‘రామి ‘

-పద్మజ కుందుర్తి 

                        

      పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు,  రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను కూడా  అంతే ఉన్నది. 

        ఏడోక్లాసు చదువుతున్న కూతురినీ, ఐదోక్లాసు చదివే కొడుకునీ మధ్యాన్నం నుండీ కళ్ళనీళ్ళు కారుస్తూ, కొంగుతో తుడుచుకుంటూ తడవకొకసారి దగ్గరికి తీసుకుంటూనే ఉన్నది రామి. వాకిట్లో నులకమంచమ్మీద కూర్చున్న అమ్మమ్మనీ, అరుగుమీద పుగాకు చుట్టుకుంటున్న తాతనీ చూస్తుంటే మనసంతా అపరాధభావంతో నిండిపోతున్నది రామికి. “ముదిమి వయసుకుచేరిన అమ్మమ్మకూ, తాతకూ అంత గొతులో గంజి పోస్తావనే కూతురా నిన్ను నాతమ్మునికిచ్చి చేస్తుంట. నా అమ్మనీ ,అయ్యనీ కట్టపెట్టమాకు, లెగలేని  నాడంత ముద్ద బొచ్చెలో యెయ్యి కుతురా! ఆళ్ళిద్దరూ కష్టజీవులు ఈ వయసులో నోటికాడికి అంత ఏడి బువ్వుంటే సాలు ఆ ముసలి పానాలకి. ” అని అమ్మ పదే పదే చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. 

     చిన్నగా అమ్మమ్మ దగ్గరికి పోయి వాటేసుకుని, “పోయొస్త అవ్వా! ఆరేగ్యం జాగర్త. రోజూ కోవటి రామయ్య కాడ రెండిడ్లీ తెప్పిచ్చుకోని తిని బీపీ బిళ్ళేసుకో, మనవరాలుసేత సక్రంగ పనులన్నీ చెప్పి చేయిచ్చుకో. గాసుపొయ్యి కాడ జేజీ, మనవరాలూ ఇద్దరూ జాగర్త. అమ్మ కూరలు పంపిత్తాదిలే. అన్నావాళ్ళుకూడా వొస్తుంటిరిగదా! ఏడేళ్ళ మనవడినీ, మూడేళ్ళ పసిదాన్నీ జూసుకోవాలగదా అమ్మ. ఎర్రబర్రెనొకటే అట్టిపెట్టాముగద. అమ్మొచ్చి రోజూ పాలుపితికిస్తది. అన్నీ కేంద్రానికి  బొయ్యకుండా కాసిని తాగి కాసిని చేవురేసుకోండి. ” రామికి ఎంతకీ తెగటంలేదు మాటలు. 

    “ఇంక అప్పగింతలు సాల్లే! బయలుదేరు. పొద్దుగూకుతాంది. ఎనిమిది గంట్లకే  బొస్సు ఆనకాలీశమైందంటే టిక్కెట్లు కూడా దొరకవ్ కానీ కానీ” మంటూ తొందరపెట్టాడు రామి మొగుడు నారాయణ. టిపిను కారేజీ చేతపట్టుకొని బిడ్డలని మళ్ళీ పొదువుకొని చిన్నోడికి “బడివొదలంగనే గమ్మున ఇంటికిరా నాయినా ..జేజిని ఏడిపీమాక. ఇంటికిరాంగనే బువ్వతిని అక్కతో బాటే సదూకో సందేళ గొడ్లకు కాస్త పచ్చిమేత కొయ్యి. లెక్కలయ్యీ రాపోతే పంతులమ్మ ఇంటికాడికి బొయ్యి సెప్పిచ్చుకో”. అని ఆటో ఎక్కినదాకా సుద్దులు చెబుతూనే, లేగదూడని వదిలిపెట్టి వెళుతున్న గోమాతలా తిరిగి తిరిగిచూస్తూనే వెళ్ళింది రామి. 

   ఆటో వూరుదాటి డొంక బాట పట్టింది. ఎగుడుదిగుడు దారిలో పొలాలమధ్య నించి పొతున్నది  ఆటో. చింత తోపులు దాటగానే సవిటి పర్రలూ దాని వెనుక దూరంగా కనబడుతున్న తమ పొలాలనూ చూస్తూ నిట్టూర్చింది రామి. ఒకటారెండా మూడుచోట్ల భుమిలోకి దాదాపు నాలుగొందల అడుగుల పైన వేయించినా కూడా నీరుపడక మూతేసిన బోరు బావులు సమాధుల్లా కనబడుతున్నాయి. ఒకటి గవర్నమెంటు సబ్సిడీ మీద వేసేరు. ఇంజనీరు వచ్చి చోటుచూసి ఇక్కడ పుష్కలంగా నీరు పడ్తుందంటే ఉత్సాహం గా వేసేరు. కానీ నీరు పడలేదు. 

  రెండోబోరు దగ్గరున్న కాసిన్ని డబ్బులూ కర్సుపెట్టివేసేరు. వెయ్యబొయేముందు అయ్యోరిని ఏపక్క వేస్తే వాస్తు ప్రకారం మంచిదో కనుక్కుని పొలానికి ఈశాన్యం లో వేసేరు అక్కడా ఆ గంగమ్మ తల్లి దయ చూడలా. ఇక పొలం బీడైపోతందని భయపడి మూడోబోరు అప్పుచేసి వేసేరు. అప్పుడుకూడా అందరికీ అంత్రాలు కట్టే సామిని పిలిపించి సూపిచ్చారు. ఆయన కొబ్బరికాయ అరిసేతులో నిలబెట్టుకోని పొలమంతా తిరిగి “ఇల్లిదిగిదిగో ఈడ అరిసేతిలో కాయ గిరగిరా తిరుగుతాంది, ఇక్కడ పాతాళ గంగమ్మ పైకి వురకతా నంటాంది ”  అంటా ఓ గుండ్రం గీసాడు. అక్కడే బోరు ఏపిచ్చినా సుక్కనీరు పడలా …పైగా రెండు లచ్చల రూపాయిలు అప్పు మీదపడింది. 

     రెండేళ్ళుగా యెగసాయం మానుకుని సుట్టుపక్కల సెరువుల కిందా, బోర్లకిందా సాగయ్యే పొలాల్లో రోజుకూలీలుగా రోజులు నెట్టుకొస్తున్నారు. సన్నిళ్ళకు ఏన్నీళ్ళుగా నాలుగు బర్రెలు మేపుకొని పాలు అమ్ముకుంటూ, సంసారం జూసుకుంటా అప్పు తీర్సాలంటే వీలు కుదరట్లా. అప్పటికీ ఒక లచ్చరూపాయిల అప్పుతీర్చటానికి రెండేళ్ళు పట్టింది. వానలు లేక అన్నావాళ్ళ పొలాలుకూడా బీళ్ళై పోయాయి నాలుగేళ్ళుగా వ్యవసాయం మూలపడింది. సన్నకారు రైతులే కాదు ఓ మాదిరి పెద్ద రైతులు  కూడా వ్యవసాయ కూలీలుగా మారిపొవాల్సిన పరిస్థితి. ఆ వ్యసాయపు పనులు కూడా దొరకని పరిస్థితి దాపురించింది. నాలుగేళ్ళుగా ఆ వానదేవుడు కూడా చిన్నచూపు చూస్తున్నాడు. 

          తమ జిల్లాని ఈమధ్యే ప్రభుత్వం కరవు జిల్లాగా ప్రకటించింది. జిల్లాలోని సగం మంది రైతులు కడుపు చేత పట్టుకుని పెద్ద పెద్ద పట్టణాలకు  కట్టుబడికూలీలుగా వలస పోతున్నారు. నెలనుంచీ అన్నయ్య కూడా ఒకటే పోరు పెడుతున్నాడు “మనం కూడా హైదరాబాదు వెళదాం. ఆడ నాకు తెలిసిన మనిషి కూలీల కోసం ఫొను చేసేడు మనం కూడా వెళదాం. మగోళ్ళకు ఐదొందలూ , ఆడోళ్ళకు మూడొందలాభై రోజుకూలీ అంట. పై మూడొందలాభై కర్సులకు పోయినా ,నెలకు పదేనేలు మిగులుతై, పదినెలల్లో బాకీ వడ్డీతో సహా తీరిపోద్ది ” అంటా ఒకటే ఊదరకొట్టి బైల్దేరదీపిచ్చాడు. 

   ఆటో గంటకల్లా ఒంగోలు చేరింది. బస్సుకింకా గంట టైముంది. అందరూ కారెజీల్లో తెచ్చుకున్న అన్నాలు తిని బస్సెక్కారు. అది ఆర్డినరీ బస్సు. దాదాపు బస్సంతా తమలాంటి వాళ్ళతో నిండి పోయింది. నారాయణా, బామ్మర్ది రమేషూ ఇద్దరూ కలిసి సామాను బస్సుమీదకి చేర్చి, గాట్టిగా కట్టారు. బస్సుబయలుదేరి, ఏడింటికల్లా హైదరాబాదు చేర్చింది. 

   తెల్లగా తెల్లారేపాటికి కూకట్ పల్లిలో దిగి అక్కడికి వచ్చిన అన్న స్నేహితుడి సాయంతో,  కొండాపూర్ చేరుకున్నారు రామి కుటుంబం. అక్కడ కట్టుబడి జరుగుతున్న పెద్ద అపార్టుమెంటులోనె వారికి ప్రస్తుతం పని. ఆ పరిసరాల్లోనే క్రింద ఓ మూలగా సిమెంటు బస్తాలు కుట్టిన పెద్ద పరంజా ఒకటి ఇచ్చి ఇవాళ గుడిసె వేసుకుని సామాను సర్దుకోమనీ, ఇవాళ ఆదివారం కనుక పని ఉండదని, రేపటినుంచీ పనికి రావలసి ఉంటుందని చెప్పి  వెళ్ళిపోయాడతను. 

      అక్కడ అప్పటికే తమ లాగ గుడిసెలు వేసుకున్న పది కుటుంబాలదాకా ఉన్నాయి. అయితే వాళ్ళు మనబాస కాదు. కొంతమంది బీహారు నుంచీ కొంతమంది రాజస్థాను నుంచీ వలస వచ్హిన వాళ్ళువాళ్ళందరూ వచ్చీరాని తెలుగులో సగం సైగలతో పలకరించారు వాళ్ళని. “ఓర్నాయనో ..ఈడ అంతా అరవమేళం పలకరించే దిక్కు కూడా లేదొదినో ఎట్టా గో ఏమో” వదినతోటి  వాపోయింది రామి. 

     చుట్టు పక్కల మురికికంపు కొడుతూ చిత్తడి చిత్తడి గాఉన్న పరిసరాలని చూస్తుంటే వాంతొచ్చినంత పనైంది రామికి. పొద్దుటే పేడ కళ్ళాపి  చల్లి అందంగా ముగ్గుపెట్టిన తమ వాకిలి గుర్తొచ్చింది. నిట్టూరుస్తూ నలుగురూ ఓపికున్నంతలో పరిసరాలు శుభ్రం చేసుకున్నారు. కాల కృత్యాలు తీర్చుకోవటానికి కనీస వసతులు కూడాలేవు. మొఖాలు కడిగామనిపించి టీ చుక్క కోసం రోడ్డవతలున్న టీ బండి దగ్గరకువెళ్ళి తలా పది రూపాయలిచ్చి నీళ్ళ టీ తాగారు. 

          నెమ్మదిగా అక్కడేఉన్న కర్రలు తీసుకుని, ఇద్దరికీ రెండు డేరాలు తయారు చేసుకునే సరికి, కడుపులో ఎలికలు పరిగెట్టటం మొదలుపెట్టాయి. నిన్న తెచ్చుకున్న సద్దిలోనే ఉల్లిపాయ కొరుక్కుని నాలుగు ముద్దలు తిని సామాన్లు సర్దుకునే సరికి రెండు గంటలైపోయింది. ఈలోగా మగవాళ్ళు హోటలు వెతుక్కొని భోజనం పార్శిలు కట్టించుకొచ్చేరు. ఒక భొజనం ఇద్దరు సర్దుకోని తిన్నామనిపించి, “అమ్మో ఇయాళ అన్నం కర్సు రొండొదలా రేపటినించీ ఒండుకుతినాల …ఇంత కర్సు  బరాయించలేం సామీ ” అని నిర్ణయించుకుంది రామి. 

            రాత్రికి రెండురొట్టెలతో సరిపుచ్చుకొని ,ముసురుకొంటున్న  దోమలమధ్యన తెల్లవార్లూ కంటికి కునుకు లేకుండా గడిపారు. ఎనిమిది గంటల నుంచీ ఒక్కొక్కరే పనివాళ్ళు రావటం మొదలెట్టేరు. టిపిను కారేజులు పట్టుకుని చాలా మంది ఆడవాళ్ళూ మగవాళ్ళూ వచ్చేరు. వాళ్ళు తెలుగు మాట్లాడటం చుసీ వాళ్ళ యాస చూసీ అంతా మనోళ్ళే మనేపు నించొచ్చినోళ్ళే అని సంతోష పడింది రామి.  

అందరినీ నుంచో బెట్టి చెయ్యాల్సిన పనులూ,ఎవరెవరు ఏ అంతస్తులో కట్టుబడి చెయ్యాలో చెబుతున్నాడు సూపర్వైజరు మల్లేశు. నారాయణకు, రమేషుకూ కట్టుబడి రాదు కనుక సిమెంటు అందించే పనీ, ఆడాళ్ళకు ఇటుకలు మోసే పనీ అప్పగించారు. మెట్లు ఎక్కుతూ దిగుతూ అనుకుంది రామి. “కష్టం ఆడాళ్ళ కెక్కువా కూలి మాత్రం తక్కువా …పని ఇద్దరికీ సమాన మైనప్పుడు కూలెందుకు తగ్గించాలి. ఆడాళ్ళ మీద అందరికీ చిన్నసూపే,ఇళ్ళ కాడైనా పని కాడైనా ” అనుకుంటూ నిట్టూర్చింది. 

          “అన్నకు సదువబ్బలా ..ఎనిమిదో తరగతిలోనే బడి మానేసాడు. తనుమాత్రం పది వరకూ చదివింది. ఒంగోలు పోయి ఇంటర్ చదువుతానంటే,అమ్మఒప్పుకోలా “సాల్లే ఇదే ఎక్కువ. నా తమ్ముడికి అసలు సదువులేదు. ఇంకా కాలేజీ సదువుకూడా సదివితే ఆడికి పెళ్ళి ఎప్పటికి  గావాల. మా అమ్మ ముసిల్దైపోయింది. కట్టపడాలన్నా అమ్మకు చెయ్యి సాయం లేదు. ఇప్పటికే పొలం పోలేక పోతాంది. గొడ్డూ గోదా సూసుకునే వాళ్ళు లేరు. అని వెంటనే మావయ్యకిచ్చి పెళ్ళి చెసేసింది. 

           ఆలోచిస్తూ దిగుతున్నరామి, ఎదురుగా మనిషిని గమనించుకోక అధాటుగా గుద్దేసింది. రెండుచేతులూ నడుమ్మీద పెట్టుకునిలబడిన సూపర్వైజరు మల్లేశాన్ని  చూసి “అయ్యో సూళ్ళేదయ్యగారూ ..” నెమ్మదిగా అంటూ దిగిపోయింది. కానీ అమెనే గమనిస్తున్న సూపర్ వైజరు వాలకం నచ్చలేదామెకు. ఆరోజంతా అక్కడక్కడే తిరుతున్న మల్లేశం  చూపులనుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది రామి. ఆ ఇబ్బంది కరమైన పరిస్థితి ఎదుర్కోవటం చాలా కష్టమనిపించింది ఆమెకు. మగనాలిగా ఇంట్లో గౌరవం అనుభవించి పొట్టచేత బట్టుకుని బైటకొచ్చినందుకు మొదటిరోజే ఇదేంటి భగవంతుడా! అనుకుంటూ ఆరోజు గడిపేసింది రామి. 

                మర్రోజు పొద్దుటే లేచి, పాలపేకెట్ తెచ్చుకుని అన్నిటీ తాగి మిగిలిన పాలు తోడేసుకుంది. కంపుకొడుతున్న పాలతో కాచిన టీ గొంతు దిగలేదు రామికి. ఇంట్లో ఎర్రబర్రె అంత రుచి కరమైన పాలిచ్చేది. కమ్మటి డికాషన్ కాఫీ తాగితే రోజంతా సత్తువ వొచ్చినట్టుండేది. పిల్లలకు కూడా కమ్మని పాలిచ్చి బడికి పంపేది. వెన్న చిలికిన మజ్జిగ ఉదారంగా పంచేది. కడుపుకు తిన్నంత తిని నలుగురికి పెట్టిన చెయ్యి. పాడీ పంటా గొడ్డూ గోదా కలిగి గౌరవంగా బతికిన ప్రాణం. ఈ కష్టమేంది భగవంతుడా!!  అని ఒకటే మనసులో వాపోయింది రామి. 

    నెమ్మదిగా వారం గడిచింది. శనివారం సాయంత్రం కూలీ బట్వాడా చెస్తున్నారు. అందరూ లైన్ లో నిలబడి కూలీ తీసుకుంటున్నారు. రామీ!  పిలిచాడు సూపర్వైజరు ఇదుగో ఏడురోజులకీ 2,450. అని డబ్బులు చేతిలో పెడుతూ తడుముతున్న అతని వేళ్ళ స్పర్శ ఏదోలా అనిపించి టక్కున చెయ్యి వెనక్కు లాక్కుంటూ డబ్బు తీసుకుని అక్కడి నుంచి విసురుగా వెళ్ళి పోయింది రామి.  

                తరువాత “ఎందుకలా వచ్చేసావ్ సంతకం పెట్టకుండా ..అని పుస్తకం తీసుకుని వచ్చిన నారాయణ చేతిలోని బట్వాడా ఎక్కౌంటు పుస్తకం లాక్కుని ‘రామలక్ష్మి ‘అని సంతకం పెట్టి ఇచ్చేస్తూ, పక్కనే మొగుడి వేలి ముద్రని చూసి విసుక్కుంటూ, “సంతకం నేర్చుకో. మంటే నేర్చుకోవు సదువు లేకపోతే పాయె సంతకం పెడితేనన్నా గౌరవంగా ఉంటది కదా ” అంది రామి. నవ్వేస్తూ “సదువునాకు అచ్చిరాదు లేవే ” అనుకుంటూ, పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు నారాయణ. 

                తెల్లారింది ఆరోజంతా సందడిగా ఉంది. పదిహేను రోజులకి ఒకసారికూలి ఇస్తారు. ఇంక ఆరోజు వెళ్ళి కావలిసిన ఉప్పూ పప్పులూ, కూరగాయలూ తెచ్చుకుంటారు కూలీలు. ఇన్స్టాలుమెంట్ లో బట్టలు అమ్మేవాళ్ళూ, స్టీలు సామానులు అమ్మేవాళ్ళూ, చిన్న చిన్న బీరువాలూ లాంటివి అమ్మేవాళ్ళూ, ఇంకాలాటరీ టిక్కెట్లు అమ్మేవాళ్ళూనూ.వీళ్ళే కాక కూలీలు చేసిన అప్పులకి వడ్డీలు వసూలు చేసే వాళ్ళతోటీ అక్కడ అంతా చాలా సందడిగా ఉంది. రోజు కూలీ తెచ్చుకునే వీళ్ళ మీదకూడా ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారో అని ఆశ్చర్య పోయిని రామి. ఇంటికి ఫొను చేసి పిల్లలతోనూ, అమ్మమ్మ తాతలతోనూ మాట్టాడింది. 

      దిగులు కళ్ళతోటి కూచున్న రామిని ఓదార్చాడు నారాయణ. “తట్టుకోవే ! ఒక్క పదినెల్లు ఓర్సుకో. అప్పుతీరిపోద్ది. ఈలోగా ఆదేముడు దయజూత్తే నాలుగు వానలు పడకపోవు. సద్దలూ, రాగులన్న పండుతై. మన ముద్ద మనం తినొచ్చు. అప్పుల భారం లేకపోతే మారాజు బతుకు కదే మనది. పిల్లలకు దూరం జేసి, ఊరికి దూరం జేసి నిన్నుకూడా కట్ట పెడతన్నా!  పోనీ నువ్వూ మీ వొదినా ఎల్లిపోండి. నేనూ రమేషూ ఎట్టాగొట్ట పనిజేత్తాం. పదినెల్లు కాపోతే ఇంకోపదినెల్లు. ఈ కాత్త అప్పూ తీరిపోనీ, కుదువబెట్టిన నీ పుస్తెలతాడూ, నల్లపూసలూ మళ్ళా ఏటికి నీ మెళ్ళో ఏస్తా. “నారాయణ రామిని తిరిగి వాస్తవం లోకి తెచ్చే ప్రయత్నం చూసి చిన్నగా నవ్వింది కానీ, బిడ్డల్ని తలుచుకుని ఆ తల్లిమనసులోనే కుమిలిపోయింది . 

       రోజులు గడుస్తున్నై, పట్నంలో మూడురోజులుగా ముసురు పట్టి ఒకటే కురుస్తున్నది వాన. డ్రైనేజులు పొంగి గుడిసెల్లోకి మురుగు నీరు ప్రవహిస్తోంది. కూలీల్లో పసిపిల్లలందరికీ జొరాలు పట్టుకున్నై. అడవిగాచిన వెన్నెల్లా పట్నం లో వృధాగా కురుస్తున్న వానని చూస్తుంటే రామికి చాలాబాధగా అనిపిస్తోంది. నెర్రెలు విచ్చి  బీళ్ళుగా మారిన తమ పొలాలు గుర్తుకొస్తున్నై. “భగవంతుడా! అవసరమైనచొట నాలుగు చినుకులు రాలటం లేదు. మోరీలు పొంగేలా ఈ వానలేందో తండ్రీ ” అని విసుక్కుంది. ఆ రోజు వానకి చాలామంది పనివాళ్ళు రాలేదు. రామీ, ఇంకా కొంతమందినీ పనులకు పురమాయించాడు సూపర్వైజరు. 

    ఒక అంతస్తు నుండి  ఇంకో అంతస్తులోకి ఇటికెలు మోస్తున్న రామిని ఒంటరిగా ఉండటం గమనించి దగ్గరగా వెళ్ళాడు సూపర్వైజర్ మల్లేశం. వెకిలిగా మాట్లాడుతూ చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేసాడు. విదిలించి కొట్టి, “చూడు సామీ !నీకూ అక్కా సెల్లీ, అమ్మా ఆలీ ఉన్నారనే అనుకుంటున్నా. ఇదే మావూర్లో అయితే అన్నా అని ఒక్క కేకపెడితే పదిమంది వొచ్చి చితక కొట్టేవాళ్ళు నిన్ను. ఇప్పుడైనా నేను ఒక్కమాట చెబితే నా అన్నా, పెనిమిటీ నిన్ను సంపి పాతిపెడతారు. ఎగసాయం చేసుకునే రైతులం. కాలానికి చిక్కి ఈ పనికి తలవొంచేం. అందుకని అలుసు తీసుకోమాకు. ఇంకోపాలి ఈ తప్పుజరిగిందంటే నీ ఆలి ముండమోసినట్టే” అని తలమీది బొచ్చె కిందపడేసి విసురుగా వచ్చేసింది అక్కడినుంచి రామి. 

      అతను కూడా భయపడ్డట్టే అనిపించింది. బండిమీద అక్కడినుంచి వేగం గా వెళ్ళి పోయాడు. వాడికి తను లోకువ అయినందుకు రామికి ఆరోజంతా ఉడికిపోయింది మనసు. మొగుడికీ అన్నకీ చెబుదామనిపించినా, వాళ్ళేమి బాధపడతారో, తనను తిరిగి ఇంటికి పంపించి భర్త ఒక్కడే కష్టపడతాడేమో. అసలు ఆ సూపర్వైజరు గాడు తనమీదే తప్పు తోసేస్తే అందర్లో అభాసు పాలౌతానేమో అన్న భయం వెంటాడింది. దగ్గరకు రాబోయిన మొగుణ్ణి విసిరికొట్టి వెక్కిళ్ళు పెట్టి యేడుస్తున్న రామిని చూసి ఇంటిదిగులేమో అని అటుతిరిగి పడుకుండిపోయాడు నారాయణ. తెల్లవార్లూ కంటిమీద కునుకు లేదు రామికి. ఇంకో సారి ఇలాంటితప్పు జరిగితే అప్పుడు అన్నకీ మొగుడికీ చెప్పొచ్చు. ఇప్పటికి బెదిరించాను కనుక అంతా సర్దుకుంటుంది లెమ్మని మనసుకు సర్ది చెప్పుకుంది రామి. 

                              రామి రెండవ భాగం 

   రెండురొజులు పనికి వెళ్ళలేదు రామి. నలతగా ఉందని గుడిసెలోనే ఉండిపోయింది. తప్పదు కనుక తలవంచి మూడోరోజునించీ తిరిగి పన్లోకి వెళ్ళిపోయింది.  రామి వచ్చిన దగ్గరినుండీ తోటి ఆడవాళ్ళతో మాటలు కలుపుతూ చిన్న చిన్న హిందీ మాటలు నేర్చుకుంది. ఇప్పుడిప్పుడు వాళ్ళ భాష పూర్తిగా అర్ధమవుతుంది రామికి. కొంచెం కొంచెంగా బదులుకూడా చెప్పగలుగుతోంది. రోజూ పనికివచ్చే మిగిలిన ఆడవాళ్ళు కూడా కలిసి కూర్చొని అందరూ అన్నాలు  తినేవేళ చిన్నగా సాటి ఆడవాళ్ళతో తన కష్టం చెప్పుకుంది.కాస్తోకుస్తో తేడాగా అందరి అనుభవాలూ అలాగే ఉన్నాయి. కాకపోతే తనపట్ల ఇంకాస్త ఎక్కువగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు వాడు. “బైటికొచ్చిన ఆడదంటే ఎంత అలుసు ! ఎదవలకి ఇళ్ళలో పెళ్ళాలు పతివ్రతలుగా ఉండాల. కనపడ్డ ఆడదల్లా ఒళ్ళోకి రావాల ” కసిగా అనుకుంది రామి. 

      మల్లేశం  కొన్నాళ్ళు బుద్దిగానే ఉన్నాడు కానీ అతని చూపులు  మాత్రం నిర్లజ్జగా రామిని తడమటం మానలేదు. ఆడాళ్ళ మాటల్లో రోజుకూలీ ప్రసక్తి తెచ్చింది రామి. “మగాళ్ళతోపాటు కష్ట పడుతున్నాం. ఆళ్ళకి అయిదొందలు మనకి మరీ మూడొందలాబై ఏంది? పోనీ కట్టుబడి పని మనకి శాతకాకున్నా! మరీఇంత తేడానా? అందరం కలిసి అడుగుదాం  ఆడాళ్ళ కు కూడా కూలి పెంచమని అని ఆడవాళ్ళకి చెప్పి ఒప్పించింది. మళ్ళా బట్వాడా రోజు అందరూ ఎక్కౌంటెంటు ముందు నిలబడ్డారు మాట్లాడటానికి అందరూ రామినే ముందుకు తోసారు .

                  రామి కూలి సంగతి అడుగుతుండగానే ..ఎక్కౌంటెంటు కంటే ముందు సూపర్వైజరు ఇంతెత్తున లేచాడు. “మేమిచ్చే కూలి ఇంతే, ఇష్టమైతే  చెయ్యండి. కష్టమైతే మానుకోండి. మాకు పనివాళ్ళు కావాలంటే శానామంది దొరుకుతారు. ఈడ గ్రూపులు కడితే కుదరదు. కూలి నచ్చనోళ్ళు రేపటినించీ పనిలోకి రావద్దు. నారాయణా నీ పెళ్ళానికి కాస్త బుద్ది చెప్పుకో. అయినా మొగోళ్ళు శాతగానోళ్ళయితే ఆడంగులిలాగే రచ్చకెక్కుతారు”. అంటూ నారాయణను మందలించాడు. 

    నారాయణకు రోషం పొడుచుకొచ్చి “రామీ నువ్వు నోరుమూసుకొని పాయే” అని రామిని ఒక్క గదుము గదిమాడు. “అదికాదయ్యా ఆడోళ్ళ కట్టానికి తగిన కూలి సూసి ఇమ్మంటన్నా ” అని రామి  చెబుతుండగానే నారాయణ నలుగుర్లోతన మాటేదో మీరిందని రామి చెంప ఛేళ్ళు మనిపించాడు. అతని ప్రేమ రుచేగాని దెబ్బ రుచి ఎరుగని రామి నిర్ఘాంత పోయింది. మండిపోతున్న చెంపమీద చెయ్యి పెట్టుకొని మొగుడి ముఖం లోకి చూసింది. తొందరపాటు తనానికి పశ్చాత్తాపపడుతున్నట్లు రామి కళ్ళలోకి చూడలేక తలవంచుకున్నాడు  నారాయణ. వెంటనే మల్లేశం వైపు చూసింది. వాడి కళ్ళలో స్పష్టమైన ఆనందమేదో తొణికిసలాడుతోంది. మిగిలిన ఆడాళ్ళు తలవొంచుకుని పక్కకు తప్పుకున్నారు. రామి అవమానాన్ని తట్టుకుంటూ జారబొయిన కన్నీళ్ళు బలవంతంగా ఆపుకుంది. 

       ఇంటికొచ్చేక మొగుడితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు రామి. ఆరోజు సందేళ బైటికెళ్ళిన నారాయణ పొద్దుపోయినా రాలేదు. అన్న తో కలిసి వెళ్ళాడేమో అని వొదినెను కేకేసింది. అన్న ఇంట్లోనే ఉండటం చూసి ఎక్కడికెళ్ళాడో అని దిగులు పడింది. అన్న అక్కడాఇక్కడా వెతికి కనపళ్ళేదని తిరిగొచ్చాడు. బాగా పొద్దుపోయాక ఆటో చప్పుడు విని చటుక్కున బైటికొచ్చింది రామి. సూపర్వైజరు మల్లేశం  మొగుడిని భుజాలమీద చేతులేసి తెచ్చి గేటుముందు దింపటం చూసింది. నాలుగడుగులేసి ధబ్బున ముందుకు పడ్డాడు నారాయణ. రామికేకలకి అన్నా వదినా పరుగెత్తుకు వచ్చారు. 

       బాగా తాగున్నాడు నారాయణ. “నేను మొగొణ్ణే, తంతా, పొడుస్తా నాయిష్టం నోరుమూసుకోని పడుండు. సంపుతా నీ ….ఇంకా ఎవో బూతులు గొణుగుతూనే ఉన్నాడు. ఎన్నడూ తాగని మనిషి! పల్లెత్తి ఒక మాట మాట్లాడని మొగుడు! ఈరోజు తన్నటమే గాక, తాగి వచ్చిందేకాక, మైకంలో కూడా  అసభ్యం గా మాట్లాడటం రామిని ఎంతో కలచివేస్తోంది. వాడు ఆ సూపర్వైజరు మల్లేశం గాడు కావాలనే ఇదంతా చెస్తున్నాడన్న ఆలోచన రాగానే భయం తో వణికి పోయింది రామి. తల్లి వొడిలాంటి పల్లె విడచి కాని చోటికి వచ్చామేమోనన్న బాధ ఆమెను కలచివేసింది. 

    డబ్బు అవసరం కూలి పనికి దిగజార్చినా, మనుషి గా దిగజారాల్సిన అవసరం మొగుడికి ఎందుకొచ్చిందో అర్ధం కాలేదామెకు. కాసిని మజ్జిగనీళ్ళు తాగించి ఆరోజుకి అన్నావొదినెలను సాయం పడుకో మంది. తెల్లారి బారెడు పొద్దెక్కినాక గానీ  లేవలేదు నారాయణ.లేస్తూనే మొగుడితో పోట్లాట పెట్టుకుంది రామి. ఎన్ని చివాట్లేసినా తలవొంచుకు కూర్చొని సమాధానం చెప్పలేదతను. కాసేపటికి మల్లేశం గుడిసెబైటికొచ్చి నారాయణా !అని పిలవగానే నాగస్వరం విన్న నాగులా చటుక్కున లేచి వెళ్ళిపోయాడు. 

   అలా వారానికోసారి మందుతాగట, పొద్దుపోయి ఇంటికొచ్చి రామిని తిట్టటం అలవాటైపోయింది నారాయణకు. మొగుడికి మందుకొట్టిచ్చిన మర్నాడు వలలో పడి గిలగిల కొట్టుకుంటున్న మృగం వంక వేటగాడు చూసినట్లుగా ఉన్న మల్లేశం  చూపులు తట్టుకోవటం కష్టం గా ఉంది రామికి. ఒకరోజు అందరూ పనుల్లో మునిగి పోయి ఉండగా హడావుడిగా అందరినీ కిందకురమ్మని కేకేసాడు మల్లేశం . ఆరోజు ఆకన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ గారి పుట్టిన రోజట. ఎప్పుడో వొసారి గానీ రాడాయన. ఆరోజు మల్లేశం  హడావుడి అంతాఇంతాకాదు. ఎవ్వరినీ కారు దరిదాపుల్లోకి కూడా పోనీయడు.

   ఈరోజు అయనకోసం కింద పుట్టినరోజు సందర్భంగా చిన్న సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయనే కూలీల సమక్షంలో కేకు కట్ చేస్తానంటే అందరినీ కేకేసాడు. అందరిలొను కేకు కట్చేసి అందరికీ పంచమని కారెక్కబొతుంటే రామి గట్టిగా “సార్ ” అని కేకేసింది. అందరు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. మల్లేశం  వారిస్తున్నా ఆగకుండా మళ్ళీ కేకేసింది రామి. చైర్మన్ కార్లోకి ఎక్కబోతూ వెనుదిరిగి చూసాడు. నేనే కేకేసానన్నట్లు చెయ్యి పైకెత్తిన రామిని రమ్మన్నట్లు చెయ్యివుపాడు. 

    పరుగెత్తుకుంటూ  వెళ్ళిన రామి వచ్చీరాని హిందీలో ఆడవాళ్ళ పనిలో కష్టాలు చెప్పింది. పక్కనే ఉన్న మేనేజరు “పర్లేదమ్మా ఆయనకు తెలుగు వచ్చు తెలుగులో చెప్పమనగానే,’తమబాధలు చెప్పి కూలి పెంచమని కోరింది. చైర్మన్ ఒక్కనిముషం ఆలోచిస్తున్నట్లు నిలబడి వెనక్కివచ్చి రామి అభ్యర్ధనను మన్నిస్తున్నాననీ, కానీ తనుకోరినట్లు సమానం గా కూలి  ఇవ్వటం కుదరకపోయినా,ఆడవాళ్ళకు తన పుట్టినరోజు కానుకగా ఇంకో యాభై రూపాయలు పెంచుతున్నాననీ ఈరోజునించీ ఆడవాళ్ళకు రోజుకి 400 రూపాయల కూలీ అని ప్రకటించగానే ఆడవాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. మల్లన్న మాత్రం కసిగా పెదవులు కొరుక్కుంటూ చేసేదేమీ లేక ఛైర్మన్ ను సాగనంపటానికి వెళ్ళాడు. నారాయణ పెళ్ళాం ధైర్యానికి మనసులోనే మెచ్చుకున్నా, బైటకు మాత్రం గంభీరంగా ఉండిపోయాడు. 

        రామీ వాళ్ళు పట్నమొచ్చి దాదాపు ఆర్నెల్లు గడిచాయి . మధ్యలో ఒకటిరెండు సార్లు అన్నా, మొగుడూ ఇంటికి వెళ్ళి చూసొచ్చారు దసరా పండగకు అందరూ పదిహేను రోజులకు పనికి శలవ తీసుకుని వాళ్ళ సొంత ఊర్లకు ప్రయాణ మయ్యారు. రామికి చాలా సంతోషం గాఉంది. కొడుక్కీ కూతురికీ బట్టలు కొన్నది. అమ్మకీ, అమ్మమ్మకీ చీరెలు కొని సంతోషం గా ఊరు చేరింది. తెల్లారేపాటికి ఊర్లోకి వచ్చిన రామికుటుంబానికి చల్లని స్వచ్చమైన గాలి స్వాగతమిచ్చింది. గుండెలనిండుగా ఉపిరి పీల్చుకోగానే వెయ్యెనుగుల బలమొచ్చినట్లుగా అనిపించింది రామికి. 

        చుట్టేసుకున్న కొడుకునీ కూతుర్నీ దగ్గరగా హత్తుకుని కన్నీరు కార్చింది రామి. అమ్మనీ తాతనీ పలకరించి చిక్కని కాఫీ కలుపుకుని తాగి, అప్పుడు ఇల్లు కలజూసుకోని ,ఇన్నాళ్ళూ తను లేకపోవడం మూలాన చిందరవందరగా ఉన్న ఇంటిని సర్దుకుంది. ఆ పదిహేనురోజుల్లో పట్నాన్ని పూర్తిగా మర్చిపోయింది రామి. అప్పుకూడా కొంత తీరిపోయింది. అక్కడ తాగుడు గురించి మర్చే పోయాడు నారాయణ. రామికూడా కుటుంబంలో నారాయణ తాగుడువిషయం చెప్పలేదు. 

          అన్నమాత్రం తల్లికి చెప్పినట్లుగాఉంది. చివరి రోజు భోజనానికి పిలిచి కంచలో వడ్డించి తమ్ముడి పక్కనేకుర్చొని “మన ఇంటావంటాలేని ఈ అలవాటు ఏంది తమ్ముడూ. ఇల్లూ వాకిళ్ళు వదిలేసి కష్టం చేసుకుంటున్నారు. డబ్బువృధా చెయ్యమాకు. ఇప్పుడువాడు వూరకనే మందుపోయించినా ఆనక  అలవాటయితే పొలం పుట్రా అమ్ముకోవాల్సివస్తుంది. నిన్నుజూసి పిల్లలు పాడైపోతారు తమ్ముడా, అలవాటు మానుకోయ్యా” అని సుద్దులు చెప్పింది. 

      వచ్చేముందురోజు గడ్డి బలిసిపోయి, తుమ్మలు మొలిచిన పొలాన్ని చూసి రామీ, నారాయణా ఎంతో బాధపడ్డారు. మళ్ళా ఈ పొలం సాగులోకిరావాలంటే పాతిక వేలైనా పడుతుందనుకున్నారు. ఆపొలం చుస్తుంటే గుండె చెరువయింది  రామికి. “మళ్ళా సాగులోకి తేగలమంటావా మామా ” అంది నీళ్ళు నిండిన కళ్ళతో. కన్నీళ్ళు తుడుస్తున్న మొగుడితో చెయ్యి పట్టుకుని “ఇక్కడ కంటితడి తుడుస్తా పట్నంలో ఏడిపిస్తన్నావేంది మామా? ఆ మందులో ఏముంది? అసలే బతికి సెడ్డ కుటుంబం, సెడి పోయి బతకొద్దు మామా ఇంక తాగితే పిల్లలమీదొట్టు” అని వెక్కివెక్కి ఏడ్చింది. నారాయణ కూడా “ఇంకెప్పుడూ తాగనే”  అని వొట్టుపెట్టాడు. 

      పదిహేనురోజులు నిమిషాల్లాగడిపి మళ్ళీ అందరూ హైదరాబాదు  చేరారు. అందరూ పనుల్లో పడిపోయారు. నారాయణని ఓరోజు సాయంత్రం మల్లేశం పిలిచాడు అలా పోయొద్దాం రమ్మని, ఒంట్లో బాలేదని తప్పించుకున్నాడు నారాయణ. పట్టు ఒదలకుండా ఓ మూడురోజులు వెంటపడినా రాలేదు నారాయణ. మల్లేశానికి ప్లాను బెడిసికొట్టినందుకు కసిగాఉంది. రామి చేతులోంచి జారిపోతున్న చెపపిల్లలా ఊరిస్తోంది మల్లేశాన్ని. 

        ఓ రోజు పొద్దున్నే  మూలగా ఇటికెలు సరిచేస్తూ అక్కడంతా శుభ్రం చేస్తున్న రామి ఒంటరిగా దొరికింది మల్లేశానికి. వెనగ్గావెళ్ళి నడుమ్మీద చెయ్యెసి గట్టిగా పట్టుకున్నాడు. బిత్తరపొయిన రామిని చూస్తూ “ఎంత పొగరేనీకు ఎప్పటికైనా నిన్నూ …..” అంటుండగానే రామి “ఆన్నో!మామో !రాండి రాండి “అని  బిగ్గరగా కేకలు వేసింది.అందరూ “ఏమైంది? ఏమైంది ” అని పరుగున వచ్చారు. 

పరువుకోసం గుట్టుగా ఉంటుందనుకున్న రామి అలా కేకలు పెట్టేసరికి మల్లేశం భయపడి వేగంగా అక్కడినుంచి తప్పుకున్నాడు. “తేలు !అన్నా…. పెద్ద తేలు! ఈ ఇటికెల్లోంచి బైటికొచ్చిందన్న రామి మాటలు నమ్మి అందరూ దానికోసం చాలాసేపు వెతికారు. 

    రామికి చాలా ఆవేశం  గానూ ఆవేదన గానూ అనిపించింది . వాడి చెయ్యి తగిలిన ప్రాంతాన్ని తన శరీరం నించి కోసి వేరు చెయ్యాలనేంత జుగుప్స కలిగింది. మగాళ్ళ వేధింపులను బయటికి చెప్పుకోలేని స్త్రీ బలహీనతే మగాడి బలం గా మారుతోంది. బాధతో ఉక్రోషం తో కన్నీళ్ళు వస్తున్నాయి రామికి. ఇంక ఉపేక్షిస్తే లాభం లేదనుకుంది. మొగుడి దాకా పోకుండా తన సమస్యను తనే పరిష్కరించుకోవాలనుకుంది. వాడికి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. అందుకోసం ఏంచెయ్యాలా అని ఆలోచించ  సాగింది. 

              రెండురోజులు గడిచాయి. మల్లేశం మాములుగానే తిరుగుతున్నాడు. నువ్వేమీ చెయ్యలేవు చూసావా అన్నట్టు వెకిలినవ్వు నవ్వుతున్నాడు. రామి కూడా తలవంచుకుని తప్పించుకు తిరుగుతోంది. ఆరోజు  శుక్రవారం మరునాడే బట్వాడా. నాలుగు గంటలవేళ మల్లేశం వచ్చాడు. ఎప్పట్లానే నాలుగో అంతస్తులో పనిచేస్తున్న రామిని చూసి వెకిలిగా నవ్వుతూ ఆడాళ్ళందరినీ తింగరిమాట ఏదో అని కిందికి వెళ్ళి పోయాడు. నెమ్మదిగా తొంగిచూసింది రామి. మూడో అంతస్తులో మెట్లగోడ దగ్గర నిలబడి ఒకచెయ్యి గోడమీదపెట్టి,  ఇంకోచెతులో సిగరెట్ కాలుస్తూ ఏదో మాట్లాడుతున్నాడు మల్లేశం. 

      నెమ్మదిగా ఐదో అంతస్తులోకి వెళ్ళింది రామి. చుట్టూ చూసింది. ఎవరి పని హడావుడిలో వాళ్ళు ఉన్నారు. మాటువేసిన పులిలా ఉన్నరామి అవకాశం వదులుకోదల్చుకోలేదు. “తన నడుమ్మీదేకాదు,ఇంక ఏ ఆడదాని మీదకూడా ఆచెయ్యి వెయ్యాలంటే భయపడాలి వెధవ” అనుకుంది. కొంగుచాటునుంచి తీసిన రెండు ఇటుకలూ ఒక్కసారే గురిచూసి జారవిడిచింది.”అమ్మో !!” అన్న మల్లేశం గాడి కేక అక్కడ ప్రతిధ్వనించింది. “అయ్యయ్యో ఏమైంది” అంటూ అందరూ అటుగా పరుగెట్టేరు. రామికూడా అందరితో ఏమీ ఎరగనట్లు దిగివచ్చింది. 

     మల్లేశం చెయ్యి మోచేతినించి క్రిందకు వేళ్ళాడుతోంది. వేళ్ళు పచ్చడై రక్తం ధార కడుతోంది. అంబులెన్సుకు ఫోనుచేసేరు. డాక్టర్లు చూసి  మోచేయ్యి బాగా దెబ్బతిన్నది. ఆపరేషన్ చేసి రాడ్లు వెయ్యాల్సొస్తుంది. వేళ్ళు కూడా చితికిపోయాయి పనిచెస్తాయోలేదో తెలియదు . వెంటనే హాస్పిటల్ కితీసుకువెళ్ళాలి అన్నారు. అప్పుడు నవ్వింది రామి మల్లేశం కళ్ళలోకి చూస్తూ ఎరనుమింగిన చేపలాగా. మల్లేశం షాక్ తోటి “నువ్వు ,నువ్వు!!” అంటుండగానే ….అందరూ సాయం పట్టి అంబులెన్స్ ఎక్కించారు. 

     మర్రోజు మేనేజర్ వచ్చాడు. ఈరోజు బట్వాడా ఎలా అంటుంటే రామి ముందుకొచ్చి “నేను చూసుకుంటానయ్యా ” అంది. లెక్కలు ఎలా అని సందేహపడుతుంటే, నేను పదోతరగతిదాకా చదువుకున్నానయ్యా అనిచెప్పింది. ఆరోజుకు తనుచూసి అందరికీ డబ్బులు ఇప్పించింది. తరువాత అక్కౌంటు పుస్తకం గుడిసెకు తీసుకెళ్ళి చూస్తుంటే, లొసుగులు తెలిసాయి రామికి. దాదాపు వందమంది పనిచేసే ఇక్కడ రోజూ కనీసం నాలుగు కూలీలన్న ఎక్కువ రాసుకుంటున్నాడు సూపర్వైజర్  మల్లేశం. 

    అంటే రోజుకి రెండువేలు! నెలకు దాదాపు యాభైవేలు! ఆశ్చర్య పోయింది రామి. “అందుకే వెధవ అందరికీ ఊరికేమందు పోయించి చెడగొడ్తున్నాడు ” అని తిట్టుకుంది. మర్రోజు మేనేజర్ కి పుస్తకం చూపించింది. “సారూ రోజుకి దాదాపు రెండువేల రూపాయలు వృధాగా పోతున్నాయి. మల్లేశమూ, ఇంకా ఎక్కౌంటెంటూ ఇద్దరూ  కలవకపోతే ఇది జరగదు” అనిచెప్పింది. మేనేజరు ఆశ్చర్యపోయి, ఇకనుంచి నువ్వే లెక్కలు చూడు. పనులు ఎలాజరుగుతున్నాయో చూసుకో. మన చైర్మన్ గారికి చెప్పి జీతం మాట్లాడతా అన్నాడు. 

         ఒక వారానికల్లా  రామి ఆ అపార్టుమెంటుకి సూపర్వైజర్ అయ్యింది. నెలకు ఇరవైవేల జీతంతో. “ఇంకో పదినెలలు ఇక్కడే కట్టుబడి పనులు ఉన్నాయి. ఈ పదినెల్లూ పనిచేయండి. తరువాత ఇంకో అపార్ట్ మెంటుకి మారుస్తా” అన్నాడాయన. రామి సంతోషానికి అంతులేదు. నారాయణ కూడా “సదువు విలువేందో ఇప్పుడుతెలుసుకున్నానే, నాకూ సదువు నేర్పు” అన్నాడు. “ముందు సంతకం నేర్సుకో ఆనక సదువు” అందిరామి. “ఇంకో నాలుగు నెలల్లో మన అప్పుతీరిపోద్ది” ఇక్కడే ఉందామా కాస్త ఎనకేసుకోవచ్చు” అన్నాడు నారాయణ. 

          “వద్దుమామా ….ఈ బురదలో మోరీల్లో బతుకు మనకొద్దు. జీవితానికి డబ్బే ముఖ్యం కాదు. ఈ పదినెల్లూ గడిపేసి మనూరు పోదాం. పొలం బాగుసేయించుకుందాం. గొడ్డూగోదా పెంచుకుని. ఆరోగ్యంగా ఉందాం. పిల్లల్ని సదివిచ్చుకుందాం, పెద్దోళ్ళనీ కనిపెట్టుకొని ఉందాం. వానదేవుడు కరుణించకపోడు పల్లె కన్న తల్లి  లాటిది. ఎప్పుడైనా మనల్ని కడుపులో పెట్టుకుంటాది” అంది రామి మెరిసే కళ్ళతో.         

                      *****

Please follow and like us:

9 thoughts on “రామి (క‌థ‌)”

  1. ఎప్పుడో చదివాను, అలా గుర్తు వుండి పోయింది, ఒక పల్లె గృహిణి ఆత్మాభిమానం, అంతరంగం , నిక్కచ్చి తనం ఎంత బాగా రాశారు. ముగింపు చాలా బావుంది. పట్నవాసపు అలవాట్లు, డబ్బు రుచి మరిగి పల్లెల్ని వదిలే జనానికి కనువిప్పు. అభినందనలు.

    1. ధన్య వాదాలు వరప్రసాద్ గారు. నిజం గా పల్లెజీవనం లో ఒక నిబద్ధత ,ఆత్మాభిమానం ఉంటాయి. వాళనుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో …

  2. చాలా బాగుంది రామితోపాటుగా ఇటుకలు మోసినట్లు,మల్లేశం చూపులు మనల్ని తాకినట్లు అనిపించింది . చదువు విలువ ,బంధాలవిలువ తెలిపే కథ అభినందనలు.

    1. చాలా కాలంగా మీ పూనాచ్చి విశ్లేషణ కోసం వెదుకుతున్నాను. అనుకోకుండా ఈ రోజు దొరికింది. బావుంది మేడం.

    2. థాంక్యూ రాణెమ్మా. రామిలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆడవాళ్ళు పల్లెల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు

  3. Padmaja chaalaa manchi Katha.raithu polamlo kalupe kaadu theesivesedi chedda manushulalo koodaa ani chupincharu. Abhinandanalu.

    1. అవునండీ చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.