రంగయ్య స్నేహం

(‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ)

-వెంకట శివ కుమార్ కాకు

నేల మీద పగుళ్లు వున్నాయి. నెత్తి మీద సూరీడు భగ్గున మండుతున్నాడు. ఆ నేలని హత్తుకొని పడుకున్నాడు రంగయ్య. రంగయ్య కన్నీటి తో దాహం తీర్చుకుంది ఆ నేల. అతని ఎండిన శరీరం ఎండిన నేల తో కబుర్లు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిరకాల మిత్రులు!
 
రంగయ్య రైతు కుటుంబం లో పుట్టాడు. చిన్నప్పుడే తల్లి చని పోయింది. తండ్రి వ్యవసాయం చేసే వాడు. అందుకే రంగయ్య మట్టి ఒడి లో ఆడుకుంటూ పెరిగాడు. తల్లి ప్రేమ కి దూరం అయిన నేల తల్లి అక్కున చేర్చుకుంది. ఆ మట్టి లోనే పెరిగాడు. ఆడాడు. ఎదిగాడు. దాంతోనే స్నేహం చేసాడు.
 
బడి నుంచి నేరు గా వచ్చి మట్టి లో దిగే వాడు. దాంతో మిగిలిన రోజంతా కబుర్లు చెప్పేవాడు. “నీ స్నేహితుడు ఎవరు?” అని ఎవరైనా అడిగితే తన పొలం వైపు చూపించే వాడు. యేడాది కి రెండు పంటలు పండేది. ఈ నేల మీద పండినవి కొని తినే వాళ్ళవే కాదు కష్టం చేసి పండించిన వాళ్ళ పొట్టలు కూడా నింపేది.
 
రంగయ్య కి పెళ్లి చేసారు. భార్య తో సహ వెళ్ళి ఆ నేల కి మొక్కి దీవెనలు తీసుకున్నాడు. తన స్నేహితుడ్ని భార్య కి పరిచయం చేసాడు. ఇదంతా విని మొదట రంగయ్య భార్య తనకి పిచ్చి అనుకుంది. ఆ తర్వాత రంగయ్య కి పొలం తో వున్న అనుబందం చూసి మురిసి పోయింది.
 
ఆ కుటుంబం లో అందరూ ఆ పొలం నీడ లో పుట్టారు, ఎదిగారు, బ్రతికారు. రంగయ్య కి ఒక కొడుకు, ఒక కూతురు పుట్టారు. తను కూడా ఇదే పొలం లో ఇష్టం గా కష్టం చేసేవాడు. పిల్లల్ని బాగా చదివించాడు. కూతురు కి పెళ్లి వయస్సు వచ్చింది. సగం పొలం అమ్మాల్సి వచ్చింది.
 
తన ప్రాణ స్నేహితుడ్ని సగం చేసి అమ్ముతున్నప్పుడు రంగయ్య ప్రాణం కూడా అప్పుడే సగం పోయింది. ఆ రోజు నుంచి తన బ్రతుకు లో జీవం పోయింది. కొన్నాళ్ళకు భార్య పోయింది. మరింత క్షీణించాడు. పొలం పని చేసుకుంటూ అక్కడే పొలం లోనే వుండి పొయ్యేవాడు.
 
కొన్నాళ్లు వర్షాలు పడలేదు. పొలం బీటలు వారింది. చుక్క నీళ్లు కూడా దొరకలేదు. స్నేహితుడి పగిలిన గుండె చూసి రంగయ్య కళ్ళు ఎర్రగా మారాయి. పొలం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. “నువ్వు ముసలాడివి. ఎందుకు పనికి రావు. నువ్వు గొప్ప స్నేహితుడి గా చెప్పుకొనే నీ పొలం కూడా ఎందుకు పనికి రావడం లేదు” అని కొడుకు కోపం గా రంగయ్య ని ఇంటి నుంచి గెంటేసాడు.
 
తనకి ఇంక ఎవరూ లేరు. చావైనా దిక్కైనా తన చిరకాల మిత్రుడు తన పొలమే. అందుకే పొలం ని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. తన చివరి క్షణాలు తనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు మిగిలిన ఆనందం స్నేహితుడి తోడు మాత్రమే. “నేను ఎవరికీ పనికి రానంట. మరి నీకు కూడా ఇలువ లేదన్నాడు. నా కన్న బిడ్డ నన్ను ఇంటి నుంచి గెంటేసాడు” అని పొలం తో చెప్పుకుంటూ ఏడ్చాడు.
 
“నాకు ఇలువ లేదు అంటే ఒప్పుకుంటాను. నీకు లేదంటే ఎట్నా సెప్పు? నువ్వు బంగారం. నా మిత్రుడు బంగారం” అని అంటూ అక్కడే నేల మీద కళ్ళు మూసాడు. “అరేయ్ రంగయ్య సచ్చిపోయాడు” అని ఎవరో కేక పెట్టారు.
 
జనం గుమిగూడారు. కొడుకు కూడా వచ్చాడు. “నాన్న! నన్ను క్షమించు. ఈ పొలం విలువ లేనిది కాదు. మన పొలం నుంచి హైవే పడుతోంది. ఇప్పుడు ఈ పొలం విలువ కోట్లు నాన్న. నీ మిత్రుడి విలువ కోట్లు నాన్న” అని కొడుకు తండ్రి దేహం మీద పడి ఏడ్చాడు. అవును రంగయ్య అన్నట్టు అతని చిరకాల మిత్రుడు చాలా గొప్ప! ఇలువ లేని వాడు కాదు!

****

Please follow and like us:

One thought on “రంగయ్య స్నేహం (‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ)”

Leave a Reply

Your email address will not be published.