యాత్రాగీతం

అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-18

-డా||కె.గీత

ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.*

***

ఇంగ్లాండ్ (చివరి రోజు ) – గ్రీన్ విచ్ రాయల్ అబ్జర్వేటరీ – పీకడెల్లీ సర్కసు

బ్రిటిషు మ్యూజియంనించి మేం గ్రీన్ విచ్ వెళ్ళడానికి రైలు ఎక్కాల్సి ఉంది. రెండు, మూడు సందులు తిరిగి దాదాపు అర కిలోమీటరు నడిచేక వచ్చింది అండర్ గ్రౌండ్ ట్యూబు స్టేషను. కానీ అదెక్కడానికి అక్కడ దాదాపు పది అంతస్తులు కిందికి లిఫ్ట్ దిగి వెళ్లాల్సి ఉంది. లిఫ్ట్ పైకి రావడానికి మరి పదిహేను నిముషాలు వేచి చూడాల్సి వచ్చింది. ఎస్కలేటర్లు ఉన్నా సిరి ఎక్కనని పేచీ పెట్టడంతో లిఫ్ట్ ఎక్కక తప్పలేదు.

ఈ ట్యూబు స్టేషన్లలో టిక్కెట్టు కొనుక్కోవడానికి వేరేగా ప్రత్యేక కౌంటరు దగ్గిరికి వెళ్ళక్కరలేకుండా గేట్ల దగ్గిర క్రెడిట్ కార్డు స్వయిప్ చేసి వెళ్లిపోవచ్చు. కానీ ఒకే కార్డు అందరికీ పనిచెయ్యదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు వాడాల్సి ఉంటుంది. లక్కీగా మా దగ్గిర మూడు క్రెడిట్ కార్డులు ఉండడం వల్ల ఎంట్రన్సు, ఎఎగ్జిట్ గేట్ల దగ్గిర సులభంగా వెళ్లగలిగాం.

మొత్తానికి ఈ అండర్ గ్రౌండ్ రైలు సమయానికి ఎక్కినా, మళ్ళీ మధ్యలో ఇంకో రైలు మారాల్సి వచ్చింది. గ్రీన్ విచ్ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకున్నాం. కానీ రైలు స్టేషనునించి పావుగంట నడక దూరంలో ఉన్న గ్రీన్ విచ్ రాయల్ అబ్జర్వేటరీకి వెళ్లాల్సిన మా టిక్కెట్లు కూడా 3 గంటలకే కావడంతో హడావిడిగా రైలు దిగి పరుగెత్తాం.

తీరా చూస్తే గ్రీన్ విచ్ స్టేషన్లో పైకి వెళ్లే ఎస్కలేటర్లు పనిచెయ్యడం లేదు, లిఫ్ట్ ఎంతకీ రావడం లేదు. ఇక అందరితో బాటూ మెట్లెక్కడం ప్రారంభించాం. మెట్టుమెట్టుకీ పేచీ పెడ్తున్న సిరిని మెల్లగా బుజ్జగిస్తూ మెట్లు ఎక్కిస్తూ నేను, సిరి కార్టుని మోసుకుని సత్య మొత్తం పదంతస్తులు ఎక్కేసరికి చుక్కలు కనిపించాయి మాకు. పబ్లిక్ ట్రాన్సుపోర్టు అంటూ అనవసరంగా తలకాయ నొప్పి కొనితెచ్చుకున్నాం అనిపించింది.

ఇక బయటకు వచ్చి, పావు గంట పాటు నడిచి, గ్రీన్ విచ్ పార్కు వరకు అడ్రసు పట్టుకుని వచ్చేక అర్థమైంది ఏవిటంటే గ్రీన్ విచ్ అబ్జర్వేటరీ అక్కణ్ణించి పైకి కనిపిస్తున్న కొండ మీద ఉందని, అక్కడికి వెళ్ళడానికి నడక తప్ప మరొక మార్గం లేదని.

అప్పటికే అందరం బాగా అలిసిపోవడంతోనూ, కొండ మీదికి వెళ్లేదారి నిలువుగా ఉండడంతోనూ, సిరిని కూర్చోబెట్టుకుని కార్టుని తోసుకు వెళ్లడం అసాధ్యమైన విషయం అని అర్థమైంది. అలాగని ఆ పిల్లని నడిపించడమూ అయ్యే పని కాదు. ఇక అప్పటికే మూడున్నర అయిపోతుండడంతో పార్కు కొసన ఉన్న కొండ దారి వరకూ నడిచేక ఇక సిరితో నేను అక్కడే ఉండి పోతాను, కనీసం సత్యనైనా వెళ్ళమని పంపించాను.

సత్య వెంటనే కొండ పైకి పరుగెత్తాడు. సిరి, నేను అక్కడే ఉన్న బెంచీల మీద మరో అరగంట పాటు చతికిలబడ్డాం. ఇంతలో సిరికి ఏమనిపించిందో మరి, “పద, మనమూ వెళదాం” అని లేచి పరుగు తీసింది. హమ్మయ్య అనుకుని నేను కూడా ఖాళీ కార్టుని దొర్లిస్తూ వెనక పరుగుతీసాను. మొత్తానికి గండం గడిచి పై వరకూ వెళ్లినా, పైన ఉన్న ప్లానిటోరియంకి టిక్కెట్లు దొరకలేదు మాకు.

ఒక పక్క చెమట్లు ధారాపాతంగా కారసాగేయి. బాగా వేడిగా, విపరీతమైన దాహంగా అనిపించసాగింది. ఇక గ్రీన్ విచ్ టిక్కెట్లు అంటూ మేం ముందే బుక్ చేసుకున్నవి ఆ ఆవరణలో ఉన్న గ్రీన్ విచ్ కాలమానపు రేఖని, అబ్జర్వేటరీని చూడడానికి. నిజానికి అందుకోసం టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు కూడా కొనుక్కోవచ్చు.

సత్య అప్పటికే వాటర్ బాటిల్ ఒకటి కొని, వివరాలు కనుక్కుని మా కోసం కిందికి వచ్చేదారి మొదట్లో వెనక్కి వస్తూ ఎదురయ్యేడు. మొత్తానికి ముగ్గురం ఆన్ లైనులో ముందే కొన్న టిక్కెట్లు చూపించి లోపలికి వెళ్ళేం. లోపల అదొక చిన్న ఆవరణ. అక్కడ నేలమీద రాళ్ల ఫ్లోరింగ్ మధ్యలో చెక్కబద్ద ఒకటి పొడవుగా స్టీలు బద్దల మధ్య బిగించి ఉంది.

గ్రీన్ విచ్ రేఖాంశం అంటే సున్నా డిగ్రీల రేఖాంశం అన్నమాట. దీన్ని బట్టే భూమి మీద సమయాన్ని లెక్కవేస్తారు. ఆ గీతకు అటూ ఇటూ ఏ నగరం ఎన్ని డిగ్రీల రేఖాంశాల మీద ఉందో రాసి ఉంది. అక్కణ్ణించి బొంబాయి 73 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉంటే, లాస్ ఏంజిల్స్ పడమరకి 118 డిగ్రీల మీద అని ఉంది.

ఆ అద్భుతరేఖని చూస్తూనే అప్పటిదాకా మేం పడ్డ కష్టమూ, అలసటా అన్నీ మర్చిపోయాం. అక్కడ ఆ గీత మీద అటూ ఇటూ తిరుగుతూ భూమంతా చక్కెర్లు కొట్టినట్టు అనుభూతి చెందుతున్న మాతోటి సందర్శకుల లాగానే మేం కూడా ఆనందోత్సాహాలతో గడిపేం. ఇంతకీ అదేదో ఊహాత్మక పిచ్చి గీత అనుకుంటే పొరబాటే.

ఈ గ్రీన్ విచ్ కాలమానపు గీతని సరిగ్గా నిర్ణయించిన అసలు పరికరం దాన్ని ఆనుకుని ఉన్న చిన్న గదిలో ఉంది. దానిని మెరిడియన్ అబ్జర్వేటరీ అంటారు. మెరిడియన్ అంటే సరిగ్గా సూర్యుడు నడినెత్తిన ఉండే సమయానికి ఎవరైనా వ్యక్తి ఈ గీత మీద సరిగ్గా మధ్యన నిలబడితే, అక్కడ భూమిని నిలువుగా అడ్డకోత కోస్తే ఏర్పడే ఉత్తరదక్షిణాల గీత అతని మీదుగా వెళ్తుందన్నమాట.

రాయల్ జాన్ ఫ్లేమ్ స్టీడ్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు ఈ మెరిడియన్ గీతని మొట్టమొదటిగా ఉపయోగించి దాదాపు మూడువేల నక్షత్రాల గతుల్ని సరిగ్గా అంచనా వేసాడట. మా ఇద్దరికీ చాలా నచ్చింది ఆ ప్రదేశం. గ్రీన్ విచ్ రాయల్ అబ్జర్వేటరీ ఒక భౌతిక శాస్త్ర అద్భుతం. తలెత్తి చూస్తే ఆ భవంతి పైన ఎర్రని బంతి ఆకారపు కట్టడం మీద బాణం తిరుగుతూ ఉన్నట్టున్న దిక్సూచి కూడా కనిపిస్తుంది.

సాయంత్రం అయిదు గంటలకు అబ్జర్వేటరీ మూసివేసే సమయం వరకూ అక్కడే ఉండి, తిరిగి కొండ దిగి వచ్చాం. కొండ పై నించి చూస్తే దూరంగా కొత్త లండను నగరం అందంగా కనిపిస్తూ ఉంది. దారిలో చాలా మంది కొండ వాలులో కూర్చుని ఉన్నారు. రాత్రయ్యే వరకూ అక్కడే ఉండి నక్షత్రాల్ని చూసి వెళ్తారట.

మాకు అక్కడే చీకటయ్యే వరకూ ఉండే ఓపిక లేక తిరుగు ప్రయాణమయ్యాం. అక్కణ్ణించి మా బసకు అసలే గంట ప్రయాణం. వచ్చే దారిలో సిరి ఐస్ క్రీము అని పేచీ పెడితే కాస్సేపు ఆగేం. నేను థాయ్ బబుల్ టీ కొనుక్కున్నాను. అమెరికాలో ఈ చల్లని ఐసు బబుల్ టీలు అస్తమాటూ తాగుతాం. ఆ అలవాటు చొప్పున ఇలా టీ దుకాణం కనబడగానే వెళ్లి లైనులో నిలబడ్డాను. అయితే అక్కడ టీ అమెరికాలో ఉన్నంత గొప్పగా లేకపోవడం కాస్త నిరాశగా అనిపించింది.

తిరిగొచ్చేటపుడు రైలు ఎక్కడానికి హడావిడి పెట్టుకోకుండా, దొరికినప్పుడే ఎక్కుదాం, లేకపోతే టాక్సీ ఎక్కుదామని స్థిమితంగా నడిచాం. అప్పటికి ఇంకా సాయంత్రం ఆరు గంటలు మాత్రమే కావడంతో తిరుగు రైలెక్కి మొదటగా మేం రైలు మారాల్సినదీ అక్కడే. “పీకడెల్లీ సర్కసు” స్టేషనులో రైలు దిగిపోయి బయటకు నడిచాం. పీకడెల్లీ సర్కసు నిజానికి సర్కసు కాదు. వెస్ట్ మినిష్టర్ ఏరియాలో ప్రసిద్ధ నాలుగు రోడ్ల కూడలి. లాటిన్ భాషలో “సర్కస్” అంటే “సర్కిల్” అని అర్థమట.

ఆ కూడలిలో షెఫ్ట్స్ బరీ మెమోరియల్ ఫౌంటెన్, మధ్య గ్రీకు ప్రేమ దేవత ఈరోస్ విగ్రహం ఉంది. చుట్టూ కూర్చునేందుకు అన్నివైపులా మెట్లు ఉన్నాయి. ఆ కూడలి నాలుగు వైపులా నియాన్ లైట్లతో న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ లాగా ధగద్ధగా మెరిసిపోతూ ఉంది. మేమూ ఓ వైపు చతికిలబడ్డాం. అయితే చుట్టూ జనాలంతా రద్దీగా నడయాడుతున్నారు. పెద్ద మ్యూజిక్ పెట్టి, గారడీ వీధి ప్రదర్శనలు ఇచ్చి, డబ్బులు అడిగే వాళ్ళు, వాటిని చూసే వాళ్ళు, ఊరికే అటూ ఇటూ తిరిగే వాళ్లతో బాటూ, మెట్ల మీద కూర్చుని గంజాయి పొగలు వదులుతున్న వాళ్లు కూడా అధికంగా ఉన్నారు. చిన్నపిల్లతో అక్కడ ఎక్కువసేపు ఉండడం క్షేమం కాదనిపించి కాస్సేపట్లోనే బయలుదేరేం.

రోడ్డు దాటి, కనిపించిన ఫుడ్ ట్రక్కులో “ఫలాఫల్ ర్యాప్ రోటీలు” కొనుక్కునే వేళకి పాటలు, లైట్లతో వెలిగిపోతూ వీధుల్లో అక్కడక్కడే తిప్పి చూపించే రిక్షా ఒకటి కనిపించేసరికి ఎక్కుదామని మారాం చేసింది మా సిరి. పది నిమిషాలకు ఏభై పౌండ్లు చెల్లించి ఆ సరదా కూడా అయ్యిందనిపించాం. ఆ రిక్షావాలా కెన్యా నించి వచ్చి బ్రిటన్ లో స్థిరపడ్డాడట. సిరి సంతోషం చూసి చాలా ముచ్చట పడ్డాడు. మాకోసం ప్రత్యేకించి పెద్ద సౌండుతో బాలీవుడ్ మ్యూజిక్ పెట్టాడు. మా సిరికి పాటలంటే మహా ఇష్టం. ఆ రిక్షాలో అలా తిరుగుతూ వెళ్లడాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టింది.

ఇక అక్కణ్ణించి ఎర్ర డబుల్ డెక్కర్ బస్సెక్కి తిరిగి విక్టోరియా స్టేషనుకి తిరిగొచ్చి, అక్కణ్ణించి హోటలుకి నడిచొచ్చి, తెచ్చుకున్న భోజనం చేసేసరికి పదయ్యింది. ఇక మర్నాడు పొద్దున్నే మేం లండను నించి పారిస్ కు వెళ్లే రైలు ఎక్కాల్సి ఉండడంతో సామాన్లన్నీ సర్ది నేను నిద్రకుపక్రమించేసరికి పన్నెండు దాటింది.

ప్రతీ రోజూ హడావిడిగా పరుగెత్తినా, లండనులో మాకు మేముగా తిరిగిన ఆ చివరి రోజు అనుభవమే వేరుగా అనిపించింది. ఏదేమైనా లండన్ లో ఇలా పబ్లిక్ ట్రాన్సు పోర్టులో సొంతంగా తిరిగి చూడడం మంచి అనుభవం.

https://www.facebook.com/geetamadhavikala/posts/

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.