జీవితమే నవీనం

అనుభవాలు -జ్ఞాపకాలు-2

-వెనిగళ్ళ కోమల

పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో మాకు ఉయ్యాలలు కట్టేవాడు. స్నేహితులందరం ఊగేవాళ్ళం. 

మామయ్య బొడ్లో తాళాల గుత్తిలో చిన్న చాకు వేలాడుతూ ఉండేది. దానితో పెన్సిల్ కి ఎంతో నగిషీలు చెక్కేవాడు మామయ్య. రోజూ బడికి పోతూ పెన్సిల్ ముక్కు విరగదీసి మామయ్యను చెక్కమనేదాన్ని- చాలా రాసినట్లున్నావు కదమ్మా అని ఎగతాళి చేసేవాడు. పెన్సిల్ చెక్కి, రోజూ ఒక కానీ (రూపాయలో 64వ వంతు) యిచ్చేవాడు. ఆ రోజుల్లో కానీ విలువ చాలా ఎక్కువ. ఇంట్లో ఏం టిఫిన్లు చేసినా పెదమామయ్యను పిలిచి పెట్టకపోతే అమ్మా, నాన్నలకు లోటనిపించేది.

ఆవకాయ సీజన్లో, పొరుగూరు పనివాణ్ణి తీసుకుని ఒక ప్రత్యేకమైన చెట్టు మామిడి కాయలు కోయించి తెచ్చేవాడు. ముక్కలుగా కోసేవాడు కూడా. ఒకసారి చెయ్యి తెగ్గోసుకుంటే అందరం బాధపడ్డాం. 

అత్తయ్య నాగేంద్రమ్మ చక్కని వ్యక్తి. ప్రేమగా ఉండేది. అమ్మ, అత్తయ్య అప్పచెల్లెళ్ళలాగా ఉండేవారు.  చినమామయ్య వెంకట్రామయ్య దుడుకు మనిషి, కోపిష్ఠి. ఆయన కోపానికి అత్తయ్య, పిల్లలు బాధపడవలసి కూడా వచ్చేది. ఎవరైనా ఆడపిల్లలను వేధించినా, జులాయితనం పోయినా ముందు వాళ్ళను కొట్టి, తరువాత ఎందుకు కొట్టాడో వాళ్ళకి చెప్పేవాడు అమ్మంటే ప్రేమగా ఉండేవాడు. అత్తయ్యకు చీరలు కొంటే అమ్మకు కూడా ఒకటీ రెండు చీరలు కొనేవాడు అత్తయ్య కిష్టం లేకున్నా. చేపల కూర వండించి అమ్మకు ప్రత్యేకంగా పంపించేవాడు. బడికెళ్ళేటప్పుడు ఎదురుపడితే నాకు పావలా (1/4 రూపాయి) యిచ్చేవాడు. ఊరు తిరణాలప్పుడు రోజుకు రూపాయి ఇచ్చేవాడు. మామయ్య దగ్గర గ్రామఫోను ఉండేది పెద్ద బాక్సు టైపులో. చుట్టుపక్కల పిల్లలంతా మామయ్యని ఫోను మామయ్య అని పిలిచేవారు. అమ్మ ఏదైనా పెడితే మొహమాట పడేవాడు. రోజూ ఒకసారి యింటిలోకి వచ్చి అమ్మను చూచి వెళ్ళేవాడు. 

పిచ్చమ్మత్తయ్య అంత కలివిడిగా ఉండేది కాదు. కొంచెం స్వార్ధం పాలు ఎక్కువ అన్నట్లు ఉండేది. అయినా అమ్మ ఆమెకు అన్ని పనుల్లో సహాయపడుతూ ప్రేమగా ఉండేది. 

ఇక మామయ్యల పిల్లలు మేమూ అరమరికలు లేకుండా ఒకే కుటుంబం వారుగా ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళం. అందరం అమ్మ దగ్గరే గుమిగూడేవాళ్ళం. ఓపిగ్గా వండి మా అందరికీ తినిపించేది. అత్తయ్యలు – ఎప్పుడూ ఏముందో, మేనత్త చుట్టూ చేరతారు తెల్లవారగానే అని మురిపెంగానే అనుకునేవారు. 

వసుమతీ, నేనూ బాగా అల్లరి పనులు చేసేవాళ్ళం. శ్యామల సుకుమారంగా ఉండేది. ఏ దుడుకు పనులకూ మాతో చేరేదికాదు. ఒకసారి వసుమతీ, నేను చేసిన అనాలోచితమైన దుడుకుపని మమ్మల్ని పశ్చాత్తాపపడేలా చేసింది. 

మా చాకలి ముత్తి (ముక్తి అయి ఉండవచ్చు) మంచి వ్యక్తి. చక్కగా బట్టలు ఉతికి, మడిచి అప్పచెప్పేది. అమ్మన్నా, పిల్లలం అన్నా ఎంతో ప్రేమగా ఉండేది. పిల్లలు లేరు. ఎవరినో పెంచుకున్నది – ఆ కోడలు బాధలు పెట్టేది ముత్తిని. అమ్మతో, తన బాధ పంచుకునేది. రోజూ రాత్రి బుట్ట తెచ్చుకుని అమ్మతో వేడిగా అన్నం కూరలు పెట్టించుకుని వెళ్ళేది. ఈనాటికి మరపురాని వ్యక్తి ముత్తి. 

ఒకసారి ముత్తి మా బట్టల పెద్ద మూట నెత్తిన పెట్టి తెస్తుండగా లోన తలుపుల చాటున దాక్కొని నేనూ, వసుమతి ఆమె గడపదాటుతుండగా భౌ అని అరిచాం. అదిరిపోయింది. మూట కిందపడింది. ఆమెకు భయంకరంగా నడుంపట్టి చాలా బాధపడింది. అయినా మా మీద కోపం తెచ్చుకోలేదు. మేము పశ్చాత్తాప పడ్డాం  ఇక ఎప్పుడూ తనను బాధించమని. మా అల్లరి చేష్టలకు ఇదొక ఉదాహరణే. అలాంటివి ఎన్నో!

శేషగిరి నా వయసువాడే. మాతో కలిసిపోయేవాడు. అత్తయ్యలా అందంగా ఉండేవాడు. పావురాలను పెంచేవాడు. నాకు సైకిల్ తొక్కటం నేర్పించబోయాడు. ఏ పనులూ సమంగా పట్టించుకోను కదా. పడతానేమో అని భయపడి సైకిల్ నేర్వలేదు. అన్నయ్యకు శేషగిరి అంటే చాలా యిష్టం. అతని చదువు సంధ్యల విషయంలో శ్రద్ధ వహించింది అన్నయ్యే. డాక్టరు చదివించటానికి మామయ్యను ఒప్పించింది అన్నయ్యే. వరాలు చిన్నది. ఆట్టే మాతో జతకట్టేది కాదు. 

నిర్మల అందరితో చనువుగా ఉండేది. నాన్నతో గూడా హాస్యాలాడేది. ఇద్దరం ఆవకాయతో పెరుగన్నం యిష్టంగా తింటుండేవాళ్లం. చిన మామయ్య అమ్మతో వాళ్ళకి ఆవకాయ పెట్టబోకమ్మాయి, బొంత కాకుల్లా ఎట్లా తయారవుతున్నారో చూడు అనే వాడు. అయినా మా తిండి మాదే. నిర్మల ఎక్కువ పెట్టించుకుని పారేస్తుంటే నాన్న – నిర్మలా అలా, వేస్ట్ చేయగూడదు. కావలసినంతే పెట్టించుకో అన్నాడు. నిర్మల సమాధానం – ఏం చేయను మామయ్యా కళ్ళు కావాలంటున్నాయి. కడుపు వద్దంటున్నది మరి అని. నాన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

నిర్మల బాగా చదవటంలేదని మాన్పించి 15 ఏళ్లకే పెళ్ళి చేశారు మామయ్య. ప్రాక్టికల్గా మంచి సూక్ష్మ బుద్ధి నిర్మలది. ఎదుటి వారికి సహాయం చేయటానికి ముందుండేది.  ప్రేమను పంచి యిచ్చేది.

తనతల్లి కోటమ్మ పోలికతో పుట్టిందని సత్యవతి అంటే చిన మామయ్యకు ప్రేమెక్కువ.  చాలా మొహమాటస్తురాలు. కోటేశ్వరరావు సిగ్గుపడి మాతో ఆట్టే చేరేవాడు కాదు ఆటలకు. ఇప్పటికీ పోయిన వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళం కలివిడిగా ఉంటున్నాము. వెనకటి ప్రేమానురాగాలు మాసిపోలేదు.  మమ్మల్ని పెంచిన విధానం మమ్మల్ని అలా తయారుచేసింది. 

నాన్న సహాయం మా వూరిలో పొందినవారు ఎంతో కృతజ్ఞతతో ఆ విషయం మాకు చెప్పేవారు. ధనసహాయం, మాటసహాయం, సలహా సంప్రదింపులలో సాయం, పేదవారి పెళ్ళిళ్ళలో వధువుకు మంగళసూత్రం చేయించి యివ్వటం యిలా అనేక సంగతులు వినేవాళ్ళం. ముఖ్యంగా వారిలో ఇంద్రమ్మక్కయ్య (ఇందిరమ్మ) వాళ్ళ ఇంటి గురించి ఎప్పుడూచెపుతూ వుంటుంది. ఆమె భర్త నాన్నకు ఒక కోర్టు కేసు విషయంలో ముఖ్యమైన సమాచారాన్ని  సకాలంలో అందించి కేసు గెలవటానికి సహకరించాడట. కృతజ్ఞతగా నాన్నవారికి ఇల్లు కొనిపెట్టారట. అక్కయ్య పలుసార్లు ఆ విషయం మాకు కృతజ్ఞతతో చెప్పేది. అమ్మా, నాన్న ద్వారా తెలియలేదుగాని – పరుల వల్ల తెలిసింది. అమ్మకు తాంబూలం (పెద్ద ఇత్తడి పళ్లెం) నిండా అన్ని రకాల నగలు ఉండేవట – నాన్న స్నేహితులొకరు వ్యాపారం పెట్టుకుంటానంటే అమ్మను సంప్రదించకుండానే నాన్న ఆ బంగారం అంతా అమ్మి డబ్బు ఆయనకిచ్చారట. ఆయన వ్యాపారం ఏమయిందో కాని బంగారం మాయం. అమ్మ ఆ విషయంలో నాన్ననెప్పుడూ నిందించలేదు. చిన్నక్క పెళ్ళిలో నాన్న బంగారం కొంటుంటే నా బంగారం ఉన్నట్లయితే పిల్లలందరికీ బాగా యివ్వగలిగేవాళ్ళం అని ఒకసారి అన్నది అంతే. 

అప్పుడు పెదమామయ్య ముంగాలలో తెచ్చిన ముంజలు తింటూ పనివాళ్ళు పండేసిన ఈత పళ్ళు తింటూ జీవితాన్ని ఆప్యాయతల మధ్య అనుభవించటం తప్ప పెద్ద విషయాలు అర్థం అయ్యేవికావు మాకావయసులో.

నా చదువు 

ఊళ్ళో ప్రైమరీ స్కూలే ఉండేది. పసితనంలో వెంకటేశ్వర్లు (పెరవలి వారి ఊరు) మాష్టరుగారు ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పారు. వారికి రుణపడి ఉన్నాను. మా బెంచిలో పెద్ద క్లాసులో మేము ముగ్గురం అమ్మాయిలం, ఒకబ్బాయి లింగాలు కూర్చునేవాడు. మేము ఏమీ ఎరగనట్లే నెమ్మదిగా ఒకరినొకరు తోసుకుంటూ అతన్ని కిందికి తోసేవాళ్ళం. పాపం! ఏమీ అనేవాడు కాదు. నేను కానులిచ్చి అతని దగ్గర చింతకాయలు కొనుక్కునేదాన్ని. అతను పెద్దయిన తరువాత పెండ్లి వాద్య బృందంలో చేరాడు. మా యింటి ముందుగా మేళం వెడుతుంటే నేను కనిపిస్తే సిగ్గుపడేవాడు. 

హైస్కూలు చదువులకు చాలామంది కూచిపూడి స్కూలుకు నడిచి వెళ్ళేవారు. నాన్నకు అలా పంపించటం యిష్టం లేక యింటిలోనే టీచర్ను పెట్టి చదివించారు. హిందీ చదువు యింట్లోనే సాగింది. నాతోపాటు చుట్టు పక్కల అమ్మాయిలు మా యింట్లో ఫ్రీగా చదువుకోగలిగారు. 

పెద్దక్క ఆమె మారుటి కుమార్తె సుజాత పెదపూడిలో వారింటిలోనే చదువు సాగించారు. నేను తరచు వారింట్లో గడిపేదాన్ని. బావగారు శరణు రామకోటయ్య నా చదువును ప్రోత్సహించినవారిలో ఒకరు. వారి చిన్నమ్మాయి శేషవర్ధిని తదుపరి కాలంలో మా అన్నయ్యకు భార్య అయింది. మేమిద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. 

నా తదుపరి చదువు మద్రాసులోనూ, చిత్తూరులోనూ సాగింది. 15వ ఏట హిందీలో అతిపెద్ద పరీక్ష, టీచరు ట్రైనింగ్ ముగించాను. టీచరుగా వెళతానంటే అన్నయ్య పెద్ద కళ్ళ, బారుజడ పిల్ల పంతులమ్మ మాట ఎవరు వింటారు అని ఎగతాళి చేసి,  బాగా చదువుకో, నాన్నకూ, నాకూ నీవు బాగా చదువుకోవాలని ఉన్నది అని సలహా చెప్పి ఇంగ్లీషు చదువులలో పెట్టాడు. 

చిన్నప్పుడు గడియారంలో టైము చెప్పగలగటం అన్నయ్య నేర్పాడు. ABCDలు నేర్పాడు. పెద్దక్క 6, 7 తరగతుల ఇంగ్లీషు పాఠాలు చెప్పింది. ఆమె టీచరు కాగల అర్హతలన్నీ పొందినా బావగారు అక్కను ఉద్యోగం చేయనీయలేదు. ఆమె జీవితం మా అందరి సేవలకే అంకితమిచ్చింది. అమ్మా, నాన్నలను చూచుకున్నది తనే. అమ్మ తరువాత అమ్మగా మా అందరికీ అండగా నిలిచింది అక్కే. హారతి కర్పూరంలాగా, కొవ్వొత్తిలాగ కరిగి ఇతరుల సేవలకంకితమైన త్యాగ జీవి అక్క. ఆమెకు జోహారులు. 

విమలక్క, బావగారు వెలగా రామకోటేశ్వరరావు (హిందీటీచరు) గారి పిల్లలు పసితనంలో మా దగ్గర కొంతకాలం పెరిగారు. వారంతా మాకు చాలా యిష్టమయిన వారు. అన్నయ్య ఎంతో సుకుమారంగా ఆ పిల్లలను చూసుకునేవాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళినా నా రంగుకు నప్పే బట్టలు తెచ్చేవాడు. తనతో ప్రయాణాలు చాలా సౌఖ్యంగా ఉండేవి. ఎంతో అండదండలనందించిన అన్నయ్య ఒకనాడు ఎవరికీ చెప్పకుండా త్వరపడి మమ్మల్ని వీడి వెళ్ళిపోయాడు. ఆలోటు ఎవరు తీర్చగలరు?

నేను చదువు నిమిత్తం మూల్పూరు వదిలేముందు నాకిష్టమైన వారినీ, గౌరవించినవారినీ, ఇప్పటికీ స్మృతిపథంలో మెలిగేవారినీ, నన్ను కవ్వించి నవ్వించిన వారందరిని గురించి ప్రస్తావించకపోతే నా యీ జ్ఞాపకాలు సంపూర్ణంకావు. 

అమ్మ చిరకాల మిత్రురాలు వెంకాయమ్మ. అమ్మకు పనులలో సహాయపడుతూ, మాకూ పాటలు, కథలు వినిపిస్తూ ఉండేది వెంకాయమ్మ. అమ్మను పిల్లా అనేది ఆప్యాయంగా. అమ్మ పని తీరక ఆలస్యంగా భోజనానికి కూర్చుంటే – పిల్లకు తిండి తినటానికి గూడా తీరనంత చాకిరి అని దిగులు పడేది. పండగలప్పుడు పెద్ద ఎత్తున పిండివంటలు, వంటలు చేసేది అమ్మ. పనివాళ్ళందరి కుటుంబాలను పిలిచి భోజనం పెట్టేది. ఆ పనులన్నిటిలో వెంకాయమ్మే అండగా నిలిచేది. ఎక్కువ మా యింట్లోనే ఉంటూ ఉండేది. మాకందరికీ ఇష్టమైన వెంకాయమ్మ నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువప్పుడు కాలం చెందింది. అమ్మ చాలా దుఃఖపడింది. 

అమ్మ అంతగా తనకిష్టమైన ఆవు చనిపోయినప్పుడు బాధపడటం చూచాను. నాన్న ఆవును ఊరేగింపుగా మా నిమ్మతోటకు తీసుకెళ్ళి అందులో ఖననం చేశాడు. ఆ ఆవుతో మేమూ ఆడేవాళ్ళం. కొమ్ము విసిరేది కాదు. అమ్మతోపాటు మాకు ఆప్యాయత పంచిందా సాధుజంతువు. 

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.