నిష్కల – 5

– శాంతి ప్రబోధ

ఆ ముందు రోజు నిష్కల కోవిడ్ 19 కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకుని వచ్చింది. మొదటి డోస్ వేసుకున్నప్పుడు కొద్దిగా చెయ్యి నొప్పి వచ్చింది అంతే. కానీ రెండో డోస్ తీసుకున్న సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు, మరుసటి రోజుకి తీవ్రమైన ఒళ్లు నొప్పులు జ్వరం. ఆఫీస్ కి వెళ్ళే ఓపిక లేదు. కానీ వెళ్ళాలి. 
 
ఈ రోజు ఫైల్ చేయాల్సిన కేసులు ఉన్నాయి.  ఒక కేసు స్టడీ చేయాల్సి ఉంది. అది ఇండియన్స్ కేసు.   అట్రాసిటీ కేసు.  
 
లేచి సీరియల్స్ పాలలో వేసుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. తినాలనిపించలేదు.  పక్కకు జరిపి కెటిల్ లో వేడి నీళ్లు పెట్టింది. కాఫీ మగ్ లో వేడి నీళ్లు పోసి గ్రీన్ టీ బాగ్ వేసింది. 
ఫ్రిజ్ లో నిమ్మకాయ కోసం చూసింది. కనిపించలేదు. కొద్దిగా తేనె వేసుకుని గ్రీన్ టీ చప్పరిస్తూ అమ్మకి ఫోన్ చేద్దామని మొబైల్ తీసుకుంది. 
 
మరుక్షణంలోనే ఆ ఆలోచన విరమించుకుంది.   తన గొంతులో నీరసాన్ని అమ్మ ఇట్టే పసిగట్టేస్తుంది.  తనకు చిన్న నొప్పి చేసినా అమ్మ చేసే హడావిడి, పడే దిగులు తెలియనిది కాదు.  తెలిసి తెలిసి అమ్మని కంగారు పెట్టడం ఎందుకని ఆ ప్రయత్నం మానుకుంది. 
 
అమ్మా … ఇప్పుడు నీతో మాట్లాడటం కుదరదు. వీలైతే నువ్వు లేవగానే ఫోన్ చేస్తాను.  నువ్వు మాత్రం నా ఫోన్ కోసం ఎదురు చూడకు అని మెసేజ్ చేసింది. 
 
నిష్కల  ప్రఖ్యాతి గాంచిన సింప్సన్ థాచర్ & బార్ట్ లెట్ ఫర్మ్ లో టీం మెంబర్ .  ఫ్యామిలీ లా లో మేజర్ చేసింది.  న్యూయార్క్, న్యూ జెర్సీ బార్ అసోసియేషన్ లో సభ్యురాలైంది . విడాకుల విషయంలో , పిల్లల కస్టడీ , పిల్లలకు సహకారం , గృహ హింస , పెళ్ళికి ముందు తర్వాత చేసుకున్న ఒప్పందాలు  విషయాలన్నిటినీ తన పరిధిలో  న్యాయం కోసం ప్రయత్నిస్తుంది. 
 
అంతర్జాతీయ జర్నలిస్టుగా పని చేయాలనుకున్న నిష్కల న్యాయ రంగంలోకి రావడం ఏంటి? స్ట్రేంజ్ .  చిన్నగా నవ్వుకుంది. 
జీవితం ఇంతేనేమో .. మనం ఒకటి అనుకుంటాం.  మరో దారిలో ప్రయాణిస్తాం. 
ఆఫ్ కోర్స్, నా దారికి ఎవరూ అడ్డు రాలేదు. నా బాట నేను చేసుకు పోతున్నాను.  అందులో ఎవరి ప్రమేయం లేదు. నా జీవితానికి నేనే కర్త, కర్మ, క్రియ. 
మంచైనా , చెడైనా అందుకు బాధ్యురాలిని నేనే. 
అమ్మ జీవితం అలా కావడానికి బాధ్యురాలు అమ్మ కాదు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు.  
ఎదుగుతున్న క్రమంలో అమ్మ జీవితం గురించిన ఆలోచనలు ఎన్నిసార్లు చేసింది.  తన పుట్టుకకు కారణమైన తండ్రిని చాలా సార్లు తిట్టుకుంది.  లోపల గూడుకట్టుకున్న భావనలు అమ్మకి తెలియనిచ్చేది కాదు.  తెలిస్తే ఆమె బాధ పడుతుంది అనే స్పృహ ఎప్పుడు నిష్కలను వెన్నంటి  ఉండేది.  
అట్లాగని  అమ్మని బాధ పెట్టలేదా అని ఎవరైనా అడగొచ్చు. 
చాలా సార్లు తెలిసి తెలిసి బాధ పెట్టింది.  అది అమ్మ బాధ పడాలని కాదు. తన మనసుకు నచ్చింది చెయ్యడం కోసం.  అమ్మ ఎప్పుడూ అమితంగా ప్రేమించే బిడ్డను గెలిపించింది.  అమ్మ బాధ పడింది కానీ ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. 
ఎంత మంచి అమ్మ.  ఇటువంటి అమ్మలు ఎంతమంది ఉంటారు?  ఎంతమందికి ఉంటారు? 
 
నాన్నతో ఉండి ఉంటే అమ్మ ఎలా ఉండేది .. ఇప్పుడున్నంత పరిపక్వంగా ఆలోచించేదా ..! 
పిన్ని , అత్త వాళ్ళ లాగా అదే రకమైన ధోరణి లో ఉండేదా ..?! ఏమో ఊహించడం కష్టం గా ఉంది. 
నేను అమ్మానాన్నలతో అమెరికాలో పెరిగి ఉంటే ఎలా ఉండేదాన్ని?!
 
గడిచిపోయిన కాలం లో లేని జీవితం గురించి ఆలోచించడం అంత శుద్ధ దండగ మరొకటి లేదు. తాను ఎందుకిలా ఆలోచిస్తున్నది అనుకుంటూ చేతిలో కప్పు సింక్ లో పెట్టి వచ్చింది. 
 
గతంలోకి తొంగి చూస్తున్న ఆలోచనల్ని కట్టడి చేస్తూ చేతిలోకి పుస్తకం తీసుకుంది.  చదువుతుంటే తల మరింత భారం అయింది. మూసేసి వెళ్లి పడుకుంది. 
తన ముందున్న కేసులు, చేయవలసిన పనులు పలకరించి వెళ్లాయి.  
 
వాటి గురించి ఆలోచిస్తున్న ఆమెకు తాను ఫ్యామిలీ అటార్నీగా పనిచేయడం ఒకింత వింతగా అనిపించింది.  
జీవితం ఎంత విచిత్రమైనది. ఎటు నుంచి ఎటు తీసుకు పోతుందో.  ఏ దరికి చేరుస్తుందో అని చిన్నగా నవ్వుకుంది. 
 
తన ఎరుకలో బంధు మిత్రుల కుటుంబాల్లో లా చదివిన వాళ్ళెవరూ లేరు.   అసలు ముందెప్పుడూ లా చదవాలని అనుకోలేదు.  ఒక సంఘటన లా చదివేందుకు పురికొల్పింది.  
 
మన జీవితంలోకి వచ్చినవో, చుట్టూ ఉన్న జీవితాల్లో చూసినవో మన ఆలోచనలను ఎంత ప్రభావితం చేస్తాయో, మన గమ్యాన్ని ఏ దిశలో మలుపు తిప్పుతాయో మనకు తెలియకుండానే జరిగిపోతుంది. 
 
పదో తరగతి డిస్టింక్షన్ లో పాసయింది.  నాకు చదువుపై ఉన్న శ్రద్ధ చూసి అమ్మ చాలా ఆనంద పడింది.  
నేను మెడిసిన్ చదివితే బాగుంటుందని  అమ్మ అనుకుంది.  అది ఆమె తీరని కోరిక. కల. 
అందుకే ఇంటర్ లో సైన్స్ గ్రూప్ లో చేర్చాలని ఆశపడింది.  దానికి తోడు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సైన్స్ గ్రూప్ తీసుకున్నారు.  వాళ్ళ సహవాసం కూడా నాకు ఉంటుంది అని అమ్మ ఆలోచన. 
అమ్మా.. నువ్వు అట్లా ఎలా నిర్ణయం తీసుకుంటావ్ .  చదవాల్సింది నేను. నాకు ఏం కావాలో , నా ఆసక్తి ఏంటో తెలుసుకోకుండా సైన్సు లో ఎలా చేర్చాలనుకున్నావ్ అని నిలదీసే ప్పటికీ  బిక్క చచ్చిపోయింది అమ్మ.  
అదేంటే నువ్వు కూడా చిన్నప్పుడు డాక్టర్ అవుతా, సైంటిస్ట్ అవుతానని చెప్పే దానివి.  నాకు నువ్వు డాక్టర్ అవ్వాలని కోరిక. అందుకే సైన్స్ లో చేరుద్దామని అనుకున్నా అంటున్న తల్లిని ఆపింది. 
తెలియనితనంతో అప్పుడేదో అనుకున్నా. కానీ ఇప్పుడు అలా అనుకోవడం లేదు.  నాకు మాథ్స్ అంటే ఇష్టం.  అని ఇంటర్లో మ్యాథ్స్ తో ఎంపీసీ  తీసుకుంది. 
 
ఇంటర్ లో ఉండగా క్లాసులో అందరితో పాటు ఎంసెట్ ఎంట్రన్స్ రాసింది. కానీ ఏనాడూ అందుకోసం ప్రిపేర్ కాలేదు.  అయినా మంచి ర్యాంక్ వచ్చింది. 
కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ వుమన్ లో ఇంజినీరింగ్ లో  చేరుద్దామని అమ్మ ఆ కాలేజి గురించి చాలా సమాచారం సేకరించింది.  
 
ఎప్పుడు ఆడపిల్లల స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజీ లో చదవడం ఏంటమ్మా.. నాకెందుకో అలా నచ్చలేదు.  నేను కో ఎడ్యుకేషన్ లో చదవాలనుకుంటున్నాను అని స్పష్టం చేశాను. 
 
నాకు ఇంజినీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు.  నేను బిఎ చదువుతానని చెప్పినప్పుడు అమ్మ మొహం చాలా చిన్నబోయింది.  కానీ అమ్మ కోసం నా భవిష్యత్ మార్గాన్ని మార్చుకోలేను.  నా ఆసక్తులను వదులుకోలేను.  ఆ విధంగా చేసినా అమ్మ సంతోషంగా ఉండ లేదని నాకు తెలుసు. 
 
ఏమోనే నిషి ఓ పట్టాన అర్థం కాదు. బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వెళ్తుందని, మంచి భవిష్యత్ ఉంటుందని ఆశపడ్డాను. నిరాశ ఎదురైంది.   
 
లోకమంతా మెడిసిన్, ఇంజనీరింగ్ అంటుంటే ఇదేంటీ .. అవి కాదంటున్నది.  చదువు రాక ఏదో బి ఏ తో కాలక్షేపం చేద్దామని అనుకుంటున్నదేమో అంటే అదీ కాదు. మెరిట్ స్టూడెంట్.  కానీ తన అభిరుచులు మాత్రం మిగతా పిల్లలకి బిన్నంగా.  ఎక్కడ ఊగిసలాట ఉండదు. ఉన్నది ఉన్నట్లు స్పష్టం చేస్తుంది. 
తనకు తోచిన విధంగా, మనసుకు నచ్చిన విధంగా చేసుకు పోవడం బహుశా ఆ తండ్రి లక్షణమేమో .. అని అమ్మ ఏదో సందర్భంలో పిన్ని తో ఏదో మాటల్లో చెప్పడం విన్నాను. కానీ బహిరంగంగా ఎవరితో ఎప్పుడు అనేది కాదు.   
 
 
బలవంతంగా నాకు నచ్చని చదువు చదవమని చెప్పే తత్వం కాదు అమ్మది.  
పిల్లలకు నచ్చని విషయాన్ని రుద్దడం వల్ల కలిగే అనర్ధం వల్ల ఏమి జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు.  ఆ విషయం అమ్మ ఎప్పుడు మర్చిపోలేదు. 
బాధితురాలు అమ్మ ఒక్కటే కాదు.  నేను కూడా. తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగింది.  అమ్మే తల్లీ తండ్రీ అయి ఏ ఇబ్బంది తెలియకుండా పెంచింది. 
ఎప్పుడు, ఏమి నా మీద రుద్దలేదు.  తనకిష్టం ఉన్నా లేకున్నా నా అభిప్రాయాన్ని గౌరవించింది. 
 
నా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనైనా అంతే.  ఎదుటివారి జీవితాల్లోకి చొచ్చుకుపోయి అవసరం ఉన్నా లేకున్నా సలహాలు , సూచనలు ఇవ్వదు.  తన బాధ్యతగా నా విషయంలో కొన్ని ఆలోచనలు చేసింది.  నేను అమ్మ మాట వింటాను. కానీ నా ఇష్టాఇష్టాలను కాదని కాదు.  
 
 
ఆడ, మగ కలిసి చదివినప్పుడే కదా ఒకరి గురించి ఒకరికి అర్ధం అయ్యేది అంటూ ఆర్ట్స్ కాలేజీలో బిఎ లో చేరాను. ఏది చదివినా దృష్టి పెట్టి చదివేదాన్ని. ఎప్పుడూ మంచి మార్కులు వచ్చాయి.  చదువుతో పాటు కాలేజీ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొనేది. 
 
వివిధ ఛానల్స్ లో పని చేస్తున్న ఆడవాళ్లను టీవీ ఛానల్స్ లో చూస్తుంటే తను కూడా వాళ్ళ లాగా పని చేయాలన్న కోరిక మొదలైంది. 
 
బిఎ అవగానే ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుంది.  
జర్నలిజం చదువుతూనే ఓ మీడియా ఛానెల్ లో న్యూస్ ప్రజెంటర్ గా చేరింది. 
చదువు పూర్తి అయ్యాక అమెరికాలో జర్నలిజం చేయాలనుకుంది. 
GRE , TOFEL  రాసి మంచి స్కోర్ సాధించింది. 
 
యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ లో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ లో సీటు తెచ్చుకుంది. 
ఆ కాలేజీలో చేరినప్పటి నుంచి పార్ట్ టైం ఉద్యోగం చూసుకుంది.  తన ఫీజులకు, తన ఖర్చులకు సరిపడా సంపాదించుకుంది.  దానితో పాటు కాలిఫోర్నియాలో ఉన్న తెలుగు విద్యార్థులు, కుటుంబ సమస్యలు తెలుగు మీడియా కి రిపోర్ట్ చేయడం మొదలుపెట్టింది.  
 
ఆ క్రమంలో  ఓ బాధితురాలి గాధ మనసును మెలిపెట్టి చాలా బాధ పెట్టింది. తను రిపోర్ట్ చేయడం వల్ల ఏమి లాభం లేదు. 
ఆమెకు, అలాంటి ఇబ్బందులు పడుతున్న యువతులకు ఏదైనా సహాయం చేయాలని బలంగా అనిపించింది.  
  
భారతదేశంలో పెళ్లిళ్లు చేసుకుని అమెరికాలో ఉంటున్న జంటల్లో ఎన్ని జంటలు  సవ్యంగా ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయని ఆలోచన మొదలైంది.  కసాయి వారిని నమ్మిన గొర్రె పిల్లలా భర్త వెంట కలల ప్రపంచం లోకి వచ్చాక గానీ తెలియడం లేదు. మనం వచ్చింది కలల లోకంలో కాదు వధ్య శిల పైకి అని.   
 
అటువంటి వారికి అమెరికన్ న్యాయ సలహాలు ఏ విధంగా పొందవచ్చో మొదట ప్రయత్నం చేసింది. అవి అర్థం కాలేదు. ఆ క్రమంలో కదా లా చేయాలని నిర్ణయించుకుంది అనుకుంటూ కొద్దిగా పక్కకి వొత్తి గిల్లింది.  వ్యాక్సిన్ వేయించుకున్న  చేయి నొప్పిగా ఉంది.   ఎడమ చేతికి వ్యాక్సిన్ తీసుకున్న విషయం మర్చిపోయి అటు తిరిగింది అనుకుని కుడివైపు కు తిరిగింది. 
 
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మిత్రులెవరూ ఇంత బాధపడినట్లు చెప్పలేదు.  ఒకరిద్దరు  మొదటి డోస్ వేసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సెకండ్ డోస్ ఎవరికీ సమస్య రాలేదు. 
తనకు మోడెర్నా వ్యాక్సిన్ వేశారు.  మొదటి డోస్ కొద్దిగా చేయి నొప్పి తప్పితే మరే సమస్య రాలేదు.  
రెండో డోస్ ఇంత ఇబ్బంది పెడుతున్న దేమిటో అనుకుంటూ మంచం మీద వాలింది.
తల దిమ్ముగా ఉంది.  లేచి  జ్వరానికి టాబ్లెట్ వేసుకుని పడుకుంది. కానీ 
నిద్ర పట్టడం లేదు.  
కళ్ళు మూసుకుంటే ఆ అమ్మాయి కళ్ళముందు కదలాడింది.  తనకంటే ఒకటి రెండేళ్లు చిన్నది. కావచ్చు . అంతే 
 ప్చ్ , వందేళ్ల బాధలు అనుభవించింది.  పెళ్లంటే భయపడి పోయింది. 
ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టు కరుణ గల మనిషి. 
లేకపోతే ఆ దుర్మార్గుడు కటకటాల్లో ఉండేవాడు.  చేతినిండా డబ్బు, మంచి ఉద్యోగం ఊడి వాడి అహంకారం, అధికారం దిగేది.  
 
అసలు ఆడపిల్లలది కూడా తప్పే .  ముక్కు మొహం తెలియని వారిని  గుడ్డిగా ఎట్లా నమ్ముతారు..  మంచో చెడో ఆలోచించక్కర్లా.. 
అబ్బాయి ఎన్నారై , విదేశాల్లో పెద్ద ఉద్యోగం,  చేతి నిండా సంపాదన ఉన్నతను తమ అల్లుడని, తమ కూతురికి భర్త అని చెప్పుకోవడం గొప్పగా మారిపోయింది.  అబ్బాయి వైపు నుండి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందంటే చాలు ఎగిరి గంతేస్తున్నారు.  ఇంకేమీ ఆలోచించే పనిలేదు.  
పెళ్లి చూపులు మొదలు పెళ్లి వరకు అంతా హడావిడిగా , వైభవంగా కానిచ్చేస్తారు. 
 పెళ్లయ్యాక భార్యతో నాలుగు రోజులు గడిపి వీసా వచ్చాక తీసుకుని వెళ్తానని చెప్పి పోయి వెనక్కి  కన్నెత్తి చూడరు కొందరు. 
అబ్బాయికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు తమకు నచ్చినట్టు పెళ్లి చేయడమే అందుకు ప్రధాన కారణం.  
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం? 
 
కొందరేమో తమతో పాటు తీసుకుపోతారు. అందరి ముందు ఎంతో ప్రేమ ఒలకబోస్తారు. కానీ ఆమె ముందు మాత్రమే తమ అసలు రూపం బయట పెడతారు.  తమ ఆధిపత్యం, అహంకారం చూపించుకుంటూ శాడిస్టులు గా మారిపోతారు. ఆదరించరు.  
అదంతా పట్టని తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితం చీకు చింత లేకుండా హాయిగా సాగిపోతున్నదని  కలలు కంటారు. 
తల్లిదండ్రులు అంతే గొప్ప స్టేటస్ కావాలి వాళ్ళకి. ఎటువంటి వారికి బిడ్డను కట్టపెడుతున్నారో వెనక ముందు ఆలోచించే పనేలేదు. 
 
మళ్ళీ ఆ అమ్మాయి రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. 
ప్చ్  కరుణ. 
ఆ కరుణ స్థానములో తనుంటేనా .. వాడికి బుద్దొచ్చేలా చేసేది .  విషయం తెలిసి ఇంకొకడు అట్లా ప్రవర్తించకుండా ఉండేలా చేసేది అనుకుంది. 
 
 ***
ఆ రోజు సాన్ జోస్ లో ఉన్న మిత్రురాలు సరస్వతిని కలిసి క్యాంపస్ కి బయలుదేరింది నిష్కల.   
వాతావరణం చల్లగా ఉంది. మామూలు కంటే ఆ రోజు మరింత చల్లగా ఉండడమే కాకుండా చలి గాలులు కూడా ఉన్నాయి. గబగబా బస్సు పాయింట్ దగ్గర కు గబగబా నడుస్తున్నది. మరో నాలుగు  నిమిషాల్లో బస్ ఉంది.   
 
హెల్ప్ హెల్ప్ .. అని బిగ్గరగా ఆడవాళ్ళ గొంతుని గాలి మోసుకొచ్చింది .  వెనక్కి చూసింది.  ఎవరూ కనిపించలేదు. 
మళ్ళీ హెల్ప్ హెల్ప్ అని వినిపిస్తోంది. 
ఒక్క నిమిషం అలాగే నిలుచుంది. ఆ అరుపు తనని చూసే అని అర్థమయింది.  గబగబా ఆ అరుపు వినిపించిన వైపు చూసింది.  కిటికీలోంచి చేయి ఊపుతూ ఒక అమ్మాయి. ఇక ఆలస్యం చేయలేదు. అటుకేసి నడిచింది. 
 
పాతికేళ్ల లోపు ఉన్నమ్మాయి.  ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు, పీక్కుపోయిన మొహం. కిటికీలోంచి దీనంగా చూస్తూ.. 
 
మీకు నేనేం హెల్ప్ చేయగలను ప్రశ్నించింది  నిష్కల.  
 
అంతలో  బస్ ఎక్కావా అంటూ మిత్రురాలి ఫోన్.  కాల్ తీసుకుని ఇంకా లేదు. నేను మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసింది. 
 
మీ ఫోన్ ఇస్తే ఒక్కసారి మా వాళ్లతో మాట్లాడుకుంటాను.  కొంచెం ఇవ్వగలరా   అర్థించింది ఆమె. 
 
ఆశ్చర్యం వేసింది.  ఫోన్ చేసుకోవడం కోసం ఇలా హెల్ప్ అడగడం ఏంటి ?  ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి సంఘటన వినలేదు. 
ఆమెను చూస్తే ఏదో పెద్ద ఇబ్బందిలో ఉన్నట్టు తోచింది. 
మారు మాట్లాడకుండా ఫోన్ ఆమె చేతికి ఇచ్చాను.  ఆత్రంగా అందుకున్న ఆమె వెంటనే డయల్ చేసింది.  కాల్ కనెక్ట్ కాలేదు. 
 
ఎక్కడికి ? ఇండియా నా అని అడిగి ముందు కోడ్ ఆడ్ చేయమని చెప్పింది నిష్కల. 
ఆమెకి కోడ్ తెలియదు అంటే ఆమె చదువు కోలేదు కావచ్చు .. అందుకే ఆమె దగ్గర ఫోన్ లేదేమోనని సందేహం వచ్చింది. 
 
మీరు నంబర్ చెప్పండి. నేను డయల్ చేసి ఇస్తానని చెప్పి ఫోన్ తీసుకుంది. 
 
ఆమె చెప్పిన నంబర్ రీచ్ అవడం లేదు.   
మరో నంబర్ చెప్పింది. రింగ్ అయింది. ఫోన్ ఆమె చేతికి ఇచ్చింది నిష్కల. 
 
అక్కా ఎలా ఉన్నారు. 
అమ్మానాన్న , నువ్వు అమెరికాలో సంతోషంగా ఉన్నానని పొంగిపోతున్నారు కదూ..  మీరు పెళ్లి చేసి నన్ను పంపింది నా కలల స్వర్గానికి కాదే నరకానికి. 
 
అవును, నరకానికే. 
మేడిపండు చూడ్డానికి బాగుంటుంది.  కానీ పొట్ట విప్పి చూస్తే గా పురుగులు ఉన్నాయని తెలిసేది.  నా మొగుడు, నా కాపురం కూడా అంతే. 
నేను ఇంటికి వచ్చేస్తానక్కా.  అమ్మకి నాన్నకి చెప్పు.
చెప్పనంటే ఎట్లా .. నేనీ నరకంలో పడి చావడమేనా .. 
 
కాదక్కా నాది బెంగ కాదు.  
 
ఏమని చెప్పను నేను పడుతున్న బాధ గురించి.  అతని దృష్టిలో నేను మనిషిని కాదు. ఒక బొమ్మని. అందమైన బొమ్మని. నాకు మనసు ఉండదు. ఆలోచన ఉంటుందని తెలియదు. 
నన్ను తిట్టడం కాదు. నా బాధ అర్థం చేసుకోండి.  
మూడు నిద్రలకి మనింటికి తీసుకు వచ్చే వరకు నేను సంతోషంగా ఉన్నాను. సరదాగా మాట్లాడే అతని మాటలకి పొంగిపోయాను. 
మొదటి రాత్రి అతని స్వరూపం ఏంటో తెలిసింది.  గదిలోకి వెళ్లిన నాపై ఆకలితో ఉన్న పులిలా పడ్డాడు.  ఏదేదో చేశాడు. వద్దని వేడుకున్నాను. వింటాడా .. ఉహు.. లేదు, వినలేదు.  
నా మనసేంటో తెలుసుకోకుండా నా మీదకి ఎగబడ్డప్పుడే సగం చచ్చిపోయాను. 
మరుసటి రోజు రెండుకాళ్ళ మధ్య అయిన గాయం సలుపుతూనే ఉంది. అమ్మకో , నీకో చెప్పాలనుకున్నాను.  కానీ ఎలా చెప్పాలో తెలియక చెప్పలేక పోయాను. 
మౌనంగా యాతన అనుభవించాను.  
రెండో రోజు నా మొహం చూసి అమ్మ అడిగింది ఎందుకలా ఉన్నావని.  ఏడ్చేశాను .  
ఏమైందో అర్థం కాక అమ్మ గాభరా పడిపోయింది. కొంచెం సేపు అమ్మ ఒళ్ళో పడుకుని సేద తీరిన తర్వాత చాలా నొప్పిగా ఉందమ్మా అని మాత్రం అనగలిగాను.  
అమ్మకు అర్థమయింది . నా తల నిమురుతూ మొదట్లో అలాగే ఉంటుంది తల్లీ .. తర్వాత అంతా సర్దుకుంటుంది. భయపడకు అని నన్ను ఓదార్చింది. 
 
అమెరికా మీద నాకున్న మోజు, అమ్మ ఓదార్పు నన్ను అతనితో ఇక్కడిదాకా నడిపించింది.  
పుండు పడిన దేహంతో, మనసుతో అమెరికా చేరాను.  
 
మనసుకు దగ్గర కాకుండా ఎంత సేపు శరీరంతో ఆటలాడుకోవడం మాత్రమే  అతనికి కావలసింది.  
నొప్పితో విలవిలలాడుతున్న నన్ను మరింత నొప్పి కలిగిస్తూ అతని మాటలు .. చేతలు. 
నిన్న రాత్రి అతని కోరిక కాదన్నానని కిచెన్ లో కత్తి తీసుకుని నా మీదకు వచ్చాడు. అతనో సైకో.   
చాలా భయమేసిందక్కా .. నా పని అయిపోయింది, ఇక మీకు కనపడను అనుకున్నాను.  బాత్ రూమ్ లో దూరి తలుపేసుకున్నాను.  
అయినా వదిలాడా .. లేదు. 
కాసేపు తలుపు దబదబా బాదాడు. తీయలేదు. 
మొదట నోటికొచ్చినట్టు తిట్టాడు. 
గతిలేని దాన్ని తీసుకొచ్చి అందలం మీద కూర్చో పెడితే తెగ నీలుగుతున్నానట.  అమ్మానాన్నలకు నన్ను పెంచడం చేతకాలేదట. వంట రాదు, ఇంటి పనులు రావు అంటే ఏదో సర్దుకు పోతున్నా. మొగుడికి సుఖం ఇవ్వలేని దాన్నట.  
మొగుడు చెప్పినట్టు నడుచుకోని పెళ్ళాం పెళ్ళామే కాదట. 
నేనెప్పుడూ వినని భాషలో నన్ను , అమ్మని నాన్నని తిడుతుంటే సిగ్గుతో చచ్చిపోయాను.  మానసికంగా హింస. శారీరకంగా హింస. 
 
అతను శాడిస్ట్ అక్కా.  ఆ అర్ధరాత్రి పూట అతని అరుపులు ఎన్ని ఇళ్లకు వినపడిందో తెలియదు.   
నోరు నొప్పి పెట్టిందేమో, అలసి పోయాడేమో కాసేపు శాపనార్ధాలు ఆగిపోయాయి. 
 
నిద్రపోయాడేమో ననుకుని నెమ్మదిగా బాత్ రూం లోంచి బయటికి రావాలని అనుకుంది.  తలుపు తీసేసరికి బాత్ రూం గుమ్మం ముందు పీఠం వేసుకుని కూర్చున్నాడు.  నేను గబుక్కున తలుపు వేయబోతే ఒక్క ఉదుటున తలుపు తోశాడు.  
నా చెయ్యి పట్టుకుని గదిలోకి ఈడ్చుకొచ్చి నా కాళ్ళ వేళ్ళ పడటం మొదలు పెట్టాడు.  ఇంకెప్పుడు ఇలా చెయ్యనని నా మీద కొట్టేశాడు. 
నిజమే కావచ్చని నమ్మాను.  
 
పేడుముక్కలాగా పడి ఉంటావు. సుఖం లేకుండా పోయింది అంటూ నన్ను పక్కకు తోసేసి తాగడం మొదలు పెట్టాడు. 
 బతుకు జీవుడా అని నా మానాన నేను పక్కకు ఒత్తిగిలి పడుకున్నాను. కాసేపటికి గొంగళి పురుగు లాగా అతని వేళ్ళు నా శరీరంపై కదలాడుతున్నాయి. 
లేచి అవతలికి వెళ్ళిపోయాను. నా వెనకే వచ్చినతను నన్ను మీదకు లాక్కున్నాడు. తోసేసి పరుగు పెట్టాను.  
తాగిన సీసా పగులగొట్టి దాంతో నా వెనక పడ్డాడు. నా చేతికి ఆ గాజు ముక్కలు దిగాయి.  రక్తమోడుతున్న చేత్తో అతనికి దొరక్కుండా ఉండడానికి ప్రయత్నించాను. చివరికి సోఫా తట్టుకుని పడబోయాను. దొరికిన నా జుట్టు పట్టుకుని ఈడుచుకుంటూ బెడ్ రూం లోకి లాక్కెళ్లాడు. వెను దిరగబోతున్న నన్ను గోడకేసి కొట్టాడు .  తల తిరిగి పడిపోయాను.  నాకు స్పృహ వచ్చేసరికి అతను లేడు.  ఆఫీస్ కి వెళ్లినట్లున్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేశాడు. నేను ఫోన్ తీసుకోలేదు. 
వస్తాడు. ఏ నిముషమైనా రావచ్చు అని దీర్ఘంగా నిట్టూర్చింది ఆమె. 
 
అక్క మౌనం ఏమీ అర్ధమయినట్లు లేదు.  మళ్లీ తనే అన్నది. 
 
నా ఇంజనీరింగ్ చదువు, నేను చేయాలనుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం కల అన్నీ నిన్నలలో కలిసిపోయాయక్కా .. ఇక నేను లేను. ప్రస్తుతం ఉన్న ఈ శరీరం అతనిది. అంతే .. 
 నువ్వు అలా అంటే ఎలా అక్కా .. మీకు నేను అవసరం లేదా .. నాకంటే మీ పరువు ప్రతిష్టలు ముఖ్యమా ? 
నువ్వు నా తోడబుట్టిన అక్కవని సిగ్గు విడిచి నా గోడు వెళ్లబోసుకున్న.  
నువ్వు కూడా అంతేనా .. నేను మీ ఎవరికీ అవసరం లేదా .. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.  
 
నాకు మాత్రం సరదానా?  చెప్పక్కా. 
అమ్మ నాన్న తల తాకట్టు పెళ్లి చేసిన విషయం నాకు తెలియనిదా .. 
నాకు మాత్రం చక్కని సంసారం ఉండాలని కోరిక ఉండదా.. 
కానీ ఈ నరకంలో నేనుండలేను. 
 
నరకం కాక ఏంటక్కా.. చిన్నప్పుడు నువ్వు చెప్పిన యమధర్మరాజు నూనెలో వేసి వేయించడం కి భిన్నంగా ఏమీ లేదక్కా ఇక్కడ నా పరిస్థితి. 
 
రేపటికి నేను ఉంటానో లేదో నాకు తెలియదు.  మిమ్మల్ని చూడ గలనో లేదో నాకు తెలియదు.  
రేపు నా పై ఎటువంటి రంగులు పులిమి బుడి బుడి ఏడుపులు ఏడుస్తాడో కూడా తెలియదు. 
నువ్వన్నట్టు అతన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకర్ధం కాదు. అంతటి చాకచక్యం నాకు లేదు.   ఒంటరిని అక్కా . 
 
దేశం కాని దేశంలో జైల్లో బందీలా పడి ఉన్నాను అక్కా 
 
నేనింత సేపు చెప్పినా నా  పరిస్థితి అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవేం.. నా వైపు నుండి ఆలోచించవేం 
నీ చెల్లెలు చెప్పే విషయాలపై నీకు నమ్మకం లేదా 
ఎంతసేపూ నువ్వు నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నావే కానీ నా సమస్యను ఎలా పరిష్కరించాలో చూడడం లేదక్కా .. 
నీకు ఏమైంది ? చెల్లెలు అంటే నీ ప్రేమ ఇదేనా ?  
 
మీ బుర్రలో అతని స్థానం ఎంత పదిల పరుచుకున్నాడో అర్థమయింది. 
చిన్నప్పటి నుండి నేనేంటో నీకు తెలుసు. అయినా నువ్వు నామాటలు నమ్మడం లేదు. 
ఇంటి మీద బెంగతో నేనేదో కట్టుకథ అల్లాను అనుకుంటున్నావు కదక్కా.. 
 
నేనెక్కడికి పారిపోతానో అని అతని భయం కావచ్చు. ఇంటికి తాళం వేసుకుని పోతున్నాడు. 
నాకు ఫోన్ చేసుకునే వెసులుబాటు ఉండదు.  తను ఫోన్ చేస్తాడు గంట గంటకి. 
అంత వరకే నాకున్న ఫోన్ సదుపాయం.  
నాకు ఇంటర్నెట్ ఉండదు . నేను మీకు ఫోన్ చేయకూడదు.  అతను ఫోన్ చేసి ఇస్తే అతని ముందు మాట్లాడాలి. 
వెనకటి రోజుల్లో ఆఫ్రికా దేశాన్నుంచి బానిసల్ని అమెరికన్లు  కొనుక్కు తెచ్చుకునేవారని విన్నాను. 
ఒకరకంగా నన్ను అలాగే తెచ్చుకున్నా అనుకుంటున్నాడు . 
కాకపోతే అతను అమెరికాలో ఉంటున్న భారతీయుడు. నేను భారతీయురాలిగా  పెళ్లి పేరుతో ఎదురు కట్నం తీసుకుని తీసుకొచ్చా. 
అంతే తేడా . అతను నన్ను చూసే విధానం మాత్రం బానిసగానే. 
 
ఇంక చాలక్కా .. చాలు . 
పది రోజుల్లో పది జన్మలకు సరిపడా బాధలు పడ్డాను.  ఇక నా వల్ల కాదు. 
 
నీకర్థం కాదా నా బాధ. ఇంకా ఎవరికీ చెప్పుకోగలను?  
ఈ మాటలైనా దారిన పోతున్న ఒక అమ్మాయిని కిటికీలోంచి పిలిచి ఫోన్ తీసుకుని చెప్పుకో గలుగుతున్నాను. 
రేపటి రోజు నాకు లేదు. మళ్ళీ నా మాటలు వినగలవో లేదో .. 
ఫోన్ కట్ చేసింది.  
 
ఆ ఇంటి లాన్ లో పచార్లు చేస్తూ విన్న మాటలు పొందికగా పెంచిన గార్డెన్ ని చూస్తూ ఆ ఇంటి యజమాని ప్రవర్తనకి విస్తుపోయింది నిష్కల.  
 
ఫోన్ మాట్లాడ్డం అయిపోయిన ఆమె అందమైన మొహంలో జలపాతాల హోరు అగుపించింది నిష్కలకి.  
కారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ  అయామ్ సారీ .  మీకు చాలా ఇబ్బంది కలిగించాను అంటూ ఫోన్ నిష్కల చేతిలో పెట్టింది.
 
ఇప్పటివరకు ఆ అక్కాచెల్లెళ్ల మాటలు విన్న నిష్కల హృదయం బరువెక్కింది.  ముక్కు మొహం తెలియని అతని భర్తపై కోపం ఎగదన్నుకొచ్చింది.
 
ఆ అమ్మాయి కేసి చూస్తూ మీ పేరేంటి అని అడిగింది. 
కరుణ అని చెప్పి ఏంటి మీరు తెలుగువాళ్ళా .. ఆశ్చర్యంగా అడిగింది. 
నార్త్ ఇండియన్ కావచ్చు అనుకున్నా. 
అయితే అంతా విన్నారన్న మాట. తప్పు చేసిన దానిలా  తలదించుకుని అన్నదామె . 
అవును. తెలుగు అమ్మాయినే. నా పేరు నిష్కల. మాది వరంగల్ .  
మీరు ఎందుకు తల దించుకుంటున్నారు. 
మీరేం తప్పు చేయలేదని, మీ పరిస్థితి ఏంటో నాకు స్పష్టంగా అర్థమైంది కరుణా. 
మోసపోవడం మోసగించడం రెండు మానవ నైజం. 
భయపడకండి. కంగారు పడిపోకండి. మీకు అండగా నేనున్నాను.  మీకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. 
రేపు మిమ్మల్ని మధ్యాహ్నం నేను మళ్ళీ కలుస్తాను. అంత వరకు ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోకండి అని భరోసా ఇచ్చింది నిష్కల . 
 
విషయం అంతా విన్న నా తోడబుట్టిన అక్క ఇవ్వని ధైర్యం మీరిస్తున్నారు. వేలవేల ధన్యవాదాలు అంటూ చేతులు జోడించింది కరుణ.  
 
ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను.  నేను ఇండియా వెళ్ళిపోవాలి. మా అమ్మ నాన్న దగ్గరకు వెళ్ళిపోవాలి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది కరుణ.  
 
తప్పకుండా నేను చేయగలిగిన సహాయం చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి.  శాడిస్ట్ మొగుడికి బుద్ది చెప్పాల్సిందే.  
 
ఇప్పుడు నేను అత్యవసరంగా వెళ్ళిపోవాలి. 
రేపు మధ్యాహ్నం వస్తాను .   భయంతో ఉండడం కాదు. 
ఎలాంటి స్థితిలోనైనా ఎదుర్కోవడానికి జాగరూకతతో మెలగండి. తెలివిగా వ్యవహరించండి.  రేపు మీదే అంటూ  ధైర్యం ఇచ్చే మాటలు చెప్పింది నిష్కల. 
 
ఏమో .. మీ మాటలు వింటుంటే నాకు కొద్దిగా ధైర్యం వస్తున్నది.   
గెలుస్తామనే ఆశను మించిన భరోసా ఈ భూమి మీద మరొకటి లేదు. గెలిచి ముందు రక రకాల ఓటములు తప్పవనే అవగాహన గొప్ప భరోసా కిందే లెక్క అన్నది కరుణ. 
 
నేను లోపల మీరు చలిలో.. అలా నిలబెట్టి చాలా ఇబ్బంది పెట్టేశా. వాతావరణం మరింత చల్లగా మారుతున్నట్లుగా ఉన్నది.  మన్నించండి అన్నదామె.  రెండు చేతులు జోడిస్తూ. 
 
ఆమె మాటల్లో ఒక కంగారు కూడా ధ్వనించింది నిష్కల కి.  
 
కరుణా రేపు మీదే.., ఆ విషయం మర్చిపోకండి అని మరోసారి చెప్పి వడివడిగా బస్ స్టాప్ కేసి అడుగులేసింది నిష్కల. 
ఇప్పటికి వరకు తెలియని ప్రపంచమేదో తెలుసుకున్నట్లుగా ఉన్నది ఆమెకు.  
 
ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కరుణ ఇంటి ముందు కారు  ఆగింది. 
 

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.