కనక నారాయణీయం –7

పుట్టపర్తి నాగపద్మిని

             తండ్రిగారు, తన చదువు గురించి పడుతున్న ఆరాటం గమనించాడు తరుణ నారాయణుడు!! ఆంగ్ల సాహిత్య పాఠాల గురించి తెలిసినా, తండ్రి గారి మనసులో, సాంప్రదాయక విద్య    కుమారునికి అబ్బటంలేదనే బాధ ఇంకా ఉండనే ఉంది. దానికి తోడు పిట్ దొరసాని ఆంగ్ల సాహిత్య వ్యవసాయానికి వేసిన కళ్ళెం!! నిజానికి ఆమె అలా అనకుండా ఉండి వుంటే, ఆ రోజుల్లోనే అదే తరహా కృషిని  కొనసాగించి ఉంటే, నారాయణాచార్యులవారు అంతర్జాతీయ స్థ్యాయిని అందుకుని ఉండేవారు కొద్ది రోజులకే!! కానీ..ప్రతి జీవి జీవితమూ విధిలిఖిత కథే కదా మరి!! పుట్టపర్తి జీవనది కూడా, దారి మళ్ళించుకుని మరీ విశాల క్షేత్రంలోకి ఉధృతంగా మళ్ళవలసిన తరుణం ఆసన్నమైంది.

         ఈ పరిస్థితుల్లో, శిరోమణి చదువే తరుణోపాయంగా తోచింది పుట్టపర్తి కి!! ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు వారు. శిరోమణిలో ప్రవేశాలు జరుగుతున్నట్టుగా మిత్ర బృందం ద్వారా సమాచారమందుకున్న మరు క్షణమే, తిరుపతికి వెళ్ళాలన్న తపన మొదలైంది.  

    శిరోమణి ప్రవేశాలు జరుగుతున్నాయని స్నేహితుడు పాముదుర్తి నారాయణ అందించిన సమాచారం తరుణ నారాయణున్ని కూర్చోనివ్వలేదు, నిల్చోనివ్వలేదు. ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళి వాలుదామా అన్న ఆరాటం!!

  తిరుపతికి వెళ్ళాలంటే ప్రయాణానికి డబ్బు కావాలి కదా!! పిన తల్లిని అడిగారు

  ఆ రోజుల్లో డబ్బు దాచుకునేందుకు ఇప్పటివలె గోద్రెజ్ బీరువాలు వంటివి వుండేవి కావు కదా!! తన జీతం రూపంలో వచ్చే వెండి నే\ఆణేలను తాతగారు శ్రీమాన్ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్యులవారు ఒక చిన్న మట్టికుండలో దాచి ఉంచేవారట!! ఆ కుండ ఆచూకీ చెప్పిందామె!!

  ఓ రోజు ఆ కుండలోని కొన్ని నాణాలు తీసుకుని జేబులో వేసుకుని, పినతల్లికి చెప్పి, తిరుపతికి చేరుకున్నారు తరుణ నారాయణులు.

 వాళ్ళనూ వీళ్ళనూ అడిగి, ఓరియెంటల్ కాలేజీ కి చేరుకున్నారు. 

  శిరోమణిలో ప్రవేశానికి, అప్పుడు, ఇప్పటిలాగా ప్రవేశ పరీక్షలంటూ ఉండేవి కావేమో!! సకల శాస్త్ర పారంగతులైన అప్పటి ఆచార్య వర్గం అంగీకారం ఉంటే చాల..ప్రవేశాం దొరికే పద్ధతి ఉండేవి. ఈ పద్ధతి గురించి తెలియగానే, ‘ఆ..అదేమంత పెద్ద పని, మా ఎం.ఎల్.ఏ తో ఓ మాట చెప్పిస్తే చాలు పనిపోదూ..’ అని ఇప్పట్లా జబ్బలు చరచే రోజులు కాదు కదా అవి!! పైగా ఆ ఆచార్యుల అంగీకారం దొరకాలంటే..అది ఆషా మాషీ వ్యవహారం కాదు. దేసమంతా తిరిగి తర్క, వ్యాకరణ, అలంకారం వంటి  శాస్త్రాల్లో విజయ భేరి మ్రోగించివచ్చిన ఆచార్యులౌ మెప్పించటమంటే మాటలా!! పైగా నిజాయితీ వాళ్ళ నరనరాల్లోనూ తిష్ట వేసుకుని వుంటుంది. అటువంటి వారు, తమ మనస్సాక్షి అంగీకరించకపోతే, శిరోమణి ప్రవేశానికి వచ్చిన మామూలు విద్యార్థినే కాదు, హేమా హేమీలవంటి శాస్త్ర పండితులనైనా తిరస్కరించే మనో ధైర్యం కలిగిన వారై ఉండేవారు అప్పట్లో!! ప్రస్తుతం, అంటే మనం పుట్టపర్తి వారి శిరోమణి ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్న కాలం 1929 – 30 గురించి చెప్పుకుంటున్నాం కదా!! అప్పుడు తిరుపతి ఓరియెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ కపిస్థలం  కృష్ణమాచార్యులవారుట!!

  ఎంతమందో వేసి ఉన్నారు ప్రవేశానికై!! చాలా మంది విద్యార్థులు తమ తండ్రిగారలతో పాటూ వచ్చారు. ఒంటరిగా పుట్టపర్తి వల వచ్చినవాళ్ళు చాలా తక్కువ. కొంతమంది ఉత్సాహంగానే వెళ్ళి, నిరాశగా తిరిగి వస్తున్నారు. కొంతమంది చాలా భయ భక్తులతో వెళ్ళి, ఆనందంగా బైటికి వస్తున్నారు. ఒంటరిగా వచ్చిన పుట్టపర్తి గురించి ఒకరిద్దరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే, పుట్టపర్తి మనసులో సంశయ స్థితి!! తన సంగతేమౌతుందో అని!!

  తర్క వితర్కాల మధ్య పుట్టపర్తి వారి వంతు వచ్చింది. గురు ముఖత: నేర్చిన పాండిత్యం కంటే, స్వతహాగా నేర్చుకున్నదే ఎక్కువ కాబట్టి, ‘మీ గురువుగారు ఎవరు..’ వంటి ప్రశ్నలకు సమాధానమివ్వలేకపోయారు పుట్టపర్తి. పైగా, బట్టలు  దుమ్ము కొట్టుకుని పోయి, తల వెంట్రుకలు చిందర వందరగా ఉండటం కూడ కపిస్థలం వారికి నచ్చకపోయి ఉండవచ్చు. ఫలితం – వారికి ప్రవేశం దొరకలేదు!!

    తిరస్కృతి సంగతి విన్న పుట్టపర్తి లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆశువుగా సంస్కృతంలో విస్ఫులింగాల  వంటి శ్లోకాలు గట్టిగా చెబుతూ బైటికి వెళ్ళిపోతున్నారు. లోపల గదిలోనే ఉన్న కపిస్థలం వారి చెవిన పడ్డాయీ శ్లోకాలు!! ‘ఎవరా శ్లోకాలు  చదువుతున్నది??’ గావు కేక పెట్టారాయన గదిలోనుండీ!! బైట కాపలాగా ఉన్న బంట్రోతు ఉలిక్కిపడి లోపలికి పరిగెత్తాడు గడ గడ వణుకుతూ!! ”కపిస్థలం వారడిగారు,’ ఎవరా శ్లోకాలు చెబుతున్నది?? వెంటనే పట్టుకురా!!’ మళ్ళీ పరుగులు. ఇంతకు ముందే, ప్రవేశం కోసం లోపలికి వెళ్ళిన ఆ స్ఫురద్రూపి అబ్బాయి, బైటికి వచ్చి, వెళ్ళిపోతూ, జేవురించిన ముఖంతో శ్లోకాలు అందుకోవటం, కళ్ళారా చూశాడా బంట్రోతు!! సులభంగానే  ఆ అబ్బాయిని పోల్చుకుని, ఆచార్యులవారు రమ్మంటున్నారని చెప్పాడు.

  ఆ అబ్బాయి కవితావేశాన్ని దగ్గరగా చూసిన అక్కడి పిల్లలలో చాలామందికి ఆ అబ్బాయి చెప్పిన శ్లోకాల్లో ఏముందో కూడ అర్థం కాలేదింకా!! పెద్దలకు కూడా అర్థమయ్యీ కానట్టున్నాయవి!! ఇంతలో మళ్ళీ ఆచార్యుల వద్దనుండీ, ఆ అబ్బాయి కోసం యీ పిలుపు!! ఇంతకీ, ఏదో ఉపద్రవం జరగబోతుందని అర్థమైంది, అక్కడున్న పెద్దలకు!! ‘హన్నా!! అంతటి ఆచార్యవర్యులను ధిక్కరిస్తూ వేలెడంత కూడా  లేని యీ బుడతడు, శ్లోకాలు చెప్పడమా!! వీడి అదృష్టం బాగాలేదు యీ రోజు!! ఆ ఆచార్యుల వారి చెవిన పడనే పడ్డాయిగా ఆ శ్లోకాలు!! యెంత ధైర్యం కాకపోతే, ఎక్కడో పెనుగొండ నుండీ, పెద్దల అండ దండలంటూ లేకుండా ఒంటరిగా శిరోమణి ప్రవేశానికి ధైర్యంగా వచ్చిందే కాకుండా, ప్రవేశం దొరక్కపోతే, మహా తనకే వచ్చినట్టు, ఏవేవో శ్లోకాలు ఆశువుగా చెప్పేయటం కూడా!! అక్కడున్నదెవరూ…మహామహోపాధ్యాయ కపిస్థలం వారు కాదూ!! పిల్లాడి తాట వదిలేలా చీవాట్లు వేసి, మళ్ళీ యీ గడప కి రావొద్దనేస్తారు తప్పక!!’

    వీళ్ళంతా ఆ అబ్బాయి వైపు, ఏదో తప్పు చేసిన వాడిలా చూస్తున్నారే కానీ, ఆ అబ్బాయిలో కాస్తైనా భయం లేదు. పశ్చాత్తాపమూ లేదు. ధైర్యంగా బంట్రోతుతో పాటూ కపిస్థలం వారి గదిలోకి అడుగు పెట్టాడా కుర్రాడు!! బంట్రోతును బైటికి వెళ్ళమన్నారు కపిస్థలం వారు.

  బైట ఉన్నవారిలో ఉత్కంఠ.

 ఇక లోపల …

  ‘నీ పేరేంటి??

  ఇంతకు ముందే చెప్పానుగా..అన్న పెంకితనం తరుణ పుట్టపర్తి కళ్ళల్లో!!

  అది గమనించిన ప్రిన్సిపల్ గారికి, ఆ వయసులోని వుడుకుమోతు తనం చూసి ముచ్చటేసింది. కారణం, యీ ఉడుకుమోతు తనం సంధించిన సంస్కృత శ్లోకాలింకా వారి చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి మరి!!  క్షమించేశారు. కానీ ఆ ఉడుకుమోతు తనాన్ని ఒక మంచి మార్గంలో పెట్టాలి కాబట్టి, అదే ప్రశ్నను మళ్ళీ సంధించారు. అప్పుడిక చెప్పక తప్పదనుకుంటూ..

  ‘పుట్టపర్తి తిరుమల నారాయణాచార్యులు..’

  ‘ఎక్కడినుంచి వచ్చావ్??’

  ‘విజయ నగరం వేసవి విడిది, పెనుగొండ, అనంతపురం జిల్లా నుండి..’

  ‘మీ తండ్రి గారు?’

  ‘పెనుగొండ పురపాలక పాఠశాలలో తెలుగు పండితులు.’

  ‘నీతో వచ్చారా??’

  ‘లేదు..’

  ‘ఎందుకు రాలేదు..’

  మౌనమే సమాధానం.

  ‘అది సరే..నీవింతకు ముందు గదినుండీ బైటికి వెళ్ళేటప్పుడు చెప్పిన శ్లోకాలు ఆశువుగా చెప్పావా?’

   ‘ఔను..’

  ‘అంత గంభీరమైన శ్లోకాలను అలవోకగా ఎలా చెప్పావ్??’

  అప్పుడిక ఆ అబ్బాయి, తన నేపథ్యం, తండ్రిగారి వల్ల కలిగిన సంస్కృతాంధ్ర సాహిత్య ప్రవేశం, రాళ్ళపల్లి వారి శిష్యరికంతో ప్రాకృత సాహిత్యాసక్తి, తాను వ్రాసిన పెనుగొండ లక్ష్మి పద్యాలూ- అన్నీ తడబడకుండా చెప్పేశాడు. కపిస్థలం వారికి ఆ అబ్బాయిని చూసి చాలా ముచ్చటేసింది. వెంటనే అనేశారు. ‘శిరోమణిలో నీకు ప్రవేశం దొరికింది..నీకిష్టమైన తరగతిలో చేరవచ్చు, రేపే!!’ అనేశారు.

  బైటికి వచ్చిన తరుణ నారాయణుని ముఖంలో విజయ హాస రేఖలు!!

  ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బైటివారిలో, ఆ అబ్బాయిని చూస్తూ ఒకటే ఆనందం!!

 అలా, పుట్టపర్తి వారి శిరోమణి ప్రవేశం కూడ ఒక అపురూపమైన సన్నివేశంగా చరిత్రలో నిలచిపోయింది!!

  ఇంక అప్పటినుంచీ  తరుణ నారాయణుని జీవితంలో స్వర్ణాధ్యాయం మొదలైంది. తిరుపతి ప్రాచ్య కళాశాలలో తర్క, అలంకార, వ్యాకరణశాశ్త్రాలు, వైష్ణవ శైవాగమాల పఠనంలో అలుపు లేని పథికుడయ్యారాయన!! అవధాన విద్యలోనూ ఆరితేరి చక్కటి అవధానాలూ చేసిన ఖ్యాతి గడించారు.అక్కడే ఉంటున్న శ్రీయుత మానవల్లి రామకృష్ణ కవి, చక్రవర్తి రాజగోపాలాచార్యులు, కపిస్థలం కృష్ణమాచార్యులవారు, నాగపూడి కుప్పు స్వామి వారు – ఇటువంటి మహనీయుల జీవితాలను గమనిస్తూ, అప్పుడప్పుడూ వరి వద్దకు వెళ్ళీ తన సందేహ నివృత్తి చేసుకుంటూ, ఏనాడైనా వారి వలె అఖండ జ్ఞాన సముపార్జన చేసి తీరాలని గట్టి నిర్ణయమే తీసుకున్నారు తరుణ వయసులోని పుట్టపర్తి. తక్కిన విద్యార్థులందరిలో లేని పుట్టపర్తిలో మత్రమే ఉన్న ప్రత్యేకతలు, సంగీత నాట్య విద్యలలో ప్రవేశం,  హరికథలు స్వయంగా వ్రాసుకుని చెప్పి మెప్పించే నేర్పు, ఇంకా రాళ్ళపల్లి వారి శిష్యునిగా, పాలీ ప్రాకృతాది భాషా సాహిత్యాలలోని పట్టూ!!

   భావ కవితా సామ్రాజ్యం విస్తరిస్తున్న వేళ అది. మనసును గిలిగింతలు పెట్టే భావ కవితలను, సంగీతంతో జోడించి,వారు ఆలపిస్తుంటే, విద్యార్థులంతా మంత్ర ముగ్ధులై పోయేవాళ్ళు. ప్రాకృత సాహిత్యంలో తనకిష్టమైన ప్రవరసేనుని రచనను గొంతెత్తి ఆలపిస్తుంటే, నిద్రాహారాలు మరచిపోయేవాళ్ళు వారి సన్నిహిత మిత్రులు. త్యాగరాజు కీర్తనలలోని సూక్ష్మాంశాలను తీష్ణ నేత్రాలతో వివరిస్తుంటే, ఇళ్ళకు వెళ్ళటం కూడ మరచి వారి చుట్టూ చేరేవారు, స్థానిక మిత్రులు. తాను పెనుగొండలో ఉన్న సమయంలో తండ్రిగారి నటనానుభవాన్ని ఆస్వాదించిన జ్ఞాపకాలతో పాటూ, తానూ నటించిన అనుభవాలింకా తాజాగా ఉండనే ఉన్నాయింకా!! కనుక కళాశాల ప్రదర్శనల్లో, తన  నటనకు కూడా మెరుగులు పెట్టుకునే అవకాశమూ దొరికింది వారికి!! అంతేనా? పిట్ దొరసాని వద్ద తాను చదివిన ఆంగ్ల సాహిత్యంలోని విశేషాలను, మరీ ముఖ్యంగా షేక్స్పియర్ స్వగతాలను ధీరగంభీర స్వరంలో అభినయ సహితంగా ప్రదర్శిస్తూ ఉంటే, అయ్యో! తామింకా ఆంగ్ల సాహిత్యం చదవలేదే అని పస్చాత్తాపం మొదలయ్యేది చాలామందిలో!!

    పెనుగొండ శిధిలాలమధ్య  తిరుగుతూ, పన్నెండేళ్ళ ప్రాయంలోనే పుట్టపర్తి వ్రాసుకున్న పెనుగొండ లక్ష్మి కావ్య పఠనం అన్నిటికన్నా మించి ఆకర్షించింది వారి సహ విద్యార్థులను!!

  సీ. ఎట్లు పైకెత్తిరో ఏన్గు గున్నలకైన 

           తలదిమ్ము గొల్పు నీ శిలల బరువు,

    యే రీతి మలచిరో యీ స్థంభములయందు,

           ప్రోవుగమ్మిన మల్లెపూల చాలు,

    యే లేపనంబున నీ కుడ్యములకెల్ల

           దనరించినారొ యద్దాల దళుకు,

      యే యంత్రమున వెలయించిరో వీనికి

          జెడకయుండెడి చిరంజీవ శక్తి,

      గీ. కని విని యెరుంగనట్టి దుర్ఘటములైన,

    పనులు స్వాభావికముగ నుండెడివి, వారి

    కా మహాశక్తి యే రీతి యబ్బెనొక్కొ,

    కలమొ! జీవనమొ! యేదొ కారణంబు!!

  చూచేకొద్దీ ఆశ్చర్య చకితులను చేసే అక్కడి శిల్ప విద్యా నైపుణిని ఉదాహరణలతో పాటూ పద్య పఠనవేళ వారు విశదీకరిస్తుంటే, తామేదో వేరే లోకంలో విహరిస్తున్నట్టే అనిపించేది అక్కడి విద్యార్థులకు!! వీటన్నిటితో, తరుణ పుట్టపర్తి అప్పటి విద్యార్థులందరి దృష్టిలో ఒక హీరోగా నిలచిపోయారు.

     వీరితో పాటీ వీరి తరగతిలోనే చదువుకుంటున్న కలచవీడు శ్రీనివాసాచార్యులనే శ్రీవైష్ణవ విద్యార్థి,  వీరికి జూనియర్ గా శిరోమణి చదువుకుంటున్న గౌరిపెద్ది రామ సుబ్బ శర్మ వంటి స్నేహితుల ఆప్యాతానురాగాల  మధ్య పెనుగొండ కూడ అంత గుర్తుకు రావటం లేదు తరుణ నారాయణునికి!!కానీ కలచవీడు శ్రీనివాసాచార్యుల కుటుంబం ద్వారా పుట్టపర్తి తండ్రిగారికి వీరి క్షేమ సమాచారాల వార్తలు చేరుతూనే ఉన్నాయి. కరణం కలచవీడు వారికి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో  ‘దేశబంధు ప్రెస్’ అన్న ఒక ముద్రణాలయం వుండేది. అప్పుడప్పుడు అక్కడివారు పెనుగొండకు వచ్చినప్పుడల్లా, మలయసమీరం వంటి నారాయణ వార్తాసమీరాలు, వారి తండ్రి గారికి మోదాన్ని కూర్చేవి.

      మరొక అద్భుతం జరిగిందిక్కడే, ఇదే సమయంలోనే!! కలచవీడు శ్రీనివాసాచార్యుల బంధువులకు తాడిపత్రిలో దేశబంధు ప్రెస్ ఉన్నదనుకున్నాం కదా!! పుట్టపర్తి స్నేహితుడైన శ్రీనివాసాచార్యులకు, తన స్నేహితుని పెనుగొండ లక్ష్మి ని తమ ముద్రణాలయంలో ప్రచురించవలెనని కోర్కె పుట్టింది. దానికి ధనం కావాలి కదా !! ఎలా మరి?? (సశేషం)

****

Please follow and like us:

2 thoughts on “కనక నారాయణీయం-7”

  1. మహా మహులు శ్రీ పుట్టపర్తి వారి గురించి వారి పుత్రిక వ్రాయగా తెలుసుకోవడం ముదావహం. పుట్టపర్తి వారు పూజనీయులు మా తరం వారికి. నెల నెలా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు సంచిక వస్తుందా అని. అభినందనలు మీకు !

    1. కె.వరలక్ష్మి గారూ….మీ స్పందన నాకెంతో స్ఫూర్తి దాయకం…మా అయ్య గారి జీవన రేఖలు వ్రాసే అపూర్వ అవకాశం… ప్రియ .’ నెచ్చెలి’ ద్వారా దక్కటం.. నా భాగ్యం!!..మీ వంటి సుప్రసిద్ధ సాహితీ వేత్తలు…ఆనందించి… ఆశీస్సులందించటం..మరీ భాగ్యం!!..నా శక్తి మేరకు… పుట్టపర్తి వారి వ్యక్తిత్వ సాహిత్య విలువలను….మీవంటి సాహితీ ప్రముఖుల ముందుంచే ప్రయత్నం తప్పక చేస్తాను..!! మీకూ,..ఎంతో సమర్థవంతంగా ప్రేమతో.. నెచ్చెలి ని తీర్చిదిద్దుతున్న సంపాదకులు డా.గీతాకళ గారికి.. నమశ్శతాని.. పుట్టపర్తి నాగ పద్మిని

Leave a Reply

Your email address will not be published.