వెనుతిరగని వెన్నెల(భాగం-55)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ:అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళిలో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీలో ఎమ్మే పాసయ్యి, పీ.హెచ్.డీలో జాయినవుతుంది. శేఖర్ తో ఎన్నో రోజులు పోరాడి, చివరికి తన్మయి విడిపోతుంది. హైదరాబాదుకు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితుడు ప్రభు అనుకోకుండా మళ్ళీ ఎదురయ్యి, పెళ్ళి ప్రపోజల్ తీసుకు వస్తాడు.

***

          పెళ్ళి చేసుకుందామని ప్రభు దృఢంగా  చెప్పినప్పటి నుంచి “ఇదంతా మంచి దౌనా, కాదా” అన్న మీమాంస రోజురోజుకీ పెరగసాగింది తన్మయికి.

          పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న బాబు ముఖం కేసి చూసింది. ఈ పెళ్ళి వల్ల తనొక్కతే కాదు, వీడి భవిష్యత్తు కూడా సుఖవంతం కావాలి. అది సాధ్యమేనా?

          ఆలోచనలతో బుర్ర పగిలిపోతూంది. సిద్దార్థ అన్నట్లు “కొన్ని విషయాలలో స్వంతంగా నిర్ణయం తీసుకోలేనప్పుడు మరెవరినన్నా విశ్వసించాలి. ప్రభు పట్ల నమ్మకంతో ముందుకు అడుగెయ్యడమే మంచిది.” ఇక మరిన్ని ఆలోచనలు వృథా. 

          “పెళ్ళి ఏ రోజు చేసుకోవాలో ముహూర్తం ఎవరు పెడతారు మనకి? ” అన్నాడు సాలోచనగా ప్రభు ఆ రోజు ఆఫీసు నించి వస్తూనే.

          “మనమే” అంది చిన్నగా నవ్వి తన్మయి.

          “మనకి ఏ రోజు రిజిస్టరు ఆఫీసులో అప్పాయింటుమెంటు దొరుకుతుందో అదే మంచి ముహూర్తం” అంది మళ్ళీ.

          “వీలైనంత సింపుల్ గా చేసుకుందాం. ఆర్భాటాలు చెయ్యడం నాకు ఇష్టం లేదు” అన్నాడు.

          “అలాగే” అంటూ నీరసంగా తలూపింది.

          “ఏమయ్యిందిరా, పోనీ నీకు నచ్చిన వాళ్ళనందరినీ పిలువు” అన్నాడు గోముగా కళ్ళలోకి చూస్తూ.   

          వద్దన్నట్టు మిన్నకుండిపోయింది. 

          మనసులో ఒక రకమైన భయాందోళనేదో సుళ్ళు తిరుగుతూంది. ఇదంతా సక్రమంగా జరుగుతుందో, లేదో ఎవరైనా అడ్డుపడతారేమోనన్న భయం ఒక వైపు, ఎవరికీ తెలియకుండా చేసుకుంటూన్న ఈ పెళ్ళి సక్సెస్ అవుతుందో, లేదో అన్న టెన్షన్ మరోవైపు.

          “ఏమయ్యిందిరా” అన్నాడు మళ్ళీ. 

          అత్యంత ప్రేమపూరితమైన ఆ పిలుపుకి మనస్సులోని బాధావేదనలన్నీ తొలిగి పోయినట్లు అతని భుజాల మీద తల వాల్చి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.

          “ఈ నిశ్చింత చాలు తన జీవితానికి” అనిపించింది “ప్రభూ! నన్నెప్పుడూ వదిలి వెళ్ళవుగా” అంది.

          “ఎప్పుడూ వెళ్ళను” అన్నాడు గద్గదంగా తల నిమురుతూ.

          “రేపు సెలవు పెట్టి పెళ్ళికి కావల్సినవన్నీ కొనుక్కుందామా” అంది. 

          “సరే, ముందు కాస్త చల్లని నీళ్ళతో ముఖం కడుక్కో కాఫీ కలుపుతాను” అన్నాడు.

          తన్మయి సంతోషంగా లేచింది.

***

          మనసంతా నిండిన హుషారుతో తెల్లారగట్లే మెలకువ వచ్చింది తన్మయికి.

          తనకెంతో ఇష్టమైన చలికాలపు రోజులవి. 

          దుప్పటీ కప్పుకునే వాకిట్లోకి వచ్చింది.

          ముందురోజు వేసిన ముగ్గు ఇంకా అందంగా అలానే ఉంది.

          విరబూసిన బంతి పూలు, గన్నేరు పూలు ఉదయపు ఆహ్లాదానికి తలలూపు తున్నాయి.

          ఆకాశం కేసి చూస్తూ “అజ్ఞాత మిత్రమా! నా జీవితం అందమైన మలుపు తిరగ బోతూంది. నువ్వు నాతో తోడుండి అన్నీ సక్రమంగా జరిగేటట్లు చెయ్యవూ?” అని దీర్ఘంగా ఊపిరి పీల్చింది.

          తనకు, ప్రభుకు పెళ్ళి. తమ అపురూపమైన పెళ్ళికి మేఘాలే పందిళ్ళు, పక్షుల కిలకిలారావాలే మంగళ వాయిద్యాలు, ఆశీస్సులందజేస్తున్నట్లు తలలూపుతున్న వృక్షాలే బంధువులు.  

          ఈ పెళ్ళికి అయినదానికీ కాని దానికీ అలిగే మగపెళ్ళి వారు లేరు,  అసంతృప్తితో విసుక్కునే ఆడపెళ్ళి వారు లేరు. అటూ ఇటూ ఏ గందరగోళమూ లేదు. అందమైన నిశ్శబ్దపు, అచ్చమైన రహస్యపు పెళ్ళి. 

చిన్నప్పుడు కథల్లో విన్న “గాంధర్వ వివాహం” అంటే ఇలాగే ఉండేదా? ఏమో. ఇలా ఏ తంతూ లేకుండా మనసుకి ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తూంది. 

          ఒకర్నొకరు ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించేందుకు అసలింత కంటే ఏం కావాలి?  

          “పొద్దున్నే మెలకువ వచ్చేసిందా?” చిన్నగా నవ్వేడు అప్పుడే లేచిన ప్రభు లోపలికి వస్తున్న తన్మయిని చూస్తూ.

          తన్మయి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి “థాంక్యూ” అంది.

          “దేనికి?” అన్నాడు.

          “అన్నిటికీ” అంటూ  బాబుని నిద్రలేపి స్కూలుకి తయారుచేయసాగింది. 

          షాపింగుకు బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని సాయంత్రం లేటైతే బాబుని చూడమని తాయిబాకు చెప్పి వచ్చింది. 

          తన్మయి తనకు ఇష్టమైన గంధం రంగు పట్టు చీర కొనుక్కుంది. 

          ప్రభు తనకు నచ్చిన బట్టలు, బూట్లు సెలక్టు చేసుకున్నాడు.

          “ఆఫీసుకి వేసుకునే బట్టలు కదా ఇవి” అంది తన్మయి.

          “అవును పొద్దున్న పది గంటలకి కదా మన పెళ్ళి, అట్నించటే నేను మళ్ళీ ఆఫీసు కి వెళ్ళి పోవాలి” అన్నాడు.  

          తన్మయి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. “ఎంత రిజిస్టరు పెళ్ళయినా ఇంత ప్రాక్టికల్ గా ఉండాల్సిందేనా?” అదే అంది. 

          “నీకు తెలీనిదే వుంది, నాకు ఆర్భాటాలు నచ్చవని. అది సరే, ఆఫీసులో బోల్డు పని పెండింగులో ఉంది. ఇక్కడ ఎంత తొందరగా తెమిలితే అంత మంచిది” అన్నాడు చిన్నగా నవ్వుతూ. 

          “మరి ఈ రోజంతా సెలవు…” అని తన్మయి అనబోతూండగా “నువ్వేదో బాధ పడ్తున్నావని సరేనన్నాను నిన్న” అన్నాడు.  

          మరో గంటలో “పూల దండలు ఆర్డరు ఇవ్వడం కూడా అయిపోయింది కదా, ఇక నిన్ను బస్సెక్కించి నేను ఆఫీసుకి వెళ్తాను మరి” అన్నాడు. 

          తన్మయి “మంగళ సూత్రాలు, మెట్టెలు కొనాలి కదా” అంది.

          ప్రతిగా చిన్న నవ్వు నవ్వి “నీకు నచ్చితే నువ్వు కొనుక్కో” అని పర్సులోంచి “ఇదుగో క్రెడిట్ కార్డు అని కొత్తగా వచ్చింది. ఇది పెద్ద షాపుల్లోనే ఏక్సెప్టు చేస్తున్నారు. నిన్నక్కడ దించి నేను వెళ్తాను పద” అన్నాడు.

          షాపులోకెళ్ళి తనకు నచ్చిన పెద్ద మంగళ సూత్రాలు, చుట్లు, పిల్లేళ్లు  వెరైటీలు చూస్తూందే కానీ ప్రభు కూడా తనతో ఉంటే బావుణ్ణని అనిపించసాగింది.  

          “పెళ్ళి” జీవితంలో అతి ముఖ్యమైన సంఘటన. అది ఇతనికి ఎందుకు ఇంత మామూలుగా అనిపిస్తూంది?   

          తప్పు తన ఆలోచనల్లో ఉందా? లేదా అతని పద్ధతిలో ఉందా? 

          ఏదేమైనా పెళ్ళి పేరుతో తన జీవితంలో ఇంత వరకూ జరిగిన అనేక బాధాకరమైన సంఘటనల కంటే ఇది నయమే.

          ఇక్కడ తనకి నచ్చినదేదైనా చేసే జీవితం ఉంది ఇప్పుడు. “తనకు నచ్చనిదేదీ చెయ్యక్కరలేదు.” ఆ ఆలోచనే ఎంతో ఆనందంగా ఉంది.

          రెడీమేడ్ లో చూసిన మెట్టెలు నచ్చక పక్కనే సందులో ఉన్న చిన్న దుకాణాల దగ్గిర నడవసాగింది. 

          జీవితాంతం తన కూడా నడవవల్సిన వాడు తనతో ఈ కాస్సేపు ఉండలేనట్లు వెళ్ళి పోయేడు “ప్చ్”  అని నిట్టూర్చింది.

          అంతలోనే “జీవితాంతం” అన్నది తల్చుకుని తనలో తనే నవ్వుకుంది.

          అసలు ఆ పదానికి అర్థం ఉందా? 

          యౌవనంలోకి అడుగుపెడ్తూనే ఎన్ని కలలు కంది తను!

          శేఖర్ తనతో జీవితాంతం ఉంటాడని, అతనితో తనున్న ఇల్లు, జీవితం శాశ్వతం అనీ అనుకుంది. కానీ అవన్నీ కలలుగా మాత్రమే మిగిలిపోయాయి. 

          “ఇంతకంటే బరువైన మెట్టెలు కావాలంటే చేసి ఇస్తాం. కానీ వారం పడుతుంది” అంటున్నాడు షాపతను.  

          ఈ లోకంలోకి వచ్చింది. “ఊహూ, అంత సమయం లేదు” అని ముందుకు నడిచింది.

          తమ అమ్మమ్మ కాళ్ళకి పెద్ద మెట్టెలు, కడియాలు ఉండేవి. తనకెందుకో అలాంటి మెట్టెలంటే భలే ఇష్టం.   

          శేఖర్తో పెళ్ళిలో చీరలు, నగల మాట దేవుడెరుగు కనీసం పూల జడతో సహా ఏదీ తనకి నచ్చినదేదీ జరగలేదు.   

          అన్నీ నిన్నో మొన్నో జరిగినట్టు గుండె గాయాలై బాధతో సలుపుతూ ఉన్నాయి.

          పెళ్ళి మాటల్లో కట్నాల బేరాలు, పెళ్ళిలో ఆడపడుచు లాంఛనాల అలకలు, భోజనాల గొడవలు, పెళ్ళికాగానే సారె గోల, అడుగడుగునా శేఖర్, అతని తల్లిదండ్రుల అసంతృప్తి వేధింపులు, తన తల్లిదండ్రుల దు:ఖం, ఈసడింపు మాటలు… అది పెళ్ళి  కాదు. ఇరు కుటుంబాల మధ్య యుద్ధమది.   

          ఎవరి గోలా, గొడవా లేకుండా ఇలా చెప్పాపెట్టకుండా పెళ్ళి చేసుకోవడం ఎంత ఉత్తమమో అనిపించసాగింది. 

          తనకు నచ్చినవన్నీ కొనుక్కుని బస్సెక్కింది తన్మయి. 

          బంగారు రంగు అంచు ఉన్న తెల్లని సిల్క్ చీర అందులో ఒకటి.

          ఇంటికి వెళ్ళగానే కవరు లోంచి పైకి తీసి  మురిపెంగా చూసుకుంది. భుజమ్మీద వల్లెవాటుగా వేసుకుని అద్దంలో చూసుకుంది.    

          శరీరం ఒకప్పటి కన్నా బాగా చిక్కిపోయినా, అన్ని విధాలా నచ్చిన పెళ్ళికి ఆయత్త మైన ముఖం ముగ్ధ మనోహరంగా కొత్త అందాన్ని సంతరించుకుంది. 

          బట్టలు దగ్గర్లోని టైలర్కి ఇచ్చి, పొద్దున్న మర్చిపోయిన బంగారు రంగు మట్టి గాజు లు రెండు డజన్లు కొనుక్కుని మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కూడా ప్రభు రాకపోయేసరికి రోడ్డు చివరి వరకూ వెళ్ళి ఆత్రంగా ఆఫీసుకి ఫోను చేసింది.

          అవతలి నుంచి ప్రభు గొంతు విన్నాక కానీ స్థిమితం కలగలేదు. 

          “ఇంట్లో ఫోను పెట్టించుకోవాలిక, లాభం లేదు మర్నాడే వెళ్ళి టెలీఫోను ఎక్సేంజీలో అప్లికేషను పెట్టాలి. అసలే ఆరునెలలయినా పడుతుంది ఫోను రావడానికి” తనలో తను అనుకుని నిట్టూర్చింది. 

          రాత్రికి ఇంటికి వస్తూనే అన్యమనస్కంగా కనిపించేడు ప్రభు. 

          భోజనం చేసి పడుకోవడానికి తన చాపా, దుప్పటీ సర్దుకుంటున్న ప్రభుతో “అలా కాస్సేపు డాబా మీదికి వెళ్ళోద్దామా” అంది.

          వెన్నెల రోజులు కావడంతో దేదీప్యమానంగా వెన్నెల కాస్తూంది. 

          సంతోషంగా  “మన పెళ్ళి పౌర్ణమి నాడు వస్తూంది తెలుసా?” అంది ప్రభు చేతిని పట్టుకుని. 

          “అవునా?” అని “మా అమ్మానాన్నలు నన్ను కన్నవాళ్ళు కాదు, పెంచారు”అన్నాడు బొత్తిగా సంబంధం లేకుండా హఠాత్తుగా.

          తన్మయి ఆశ్చర్యంగా చూసింది. “ఇన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడెందుకు చెప్తున్నట్టు?”

          “మా అసలు అమ్మ, నన్ను పెంచిన అమ్మకి చెల్లెలు వరస అవుతుంది. ఆ విషయం నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాలేకే నన్ను పెంచు కోవడానికి ఇచ్చేరు. ఒక విధంగా ఇప్పుడు వాళ్ళకి నేనే ఆధారం. మన పెళ్ళి వల్ల నన్ను పెంచిన అమ్మా, నాన్నా ఎలాగూ దూరం అవుతారు. అందుకు నాకు పెద్దగా బాధ లేదు, వాళ్ళకి నా మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ నేనే ఆధారం అయిన నన్ను కన్న వాళ్ళ సంగతి ఏవిటి? నేను డబ్బులు పంపిస్తే గానీ గడవని పరిస్థితి వాళ్ళది” అన్నాడు దీర్ఘంగా నిట్టూర్చి. 

          “ఊ…ఎప్పటిలానే డబ్బులు పంపిస్తే తీసుకోరంటావా?” సాలోచనగా అంది తన్మయి.  

          “ఏమో తనూ, డబ్బుల కంటే వాళ్ళ మాట వినలేదనే పంతం ఎక్కువ కావచ్చు. నన్ను కుటుంబం నుంచి వెలివెయ్యొచ్చు. నన్ను కన్న ఋణం తీర్చుకునే అవకాశం నాకు లేకుండా పోతుందనే బాధగా ఉంది. పైగా నా మీద కోపంతో వాళ్ళూ కష్టాల పాలవు తారని దిగులుగా ఉంది” అన్నాడు. 

          “నువ్వు చాలా మంచి వాడివి ప్రభూ! నిన్ను వాళ్ళు ఎప్పటికీ దూరం చేసుకోరు” బాధపడకు అనునయంగా అంది తన్మయి.

          “ఏమో తనూ! మన పెళ్ళయ్యేక వాళ్ళకి ఎలా చెప్పాలో ఆలోచించాలి” అన్నాడు ఇంకా ఆలోచిస్తూ. 

          తన్మయి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని “నన్ను దేనికీ దిగులు పడొద్దని నువ్వు ఇలా బెంబేలు పడితే ఎలా?” అని “అన్నట్టు నీకు చెల్లెలు ఉంది కదా తనకేమైనా కొందామా” అంది.

          “ఒక అక్కా, అన్నయ్యా కూడా ఉన్నారు. అవునూ, ఏవిటీ వాళ్ళకు ఏమైనా కొనడ మంటే ఆడపడుచు లాంఛనాలా?” అని చిన్నగా నవ్వి “ఈ కట్నాలు, లాంఛనాలు, ఖర్చులతో కూడిన వివాహ వ్యవస్థంటేనే నాకు చాలా చికాకు” అంటూ లేచేడు.

          “మరి అన్నయ్యా, అక్కా ఉండి కూడా మీ వాళ్ళు ఎందుకు నీ మీద ఆధారపడి ఉన్నారు?” అంది.

          “వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, వాళ్ళ జీవితాలు గడవడమే అతి కష్టం, ఇక అమ్మా, నాన్నలనేం చూస్తారు?” అన్నాడు. 

          తన్మయికి ప్రభు ఎంతో ఉన్నతంగా కనిపించేడు. మంచి కొడుకు కాలేని వాడు, మంచి భర్త కూడా కాలేడన్నది తను బాగా నమ్ముతుంది.  

          అతను తన వాళ్ళని చూసుకోవాలనుకోవడం అతనికెంత బాధ్యతో తనకూ అంతే.

          అదే చెప్పింది.

          “నాకు తెలుసు తనూ!” గద్గదంగా అంటూ హత్తుకుని నుదుటి మీద ముద్దుపెట్టేడు.  

          తనెంతో అదృష్టవంతురాలు. అసలు ఇంత మంచి వ్యక్తి తనని కోరి, వలచిరావడం ఇంకా తనకి కలగా అనిపిస్తూంది.

          కిందికి వస్తూనే ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు నుదుటి మీద ముద్దు పెట్టి “మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి నాన్నా, ఇక మనకే భయం లేదు” అంది. 

***

          పెళ్ళి రోజు రానే వచ్చింది. తలారా స్నానం చేసి వదులుగా జడ వేసుకుంది. కళ్ళకు సన్నని కాటుక, నుదుటిని తిలకం బొట్టు దిద్దుకుంది. తలలో తనకి ఇష్టమైన జాజిపూలు తురుముకుంది. 

          గంధం రంగు పట్టుచీర, చేతికి బంగారు రంగు గాజులతో మెరిసిపోసాగింది తన్మయి.   

          “బాబుని నేను సూస్తాలే తియ్యి. ఎప్పుడూ సల్లగ ఉండుండ్రి” సంతోషంతో మెటికలు విరుస్తూ పెద్దదానిలా దీవించింది తాయిబా.  

          బండి మీద తన్మయి కూర్చోగానే బాబు గేటు దగ్గిరికి పరుగెత్తుకొచ్చి “టా టా” అన్నాడు. 

          వాడికి ఏం అర్థమయ్యిందో తెలీదు. సంతోషంగా చేతులూపేడు. 

          వీథి మలుపు తిరగగానే ప్రభు డ్రైవ్ చేస్తూనే తన భుజంమ్మీద ఉన్న తన్మయి చేతిని తీసి నడుము చుట్టూ మార్చుకున్నాడు.  

          బండి అద్దంలో నుంచి కనబడుతున్న అతని కళ్ళల్లోని చిలిపిదనాన్ని చూసి నవ్వింది.

          అనుకున్న సమయానికి రిజిస్ట్రార్ ఆఫీసుకి సిద్దార్థ భార్యతో బాటూ వచ్చాడు.

          సంతకాలు, దండలు మార్చుకోవడం, తాళి కట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

          తన్మయికి ఇదంతా నిజమో, కలో అన్నట్లు భ్రాంతి కలగసాగింది.

          వయసొచ్చిన వివాహానికి వేద మంత్రాలు అవసరం లేదని, మనసులు కలిస్తేనే అత్యంత ఆనందదాయకమైన, ఉన్నతమైన వివాహమనీ అర్థం అయ్యింది.  

          ప్రభు చిటికెన వేలు పట్టుకుని దిగిన రిజిస్ట్రాఫీసు మెట్ల దారే అపురూప సప్తపద య్యింది.

          చల్లగా వీస్తున్న గాలి వల్ల చుట్టూ ఆవరణలో ఉన్న చెట్ల చిన్న చిన్న పసుపురంగు టాకులు ఎగిరి వస్తూ ఆకాశం తమ పెళ్ళికి సన్నగా పూల వర్షం కురిపిస్తున్నట్లుఅనుభూతి కలిగింది తన్మయికి.

          బయటికి వస్తూనే దగ్గర్లో ఉన్న రెస్టారెంటు పేరు చెప్పి “భోజనాలు చేసెళ్దాం” అంది తన్మయి.

          ప్రభు కాదనకుండా ముందుకు దారి తీసేడు.

          తన్మయికి ఆ మాత్రానికే ఎంతో సంతోషం వేసింది.

          భోజనాలైన మరో గంటలో సిద్దార్థ, అతని భార్య మరోసారి మన:పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు.     

          తన్మయిని బస్సెక్కించి ఆఫీసుకి వెళ్ళిపోయేడు ప్రభు.

          దండల్ని తెచ్చుకున్న చేతిసంచీలో పెట్టి,  తను కూర్చున్న సీటు పక్కనే ఖాళీ సీట్లో పెట్టుకుంది. 

          మెడలో మెరుస్తూన్న తాళిబొట్టుతో, కాళ్ళకి మట్టెలతో కొత్త పెళ్ళికూతురన్న సంగతి చుట్టూ అందరికీ ఎక్కడ తెలుస్తుందోనని కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. 

          తెల్లారగట్ల నిద్ర లేవడం వల్ల బస్సెక్కుతూనే నిద్ర ముంచుకొచ్చినా ఊదయం నుంచీ జరిగినవన్నీ మళ్ళీ మళ్ళీ తల్చుకుంటూ కిటికీలోంచి బయటికి చూడసాగింది తన్మయి.   

          వీథి మొదట్లో ఉన్న దేవ గన్నేరు చెట్టు కింద రాలిన పూలు నాలుగు చేతిలోకి తీసుకుంటూ 

          “మిత్రమా! అన్నీ అనుకున్నట్లు జరగడానికి సహాయపడడమే కాకుండా నా కోసం నీ బహుమతిగా నాకిష్టమైన ఈ పుష్పాల్ని కూడా ఇక్కడుంచావన్నమాట. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను” తనలో తనే అనుకుంటూ పూలని అపురూపంగా ఇంటికి తెచ్చి చిన్న గిన్నెలో నీట్లో వేసింది.  .  

          పరుగెత్తుకు వచ్చిన బాబుని ముద్దులతో ముంచెత్తింది.

          తల్లి ఆనందానికి కారణం తెలియకపోయినా సంతోషంతో గంతులు వేసేడు.

          తాయిబా ఎదురొచ్చి దిష్టి తీసింది. 

          “ఎంత ముద్దుగ ఉన్నావు మేడం, ఇంద ఈ ఖీర్ తాగు” అంటూ సేమ్యా పాయసం కప్పు చేతికిచ్చింది.

          సంతోషంతో తాయిబాని కౌగిలించుకుంది తన్మయి.

          లోపలి నుంచి తాయిబా కోసం కొన్న చీర పట్టుకొచ్చి ఇస్తూ “వద్దనకు తాయిబా, నువ్వే నాకు అమ్మయినా, నాన్నయినా, తోబుట్టువయినా” అంది తన్మయి. 

          పెళ్ళి కబుర్లు ఇద్దరూ కులాసాగా చెప్పుకుంటూండగానే చీకటి పడసాగింది.

          “బాబుని నాల్నాళ్ళు మా ఇంటి కాడ పండబెట్టుకుంటానుముసిముసిగా నవ్వుతూ తీసుకెళ్ళింది తాయిబా.    

          ప్రభు వచ్చే సమయానికి తలారా స్నానం చేసి ఇష్టంగా కొనుక్కున్న బంగారు అంచు తెల్ల సిల్కుచీర కట్టుకుంది. తలలో దేవ గన్నేరు పువ్వొకటి పెట్టుకుంది.  

          అద్దంలో తనకు తనే దేవకన్యలా కనబడింది తన్మయికి.  

          “జీవితంలో కష్టసుఖాలన్నీ అవగతమయ్యేక చేసుకునే పెళ్ళే నిజమైన పెళ్ళేమో. శరీరమూ, మనస్సూ ఇప్పటికి పరిపక్వమయ్యాయి. ప్రభుతో తను పంచుకోబోయే మొదటి రాత్రి అత్యంత మరపురానిదిగా, అందంగా ఉంటుంది. తనకు నమ్మకముంది.”  

          శాండిల్ ఉడ్ అగరొత్తుల పరిమళం హాయిగా, ప్రశాంతంగా ఉంది. టేప్ రికార్డర్ లో నుంచి సన్నగా వినిపిస్తున్న హరి ప్రసాద్ చౌరాసియా వేణు నాదం వింటూ తన్మయంగా మంచంమ్మీద జేరబడి కళ్ళు మూసుకుంది తన్మయి.       

          కాస్సేపట్లో ప్రభు వస్తూనే కళ్లెగరేసి చిన్నగా నవ్వేడు. సిగ్గుగా కళ్ళుదించుకుంది

          స్నానం చేసి తన్మయి ఇచ్చిన తెల్లని లాల్చీ, పైజమా వేసుకున్న ప్రభుని చూడగానే గుండెల మీద వాలిపోవాలన్నంత తమకం కలిగింది తన్మయికి

          కానీ ప్రభు ఏదో దిగులుగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూంది

          “అలసటగా ఉందా?” అంది.    

          నిశ్శబ్దంగా భోజనం చేస్తున్న ప్రభు తల మీద చెయ్యి వేసి చూసింది ఒంట్లో బాలేదేమోనని

          భోజనం కాగానే కంప్యూటరు ముందుకెళ్ళి కూర్చుని ఆఫీసు పని చేసుకోసాగేడు.  

          ఈ మధ్యే కేబుల్ ద్వారా ఇంటర్నెట్టు వచ్చింది

          కేబుల్ టీవీ ఉన్నా తన్మయికి అదే పనిగా టీవీ ముందు కూర్చోవడం ఇష్టం ఉండదు.

          కానీ ఇంటర్నెట్టు వల్ల ఆఫీసు పని ఇంటికీ వచ్చిందిక.  

          పదకొండుగంటల వేళైనా కదిలిరాని అతని వైపు చూసి నిట్టూరుస్తూనాకు నిద్రొస్తూంది బాబూఅంది.     

          “పడుకో మరిచిన్నగా అన్నాడు.

          తను విన్నది నిజమేనా అన్నట్లు వింతగా చూసింది అతని వైపు.

          తన్మయి భావన అర్థమయ్యినవాడిలాక్షమించు, నాకు మనసేం బాలేదుఅన్నాడు.

          దగ్గిరికెళ్ళి అనునయంగాఇవేళ మన పెళ్ళయిన మొదటి రోజుఅంది తన వైపు తిప్పుకుంటూ.  

          దు:ఖం నిండిన అతని కళ్ళని చూసి చప్పున పక్కన కూచుంటూఏమైందిఅంది ఆదుర్దాగా.

          “సాయంత్రం ఇంటి నుంచి ఫోను చేసేరు. ఎంత ప్రయత్నించినా ఉదయం మనం పెళ్ళి చేసుకున్నామన్న సంగతి చెప్పడానికి ధైర్యం చాలలేదు. ఏదో అపరాధ భావన నన్ను చుట్టుముట్టేస్తూందిఅని తన్మయి ఒళ్ళో తల వాల్చి దు:పడసాగేడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.