విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష)

-డా.సిహెచ్. సుశీల

అతివేగంగా మారిపోతున్న ప్రపంచపోకడలు అన్ని రంగాలకూ వర్తించినట్లే మానవసంబంధాలు, ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలకు కూడ వర్తిస్తూ, “ ఆత్మాభిమానం, వ్యక్తిత్వం” వంటి వాటిని బీటలు వారేలా గట్టి దెబ్బే కొడుతున్నాయి. కంప్యూటర్ లా వేగంగా ఆలోచించే మనిషి మెదడు ‘కేవలం ‘ కంప్యూటర్ లాగానే ఆలోచిస్తోంది కాని ‘మనసు తడి’ లుప్తమైపోతోంది. అలాంటి వాటిని అందిపుచ్చుకుని వస్తున్న రచనలు వున్నాయి. కానీ, అయితే అతి మంచిపాత్రలు, లేదా అతి చెడ్డ మనస్తత్వ పాత్రల్ని సృష్టించి పాఠకులకు అందిస్తున్నారు రచయితలు. అందులోనూ కథలు వస్తున్న విరివిగా నవలలు రావడం లేదు.

ఈ పరిస్ధితుల్లో ఝాన్సీ కొప్పిశెట్టి గారి నవల “ విరోధాభాస” పాఠకలోకాన్ని ఒక్క కుదుపు కుదిపిందనే చెప్పాలి. అందులోనూ ఒక రచయిత్రి బోల్డ్ గా “ కొన్ని” విషయాల్ని స్వేచ్ఛగా చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అయితే ఇది ఆహ్వానించదగినదే. ముఖ్యంగా మగవారు ఈ నవలలోని కథను , హీరో ప్రీతం మనస్తత్వాన్ని ఎలా తీసుకుంటారో ఊహించలేం. ( పుస్తకావిష్కరణలో విశ్లేషించిన ముగ్గురూ రచయిత్రులే మరి)

కథానాయకుడు ప్రీతం గురించే ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రీతం విదేశాల్లో పెరిగిన వాడవడం వల్ల అతని ఆలోచనలు, ప్రవర్తన, జీవనవిధానం ‘భారతీయ’ పాఠకులకు కొంత వింతగా వుండవచ్చు. అతనిప్రవర్తనకు కారణం అతని మానసిక వైకల్యం అనీ, హార్మోన్స్ ఇన్ బాలెన్స్ అనీ, మానసికశాస్త్రం ప్రకారం అతని పాత్రను విశ్లేషించాలని కొందరి అభిప్రాయం. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే అవేవీ కారణాలు కావు. ప్రీతం….! ప్రీతమే. అతని ఆలోచనలు అంతే. అతని పొగరు, అహంకారం అంతే. అతని ప్రవర్తన అంతే. ఇలాంటి వికృత, విచిత్ర మనస్తత్వం ఉన్నవారు మారరు.

ప్రీతం లాంటివారు ఈ లోకంలో చాలమంది ఉన్నారు. బయటకు అందంగా, ఆహ్లాదంగా, ఆదర్శవంతంగా, ఆకర్షణీయంగా , ప్రేమాస్పదమూర్తిగా, ( అమ్మాయిలూ జాగ్రత్త ) కన్పిస్తారు. వారు చేసే మాయకు వారు పెట్టుకున్న అందమైన ఆత్మవంచన పేరు ‘ప్రేమ’. మృణాళినిగారు అన్నట్లు “ఎంతమందికైనా ప్రేమను పంచగల అతని సామర్థ్యం, వారి నుంచీ అలాంటి ప్రేమనే ఆశించే మనస్తత్వం, తన ప్రేమలకు ఎవరూ అడ్డురాకూడదనే మంకుతనం. ప్రేమలో స్వేచ్ఛ తప్ప, బాధ్యత కూడ వుంటుందని, ఉండాలనీ, ప్రేమ అంటే నిగ్రహం కూడానని గుర్తించని తెంపరితనం. శృంగార జీవితం నిత్యనూతనంగా ఉండాలన్న కోరిక, పెళ్ళయినంత మాత్రాన తను ఇతర స్త్రీలను వదులుకోవాలా అన్న అహంకారం”.

అందాన్ని ఆరాధిస్తాడట. కొత్త అందాలు, కొత్త అమ్మాయిలు, కొత్త ప్రేమలు, కొత్త శృంగార రుచులు నిత్యనూతనంగా ఉండాలట. “ భార్యను ప్రేమిస్తాడు, కానీ మిగిలిన గర్ల్ ఫ్రెండ్స్ నీ అంతే సమానంగా ప్రేమిస్తాడట”. ఇది ప్రేమ కాదు, పక్కా వ్యామోహం. వయసు, శారీరక ఆరోగ్యం, డబ్బు, డబ్బును వెదజల్ల గల ఉదారత వల్ల వచ్చిన అహంకారం. తను చేసే పని తప్పు కాదని అతను వాదించడం చూస్తే భార్య, మిత్రులు, లాయర్, జడ్జీతో పాటు చదువుతున్న మనమూ ఓ క్షణం అతని మాటల గారడీలో పడి అతను చెప్పే ఆ ‘ప్రేమ థియరీ’ కి కన్విన్స్ అయిపోతామేమో అనిపిస్తుంది. దాంపత్యజీవితంలో ఒకడికి జీవితాంతం ఒక్కరే అన్న భారతీయ వివాహవ్యవస్ధ, ధర్మాన్ని పక్కన పెడితే, స్వేచ్ఛను కోరుకునే అమెరికన్ లాయర్స్, జడ్జీలన కూడ ‘ మేమైనా ఒకరు వెళ్ళిపోయాక మరొకరిని ఆహ్వానిస్తాం కాని, ఇలా ఒకేసారి పేరలల్ గాతీసుకురాము’అని బోల్డంత హాశ్చర్యపోతారు. అంతటి పిడివాదం అతనిది.

“ మనిద్దరం ఎంత కలిసివున్నా నాకంటూ ఒక స్పేస్ కావాలి. ఆ స్పేస్ లో నువ్వు మాత్రమే ఉండాలి అంటే కుదరదు. నా పర్సనల్ స్పేస్ లోకి నువ్వు తొంగి చూడకూడదు. ఆ స్పేస్ లో పరాయి స్త్రీ లతో సహా ఎవరైనా ఉండవచ్చు కన్వీనియంట్ గా ధీయరీ చెప్పి, ‘ నీ కంటూ పర్సనల్ స్పేస్ ఉంటే అందులోకి నేను రాను’ అని ఉదారంగా సెలవిస్తాడీ మహానుభావుడు. నిజంగా భార్య మనసులోకి ఎవరైనా వస్తే ఎంతవరకు సహిస్తాడో, భరిస్తాడో తెలీదు.ఎట్టి పరిస్తితుల్లో అంగీకరించదు, ఆహ్వానించదు అతని ‘ భర్త అనే ఇగో ‘ .

భార్య అనే హక్కుతో, అధికారంతో తన జీవితాన్ని ఆమె ఆటంకించే పరిస్తితికి చిరాకుపడి విడాకులు తీసుకోవాలను కుంటాడు ప్రీతం. అంతా తన వైపు నుంచే ఆలోచించే పరమ స్వార్ధపరుడు. ఎదురుగా ఉన్నది తన అర్ధాంగి అనీ, పూర్తిగా తనని నమ్మి జీవితాన్ని మొత్తంగా అర్పించుకొని వచ్చిన సహధర్మచారిణి అనే విషయం పట్టించుకోడు. రచయిత్రి చెప్పినట్లు “ అతనిలో ఒక చార్మ్ వుంది. అతని మాటల్లో ఒక వశీకరణశక్తి వుంది. అతని నవ్వులో ఒక మెస్మరిజం వుంది. అతని సహృదయతలో ఒక కరుణ వుంది. అతని స్నేహశీలతలో ఒక ప్రేమ వుంది. అతనిలో స్వచ్ఛత వుంది. అతని ఇష్టం లోనూ స్పష్టత వుంది”.

కోర్ట్ లో ఆంగ్లేయుడైన డిఫెన్స్ లాయర్ అమెరికన్ బోర్న్ ఇండియన్ ప్రీతం మాటలకు విస్తుపోతాడు —

“ నాకు ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. అప్పుడే ఉత్సాహంగా వుండగలసు. లైఫ్ ఈజ్ టు ఎక్స్ ప్లోర్ . లైఫ్ ఈజ్ టు ఎక్స్పరిమెంట్. నిశ్చలత నాకు నచ్చదు. మొనాటనీ నాకు అరగదు. సచ్ లైఫ్ ఈజ్ బోరింగ్ ఫర్ మి. ఐ నీడ్ ఎ చేంజ్ ఆల్వేస్. నా పన్నెండేళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లో ఆరు ఉద్యోగాలు మారాను. ఒకే పనిలో ఒకే చోట వుండలేక , మొనోటోనీ లో బ్రతకలేక…. కొత్త పని చేయాలి. కొత్త ప్రదేశాలు చూడాలి. కొత్త పరిచయాలు కావాలి. కొత్త స్నేహాలు చేయాలి. ఎప్పుడూ కొత్తదనం కోసం తపిస్తుంటాను….” అతని మనస్తత్వాన్ని పట్టి యిచ్చేవి అతని ఈ మాటలు. దిస్ ఈజ్ ప్రీతం.

నోరు వెళ్ళబెట్టిన లాయర్ తేరుకొని “ అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నట్టు…” అడిగాడు.

“ అగైన్ ఫర్ ఎ చేంజ్ ఫ్రం బాచిలర్ లైఫ్. సంసారజీవితం ఎలా వుంటుందీ, పిల్లలు పుడితే ఫాదర్హుడ్ ఎలా వుంటుందీ ఆస్వాదించడానికి. … నా స్నేహితురాండ్ర విషయంలో భార్యనంటూ ఆమె జోక్యం, హక్కు ఉండకూడదనే ఈ విడాకులు…” ఇదీ అతని నైజం. చిత్రమైన రీజనింగ్.

భార్య ప్రియను అతను ప్రేమించిన విధం, గాఢమైన రాగానురక్తి, కేరింగ్, కూతురిపై అవ్యాజమైన అనురాగం…. అన్నీ, పై అతని మాటలముందు దూదిపింజలై పోయాయి. అతన్నీ ఏ స్త్రీ కూడ శాశ్వతంగా ప్రేమించలేదు. అతను చూపే అద్భుతమైన ప్రేమ పూరితవాక్కులు, చేతల వాహినిలో మునిగి తేలుతూ కొంతకాలం మైకంలో వుంటుందేమో కానీ జీవితాంతం భరించలేదు. కొత్త రుచుల కోసం వెంపర్లాడుతూ “ నాది అందాన్ని ప్రేమించే నైజం” అని తానొక ప్రేమైకమూర్తిని అంటూ గొప్పగా చెప్పడం స్త్రీ హృదయాన్నిఛిద్రం చేస్తుంది.

పరాయి స్త్రీతో ఉన్న అతన్ని చూసి ప్రియకు కంపరం, జుగుప్స, అసహ్యం, వికారం, సెక్స్ పై రోత, జీవన వైరాగ్యం , ప్రేమరాహిత్యం అన్నీ మూకుమ్మడిగా కలిసి పిచ్చిదాన్ని చేసేసాయి. ఎంత హృద్యంగా, మనసుకు తాకేలా చెప్పారు రచయిత్రి! స్త్రీ హృదయం బద్దలైతే, భర్త పట్ల ఆమె నమ్మకం వమ్ము అయితే, తామిద్దరి అనురాగం విచ్ఛిన్నమైతే ఆమె పానిక్ గా మారిపోతుంది. ఇంకా ప్రియ మంచి పెంపకం నుంచి వచ్చింది కాబట్టి కొంత అయినా సహించింది. మారతాడని ఆశించింది. అది ఆమె జన్మతః వచ్చిన సంస్కారం.

ప్రీతం ధియరీ ప్రకారం ఒక్కో స్నేహానికి, బంధానికి, అనుబంధానికి తన హృదయంలో ఒక్కో అర వుందిట. ఏ అరలో వారినక్కడే పదిలపరుస్తాడట. మరి షబనా, సారా, కరిష్మా… వంటి ఎందరో అతని జీవితంలోకి ఉప్పెనలా వచ్చి, ఉధృతంగా ప్రవాహంలో మునిగి ఎందుకు తేలి తెప్పరిల్లి నిష్క్రమించారు! అది అతను ఎప్పటికి గ్రహించలేడు.

“ ప్రపంచం మొత్తానికి ఇతనేనా…. ఇతని లాంటి మనిషి మరెవరైనా ఉంటారా. “ అని ప్రియ అనుకుంటుంది. బహుశా రచయిత్రి ఝాన్సీగారి సందేహమేనేమో ఇది. (ఉంటారు, అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త ). ఇలాంటి భర్తా వద్దు , ఉక్కిరి బిక్కిరి చేసే అతని ప్రేమా వద్దు, అతను కల్పించే సౌకర్యాలూ వద్దు అనుకుంది ప్రియ. “ అతనితో తెగతెంపులు చేసుకుంటే నీ వర్తమానం సంతోషంగా ఉంటుందా” అని తల్లి ధీరజ అడిగితే “ సంతోషం లేకపోయినా కనీసం ఆత్మాభిమానంతో బ్రతుకుతాను” అంటుంది. ఈ ఒక్క వాక్యం ప్రియ వ్యక్తిత్వశిఖరం ఎంతో ఉన్నతమైందని తెలుస్తుంది. ఆ పాత్ర ఔన్నత్యాన్ని సింపుల్ గా చెప్పారు రచయిత్రి. భర్త నచ్చడు, అతని హింస భరించలేక మనసు వ్యతిరేకిస్తుంది, కానీ అతని వల్ల సమాజంలో లభించే ‘ సేఫ్ జోన్ ‘ కోసం ఒక కప్పు కింద ఆత్మవంచనతో బ్రతికే ఎందరో స్త్రీల కంటే భిన్నంగా ఆదర్శవంతంగా చూపడంలో సక్సెస్ అయ్యారు రచయిత్రి ఝాన్సీ.

తన భర్త తనకే స్వంతం కావాలని, అతని ప్రేమ సంపూర్ణంగా తనకే దక్కాలని ఆశించడం అతని దృష్టిలో న్యూసెన్స్. కానీ, ఆత్మాభిమానంగల నేటి తరం చదువుకున్న అమ్మాయి ప్రియ ఇక సహించలేక పోయింది. “ జీవితం పాఠాలు నేర్పడమే కాదు , ధైర్యాన్ని నూరిపోస్తుంది కూడ. గెలుపోటముల ప్రసక్తి లేకుండా యుద్ధానికి సన్నద్ధం చేస్తుంది”.

కోర్టు తీర్పుతో కాదు. ధైర్యంగానో, విరక్తితోనో, కోపంగానో, ఆశాభంగం వల్ల కలిగిన నిర్వేదంతోనో, ప్రీతం వల్ల మనసుకు కలిగిన గాయం వల్లో ప్రియ వెళ్ళిపోయింది అతని జీవితం లోంచి. ఒక కూతుర్ని తన దగ్గర, రెండో కూతుర్ని ఇండియాలో తల్లి దగ్గర ఉంచింది. డాక్టర్ గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా తను నమ్మిన సిద్ధాంతంతో, ధర్మంతో ముందుకు అడుగు వేసింది. స్నేహితురాలి కజిన్ , మృదుభాషి సరళ స్వభావుడు అయిన విక్రం ఆమెను అర్ధం చేసుకొని, ఇద్దరు పాపలతో సహా ఆమెను స్వీకరించి ఆమె జీవితంలో ప్రశాంతతను, ఆనందజల్లులను కురిపించాడు.

ప్రేమకు కొత్త ధియరీ చెప్పిన ప్రీతం పరుగులు తీసి తీసి డబ్బు, ఆరోగ్యం, తను నమ్ముకున్న (కృత్రిమమైన) ప్రేమ, గర్ల్ ఫ్రెండ్స్ అన్నిటిని పోగొట్టుకుని, చివరకు పశ్చాత్తాప పడినా, వెనక్కి తిరిగి వచ్చినా ప్రియ అతను అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయింది.

రాగి విరాగి కావడం, వాత్సాయనుడు బుద్ధుడుగా మారడం ‘నవల’ కోసం ముగింపు రాసి నట్టుంది కానీ, ఇలాంటి ‘ స్వేచ్ఛను పూర్తిగ అనుభవించాలి’ అన్న తాపత్రయం వున్న వ్యక్తి చివరికి జంతుప్రేమికుడుగా మారాడు అని చెప్పడం మెలో డ్రామా. ఒక నవలను ఇలాగే ముగించాలేమో కానీ, ప్రీతం ఎప్పటికీ మారడు. మారనంత విచిత్రమైన మనసు అతనిది. ఈ ప్రీతంలు స్త్రీ మనసుని గెలవలేరు. రచయిత్రి ఝాన్సీ ఎవరూ రాయడానిక ధైర్యం చేయని ఒకానొక ‘ఇగో’ గల పురుషుణ్ణి పాఠకలోకానికి ఎలాంటి వెరపు, ముసుగు లేకుండా చూపారు విరోధాభాస నవలలో.

ఇక ధీరజ నిజంగా మంచి వ్యక్తిత్వం గల మహిళ. జీవితంలో ఎన్నో కోల్పోయినా, తన కంటూ ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని నిర్దేసించుకొని, కూతుర్ని చక్కగా పెంచి పెళ్ళి చేసి , మళ్ళీ మనమరాళ్ళ బాధ్యతనూ కర్తవ్యదీక్షతో పూర్తిచేసిన ఆదర్శవంతురాలు. సిద్ధార్ద్ ఆరాధన, అల్లుడు ప్రీతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించమని ప్రోత్సహించడంతో అప్పుడప్పుడు ఆమె లోని స్త్రీత్వం అటుఇటూ ఊగిసలాడినా, అమ్మగా అమ్మమ్మగా బాధ్యతలు నిర్వహించి, చివరకు వికలాంగుల సేవలో నిమగ్నమైన ‘ధీర ‘.

అత్యాధునిక కాలంలో, కాలం తెచ్చిన మార్పుల్ని ఎదుర్కొంటూ, తమ వ్యక్తిత్వాలను కోల్పోకుండా అనేక సంఘర్షల్ని, సంక్లిష్టతల్ని దాటుకుని నిలిచిన పాత్రలు ప్రియ, ధీరజ. కథలో బిగి, కథనంలో టెంపో సడలకుండా, ఇంతటి ‘బోల్డ్’ విషయాన్ని ‘విరోధాభాస’ నవలలోచెప్పిన ఝాన్సీ కొప్పిశెట్టి మామూలు రొటీన్ నవలలు కాకుండా మరిన్ని మంచి నవలలు రాయాలని ఆశిస్తున్నాను.

*****

Please follow and like us:

14 thoughts on “విరోధాభాస (ఝాన్సీ కొప్పిశెట్టి నవల పై సమీక్ష)”

  1. సమీక్ష మరోసారి చదివాను.అద్భుతం.నిజంగా చెప్పాలంటే,ఒక థీసిస్ మాదిరిగా వుంది.ప్రముఖ రచయిత దగ్గు మాటి పద్మాకర్ గారు వెలిబుచ్చినట్టుగానె,ప్రీతం గా మారడం లో ఆశ్చర్య పడనక్కర లేదు.ప్రియ నిర్మించుకున్న కొత్త జీవితం అతనికి,కనువిప్పు కలిగించడానికి సరిపడా కనిపించింది అతనిలో.పైగా ఇవి కృత్రిమ పాత్రలు కావుకనుక రచయిత్రి కలం సరైన పద్దతిలో నడిచింది.ఈ ఒక్క విషయం లొ తప్ప సుశీల గారి సమీక్ష అత్యున్నతం గా కనిపిస్తున్నది.ఈ నవల మలి ముద్రణకు రచయిత్రి సాహసిస్తే,సుశీల గారి సమీక్ష అందులో చేర్చడం అర్ధవంతంగా వుంటుంది.సుశీల గారికి అభినందనలు.

  2. Not read the novel . But as it posted by my friend Vamsy, I read the analysis of Suseela garu. So nicely comprehended. In very few words she could successfully portrayed the characters of the different personalities of the novel. It seems that the story is about a person who can play a mind game conveniently that turns into his favour. There will be so many such type of personalities in the society.
    It seems that the writer shown a way out to readers how to lead a life in such situations. But had it addressed the problem and suggested ways to girls so that not becoming prey to such persons would have given some more value to the novel. (I don’t know whether such suggestions are already there in).
    There are chances of change of mindset one in a thousand or lakh or crore or so. That one could be Priyatham . Of cource once the train is missed one can never catch hold of same train in same station.

    Good analytical briefing.
    Good ending to the story too.

    Thanks Vamsy, Suseela garu and Jhansi garu. Really a tough and sensitive subject that affecting the new generation.
    Good luck to all
    …..ramesh

  3. ప్రీతం పాత్రపై రచయిత్రికి కూడా లేని కసి సమీక్షలో కనపడుతుంది. ప్రీతం అనే కల్పిత పాత్ర చేసిన తప్పుడు ప్రవర్తనలన్నీ నిజమేనని నమ్మి ఆగ్రహం తెచ్చుకున్నప్పుడు, చివరలో అతడు జంతు ప్రేమికుడుగా మారడం ఎందుకు నమ్మకం కలగడంలేదు? ప్రీతంకి ఒక్క విషయంలో మాత్రమే ఉన్న బలహీనతని మొత్తం కేరెక్టర్ కి ఆపాదించడం రచయిత్రి కూడా చేయలేదు. కానీ ఈ చిన్న సమీక్ష చేసేసింది. 🙂

  4. ఝాన్సీ గారి చాలా మంచి చిక్కని నవలా రచన విరోధాభాసకు చక్కని వివరణాత్మక విశ్లేషణాత్మక సమీక్షను ఇచ్చారు సుశీల మేడమ్ గారు. ఎలాగైనా చదవాలనే ఓ తపన కలగక మానదు.త్వరలో ఆ అదృష్టం నాకు వరించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సుశీలా మేడమ్ గారికి, ఝాన్సీ గారికి, చక్కని వేదికను అందచేసిన గీతా మేడమ్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  5. ఝాన్సీ గారి విరోధాభాస నవల ఎంత నవ్యమ్గా ఉండబోతోందో…..అందులో పాత్రలు ఎంత బోల్డ్ గా ఉంటాయో…..చాలా చక్కగా….ఆసక్తికరమైన రీతిలో సమీక్షించారు సుశీల గారు…ఝాన్సీ గారికి,సుశీల గారికీ అభినందనలు.ఇంత చక్కటి నవలను పరిచయం చేసేందుకు వేదికనిచ్చిన గీతామాడం గారికి అభివాదాలు.

  6. నెచ్చెలి నిర్వాహకురాలు Dr. Geeta గారికి అద్భుతమైన సమీక్ష రాసిన Dr. Sudheeka గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  7. బాగా చెప్పారు మేడం ….విరోధభాస నాకు బాగా నచ్చిన కథనం మీ సమీక్ష కూడా చాలా బావుంది

Leave a Reply

Your email address will not be published.