వెనుతిరగని వెన్నెల(భాగం-53)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీ లో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురయ్యి,  పెళ్ళి ప్రపోజల్ తీసుకు వస్తాడు. తన్మయి ఒక ఏడాది గడువు పెట్టి, మధ్యలో కలుసుకోకూడదని  నిబంధన పెడుతుంది.

***

          తల్లిదండ్రుల్ని చూడగానే తన్మయికి పూర్తిగా ధైర్యం వచ్చింది.

          బాబుకూడా సంతోషంగా గంతులు వేసేడు.

          ఆపరేషను అయ్యి వారం రోజులే అయినా తనంతట తనుగా లేచి చిన్న చిన్న పనులు చేసుకోసాగింది తన్మయి.

          “జాగ్రత్తమ్మా, కింద కూర్చోవడం, బరువులు ఎత్తడం లాంటివి అస్సలు చెయ్యద్దు” అని వారించింది జ్యోతి.

          “వీళ్ళు వచ్చిన సంగతి ప్రభుకు ఎలా తెలియజెయ్యాలి? బయటికెళ్ళి ప్రభు ఆఫీసు కి ఫోను చేసొద్దామంటే ఇంకా అప్పుడే బయట నడవగలిగే ఓపిక ఇంకా రాలేదని అనిపి స్తూంది” ఆలోచిస్తూ…

          పొద్దున్నే  కాలేజీకి బయలుదేరుతున్న తాయిబాని రహస్యంగా పిలిచి, ” సిద్దార్థ సారుకు లెటర్ ఇవ్వు” అని కాగితం మడిచి చేతిలో పెట్టింది.

          వెనక్కి తిరగగానే తల్లి ఎదురు పడే సరికి, “ఏం లేదు, కాలీజీకి లీవు లెటరు” అంది కొంచెం తడబాటుగా.

          “నేనేమీ అడగలేదే” అంది జ్యోతి.

          తల్లిదండ్రులు వచ్చిన సంగతి ప్రభుకు ఫోనుచేసి చెప్పమని సిద్దార్థకు రిక్వెస్టు లెటరది.

          తన్మయికి ఒక పక్క ప్రభు వస్తే తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలోనన్న ఆతృత, మరో పక్క అతను రాకపోతే ఎలా అన్న దిగులు ఒకేసారి కలిగి కలవరంగా అనిపించసాగింది.

          ముఖంనిండా చెమట్లు  పడుతూ అస్థిమితంగా ఉన్న కూతుర్ని చూసి,

          “ఏమైందమ్మా!” అన్నాడు భానుమూర్తి.

          తండ్రి ప్రేమగా అడిగేసరికి భోరున ఏడ్చింది తన్మయి.

          “అయ్యో, అయ్యో ఆపరేషను అయ్యి పదిరోజులు కూడా కాని పిల్లవి ఇలా ఏడవొచ్చా?” అంది తల్లి గాభరాగా.

          “ఏమని చెప్పాలి? చెప్పినా ప్రభుకు, తనకు మధ్య పెరిగిన ఆత్మీయతానురాగాలు హర్షిస్తారా? అసలు ఒప్పుకుంటారా?” చెప్పడానికి ధైర్యం చాలక కళ్లొత్తుకుంటూ, కిందికి చూస్తూ ఉండిపోయింది తన్మయి.

          “ప్రశాంతంగా కాస్త తిని నిద్రపోమ్మా,  అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు.అమ్మా, నేను నీకు తగ్గే వరకూ ఉంటాంగా” అన్నాడు భానుమూర్తి.

          అలాగేనన్నట్టు “నిశ్శబ్దంగా తలూపింది”

          మనసంతా ఎంతో భారంగా ఉంది.

          మొన్నటి వరకూ ప్రభుకి తనే ఆంక్షలు పెట్టింది.

          ఇప్పుడిక అసలు అతన్ని చూడకుండా ఉండడం దుర్లభం అనిపిస్తూంది. 

          పుస్తకాల అరలో నుంచి తిలక్  “అమృతం కురిసిన రాత్రి” తీసి తల కింద పెట్టుకుంది. 

          “ఇన్ని నే బతికిన దినాల పన్నిన వ్యూహాన

          నిన్నెక్కడ  కలిసికొనినానొ స్మృతికి రాదుగాని

          నీవు లేవనునట్టి కాలమే నాకు లేదు 

          నా దారి నుండి నిన్ను వీడదీయు వేరు మార్గమే లేదు

          నా నిదురించు శయ్యాగృహమ్ము 

          నీవు లేక నాకు పచ్చి శూన్యమ్ము”

          తిలక్ కవిత్వం కంటి నుంచి ధారాపాతంగా కురుస్తూ ఉండగా నిస్త్రాణగా కళ్ళు  మూసుకుంది తన్మయి.

          ఎంత సేపు పడుకుందో తెలియలేదు.

          “ఏమ్మా, ఎలా ఉన్నారు?” గుమ్మం బయట దేవి గొంతులా వినబడడంతో ఉలిక్కి పడి లేచింది తన్మయి.

          దేవి, ఆవిడ పెద్ద తమ్ముడు నిజంగానే అక్కడ ప్రత్యక్షమయ్యేరు. 

          తాయిబానడిగి తండ్రి వాకిట్లో కుర్చీలు వెయ్యడం, దేవి, ఆవిడ తమ్ముడు కుశల ప్రశ్నలు వేస్తూ బాబుని ముద్దాడడం చూసి ఒక్క సారిగా తలపోటు ప్రారంభమైంది తన్మయికి.

          మూసుకున్న కళ్ళు తెరవడం ఇష్టం లేక, వెనక్కి తిరిగి పడుకున్న తన్మయి హృదయం బాధతో మూలగసాగింది.

          “అసలే తనకు శరీరమూ, మనసూ ఏవీ బాలేవు. మధ్య మళ్ళీ వీళ్ళ గోల ఏవిటీ? అసలెందుకొచ్చేరు?”

          “ఇక్కడికీ దాపురించేరు” జ్యోతి విసుక్కుంటూ స్టవ్వు మీద టీ పెడుతున్న శబ్దం విని మెల్లిగా లేచి కూర్చుంది తన్మయి.

          భానుమూర్తి సంతోషంగా మాట్లాడుతున్నాడు.

          “ఆపరేషను అయ్యిందని తెలిసిందన్నయ్యా. హైదరాబాదులో పెద్ద తమ్ముడింటికి మొన్నే వచ్చేను. కానీ వాడి ఉద్యోగం హడావిడిలో ఇప్పటికి రాగలిగేను.” దేవి మాటలు లోపలి నుంచి వింటూ

          “ఏవిటో ఈవిడికి ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది నీ మీద” ఈసడింపుగా అంది జ్యోతి.

          తన్మయి నిశ్శబ్దంగా బాత్రూములోకెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది.

          “ఎంత కాదనుకున్నా మనం మనం బంధువులం. ఎన్నాళ్ళని ఇలా ముఖముఖాలు చూసుకోకుండా ఉంటాం?” అంటున్నాడు దేవి తమ్ముడు. 

          భానుమూర్తి మాట్లాడకుండా టీ చప్పరించసాగేడు.

          తన్మయి బయటికి రావడం చూసి ఆవిడ తమ్ముడు లేచి గట్టు మీద కూచుంటూ “ఇలా రామ్మా, కుర్చీలో కూచో” అన్నాడు.

          దేవి ముఖాన నవ్వు పులుముకుంటూ “ఏమ్మా, ఎలా ఉంది ఒంట్లో” అంది.

          కృత్రిమమైన పలకరింపుకి చికాకు వచ్చి తన్మయి ముభావంగా తలాడించింది.

          “ఏవిటో వొదినా, ఎవరి కళ్ళు పడ్డాయో గానీ పండంటి కుటుంబం చెదిరిపోయింది.  మా మనవణ్ణి తరచూ చూసుకోవడానికి మాకు యోగం లేకుండా పోయింది” అంటూ ముక్కు చీదింది దేవి.

          జ్యోతి “వీళ్లెందుకు వచ్చేరన్నట్లు” తన్మయి వైపు ప్రశ్నార్థకంగా చూసింది.

          తన్మయి కూడా అలాగే చూసింది తల్లి వైపు.

          “ఎవరి కళ్ళోపడి పండంటి కుటుంబం చెదిరిపోయిందా? జరిగిన ఏ పరిణామమూ ఈవిడికి తెలీదూ? ఈవిడ కొడుకే కావాలని కుటుంబాన్ని కాలరాసుకున్నాడని తెలీదూ? 

          అయినా జరిగిన అన్నిటి వల్ల తనకూ, తన కొడుక్కీ కలిగిన నష్టం ముందు,అతనికీ, వీళ్ళకు కలిగిన బాధ ఏపాటిది?

          ఈవిడకి మనవణ్ణి చూసుకోలేక పోవడం ఒక్కటే బాధ. మరి తనకి? బాబుకి?” మనసు లో సుళ్ళు తిరుగుతున్నవేవీ బైటికి అనే ఓపిక లేక తన్మయి అక్కణ్ణించి లేవబోయింది.

          ఇంతలో ఆవిడ తమ్ముడు భానుమూర్తి నుద్దేశించి “మా అక్క బాధ చూళ్ళేక తీసుకు వచ్చేను. బావగారూ! మీ అమ్మాయి విలువ ఇప్పుడు తెలిసి వచ్చింది అందరికీ. మీ అమ్మాయిని కాదని శేఖర్ చేసుకున్నది కొరకంచె. ఎవ్వరినీ గుమ్మం ఎక్కనివ్వదు. అయినా ఆడు కూడా యాపారంలో నష్టవొచ్చి బాగా చితికి పోయేడు. పైగా ఇద్దరు ఆడ పిల్లలు. మీరే ఏదోలాగా మీ అమ్మాయికి నచ్చ చెప్పి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి” అన్నాడు నీళ్ళు నములుతూ.

          భానుమూర్తి ఏదో అనేలోగా దేవి మళ్ళీ ముక్కు చీదుతూ, “అన్నయ్యా! నీకు తోడబుట్టక పోయినా, ఎంత కాదనుకున్నా నేను మీ చెల్లెలిని. మా మనవడు మాకు దూరం అయ్యి పోయేడని అందరం దిగుళ్ళు పెట్టుకున్నాం. ఇవన్నీ కాదు గానీ, నువ్వే చెప్పు. నా కొడుకు మళ్ళీ మీ అమ్మాయిని ఏలుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏవంటారు?” అంది. 

          తన్మయికి కుట్లన్నీ ఒక్కసారి పీకేసినంత ఆవేశం కలిగింది. ఆ చెంపా ఈ చెంపా వాయించి, మెడబట్టి వాళ్ళని బయటకు తోయాలన్నంత కోపం వచ్చింది. 

          భానుమూర్తి దిగులుగా వింటున్నాడు. 

          తండ్రి ముఖంలో బాధని చూడలేక దిగ్గున అక్కణ్ణించి లేచింది తన్మయి. కానీ అడుగు ముందుకు పడని హఠాత్తు నొప్పితో అక్కడే కూచుండిపోయింది.

          జ్యోతి కూతురి అవస్థని వెంటనే పసిగట్టి, “మీకు దణ్ణం పెడతాను. ఆపరేషను అయ్యి పచ్చి పుండులా ఉన్న పిల్లని ఇంకా వేధించకండి, నువ్వు రామ్మా” అని చెయ్యి సాయం అందించింది. 

          గదిలో అడుగుపెట్టగానే తల్లి భుజమ్మీద దు:ఖ భారమంతా తీర్చుకుంది తన్మయి.

          “ఏడవకమ్మా! ధైర్యంగా ఉండు. ఇవేళ నువ్వు చక్కగా జాబులో సెటిలయ్యేవు కాబట్టి ఇప్పుడు నువ్వు కావాల్సి వచ్చేవు. సిగ్గులేని బతుకులు. ఆ ఎదవకి ఇప్పుడు సంపాయిం చి పెట్టే పెళ్ళాం కావల్సి వచ్చింది కాబట్టి వీళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేరు” అంది గట్టిగా వాళ్ళకి వినబడేటట్టు.

          ఇంతలో మసీదులో నుంచి ప్రార్థన వినవచ్చింది.

          “వాళ్ళకి నా మాటలు వినిపించాయో, లేదో తెలీదు. నేను చూసొస్తాను. నువ్వు పడుకో. ఇక బయటికి రాకు. నాన్నగారు, నేను మాట్లాడుతాం” అని బయటికి నడిచింది జ్యోతి.

          తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో వినే ఆసక్తి కూడా లేదు తన్మయికి. బాధతో కళ్ళు మూసుకుంది. 

          బయటెక్కడో ఆడుకుంటున్న బాబు తల్లి దగ్గిరికి పరుగెత్తుకొచ్చి పక్కన చేరేడు.

          తన్మయి వాణ్ణి దగ్గిరికి తీసుకుని దు:ఖ భారంతో ముద్దులు కురిపించింది.

          ఏదో అర్థమైన వాడిలా తల్లి కన్నీరు తుడుస్తూ “అమ్మా! నాన్నమ్మ నాకు చాక్లెట్టు తెచ్చింది. వద్దని చెప్పేను” అన్నాడు.

          వాణ్ణి గుండెలకు హత్తుకుంది తన్మయి.

***

          ఆ రాత్రి తన్మయికి నిద్రపట్టలేదు.

          మనసంతా సుళ్ళు తిరుగుతున్న బాధ, తీరని కోపం వల్లనో ఏమో శరీరం తన మీద ప్రతాపం చూపిస్తున్నట్లు కుట్లు నొప్పి.

          శేఖర్ చేసిన తప్పిదాలన్నీ మరిచి పోయి, కాదు కాదు క్షమించి, అతనితో ఏం జరగనట్టు జీవితం మొదలు పెట్టడం అసలు జరిగే పనేనా?

          అతను తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ వచ్చేడు. వ్యసనాల్లో కూరుకుపోయి అగ్ని సాక్షిగా చేసిన అన్ని ప్రమాణాలూ చెరిపివేసేడు. తనతో ఉండగానే మరో అమ్మాయి ని చెప్పా పెట్టకుండా పెళ్ళి చేసుకుని తనని వదిలించుకోవడానికి పెద్ద డ్రామా చేసేడు. పుస్తెలు కూడా వదలకుండా తనని దోపిడీ చేసేడు. ఇప్పుడు తనను “మళ్ళీ ఏలుకునే” నెపంతో “మళ్ళీ దోపిడీ” మొదలు పెడతాడన్నమాట. 

          పిల్లాడి నెపం ఒకటి మధ్యలో. తల పగిలిపోసాగింది తన్మయికి. 

          పొద్దున్న వాళ్ళు మాట్లాడేది తండ్రి అంత శాంతంగా ఎందుకు విన్నాడో అర్థం కాలేదు.

          అసలు తనకూ ఒక మనసుంటుందని ఎవరికీ అర్థం కాదా? అర్థమయినా దానికి విలువ లేదా? 

          ఎవరికి విలువ లేకపోయినా తనకి ఉంది. తనంటే తనకి తెలుసు. తనకే బాగా తెలుసు. 

          తనిప్పుడు ఎవ్వరి మీదా ఆధారపడిన వ్యక్తి కాదు. తన జీవితానికి ఏం కావాలో తను నిర్ణయించుకో గలిగిన సాధికార మహిళ.

          ఇటు వంటి ఎన్నో డిస్ట్రబెన్సెస్ జీవితంలో ఎన్నో కలుగుతాయి. వీటి నుంచి ఎంత త్వరగా తను బయటికి రాగలిగితే అంత మంచిది తనకి.

          కన్నీళ్ళు తుడుచుకుని, మొహం కడుక్కుని బయటికి వచ్చి వెన్నెట్లో అరుగు మీద జేరబడి కూచుంది. 

          తన మానాన తను హాయిగా ఉన్న జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మురికి కూపంలోకి నెట్టుకోకూడదు. అసలా ఆలోచనే వద్దు. 

          ఇప్పుడు ఆలోచించవలిసినది తనీ శారీరక కష్టం నుంచి ఎంత త్వరగా కోలుకో గలదా అన్నది మాత్రమే.

          తల్లిదండ్రులు తన దగ్గిర ఉన్నారు కాబట్టి బాబు గురించి, ఇంటి పని గురించి ఇప్పట్లో బెంగ లేదు.

          కానీ ఇలా ఇంట్లోనే కూచోవడం వల్ల మనశ్శాంతి ఉండడం లేదు. 

          తల్లిని ఒప్పించి మరో వారంలో మెల్లగా కాలేజీకి వెళ్ళిపోవాలి. 

          కాకపోతే కొన్నాళ్ళ పాటు క్లాసులు నిలబడి చెప్పడం కష్టం అవుతుందేమో. బహుశా: కూచుని పాఠాలు చెప్పాలి. 

          ధైర్యంగా ఉండాలి. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి.

          ఆకాశం కేసి చూస్తూ తనకి మాత్రమే వినబడేటట్టు  “అజ్ఞాత మిత్రమా! ఈ కష్టాల్ని ఎదుర్కోవడానికి తగిన ధైర్యాన్ని ఇవ్వవూ” అంది.  

***

          మర్నాడు ఆదివారం ఉదయానే గేటు తీసుకుని వస్తున్న ప్రభుని చూసి ఆశ్చర్య పోయింది తన్మయి.

          “అదేవిటి?  రావొద్దని సిద్దార్థతో ఫోను చేయించింది కదా?” 

          వస్తూనే చేతిలో ద్రాక్షపళ్ళు, అరటి పళ్ళు జ్యోతికి ఇస్తూ నమస్కరించేడు.

          ప్రభుని గుర్తు పట్టినట్టు “ఆ… మీ అమ్మగారూ, నాన్న గారూ బావున్నారామ్మా?ఎప్పుడో మీరు చదువుకునే రోజుల్లో చూసేను. మీరు మా వీథికవతల పేటలో అద్దెకుండేవారు కదా” అంది.

          భానుమూర్తి ప్రతి నమస్కారం కూడా చెయ్యకుండా తలూపేడు.

          వాకిట్లో కూచున్న ప్రభుని చూస్తూ ఒక పక్క మనసు అంతులేని సంతోషంతో గంతు లు వేస్తున్నా మరొక పక్క తల్లీ తండ్రీ ఏమంటారో అన్న భయం కలగసాగింది తన్మయికి.

          బాబు పరిచయంగా వచ్చి ప్రభు ఒళ్ళో కూచోవడం వాళ్ళు గమనించడాన్ని తన్మయి పసిగట్టింది.

          మెల్లిగా బయటకు వచ్చిన తన్మయిని చూస్తూనే “ఎలా ఉంది ఆరోగ్యం?” అన్నాడు ప్రేమ ధ్వనిస్తున్న గొంతుతో.

          తన్మయి నిశ్శబ్దంగా తలూపింది.

          నిజానికి అతన్ని అల్లుకుని దు:ఖపడాలని ఉంది. 

          రాత్రంతా తనకి తను ధైర్యం చెప్పుకున్నా ప్రభుని చూడగానే ఒక రకమైన బేల తనం ఆవరించింది.

          “నేస్తం! నన్నీ ప్రపంచంలోని అన్ని కష్టాల నుంచి త్వరగా గట్టెక్కించు” అని హత్తు కోవాలని ఉంది.

          తన్మయి మనసు పసిగట్టినట్లు దిగులుగా చూసేడు ప్రభు.

          అక్కడ ఇక ఉండ లేక లోపలికి వచ్చేసింది తన్మయి.

          తల్లి వంటింట్లో టీ పట్టసాగింది. అక్కడే గోడకి ఆనుకుని నిలబడ్డ తన్మయి వెనకే తండ్రి విసవిసా వచ్చేడు.

          ఒక్కసారిగా తన్మయి గొంతు పట్టుకుని  రౌద్రమైన ముఖంతో “ఎవరితను? తరచుగా ఎందుకొస్తున్నాడు?” అన్నాడు.

          హఠాత్తుగా జరిగిన పరిణామానికి తన్మయి ఆశ్చర్యపోయింది.

          జ్యోతి వెంటనే ఒక్క అరుపు అరిచింది, “ఉండండి, పిల్లని చంపుతారా ఏంటి? అతణ్ణే అడుగుదాం” 

          భానుమూర్తి వెంటనే తేరుకున్నట్టు పట్టు వదిలేసినా అప్పటికే గోళ్ళు  గుచ్చుకు న్నాయి గొంతు మీద.

          తన్మయి కళ్ళల్లో జల జలా నీళ్ళు తిరిగేయి.

          చిన్నతనం నుంచి అల్లారు ముద్దుగా పెంచిన తండ్రేనా ఇతను?

          మొదటిసారిగా తండ్రి మీద అసహ్యం వేసింది.  ఎర్రబడ్డ కళ్ళతో తండ్రి వైపు తీక్షణంగా చూసింది.

          “ఏమ్మా, మమ్మల్ని ఇలా కూడా బతకనియ్యవా” అంటూ తల్లి కూడా  ఉన్నట్టుండి తండ్రికి వంత పాడడం మొదలుపెట్టింది. 

          మాటలు బయటకు వినబడకూడదన్నట్లు తలుపు మూసి వాకిట్లో కూచున్న ప్రభు దగ్గిరికి వచ్చింది.  

          ప్రభు అప్పటికే అంతా విన్నట్టు  లేచి నిలబడ్డాడు. దగ్గిరికి వచ్చి తల పంకిస్తూ, “మా వాళ్ళు అర్జంటుగా రమ్మంటే ఊరు వెళ్తున్నాను. నీకు చెప్పి వెళదామని వచ్చేను. నిన్ను అనవసరంగా బాధ పెడితే క్షమించు. మళ్ళీ వస్తాను” అని గేటు తీసుకుని వెళ్ళి పోయేడు.

          అతను వెళ్ళిన వైపే నిర్వికారంగా చూస్తూ అరుగు మీద కూలబడింది.

          తండ్రి తన గొంతు పట్టుకోవడం వెనక కారణం ఏదైనా, ఇక ఆయన ఎప్పటికీ తన జీవితంలో ఇంతకు ముందు తండ్రి కాలేడు. ఎప్పటికీ కాలేడు.

***

          తల్లి ప్రభు గురించి ఆ తర్వాత ఏం మాట్లాడినా తన్మయి మౌనం వహించింది. 

          ప్రభు తమతో మాట్లాడకుండా వెళ్ళిపోవడాన్ని ఇద్దరూ సహించలేకపోయేరు. 

          “చూసేవుగా, నాన్నగారు అతన్ని విషయం ఏవిటని అడిగే లోపలే పలాయనం చిత్తగించేడు”

          “అయినా అతన్నని ఏం పాపంలే. నీ అలుసు లేకుండా అతనెందుకొస్తాడు?”

          “అయినా, ఇదేం ఖర్మమో. బతికున్నంత కాలం నీ గురించి ఏడవాల్సి వస్తూంది” 

          “హవ్వ, పేటలో కుర్రాడు ఇలా మన పిల్ల చుట్టూ తిరుగుతున్నాడని ఎవరికైనా తెలిస్తే ఇంకేవైనా ఉందా?”

          తల్లి మాట్లాడీ మాట్లాడీ  ఊరుకుంది.

          తండ్రితో తన్మయి వాళ్ళు వెళ్ళే రోజు వరకూ మాట్లాడలేదు. 

          వాళ్ళున్నంత సేపూ తన్మయికి తన స్వంత ఇంటిలో తనే జైలులో ఉన్నట్లు అనిపించసాగింది.

          వాళ్ళు తన తల్లిదండ్రులైనా ఇంకా తనని దండించే వయసున్న చిన్న పిల్లగా చూడడం తన్మయి సహించలేకపోతూంది.

          అయినా ఎదురు చెప్పకుండా మౌనం వహించింది.

          తనని వదిలిపెట్టేసి శేఖర్ హాయిగా బతుకుతున్నాడు. తను జీవితాన్ని చక్కదిద్దు కోవడంలో తప్పేవుంది? ప్రభు తన కోసం రావడాన్ని వీళ్ళు ఎందుకు తప్పు పడుతు న్నారు?

          తనకి పెళ్ళికాక ముందు ఆ పల్లెటూళ్ళో తనని అదుపాజ్ఞలలో భయభక్తులతో  పెంచేరు. ఇప్పటికీ వీళ్ళ అదుపులోనే ఉండాలను కుంటున్నారా? లేదా అసలు తను మళ్ళీ తన జీవితం చక్క దిద్దుకోవడం ఇష్టం లేదా? లేదా తను మళ్ళీ తప్పటడుగు వేస్తుందేమోనని భయపడుతున్నారా? తను జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండి పోవాలనా వీళ్ళ ఉద్దేశ్యం? లేదా శేఖర్ తో మళ్ళీ తను కలవాలని అనుకుంటున్నారా? లేదా వాళ్ళే సరైనవాడిని చూసి చెయ్యాలనుకుంటున్నారా? అదే నిజమైతే, ఇప్పటి  వరకూ ఒక్క సంబంధం కూడా ఎందుకు చూడలేకపోయేరు? ప్రభు కుటుంబం, అతని సామాజిక వర్గం, ఇతర పరిస్థితులు అంగీకరించడం ఇష్టం లేదా?

          అంతు చిక్కని ప్రశ్నలు తనలో తనే వేసుకుంటూ జవాబులు తెలుసుకోలేక అవస్థ పడసాగింది తన్మయి.

***

          ఆపరేషను తర్వాత కాలేజీలోకి అడుగుపెట్టిన మొదటిరోజు  ప్రిన్సిపాల్ గారితో సహా అందరూ ఆప్యాయంగా పలకరించేరు. 

          కాసేపట్లోనే  తాయిబా ఉత్తరం పట్టుకు వచ్చి ఇచ్చింది. ప్రభు ఉత్తరం చూడగానే సంతోషం పెల్లుబుకింది తన్మయికి .

          ఆత్రంగా విప్పింది.

“ప్రియమైన తనూ!

నీకు ఆరోగ్యం ఇంకా కుదురుపడకుండా నేను నీ  నుంచి దూరంగా వెళ్ళాల్సి వచ్చినం దుకు ఎంత బాధగా ఉందో చెప్పలేను. ఈ వారం మళ్ళీ మా ఇంటికి అర్జంటుగా రావాల్సి ఉండి వచ్చాను. మీ వాళ్ళు నీ దగ్గిరే ఉన్నందుకు ఒక పక్క కొంత నిశ్చింతగా ఉన్నా, నువ్వెలా ఉన్నావో అనే చింత వెంటాడుతూనే ఉంది. 

          ఇక మా ఇంటికి వచ్చిన విషయం ఏవిటో ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీకు చెప్పి నిన్ను బాధించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ, నీతో తప్ప నేను ఏ విషయమైనా ఎవరితో పంచుకుంటాను?

          మా వాళ్ళు నా కోసం చెప్పాపెట్టకుండా సంబంధం మాట్లాడి, రేపు నిశ్చితార్థం అని ఫోను చేసేరు. ఇక మన సంగతి స్వయంగా వచ్చి చెప్పడం కంటే వేరే మార్గం  కనబడ లేదు. తీరా వచ్చేనే కానీ ధైర్యం చాలడం లేదు. ఒక పక్క మీ వాళ్ళకూ ఇష్టం లేదని అర్ధమయ్యి పోయింది. ఇక వీళ్ళకు చెప్పినా ససేమిరా ఒప్పుకోరు. అందుకే ఇక ఒక నిర్ణయానికి వచ్చేను……..” ఇక చదవలేక ఆగిపోయింది తన్మయి.  

          వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుళ్ళ మధ్య, ముఖమంతా చెమటలతో, వణుకు తున్న చేతులతో టేబుల్ మీదే వాలిపోయింది. గుండెని పిండేస్తున్న దు:ఖం. కళ్ళు  తిరుగుతున్నట్టు స్పష్టంగా తెలియసాగింది తన్మయికి.

          గుమ్మం దగ్గిరే ఉన్న తాయిబా “అయ్యో మేడం… మేడం” అంటూ చప్పున లోపలికి పరుగెత్తుకు వచ్చింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.