కథా మధురం  

అల్లూరి గౌరీ లక్ష్మి

మూడు తరాల స్త్రీల మనోభావాల ముప్పేట కలనేత ఈ కత!

-ఆర్.దమయంతి

వొంట్లో నలతగా వున్నా, మనసు లో కలతగా వున్నా, కాపురంలో కుదురు లేకున్నా..విషయాన్ని ముందుగా అమ్మకి చెబుతాం.  అమ్మ అయితే అన్నీ అర్ధం చేసుకుంటుంది. ‘అయ్యో  తల్లీ ‘  అని జాలి పడుతుంది. ఓదారుస్తుంది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలుతుంది. ‘ఇక నీకేం భయం లేదు. నిశ్చింతగా వుండు.’ అంటూ కొండంత అండగా నిలుస్తుంది. కష్ట సమయం లో అమ్మని కళ్ళతో చూస్తేనే సగం భారం తీరిపోయినట్టుంటుంది.  మిగిలిందంతా అమ్మ సాయం తో గట్టెక్కిపోతుంది. చివరికి ఎంత రిలీఫ్! ఎంత సంతోషం! కానీ, అమ్మ తిరిగి వెళ్ళిపోతుంటే మాత్రం కంట్లో సముద్రం. 

సరిగ్గా ఈ కథలో ని కథాంశం కూడా ఇదే. ఐతే ఈ కథలో అమ్మ స్థానం లో అత్తగారు, కూతురి స్థానం లో కోడలు చోటు చేసుకోవడమే ఓ అపురూపమైన విశేషం. అదే ఈ కథ లోని ప్రత్యేకత!

కథేమిటంటే : 

ఆమె టీచర్ గా పనిచేసి,  రిటైర్ అయిన తర్వాత  వున్న వూళ్ళోనే సొంతింట్లో ఏకాంతం గా వుంటూ,  కాలాన్ని ప్రశాంతం గా వెళ్ళబుచ్చుతుంటుంది. ఆ రోజు కోడలు ఫోన్ చేసి ఏడుస్తూ సమస్య ని వివరిస్తూ,  వెంటనే బయల్దేరి  రమ్మంటుంది. ఆ పళాన ఆమె గబ గబా హైదరాబాద్ కి ప్రయాణమై వెళ్తుంది – సమస్యని తీర్చడం కోసం. సమస్యేమిటంటే – ఇంజినీరింగ్ చేసి, ఉద్యోగం లో చేరిన ఒక్కగానొక్క మనవరాలు ఓ ముస్లిం అతన్ని ప్రేమించింది. ఎవరు కాదన్నా అతన్నే పెళ్ళిచేసుకుంటానని భీష్మించుకుని కుర్చుంది. ఇష్టం లేకపోయినా కొడుకు మౌనం గా వున్నాడు. కోడలు కన్నీరు మున్నీరు గా అలుకలాడిపోతోంది. అలా జరగడం ఆమెకి ససేమిరా ఇష్టం లేదు. 

ఇప్పుడేం చేయాలి తను? వొద్దంటే పిల్ల ఊరుకుంటుందా? సరే అంటే తల్లి బ్రతుకుతుందా? ఇదంతా సరే. పక్కన పెడదాం. అసలు వాళ్ళిద్దరిదీ నిజమైన గాఢంపు ప్రేమేనా? పల్లవి ని అడిగితే డౌటే లేదంటుంది. కోడల్ని అడిగితే ‘ దానికి పిచ్చెక్కింది. ప్రేమ అనే భ్రమ లో పడి కొట్టుకుపోతోంది.’ అని మొత్తుకుంటుంది. కొడుకు – ‘దానిష్టాన్ని కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అప్పుడూ పరువు పోతుంది కదా?’ అంటాడు. ఎలా ఈ సమస్యని ఓ కొలుక్కి తీసుకొచ్చి గట్టున పడేయడం?  

ఆమె తెలివిగా శాంతం గా ఆలోచించి, చివరికి సమస్యని పరిష్కరించింది.    

 అయితే, సమస్యని ఎట్నించి ఎటు నరుక్కొచ్చింది? ఎంత చాకచక్యం గా పావులు కదిపింది? ఎవరి మనసూ కించపరచకుండా, మనుషుల మధ్య కోపతాపాలు పెరగకుండా, ఎలా ఈ చిక్కు ముడి విడదీసిందీ అంటే.. శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి రచించిన ‘అడుగేయ్ నిబ్బరం గా..’ కథ  చదవాల్సిందే.

***** 

కథలో స్త్రీ పాత్రలు – స్వభావ స్వరూపాలు :

కథలోని ప్రధాన పాత్రధారి – అత్తగారు. చాలా తెలివైనది మాత్రమే కాదు. మంచితనం తో బాటు తన హద్దులు ఏవిటో కూడా బాగా తెలిసిన వ్యక్తి. కోడలి తో ఆమె ఎంత గొప్ప రిలేషన్ ని మెయింటెయిన్ చేస్తోందో చెప్పడానికి ఓ గొప్ప ఉదాహరణ ఏమిటంటే –  కోడలు తన సమస్యని అత్తగారితో చెప్పుకుని దు@ఖించడం ! 

ఆ క్షణం లో  అత్తగారు తల్లి లా కోడల్ని ఓదార్చడం, ‘ఏం భయం పడకు..నేనున్నా కదా..’ అంటూ  ధైర్యం ఇవ్వడం చూస్తే-  అత్త గారి పాత్ర లోని ఔన్నత్యం  ఎంత గొప్పదో మనకు అర్ధమౌతుంది.  

కొడుకింట్లో  ఆమె ప్రవర్తన కూడా ఎంతో హుందాగా వుంటుంది. ప్రతి అత్తగారు సరిగ్గా ఇక్కడే అర్ధం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ అని సూచిస్తుంది. అదేమిటంటే – తను ఇండిపెండెంట్ గా వుంటున్నా, కొడుకింట్లో తన స్థానం ఎప్పుడూ రిజర్వ్ అయి వుండాలి. భౌతికంగా దూరం గా వుంటున్నా, కుటుంబానికి ముఖ్యం గా  కోడలి మనసుకి మాత్రం దగ్గర గా వుండాలి. ఈ సూత్రం  ఈ అత్తగారికి ఎలా తెలిసిందో కానీ, ఈ స్వభావం అలవరచుకుంటే ఎవరికైనా జీవితం అంతా ప్రశాంతంగానే  వుంటుంది.

 తను వచ్చిన పని  వెంటనే  అవ్వగొట్టడం కోసం  పీట లాక్కుని కుర్చుని, పంచాయతీ  మొదలుపెట్టదు. అదునైన సమయం కోసం ఎదురుచూస్తూంటుంది ఓర్పుగా!  తద్వారా తానొక  ఓర్పు గల మనిషిననీ చెబుతుంది. కాదు నేర్పుతుంది. అంత సహనం లోనూ అప్పుడప్పుడు సందేహాలతో సతమతమైనా..బయటపడకుండా నిగ్రహాన్ని పాటిస్తుంది. సమస్యలొచ్చినప్పుడు మాటల్ని తూటలు గా వాడకూడదు. చాలామంది గ్రహించరు కానీ, కుటుంబంలో  యుధ్ధం  రాకుండా వుంటానికి  స్త్రీ నిరంతరమూ ఓ సరిహద్దు రేఖ లా నిలబడే వుంటుంది. ఓ సైనికురాలిలా  పని చేస్తూనే వుంటుంది.  అందుకు ప్రత్యక్ష  సాక్షి గా నిలుస్తుంది అత్తగారి పాత్ర.  

ఇంజినీరింగ్ చేసి, ఉద్యోగం లో అడుగుపెట్టిన మనవరాలి తో ఎలా మాట్లాడాలి? 

తన వొళ్ళో పెరిగిన పిల్ల..  తన కళ్లముందు పుట్టి పెరిగిన  పిల్ల తో అసలు మాటలేవిటీ? ముఖం వాచేలా నాలుగు చివాట్లు పెట్టి,  బెదిరించి, బంధించి పడేయడానికి ఇంత రిహార్సల్ అవసరమా? అని అనే దుడుకు ప్రశ్నకు ‘అవును. అవసరమే.’ అని కూల్  జవాబు నిస్తుంది. 

ప్రేమ నింపుకున్న గుండె గాజు పరికరం లాటిది.  జాగ్రత్తగా హాండిల్ చేయాలి. ఆమె ప్రేమ ఆమెకెంత అపురూపం అంటే తన ప్రాణమంత. పెద్దలు వ్యతిరేకిస్తే అసలు కే ముప్పు రావొచ్చు. అలా అని  పెళ్ళికి అంగీకరిస్తే..ఆమె –  జీవితం లో ఓడిపోవచ్చు. సరిగ్గా ఇలాటి పరిస్తితుల్లోనే చాలా మంది పెద్దలు  పిల్లల కులాంతర, మతాంతర పెళ్ళికి సరే అని తలూపుతున్నారు.  కానీ ఇక్కడ ఈ పాత్ర అందుకు పూర్తి వ్యతిరేకి. అలా అని ఆ అత్తగారు  ప్రేమ వివాహాల కి కానీ మతాంతర వివాహాల కి కానీ వ్యతిరేకి కాదు. ఆమె ఆలోచిస్తోందల్లా ఒకటే. తన మనవరాలి ప్రేమ లాగానే  ఖదీరు ప్రేమ కూడా స్థిరమైనదా? కాదా? అని. ఈ ఆలోచనా సరళి వల్లే అత్తగారి పాత్ర అపూర్వం గా  మారుతుంది. నేనెప్పుడూ సరదాగా అంటుంటాను. ప్రతి  స్త్రీ మెదడులో  ఒక లాయర్, ఒక జడ్జ్ ఎప్పుడూ సంవాదించుకుంటూ  వుంటారని.  కానీ, ఈ అత్తగారిని చూసాక నా అభిప్రాయం నిజమే అనిపించింది. 

 ఎందుకంటే కోర్ట్ కూడా పరిష్కరించలేని ఎన్నో సమస్యలు కుటుంబాలలో చోటు చేసుకుంటాయి.  విభేదాలు, విడిపోవడాలు, కొట్లాటలు, రక్త సంబంధీకుల్లోనే శతృత్వాలు వంటివెన్నో  ప్రతి గడపలోనూ వుంటాయి . ‘పొయి లేని ఇల్లు, పొగ రాని గూడు’ ప్రపంచంలో ఎక్కడా వుండదు.  సహజమే. కానీ, మూడో కంటికి తెలీకుండా ఇంట్లోనే ప్రశాంతం గా పరిష్కరించుకోవచ్చు. ఆ  దిశ గా ఆలోచించమని సూచిస్తుంది ఈ అత్తగారి పాత్ర.  

 మనవరాలు పల్లవి తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తపడుతుంది. ఓ నాయనమ్మ గా, పెద్ద మనిషిగా   ప్రశ్నించే అధికారం తనకుందన్నట్టు కాకుండా..విషయమేమీ తెలీనట్టే అమాయకంగా ప్రవర్తిస్త్తుంది.  ఫ్రెండ్లీ గా వుంటుంది. మాటల్లో పెట్టి, అసలు ప్రేమ కథంతా మనవరాలే స్వయంగా తనకు వివరించే అవకాశాన్ని కలిగిస్తుంది. అంతా విన్నాక మండిపడటం కానీ, వాదించడం కానీ చేయదు. ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించదు. అలా అని సపోర్ట్ కూడా చేయదు. మనవరాలితో స్నేహం గా వుంటూ, ప్రేమ కబుర్లని అప్డేట్ చేసుకుంటూ ఒక అంచనా కి వస్తుంది.  పనిలో పనిగా పల్లవిని సున్నితం గా హెచ్చరిస్తూ వుంటుంది. ఆకర్షణ లో తొందర కూడదని.   

ఇలాటి సున్నితమైన విషయాలను తల్లి కంటే అమ్ముమ్మ బామ్మలే చాలా చక్కగ కన్వే చేయగలరు. కన్విన్స్ చేయగలరు. అని  ఈ పాత్ర నిరూపించిందని ఒప్పుకోవాలి. 

 అంతే కాదు  ‘రిటైర్మెంట్ వయసులో  నాకెందుకొచ్చిన గొడవ ఇదంతా? మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి  అని అనకూడదనే చిన్న సలహా గా సూచిస్తుంది. ‘ ఇదీ ‘  మన వంతు ధర్మమే అనే నైతిక బాధ్యతని గుర్తు చేస్తుంది. అందుకే,  కుటుంబంలోని కొందరు స్త్రీలు తరతరాలకు ఆరా ధ్య దైవాలు గా ఎలా మారతారు అంటే,ఇదిగొ ఇలా  వారు చేసే త్యాగాలు, సేవలు, జీవన మార్గ నిర్దేశకాల వల్లే వల్లే ఆదర్శమూరుతులై వెలిగిపోతారు.  

ఈ అత్తగారు మానసిక పరిశీలకురాలు కూడా అని అనిపించుకుంటుంది. అందుకు ఆమె టీచింగ్ ప్రొఫెషన్ కూడా తోడ్పడి వుండొచ్చు. ఇంట్లోని  ముగ్గురి  మనోభావాలను మౌనంగా చదువుతుంటుంది. ముగ్గురిని కలిపి కాకుండా విడివిడిగా  ఒంటరి సమయాలప్పుడే  సమస్యని చర్చిస్తుంటుంది. ఆ ముగ్గురి మనసుల్లోనూ ఆవిడ పట్ల గల గౌరవాభిమానాలు, ప్రేమానురాగాలు చూసినప్పుడు  ‘ఇంత మంచి  వ్యక్తిత్వం గల పెద్దమనిషి  మనింట్లో కూడా వుంటే ఎంత బావుణ్ను కదా!’ అని ఆశపుట్టిస్తుంది.  రెండు తరాల మధ్య తానొక గట్టి వంతెన గా మారి, కథని ముందుకు నడిపి, సుఖాంతం చేసి తిరిగి తన గూడు కి చేరుతుంది అత్తగారు. 

‘కొంతమంది స్త్రీలు ఒంటరిగా వున్నా ఏ వొంటరి తనాలు కానీ,  ఎలాటి డిప్రెషన్స్ కానీ  వారి దరి చేరవు. ఎందుకంటే వారు – బంధాలకు, బాధ్యతలకు ఎప్పటికీ  దూరం కారు కాబట్టి.’ అనే గొప్ప సందేశాన్ని అందించి వెళ్తుంది అత్తగారి పాత్ర. 

ఊహలో అయినా, నిజం లో అయినా ఈ పాత్ర లా బ్రతకగలిగితే ప్రతి ఇల్లూ శాంతినిలయమే అవుతుందనడంలో సందేహం లేదు. 

అయితే, వెళ్తూ వెళ్తూ మరో ఆణిముత్యం లాటి మాటొకటి అంటుంది కొడుకుతో.  సమస్య ఇప్పటికి తీరినా, పెళ్ళి తర్వాత కూడా మనవరాలి జీవితం లో సమస్యలు ఎదురవ్వొచ్చనీ, అందుకు గుళ్ళూ గోపురాలు, మొక్కులూ తీర్చుకోవడాలు పరిష్కారం కాదు అని రియాల్టీ ని గుర్తుచేస్తుంది. మెలకువైన హెచ్చరికని జారీ చేస్తుంది-  ఓ  టీచర్ లా! తల్లి అంటే గురువు కూడా కదా మరి.

ఈమె ని అర్ధం చేసుకోని కొందరు – ‘ఇంతకీ ఈ పెద్దమనిషి  మతాంతర వివాహాని కి వ్యతిరేకన్నమాట ‘ అనే ముద్ర తన మీద పడనీదు. తను ఆధునిక భావాలు గల స్త్రీ అని తెలీడం కోసమే కథలో చివర్లో ఆ తల్లితో కొడుకు అన్న మాటలే నిదర్శనం. ఏమిటా విషయం అన్నది కథ చదివి తెలుసుకోవచ్చు. కథకి అదొక మెరుపులాటిది. 

కోడలు జానకి పాత్ర : 

అత్త లేని కోడలుత్తమురాలు అంటారు కానీ..అత్త వున్న ఈ కోడలూ బహు ఉత్తమురాలే!  అత్తా కోడళ్ళు కలిసి  వుండకపోవడం ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది.  అది ఇక్కడ పెద్ద విషయం గా చెప్పుకొనవసరం లేదు. కానీ..వీరిద్దరి మధ్య ఆ దూరం కనిపించదు. పై పెచ్చు దాపరికాలు లేని అనుబంధాన్ని పెంచుకుంటారు. తన మనసులోని కష్టం చెప్పుకుని భొరుమని దుఃఖించే పసి మనసున్న స్వభావం ఈ కోడలికే సొంతం. అత్తగారితో అంత బంధుత్వాన్ని, బంధాన్ని  ఎవరైనా కోరుకుంటున్నారా ఈ రోజుల్లో? భర్త ముందు ఒక రకం గా, ఆయన లేనప్పుడు ఒక రకం గా, అత్త గారితో ప్రవర్తించే ‘బహు ముఖ ప్రజ్ఞలు ‘ ఈ కోడలి పాత్రలో మచ్చుకైనా కనిపించదు.  మొగుడి ముందు   అత్త గారి మీద ఆత్మీయత ఒలకబోస్తూ ఒక రకంగా, కళ్ళ ముందు అత్త కనిపిస్తే కారాలు మిరియాలు నూరుతూ మరో రకం గా నట శిరోమణులకు  భిన్నంగా స్వచ్చమైన మనస్కురాలైన ఈ కోడలి పాత్ర పాఠకులందరి మనసునీ గెలుచుకుంటుంది. 

విడి కాపురాలయ్యాక కోడళ్ళు   తల్లి తరపు వారికే అంకితమై పోతుంటారు. అలాటిది, ఆమె తన తల్లితో  చెప్పుకోవాల్సిన ఈ కష్టాన్ని  అత్త గారితో చెప్పుకుని భోరుమనడం చూస్తే..ఆ స్త్రీ మూర్తుల మధ్య గల మమతాను బంధానికి ముచ్చటేస్తుంది.  

శరీరం లో అవయవాల అమరిక కి ఒక రీతి వుంటం వల్లే శరీరాకృతి అందం గా కనిపిస్తుంది.  స్థాన భ్రంశం చేయాలని ప్రయత్నిస్తే అది వికృతి రూపాన్ని దాల్చుతుంది.   

 అలానే కుటుంబానుబంధాలు  కూడా జీవనాకృతికి ఎన్నో అందాలని ఆపాదించె పెడతాయి. వాటిని తొలగించుకోవాలని చూస్తే జివ్వితమే అందవికారమైపోతుంది.

 వివాహానంతరం ఆడపిల్లకి అత్తగారే అమ్మ అవ్వాలి. అలాగే ఆ అత్తకి  కోడలూ కూతురే అయి తీరాలి. అలా ఆ  ఇద్దరూ ఈ రెండు పాత్రల్లో మనకు దర్శనమిస్తారు. ఆదర్శంగా నిలుస్తారు. నేనెప్పుడూ తలబోస్తుంటాను. ఆడపిల్లకి ఇద్దరు అమ్మలుంటారు అని. ఒకరు కన్నతల్లి. మరొకరు ప్రేమని పెంచే అత్తగారొక తల్లి అని.

 పల్లవి ముస్లిం అబ్బాయిని ప్రేమించడం, అతన్నే పెళ్ళి చేసుకుంటాననడం జానకికి గొప్ప షాకింగ్ న్యూస్. (ఆమె దృష్టిలో) జీర్ణించుకోలేని విషయం. నిజానికి తల్లితో మాత్రమే చెప్పుకోవాల్సిన బాధ.  కానీ ఆమె అత్తగారినే ఆశ్రయిస్తుంది. 

తమ అత్తగారికి అసలు ఈ విషయం ఏ మాత్రం  తెలిసినా కొంపలంటుకుపోతాయనుకునే అఘాయిత్యపు కోడళ్ళు చదవాల్సిన నీతిపాఠం వంటిది – ఈ  కోడలి పాత్ర. 

ఒక సాదా సీదా గృహిణి అయిన జానకి – జీవితం లో తానూహించని పరిస్థితి ఎదుర్కుంటోంది. కూతురి మొండి వైఖరికి  దహించుకుపోతోంది ప్రాణం. కానీ ఏమీ అనలేని పరిస్థితి. మరో పక్క  తన ని అర్ధం చేసుకోలేని భర్త తో వాదించలేదు. 

ఈ పెళ్ళే కనక జరిగితే? తలచుకుంటే గుండె జారిపోతోంది. ఒక వేళ జరిగిందే అనుకో..పల్లవి నిండు జీవితం మాటేమిటి? పోనీ ఈ పెళ్ళి జరగకుండా అడ్డుకుంటే జరిగే  పరిణామాలు? ఇలా ఎడతెరుపి లేని  ఆలోచనలు. తీవ్ర మనోవేదన కి గురి చేసే సందేహాలు. జవాబు లేని ప్రశ్నలు.  కునుకు లేని రాత్రుళ్ళు. భయపెట్టే పగళ్ళు. ఓ భయంకర్ మైన  ఒంటరితనాన్ని మోస్తోంది. ఆమెని దిగులు మింగేస్తోంది.  ఆ ఒంటరితనంలో జానకి అత్తగారికి ఫోన్ చేస్తుంది మాట్లాడదామని. అత్తగారు  ప్రేమ గా ‘ఏంటి నానా?’ అని అనగానే ఒక్కపెట్టున దుఃఖిస్తుంది.   సహజమైన ప్రేమలు ఇలానే వుంటాయి.   తల్లి -బిడ్డ  స్వరాన్ని బట్టి  పసిగట్టే స్తుంది. ఆనందంగా వున్నదీ, ఆవేదనతో వున్నదీ అనే విషయాన్నీ ఇట్టే పట్టేసుకోగలదు.  ‘ఏమిటి నానా అలా వున్నావు?’ అని అడిగేస్తుంది వెంటనే. సరిగ్గా అలాటి  ఆ తల్లి లాలనకే ఈ కోడలు కరిగి కన్నీరౌతుంది. అత్తగారు మంచిదైతే కోడలూ గుణవంతురాలే అవుతుందనే నిజాన్ని చెబుతుంది ఈ పాత్ర. నిజాయితీ తో కూడిన బంధాలెప్పుడూ మనసులతో నే మాట్లాదుకుంటాయి. 

  ఒకానొక సన్నివేశం లో –  అత్తగారు కొడుకుతో ఒంటరిగా కుర్చుని సంభాషిస్తుంటుంది. సరిగ్గా అప్పుడే,  గుడి కెళ్ళిన కోడలు  లోపలకొస్తుంది. వాళ్ళు మాటలు ఆపేస్తారు. ఆ ఇద్దర్నీ చూసి, తలొంచుకుని వంటింట్లోకెళ్ళిపోతుంది. అత్తగారు అప్పటిదాకా మాట్లాడుతున్న విషయాన్ని పక్కన పెట్టి, వేరే మాటల్లోకి వెళ్తుంది. జానకి అదేం పెద్దగా పట్టించుకోదు.

అదే గనక స్వల్ప బుధ్ధి గల కోడలైతే నానా యుధ్ధం చేసేద్దును. నేను లేనప్పుడు మీ అమ్మకేం చెబుతున్నావ్? నేను లేకుండా చూసి, కొడుక్కేం నూరిపోస్తున్నావ్ అంటూ..అటు సినిమాలు,  ఇటు టివీ సీరియల్స్ చూసిన పరిజ్ఞానంతో సిట్యు యేషన్ని  నాన బీభత్సం  సృష్టించేద్దును.    ఎందుకంటే మనసు మీద ఆ దృశ్య  ప్రభావాలు చాలా గాఢం గా పాతుకుపోయుంటాయి  కాబట్టి.  తెర మీద పాత్రలు, హింసాత్మక సన్నివేశాలే నిజమని స్థిరం గా నమ్ముతారు  సామాన్యులు. మంచి చెబితే కదా అనుసరించడానికి!    

జానకి స్వభావం గల వారికి అలాటి చెత్త బుధ్ధులు అంటవు. అత్తగారు ఆమెకి పరాయిది కాదు. పైగా మొగుడి మీద కంప్లెయింట్స్ కూడా అత్తగారికే చెప్పుకుంటుంది. అత్తగారు అంటే  తన కాపురం కూల్చే మనిషి అనే  మురికి భయాలు ఈ పాత్రలో కనిపించకపోవడం ఓ విశేహ గుణం గా చెప్పుకోవాలి.  

ఏ స్త్రీ కైనా  తన చుట్టూ అభద్రతా  భావాలు సుడిగుండాల్ల్లా చుట్టుకోకుండా వుండాలంటే అసలు నమ్మకం భర్త అయి వుండాలి. ఆ నమ్మకాన్ని కని ఇచ్చింది అత్త గారి మీద కూడా  ఆ గౌరవం విశ్వాసం మనసులో నాటుకుపోయుండాలి. 

 నిజానికి  ఆ సన్ని వేశం లో లో తల్లీకొడుకులిద్దరూ మాట్లాడుకుంటోంది జానకి మీదే. అయితే నెగెటివ్ గా కాదు. అది ఆమెకీ తెలుసు,తెలియకపోవచ్చు.  వాళ్ళిద్దరూ తన మీద వ్యతిరేకం గా చాడీలు చెప్పుకునే అవకాశమే లేదన్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం ఆమెలో మెండు గా కనిపిస్తాయి.  కుటుంబ జీవనం లో  మన మధ్య వుండాల్సిన కనీస మనిషి  లక్షణాలు ఇవి. ఇందుకు దర్పణం లా నిలుస్తుంది కోడలి పాత్ర. 

‘మీరు వెంటనే బయల్దేరి రావాలి..నామీదొట్టు..’ అంటూ అత్తగారిని వేడుకోవడం, ‘మీరొచ్చేసారు. ఇప్పుడు నాకెంత ధైర్యం గా వుందో..’ అంటూ ఆనందపడటం,  ఈ కోడలి పాత్ర లో కనిపించే ప్రత్యేక వ్యక్తిత్వ సుగుణాలు. ఈ నాటి మన సమాజం లో చాలామంది అత్తగార్లు కుటుంబాల నించి ఎందుకు దూరమౌతున్నారూ అంటే..జానకి లాటి కోడళ్ళు లేకే అని పరోక్షం గా చాటి చెప్పిన పాత్ర- జానకి పాత్ర. 

ఈమె మంచి కోడలే కాదు. ఒక్కగానొక్క పిల్లని  గారాబంగా,  ప్రాణం గా పెంచుకున్న ప్రేమ మయి కూడా. అంత ప్రేమించినా,  మతాంతర వివాహాన్ని మాత్రం విభేదిస్తుంది. .  కూతురి తో వాదనలు, వైరం, అలగడం, మౌనం గా బాధపడటం, ఆమె  భవిష్యత్తు ఏమౌతుందా అని ఆవేదన చెందడం, భర్త సహకరించకపోవడంతో ఆయన  మీద కోపం, పరిస్థితుల పట్ల నైరాశ్యం, దేవుడి మీద భారం మోపడం, అత్తగారి మీద నమ్మకాన్ని వుంచడం..ఫలితం కోసం ఉద్వేగం గా ఎదురుచూడటం.. ఇలా సగటు ఓ నిండైన తెలుగింటి పదహారణాల ఇల్లాలి పాత్రలో జీవం పోసుకుని నిలబడుతుంది.  కోడలి  పాత్ర  లో – జానకి  పాఠకులకి  గుర్తుండిపోయే పాత్ర అని చెప్పాలి. 

పల్లవి పాత్ర : 

నేటి యువతరానికి ప్రతినిధి.  ఆకర్షణకి, ప్రేమకి మధ్య గల తేడా తెలుసుకోలేని యువతి. గుల్ల ఆదర్శాలు వల్లించే అమాయక ప్రేమిక – పల్లవి.  

కుల, మతాంతర వివాహాల గురించి లెక్చర్లు దంచడం లో దిట్ట. అమ్మని పాతకలం నాటి స్త్రీ గా, నానమ్మ ని ఆధునిక మహిళగా అభివర్ణించి మురిపించేయగల మాటకారి. ఇంజినీరింగ్ పిల్ల. చేతిలో ఉద్యోగం వుంది. తండ్రి సాధువు. తల్లిని ఎదిరించొచ్చు.  బామ్మని పొలైట్ గా వంచేయొచ్చు. ఇక ఖదీర్ తో తన పెళ్ళి ఖాయం. పెద్దలు కాదంటే ‘ఛలో..వెళ్ళిపోదాం..’ అనుకునే మనస్తత్వం. ఎవరి కోసమో మన ఇష్టాలనీ, సుఖాలనీ, వ్యక్తిత్వాలని వదులుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పెయగలదు.  

ప్రేమలో నిండా మునిగిన వారికి  –  ఎండ కూడా వెన్నెల్లా, నిప్పు కూడా రూబీపువ్వులా కనిపిస్తుంది. అది నీ భ్రమ అని చెప్పినా వారికి వినపడదు. వినిపించినా, లెక్క చేయరు. నీ జీవితం కాలిపోతుంది వొద్దు అంటె- కాలిపోనీ..ప్రేమ జ్వాల లో అంటారు. ‘నా జీవితం నా ఇష్టం..’ అంటారే తప్ప నిజాన్ని గ్రహించే పరిస్థితి వుండదు. చేతులు కాలక ముందే జాగ్రత్త పడాలని పెద్దలు, అదంతా మీ మూర్ఖపు ఆలోచన అని పిల్లలు ..ఇది ఇప్పటి ఘర్షణ కాదు. యుగాల నించి జరుగుతున్న యుధ్ధమే ఇప్పుడు పల్లవి కూడా చేస్తోంది.  అయితే, పల్లవి పెద్దల్ని ఎదిరించే పిల్లే కానీ, బరితెగించిన అమ్మాయి కాదు. ఆమె లో ఇంకా పసితనం మిగిలే వుంది. అందుకు సాక్ష్యం గా  నానమ్మ హెచ్చరికలకి  – ‘నాకూ తెలుసులే. ఖదీర్ కి ఇప్పటి దాకా షేఖాండ్ కూడా ఇవ్వలేదు తెలుసా? ‘ అంటూ రోషపోతుంది చిన్న పిల్లలా సమాధానమిస్తుంది.

ఆకర్షణ ఎంత గాఢమైనదే అయినా..ఆ గీటు దాటకూడదన్న ఎరిక ప్రతి అమ్మాయిలో నూ వుంటుందనీ,  చెప్పే పాత్రలో  పల్లవి బాగా రాణించిందని చెప్పాలి. 

నానమ్మ తో మనసులో మాట చెప్పుకోవడం,  ఓటమి కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ గా తీసుకోవడం..భవిష్యత్తు ని అందంగా తీర్చి దిద్దుకోవాలనే నిర్ణయానికి రావడం వంటి ఆశాజనితమైన ఆలోచనలు వల్ల ఈ పాత్ర ఎందరో యువతులకి స్ఫూర్తి గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

తల్లిని ఎదిరించి మాట్లాడటం, విమర్శించడం, ప్రపంచం తెలీని మనిషి గా భావించడం..ఈ లక్షణాలన్నీ నేటి తరం ఆడపిల్లల్లో చూస్తున్నట్టే –  పల్లవీలోనూ చూస్తాం. 

‘నానమ్మ అప్పుడే వెళ్ళొద్దు. ఇంకా వుండమని గారం పోయే పల్లవి పాత్ర ముచ్చటగొల్పుతుంది.  అంతే కాదు, ప్రేమ పెళ్ళిళ్ళని పెద్దలెందుకు వ్యతిరేకిస్తారు? పెద్దలు కుదిర్చే వివాహాలు సుఖవంతమౌతాయా? వంటి  ప్రశ్నలు వేసి, జవాబులను శ్రధ్ధగా ఆలకిస్తున్న పల్లవి పాత్ర ఒక సందేశాన్ని అందిస్తుంది. నేటి ఆధునిక యుగ వనితలు..ఓ అడుగు పొరబడి నడవచ్చేమో కానీ, జీవితం పట్ల తమ  దృక్పథం మాత్రం ధృఢంగా నే వుంటుందన్న నిశ్చింతని కలిగిస్తుంది. ఓ స్థిరమైన నిబ్బరాన్ని కలిగిస్తుంది.

ఇవీ! ఈ కథలోని స్త్రీ పాత్రలు, వారి స్వభావ స్వరూపాలు. సుగుణాలు.

చివరగా ఓ మాట. ఈ కథలో ఏ స్త్రీ కూడా మతాంతర వివాహల పట్ల విశ్వాసం లేని వారు కాదు. ‘అతని మతం కంటేనూ ఇక్కడ ప్రధానంగా  మగాడి చంచల బుధ్ధి కే వ్యతిరేకులు అని గ్రహించాలి.

మంచి కథని అందించిన రచయిత్రికి మన నెచ్చెలి తరపున నా అభినందనలు.

ఫ్రెండ్స్! మీ విలువైన హృదయస్పందనలను నెచ్చెలితో పంచుకుంటారు కదూ? 

ధన్యవాదాలు. 

వచ్చేనెల మరో మధురమైన  కథతో కలుద్దాం. 

అందరకీ వందనములతో..

****

అడుగేయ్ నిబ్బరంగా !

రచన: అల్లూరి గౌరీలక్ష్మి

రోజంతా గడిచిపోయిన సూచికగా పొద్దు వాటారుతోంది. గోరువెచ్చని ఎండలో నిలబడి మొక్కలకు నీరు పెట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో ! మొక్కల మొదట్లో పడిన నీటిని మట్టి ఆనందంగా పీల్చుకుంటోంది. తడిసిన ఆకులు, పువ్వులు ఊగుతూ నాతో మాట్లాడుతున్నట్టున్నాయి. ఇది ఆయన కిష్టమైన పని. ఇంట్లో ప్రతి అణువులో  మావారితో  నేను గడిపిన జీవితమంతా నిండి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటుంటే తృప్తిగా ఉంటుంది. అందుకే  ఆయన పోయి నాలుగేళ్లయినా అబ్బాయి ఎంత  బతిమాలినా వాడి దగ్గరికి వెళ్ళలేదుఇంతలో ప్రహరీ గోడపై పెట్టిన మొబైల్ మోగింది. తీసి చూసాను. కోడలు జానకి నుంచి ఫోన్.

 ” ఏం చేస్తున్నారత్తయ్యా ? ” అనడుగుతున్న జానకి గొంతులో ఆవేశపు దుఃఖం నన్ను కంగారు పెట్టింది.” ఒక్క నిమిషంఉండుఅంటూ పైప్ కట్టేసిఏమైయ్యిందమ్మా ? అంతా ఓకే కదాఅన్నాను భయం దాచుకుంటూ.

ఏం ఓకే ? మీ ముద్దుల మనవరాలు ఇక్కడ కొంప ముంచే పని చేస్తోంది.” జానకి దుఃఖం ఏడుపు లోకి మారింది.

ఏమయ్యింది నాన్నా ? ” అడిగాను ఆత్రుతని అణచుకుంటూ.

నా నోటితోనే చెప్పమంటారా ? ” ఆక్రోశంగా అంది జానకి

నువ్వు ముందు నిదానించు. తమాయించుకో. Saamtamgaa  చెప్పుఅన్నాను.

అంత అదృష్టమా నాకు ? ఎవరో ముస్లిం కుర్రాడిని పెళ్లాడుతానంటోంది. ఇష్టపడిందట.” 

అతి కష్టం మీద మాట చెబుతుంటే జానకి గొంతులో నిస్సహాయతతో కూడిన బేలతనం. విన్నాక ఒక్క క్షణానికి విషయం అర్ధమై నా నోటి లోంచి మాట రాలేదు.

నేనిప్పుడేం చెయ్యాలి?ఒక్కగా నొక్క పిల్లని కాఫీ, టీ లందిస్తూ చెలికత్తెలా వెనకే తిరుగుతూ పెంచుకున్నాను.” దుఃఖంతో జానకి గొంతు పూడుకుపోతోంది.

కొన్ని సెకన్లతర్వాత తేరుకునిరాంబాబేమంటున్నాడు ? ” అన్నాను 

కూతురి మీద గుడ్డి ప్రేమ కదా ! మౌనం దాల్చారు. నేను నెత్తీ నోరు కొట్టుకుంటుంటే నన్ను సముదాయిస్తున్నారుఅంది ఉక్రోషంగా. నేను ఏం మాట్లాడాలో తోచనట్టుగా కొన్ని క్షణాలుండిపోయాను.

రేపు మధ్యాన్నానికల్లా మీరిక్కడ ఉండాలి నా మీదొట్టుఅంది జానకి బెక్కుతూ

సరే, సరే నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో . రేపీపాటికి అక్కడుంటాను సరేనా ! ” అన్నాను .

థాంక్స్ అత్తయ్యా !” అంటూ ఫోన్ పెట్టేసింది. గబా గబా సూట్ కేసు తీసి నాలుగు చీరలు, మిగిలిన సరుకులూ పెట్టుకుని పాలవాడికీ, పనమ్మాయికీ చెప్పి మర్నాడుదయం ఫస్ట్ బస్సు కి మంగళగిరిలో బయలుదేరాను. గుంటూరు లో బస్సు దిగి హైదరాబాద్ బస్సెక్కాను. మధ్యాహ్నం మూడు కల్లా అమీర్పేట్ లో దిగి ఆటోలో అబ్బాయింటికి చేరాను.

****

తలుపు తీస్తూనే సూట్ కేసు అందుకుని కాళ్లు కడుక్కోగానే భోజనం వడ్డించింది జానకి.తిన్నాక నన్ను పడుకోమని చెప్పి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని చెప్పడం మొదలు పెట్టింది.

నా మనవరాలు మంచిది, మంచిది అనేవారు కదా ఇప్పుడు చూడండి.ఏదో బి.టెక్ చేసింది క్యాంపస్ సెలక్షన్ వల్ల సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబొచ్చిందని మనమంతా మురిసిపోతుంటే ఎంత పని చేసిందో చూడండి. ముస్లిం కుర్రాడు మన పల్లవి తోనే బీ టెక్ చేసాడట. ఇక్కడిద్దరికీ జాబ్ వచ్చాక పరిచయం అయ్యిందట. నెల తర్వాత, నువ్వంటే ఎప్పటినుంచో నాకిష్టం. ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాట్ట. రెండు నెలల నుంచీ ఇది కూడా వాణ్ణి ప్రేమించడం మొదలు పెట్టిందట. చాలా మంచి వాడట.

నువ్వొప్పుకుంటే చాలమ్మా ! నాన్నగారేమీ అనరు అంటూ వారం రోజుల్నుంచి వేధిస్తోంది.   పోయి పోయి వేరే మతం వాణ్ని పెళ్లి చేసుకోవడం ఏమిటే ఖర్మ! “ అని నేను నెత్తీ నోరూ కొట్టుకుంటుంటే   ‘అమ్మా ! నువ్వు ఇంట్లో కూర్చుంటావు నీకు లోకం తెలీదు. మా ఆఫీస్ లో అమ్మాయిలైతే వేరే రాష్ట్రం వాళ్ళని కూడా చేసుకుంటున్నారు. మంచి కుర్రాడైతే చాలు కానీ ఇవన్నీ అనవసరం.’ అని నాకు పాఠాలు. నాకసలు మతి పోయింది. ఇక తట్టుకోలేక మీకు ఫోన్ చేసాను.”  అంటూ ఊపిరి పీల్చుకుంది. కోడలి వ్యధ,బాధ ఆమె కళ్ళలో కనబడుతోంది. జానకి నాతో కన్న కూతురిలా తన బాధంతా  చెబుతుంటే  నా కడుపులో పేగు కదిలింది. జానకి చేతిపై చెయ్యి వేసాను.

అసలు దాన్ని కాదు మీ అబ్బాయిననాలి. నంగనాచిలా ఏమీ మాట్లాడరు. అది ఏం చెప్పినా తలూపుతున్నారు. పిల్ల నొక్క మాటనట్లేదుఇంకా చూడండి. దాన్ని పిలిచి మీ అమ్మిలా బాధ పడుతోంది ఏమంటావ్ ? అంటూ దానికి నా మాటగా చెబుతున్నారు. నన్ను చెడ్డ చెయ్యాలనే చావు తెలివి తప్ప దానికి బుద్ది చెప్పట్లేదు. ఇదీ సంగతి  “ అంటూ బొట బొటా కన్నీరు కారుస్తూ నా వైపు బాధగా చూసింది.

నేనొచ్చాను కదా ! నువ్వింక బాధ పడకు. చూద్దాం పరిస్థితి ఏంటో తెలుసుకుంటానుఅన్నాను

కళ్ళు తుడుచుకునిమీరొచ్చారు నాకు  కొండంత బలం వచ్చేసింది.” అంటూ హుషారుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది 

జానకి. టీ స్నాక్స్ తీసుకొచ్చింది. ఇద్దరం తిన్నాక  ఆమె వంట ప్రయత్నంలో ఉండిపోయింది. సాయంత్రం ఆరయ్యేసరికి రాంబాబూ, పల్లవీ వచ్చారు.

భలే వచ్చావే అమ్మా” అంటూ రాంబాబు మురిసిపోయాడు. పల్లవి ఎగిరి గంతేసి నన్ను చుట్టుకు పోయింది ఆనందంగా. అందరం బోలెడు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసి కొంత సేపు  టీవీ చూసి పడుకున్నాం.

నా పక్కనే నా పైన చెయ్యి వేసి తన ఉద్యోగం విశేషాలు చెబుతూ నిద్రపోయింది పల్లవి. నాకు నిద్ర రావడం లేదు.ఒక్క పిల్ల చాలనుకుని ఆపరేషన్ చేయించుకుని హాయిగా ఇన్నాళ్లూ  కాపురం చేసుకున్నారు కొడుకూ కోడలూ. ఇప్పుడీ సమస్య వచ్చింది. అసలిది సమస్యేనా , కాదా ? అంటే అనుకుంటే సమస్య కాదనుకుంటే కాదు ఇలా ఆలోచిస్తూ  తెల్లవారు జాముకి నిద్ర పోయాను.

మర్నాడు రాంబాబు బ్యాంకు కి వెళ్ళాక  జానకి గుడికి వెళ్ళింది. నేనూ పల్లవీ మిగిలాం. శనివారం దానికి శలవు.

నానమ్మా ! నీకొక షాకింగ్ న్యూస్ ! నేనొకబ్బాయిని ప్రేమించాను.” అంది పల్లవి. నేను ఆశ్చర్యం నటించాను.

ఖదీర్ అని ముస్లిం అబ్బాయి. నాతో శ్రీనిధిలోనే బీ టెక్ చేసాడు. చాలా మంచివాడు. వెరీ ఫ్రెండ్లీ ! నువ్వు చూసావంటే మెచ్చుకుంటావు మంచి కుర్రాడని. కాలేజ్ లో చూసాను కానీ పరిచయం లేదు. అప్పట్నుంచే నేనంటే ఇష్టమట. ఇప్పుడు ఒకే చోట పనిచెయ్యడం తో మేం దగ్గరయ్యాం. నన్ను ప్రేమిస్తున్నాడు నానమ్మా ! చూడ్డానికి కూడా బావుంటాడు “అంటూ ఆపి నా మొహం చూసి “అమ్మ సినిమాల్లో అమ్మలా జుట్టు పీక్కుంటోంది. నాన్న సరే అనీ కాదనీ ఏమీ అనడం లేదు. కానీ పాజిటివ్ గానే కనబడుతున్నారు.నేనే నీకు ఫోన్ చే సి పిలవాలనుకున్నాను నువ్వే వచ్చేసావ్ ఇంచక్కా. నువ్వైతే అమ్మకి నచ్చ చెప్పగలవు. టీచర్ వి కాబట్టి ”  అంది నా భుజంమీద తల పెట్టుకుంటూ

నేను నీకు సపోర్ట్ చేస్తానని నీకేంటి నమ్మకం ? ” చిరునవ్వుతో అడిగాను.

నాకు తెలుసు నువ్వు మోడరన్ లేడీవి, ఉద్యోగస్తురాలివి. అమ్మ పాతకాలం మనిషి. లోకం తెలీదు. బంధువులంతా నవ్వుతారట. స్నేహితుల ముందు అవమానమట. ఇంకా మా మతాలూ వేరు కాబట్టి మాకు కలవదట. గొడవలు పడతామట. రోజుకో క్లాస్ పీకుతోంది. మేమేమన్నా భక్తులమా దేవుడి గురించి పోట్లాడుకోవడానికి ? చదువుకున్నవాళ్లం. ఉద్యోగాలు చేసుకుంటాం. కాపురం చేసుకుంటాం. అని చెబితే వినదే !   నువ్విక్కడే ఉండి అమ్మను కూల్ చెయ్యిఅంది.

నా అభిప్రాయం అక్కర్లేదన్న మాట”  నిష్టూరంగా అన్నాను.  

అయ్యో అలా కాదు నానమ్మా ! నువ్వు నాయిష్టాన్ని కాదనవని నమ్మకం నాకు. మా అమ్మ చాదస్తం చూసి  నేనెప్పుడూ అనుకుంటాను. నువ్వు మా అమ్మవైతే ఎంత బావుండునో అని ”  

దీన్నేనా మీ యూత్ బిస్కెట్ అంటున్నారు? ” అన్నాను.

అయ్యయ్యో ! ” అంటూ నన్ను గట్టిగా కౌగలించుకుని నవ్వేసింది పల్లవి.      

 “పెళ్లి విషయం లో నిదానించి యోచించాలిఅన్నాను చర్చకు పిలుస్తూ

బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నానమ్మా !ఎవరికైనా ఏం కావాలి ? ఉద్యోగం, ప్రేమించే మనిషి. కులం, మతం అనేవి పాత కాలం మాటలు.”      

సరే అనుకుందాం. అతని ప్రేమ ఎంత లోతు అంటే ఎంత స్థిరం అనేది చూడాలి కదా !”  

ఓకే . ఒప్పుకుంటాను. అందుకేంచేద్దాం ? “అంది ఉత్సాహంగా పల్లవి.

తొందర పడి పోకుండా కొన్ని రోజులు వేచి చూద్దాం ! “

డన్ ! నాకేమీ అర్జెంటు గా పెళ్లాడేయ్యాలని లేదులే  బట్ వన్ కండిషన్ నువ్విక్కడే ఉండాలిఅంది.

డన్ ! నీ లవ్ స్టోరీ పెళ్లి గా మారే వరకూ ఉంటానులేఅని నవ్వాను.

       ****

మర్నాడు సాయంత్రం మా వాడప్పుడే బ్యాంకు నుంచి వచ్చాడు. జానకి కూరలకి వెళ్ళింది. నేనూ వాడూ పక్క పక్కనే కూర్చున్నాంపల్లవి ఇంకా రాలేదు. నేను తలెత్తి వాడి వైపు చూసాను. ” నేనే వచ్చి నిన్ను తీసుకొద్దాం అనుకుంటున్నానమ్మా! “

ఏంటి పరిస్థితి ? ” అన్నాను

ఇద్దరూ చెప్పగా  అంతా వినే ఉంటావు. అది రెక్కలొచ్చిన పిల్ల. గట్టిగా కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే అదింకా దుర్భరమైన పరిస్థితి. ఒక్కగానొక్క పిల్లని వదులుకుని ఏం బావుకుంటాం ? “అంటుంటే వాడి గొంతులో దుః ఖపు జీరనేను చెయ్యి నొక్కాను

వారం రోజుల కింద చెప్పింది. పిల్లని నేనేమీ అనలేక పోతున్నాను. తలూపి  ఊరుకున్నాను. రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. నాకేమీ తోచట్లేదు. నువ్వొచ్చాక నాకు ధైర్యంవచ్చింది. నువ్వెలా అంటే అలా చేద్దాం! బాగా ఆలోచించు.” అన్నాడు కానీ వాడి మొహం బాగా వాడిపోయి, నలిగి పోయినట్లుగా ఉంది. వాడెప్పుడూ అంతే. చాలా తక్కువగా మాట్లాడతాడు. నేనూ నిట్టూర్చి మౌనంగా ఉండిపోయాను. ఇంతలో జానకి వచ్చింది. మా ఇద్దరినీ చూసి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. టీవీ పెట్టి వంట  మొదలు పెట్టింది. ముగ్గురం ఊరి విషయాలు చెప్పుకున్నాం. ఇంతలో పల్లవి రావడంతో దాని కంపెనీ కబుర్లతో కబుర్లు కలిపాం

నాలుగు రోజులు గడిచాయి. నేను న్యూస్ పేపర్లు  చదువుకుంటూ, మా కోడలి  ఊహాపోహల మాటలు, విసుర్లూ, భయాలూ వింటూ తల పంకిస్తూ మధ్య మధ్య కళ్ళతో ఓదారుస్తూ రోజులు గడుపుతున్నాను. నలుగురికీ లోపల టెన్షన్ గానే ఉంది. బైటికి అందరం మాములుగా పనులన్నీ చేసుకుంటూ భోజనాలు చేస్తున్నాం. టీ వీ  చూసుకుంటున్నాం.

ఒక రోజు పడుకున్నాక అంది పల్లవి.  ” నానమ్మా ! ఒక రోజు ఖదీర్ ని టీ కి పిలుద్దామా ? ” 

నాన్నని అడుగుతాను రేపుఅన్నాను.

మర్నాడు చెప్పగానే రాంబాబన్నాడుఇంటికొద్దమ్మా ! ఎక్కడన్నా హోటల్ లో కలుద్దాంలే మనం  ముగ్గురం. జానకి వద్దు. ” అన్నాడు. అన్నట్టుగానే మర్నాడు ఒక హోటల్ లో కూర్చున్నాం అబ్బాయి కోసం.

ఖదీర్ అన్న సమయానికే వచ్చాడుపల్లవి నా పక్కనే కూర్చుంది. రాగానే నమస్తే చెప్పి నా పేరు ఖదీర్ అండీ అన్నాడు రాంబాబు తో చెయ్యి కలిపి వాడి పక్కన కూర్చుంటూ. నా వైపు తిరిగి నాక్కూడా నమస్కారం పెట్టాడు. పల్లవి మా ఇద్దర్నీ అతనికి పరిచయం చేసింది. నేను కూడా నమస్తే బాబూ అన్నాను. కుర్రాడు చాలా రంగున్నాడు. సరిపడా ఎత్తు, లావు ఉన్నాడుకొంచెం ముస్లిం యాస ఉన్నా తెలుగు కుటుంబాలతో మసిలిన అలవాటున్నట్టుంది. తడబడకుండా తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు.రాంబాబు కుర్రాడితో మీ పేరెంట్స్ ఏం చేస్తారుఅనడిగాడు. తండ్రి పేరు సలీం అట. సెక్రటేరియట్ లో ప్లానింగ్ డిపార్ట్ మెంట్లో సెక్షన్ ఆఫీసర్ అని చెప్పాడు. తల్లి ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు. తనకి ఇద్దరు చెల్లెళ్ళు డిగ్రీ చేస్తున్నారని చెప్పాడు. ఇంతలో పల్లవి సర్వర్ ని పిలిచి స్నాక్స్ టీ ఆర్డర్ చేసింది.     

మీరిక్కడే  ఉంటారా? “అని నన్నడిగాడు. “ రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ని, ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటా”నని  చెప్పాను

స్నాక్స్ తిని టీ తాగాక పావుగంట ఉండి వెళ్లిపోయాడతను. మేం ముగ్గురం ఇందిరా పార్క్ కి వెళ్లి కొంత సేపు కూర్చుని ఇంటికి వెళ్ళాం. మేం ఎక్కడికి వెళ్లిందీ జానకికి చెప్పలేదు.   

రాత్రి పల్లవి నడిగాను. ” వాళ్ళింట్లో ఒకే అన్నారా మీ పెళ్ళికి ?”

ఇంకా చెప్పినట్టు లేదు “  

ఏం ?” అన్నాను ఆశ్చర్యంగా 

ఒప్పుకుంటారో లేదో అని కొంచెం భయపడుతున్నాడు.”

మరెందుకొచ్చాడు ? ” అన్నాను ఆశ్చర్యంగా

నేనే రమ్మన్నాను నీకు చూపిద్దామనిఅంది నెమ్మదిగా పసిదాని మొహం చూస్తే జాలేసింది. పైకి గంభీరంగా ఉంది కానీ దానికీ భయంగానే ఉంది అనిపించింది.

కాలమే అన్నీ ముందుకు సాగేట్టు చూస్తుంది కానీ నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకో. పెళ్లయ్యే వరకూ అతను నీకు సహోద్యోగి, మిత్రుడు మాత్రమే ! నిజమైన ప్రేమకు అధికమైన దగ్గరితనం అవసరం లేదు. అతి స్నేహం, చనువూ వద్దు. బైకెక్కి తిరగడం, హద్దులు మీరి మాట్లాడడం మంచిది కాదు. బిహేవ్ యువర్ సెల్ఫ్చిన్న పిల్లవు కావు కదా ! ” అన్నాను కొంచెం గంభీరంగా.

నా మాటలోని గట్టితనం గమనించిన పల్లవినాక్కూడా తెలుసు. రోజువరకూ అతనికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు తెలుసా ? “అంది పౌరుషంగా. “గుడ్ గర్ల్అన్నాను వీపు తడుతూ.

రోజులు భారంగా గడుస్తున్నాయి. జానకి మాత్రం టెన్షన్ తట్టుకోలేక అప్పుడప్పుడూ బైటకి కక్కి గింజుకుంటూ ఉంది.  “ఎంత నిబ్బరమో మీ ముగ్గురికీ, తేలరు బైటికి. ఎలా నిద్ర పడుతుందో  మీకుఎంతైనా  మీరంతా ఒకే కుటుంబం వాళ్లునేను పరాయి కుటుంబమే కదా అలా గుంభనంగా ఉండడం నాకెలా చేతనవుతుంది ?” అందొకసారి  ఉడుకుమోత్తనంతోనేనేమనాలో తెలీక మౌనంగా ఉండిపోయాను

ఏమంటాడు ఖదీర్ ? రెండు రోజుల తర్వాత అడిగాను పల్లవిని. “వాళ్ళింట్లో ఇంకా చెప్పలేదుట నానమ్మా ! “అంది కాస్త నిరుత్సాహంగా.

సర్లే చెప్పనీయ్ నెమ్మదిగాఅన్నాను.

మరో రెండు రోజులు పోయాక తానే చెప్పిందిమీ వాళ్లంత ఫార్వర్డ్ కాదు మావాళ్లుఅంటున్నాడు అని.”వాళ్ళు ఒప్పుకోరా ఏంటిప్పుడు ? “అని  పల్లవి నిలదీస్తే  “లేదు లేదు ఒప్పిస్తానుఅన్నాడట. ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు వాళ్ళ కంపెనీ గురించీ, మిత్రుల గురించీ, సినిమాల గురించీ నా ఎదురుగానేరాంబాబు నేనొచ్చాను కదా అనేమో తన బ్యాంకు పని చేసుకుంటూ కాస్త నిశ్చింతగా  ఉన్నట్టు కనిపిస్తున్నాడు.

చూస్తూ ఉండగానే మరో పది రోజులు గడిచాయి. నేను వెళ్ళిపోతాను అని  ఎలా అనగలను? సరే కానియ్ ఉందాం సమస్య ఏంటో తేలాలి కదా అన్నట్టున్నాను. జానకి కనబడ్డ దేవుళ్లందరికీ నాకు చెప్పి మరీ మొక్కుతోంది, ఆపద గట్టెక్కితే చాలు అంటూ. నిరంతరం ఇదే ఆలోచిస్తూ కాస్త పిచ్చి దానిలా అయిపొయింది కూడా. నేనేమైనా నచ్చ చెబితే వినే మనిషి కాదని తెలుసు కనక ఊరుకున్నాను.     

ఒక రోజు పల్లవినానమ్మా మా కంపెనీలో కొత్తగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేరింది. పేరు  అజీజా బేగం  ఎంత బావుందో !” అంది. వారం తర్వాత  “ ఇప్పుడు మేం ముగ్గురం ఫ్రండ్స్ అయిపోయాం, కాంటీన్ కెళ్ళి కాఫీ తాగినా, లంచ్ చేసినా కలిసే చేస్తున్నాంఅంది. ఇంకా చిన్న పిల్లస్నేహాల వయసు దాటలేదు  అనుకుని నవ్వుకున్నాను.

మరో వారం గడిచింది. రోజూ పల్లవి ముగ్గురూ కలిసి మాట్లాడుకున్న జోక్స్ చెబుతోంది. ఒక సండే ముగ్గురూ కలిసి ఒక సినిమాకి వెళ్లి హోటల్ లో లంచ్ కూడా చేసి వచ్చారు.

మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకుండా మధ్యలో ఎందుకే పిల్ల ? ” అన్నానొకరోజు విసుగ్గా.

అంటే ,అది నానమ్మా ! అలా ఎలా వదిలేస్తాం దాన్నిఫ్రెండ్ అయ్యింది కదాఅంది మొహమాటంగా.

ఖదీర్ ఇంట్లో ఏమన్నారు ? అడిగావా ? “

అడిగాడేమో, వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి టైం తీసుకుంటారు కదా ! “

ప్రేమించాక ఆలస్యం ఎందుకు, కాస్త స్పీడప్ చేసుకోమనుఅన్నాను

నాకంటే నీకే తొందరెక్కువుందే ! ” సిగ్గుపడుతూ అంది పల్లవి.                               

పల్లవి చూస్తే అట్లా, జానకి చూస్తే ఇట్లా . ఎలా అమ్మా ? “అన్నాడొకరోజు రాంబాబు 

జానకికి డైజెస్ట్ అవ్వట్లేదు. ఇద్దరం మెల్లగా నచ్చ చెబుదాంలేఅన్నాను.

నా వల్ల కాదు. చెబితే నువ్వే చెప్పాలిఅన్నాడు

మరో పది రోజులు గడిచాయి. ప్రోగ్రెస్ లేదు. పల్లవి తలకి హెన్నా పెడుతూఏంటే , నీ ప్రేమ కథ టీవీ సీరియల్ లా సాగుతోంది” అని ఉడికించాను. ఏమీ జవాబు చెప్పలేనట్లు ఊరుకుంది పల్లవి

 ఇంకో పది రోజులు గడిచాయి. రోజు పల్లవి వచ్చేసరికి నేనొక్కదాన్నే ఇంట్లో ఉన్నాను.   

వస్తూనే “నానమ్మా” అంటూ సోఫాలో కూర్చున్న నా ఒడిలో వాలి పోయింది. మరుక్షణమే ఏడుపు మొదలు పెట్టింది. ఏమయ్యింది బంగారూ ? అన్నాను తల మీద రాస్తూ, జుట్టు సర్దుతూ. పిల్ల కళ్ళలో నీరు చూస్తూనేఅది నోరు విప్పే లోపే నా కళ్ళలో నీళ్లు జల జలా రాలిపోతున్నాయి

   అడగ్గా, అడగ్గా చాలా సేపటికి నోరు విప్పింది పల్లవి. ” ఖదీర్ వాళ్ళింట్లో మా విషయం నలుగుతూనే ఉంది అప్పటినుంచీ. ఏదో ఒక రోజు ఒప్పుకుంటారనీ గుడ్ న్యూస్  చెబుతాననీఅన్నాడు . రోజు కాంటీన్ కి పిలిచి చెప్పాడు. వాళ్ళింట్లో  అజీజాని చేసుకో అంటున్నారట.ఆమె వాళ్ళకి బంధువుకూడానట.” అంది కళ్ళు తుడుచుకుంటూ

నువ్వేమన్నావ్నిన్ను ప్రేమించాను, కాలేజ్ రోజుల్నుంచీ ఇష్టం అన్నాడు కదాఅన్నాను కోపంగా.  

నేను  కోపంగా వచ్చేస్తుంటే బతిమాలాడు ఉండమని. చాలా సేపు మాట్లాడాడు. ఏదేదో చెబుతున్నాడునా కర్దమయ్యిందేమిటంటే అతనికి ఇంట్లో వాళ్ళని బ్రతిమాలి ఒప్పించడంకాదంటే గొడవ పెట్టుకోవడం ఇష్టం లేదు. ఖదీర్ కి నా పై పెద్దగా ప్రేమేమీ లేదు. జస్ట్ నచ్చాను. ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం కాబట్టి లైఫ్ బావుంటుందని ప్లాన్ చేసాడు. అంతే ! అతని మాటలు నమ్మి అతను నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను.”

    ” మరీ ఇంత అన్యాయమా ! మనమేమో చాలా సీరియస్ గా తీసుకున్నాం. నాన్నా, నేనూ అమ్మని మెల్లగా సమయం చూసి ఒప్పించాలని చూస్తున్నాం. “

ఇంకో సంగతేమిటంటే అజీజాని చేసుకున్నా అతననుకున్నభవిష్యత్తు అతని కుంటుంది కాబట్టి ఖదీర్ కన్విన్స్ అయ్యాడని నాకనిపించింది. ” అంది ఆలోచిస్తూ.  

నువ్వేమన్నావ్?ఆఖరికిఅన్నాను. “ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చేశాను హర్ట్ అయినట్టు కనబడకుండా “అంది పసి పిల్లలా నా కళ్ళలోకి బేలగా చూస్తూ. నేను దగ్గరగా జరిగి పిల్లని గుండెల్లోకి పొదువుకున్నాను. వీపు నిమిరాను.ఇద్దరం చాలా సేపు అలాగే ఉండిపోయాం. తానే  ముందు తేరుకునిఓకే నానమ్మా ! లైట్ 

తీసుకుందాంఅంది విసురుగా లేచి ఫ్రిజ్ లోంచి నీళ్ల సీసా తీసుకుని తాగుతూ. నేను బొటన వేలు పై కి చూపించి నవ్వాను. రాత్రి మేమిద్దరం మనసు విప్పి బోలెడు మాట్లాడుకుంటుండగానానమ్మా ! ప్రేమ పెళ్లిళ్లన్నీ విఫలం అవుతాయేమో కదా !” అంది.

అలా ఏమీ ఉండదు. పెద్దలు చూసి చేసినవి కూడా విఫలం అవుతాయిఅన్నాను 

”  మరెందుకూ అందరూ ప్రేమ పెళ్ళిళ్ళను వ్యతిరేకిస్తారు ? ” అడిగింది.

కొంత మంది యువత వెర్రి వ్యామోహాలకీ, ఆకర్షణలకీ  లోనయ్యి ముందూ, వెనకా చూసుకోకుండా పెళ్ళాడి తర్వాత దెబ్బ తినడం చూసి అనుభవంతో !” అన్ననా మాటలకి పల్లవి ఇంకేమీ మాట్లాడ కుండా నిద్ర పోయింది.

మర్నాడు ఆదివారం. బ్రేక్ ఫాస్ట్  తింటుండగా అంది పల్లవి. “అమ్మా! నాన్నా! నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీకు  నచ్చిన సంబంధం చూడండిఅంది టిఫిన్ తింటూ తల పైకెత్తకుండా. జానకి ఆనందంతో టిఫిన్ తినడం మానేసి గబుక్కున చెయ్యి కడుక్కుని దేవుడి దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం పెట్టి  ఏదో మంత్రం చదువుకుంటూ కూర్చుందిరాంబాబుచట్నీ నువ్వు చేసేవామ్మా ? చాలా బావుందిఅన్నాడు ఏమనాలో తెలీక. పల్లవి సీరియస్ గా  ఇడ్లీ తినేసి మారూమ్ లోకి వెళ్ళిపోయింది. రాంబాబూ, నేనూ బ్యాంకు పని మీద బైటికి వెళ్ళినప్పుడు ఖదీర్ విషయం వాడికి చెప్పాను. “బతికి పోయాంఅంటూ నవ్వాడు. మర్నాడే, రెండు రోజుల్లో బయల్దేరతానని చెప్పి రాంబాబు చేత బస్సుకి టికెట్ బుక్ చేయించుకున్నాను.

****

ఆరోజు ఆదివారం. రాత్రికే నా ప్రయాణం. కాఫీ టిఫిన్ లయ్యాక సోఫాలో నేనూ, రాంబాబు టీవీ ముందు కూర్చున్నాం. పల్లవి మరో కుర్చీ లో కూర్చుందిజానకి స్నానం చేసి గుడికి తయారయ్యింది. పూజ బుట్ట టీపాయ్ మీద పెట్టి నా కాళ్ళకి దణ్ణం పెట్టి పక్క కొచ్చి కూర్చుంది. నా చేతులు పట్టుకునిఅత్తయ్యా ! మీరు దేవుడు పంపిన దూతలా వచ్చి దాని మనసు మార్చారు. నా నెత్తి మీద పడ్డ బండను తీసేసారు. మా అమ్మా నాన్నలకి కూడా నా కష్టం చెప్పలేదు మీకే చెప్పాను. మీరు సమర్ధులని నాకు తెలుసుఅంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది.

నువ్వలా కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు తప్పుఅన్నాను జానకి భుజం తడుతూ. జానకి కళ్ళు తుడుచుకుని లేచిమీరుండగానే ముందుగా వినాయకుడి గుడికెళ్ళి మొదలుపెట్టి నా మొక్కులన్నీ ఒకటొకటీ తీర్చుకుంటాను.అంది మా ఇద్దరివైపూ చూస్తూ. ” సరేపోయిరా ! ” అన్నాను లేచి గుమ్మం వరకూ వెళుతూ.

తిరిగి వచ్చి కూర్చుని అబ్బాయి వైపు చూసాను. టీవీ కట్టేసిచెప్పమ్మా !” అన్నాడు రాంబాబు నిశ్చింతగా నవ్వుతూ. పల్లవి మా ఇద్దరి వైపూ చూస్తూ కూర్చుంది.

నేను చెప్పాలనుకున్నది మొదలు పెట్టాను. “తల్లి తండ్రుల బాధ్యతంటే, సమస్య వచ్చిందని దేవుళ్లందరికీ  ముడుపులు కట్టి  అది తీరాక మొక్కులు తీర్చుకోవడం కాదురా. ఇప్పుడొచ్చిన సమస్య సమసిపోగానే కథ సుఖాంతం అయినట్లు కాదుప్రాబ్లెమ్ మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. మనం చేయాల్సిందల్లా పిల్లలు వేసే ప్రతి అడుగు వెనకా మన సలహా సహకారం ఉండేట్లు చూడడం, మన పరిణతి వారి లోకజ్ఞానానికి తోడవటం అంతే. ప్రేమ వివాహాలు చేసుకున్న పిల్లల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టి చేతులు దులుపుకోవడం కూడా తల్లితండ్రుల బాధ్యతా రాహిత్యమే అవుతుంది. వీలయినంతగా వాళ్ళకి ముందు వెనుకలు వివరించి, హెచ్చరించి వారి దారిన వారిని పోనివ్వాలి. కష్ట నష్టాలు వాళ్లే పడతారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది. ” 

అవునమ్మా ! ఇప్పుడు నావయసు వాళ్లందరికీ ఇదే పరిస్థితిఅని నవ్వాడు రాంబాబు

నేను మళ్ళీ అందుకుని “పిల్లలు జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి వాళ్ళని మానసికంగా సమాయత్తం చేయాలి అలా వాళ్ళ వ్యక్తిత్వాలని మలచాలి.  అంతే కానీ మన భయాలూ,ఆందోళనలూ వాళ్లపై రుద్ద కూడదు. అలా అని వాళ్ళేం చేసినా పిచ్చి ప్రేమతో తలూపకూడదు.

ఇప్పుడు మన పల్లవి మనం చెప్పిన పెళ్లి చేసుకున్నా దాని వైవాహిక జీవితం సాఫీగా సాగుతుందని గారంటీ లేదు కదా ? వచ్చే భర్తతో ఇబ్బంది రావచ్చుపిల్లకి అన్నివేళలా జీవితాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యస్థయిర్యాలిస్తూ ప్రేమగా దాని వెన్నంటి ఉండాలి. దాని బ్రతుకది తీర్చి దిద్దుకునేలా, జీవితంలో అది   తప్పటడుగులు వెయ్యకుండా స్థిరమైన అడుగులు నిబ్బరంగా వేసేలా చూడాలి అంతవరకే మన బాధ్యత.” అన్నాను నిదానంగా.  

నిజమేనమ్మా ! నువ్వన్న మాటలో నూటికి నూరు పాళ్ళు సత్యం ఉందిఅన్నాడు

ఇంకేంటి సంగతులు ? ” అన్నాను

అమ్మా ! నీకు గుర్తుందా ? నేను ఎమ్మే చదివేటప్పుడు  మా క్లాస్ మేట్ రవి కులాంతర వివాహం చేసుకుంటుంటే నువ్వు  రవినీ అమ్మాయినీ పిలిచి కౌన్సిలింగ్ చేసావు. తర్వాత వాడి పెళ్ళికి రిజిస్టర్ ఆఫీస్ కొచ్చి సాక్షి సంతకం కూడా చేసావు. సంగతి జానక్కి చెప్పుంటే నిన్నిక్కడికి పిలవక పోయేది. నీకీ కీర్తి దక్కక పోయేదిఅన్నాడు రాంబాబు గట్టిగా నవ్వుతూ.

నేను వాడి నవ్వుతో శృతి కలిపి నవ్వుతుండగా పల్లవి వచ్చి నా పక్కనే సోఫాలో కూర్చుంటూవెళ్ళిపోకు నానమ్మానువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలిఅంది నా చుట్టూ చెయ్యి వేస్తూ

విన్నావుగా ! నా ఆశీస్సూ, నా సూచనా ఎప్పటికీ ఒకటేనేనెక్కడున్నా అవి నీ వెంటేఅన్నాను దాని తలపై ముద్దు పెడుతూ.  

****

 అల్లూరి గౌరీలక్ష్మి స్వీయ పరిచయం :

మాది కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా. మా గ్రామం అంతర్వేది సముద్రానికి దగ్గరగా ఉండే అంతర్వేదిపాలెం. 

నా విద్యాభ్యాసం అంతా  రాజమండ్రి టౌన్,పశ్చిమ గోదావరి,తూర్పుగోదావరి,వైజాగ్,మద్రాస్

  •     కాలేజీ చదువు ఐదేళ్లూ మా  పక్క గ్రామం మలికిపురం డిగ్రీ కాలేజ్ లో జరిగింది. B.Sc.,B.P.R.,MA (Political Sciecne)  చేసాను.
  • పచ్చని చేలూ,కోబ్బరితోటలూ, చుట్టూ గోదావరి పాయలూ ఉండే మా ఊళ్లలో మా మిత్ర బృందానికి  నచ్చిన పని – వారానికి రెండు సినిమాలు చూడడం, లైబ్రరీలో పుస్తకాలు చదవడం.అలా సెలవుల్లో రోజుకు నాలుగు నవలలు చదివి గ్రంధాలయం లో ఉండే అన్ని పుస్తకాలూ పూర్తిచేశాను.నేను తొమ్మిది పదేళ్లనుంచే కనబడ్డ కాగితమల్లా చదువుతూ ఉండేదాన్ని. ఇంట్లో పెద్ద వాళ్ళు చిన్నపిల్లవి నీకెందుకు అన్నా మానకుండా వాళ్ళు చదివే సీరియళ్లూ, ఇతర నవలలూ చదవడం ఒక వ్యసనం అయ్యింది.క్లాస్ లో ఎప్పుడూ ఫస్ట్ రావడంతో ఎవ రికీ ఎలాటి అభ్యంతరమూ వుండేది కాదు.

అలా డిగ్రీ పూర్తవగానే పెళ్లి. ఆపై హైదరాబాద్ కి రావడం జరిగింది. మొదటికథ: 1982లో కార్టూనిస్ట్, కధారచయిత మల్లిక్ గారి ‘ఆడది’ అన్న కథ చదవగానే కోపంతో ‘మగాడు’ అనే కథ రాసి ‘విజయ ‘ మాసపత్రికకి పంపాను.అది అచ్చయ్యాక నేను మళ్ళీ రాయడానికి ప్రయత్నించలేదు. నాకు రాయాలన్న ఉద్దేశం లేనే లేదు.ఉద్యోగం సంపాదించే, ఇంకా కుటుంబం చూసుకునే  క్రమంలో పదేళ్లు గడిచిపోయాయి. సినిమాలు చూడడం,పుస్తకాలు చదివే వ్యాపకం చదవడం సాగుతూనే ఉండేది. సినిమాలు,నవలలలోని కధలు,పాత్రలు,పాటలు, సంభాషణలు మొదలైన వాటిపై ఆసక్తి, ఇష్టాలు ఎప్పుడూ ఉండేవి. 

 రచనా  ప్రారంభం : కాస్త తీరిక చిక్కాక 1991 నుంచీ కధలు రాయడం మొదలు పెట్టి ఒక్కసారిగా పది కథలు రాసేసాను. అవి ప్రభ, స్వాతి,జ్యోతి,భూమి,మయూరి,పల్లకీ,తేజమాసపత్రిక..ఇలా అన్ని పత్రికలలోనూ రావడం మొదలు పెట్టాయి. అప్పటినుండీ ముప్పయ్యేళ్లుగా ఆపకుండా రాస్తూనే ఉన్నా. 

స్ఫూర్తి:  కొడవటిగంటి,గోపీచంద్,వాసిరెడ్డి,మాదిరెడ్డి,కోడూరి కౌసల్యా దేవి,కొమ్మూరి వేణుగోపాల్ రావు రావిశాస్త్రి,బీనాదేవి,మాలతీ చందూర్, లత,చలం,యండమూరి,మల్లాది ఇలా ఎందరో నాకు స్ఫూర్తి నిచ్చిన రచయితలు.

  • హాబీలు: నిరంతరం ఏదో ఒకటి చదవడం, ఆత్మీయ మిత్రులతో గడపడం, వీలుకాకపోతే ఫోన్ లో  మాట్లాడడం,రాయాలనిపిస్తే రాయడం. ప్రశాంతంగా ఉండడం. జీవిత భారాన్ని తేలిక చేసే హాస్యాన్ని ఇష్టపడడం. సినిమాలు చూడడం మాత్రం మానలేదు.
  • అసలెందుకు రాయడం ?: చిన్నప్పటినుండీ సాహిత్యం చదవడం వల్ల ఒక విధమైన విజ్ఞాన వికాసం కలిగింది. అన్ని విషయాలనూ నిశితంగా గమనించే ఎరుక కలిగింది. చుట్టు  పక్కల మనుషుల్ని స్టడీ చెయ్యడం, వారి మనస్తత్వాలు పరిశీలించడం చేసేదాన్ని.అందువల్ల,మానవులు ఇలా సంకుచితత్వాలు లేకుండా ఉండాలి.పక్క వారిపై సానుభూతితో ఉండాలి.మనం బతకాలి పక్కవాడిని కూడా బతకనివ్వాలి.అందుకోసం అందరూ పెద్ద మనసు చేసుకోవాలి.స్వార్ధం కొంత వదలాలి, అని చెప్పాలి అన్న తపన కలిగింది. ఈ భావన రచయితలందరికీ ఉండేదే. నాకే ప్రత్యేకం కాదు.  
  • ఇప్పటివరకూ మూడు నవలలూ,నాలుగు కథా సంపుటాలూ,రెండు కవితల సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువడ్డాయి.

ఉద్యోగ ప్రస్థానం: APIIC (ANDHRA PRADESH INDUSTRIAL INFRASTRUCTURE CORPORATION) లో 33 సంవత్సరాలు ఉద్యోగం చేసి  పబ్లిక్ రిలేషన్స్ జనరల్ మేనేజర్ గా 2019 లో పదవీ విరమణ చేసాను.

  •   నా అభిప్రాయం : మనిషి అన్ని రంగాల్లో ఎంత ఎత్తుకి ఎదిగినా ప్రాధమికంగా మనుషుల మధ్య సంస్కారం ఉండాలి. ధన సంపాదన లో పడి ఎండమావుల వెంట పరుగు  కాస్త ఆపాలి. మానవ జీవితంలో చివరికి మిగిలేవి రెండే అవి స్నేహం, ప్రేమ. ఏ కళ పరమార్ధం అయినా మనసుని ఆహ్లాపరచాలి. హృదయవైశాల్యాన్ని పెంపొందింప చేయాలి..సాహిత్యానికి ఆ శక్తి మెండుగా వుందని భావిస్తా.  

రచనలు- అవార్డులు:

 * నాలుగు కథా సంపుటాలూ,మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,

 ఒక కాలమ్స్ బుక్ వెలువరించాను.

 *  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి శ్రీ విళంబి ఉగాది పురస్కారం. 

 * పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తి పురస్కారం. 

* లేఖిని సంస్థ నుండి  పురస్కారం. 

* నెల్లూరు మాసపత్రిక విశాలాక్షి వారి పురస్కారం.

* మల్లెతీగ మాసపత్రిక వారి పురస్కారం, ఇంకా అనేక ప్రతిభా పురస్కారాలు.

* మరి కొన్ని కధలకు, కవితలకు బహుమతులు లభించాయి  

* వివిధ దిన పత్రికలలో అనేక  రాజకీయ వ్యంగ్య వ్యాసాలు.

*****

Please follow and like us:

6 thoughts on “కథా మధురం- అల్లూరి గౌరీ లక్ష్మి”

  1. శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారి అడుగేయ్ నిబ్బరంగా చాలా బాగుంది ప్రతి కోడలూ ప్రతి అత్తగారూ ఇలాగే ఉంటే old age homes వీధికి ఒక్కటి వెలవవు . ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా పోషించారు . ప్రతి ఇంటా ఇలాంటి అత్తగారుంటే స్వర్గమే ఆ ఇల్లు ఇంత మంచి కధని అందించిన. గౌరీలక్ష్మి గారికి ధన్యవాదాలు
    ఉషా లక్ష్మి

  2. మధురమైన కథ. విశ్లేషణ, కథ,పరిచయం ..అంతా మధురమే! తార్కిక ఆలోచన,ప్రేమ,ఆత్మీయత..wow.. ప్రతి పాత్ర మనసులో నిలిచిపోతుంది.ఇలాంటి కథ చదివించిన నెచ్చెలి కి,రచయిత్రికి అభినందనలు.

  3. కథయొక్క ఆత్మని పట్టుకోవడంలోనూ, పాత్రల అంతరంగాలనూ,రచయిత ఆంతర్యాన్నిగ్రహించడంలోనూ సమీక్షకురాలు నూటికి నూరు శాతం విజయం సాధించారు. అందువల్లనే చక్కని సమీక్షను ఆమె చేయగలిగారు.ఒక రచన వెనక రచయిత మనో మధనం, ఒక సూచన చెయ్యాలన్న ఆవేశం,ఆతృత ఉంటాయి.అటువంటి ఆవేదనను,ఉత్సాహాన్నీ క్యాచ్ చెయ్యగల పాఠకులు అరుదేనని చెప్పక తప్పదు. Routine కధా పరిచయం కాకుండా సహృదయంతో, సగౌరవంతో Review
    చేసిన దమయంతి గారికి ధన్యవాదాలు.
    ON THIS OCCASION MY SPECIAL THANKS TO RESPECTED AND HONOURABLE NECCHELI Ms.GEETHAJEE.

    ON THIS OCCASION MY SPECIAL THANKS TO RESPECTED AND HONOURABLE NECCHELI Ms.GEETHAJEE.

  4. ముచ్చటైన మూడు పాత్రలతో… వినూత్నంగా చెక్కిన ‘ అడుగెయ్ నిబ్బరంగా’ కథను… పి. హెచ్. డి. థీసిస్ స్థాయిలో…అరటిపండు వలిచి నోట్లో పెట్టిన రీతి సమీక్షించిన ఆర్ దమయంతి గారికి… కథా రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారికి… ‘నెచ్చెలి’ వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.