కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ|| కె. శ్రీదేవి

సి.సుజాత కథలు

       మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుదించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోన్న సందర్భాన్ని చాలా అరుదుగా సృజనకారులు కాల్పనిక సాహిత్యంలో ఆవిష్కరించే  ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే ఇవాల్టి జీవితంలో అమానవీయ ధోరణి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థమవుతుంది. వీటిని ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావమనే పేరుతో తేలికగా తీసుకుంటున్నారు.  కానీ అలా తేలికగా తీసికోవాల్సిన అంశం కాదు. అత్యంత వేగవంతమైన, సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులోకి  వచ్చి, మనిషి జీవన ప్రమాణాన్ని పెంచింది. కానీ బుధ్ధి నైశిత్యం సంకుచిత పరుధులకు లోనవుతుంది. దీనిని ఎదుర్కోవడం స్త్రీవాద తాత్విక పరమైన సృజనాత్మక సాహిత్యం ద్వారా కొంతవరకు సాధ్యమవుతుంది. రచయితలు ఈ మాయాజాలానికి అతీతంగా తాత్విక అధ్యయనంతో విశాల దృష్టి కోణాన్ని సంతరించుకోవడం ద్వారానే మంచి సృజనాత్మక  సాహిత్యం లభ్యమయ్యే అవకాశం వుంది.

 సామూహిక లేక నిర్థిష్ట సమాజ సంబంధమైన విషయాలను మాత్రమే ప్రతిఫలించటం వలన గత రెండు దశాబ్దాల కాలంలో సాధికారత చేకూరే ప్రక్రియ ప్రారంభమవటంతో స్త్రీవాద సాహిత్యం బలమైన వ్యక్తీకరణకు నోచుకుంది. ఈతరహా ఆలోచనలు గత రెండు దశాబ్దాల కాలంలో తెలుగు కాల్పనిక సాహిత్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు దోహదం చేసిన స్త్రీ రచయితలలో సి. సుజాత ఆలోచనలు ప్రతిబింబించాయి.  

        నాలుగు దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యాన్ని సృజిస్తున్న సి. సుజాత,  స్త్రీల జీవితాన్ని సమస్త కోణాల్నించి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్శ్వాల నుండి  విడివిడిగా రచనలు చేస్తున్న వారి రచనలలో  జీవితాన్ని గురించిన అవగాహన  సమగ్రంగా వ్యక్తంకాదనే అభిప్రాయం వుంది.  అలాంటి సాధారణీకరణల్లోంచి,  అవగాహనల్లోంచి, నమ్మకాల్లోంచి సుజాత చాలా  బలమైన కాల్పనిక సాహిత్యాన్ని సృజించారు. సుజాత ఇంతవరకు మూడు సంపుటాల కథా సాహిత్యాన్ని రెండు నవలల్ని ప్రచురించారు. సుజాత కథలు, రెప్పచాటు ఉప్పెన, సప్త భుజంగాలు ద్వారా స్త్రీల సాహిత్య ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకోగలిగినారు. ’నెరుసు” కథా సంపుటి,  ”రాతిపూలు’ నవల రెండూ  సుజాతను  సీరియస్ స్త్రీవాద కాల్పనిక సాహిత్య కారిణిగా తన సామర్థ్యాన్ని మరోసారి శక్తివంతంగా ఋజువు చేసుకోగలిగింది.

         స్త్రీవాదం చర్చకు పెట్టిన  పితృ స్వామ్య అణచివేత రూపాలైన ఇంటిచాకిరి, లైంగికత, పునరుత్పత్తి హక్కులు లాంటి అంశాలన్నీ సుజాత సాహిత్యంలో ముఖ్యంగా ‘రెప్పచాటు ఉప్పెన’, ‘నెరుసు’ కథా సంపుటాలలోని  కథలు మిగిలిన సాహిత్యం కంటే చాలా బలంగా, గాఢంగా స్త్రీవాద తాత్వికతలోని వ్యక్తరూపాలుగా దర్శనమిస్తాయి. ఉదాహరణకు చాలామటుకు సంక్లిష్ట సంధర్భాల్లో కూడా సుజాత కథల్లోని పాత్రలు నిరాశలో మునిగిపోవు. పరిస్థితులను అర్థం చేసుకుని, తమంతకు తామే స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. జీవితానికి కావాల్సిన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల స్వరూపం ఎలా వుంటుందో,  వాళ్ళు  జీవితాన్ని పెంపొందించుకొనే క్రమంలో తెలుస్తుంది .  జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తాయోనని అనడానికి ఆమె కథల్లోని పాత్రలన్నీ నిదర్శనంగా నిలుస్తాయి.  .  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే,  వాళ్ళు జీవితాన్ని కోల్పోయేంత స్వేఛ్ఛను పొందాలనుకునే పాత్రలుగా ఉండరు.  అలా కోల్పోయేంత స్వేచ్చ ఉండకూడదన్న అవగాహన  సుజాతకు వుంది. జీవితంతో మమేకమైన స్వేఛ్ఛను, తమకు కావాల్సిన  లేదా పొందాల్సిన  స్వేఛ్ఛ గురించి తమ పాత్రల ద్వారా శక్తివంతంగా వ్యక్తం చేసే క్రమంలో సుజాత తాను పొందిన  స్వీయ అనుభవ చైతన్యం ఈ కథల్లో పర్యవసించడం వల్లనే ఈ కథలు ఇంత వాస్తవికంగా potential గా తయారయ్యాయని చెప్పవచ్చు. 

          స్త్రీవాద సిధ్ధాంతం  ప్రతిపాదించిన లైంగికత వైవాహిక వ్యవస్థ పైన చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దికున్న భావనలు (concepts) సహజీవనం (living together) స్వలింగ సంపర్కం (Lesbian) ఒంటరి స్త్రీలుగా (Single women) ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి.ఈ భావనలన్నింటినీ సి. సుజాత , ‘బీటెన్ ట్రాక్’, ‘చందన’, ‘నా దారిలోనే’  కథల్లో చిత్రించారు.

               స్త్రీవాద రచయితగా సుజాత మాతృత్వం పట్ల పితృస్వామ్యం  ఏర్పరచిన భావనలను బద్దలుకొట్టి, పునరుత్పత్తి క్రమంలో స్త్రీలు వంటరివాళ్ళుగా మారుతున్న క్రమాన్ని ‘నేనొక్కదాన్నే’, ‘త్రీ ఇన్ ఒన్’  కథల్లో చిత్రించారు.  స్త్రీలు పెళ్ళికాకముందు చేయని పనులన్నింటినీ పెళ్ళయిన తరువాత ఎవరూ చెప్పకుండానే చేసుకుపోయేంత తర్ఫీదు తల్లులు, నాయనమ్మలు, అత్తల ద్వారా గ్రహించడం జరుగుతుంది. అందువలననే అమ్మాయిలు ఈ కథల్లో ఆటోమేటిక్ గా ఆపనుల్ని ఒకరు చెప్పకుండానే చేసుకుపోయే తత్వాన్ని జెండర్ దృక్పథంతో సి. సుజాత చర్చించారు. పుట్టినప్పటి నుంచీ అలవాటు లేని పిల్లల పెంపకం బిడ్డ పుట్టి పెరుగుతున్న కొద్దీ తమ చేతుల స్పర్శ తల్లుల సేవల్లో వాళ్ళెంత హాయిగా, సౌకర్యంగా వుండగలరో తెలుసుకోవటం అంతెందుకు గర్భం ధరించగానే దూకుడు తగ్గించి నడవడం దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మ నాయనమ్మల పర్యవేక్షణలో అమ్మాయిలు తల్లులుగా రూపాంతరం చెందే క్రమాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే చదువుల విషయంలో కూడా చక్కగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి, వాళ్ళ సంతృప్తిని గెలుచుకోవడం, వాళ్ళందరి దృష్టిలో నమ్రత కలిగిన తెలివైన ఆడపిల్లలుగా ఎలా తీర్చి దిద్దబడతారో అందులోని నియంత్రణ అధికారపూర్వకంగా కాక ప్రేమ పూర్వకంగా సాగడం వలననే ఆ తీవ్రతను ,వత్తిడిని స్త్రీలు గుర్తించలేకపోతున్న క్రమాన్ని రేవతి పాత్ర ద్వారా వ్యక్తం అవుతుంది.  ఈ వరుసలోనే, తల్లితండ్రుల పెంపకంలో పెరిగిన  ఆమె చంద్రాన్ని పెళ్ళాడిన దగ్గరి నుంచీ ఏ ఇబ్బందీ కలుగకుండా ఒద్దికైన భార్యగా పేరు తెచ్చుకునే క్రమమంతా కూడా “ ఎవరినీ నొప్పించరాదనే తారకమంత్రాన్ని” పఠించడంతో వచ్చిన  అనిభవంగా గుర్తించడంలోనే రేవతి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. తనకు తెలియకుండా తనను కంట్రోలు  చేయగలిగిన శక్తులన్నింటికి తల వంచింది.  తన జీవితం తన చేతుల్లో కాక మరెవరో గీసిన హద్దుల్లోంచి, ఇంకెవరో డిజైన్ చేసిన జీవితాన్ని ఆ చట్రంలోనే ఆమె జీవితాన్ని ఎవరో పేక్ చేసి ఇస్తున్నారనే భావన కలిగింది. భర్త చంద్రం రేవతీకి ఉద్యోగరీత్యా వచ్చిన ప్రమోషన్ ను వద్దని చెప్పదం వలననే, ఆమె అస్థిత్వం ప్రశ్నార్థకం లేదా సమస్యాత్మకమవుతున్న విషయాన్ని రేవతి కంటే పాఠకులే ముందు గ్రహించగలుగుతారు.

            ఇన్నాళ్ళు తనని స్వేఛ్ఛా జీవిననే భావంలో  నిలబెట్టిన విశ్వాసం ఎంత బలహీనమైనదో అర్థమవుతుంది. రేవతి పర్సనల్, పబ్లిక్ జీవితాలు రెండూ ఎవరి కంట్రోల్ లో వున్నాయో , చంద్రం ప్రమోషన్ వద్దని చెప్పినప్పుడు మాత్రమే తన స్వతంత్ర పరిథి ఎంతో ఆమెకు తెలుస్తుంది. ఇది కొంచెం సినిమాటిక్ గా అనిపించినప్పటికీ సుజాత తన రచనలో చూపించిన నైపుణ్యం వలన పాఠకులు దీనిని  లోపంగా గుర్తించరు.

           “ తన కోసం ఫిల్టర్ చేసిన కాఫీలాగా కాచి –  చల్లార్చి –  సిధ్ధం చేసిన జీవితం తన కోసం ఎవరో షేక్ చేసిన జీవితం …. కంప్యూటర్ లోకి ఎక్కించిన  ప్రోగ్రామ్ లాగా అక్షరం తేడా లేకుండా ఖచ్చితమైన స్టాటిస్టికల్ రిపోర్ట్” (పే-౨౨) లాంటి జీవితం తల్లి నాయనమ్మల చేతుల్లోంచి చంద్రం చేతుల్లోకి మారి పధ్ధతిగా, నిదానంగా చిక్కుడు పొద మీద పాకే గొంగళి పురుగులా నడిచే జీవితం  తనకు వద్దనుకుంటుంది.  తన జీవితాన్ని ’గొంగళి పురుగు”  లాంటిదని రేవతి  Identity అవ్వడంలోనే ఆపాత్ర చైతన్యం వ్యక్తమవుతుంది.  తన సొంత ఆలోచనలకు ఆస్కారం ఇవ్వని జీవితం, పొందికగా తయారయిన జీవితం, ఎలా వుంటే అందరి మన్ననలకు పాత్రమవుతారో అలా తయారైన జీవితం. సమస్త ప్రపంచం ఏమైనాగానీ తాను మాత్రం భద్రంగా గడపాలనే జీవితాన్ని గొంగళి పురుగు నడకతోనే కాదు,  వళ్ళంతా వెంట్రుకలతో, నల్లగా, నింపాదిగా నడిచే గొంగళి పురుగు స్వరూప స్వభావాలన్నింటితో  తనను తాను Identity చేసుకున్న  రేవతి పాత్రతో  భారతదేశంలోని ఎక్కువశాతం  మహిళలు Identity అవుతారు.

           ఠంచనుగా గంటకొట్టే గడియారంలా పదిగంటల కంతా తన కాబిన్ లో,  మనుషులతో సంబంధం లేని జమా ఖర్చుల బిల్లులు చూసే వుద్యోగం , మళ్ళీ సాయంత్రానికంతా ఇంట్లో వాలిపోయే భార్య ఉద్యోగం, రాత్రి పదింటికల్లా నైటీ తగిలించుకుని శృంగారం కోసం పనికి వచ్చే ప్రియురాలి ఉద్యోగం ఇలా  పనిముట్టుల్లా  స్త్రీలు మారుతున్న క్రమాన్ని ”కనిపించని నియంత్రణకు కొనసాగింపే స్త్రీల జీవిత” మని గుర్తించడంలోనే సుజాత స్త్రీవాద దృక్పథం స్పష్టమవుతుంది.

            స్త్రీవాదం  ప్రతిపాదించిన  లైంగికత (సెక్సువాలిటి) సిధ్ధాంతం ,  వైవాహిక  వ్యవస్థపైన  చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దుకున్న భావనలే సహజీవనం, ఒంటరి స్త్రీగా స్వలింగ సంపర్కులుగా జీవించడం లాంటి భావనలు  ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి. ఈ భావనలన్నింటినీ సి. సుజాత ‘బీటెన్ ట్రాక్’, ‘నా దారిలోనే’,  ‘చందన’,  కథల్లో చిత్రించారు.

            ‘బీటెన్ ట్రాక్’. కథలోని విమల ప్రకాష్ తో సహజీవనం చేయడానికి సిధ్ధపడుతుంది. కానీ పెళ్ళికి వ్యతిరేకం. ప్రకాష్  మూడేళ్ళ సహజీవనం తర్వాత స్థిరమైన  జీవితం గడపడానికి పెళ్ళి కావాలనుకుంటాడు. కానీ విమల తన తల్లి, అత్త, అక్క జీవితాల్లోని జవజీవాలను కుటుంబం ఎలా లాగేసిందో గ్రహించడంతో పెళ్ళి వద్దంటుంది.  కానీ పెళ్ళి చేసుకోక తప్పదంటాడు. విమల అందుకు ఇష్టపడకపోతే,మరో అమ్మాయినైనా పెళ్ళాడతానంటాడు. విమలతో జరిగిన సంభాషణను గమనిస్తే ప్రేమించిన స్త్రీ పెళ్ళికి అంగీకరించకపోయినా, ప్రేమించకపోయినా ఎవరినైనా పెళ్ళాడడానికి సిధ్ధపడుతున్న ప్రకాష్ ది ఎలాంటి ప్రేమో, ఇన్నాళ్ళూ అతనితో సహజీవనానికి ఎలా సిధ్ధపడిందో ఆమె చైతన్య స్థాయిని పట్టించే అంశాలు. కాబట్టి  ప్రకాష్ మాటల్ని ఖచ్చితంగా ఈ సంధర్బంలో  పరిశీలించాల్సి అవసరముంది.

          “ మనిద్దరి మద్య కాంట్రాక్ట్ కంటే ముందు ప్రేమ కూడా వుంది విమల. మనం మెషీన్లం కాదు, మనుషులం పోనీ ఆ కొత్త మోజులో అర్థం కాలేదు. ఏ లంపటం లేకుండా హాయిగా వుందామనిపించింది. ఇందులోని లోటు నాకు ఇప్పటికి తెలిసింది. నువ్వు ఆలోచించుకో. నీకు నచ్చకపోతే నేను ఇంకో అమ్మాయిని పెళ్ళాడతాను.” (పే-89 నెరుసు సుజాత కథలు) అంటాడు. 

             ప్రకాష్ మాటల ద్వారా వాళ్ళిద్దరు కలిసి బ్రతికినా, అలాగే కొనసాగాలంటే   పెళ్ళి తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని అతను పట్టుపట్టడంలోని ఆంతర్యం భోధపడుతుంది.  అంటే,  ఎన్నాళ్ళు కలిసి బ్రతికినా చివరికి పెళ్ళిచేసుకోక తప్పదు.  అనే భావన కలగటం ఏమిటి? అన్న ప్రశ్న కలుగకపోతే సి. సుజాత కథలపై రెంటాల కల్పన రాసిన ‘ తెలుగు కథకులు- కథన రీతులు’  అన్న వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాల  వలన  విమలదే మొత్తం తప్పనిపిస్తుంది. బాధ్యతగా ప్రకాష్ పెళ్ళి చేసుకుంటానంటే విమలెందుకు తిరస్కరిస్తుంది?  అన్న వాదమే నిజమనిపిస్తుంది. విమల స్నేహితురాలు, పెళ్ళి ప్రసక్తి లేకుండా పూర్తికాలం  ఉద్యమ కార్యకర్తగా పనిచేసే నళిని అభిప్రాయంతో ఏకీభవించాల్సి వస్తుంది. ప్రకాష్ ను ఆమె  విమలకు తిరస్కరించడానికి చూపిన కారణాలు రెండు. 

  1. విమలకు ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దనటం
  2. పెళ్ళి వెనుక వున్న అభద్రతను చూసి పెళ్ళి వద్దనటం.

           పెళ్ళిని భద్రతగా భావించే వారున్నట్లుగానే, అభద్రతగా భావించే వాళ్ళు కూడా వుండటం గమనించాల్సిన విషయం. కాబట్టి ఆమె అభిప్రాయాల్లో వాస్తవం పాళ్ళెంతో అందరికీ తెల్సిన విషయమే. మరి సి. సుజాత  నళిని పాత్ర చేత ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దన్నట్లుగా ఎందుకు చెప్పించింది అంటే, రచయిత సమకాలీన  ఉద్యమ కార్యకర్తల అభిప్రాయాలలోని  దుర్మార్గమైన వ్యాఖ్యల్ని  రికార్డు చేయడం కోసమే. అంతేతప్ప స్త్రీవాద వుద్యమ చైతన్యాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళెవరికీ ఇలాంటి అభిప్రాయాలు కలుగవని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటాను.  

          విమలను నళిని దృష్టితోనో, ప్రకాశం దృష్టితోనో చూస్తే, విమలలో జరిగే సంఘర్షణను  కొంచెం కూడా అర్థం చేసుకోలేం. సమాజంలో ఇంతవరకూ ఎలాంటి విలువలు కొనసాగుతున్నాయో ఆ విలువలకే మళ్ళీ పట్టం కట్టిన  వాళ్ళమవుతాం.  సామాజికుల అభిప్రాయాల కంటే సృజనకారుల దృష్టి, అంతకంటే నిశితంగా విశ్లేషకుల తాత్విక దృక్పథం సునిశితంగా వుంటుంది. వుండాలి. ఈ సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు గుర్తుకొస్తున్నారు. సమాజంలోని సాధారణీకరణాలను చర్చించడం కన్నా సమస్యాత్మకమైన  సంఘర్షణలను, సంక్లిష్టతలను రచయితలు సాహిత్యీకరించినప్పుడే రచయిత సాధించే సాహిత్య ప్రయోజనం ప్రజలకు అవసరమంటాడు. మనం కొ.కు అభిప్రాయంతో ఏకీభవించడానికి ఎలాంటి సందిగ్దాలు వుండవు. కానీ దాన్ని సాహిత్యానికి అనువర్తింపచేయడంలో మాత్రం మళ్ళీ మొదటికే వస్తాం. ధర్నాలు హర్తాళ్ళు నిర్వహించే వుద్యమాల్లో వున్నా నళినీ లాంటి వాళ్ళకు సహజీవనాన్ని వాళ్ళ అవగాహనలోంచి ఇంతకంటే గొప్పగా చెప్పే అవకాశం సందేహాస్పదమే.

          అధికార సంబధాలున్న సంప్రదాయ పెళ్ళిని స్త్రీవాదులు వ్యతిరేకిస్తారు. ఎందుకు  వ్యతిరేకిస్తున్నారో అందులో వున్న సమస్యలేమిటో  మనకందరికీ తెలుసు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించే క్రమంలో ఒకే కప్పు కింద జీవించటం  వలన వచ్చే సమస్యల్ని ఆచరణలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వాలతో, సొంత సంపాదన , సొంత ఆలోచనలు కలిగిన స్త్రీ  పురుషుల మధ్య Flexible relations వుండాలిగానీ,   విప్పుకునే అవకాశంలేని పీటముళ్ళు కాదు. ఒక సారి పెళ్ళి అన్న బంధంలోకి వెళ్ళిన తరువాత విడిపోవడం గానీ, కలిసి వుండడంగానీ అంత సులభంగా జరిగే పనులు కావు. ఒక జీవిత కాలానికి సరిపోయే వేదన.   అందుకే అలాంటి సంబంధాన్నుంచి విమల విముక్తమవ్వాలను కుంటుంది.

 సహజీవనంలో ప్రకాష్ పనిని శ్రమ అయినా, ఆ పనిని చేయగలిగింది. అలా చేయలేని రోజు దాన్ని తిరస్కరించే అవకాశం వుంటుంది. పెళ్ళిని కూడా అలా తిరస్కరించవచ్చు కదా అనుకుంటే, ప్రకాశ్ కోరుకునే శాశ్వత బంధంలో ఇంటిచాకిరిని, పెత్తనాన్ని తప్పకుండా ఏదో స్థాయిలో ఎంత వద్దనుకున్నా భరించాల్సే వస్తుంది. అందుకే విమల పెళ్ళిని తిరస్కరించింది. ఇక్కడ విమలను శంకించే అవకాశమే లేదు. ప్రకాష్ తో గడిపిన మధురానుభూతుల్ని వదులుకోలేక అతనితో కలసి వుండాలనే కోరుకుందని చెప్పడానికి ఈ క్రింది వాక్యాలే సాక్ష్యం.

“ వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్లుగా చూస్తూచూస్తూ వుండగానే జీవితం మొత్తం చేజార్చుకున్నట్లే వుంది. తెల్లవారే సరికి ఇదంతా ముగిసిపోతుందా? ఇంకేమీ వుండవా? ఏ ఙ్ఞాపకాలు మిగలకుండా, హృదయంపైన ఏ ముద్రలు లేకుండా నేనొక్కదాన్నే ఈ విశాలమైన ఆకాశం నీడలో ఉండిపోతానా? ఆక్టోపస్ లా చేతులు జాస్తున్న ఈ నాలుగు గోడల మధ్య నేనిమిడీపోవడం తప్పేనా?…….. నిర్మానుష్యంగా నిశ్శబ్దంలో, ఒంటరితనంలో….” ఈ ఆలోచనా క్రమం విమల మానసిక స్థితి, ఆమె గురవుతున్న సంఘర్షణల వైనం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది.

సమాజం రూపొందించే విలువలకు బలయ్యే వాళ్ళు వున్నట్లే ఆ విలువలను తిరస్కరించి తమకు అవసరమైన జీవితాన్ని తాముగా రూపొందించుకునే వాళ్ళు వుంటారు. సమస్యలకు తక్షణ పరిష్కారాలు లభించనప్పుడు వ్యక్తులు తమ సొంత పరిష్కారాలు వెతుక్కుంటారు. తమకు కావలసిన separate space ని peace ని వెతుక్కుంటారు. విమల వెతుకులాటలోంచే తన వునికికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేసుకోగలిగింది. సాహచర్యం మాత్రమే Ultimate solution  అని కూడా ఈ కథలో రచయిత ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రకాష్ కు “ ఎప్పటికప్పుడు తానే ఉతికించి, వండీ, అతని మూడ్స్ కనిపెట్టి… ఏమిటిది? ఎక్కడ తన ఉనికి? అని సంఘర్షించడంలో సహజీవనంలో కూడా పురుషుని ఆధిపత్య ధోరణి కొనసాగటాన్ని సుజాత కథలో స్త్రీవాదులు ప్రతిపాదించిన సహజీవనం పట్ల వున్న భ్రమలకు గండికొట్టే ప్రయత్నం చేశారు. ఈ కథలో సుజాత స్పష్టమైన వైఖరిని తీసుకోకుండా కేవలం చర్చను మాత్రమే కథనంగా చూపించి, పరిష్కారం పాఠకులకే వదిలేస్తుంది. 

సుజాత ‘బీటెన్ ట్రాక్’  కథాలక్ష్యం పెళ్ళి, సహజీవనాల్లో వున్న డొల్లతనాన్ని బహిర్గతపరచడంలో స్త్రీవాద దృష్టికోణం  ఏమంటే, సహజీవనం, పెళ్ళి నిర్మాణాల్లో వున్న అణచివేత స్వరూపంలో వచ్చే మార్పు కంటే, స్వభావంలో రావాల్సినమార్పు వైపు తన లక్ష్యాన్ని గురిపెట్టడంలోనే ఆమె దృక్పథం వ్యక్తమవుతుంది. 

స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను గానీ తారసపడే సమస్యల పట్ల స్త్రీలుగా వర్తించాల్సిన లేదా అవలంబించాల్సిన వైఖరిని  తన కథల్లో ప్రదర్శించారనిపిస్తుంది. ఏవి చర్చించాల్సిన విషయాలో, ఏవి ఉదారంగా ప్రవర్తించాల్సిన విషయాలో కూడా సి. సుజాతకు అవగాహన వుంది అనే విషయం ఆమె కథలు నిర్వహించిన విధానంలో వ్యక్తమవుతుంది.  ఇందుకు నిదర్శనంగా ‘చందన కథ’  నిలబడుతుంది. పాశ్చాత్య స్త్రీవాదులు  చర్చించిన స్వలింగ సంపర్కం (లెస్బియన్)  సమస్య వున్న వారిని సానుభూతితో అర్థం చేసుకోవాలనే అభివ్యక్తిని, లక్ష్యాన్ని ఆమె కథా సంవిధానమే తెలుపుతుంది.ఈ కథలో చర్చకు అవకాశం ఎంత మాత్రం లేదు. కానీ త్రీ-ఇన్ వన్ కథను  బీటెన్ ట్రాక్ కథను నిర్వహించిన తీరులో వ్యత్యాసం వుంది. వీటిని నిర్వహించడంలో  అవలంబించిన ఎత్తుగడ ప్రత్యేకమైందే కాదు ప్రశంసనీయమైనది కూడా.

మధ్యతరగతి జీవితాన్ని గురించి తెలుగులో చాలా విస్తృతంగా స్త్రీల కథలు వచ్చాయి. అయితే  మధ్య తరగతి జీవితాన్ని చిత్రించిన  కథల్లోని పాత్రలు ఆ మధ్య తరగతి చట్రంలో ఇమడలేక, దాన్నుంచీ బయటపడలేక ఒకానొక సంక్షోభంలో కొట్టుమిట్టాడడం కనిపిస్తుంది. ఈ విలువల చట్రాన్ని కొన్ని పాత్రలు అధిగమించి బయటపడగలిగినా ఆ తరువాత  ఆ పాత్రలు ఒక నాస్టాల్జియాలో (ఙ్ఞాపకాల్లో) మిగలటం  లేక మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనడం కనిపిస్తుంది. పాత్రల ఈ స్థితికి మౌలికంగా రచయితల మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటపడలేకపోవటం ఒక కారణమైతే, స్త్రీ రచయితలకు మధ్య తరగతి విలువల చట్రాన్ని  అధిగమించే దైర్యం లేకపోవటం కూడా మరో కారణం. అయితే స్త్రీ రచయితలు అలా అధిగమించలేకపోవడాన్ని వాస్తవాన్ని విమర్శించటంలో భాగంగా చూడటం సరికాదు. వాస్తవ సమస్యలకు వ్యూహాత్మక పరిష్కారాలు సూచించటం అనేది కాల్పనిక సాహిత్యంలో భాగం. ఆ పని చేయటం  వలననే వర్తమాన ప్రపంచంలో తాత్విక అవగాహన కన్నా సాహిత్య అవగాహనకు ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతుంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.