతను సంతరించుకుని,
వారి ఉనికిని చాటుకోగలుగుతున్నారు. తమ ఐడెంటిటీ కోల్పోకుండా ఇటు భారతీయత ను, అటు పాశ్చ్యాత్యాతను సమన్వయం చేసుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్నారు.

          విశాల, విష్ణుసాయి స్నానం చేసి రెడీ అయిపోయి హాల్ లోకి వచ్చారు.

          ‘కిచెన్ లో నుంచి సాంబార్ ఘుమఘుమలు నాసికారంధ్రాలను తాకుతున్నాయి భలేగా ఉంది ఆ సువాసన’ విశాల మనసులో అనుకుంది. అపుడే అక్కడకి చిరు యవ్వనప్రాయంలో ఉన్న అమ్మాయి, అబ్బాయి అడుగుపెట్టారు.

          వాళ్ళను చూపిస్తూ వినయ్ “మా పిల్లలు అమర్, అన్విత ఇద్దరూ కవల పిల్లలు. డిగ్రీ చదువు పూర్తి చేసారు” అని పరిచయం చేసాడు విష్ణు, విశాల ఇద్దరికీ. కవల పిల్లలు అనగానే చాలా ఆశ్చర్యంగా చూసింది విశాల వాళ్ళిద్దరినీ.

          “హాయ్ నమస్తే అంకుల్, ఆంటీ!” అని ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకి.

          ఒక్కసారిగా ఆంటీ, అంకుల్ అన్న పిలుపుకి విశాల ఖంగు తింది. తను కూడా
ఇపుడే చదువు పూర్తి చేసుకుని కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది కదా! మహా అయితే తనకు వాళ్ళకు వయసులో వ్యత్యాసం పదేళ్ళలోపే ఉంటుంది. కానీ ఆ క్షణంలో ఏమనాలో తెలియక ఒక చిరునవ్వు నవ్వింది.

          ఇంతలో అనిత “బ్రేక్ ఫాస్ట్ కం లంచ్ అదే ఈ రోజు బ్రంచ్ రెడీ! అందరూ రండ హో అని పిలవడంతో అందరూ డైనింగ్ హాల్ లోకి వచ్చారు.

          “ఈస్ట్ ఆర్ వెస్ట్ ఇడ్లీ ఈస్ ద బెస్ట్ అనేది నా పాలసీ, మరి ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ కూడా అదే” అంటూ వినయ్ వాళ్ళవంక చూసాడు.

          “నిజమే, మనం తీసుకునే అల్పాహారం, ఆవిరి పై ఉడికించిన తెల్లని స్వచ్ఛమైన ఇడ్లీలంటే నాకూ ఇష్టమే! ఒక రకంగా మనం ప్రతి పనికి ముందు వినాయకుడిని తలుచు కున్నట్లే, ఉదయమే ఉపవాసాన్ని బ్రద్దలుకొడ్డటానికి ఇడ్లీ అద్భుతమైన అల్పాహారం అండీ” అంది విశాల.

          “భలే చక్కని కొటేషన్ ఇచ్చావమ్మా!” అన్నాడు వినయ్ ఆమె మాటలకునవ్వుతూ.

          ఒక్కసారిగా ఆమె వాగ్ధాటికి ఆశ్చర్యపోయాడు విష్ణు.

          టేబుల్ పైన అందంగా పింగాణీ ప్లేట్లలో ఇడ్లీలు, గారెలు, ఆవిర్లు గక్కుతున్న కట్టె పొంగలి, శెనగపప్పు, కొబ్బరి పచ్చడి, సాంబార్, రవ్వకేసరి నోరూరిస్తున్నాయి.

          “ప్రొద్దున్నే ఇన్ని వంటకాలు భలే చేసారండీ! నిజంగా తెలుగు రుచులన్నీ ఇలా ఆస్వాదించటం, ఆస్ట్రేలియాలో మీ ఆతిధ్యం అందుకోవడం మా అదృష్టం” అన్నాడు విష్ణుసాయి.

          అప్పటికే అందరూ మాంచి ఆకలి మీద ఉన్నారేమో, కబుర్లు చెప్పుకుంటూ
ఇష్టంగా బ్రేక్ ఫాస్ట్ తిన్నారు.

          తరువాత హాట్ వాటర్ కెటిల్ ఆన్ చేసి, వేడి నీళ్ళు, ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీ బాగ్, ఒక చెంచా బ్రౌన్ షుగర్, కార్టన్ లో కొద్దిగా పాలు కప్ లో వేసి, చకచక టీ తయారుచేసి అన్విత అందరికీ ఇచ్చింది.

          విశాలకు టీ చాలా బాగా నచ్చింది. పాలు ఎక్కువ వేయకుండా వేడివేడిగా అన్విత టీ చేసిన విధానం చూసి, “టీ చాలా బాగా చేసావ్ అన్విత, ఇట్స్ రియల్లీ రిఫ్రెషింగ్” అని మెచ్చుకుంది.

          “మీరు చేసిన కట్టెపొంగలి రుచి నిజంగా తిరుపతిలో దైవ దర్శనం చేసుకోగానే, ఎదురుగా అన్నపూర్ణ హోటల్ లో తిన్న కట్టె పొంగలిలాగనే ఉంది అనిత గారు” అన్నాడు విష్ణు.

          “యూ రియల్లీ మేడ్ మై డే విష్ణుగారు. నైస్ కాంప్లిమెంట్” అంది అనిత.

          అలా కబుర్లు చెపుతూనే అనిత వెంటవెంటనే అన్ని గిన్నెలు సర్దుతూ, తిన్న ప్లేట్లు డిష్ వాషర్ లో పెట్టేయడం విశాల గమనించింది. 

          కిచెన్ లో ఒక వైపు మైక్రో ఓవెన్, మరో ప్రక్క గ్రిల్ ఓవెన్, మెటాలిక్ కలర్ లో ఫ్రిజ్, అందంగా ఉడెన్ అలమారాలో పింగాణీ ప్లేట్లు తీరువుగా ఉండటం చూసింది విశాల.

          తను కూడా అంట్లు తోమడంలో ఓ చెయ్యి వేయబోతే అనిత వద్దని వారించింది. “ఆస్ట్రేలియా వచ్చిన మొదటిరోజే నీ చేత పని చేయించడం నాకు ఇష్టం లేదు విశాల. టుడే ఈస్ రిలాక్సింగ్ డే ఫర్ యూ!” అంది అనిత.

          అన్విత విశాలను తీసుకుని బాక్ యార్డ్ వైపుకు తీసుకెళ్ళింది.

          వెనుక గార్డెన్ లో మెటాలిక్ రాకింగ్ సోఫా పైన షెడ్ తో సేద తీరడానికి అన్నట్లుగా కూర్చోమని పిలుస్తున్నట్లుగా ఉంది. విశాలకు తను అమ్మమ్మగారింట్లో ఊగిన పెద్ద చెక్క బల్ల ఉయ్యాల గుర్తొచ్చింది.

          అప్రయత్నంగా అందులో కూర్చొని రాకింగ్ సోఫాలో ఊగుతూ, అన్వితతో  మాట్లాడు తూ తనూ చిన్నపిల్లలా బాల్యంలోకి వెళ్ళిపోయింది విశాల. వెజిటబుల్ గార్డెన్ బెడ్ లో కరివేపాకు మొక్క, మిర్చి, టొమాటో మొక్కలు ఉన్నాయి. ఎదురుగా బట్టలు  ఆరేసుకోవ డానికి గొడుగు ఆకారంలో ఐదు వరుసలలో తీగలతో పెద్ద బట్టల స్టాండ్ ఉంది.

          ఇంతలో అమర్ అక్కడకు వచ్చి విశాలతో “ఆంటీ! ఈస్ దిస్ యువర్ ఫస్ట్ విజిట్ టూ ఆస్ట్రేలియా? సో యు ఆర్ ఫైయిర్లీ న్యూ హియర్. అన్విత లెట్స్ టేక్ దెం ఎరౌండ్, విల్ గో వెస్ట్ ఫీల్డ్” అన్నాడు ఉత్సాహంగా.

          వినయ్, విష్ణు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా అదే సమయానికి ఇంటి ప్రక్క నైబర్ థామస్ వచ్చాడు.

          “హాయ్ థామస్! హౌ ఆర్ యు? మీట్ అవర్ ఫ్రెండ్ విష్ణు, న్యూలీ అరైవ్డ్ టు సిడ్నీ” అని పరిచయం చేసాడు.

          “డాడ్ ఉయ్ ఆర్ గోయింగ్ టు వెస్ట్ ఫీల్డ్, షోయింగ్ దెమ్ షాపింగ్ సెంటర్, నీడ్ టు బ్రింగ్ సమ్ గ్రోసరీస్ యాస్ వెల్” అంటూ కారు కీస్ తీసుకుని విశాల, విష్ణు, అమర్, అన్విత కలిసి షాపింగ్ సెంటర్ కి బయలుదేరారు.

          “థామస్, హియర్ ఆర్ అవర్ బ్యాక్ యార్డ్ గేట్ కీస్, ప్లీస్ వాటర్ ప్లాంట్స్ వీకెండ్స్, లాన్ మూవర్ విల్ డూ ఎవ్విరి మంత్, థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్” అని వినయ్ థామస్ చేతిలో కీస్ పెట్టాడు.

          “నో ప్రాబ్లెం వినయ్, వుయ్ ఆర్ నైబర్స్, హెల్పింగ్ ఈచ్ అదర్” అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

          అమర్ ప్రక్కనే విష్ణు, వెనుక సీట్లో అన్విత, విశాల కూర్చున్నారు. తెలుగులో తల్లి దండ్రి మాట్లాడుతున్నా, అమర్, అన్విత బాగానే అర్థం చేసుకుని ఇంగ్లీష్ లో సమాధానం ఇవ్వడం విశాల గ్రహించింది. ఏ విధమైన  బెరుకు లేకుండా అమర్ డ్రైవింగ్  చేస్తున్నాడు.

          “ఇక్కడ వాట్ ఈస్ ద ఏజ్ టు స్టార్డ్ డ్రైవింగ్ అమర్?” అని వినయ్ అడిగాడు.

          “సిక్స్టీన్ ఇయర్స్ టు గెట్ లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్, దెన్ అఫ్టర్ పాసింగ్ డ్రైవింగ్ టెస్ట్ వియ్ గెట్ రెడ్ P1 ప్రొవిజనల్ లైసెన్స్ ఫర్ 12 మంత్స్, తరువాత P2 గ్రీన్ లైసెన్స్, ఆ తరువాత ఫుల్ డ్రైవర్ లైసెన్స్ ఇన్ న్యూసౌత్ వేల్స్ స్టేట్” అని అమర్ లైసెన్స్ వివరాలు చెప్పాడు.

          ఐదు నిమిషాల్లోనే అందరూ వెస్ట్ ఫీల్ద్ షాపింగ్ సెంటర్ కి చేరుకున్నారు. కారు పార్కింగ్ నుంచి నేరుగా లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ లో గ్రాసరీస్ కోసం ఊల్ వర్త్స్ వైపు వెళ్ళారు.

          హియర్ కోల్స్, ఊల్ వర్త్స్ ఆర్ ద టూ లీడింగ్ సూపర్ మార్కెట్స్ ఆంటీ అనిఅన్విత చెప్పింది.

          మొట్ట మొదటిసారిగా ఆస్ట్రేలియా షాపింగ్ సెంటర్ లో విశాల, విష్ణు అడుగు పెడు తున్నారు. లిఫ్ట్ దాటి కాంప్లెక్స్ లోకి అడుగిడగానే, ఆ పరిసరాలను చూసి విశాల అచ్చెరువొందింది.

          “ఓహ్! ఎంత నీట్ గా లైట్లతో మిరుమిట్లుగొలుపుతూ షాపులు చూడముచ్చటగా ఉన్నాయి. ఇక కింద ఫ్లోర్ ఐతే నున్నగా మెరుస్తూ మన మొహం కూడా చూసుకోవచ్చు అన్నట్లుగా తళుక్కుమంటున్నాయి. ఒక వైపు డిక్ స్మిత్ ఎలక్ట్రానిక్ షాపు, గుడ్ గైస్, ఫెంటాస్టిక్ ఫర్నిచర్ షాపు, ఇంకా కామన్ వెల్త్ బ్యాంక్ ఇలా ఒకటేమిటి అన్ని బారులు తీరిన పొడవైన సుందర నిలయంలా ఉంది కదా ఈ సెంటర్” అనుకుంది విశాల.

          ఊల్ వర్త్స్ లోకి అడుగిడుతుంటే అమర్ అన్నాడు, “దిస్ ఈస్ ఊల్ వర్త్స్ మొదటి సారిగా 1924 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా లో తెరిచారు. ‘ఫ్రెష్ ఫుడ్ పీపుల్’ అంటారు ఎందుకంటే 1987 వ సంవత్సరంలో ‘ఫ్రెష్ ఫుడ్ పీపుల్ కేంపైన్’ పేరుతో తాజా ఆహార పదార్థాల అమ్మకం పై దృష్టి పెట్టి ప్రాధాన్యతను సంతరించుకుంది మిగతా సూపర్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే”.

          ఆ వివరణకి విష్ణు అతనిని అడ్మైర్ చేస్తూ, “బ్యూటిఫుల్ ఇన్ ఫర్మేషన్, ఐ అప్రీషియేట్ యువర్ ఎక్స్ప్లనేషన్, యూ ఆర్ ఎ వెల్త్  ఆఫ్ నాలెడ్జ్” అని అమర్ భుజం తట్టాడు.

          నిజంగానే ఊల్ వర్త్స్ లోకి వెళ్ళగానే ఫ్రెష ఫుడ్ పీపుల్ కేంపైన్ కి తగిన విధంగా లోపల మొదట తాజా తాజా రంగురంగుల కూరగాయలు, పండ్లు తీరైన అమరికతో దర్శనమిచ్చేసరికి విశాల ఉబ్బితబ్బిబవుతూ ఒక్కసారిగా ఆనందంతో కళ్ళనీళ్ళ పర్యంతమైంది. “అన్వితా, నా సబ్జెక్ట్ హార్టీకల్చర్. నాకు పూలు, పళ్ళు, కూరగాయలు
చూస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది.” అంది విశాల.

          అక్కడ కూరగాయల పరిమాణం చూస్తే విశాల ‘నిజంగా హైబ్రిడ్ వంగడాలా
ఏమిటి? ఇంత పెద్దగా ఉన్నాయి సుమీ!’ అనుకుంది. అక్కడ ఉన్న బుంగ పచ్చిమిరప కాయ పెద్ద సైజ్ లో, ముచ్చటైన మూడు రంగుల్లో ఒక పాకెట్ లో ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఉన్నవాటిని చేతిలోకి తీసుకుని చూసింది. ఇంక బంగాళదుంప కూడా పింక్ వర్ణంలో పెద్ద సైజ్ లో ఉంది. మహావంకాయ మంచి బలిష్టంగా ఉంది. ఒక్కసారిగా అమ్మ గుర్తుకు వచ్చింది, అమ్మ కూరలన్నీ భలే శ్రద్ధగా చేస్తుంది. ఈ వంకాయని చూస్తే అమ్మ ఏమంటుందో? మాంచిగా ఈ వంకాయతో పచ్చిపులుసు, కందిపచ్చడి చేసేస్తుంది డెఫినెట్ గా’ అనుకుంటూ మనసులో నవ్వుకుంది.

          అపుడే అక్కడకి వచ్చిన విష్ణు, “ఏంటి, విశాలా! నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్” అన్నాడు.

          “చూడండి, ఈ వెజిటబుల్స్ ఏంత పెద్దగా ఉన్నాయో! ఇంకా కొత్తరకం వెజిటబుల్స్ నేను హార్టీకల్చర్ లో పెద్దగా చదవనివి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదిగో ఇటు చూడండి, ఏంటిది అవకాడో నా? ఇది బ్రొకోలీ, ఇదిగో డ్రాగన్ ఫ్రూట్, పేషన్ ఫ్రూట్ అబ్బో ఎన్ని వెరైటీలో!” అని ఆశ్చర్యంగా చూపించింది విష్ణుకి.

          “ఆంటీ! అవకాడో ఈస్ లైక్ నాచురల్ బటర్, బ్రెడ్ మీద బటర్ బదులు ఇది వాడవచ్చు. గ్లాకమాల్ మెక్సికన్ ఫుడ్స్ లో కూడా వాడతారు, హైలీ న్యూట్రిటివ్, ఇట్స్ మై ఫేవరెట్” అని చెప్పింది.

          ఇంకా కొన్ని షెల్ఫ్ లలో ప్రత్యేకమైన ఐటెమ్స్ గురించి అన్విత చెపుతూ,

          “వీట్ బిక్స్ ఆస్ట్రేలియన్ బ్రేక్ ఫాస్ట్ మామూలు రోజులలో మా ఇంట్లో ఇదే మేము తింటాము, పాలు రెండు వీట్ బిక్స్ పెర్ ఫెక్ట్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్” అని ఒక పెద్ద పాకెట్ ట్రాలీలో వేసింది. టిమ్ టామ్ చాక్లెట్ బిస్కట్స్ చేతిలోకి తీసుకుని “అవర్ ఆస్ట్రేలియాస్
ఫేవరెట్ చాక్లెట్ బిస్కట్” అని వివరించింది.

          ఇంకా పాలు ప్లాస్టిక్ బాటిల్స్ చాలా రకాలు, మజ్జిగ కూడా కార్టన్స్ లో, యోగర్ట్ టబ్స్ ప్రోడక్ట్స్ చూస్తూ, అవసరమైనవి అమర్ తీసుకుంటుంటే విశాల చూసింది. అప్పటికే ఆమెకి అన్నిటినీ చూసి కొత్త వాతావరణంలో ఎక్సైట్ మెంట్ కి లోనైంది.

          విష్ణు అక్కడ కార్డ్స్ ని పరిశీలనగా చూసి, ఇంటర్నేషనల్ ఫోన్ కార్డ్ పది డాలర్లకి తీసుకున్నాడు.

          గంటన్నర షాపింగ్ తరువాత అందరూ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో
అమర్, అన్విత వారితో కబుర్లు చెపుతూ బాగా కలిసిపోయారు. ఇంటికి చేరుకోగానే, అనిత అందరికీ మ్యాంగో జూస్ ఇచ్చింది. విశాలకి ఆ క్షణంలో మాంగో జ్యూస్ అమృతంలా అనిపించింది. దేశం కాని దేశంలో గతంలో ఏ మాత్రం పరిచయం లేని వీరి కలయిక నా పాలిట గొప్ప వరమే కదా అనుకుంది.

          తోడకూరకాడలా వడలిపోయిన ఆమె ముఖం చూసి, “విశాలా! వెళ్ళి కాసేపు
పడుకో అంది అనిత.

          నిజంగా అలసిపోయిన విశాల, గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది.

          విష్ణు మనసులో రేపటి గురించి ఎన్నో ఆలోచనలు. ‘ఏ మాత్రం ముఖ పరిచయం లేకపోయినా సమయానికి చక్కని ఆతిధ్యమిచ్చి ఆదుకున్నారు. శని, ఆదివారాలంటే ఇక్కడ కాస్త రిలాక్స్ డ్ గా ఉంటారు. ఇదే వీక్ డేస్ లో ఎవరి బిజీలో వాళ్ళుంటారు. ఇటు విశాల చూస్తే అభం, శుభం తెలియని అమాయకత్వం కలగలిపిన లేత కుసుమం. ఇపుడే నాతో జీవితం ప్రారంభించింది.

          తనకి కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ నుంచి ఎలా ప్లానింగ్
తో పనులు ప్రారంభించాలి?’ అని మధన పడుతున్నాడు.

          ఆలోచనలతో బుర్ర కాస్త గజిబిజిగా ఉన్నా పెన్ను, పేపర్ తీసుకుని ఏం చేయాలో లెక్కలు వేసుకున్నాడు.

          మెల్లిగా హాలులోకి వచ్చాడు. వినయ్ టీవి చూస్తున్నాడు.

          విష్ణుసాయి వినయ్ ప్రక్కన కూర్చుంటూ, “మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి” అన్నాడు.

          వినయ్ అతనివైపు చిరునవ్వుతో “చెప్పండి విష్ణు, ఏం మాట్లాడాలనుకుంటు న్నారు? ” అన్నాడు.

          ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగటంతో వినయ్ తలుపు తీయడానికి వెళ్ళాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.