జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-16

   -కల్లూరి భాస్కరం

         మిత్రులు వృద్ధుల కల్యాణరామారావుగారు ఈమధ్య నాకు ఫోన్ చేసి పశ్చిమాసియా-భారత్  సంబంధాల గురించి మరో ముచ్చట చెప్పారు. ఈ వ్యాసభాగానికి అదే తగిన ఎత్తుగడ అని నాకు తోచింది. ఖురాన్ వింటుంటే తనకు సామవేదం వింటున్నట్టు అనిపించిందని ఆయన అన్నారు. అదే సంగతిని చెప్పిన ఒక పుస్తకం తను చదివాననీ, పేరు గుర్తులేదనీ అన్నారు. ఈ మాట వినగానే నా ఆలోచనలు వెంటనే రాంభట్ల కృష్ణ మూర్తి గారి వైపు మళ్లిపోయాయి.

         రాంభట్ల పేరు నేను పదే పదే ప్రస్తావిస్తున్నాననీ, ఆయనను ఎక్కువ ఉటంకిస్తున్నా ననే ఫిర్యాదు ఒకరిద్దరు మిత్రుల నుంచి ఉంది. కానీ నేను చేయగలిగింది లేదు. తెలుగు వారిలో ఇలాంటి విషయాలు ఎక్కువగా రాసినదీ, ముఖతా నాకు చెప్పినదీ; కోశాంబీ తర్వాత, నా కళ్ళముందు ఎంతో అద్భుతం గొలిపే పురాప్రపంచాన్ని ఆవిష్కరించినదీ ఆయనే. అందులోనూ ఇప్పుడు చర్చిస్తున్న విషయానికే వస్తే, ఆయన ప్రస్తావన లేకుండా అక్షరం కూడా ముందుకు కదిలే పరిస్థితి కనిపించలేదు.

         రాంభట్ల రాసిన ఒక అముద్రిత రచన జిరాక్స్ కాపీని, పెద్దలు ఏటుకూరి ప్రసాద్ గారు కొన్నేళ్ళ క్రితం నాకు ఇచ్చారు. దాని పేరు, ‘పంచములు ఎవరు?’. అందులో ‘శూద్రుల కథ’, ‘అసుర’, ‘ఋషి’ అనే శీర్షికలతో మూడు అధ్యాయాలున్నాయి. ఆయన ముద్రిత రచనల్లో ఉన్న కొన్ని అంశాలకు అదనంగా ఈ పుస్తకంలో మరెన్నో విశేషాలు న్నాయి. ప్రస్తుత సందర్భానికి అవసరమైన మేరకు పై అధ్యాయాలలోని కొన్ని విషయా లను క్లుప్తంగా ఇక్కడ పొందుపరుస్తాను.

         సురాసురులు, లేదా దేవాసురులు అనే జంటపదాలు మన పురాణ, ఇతిహాసాల్లో ప్రసిద్ధంగా ఉన్నాయి. వీరు ఉభయులూ కశ్యపప్రజాపతి సంతానం. కశ్యపప్రజాపతికి చాలా మంది భార్యలున్నారు. వీరిలో ఎక్కువ మంది దక్షప్రజాపతి కుమార్తెలు. వీరిలో దను సంతానాన్ని దానవులన్నారు. వీరి సంఖ్య ఎక్కువ. వీరి వంశకర్తలలో సుబరులు ఒకరు. వీరినే శంబరులని కూడా అంటారు. దానవులకే అసురులన్న బిరుదు ఉంది.

         దితి సంతానాన్ని దైత్యులన్నారు. క్షీరసాగరమథనంలో పాలుపంచుకున్నది వీరే. దేవతలకు, దైత్యులకు వైరం ఇక్కడి నుంచే మొదలైందంటారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను; సింహిక అనే ఆమెను దితి సంతానంగా పురాణాలు చెప్పాయి. కానీ రానురాను దైత్యులు, దానవులు, అసురులు అనే పేర్లకు రాక్షసులనే పేరు కూడా కలిపి పర్యాయపదాలుగా వాడుతూవచ్చారు. అమరకోశంలో కూడా అసుర, దైత్య, దానవులను కలిపేసి చెప్పారు.

         సరే, ఇప్పుడు సురాసురుల భాష విషయానికి వద్దాం. సురాసురుల్లో అసురులు పెద్దవారు కనుక వారిని పూర్వదేవులన్నారని పౌరాణికులంటారు. కనుక మొదట్లో సురలతోపాటు వారిది కూడా ఆర్యభాషే. అది వారి పితృభాష అయితే, మాతృభాష -మ్లేచ్ఛం. మ్లేచ్ఛ భాషలను అసురభాషలని, సెమెటిక్ భాషలని కూడా అంటారు. ఆర్యభాషలకు ఎంత విస్తృతి ఉందో వీటికీ అంత విస్తృతి ఉంది. హిబ్రూ, అరమాయిక్, ఈజిప్టు, అక్కాడియన్ మొదలైన దాదాపు డెబ్బైకి పైగా భాషలు ఈ భాషాకూటమిలో ఉన్నాయి. ఇరాన్ లోని జగ్రోస్ పర్వతప్రాంతాలకు చెందినదిగా కిందటి వ్యాసభాగంలో చెప్పుకున్న ఈలమైట్ ఏ కూటమితోనూ సంబంధం లేని విడిభాషగానే భాషావేత్తలు గుర్తించినప్పటికీ పొరుగునే ఉన్న సుమేరు-అక్కాడియన్ క్యూనిఫామ్(మేకు ఆకారంలోని లిపి)ని ఉపయోగించుకుంది. 

         అన్నదమ్ములే అయిన సురాసురుల మధ్య ఈ భాషాభేదం ఎందుకొచ్చిందోచూద్దాం. పదివేల సంవత్సరాలను మించిన వెనకటి కాలంలో, అప్పుడప్పుడే మంచుయుగం ముగుస్తున్న దశలో, ఎక్కువ వాసయోగ్యంగా ఉన్న మధ్యాసియాకు జనం చేరుకున్నారు. వారిలో ఆర్య, మ్లేచ్ఛ, మంగోలు-అనే మూడు భాషాకూటాలకు చెందినవాళ్ళూ ఉన్నారు. సురల్లో కొందరు పశుపాలనలోనే ఉండిపోతే, కొందరు వ్యవసాయం చేపట్టారు. గడ్డి పశువుల అన్నమూ, ధాన్యాలు వ్యవసాయదారుల అన్నమూ కావడంతో పంటపొలాల దగ్గర అన్నదమ్ముల మధ్య శత్రుత్వం వచ్చింది. పాలు, మాంసంతో పెరిగినవారు కనుక పశుపాలకులకు దేహపుష్టి ఎక్కువ. వారు వ్యవసాయదారులను అసురులన్న పేరుతో వెలివేసి తరిమికొట్టారు. అప్పుడు అసురులు మెసపొటేమియాలోని యూఫ్రటిస్, టైగ్రిస్ (వరుణ, తిగృధా) నదుల సమీపంలోని చిత్తడి భూములకు చేరుకున్నారు. సుమేరు విషయాల నిపుణులు (సుమేరియాలజిస్టులు) వారిని సుబరులన్నారు. సుబరులు అక్కడ వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఆ క్రమంలో వ్యవసాయాధారిత నాగరికతా సంస్కృతులు ఈ ప్రాంతంలో వృద్ధి చెంది, రాజ్యాలు అవతరించాయి,

         వ్యవసాయదారులుగా ఉన్న అసురులు, పశుపాలకులతో తలెత్తిన ఘర్షణల దరిమిలా వ్యవసాయరక్షకులు కూడా కావలసివచ్చింది. అందువల్ల వారికి రాక్షసులన్న పేరు వచ్చింది. టైగ్రిస్ నదికి తూర్పున వారు ఒక నగరాన్ని నిర్మించుకున్నారు. దాని పేరు, ఆసూరు. అసురభాషలో ‘అస’ అంటే తూర్పు; ‘ఇరేబు’ అంటే పడమర. ఈరోజున మనకు బాగా పరిచితమైన ఆసియా, యూరప్ అనే పేర్లు ఈ పేర్ల నుంచే వచ్చాయి. ఆసూరు తర్వాత అసురరాజులు ‘నినవే’ అనే ఇంకో నగరాన్ని కట్టుకున్నారు. మ్లేచ్ఛ పురాణమైన బైబిల్ లోని సృష్టిప్రకరణంలో అసుర ప్రస్తావన కనిపిస్తుంది. సుమేరు (మెసపొటేమియా) లో రాజ్యాలు ఏలిన చాలా మంది అసురరాజుల పేర్లు బైబిలు పూర్వసంహిత (Old Testament)లో కనిపిస్తాయి.

         మధ్య, పశ్చిమాసియాలలో సురులకు, అసురులకు మధ్య పుట్టిన వైరం గురించి చెప్పుకున్నాం. ఆ వైరమే ఆ తర్వాత సింధుప్రాంతానికి మారింది. దానికి పూర్వరంగంలో ఒక కథ ఉంది. ‘పెరామిస్ తిస్బీ’ పేరిట ఆ కథ గ్రీకుపురాణాలకెక్కింది. మనదగ్గర ‘కేదారగౌరీవ్రతం’ పేరిట వ్యాప్తిలో ఉన్న ఒక కథకు, ఈ కథకు పోలికలున్నాయి. సుమేరు ఉత్తరభాగంలో ఉన్న ‘మారీ’ అనే ఒక ప్రాచీననగర రాజ్యం ఈ కథకు రంగస్థలం. ఆ రాజ్యపాలకులను శంబరులన్నారు. అది పైనచెప్పిన అసుర సుబరులకు పర్యాయ పదం. ఆ నగర ఏలిక శంబరమాత, నగరనాయిక సుక్కమహాదేవి. అప్పట్లో పనికి ఆహారం పెట్టి జనంతో పెద్ద పెద్ద నిర్మాణాలు చేయించేవారు. అలాగే తమ దేవత అయిన సుక్కమహా దేవికి బంగారంతో భారీవిగ్రహాన్ని నిర్మించాలనుకున్నారు. ఇలాంటి నిర్మాణా లను చేపట్టినప్పుడల్లా పాలకులు ‘చండశాస’నాన్నిఅమలుచేసేవారు. ఆ శాసనం అమలు జరిగినంతకాలం పెళ్ళిళ్ళు, దాంపత్యాలు నిషిద్ధాలు.

         ఆ నగరంలోని ఒక యువజంట అప్పటికే ప్రేమలో పడ్డారు. వారివి పక్కపక్క ఇళ్ళు, గోడమాత్రమే అడ్డు. పెళ్ళికి కాదు సరికదా, వారు కనీసం కలసుకోవడానికి కూడా చండశాసనం అడ్డుపడింది. దాంతో వారు చిటికెల భాషలో మాట్లాడుకుని ఆ నగరం నుంచి పారిపోవడానికి పథకం వేసుకున్నారు. నిర్ణయించుకున్న ప్రకారం, మొదట ఆ యువతి ఊరి బయట వరుణానది పాయ దగ్గరికి చేరింది. అబ్బాయి ఇంకా రాలేదు. అంతలో సింహగర్జన వినిపించడంతో ఆ అమ్మాయి అక్కడికి దగ్గరలో ఉన్న తుప్పల దగ్గరికి పరుగెత్తింది. ఆ కంగారులో వోణీ జారిపోయింది. సింహం అక్కడికి వచ్చి గాలికి అల్లల్లాడే వోణీని చూసి, నీరనుకుని నెత్తుటి మూతితో దానిని తాకి వెళ్ళిపోయింది.

         అబ్బాయి వచ్చాడు. అతనికి సింహం అడుగుజాడలు, అమ్మాయి అడుగుజాడలు కనిపించాయి. ఆ పైన నెత్తుటి మరక ఉన్న వోణీ కనిపించింది. దాంతో ఆ అమ్మాయి సింహం వాత పడిందని నిర్ణయానికి వచ్చి, ఆమె లేని బతుకెందుకనుకుని కైజారు తీసి గుండెల్లో పొడుచుకున్నాడు. కాసేపటికి ఆ అమ్మాయి వచ్చింది. నిర్జీవంగా పడున్న ప్రియుని చూసింది. పట్టరాని దుఃఖంతో అదే కైజారు తీసుకుని గుండెల్లో పొడుచుకుని ప్రియుని మీద వాలిపోయింది.

         ఈ యువజంట ఆత్మహత్య వార్త నగరానికి పాకింది. నగరవాసులు ఆగ్రహోదగ్రు లయ్యారు. చండశాసనమూ, దానికి మూలమైన సుక్కమహాదేవి బంగారు విగ్రహ నిర్మాణమూ ఈ దారుణానికి కారణం కనుక వారి ఆగ్రహం విగ్రహం మీదకి మళ్ళింది. దానిని తునాతునకలు చేసి నదిలో కలిపారు. చండశాసనం లేని చోటుకు వెళ్ళాలని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు. వాళ్ళకు మన దేశం దారి తెలుసు. దీనిని వారు ‘దిల్మున్’ అనేవారు. సుమేరు భాషలో ‘మున్’ అంటే మేక; ‘దిల్’ అంటే బొడ్డు; ఈ మాట సంస్కృతంలో ‘అజనాభం’ అయింది. మనదేశం పేర్లలో అజనాభం ఒకటి. దారిలో కొంత మంది శంబరులు ఆగిపోగా, కొంత మంది కొత్తగా వచ్చి వారితో కలిశారు.

         అడవులు, కొండలూ గడిచి శంబరులు సప్తసింధుకు చేరుకున్నారు. అప్పటికి ఆవేశం తగ్గి, సుక్కమహాదేవి పై తిరిగి భక్తి ముంచెత్తింది. ఆ దేవి పేర సుక్కూరు నగరాన్ని నిర్మించుకుని, ఆమె పేరుతోనే సాగుభూములను ‘పురా’ల వారీగా పంచి వ్యవసాయం ప్రారంభించారు. అసురభాషలో వ్యవసాయ భూమిని ‘పురు’ అనేవారు. మన దగ్గర అది ‘పురం’ అయింది. రాతికర్రు, కంచుకర్రు, ఇనపకర్రు గల మూడు రకాల నాగళ్ళనూ వాడేవారు కనుక ఆ సాగుభూములకు ‘త్రిపురా’ లనే పేరువచ్చింది.

         వీరి తర్వాత హుర్రులు (హురియన్లు-పశ్చిమాసియాకు చెందిన ప్రాచీన జనాలలో ఒకరు) కూడా సప్తసింధుకు చేరుకుని తమ మూలస్థానమైన ‘అర్రఫ’ పేరుతో పంజాబ్ లో నగరం నిర్మించుకున్నారు. అదే హరప్పా కావచ్చునని ఊహ. ఆ తర్వాత, మధ్య, పశ్చిమాసియాలలో అసురులతో ఘర్షణ పడిన పశుపాలక సోదరులు కూడా సప్తసింధుకు చేరారు. ఘర్షణ మళ్ళీ మొదలైంది. అప్పటికి వైదికార్యులుగా మారిన పశుపాలక సోదరు ల్లో వ్యవసాయాన్ని పూర్తిగా వ్యతిరేకించే తీవ్రవాదులదే ఘర్షణలో పై చేయి అయింది. వారు సుక్కూరును తగలబెట్టి, త్రిపురాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలు ఆ తర్వాత ‘త్రిపురదాహం’ పేరిట వాఙ్మయంలో చోటుచేసుకున్నాయి. నాటక రూపంలో వీటిని అభినయించేవారని భరతుని నాట్యశాస్త్రం ద్వారా తెలుస్తోంది.

         ఎక్కువ మందికి తిండి పెట్టే వ్యవసాయం ప్రాముఖ్యాన్ని, వైదికార్యులలో కాస్త ముందుచూపున్నవారు అప్పటికే గుర్తించారు. త్రిపురదాహాన్ని వారు దుందుడుకు చర్యగా భావించారు తప్ప మెచ్చలేదు. అందుకే వేదాల్లో దాని ప్రస్తావన కనిపించదు. వ్యవసాయం వైపు మొగ్గడమంటే, అసురులతో రాజీపడడమే. చివరికి అదే జరిగింది. దగ్ధమైన సుక్కూరుకు దగ్గరలోనే అసురులు మరో సుక్కూరు నిర్మించుకున్నారు. ఆ సుక్కూరు దగ్గరే బ్రిటిష్ హయాంలో సింధునది మీద బ్యారేజి నిర్మించారు. అదే సుక్కూరు బ్యారేజి.

         రాజీ ఫలితంగా అసురుల్లో కొందరు వైదికార్యుల్లో కలసిపోయారు. అసుర, వైదిక సంస్కృతుల మధ్య ఆదాన ప్రదానాలు జరిగాయి. అసురుల దేవత సుక్క- బాలగాను, బాలాత్రిపురసుందరిగానూ, లలిత గానూ; బౌద్ధుల తారగానూ మారింది. కొంతకాలం సుక్కమహాదేవి కొత్త సుక్కూరులో కొండ కింద ఉండేది. ఆమెకు మగవేషం ధరింపజేసి కొండమీదికి తీసుకెళ్ళారు. ఆ విధంగా తిరువేంగడనాధుడు (బాలాజీ, శ్రీ వేంకటేశ్వ రుడు)అవతరించాడు. అసురుల్లో కొందరు దక్షిణభారతానికి వ్యాపించారు. అక్కడికి వారు తమ దేవత అయిన సుక్కమహాదేవిని కూడా తీసుకెళ్ళారు. తమిళనాడులో ‘తిరుసుక్కూరు’ అనే ఊరు కనిపిస్తుంది.  

         అసుర-వైదికార్యుల మధ్య కుదిరిన సయోధ్యకు వేదాల్లో సాక్ష్యాలు కనిపిస్తాయి. ఋగ్వేదంలోని దశమమండలం ఒక ఉదాహరణ. అందులో అసురభావనలు, అసుర ఋషుల పేర్లు కనిపిస్తాయి. అందులోని నాసదీయసూక్తానికి, పశ్చిమాసియాకు చెందిన ‘ఎనుమా ఎలిష్’ అనే సృష్టిగాథకు మధ్య పోలిక కనిపిస్తుంది. ఎనుమా ఎలిష్ లోని తొలి చరణాలు, నాసదీయసూక్తంలోని తొలి ఋక్కు- ఒకదానికొకటి అనువాదంలా కనిపిస్తాయి. ఎనుమా ఎలిష్, మర్దుక్ అనే దేవుడి చరిత్ర. అనంతర సెమెటిక్ మతాల్లోని ఏకేశ్వరుని కన్నా ముందు పుట్టిన ఏకేశ్వరుడు మర్దుక్. ఇక అధర్వణవేదానికి వస్తే, అందులో అసుర ఛందస్సులున్నాయి. ఆ వేదానికి ఉన్న పేర్లలో ‘అసురవేదం’ అనేది ఒకటి. 

         వేదాల పై అసురప్రభావానికి పూర్వమీమాంసకర్త  జైమిని అన్న మాటలు మరో సాక్ష్యం. వేదాల్లో ఏ మాటకైనా అర్థం దొరక్కపోతే మ్లేచ్ఛభాషల్లో(సెమెటిక్ భాషల్లో) వెతకాలని ఆయన అంటాడు. ఆయన ఉదహరించిన అలాంటి పదాల్లో ‘నీమ్’ అనే మాట ఒకటి. ఈ మాట హైదరాబాద్ లో వాడుకలో ఉంది. దీనికి సగం’ అని అర్థం. సగం చేతుల చొక్కాను ‘నీమ్ ఆస్తీన్’ అంటారు.

***

         ఇవీ రాంభట్ల చెప్పిన సంగతులు. సప్తసింధుకు శంబరుల రాకకు పూర్వరంగంలో జరిగినట్టు ఆయన  చెబుతున్న యువజంట ఆత్మహత్య కథకానీ, సప్తసింధుకు ఆ తర్వాత హుర్రు(హురియన్లు)ల రాక కానీ; సుక్కూరు దహనమూ, త్రిపురవిధ్వంసం కానీ, వేంకటేశ్వరుని అవతరణ వైనం కానీ ఎంతవరకూ ప్రామాణికాలో ఇప్పటికిప్పుడు నేనూ చెప్పలేను. రాంభట్ల చాలా అరుదుగా తప్ప ఆధారాలు చెప్పరు. అడిగినా కూడా మీరే వెతుక్కోండనేవారు. అలాగని అవి పూర్తిగా నిరాధారాలనే సాహసమూ నేను చేయలేను. ఎందుకంటే, ఆయన రాసిన వేరే అంశాలకు సంబంధించి ఇన్నేళ్లలోనూ  కొన్నైనా ఆధారాలు పట్టుకోగలిగాను. వాటిని ఏకరవు పెట్టడానికి ఇది సందర్భం కాదు. కాకపోతే వేదాలలోని సాక్ష్యాలు;  జైమిని అన్న మాటలు, మరికొన్ని ఇతర సంగతులకు పరిమితమై చూసినప్పుడు భారత్-ప్రాచీన పశ్చిమాసియాల సంబంధం గురించి స్థూలంగా ఒక అభిప్రాయానికి రావడానికి రాంభట్ల అధ్యయనం తోడ్పడుతూ ఉండవచ్చు.

         మొన్నటివరకు ప్రచారంలో ఉన్నట్టు, సింధునాగరికులపై బయటినుంచి పెద్ద ఎత్తున దాడి కానీ; జనాల ఊచకోత కానీ జరగలేదనే అభిప్రాయాన్ని ఇటీవలి కాలంలో నిపుణులు వ్యక్తం చేస్తున్న సంగతిని కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. 

***

మనదేశంలో అసురసంస్కృతీప్రభావం గురించి రాంభట్ల చెప్పిన మరికొన్ని విశేషాలూ; పశ్చిమాసియాభాషలతో తెలుగు, తమిళం వంటి మన దక్షిణాదిభాషలకు ఉన్న సంబంధం గురించీ… తర్వాత…

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.