ప్రమద

ప్రకృతి ఎదపై  మోహపు ఆనవాళ్ళు!

కుప్పిలి పద్మ “ఎల్లో రిబ్బన్” మోహలేఖలు!!

 

-సి.వి. సురేష్

Many eyes go through the meadow, but few see the flowers in it. —Ralph Waldo Emerson

చాల కండ్లు పచ్చిక బయిళ్ళ ను మాత్రమే పరిశీలిస్తాయి. కానీ, కొన్ని కండ్లు మాత్రమే అందులోని పువ్వుల్ని చూడగలుగు తాయి… ఎమెర్సన్ 

**

ఈ రచయత్రి కనులు ఒక సెకన్లో వందల కొలది  ఫ్రేమ్స్ ను  ప్రాసెస్ చేస్తాయో యేమో, తెలియదు కానీ,  అంతకు మించి , తానో సెకండ్ కాలవ్యవధిలో చూసిన ప్రకృతి పై పద్మ కొన్నివేల పేజీలు  రాయగలరని అనిపించింది. ( సాధారణంగా ఒక మనిషి కనులు తన చుట్టూ చూసిన వాటిని,  ఒక సెకనుకు ,  మాక్సిమం 70 ఫ్రేమ్స్ ను ప్రాసెస్ చేస్తాయని అంచనా- )

“ఎల్లో రిబ్బన్ “ – మోహలేఖలు …ఇది, ఓ ప్రియురాలు  ప్రకృతి తో కలిసి చేసిన ప్రయాణపు ట్రావెలాగ్. ప్రియురాలికి తన ప్రియుడిపై వున్న సుదీర్ఘ ప్రేమ భరోసా. అనంత మోహ పరవసాల చిరునామా.  అడుగడుగునా ప్రకృతిని కవిత్వంగా మార్చి, పాఠకుడికి  పరకాయ ప్రవేశం నేర్పించి, ఆ కవిత్వం లోకి, అతడిని ప్రవేశ పెడుతుంది. ఒక సమ్మోహన ప్రేమ కావ్యం. 

ఈ నగరారణ్యాన –  రంగు వెలిసి, జావ కారి, చేష్టలుడిగి జీవన సాఫల్యం పై ఆశ కోల్పోయి బతుకుతున్న ప్రపంచానికి ఈ “ఎల్లో రిబ్బన్-మోహ లేఖలు” ఒక తడి, లేత పరామర్శ.  ఒక వెచ్చని కౌగిలి. ఋతువుల సుపరిచయం.  ఒక ప్రేమైక కవితా కావ్యం. 

ప్రకృతి లోని రాగాల్ని ఆమె ట్యూన్ చేసింది. వాటికి తానో ఆలాపనైంది. అందులోని నవ్వుల్ని విరబూయించింది. ఋతువుల నెచ్చెలి గా మారింది. మోహ ప్రకృతినంతా తన అక్షరాల్లో బంధించింది. అద్భుతమైన ప్రేమ చింతను ప్రవేశ పెట్టింది. ప్రకృతిని ప్రేమించింది. మోహించింది. తానో పరవశమై మనల్ని పరవశింప చేసింది. ఆనంద జీవితపు ఆనవాళ్ళను ప్రకృతి లో పసికట్టింది.  చినుకు.. రుతువు.. పిల్ల తెమ్మెర.. మంచు వాన.. సంద్రం.. వడగళ్ళ వాన…పడచు ప్రేయసి అమెచ్యూర్ కోరికలు…ప్రేయసీ ప్రియుల అల్లరి జ్ఞాపకాలు..పూలు.. రంగులు..సంధ్యలు..ప్రభాతాలు.. ప్రదోషాలు.. అరబిక్ సముద్రము.. గోదావరి అందాలు….పడవ ప్రయాణాలు…సినిమా ప్రస్తావనలు… అందులో  స్త్రీ వాదపు  ఆనవాళ్ళు …ప్రకృతికే చక్కిలిగింతలు పెట్టె మెటఫర్లు..ప్రకృతి సైతం సిగ్గుపడి అరమోడ్పు లయ్యే సంభాషణలు..తనలో ఇన్ని అందాలు ఉన్నాయా?  అని ప్రకృతిని సైతం ఆలోచించేలా చేసే అద్భుత వర్ణనలు….ఉంటే…..ఇలాంటి ఒక ప్రపంచం లోనే ఉండి పోవాలన్న లేత ఆశ.. !

“దట్టమైన నీలి వర్ణపు జలధారపై ఉండుండి వో వూదారంగు, కాసింత కోరారంగు సమ్మిళితమై విరగ కురుస్తోన్న చినుకుల విశృంఖల సౌందర్యాన్ని చూపుల విప్పార్చుకొని  చూస్తోంటే తబ్బిబ్బవుతోంది మనసు. యే జీవ రహస్యాలని అందివ్వాలని యీ ఆకాశం, సముద్రం ధారాపాతంగా యేకమయ్యాయో ….వుక్కిరిబిక్కిరిగా ఆలోచనలు.

ఈ వాక్య౦ మనల్ని ఉండలుగా చుట్టి ఆ కురుస్తున్న వర్షంలో పడేస్తుంది. ఇంకేదో , బాగా గమనించమని ఆ ఆకాశం వైపుకు చూసేలా చేస్తుంది. నిజంగా ఆకాశం ఏదో జీవ రహస్యాన్ని ఆ భూమికి చెపుతుందేమో అనిపించేలా చేస్తుంది. 

అక్షరాల్లో చేతనం, పదాల్లో ఒక చలనం, వాక్యాల్లో చిగురింప చేసే ఒక ఆలోచన….ఇలా, మనకు మన పూర్వీకుల ద్వారా వారసత్వంగా సంక్రమిస్తున్న ప్రకృతిని అందంగా ఆరాధిస్తూనే, జీవన సంఘర్షణ లోకి ప్రవేశ పెట్టి, సంఘర్షణ ను అంతం చేసే  ఒక ప్రాకృతిక చైతన్యం పద్మ.

 ***

ఇలా ఎన్నో ఎన్నెన్నో అతి చిన్న చిన్న అందాలను కూడా ఆశ్చర్య పరిచేలా వివరిస్తూ,  సంభాషిస్తూ..తన అనుభవాల్ని చెపుతూ… ప్రియుడిని గుర్తు చేసుకొంటూ…. పాఠకుడి కళ్ళముందు ఒక సమ్మోహన ప్రేమ కావ్యాన్ని దృశ్యమానం చేసారు కవియత్రి.    

ఈ ప్రకృతి ఎవరిదో కాదు … దాన్ని ప్రేమించిన వారికే అది సొంతం.  ఎల్లో రిబ్బన్ మోహలేఖల సంకలనంలో, రచయిత్రి,  ప్రతి ఋతువును తన సొంతం చేసుకొంది.  ప్రతి అందాన్ని ఆరాధించింది. ప్రకృతి లోని అంతః బహిర్  సౌందర్యాన్ని అక్షరాల్లో దృశ్య౦ చేసారు.

గతంలో పద్మ రాసిన “అమృత వర్షిణి” లో ప్రియురాలు తన ప్రియుడికి రాసిన లేఖలు పోస్ట్ చేస్తే,  ఇప్పుడు ఆమె ఆధునికతను అంది పుచ్చుకొని ఒక అపరిచిత ప్రేయసి, తన ప్రియుడికి తన ప్రయాణపు ట్రావెలాగ్ ను ఈ మెయిల్స్  ద్వారా అందవేసిన ప్రేమ లేఖల పరంపర… ఈ “ఎల్లో రిబ్బన్-మోహ లేఖలు”

***  

తనలోని మోహఆరాటం లోకి  మనిషి ఎప్పుడో  ఒకప్పుడు ఒక నిర్ణీత వ్యవధిలో ట్రావెల్ చేస్తాడు.  తన ఊహా ప్రపంచం లోకి  కాసింత ఊరటను కోరుకొంటాడు. తనలో నిబిడీకృతమైన అనంత సౌందర్య పిపాసకి ,  సరిగ్గా ఆ సమయం లోనే  ప్రకృతి మనిషికి ప్రేరకం అవుతుంది. అందులోని వర్ణాలు మనిషిని రంగుల ప్రపంచం వైపుకు లాక్కెళ్ళుతాయి. సరిగ్గా.. ఇదే స్థితిలోకి ఈ మోహలేఖల సంకలనం మనల్ని ప్రవేశ పెడుతుంది.  అలాంటి స్థితి ని రచయిత్రి….“మనిద్దరం  అరటి పువ్వు పొరలు పొరలుగా విచ్చుకున్నట్టు మనం మన మనసులోని అన్ని ఎమోషన్స్ ని విప్పుకొంటు౦టాం అప్పుడప్పుడు ”  అనే వాక్యంతో మనలో ఆ స్పృహను రాజేస్తుంది. 

ప్రకృతి ప్రేమికురాలు, ఒక సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి, మనిషి-సమాజం అనే అంశాలపై మనో విజ్ఞాన పరిశోధన చేసిన రచయత్రి పద్మ అనేందుకు పక్కా నిదర్శనం…ఈ వాక్యం…   

“మనసేం ఎస్కలేటర్ కాదు కదా…వెళ్ళిన దారిలో కనీసం వెనక్కి కూడా దాని మీద నుంచే రాలేం కదా!” 

ఈ వాక్యం చదివి నేను ఎంతగానో ఆశ్చర్య పోయాను. ఇంతటి జీవనసత్యాన్ని, ఆ ఎస్కలేటర్ పై రాకపోకలతో పోల్చడం.. మన చుట్టూ జరిగే ఇంత చిన్ని అంశాన్ని నేనెలా గమనించలేకపోయాను… అని అనిపించింది. 

By discovering nature, you discover yourself. —Maxime Lagacé 

ఈ ప్రకృతిని మనమెప్పుడైతే కనిపెట్టగలుగు తామో,  అప్పుడే మనల్ని మనం పసిగట్టిన వాళ్ళ మవుతాము. -లగసే

***

ఈ సంకలనం లో రచయిత్రి పద్మ లో మరో భిన్న కోణాన్ని చూసాను. ఒక పోయెట్ ఫిలాసఫర్ గా మారితే, వారి రచనల్లో  ఒక జనరల్ సెన్స్ తో పాటు మెటా ఫిసికల్ కవిని, ఆ పరిభాషను చూడొచ్చు. 

“నిరాశలు అచ్చు యీ శ్రవణ మేఘాల్లాంటివే. మనిషికెంత భరోసానో.. యివన్నీ తాత్కాలికమే అనే ఓ లలితమైన ఆనవాలు వుండటం.” 

ఇలాంటి వాక్యం మనిషిని ఒక ఇన్ డెప్త్ ఆలోచనల్లోకి పడేసే తత్వం. ఈ వాక్యం రాయడానికి  ఈ సున్నిత మనస్తత్వం గల ప్రకృతి ప్రేమికురాలైన రచయిత్రికి ఎలా సాధ్య పడిందో ఆశ్చర్యం.  

***                                         

షీ ఈజ్  “నేచర్ వితిన్ ది నేచర్” – ఆమె ప్రకృతిలో అంతర్భాగం. తనలోనే ప్రకృతిని ఇముడ్చు కొని,  దాన్ని ప్రసారం చేసేందుకు ఒక కవిత్వ భాష ను ఎంచుకుంది.  ఆ భాష లో సకల కాల ఋతువుల్ని ప్రవహింప చేసింది. ఈ వాక్యాలు ఎందుకంటున్నా నంటే…..

యింకేదో యింకేదో …వూ…అరమోడ్పు తడిసిన కనురెప్పలతో,  వేల వేల చినుకులు చిలిపి చిటికెలు వేస్తుంటే పాదాల వేళ్ళ  సందుల్లోంచి చమక్కుచమక్కు మంటోoటే …రిం జిం.. అనిపరుగులు తీయిస్తూ చుట్టూ ఆవరించిన యీ చెమ్మ ప్రపంచం మనసంతా కమ్ముకొంటూ ప్రియాతి ప్రియమైన స్నేహమా.. మనమిద్దరం నిరీక్షిస్తూనే ఉన్నాం. కదా.. వూ… నిరీక్షిస్తూ నే వున్నాం.

**

“అందుకే మన స్పర్శ  ఎంతటి కాంక్షా భరితమో , ఎంతటి మోహ లావణ్యమో అంతటి పసి మోహనం కూడా..”

**

“వుండుండి గాలి వీచగానే మనం పెనవేసుకొని యేదీ మా యిద్దరి మధ్య  నుంచి వెళ్ళగలవాని! అప్పుడెప్పుడో  ఆ కొండవాగు వాలులో గాలిని ఆట పట్టించినట్లు  యిప్పుడు యీ చల్లని తీపి వగారుల గాలిని ఆటపట్టించాలనిపిస్తోంది నీతో చేరి.”

**

“అప్పుడు నువ్వొక కవితావనంలా తోస్తావనుకుంటా …నన్ను అల్లుకొని నన్నొక కవిని చెయ్యి..”

**

“నే వొచ్చే స్సరికి వీలైతే వొక గోరింటచెట్టుని వెతుకు. మోహపు అరిచేతులని కాన్క చేస్తా!.”

**

రాత్రంతా మంచుని మేసి, హిమ సౌగంధాన్ని నెమరేస్తూన్న లేతాకుపచ్చని గాలి.  

“చూస్తే  నెలవంక పాయ. పుట్టినప్పుడు నదికూడా పసిశిశు వేనా..మెల్లమెల్లగా దినదిన ప్రవర్తమానమవుతూ బాలికలా వో నదికూడా పూర్ణ బింబ ప్రవాహమవుతుందా…..ముందు నాకు అఖండ గోదావరి పరిచయం.. స్నేహం..అప్పుడా పుట్టుకని చూస్తే నాకనిపించింది.. వున్న చోట నుంచి నువ్వు చేసే ప్రయాణం నువ్వు విశాలమవుతూ.. ఆ విశాలత్వం నీకు మాత్రమే కాదు ఖచ్చితంగా సమూహాలకి సారవంతమైన జీవనంమివ్వాలి. అదే కదా జీవితేచ్ఛ.. నది కైనా.. నీకైనా.. నాకైనా..

**

అద్దుడు కాగితం ఇంకును పీల్చుకున్నట్లుగా యీ వెన్నెలా నన్ను లాక్కొంటోoది…మోహ రాగమై… మనసంతా నువ్వే ప్రేమోద్వేగంతో…”

**

“యెర్ర జూకామల్లెల్లా వొక ఆధారాన్ని పెనవేసుకొన్నంత సొగసైన జ్ఞాపకాలని మనిద్దరం ఎప్పటికప్పుడు ప్రతి మలుపులోనూ ఇచ్చుకు౦దామనే హామీ పత్రం రాసుకొంటే… అయ్యో …హామీపత్రం అనుకోవటం బాగులేదు. కానీ  ముద్దొచ్చే ప్రామిస్ చేసుకొందామా మరోసారి వో నా ఉదయపు కాఫీ పరిమళపు అబ్బాయి.”

ఒక్కో వాక్య౦లో, ఒక్కో అంతః సౌందర్యం పొదిగి ఉంది.. సహజీవన ఆనంద సరిగమలు అందుకున్నాయి. ప్రకృతి మమైకత్వం ….ప్రాకృతిక శోభ …ప్రోగ్రెసివ్ ఆలోచనలు… సౌందర్యారాధన. ఇలా సంకలనం నిండా ఒక తనివి తీరని మోహ పరవశం మనల్ని వెంటాడు తుంది. 

The goal of life is living in agreement with nature. —Zeno

ముగింపు…

ప్రకృతినీ, ప్రకృతి లోని అంతరాoతరాలను, దాని అంతః సౌందర్యాన్ని, అది తన చుట్టూ ఉన్న సున్నిత మనస్కులని ఎలా ప్రభావితం చేస్తుందీ…అలాగే, ప్రేమనూ.. ప్రేమిక ప్రపంచాన్ని… మోహాతీత సందర్భాలనూ…దాని చుట్టూ పరివ్యాప్తమైన సంబంధిత మానవ సమాజాన్ని ఆమె ఏకోన్ముఖంగా బంధించి అక్షర యాగం చేసి,  అందులోని యాగ ఫలాన్ని పాఠకులకు  అందించింది ఈ ఎల్లో రిబ్బన్-మోహ లేఖల్లో ….!!

ఎంత ప్రేమ కావ్యాలు రాసినా.. ప్రకృతి ప్రేమికురాలు అయినా… ఆమె లోని సామాజిక దృక్పథం  …ఆ స్త్రీ వాద ఆలోచనలు మనకు ఆ సంకలనం లో ఒక రేంజ్ లో మన ముందు కదలాడతాయి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా నటించిన ‘ది క్వీన్’ “థనూ వెడ్స్ మనూ రిటర్న్స్” సినిమాలను గురించి ప్రస్తావిస్తూ… “ అసలు బాలివుడ్ స్త్రీలు ప్రధాన క్యారక్టర్స్ గా తీసిన వాటిలో, “dum lag eke haisha” లో వొబేసిటి నీ, ఎన్ హెచ్ 10 లో, యిన్ టాలరెంట్ సొసైటీని, “తనూ వెడ్స్ మనూ రిటర్న్స్” లో మారిటల్ యిన్ కంపేటబులిటీ నీ.. ‘పికు” లో పేరంటల్ కేర్ లాంటి నాలుగు పార్శ్వాలని డీల్ చేసిన యీ నాలుగు సినిమాలు హిట్ అవ్వటం తో వుమెన్ పవర్ అని భలే మెచ్చుకొంటున్నారు. ఈ ఎల్లో రిబ్బన్ లో – రచయిత్రి భావనలని ఆ లేఖలు రాసే ప్రేయసి ద్వారా తన ప్రియుడికి చెపుతుంది. స్త్రీల వాయిస్ కి ప్రామినెన్సు ,స్త్రీలకూ ఫైనాన్సియల్ ఇండిపెండేన్స్, యింటలెక్చువల్ ఇండిపెండెన్స్ ని, అన్ని రకాల ఫ్రీడమ్ స్త్రీలకు వస్తున్నప్పుడు వాటి ఆధారంగా తీసిన సినిమాలు విజయవంతం కావడం, ఒక రకంగా ప్రజలు దీన్ని స్వీకరించి యక్నాలేడ్జ్  చేస్తున్నారని ప్రేమగా చెపుతుంది. అంతేగాక, స్త్రీ ఎందుకు స్వతంత్రంగా ఒంటరిగా అలా దేశాల్ని, రాజ్యాల్ని చుట్టుకొని రాకూడదు? అని ఓ కొత్త స్వతంత భావాన్ని అలనాటి చందమామ, బొమ్మరిల్లు కథలకు టాగ్ చేయడం గొప్ప విశేషం. ఆ లేఖల్లో ప్రేయసి కూడా, రాజు అలా ఒంటరిగా వెళ్ళే కథల్ని, తనదైన శైలి లోకి మార్చి రాణి అలా ఒంటరిగా రాజ్యాలని చుట్టుకొని వచ్చేలా ప్రెజెంట్ చేసే దాన్ని అని , తన భావనల్ని ఆ ప్రేయసి ద్వారా చెప్పడం గొప్ప కాయినేజ్. ఈ రకమైన సామాజిక కోణాలు..బలమైన స్త్రీవాద గొంతుక మనకు అడుగడుగునా ఈ ప్రకృతి -ప్రేమ కావ్యం లో ఉండటం మూలానే ఈ ఎల్లో రిబ్బన్ స్త్రీవాద కావ్యం కూడా అని నా అభిప్రాయం.

*****

Please follow and like us:

3 thoughts on “ప్రమద – కుప్పిలి పద్మ “ఎల్లో రిబ్బన్” మోహలేఖలపై సమీక్ష –”

  1. “ఎల్లో రిబ్బన్ ” లోని సౌందర్యాన్ని.. స్త్రీవాద దృక్పధంని.. తాత్వికతని.. లోతుగా స్పష్టంగా అందించిన సి వి సురేష్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. “నెచ్చలి” ని గీతగారు నడిపిస్తోన్న తీరు అద్భుతం. గీత గారికి, నెచ్చలి కి హృదయ పూర్వక కృతజ్ఞతలు.. శుభాకాంక్షలు.

    1. నెచ్చెలి మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పద్మ గారూ! థాంక్యూ.

    2. చాలా సంతోషం..మీకు ఆర్టికల్ నచ్చినందుకు..పద్మ జీ… ఎడిటర్ కే. .గీత గారికి కూడా ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.