వెనుతిరగని వెన్నెల(భాగం-52)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధించి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురయ్యి, పెళ్ళి ప్రపోజల్ తీసుకు వస్తాడు. తన్మయి ఒక ఏడాది గడువు పెట్టి, మధ్యలో కలుసుకోకూడదని నిబంధన పెడుతుంది.

***

          “తెల్లారి ఆరుగంటలకి ఆపరేషను. ఇవేళ్టి రాత్రి పెందరాళే భోజనం చేసెయ్యాలి. తర్వాత ఇక ఏమీ తినకూడదు, తాగకూడదు.” అంది నర్సు.

          అసలే కడుపు నొప్పితో బాధపడ్తున్న తన్మయి ఉదయం టిఫిను తర్వాత ఏమీ తినలేదు. నీరసంగా తలూపింది.

          తను ఇలా బెడ్డు మీద పడుకుని ఉంటేరాత్రికి తనకి భోజనం ఎవరు పెడతారు?”

          సిద్దార్థ పొద్దుటే ఆపరేషను టైముకి వచ్చి కాలేజీకి వెళ్తానన్నాడు కాబట్టి సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళమని పంపించింది

          తాయిబా బాబుని చూడడమే తనకి చాలా గొప్ప సహాయం. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు.

          తల్లీతండ్రీ యాత్రల్లో ఉన్నారు.

          మొదటిసారి తనెంత ఒంటరిదో అర్థం అయ్యింది తన్మయికి. జీవితంలో అన్నిటి కన్నా పెద్దదైన, రాకూడని కష్టం వచ్చింది. అప్పటి వరకూ ఉన్న ధైర్యం, ఏదైనా పరిష్కరించుకోగలిగిన ధీరత్వం ఒక్కరోజులో మాయమైపోయాయి.

          ఎవరి మీదా ఎప్పుడూ ఆధారపడకూడదనే నమ్మకం సడలిపోయి దీనురాలిగా పడి ఉంది ఇప్పుడు.

          హాస్పిటల్ గదిలో వెల్లకిలా  పడుకుని తిరుగుతున్న సీలింగ్ ఫాను వైపు చూస్తూ  “మిత్రమా! నాకెందుకీ పరీక్ష?” నన్ను ఎవరు ఆదుకుంటారు?” అంది జీరబోయిన గొంతుతో.

          ఫానులాగే లోపల్లోపల అయోమయత్వం దుఃఖంగా సుళ్ళు తిరుగుతోంది. “ ప్రపంచంలో ఒంటరిగా ప్రవేశించిన మనిషి ఒంటరిగానే నిష్క్రమించాలి. కానీ జీవన పర్యంతం ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో తనకంటూ ఒకరుండి ఉంటే ఎంత బావుండేది? తనెంత దురదృష్టవంతురాలు!”  ఆగకుండా కన్నీళ్ళు ధారాపాతంగా ముంచెత్తసాగేయి.

          “ రాత్రి తర్వాత తనకి ఏమవుతుందో కూడా తనకి తెలీదు. తను ఆపరేషను తర్వాత అసలు బతికుంటుందో, లేదో కూడా తెలియదు. ఇక భోజనం సంగతి అప్రస్తుతం.” నిస్త్రాణగా కళ్ళు మూసుకుని ప్రార్థించసాగింది.

          “భగవంతుడా! తండ్రీ!! నా సర్వస్వం నా ఒక్కగానొక్క కొడుకు మాత్రమే. నేనే ఆధారమైన పసివాడిని దయచేసి శిక్షించకు. వాడిని ప్రయోజకుడిని చేసే వరకూ నాకు బతికుండే అవకాశాన్ని కలిగించు. నన్నీ కష్టం నుంచి కాపాడు”

          “ఏంది మేడం, ఏడుస్తుండావా, సాలు తియ్యి. నే లేనా? ఇగో, నీ కోసం భోజనం తెచ్చిన, లెవ్వు” తాయిబా దగ్గిరికి వచ్చి చప్పున కళ్ళు తుడిచింది. వెనకే బాబు పరుగెత్తుకొచ్చేడు.

          ఆ క్షణాన తాయిబా సాక్షాత్తూ భగవంతుడే అని అనిపించి చేతులెత్తి నమస్కరిం చింది.

          అదేమీ పట్టించుకోని తాయిబాఅమ్మ దావఖానల ఉన్నదనగానే ఉరికినాడు బిడ్డ” అంది బాబు వీపు రాస్తూ.

          ఒక్క ఉదుటున బాబుని మంచమ్మీదికి తీసుకుని హత్తుకుంది తన్మయి.

          వాడి చిన్ని చేతుల మధ్య నిశ్చింతగా అనిపించి కళ్ళు మూసుకుంది.

          “ఇంటికి వెళ్ళిపోదాం దామ్మా”  అన్నాడు చెయ్యి పట్టుకుని లాగుతూ.

          “రేపు వెళ్ళిపోదాం. నేనివేళ ఇక్కడే ఉండాలి. నువ్వు తాయిబా దగ్గిర ఉండు నాన్నా ఇవేళ” అంది ముద్దులు కురిపిస్తూ.

          “ఉహూ” అని తల అడ్డంగా ఆడించేడు.

          తాయిబా కల్పించుకునిఉంటడులే, నువ్వు పరేషాన్ గాకు, టీవీ పెడతగా. ఉంటడు”  అని భోజనం వడ్డించింది.

          తన్మయి తినే ఒక్కొక్క ముద్దలో అమృతం ఉన్నట్లు కష్టాన్ని అవలీలగా గట్టెక్కగల ధైర్యం కలగసాగింది.

          “తాయిబాకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు?” 

          అదే అంది.

          “ఊకో మేడం, నీ అంత పెద్ద మాటలు నాకు రావు. నా సిన్నతనంల గరీబోల్లమైనా, మా అమ్మా, బాపు కాయకష్టం సేసెటోళ్లయినా సుట్టూ అందరికీ సాయంసేసుడే. నీకు ఇన్నినాళ్ళకి బుక్కెడు బువ్వ తినబెట్టే అదురుష్టం నాకు కలిగింది” అంది చిన్నగా నవ్వి.

          సంతృప్తిగా తిన్న తన్మయిని ఆనందంగా చూసింది తాయిబా.

          విశాఖపట్నంలో మూత్రపిండాల మార్పిడిలో అరుదైన రక్తం అవసరమైన వ్యక్తికి తను రక్తదానం చేసినప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన అత్యంత కృతజ్ఞతాభావం, వ్యక్తి ప్రాణం నిలబడ్డప్పుడు తనకి కలిగిన ఆనందం జ్ఞాపకం వచ్చింది తన్మయికి.

          జీవితంలో సహాయం పొందిన క్షణాలు ఎప్పుడూ మరిచిపోకూడదని తీర్మానమూ, కష్టంలో ఉన్న ఎవరికైనా నిస్వార్థసేవ చెయ్యడమే ఇక తన జీవన పరమార్థమని నిర్ణయ మూ చేసుకుంది తన్మయి.

***

          ఆ రాత్రి ఆసుపత్రిలో క్షణం నిద్దర లేకుండా గడిచింది తన్మయికి.

          చుట్టూ స్పిరిట్ వాసన, పక్క గదుల్లోంచి బాధా పూరిత మూలుగులు, చంటిబిడ్డల ఏడుపులు, వరండాలో వచ్చి పోయే జనాల చప్పుళ్ళు.

          నొప్పికి ఇంజక్షను ఇచ్చినా కొత్త ప్రదేశం కావడం వల్ల గాభరాగా, అస్థిమితంగా ఉంది.

          తెల్లారగట్ల నర్సు వచ్చి లేపింది.

          ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఆలోచనల్లా అల్లకల్లోలంగా  తెల్లవారింది రోజు.

          మనస్సుని అతి కష్టమ్మీద ఉగ్గబట్టుకుని ధైర్యం చెప్పుకోసాగింది తన్మయి.  

          నర్సు టెంపరేచర్, బి.పి వంటివి చెక్ చేసిఅటు తిరుగు ఎనీమా చెయ్యాలె” అంది.

          అదేవిటో తన్మయికి అర్థం అయ్యేలోపలే కడుపులో సుళ్ళు తిరగడం ప్రారంభం అయ్యింది.

          అసలే కడుపు నొప్పికి నిన్నటి నుంచి చాలా సార్లు వెళ్ళాల్సి వచ్చింది.

          తన్మయికి నీరసం వచ్చేసింది.

          పైగా కాసిన్ని మంచినీళ్ళడిగినా కుదరదని కఠినంగా చెప్పింది నర్సు.

          అంతలోనె ఏమనుకుందోఆపరేషను అయినంక మర్రోజు వరికి ఒంటికి, రొంటికి పోరాదు. కడుపు ఖాళీ ఉండాలె. ఇగో అంతగ అయితె గొంతు తడుపుకో” అని ఒక స్పూను, గ్లాసులో సగానికి నీళ్ళు తెచ్చి పెట్టింది.

          మరో గంటలో థియేటర్ లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టేరు.

          బల్లమీద వెల్లకిలా పడుకున్న తన ముఖం మీదికి  ఉన్న లైటు వైపు చూడలేక కళ్ళు మూసుకుంది.

సిటీ నుంచి వచ్చిన సర్జను, ఎనస్థీషియన్ లను తోడు తీసుకుని డాక్టర్ వచ్చింది.

          “ఏం మేడం, హౌఆర్యూ” అని పలకరిస్తూనే వెన్నుకి ఇవ్వబోయే ఎనస్థీషియా ఇంజక్షను గురించి వివరించింది.

          పక్కకి తిరిగిన వెన్నులో గట్టిగా సూది గుచ్చుకున్నపుడు పళ్ళ బిగువున బాధని అతికష్టమ్మీద అదిమిపెడుతూఅమ్మా….” అని అరిచింది తన్మయి.

          క్షణంలో కళ్ళు మూతలు పడడం వరకే గుర్తుంది తన్మయికి.

***

          తన్మయి కళ్ళు తెరిచే సరికి గదిలో తిరుగుతున్న  ఫ్యాను గట్టిగా శబ్దం చేస్తూ మీద పడుతున్న భ్రాంతి కలిగింది.

          మంచం మీంచి కిందికి ఎవరో తోస్తున్నట్లుఅయ్యో, అయ్యో….” అని అరవసాగింది.

          ప్రభు చప్పున చెయ్యి పట్టుకునిఎలా ఉంది” అన్నాడు.

          హఠాత్తుగా ప్రభు కనిపించే సరికితను కలలో ఉందాఅన్న అనుమానం వచ్చింది.

          కానీ స్పర్శ నిజమనిపిస్తోంది.

          ప్రభు చేతిని గట్టిగా పట్టుకునిప్రభూ! వెళ్ళోద్దు, నన్నొదిలి ఎక్కడికీ వెళ్లోద్దు”  అనసాగింది.

          “ఎక్కడికీ వెళ్ళను, సరేనా” అన్నాడు ఇంకాస్త దృఢంగా చేతిని పట్టుకుని.

          అంతలోనే నిద్ర ఆవహించింది తన్మయికి.

          తన్మయి చేతిని తన చేతిలోకి తీసుకుని అలాగే కూచున్నాడు ప్రభు.

          తన్మయికి మెలకువ వచ్చినపుడల్లా ధైర్యపు స్పర్శతో మెల్లగా నిమిరసాగేడు.

          తన్మయికి నడుము నించి కింది భాగమంతా చలనం కోల్పోయి అంతా చచ్చుబడినట్లు ఉంది.

          సెడేషన్ వల్ల నాలుకంతా పిడచకట్టుకుపోయి దాహం బాగా వెయ్యసాగింది.

          “ప్రభుప్రభు….వచ్చేవా..నా కోసం వచ్చేవా?”  మనసులోనే మాట్లాడసాగింది.

          “నీతో ఎన్నో మాట్లాడాల నుంది. నిన్ను కౌగిలించుకుని మనసారా దు:ఖించాలని ఉంది. ప్రభూ! నా చేతిని ఎప్పుడూ వదలొద్దు. ఇంకెప్పుడూ ఎక్కడికీ వెళ్ళోద్దు. దీనురాల్ని ఇలా దుస్థితిలో వదిలి ఎక్కడికీ వెళ్ళోద్దు”

          మనసులో సుళ్ళు తిరుగుతున్న ఏవేవో బాధల్ని అదిమిపట్టి పైకి మెల్లగాదాహంఅని మాత్రం అనగలిగింది.

          ప్రభు చప్పున పరుగెత్తి నర్సుని పిలుచుకు వచ్చేడు.

          “అరే, చేతికి సెలైను ఎక్కుతుండె కదమ్మా, నీకు నీళ్ళు అవసరం లే, ఊరికె గట్లనె అనిపిస్తది. నీళ్ళు తాగినవంటె వాంతి గట్ల అయితది మరి సూడుఅంది.

          అయినా దాహం భరించడం చాలా కష్టంగా ఉంది.

          పెదాలు తడుపుకుందామంటే కాస్త తడి కూడా తగలడం లేదు.

          మళ్లీదాహందాహం”  అంది.

          నర్సు అటు వెళ్ళగానే, తన్మయి అవస్థ చూడలేక ప్రభు చిన్న కాటన్ తీసుకుని వచ్చి తడిపి పెదాల మీద రెండు చుక్కలతో అద్దేడు.

          కాస్త ప్రాణం లేచొచ్చింది తన్మయికి.

          తన చేతిని పట్టుకున్న ప్రభుని చూసి కృతజ్ఞతతో కళ్ళు నిండి అప్రయత్నంగా కన్నీళ్ళు ధారాపాతంగా రాసాగేయి తన్మయికి.

          “ఉష్….” అంటూ దగ్గిరగా జరిగి, తల నిమురుతూ అనునయంగా, “తనూ! నువ్విలాంటప్పుడు ఏడొవొచ్చా? నేనున్నానుగా. ఏవీ బెంగపడకు. ఆపరేషను సక్సెస్ ఫుల్ గా అయిందని చెప్పేరు డాక్టరు, నాలుగు రోజుల్లో నువ్వు చక్కగా లేచి నడిచి నీ పనులు నువ్వు చేసుకోగలవని కూడా చెప్పేరు. ఇక ఏవీ భయం లేదు. ధైర్యంగా ఉండాలమ్మా, సరేనా?” అన్నాడు ముందుకు వంగి చిన్న పిల్లతో చెపుతున్నట్టు లాలనగా.

          తన్మయికి తండ్రి జ్ఞాపకం వచ్చేడు.

          దాదాపు ఏడేళ్ళ వయసులో తనకి తేలు కుట్టినపుడు తండ్రి తనని భుజాన వేసు కుని మంత్రగాడి దగ్గిరకి పెట్టిన పరుగు ఇప్పటికీ గుర్తుంది.

          ఉల్లిపాయ చితక్కొట్టి, పసుపు రాసి..ఏం చేసినా తగ్గని నొప్పికి గిలగిల్లాడుతూ తను పెట్టిన ఏడుపు చూళ్ళేక, తండ్రి తన పక్కనే జాగారం కూచుని కంట తడి పెట్టడం గుర్తొచ్చింది.

          కాస్సేపట్లో అప్పుడప్పుడే మత్తు విడూతుండగా వెల్లకిలా పడుకోలేక నడుం లాగేయడం మొదలయ్యింది

          పక్కకు తిరిగి పడుకోవాలని అనిపించసాగింది.

          నర్సు వచ్చి మళ్ళీ మందలించింది. “అరే మూల కెళ్ళి ఈడి దాక కుట్లు పడ్డయ్యి, పక్కకిగెట్ల తిరుగుతవమ్మ? నువ్వుపరేషాన్ అయ్యి మమ్మల్ని పరేషాని బెట్టకు

          తన్మయి నిస్సహాయంగా గది సీలింగు వైపు చూస్తూ ఉండి పోయింది.

          నర్సు వెనకే వెళ్లొచ్చి నిట్టూర్చేడు ప్రభునేనేమైనా సాయం చెయ్యగలనేమో అనుకున్నాను. కానీ పేషంట్ పక్కకు తిరిగి పడుకుంటే రక్తప్రసరణ పక్కకు అయ్యి కుట్లలోంచి రక్తం పక్కకు బయటకు వచ్చే ప్రమాదం ఉందట. “కొంచెం ఓర్చుకో ప్లీజ్” అన్నాడు బతిమాలాడుతున్నట్లు.

          తన్మయి కళ్ళల్లోంచి బాధ తట్టుకోలేక నీళ్ళోచ్చేయి.

          ఏవేవో చెప్పాలనుంది ప్రభుకి. తన బాధలన్నీ ఏకరువు పెట్టాలనుంది.

          మత్తు ఆవరిస్తూ నిద్రపోతూ, అంతలోనే కళ్ళుతెరుస్తూ  భ్రాంతిమయ క్షణాలలో ఏదో అర్థంలేని శబ్దాలు చెయ్యసాగింది.

***

          సాయంత్రం అయ్యేసరికి నెమ్మదిగా మత్తు విడి క్రమంగా కుట్లు నొప్పి తెలియ సాగింది.

          ఎవరో తన శరీరాన్ని రెండు ముక్కలు చేసి మళ్ళీ జత  చేసినట్లు చర్మం పీకెయ్యసాగింది.

          ప్రభు మళ్లీ పరుగెత్తేడు నర్సు కోసం.

          నొప్పి తగ్గడానికి ఇచ్చిన ఇంజక్షన్ క్రమంగా పనిచేస్తూనే నిద్రలోకి జారిపోయింది తన్మయి.

          నిద్రలో శేఖర్ పక్కనే కూచుని సేవలు చేస్తూ  ఉన్నట్లు కలగంది.  

          కళ్లు తెరుస్తూనే సారి పూర్తిగా మెలకువ వచ్చినట్లనిపించింది. చుట్టూ అన్నీ అర్థంకాసాగేయి.

తన కలకు అర్థమేమిటా అని ఆలోచించింది.

          బహుశా: ప్రభులాగా శేఖర్  తనని చూసుకుని ఉండి ఉంటే బావుణ్ణని తను కోరుకుంటూందన్న మాట.

          లేకపోతే శేఖర్ తన కలలోకి అంత మంచివాడుగా రావడమేమిటి?

తన్మయి కళ్ళు తెరవగానేఎలా ఉందిరా” అన్నాడు ప్రభు ఆత్రంగా దగ్గరకు వచ్చి.

          పొద్దుట్నించి పాపం బాగా అలిసిపోయేడు ప్రభు. అతని ముఖమంతా అలసటతో వాడిపోయింది.

          ఆ పలకరింపులోని ఆత్మీయత, ఆప్యాయత తన్మయికి అత్యద్భుత వరాలలా వినిపించాయి.

          “చాలు మిత్రమా! జన్మకిది చాలు” అనుకుంది మనస్సులో.

          “నువ్వుఎప్పుడు వచ్చేవు? నీకెప్పుడు తెలిసింది?” అంది మెల్లిగా.

          “ఉష్అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం” అన్నాడు ఇంకా తల నిమురుతూ.

          “ఇంటికి వెళ్ళి కాస్సేపు రెస్టు తీసుకో, తాళాలు పర్సులో ఉన్నాయి” అంది మెల్లిగా.

          “ఫర్వాలేదు, నువ్వు నా గురించి దిగులు పడకు. ఆఫీస్ కి రెండు రోజులు సెలవు పెట్టాను. నువ్వు పూర్తిగా కోలుకునే వరకూ ఇక్కడి నుండే ఆఫీస్ కు వెళ్ళోస్తాను.”  అన్నాడు స్థిరంగా.

          తన్మయి కృతజ్ఞతగా తలూపింది.

          “కనీసం కాస్త టీ అయినా తాగి రా, బాగా అలిసిపోయేవు” అంది నీరసమైన గొంతుతో.

          ప్రభు అలా వెళ్ళగానే కాలేజీ నుంచి స్టాఫ్, పిల్లలు వచ్చేరు.

          “అయిదు నిమిషాల్లో అంతా పొవ్వాలె, పేషంటుకి గాలి ఆడాలె”  నర్సు గదమాయించడంతో పిల్లలు బయటే ఆగిపోయి గుమ్మం దగ్గిర గుమిగూడారు.

          తన మంచికోరే ఇందరు మనుషులు తనచుట్టూ ఉన్నారన్న విషయం తన్మయికి అత్యంత ఆనందాన్ని ఇచ్చింది.

          అంతా వెళ్ళేకసిద్దార్థ ప్రభు వచ్చే వరకూ ఉండి వెళ్ళేడు.

          సిద్దార్థని చూస్తూనేచాలా థాంక్సండీ, సమయానికి మీరు ఫోను చెయ్యకపోతే నాకు తెలిసేది కాదు” అన్నాడు ప్రభు.

          “అయ్యో, ఇందులో మీరు థాంక్స్ చెప్పాల్సింది ఏముందిమీరు దగ్గరుంటే తన్మయి త్వరగా కోలుకోగలదు” అన్నాడు చిన్నగా నవ్వుతూ సిద్దార్థ.

          “తప్పకుండా” అన్నాడు ప్రభు.

          సిద్దార్థ వైపు చూసి నమస్కరించిథాంక్యూ సో మచ్” అంది తన్మయి. పాపం పొద్దున్న ఆపరేషను థియేటర్ లోకి తను వెళ్ళే అయిదు నిమిషాల ముందు పరుగున వచ్చేడు. ముందు రోజు ఎంతో సాయం చేసేడు.

          “మీరు త్వరగా కోలుకోండి, అంతే చాలు. ఆదివారం మా మిసెస్ ని తీసుకుని వస్తాను. మీకు కొంచెం సాయంగా ఉంటుంది” అన్నాడు.

          “అయ్యో ఫర్వాలేదు, ఆవిడని ఇబ్బందిపెట్టకండి” అంది తన్మయి

          బాబు స్కూలు నించి రాగానే తాయిబా తీసుకుని వచ్చింది.

          అసలేమవుతుందో తెలియక ఏడుపు ముఖం పెట్టుకుని దగ్గిరికి వచ్చేడు.

          తన్మయి బాబు తల నిమిరి, “భయం లేదు నాన్నా! నాకేమీ కాలేదు” అంది.

          “నువ్వేం పరేషాన్ గాకు మేడం. అల్లా మనతో ఉన్నాడు. బాబు గురించి ఫికర్ చెయ్యకు. మంచిగ ఉంటుండు. నీకు జల్దీ నయంగావాలని ఇగో ఇది తెచ్చిన” అని రహస్యంగా పమిట కింద నుంచి తాయెత్తు తీసి చేతికి కట్టింది.

          “తను జన్మలో చేసుకున్న పుణ్యమో ఇది!” అనిపించింది తన్మయికితన చుట్టూ తనని ప్రేమించే ఇందరు మనుష్యులు! ప్రభు, సిద్దార్థ, తాయిబాతను వీళ్ళకేమిచ్చి ఋణం తీర్చుకోగలదు? వీళ్ళంతా లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో తనేం చెయ్యగలదు?” 

          నిస్త్రాణగా మూసుకున్న కళ్ళ ముందు మొత్తం జీవితం గిర్రున తిరుగాడింది.

          “ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తన జీవితం!

          ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, తల్లిదండ్రులకి ఒక్కత్తే సంతానంగా అపురూపంగా, తనదైన ప్రపంచంలో అత్యంత భావుకురాలిగా పెరిగి భావి జీవితం గురించి ఎన్నో కలలతో మొదలయ్యింది తన ప్రస్థానం!

          శేఖర్ ఛిద్రం చేసిన జీవితాన్ని చదువు ఆదుకుని, అక్కున చేర్చుకుని తనని ఉన్నత స్థానంలో నిలబెట్టింది.

          పెళ్ళి, ఆశయాలు ఒక ఒరలో ఇమడని అత్యంత సంక్లిష్టమైన జీవితాన్ని దాటుకుని వచ్చింది.

          ఇప్పుడు శరీరానికే కష్టం వచ్చిందిఅయినా తను మనో ధైర్యంతో తట్టుకుని, దాటుకుని వెళ్తుందిదేనికీ భయపడకూడదు. కష్టమూ ఓర్చుకుని గట్టెక్కాలి. అవును, గట్టెక్కాలి. ” మనస్సులో దృఢంగా అనుకుంది తన్మయి.

          గట్టిగా నిట్టూర్చబోయి ఆగిపోయింది. కనీసం దగ్గడానికి కూడా కుదరడం లేదు. కుట్లన్నీ పీకేసినట్లు నొప్పి.

          ఇక తుమ్ము వచ్చిందంటే ప్రాణం పోయినట్లే. అందుకే పేషంట్లకి ఇతర అనారోగ్యాలు చుట్టుముట్టకుండా చూసుకుంటూ ఉంటారు హాస్పిటల్ సిబ్బంది.

          కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది.

          తల్చుకున్నపుడల్లా ముల్లులా గుచ్చుకుంటుంది గతంత్రోవ పొడవునా తనకి ఎదురైన మంచి మనుషులు మాత్రమే తనకున్న ఆస్తిపాస్తులు.

          అయినా గతాన్ని పక్కకు నెట్టి, బాబు భవిష్యత్తు  కోసం తను ధైర్యంగా అన్నిటినీ తట్టుకుని నిలబడాలి.

          దేనికీ భయపడకూడదు. కష్టమూ ఓర్చుకుని గట్టెక్కాలి. అవును, గట్టెక్కాలి!

          పక్కనే ఉన్న బాబు చేతిని గట్టిగా పట్టుకుంది.

          తల్లి బాధను అర్థం చేసుకున్న వాడిలా చేతిని నిమిరేడు.

          ఆ క్షణంలో వాడు తన కడుపున పుట్టిన చిట్టి తండ్రిలా కాక, తనను కన్న తండ్రిలా అనిపించాడు!

          “అమ్మానాన్నా ఎప్పుడొస్తారో” యథాలాపంగా పైకే అంది.

          అప్పుడే లోపలికి వస్తున్న ప్రభు వెంటనేఫోను ప్రయత్నించేను. కానీ ఇంకా యాత్రల నించి వచ్చినట్లు లేరు” అన్నాడు.

***

          అనారోగ్యమే జీవితంలో అన్నిటికన్నా పెద్ద కష్టమని మొదటిసారి తెలిసొచ్చింది తన్మయికి.

          పాపం తాయిబా ఆఫీసు మాని బాబుని చూస్తూపైగా తన కోసం ప్రత్యేకంగా పథ్యం వండి పట్టుకు రాసాగింది.

          ఇక ప్రభు అన్నీ మాని తనతోనే హాస్పిటల్లో ఉంటానని పట్టుబట్టినా తన్మయి వారించి బలవంతంగా ఆఫీసుకి వెళ్ళమని పంపించింది. అయినా రోజూ సాయంత్రం అంత దూరం నుంచి వచ్చి తను నిద్రపోయేక వెళ్ళసాగేడు.

          రెండో రోజే లేపి కూచోబెట్టి, మూడో  రోజు నించే లేచి నడవడానికి ప్రయత్నించమని చెప్పింది డాక్టరు.

          మొదటి రెండడుగులు అతికష్టం అనిపించినా మెల్లగా బిగబట్టిన చర్మంతో అడుగులు వెయ్యడానికి అలవాటు పడింది తన్మయి.

          పగలల్లా మంచం మీద పడుకుని ఉండడానికి బోరుగా అనిపించసాగింది.

          పక్క గదుల్లోని పేషెంట్లని పలకరించసాగింది.

          ఒక పేషెంట్ కూడా ఉన్నామెమీ గదిలో ఎవరికి ఆపరేషనయ్యింది?” అనడిగింది కూడా.

          తనే పేషెంట్ అని తెలిసి ఆమె ఆశ్చర్యం చూడాలి!

***

          అనుకున్నదానికంటే వేగంగా తన్మయి కోలుకోవడంతో నాలుగో రోజునే డిశ్చార్జి  చేసింది డాక్టరు.

          వేసుకోవాల్సిన మందుల కట్ట చూసి దిగులు పట్టుకుంది తన్మయికి. తనకస్సలు మందులు మింగడం ఇష్టం ఉండదు. పైగా ఒక్కొక్క మాత్రా పెద్ద పెద్ద చిక్కుడు గింజల్లా ఉన్నాయి. ఒకపట్టాన మింగుడు పడడం కష్టమే.

          ఇంటికి వచ్చిన మధ్యాహ్నానికి తల్లీతండ్రీ వచ్చేరు.

          “అయ్యో! పాడు యాత్రలకి ఇప్పుడే వెళ్ళాలా మేం” అంటూ జ్యోతి కూతుర్ని కౌగిలించుకుని భోరుమంది.

          భానుమూర్తి కూతురి తల నిమిరిభయపడకు తల్లీ! మేం వచ్చేవుగా” అన్నాడు.

          బాబు ఆత్రంగా తాతయ్యను, అమ్మమ్మను హత్తుకున్నాడు.

          “అయ్యో పిల్లాడు భయపడిపోయి, డీలాపడిపోయేడు” అని జ్యోతి వాణ్ణి భుజాన వేసుకుని వెన్ను నిమిరింది

          తల్లిదండ్రుల్ని చూడగానే తన్మయికి నిశ్చింతగా అనిపించింది.

          నాలుగురోజులు ముందు వాళ్ళకి తెలిసి ఉంటే ఎంతో బావుండేది కదా అనిపించింది.

          “రాత్రే ఊరినించి వచ్చాము. ఎవరో ప్రభు అటమ్మా, నీతో చదువుకున్నాడట. ఫోను చేసి చెప్పేడు” అంది జ్యోతి.

          తల్లి ప్రభు గురించి ఇంకేమైనా వివరాలు అడుగుతుందేమోనని సందేహంతో తన్మయి మాట మార్చి, “యాత్రలెలా జరిగేయమ్మా”  అంది.

          “ఇన్నాళ్ళకి అనుకున్న ప్రదేశాలన్నీ చూసి రాగలిగేం. అంతా భగవంతుడి దయ. కష్టం లేకుండా నెల రోజులు తిరగగలిగేం. కానీ మీనాన్నగారికే కాళ్ళు బాగా వాచిపో యాయి పాపం. ఎక్కడివక్కడ పడేసి నీ గురించి వినగానే ఫస్టు రైలు పట్టుకుని వచ్చేసేం. మా మాటకేం గానీ అసలేం జరిగిందమ్మా, ఉన్నట్టుండి ఆపరేషనేవిటి?” అంది జ్యోతి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.