స్నేహహస్తం

-డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో!
శూన్యం నిండిన నా ఎదలోనికి
సంపెంగల తావివై తరలివచ్చావు
స్నేహ సుగంధమై పరిమళించావు.

మమత కరువై బీటలు వారిన
నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు
ముద్ద ముద్దలో మమకారం రంగరించి
మధువు తాపి మాలిమి చేసుకున్నావు

ఆకాంక్షల కౌగిలివై కమ్ముకున్నావు
వ్యామోహపు మత్తువై హత్తుకున్నావు
నీ ఆలింగనంలో మైమరచిన నన్ను
నిస్సంకోచంగా నెట్టివేసావెందుకు?

నీవు నేను మమేకమనుకున్నా
నా గుండె ఆలాపన వింటున్నావనుకున్నా
నీ నీడ దాటి అడుగేసానని అలిగావా?
నీ గరిమను గారవించలేదని కినిసావా?

అల్లుకున్న చెలిమి తీవెలు తెంచేసావెందుకు?
అవ్యక్తమైన నా ప్రేమ నీ తనివి తీర్చలేదా?
కాలంలో నీ జాడలు కరిగిపోక ముందే
కలుప గలవా నేస్తం మరోసారి నీ స్నేహహస్తం

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.