సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం

-కొండేపూడి నిర్మల

అక్షరాలు మనవే అయినపుడు  వాస్తవాలు వేరేగా ఎందుకు వుండాలి  ?

ఈనెల 29 వ తేదీన సంతకం సాహిత్య వేదిక కవయిత్రుల సమ్మేళనం నిర్వహించింది . 22 మ౦ది కవయిత్రులు కవిత్వ౦ చదివారు. నాలుగైదుమ౦ది సీనియర్స్ వున్నప్పటికీ ఎక్కువశాతం యువ కవయిత్రులు వుండటం ఇందులో విశేషం .    రేణుకా అయోల ప్రారంభ పరిచయ వాక్యాలతో నడిచిన ఈ సభ లో  తూముచర్ల రాజారాం సమీక్ష చేశారు.  అతిధులుగా విచ్చేసిన పుట్టు మచ్చ బ్రాండు కవి ఖాదర్ మొహియుద్దీన్ , అనువాదకులు ఎన్ ఎస్ మూర్తి ,  కవులు ప్రసేన్, వసిరా , అరణ్య కృష్ణ తదితరులు తమ స్పందనతో బాటు నిర్మాణపరమైన  సూచనలు ఇచ్చారు .
పాల్గొన్న కవయిత్రుల్లో మొదటివారయిన శైలజా మిత్ర,  “నెత్తురోడుతున్న ప్రపంచ చిత్రాల్ని\ భయభ్రాంతులవుతున్న బతుకు చాయా చిత్రాల్ని\ చూసి అయ్యో పాపం అనుకుంటూ \ఎందుకిలా నాకు నేనే స్వార్ధ౦ తో నా ఇంటి తలుపు వేసుకున్నాను “ అంటూ బాధపడ్డారు  , ఇది కరోనా దూరాలకు దర్పణం పట్టే కవిత కూడా  .. నా క౦టి ఏరులో కాళ్ళను తెడ్లుగా చేసుకుని.. అనే ప్రయోగం చాలా దృశ్యా త్మకంగా వుంది  .  
 గట్టు రాధికా మోహన్ ఒక కొత్త ఉదయం కోసం అనే శీర్షికతో ప్రారంభించి “తల్లి పేగుతెంచుకుని భూమి మీద పడ్డప్పుడు ఏమీ  తెలియదు ఆడామగా కులం మతం ఏమి తెలియదు అన్నీ మనుషులే నేర్పిస్తారు, మతాలు  కూడా  మనుషులే  నేర్పిస్తారు అంటూ చదివారు –  శారరక లింగానికి సామాజిక రూపం తీసుకోవడంలో వున్న వివక్ష జండరు సేనసీటైజేషన్ లో మొదటి పాఠ౦ . అయితే ఇంత మ౦చి కవిత చివరలో నినాద ప్రాయంగా మిగిలిపోయింది. దీనివల్ల ఆ ముందు  వాక్యాలు కలిగించిన  స్ఫూర్తి  దెబ్బతింటుంది .  ఇది మనలో చాలామంది చేసే పనే. ఎందుకంటే చిన్నప్పుడు నీతి కధలు చదివిన అలవాటు దీనికి మూలం. ఏదయినా సరే ఆశా ధోరణిలో  వుండాలేమో, సినిమాల్లో మాదిరి శుభం పలకాలేమో  అనే అభిప్రాయం ఇందుకు దారి తీస్తుంది . సృజన పని ఆలోచి౦ పచేయడమే. పరిష్కార ప్రకటన కాదు . రాధిక లాంటి మ౦చి కవయిత్రి ఇంకొక్క సిట్టింగ్ వేస్తే దీన్ని ఇంకా  మ౦చి కవితగా మార్చగలుగుతుంది  .  
 నెల్లుట్ల  రమాదేవి మనసుభాష అనే కవిత చదివారు . కనపడని చేయి అనేది శీర్షిక . “రుచి వాసనా తెలియకపోయినా కోలుకుంటాం, కరుణా మానవత్వం వుండకపోతే ఏం చేస్తాం? కన్నీటి ఆలలనెలాగో కాలంతో తుడుచుకుంటాం, గుండెక౦టిన  చారికల్ని ఎలా తుడుచుకుంటాం – అంటూ కరోనా విధ్వంసాన్ని  గురించి రాశారు . శైలీ పరంగా ఇదివరకు ఎన్నడూ లేని ఒక కొత్త నడక ఇందులో కనిపించింది .
శాంతి ప్రబోధ  తన కవితలో “కాల చక్రం గతి తప్పినట్టు\ రుతుచక్రం రూటు మారిందేమో\ ఆధిపత్యపు దోపిడిలో నువ్వు\ అణచివేత చెరలో నేను \ కూకటి వేళ్ళతో మాయమైపోతూ నువ్వు\ ఊపిరి దిద్దుకోకనే ఛిద్రమయిపోతూ నేను\  అంటూ స్త్రీకి ప్రకృతి కి వున్న  సాదృశ్యాన్ని చూపెడుతూ ఒక పర్యావరణ  కవిత కళ్ళకి కట్టినట్టు రాశారు. ఈకవిత ఇంకా సానపట్టాల్సిన అవసరం  వుంది  
స్త్రీల  పట్ల జరిగే అన్యాయాల్ని ప్రస్తావిస్తూ సమ్మెట విజయ,  తాలిబన్స్ గురించి  “నీడ లా నా వెంటే  వస్తోంది \రూపం ఏడదయితేనేం \ దాని  ఆక్రమణ అత్యాచారం నామీదే \ పొదలు గదులు కాదు\  నడి రోడ్డుమీదే నరకపు వికటాట్టహాస౦ \ నేనం పాపం చేశాను అమ్మను  అడగాలి \  అమ్మ నా అనుకరణ \ కానీ నేడు అమ్మను చూస్తే భయం\  అధికారానికి కొత్త  అర్ధం అణచివేతేనేమో అంటూ ముగిస్తారు . భూమి ఏదయినా భూమి పుత్రిక కన్నీరు అందరినీ ముంచెత్తుతూనే వుందని చెప్పడానికి కవయిత్రి  కనబరచిన సహానుభూతి  ఒక తార్కాణం .గొప్ప వేదన కలిగించే కవిత .
 ఫణి మాధవి సింగిల్ విమెన్ ( ఈ పదం మీద లోగడ చర్చ జరిగింది , ఇండిపెండెంట్ విమెన్ అనాలని  నిర్ణయించుకున్నాం ) గురించి యోధ అనే కవిత చదివారు అది ఇలా మొదలవుతుంది ‘ ఒక శక్తి ఇప్పుడు చెవిలో గుస గుసలాడుతుంది . ఈ తుఫాన్ నువు తట్టుకోలేవు..  ఈ రోజు ఆమె సమాధానం…. ఏ ఈదురు గాలులూ  ఆమె కాంతిని ఆర్పి వేయలేకపోయాయి .. .. వెనకనుంచి వేల వేల చెవుల కొరుకుళ్ళు , impossible , is she  a  woman ?.. అంటూ కొనసాగుతుంది . సింగల్ విమెన్ సంఖ్య 21 వ శతాబ్దంలో చాలా పెరిగింది  , కానీ ఇల్లు అద్దెకి తీసుకునేచోట  ఉద్యోగం చేసేచోట  పరిస్థితి మారనే లేదు . అంతే కాదు కవయిత్రే  చెప్పినట్టు ఆమె కన్నీటి  మడుగైపోతే ధైర్యం చెప్పడానికి చాలామంది వస్తారు , తీరా ధైర్యంగా వుంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు  . ఒక మ౦ చి మానసిక విశ్లేషణతో రాసిన కవిత  ఇది .
అరుణా  నారద భట్ల కవిత “సందర్భ సందిగ్ధ”-   లాక్ డౌన్ లో రద్దయిపోయిన మానవ సంబంధాల్ని గురించి రాసింది . “ఎవరినీ  తప్పు పట్టలేం\  దేన్ని కాదనలేం \ కాల౦  కఠిన భాష మాట్లాడుతున్నప్పుడు\  దేన్నీ  అంచనా వెయ్యలేం \ అధీనంలో వుండాలనీ  వుంచాలని కాంక్షలుండవు \  వాటంతట అవే తెరలు తెరలుగా తరంగాల  భ్రమాప్రపంచాలని సృష్టిస్తూ వణికిస్తున్నప్పుడు \  అణువు అణువులో ఒదిగి వుండదు .అంటూ ఇప్పటి ఒక వింత వాతావరణాన్ని వివరిస్తారు . అరుణ కవితలో సాంద్రత వుంది గాఢతకి ఎంచుకున్న భాష , నిర్మాణం బాగా అమిరింది
 పర్షియాదేవి కవిత  “ఆలోచించాలి” అంటూ మొదలవుతుంది . “పొట్టలో౦చి కేరింత సవ్వడి వింటూ \ పాదపు స్పర్శను అనుభవిస్తూ కూడా ఆలోచించాలి \. ఆడపిల్లని తెలిసిననాటినుంచి \ నిన్ను అబార్షన్ చేసుకోమని బలవంత పెడుతున్న వారిను౦చి\ నిన్నుపదిలంగా  కాపాడుకున్న రోజుగురించి\ ఆలోచించాలి. మైనస్ ని మోస్తున్నావని \ వాదిస్తున్న వారితో మైనస్ కాదు\ ప్లస్సే నని ఒప్పించిన  రోజు \ గుర్తు తెచ్చుకుని మరీ  ఆలోచించాలి\  ఇంకాకొద్ది  రోజుల్లో ఊపిరిపోసుకో నున్న\  నిన్ను రాబందులు తోడేళ్ళు పీక్కుతినడ౦  అవసరమా \ అని ఇప్పుడు కొత్త గా ఆలోచించాలి “ అనే ధోరణిలో సాగుతుంది , పో ర్షి యా దేవి  అక్షరం నిప్పులు కురిసే ధోరణిలో వుంటుంది  .  గురి దేనిమిదో తెలిసిన కవయిత్రి కూడా
 సుభాషిణి తోట “ ప్రతి ఇంట్లో తాళి బన్లు “ ఆంటూ  శీర్షికతో నే ఒక కొత్త ప్రయోగం చేసింది .  ప్రపంచ స్త్రీ కోల్పోతున్న  స్వేచ్ఛను గురించి “ ఆప్ఘనిస్తాన్ ఆమె దేహమైతే ప్రతి ఇల్లూ తాళిబాన్ల  వశమే \  ఇంకో మగ వ్యక్తితో మచ్చుకి మాట్లాడితే\  ప్రతి ఇంట్లో హి౦స  వుంటుంది \తాలి బన్లు వశపరుచుకున్న ఆఫ్గాన్ని చూడలేక మనం కన్నీరు  కారుస్తున్నాం \ కానీ మనదేశంలో ప్రతి యింట్లో  తాళిబన్లు వున్నారు \  ఏదేశ హరిహద్దులు చూసి అయ్యో అనుకున్నామో \ ఆ దేశమే కాదు మాదేశం కూడా ఆమె కన్నీటి తీరాలే తాకు తున్నాయి \ రేపటి తరాన్ని అయినా బతికించు\  అని మొక్కుతున్న ఆఫ్ఘాన్ ప్రజల్ని చూస్తున్నాం \ కానీ భావి తరాల్ని  గాలికొదిలి తల్లులని కర్కశంగా  హింసించే  తాళిబన్లు ఎందరో మాదేశం లో..  ,అని ముగించారు .సుభాషిణి కవిత వేదనకి ఒక సామూహిక రూపం ఇచ్చి౦ది. పచ్చి నిజాలు ఎప్పుడు కోపాన్నే తెప్పిస్తాయి .
సిహెచ్ ఉషారాణి తన కవితలో జోగిని వ్యవస్థను గురించి హృద్యంగా పలికారు . “పోతు రాజుతో పెళ్లి కొయ్య బొమ్మల  పెళ్ళయి మిగిలింది\  అరచేయి అంజనంలో నా బొమ్మే కనిపించింది \ మి౦గేసిన చేతిలో హారతి మీద ఆనగా మల్లమ్మ పూనకంలో నాపేరే వినిపించింది\ పేడ పురుగుల్లా నన్ను దొర్లించుకుపోతుంటారు\  అడ్డదిడ్డంగా నీళ్ళలో గీసుకు  పోతున్న నాణెంలా నేను \  ఆర్చీల గౌనులా అంచెలంచెలుగా దిగబడ్తున్నాను” అంటూ కలవరపెటుతుంది.
చాలా బావుంది కవిత . నీటిలో మునిగిపోయాదాన్ని ఆర్చీల గౌనుతో పొలచడం బాల్యాన్ని గుర్తు చేస్తూ సంఘటనలోని విషాదానికి  అద్దం పడతుంది  
వీణావాణి  తొమ్మిది నెలల పసిపాపపై జరిగిన అత్యాచారం గురించి రాస్తూ “కన్నెపిల్లలారా రండి గొడ్రాళ్ళ వ్రతం చేద్దాం , భూమాత చేసిన త్యాగం కంటే ముందే దీపావళి వస్తుందేమో , పిల్లలారా ఇటుగా వచ్చే ఈల గొం తులు మీవేనా ,రేపటి ప్రకృతి మీదని చంద్రుని వెతుకుతున్నారా ? ఎప్పడు  ఎవరిలో నిద్ర లేస్తాడో కనపడని శత్రువు ? నీ  గ౦ధపు కలల్ని విరమించుకో\  తారలై శూన్యాన్నయినా వెలిగించు \  సానుభూతి మాటలెందుకు చట్టాలు చట్టుబండలు ఎందుకు \  ,తల్లులారా ఆకశానికి ఎగిరిన పక్షి ఎటో  ఎగిరిపోయిందా ?  అంటూ సాగుతుంది . ఎత్తుగడ బావుంది . శిల్ప పరంగా మ౦చి కవిత.వేదనకి  తగిన వాక్య  నిర్మాణం .  
వాణి దేవులపల్లి “ ఏదేశ డాటరయితేనేం? ఏమున్నది గర్వకారణం / స్త్రీజాతి చరిత్ర సమస్తం  పురుష పీడన పరాయణత్వం\  పితృస్వామ్య పద ఘటట్టాల  పడి  నలిగిన పారిజాత సుమం\  అంటూ నిర్భయ సంఘటన నేపధ్యంలో ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ  స్ఫూర్తితో రాసింది . గంభీరమయిన కవిత రాసేటప్పుడు బాగా అలవాటు అయి పోయిన పాత దేశభక్తి గీతాలకి మన  ఆర్తిని అల్లడం వల్ల  అది పలచబారే ప్రమాదం వుంది  . . మీరు ఎంచుకున్నది అమానవీయమైన సంఘటన  ఇక్కడ మీ స్వరం పలకాలి కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చే యాలి . ఉదాహరణకి నలిగిన పారిజాతం అన్నారు అది బాధితుల్ని మరింతగా తలెత్తుకొనీయని అవమానానికి బాలహీనతకి
గురించేసే పదమే . ఇంకా చెప్పాలంటే  అరిటాకు ముల్లు సామెత, పువ్వులు తుమ్మెదలు, వీర శిఖామణులు , సుకుమార సుందరి మణులు అనే పోలికలు  ఉద్దేశ పూర్వకమయిన దృక్పధాన్ని సూచిస్తాయి.  ?  వాస్తవానికి జన్యుపరంగా స్త్రీలే బాలవంతులు ,. బలం అంటే ఆకారం కాదు . ఇమ్యూనిటీ..  మీకు తెలియదని కాదు మీ కవిత నన్ను కూడా ఆలోచనలో పడేసింది  వాణి ఇంకోసారి ప్రయత్నిస్తే  ఈ వస్తువుకి   ఇంకా కొత్త రూపు వస్తుంది ..
రూప రుక్మిణీ పచ్చి కు౦డ  అనే కవితలో “ గ్రీష్మ  దాహం పచ్చి కుండకేం తెలుసు? ..  ఎండమావి ఎదురొచ్చినా ముడివేసుకున్న చెమట చుక్కలన్నీ కొంగు  చివర ముడివేసుకున్నా చల్లగాలి పలకరించదు , నిలువు టద్దం  చూసే చూపులు ఎన్నిసార్లు పలకరించాయో\  నల్లకాకి నీడ పడకూడదని .. “ అంటూ మంచి కవిత రాశారు . ఆమె పుస్తకం ‘అనీడ” కూడా నేను చదివాను . మనం ఎంపిక చేసుకున్న వాక్యాలు అలవాటుగా పడుతున్నాయో ఆలోచనతో పడుతున్నాయో చూసుకోవాల్సిన అవసరం వుంది . ఫలానా చూపు పడకూడదు నీడ పడకూడదు అనే మూఢాచారాలు  మనలో వున్నాయా ? లేవు కదా మరి కవిత్వంలోకి ఎలా వస్తాయి ? అంటే వినికిడితోనో  చదివిడితోనో  వస్తాయి.  కొత్త   దృక్పధ౦ తో సమస్యని చూసినప్పుడు 21 వ శతాబ్దపు  ఆధునిక కవయిత్రులు వస్తువుతోనే కాదు దాని ఉద్దేశ్యంతోనూ పూచీ పడాలి . నల్లకాకి అనడంలో రంగు గురించిన వివక్ష కనిపిస్తుంది . నల్లకాకి , శ్వేత గులాబీ అనేవి చాలా రాలేదా అంటే నవలలు కూడా వచ్చాయి. సినిమాలు కూడా తీసి వుండచ్చు కానీ ఇప్పుడు మన౦  ఆఫ్రికన్ కవిత్వం  చదువుతున్నాం.  దళిత వాద  సృహతో  వున్నాం కాబట్టి  ఈకోణంలో ఆలోచించాలేమో చూడండి .
సరసిజ పెనుగొండ  శ్వేత రుధిరం రాసింది వస్తు పరంగా ఇది కాస్త భిన్న కవిత  ( లోగడ జయ ప్రభ వేరే పేరుతో ఈ దశను గురించి రాసింది) సరసీజ కవిత ఇలా మొదలవుతుంది .   “మూలకు కూచో డానికో ముడుచుకు పడుకోవడానికో , ఇది మూడు రోజుల ముట్టుడు కాదు\  అక్రమంగా వచ్చే తప్పనిసరి ముట్టు \ అయినవాళ్ళతో అయినా అనలేని అవస్థ అది \  ఉల్లిపాయ పొరలు వలిచినట్టు చిట్లుతున్న  చర్మం \  ప్రమాదమని పసిగట్టలేని తెల్ల రక్తం \  కూచున్నచోట కుప్పకూలలేక నిలుచున్నచోట  నిస్త్రాణమవలేక \ బట్టి  పట్టిన పాఠం లాగా  పనులన్నీ ఇక పూర్తి  చేయడమే \ తెలుపు తెలుపు తెలుపు ఎర్రని కన్నీళ్లని కూడా రక్తంలో కలిపేసి\  ఏ రంగు లేదనిపించిన వెలివేత తెల్లరక్తపు పూత – అంటూ నడుస్తుంది . పదచిత్రాలన్నీ చక్కగా అమిరాయి. ఇంతవరకే రాస్తే ఇది వున్న దశ  మాత్రమే చెబుతుంది . వైట్ డిశ్చార్జ్ ఎందుకవుతుంది ? రక్తహీనతా ? భర్త  అంటించిన వ్యాధులా?వాతావరణ కాలుష్య మా అనేది చెబితే అప్పుడు సామాజిక కవిత అవుతుంది . వ్యక్తిగతాన్ని వైయుక్తికంగానే కాక ఇలా కూడా చూడాలి.
మానస చామర్తి పసిపిల్లవాడి  మీద ఒక అమ్మగా లాలిపాట లాంటి  కవిత రాసింది  “ఇన్ని వ్యాకులతల మధ్య ఒక మెచ్చుకోలు చూపయి వాడు నా బతుకు పుస్తకానికి  రంగు అద్దుతాడు\  ఎన్ని ముద్దులు పెట్టినా తీరని  ముచ్చటేదో మాటల్లో వాడికి చెప్పమoటాడు \ కన్నందుకు కాదురా నువు నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యాను\  విచ్చుకున్న నీ  కలల పూల తోటలో రెప్ప వేయని మాలినయాను\ నేను వదిలేసుకున్న మనుషులు ,  వద్దనుకున్న పనులు,  మిగల్చుకోలేని సమయాలకన్నా కేరింత నవ్వుల్లో..  తుంటరి రూపాన్నే  నేనెక్కువగా ప్రేమిస్తానని .. అంటూ చక్కగా చదివింది . చదవడంలో భావార్తి వుంది . పక్కా అనుభూతి కవిత .
జయశ్రీ మువ్వ కవిత “యుద్దం పుల్లి౦గమే”  రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూ పాదాలకు పరుగు నేర్పిస్తున్నాం\  తెగబడిన తాలిబన్ మృగాల వి౦దుకు ఆఫ్ఘనిస్తాన్ పై ముసిరిన తాలిబాన్ మేఘమా\  నీ  మత మౌఢ్యం  మాత్రం  పురిటి కంపునుంచి ఇంకా శుద్ధి కాలేదు నిన్ను కన్నది నీకు బానిస , నీ  జీవన్ని మోసి౦ది  నీకు దాశినా ? ఎవరి బిక్ష నీ బతుకు “- అంటూ చదివింది . ఇక్కడ “మత మౌఢ్యం పురిటి కంపు నుంచి ఇంకా శుద్ధి కాలేదు” . అనే పద ప్రయోగం వుంది . పురిటి సుగంధం అనే మాటను ఈ కవి సమ్మేళనంలో ఇద్దరు చదివారు.  అలవాటుగా ఈ పద౦  వున్నదేకూడా . ఇక్కడ పురిటి కంపు అంటే మతదుర్మార్గం  అనేది అట్టడుగు అంధకార దశలో వుంది అని చెప్పడం కావచ్చు . వాసనకు  ఈ స్తటిక్ సెన్స్ వుంది . ఏది వాసన ఏది కంపు అనేది కూడా మన అలవాట్లమీద, జీవిత నేపధ్య౦ మీద  ఇంకా చెప్పాలంటే కులం మీద వర్గం మీద కూడా ఆధారపడివుంటుంది.  మన కవిత్వంలో పదజాలం సాధ్యమయినంతగా సార్వజనీనంగా వుండేలాచూడాలి . అది మినహాయిస్తే  మిగతా కవిత అంతా బావుంది .
వైష్ణవీశ్రీ   చీకటి నుంచి చీకటి లోకి అని ప్రవేటైజేషన్  మీద రాసిన కవిత చదివింది . ‘కుప్పలు కుప్పలుగా పోసి చిల్లరగా అమ్మించేదే  జీవితమని  నువ్వ౦ టా వు ..  నా మొహం ఎప్పుడో ప్రైవేట్ పర౦  చేశావు ఇప్పుడు కొత్తగా నా ముఖ౦ మీద  నీ ముఖ మల్  చద్దర్ ముద్ర ..  రాత్రుళ్ళని వేయినొక్కా  మెలకువలతో కప్పెడుతున్నాము..  నాదేదీ  మిగలని చోట నీ  రియల్ ఎస్టేట్ దందా \ నీరో హిట్లర్ నా  కల ల్లోంచి కళ్ళెదుట నిలిపావు అంటూ ముగుస్తుంది . ఈమె  మ౦చి ఊహాశక్తి గల కవయిత్రి .  
పద్మజా బోలిశెట్టి కవిత “ఆమె కధ’ శీర్షికన అత్యాచారాల మీద రాసి౦ది . ‘ఎలా రాయాలి ఏమని రాయాలి ?ఏటికేడు విధ్వంసంలో కూరుకుపోతున్న వ్యవస్థను,  ఆస్తిత్వాలను అణ గదొక్కే  నూతనరీతులను ఏ తీరున  రాయాలి\  బిగ్గరగా , మాట్లాడద్దు ,  అని కొందరు  నవ్వద్దని కొందరు  .. జీన్స్ వేసుకోవద్దని కొందరు ..”  అంటూ ఇలా కోసనసాగుతుంది. కవితా వస్తువు పాతదే అయినప్పుడు కొత్తగా ఏమి చెబుతున్నామో అని చూస్కోవడం అవసరం , లేకపోతే ఇది పద్మజ ముద్ర అని ఎలా తెల్సుకోగలం? ఇంకా బాగా ప్రయత్నించండి పద్మజా .
వచన కవిత్వం ఒక తపస్సు . అది  తేలిగ్గా రాస్తే వచనం అయిపోతుంది , భాష దట్టించి రాద్దామా అంటే గ్రాంధికం అయిపోతుంది . కవిత్వంగా మార్చడం అనేది అంత సులువు కాదు ఇంకా ప్రయతించాలి. కొత్త వస్తువు తీసుకోండి కొత్తగా రాయగలరు .  
 లక్ష్మిశ్రీ తన కవితలో “అనాదిగా ఆమె” ను గురించి చెప్పింది . అందచందాల పాపాయి విరిసిన పూవయింది\  కన్నవారి కనుపాపలతో ప్రేమ సుధను చిలికింది\  బాధ్యతల్ని పంచుకుంటూ అందరికీ అమ్మ అయింది \ పున్నామ నరకం దాటించే పుత్ర సంతానం నడమంత్రపు పుండయింది \ . కన్నవారి కనుల పంట అశ్రు ధారలయింది ఇప్పడు తెర వాలింది  మది వాకిట జనన గవాక్షం.. అంటూ సాగుతుంది – కవులకి ప్రాపంచిక అవగాహన కూడా ఎంతోఅవసరం.  ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తున్నామో ఆరవ శతాబ్దంలో కూరుకుపోయామా అనేది చూసుకోవాలి. పుత్రులే పున్నామ నరకం దాటిస్తారనే భ్రమ స్త్రీల  జన్మ హక్కుకి కూడా గొడ్డలిపెట్టయింది .  ఈతరం అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడంలేదు , పున్నామ నరకం యావతో ఆడసంతానాన్ని  వద్దనుకున్న కొందరి ద్రోహ చింతనతోనే ఇది జరిగింది. మనం  పురాణాల్ని కాదు సమాజాన్ని చదవాలి . పేరెంట్స్ లాస్ట్ రైట్స్ ఇప్పుడు భారతదేశంతో సహా అనేక దేశాలలో స్త్రీలు కూడా నిర్వహిస్తున్నారు . చివరికి మనం  చదివిన పురాణాలలో కూడా తలకొరివి పెట్టిన కూతుళ్ళు కోడళ్ళు వున్నారు . మన రచన మన శైలికి శిల్పానికే కాదు అవగాహనకి కూడా అద్దంపడుతుంది . మూసలో రాస్తున్నామో మార్పుకోరి రాస్తున్నామో చూసుకోవాలి .  
కళా గోపాల్ “ ఎడారి రాత్రులు అనే కవితలో పేద ముస్లిం బాలికల్ని అరబ్ దేశాలకు పెళ్ళిళ్ళ పేరిట ఎత్తుకుపోతున్న ఉదంతాన్ని గురించి రాసింది . ఆ కవిత ఇలా మొదలవుతుంది . లా౦తరు  దీపపు గుడ్డి వెలుగు లో  సుర్మా  అంటిన కాటుక కాళ్ళను,  చెమికీ  లొత్తే    గాజులు ప్రశ్నించాయి \ నీ  కళ్ళలోని చెమక్కులేవని/ మీఠా పాన్ నోటిలో ఊరుతున్న గారడీ మాటల ఊటలకు \ నాంది వాక్య౦ లా ఇక ముగింపులేని కధ ఒకటి ఆమె గుబులు హృదయంలో సరీ  నృప౦ లా జొరబడింది. బావుంది కవిత . ఎత్తుగడ నడక బాగా వినిపించాయి .  
విజయ లక్ష్మీ నల్లపునేని  కవితలో  ‘ప్రేమ- ఆమె ‘ అనేది శీర్షిక “ పేమంటే ఏమిటి ? అడిగింది బిడ్డగా,  జన్మనిచ్చిన తండ్రి మాట జవదాటకపోవడమే , చెప్పాడతను, ప్రేమ౦టే  ఏమిటి అడిగిందో ప్రేయసి,  ఎదుటి వారికొసం ఏదయినా చేయగలగడం చెప్పాడు అతను,  తన సర్వస్వాన్ని సమర్పించి సిద్ధపడిందామె , ప్రేమ౦టే  ఏమిటి అడిగిందో భార్యగా , బాధ్యతగా బతకడమే బదులిచ్చాడతను , విరామమే మరచి అతని విలాసానికి వెలుగై నిలిచిందామె , ప్రేమ౦టే  ఏమిటి అడిగొందొక  తల్లిగా,  రక్తమాంసాల్ని ధారబోయడమే బదులిచ్చాడతను , జీవితాన్నే ధారబోసిందామె.  మీలో ఎవరయినా నన్ను ప్రేమించగలరా ?   అడిగింది నలుగురినీ .. అది ఆన్ కండినల్ లవ్ ప్రేమి౦చడం  నీ  వంతు , బదులిచ్చారు  నలుగురు . కొసమెరుపు అన దగిన కవిత ఇది . ఎత్తుగడ నడక మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా సాగింది . అవును ఆ నలుగురే  మన జీవితాన్ని శాశిస్తారు . మనం మనకోసం ఏమి మిగుల్చుకున్నాం ఈ సామాజిక వ్యవస్థ మన పట్ల ఎలా వుంది అని ఆలోచించాలి అని చెబుతుంది ఈ కవిత . కొత్తగా రాస్తున్నారు విజయ .  ఈమె కాంట్రిబ్యూషన్ ఇంకా ఎక్కువ వెలుగులోకి రాలేదు , కానీ ప్రామిసింగ్ పొయెట్ అనిపించింది .
బాల బోయిన రమాదేవి “జర జాడ చెప్పుండ్రి’ అనే కవిత రాసింది . “ పండక్కి ఇంటికొచ్చిన మా పెద్దక్క మొహంల \ఎనకటి ఎలుగు కానరాలేదు \ డొక్కలు గుంజుకపోయి పిడికెడు మెతుకులు తీనంగానే \ భళ్ళున పగిలిన కుండయి తాoది\ నవ్వితే నచ్చత్రాల్ల  మెరిసే పండ్లు కాననయినా కానరాడంలేదు\  ఇపుడు ఉలుకు పలుకు లేకుండా ఓటిపోయిన కుండవలే ప౦డుకున్నది \ మాపిటినుంచి  పొద్దుకానముకని సూస్తున్న మంచమ్మీద పీనుగోలే \ పండుకుని మనిసిని సూడక\ సూడనీ కుండా పందుకున్నది |ఉగ్గబట్టుకోలేక  అడిగితే\  అక్క అయిదోతనం పోయిందని ఆపుకోలేని దుఖాన్ని\ కొంగున  వోoపుకున్నది\  నా చిన్న మనసుకు అడ్రస్ తెలవదు  గాని ఆ అయిదోతనం జాడ జర జెప్పరాదుoడ్రి ? ఎంత  మ౦చి కవిత ? మా౦డలికంలో వచ్చిన ఒక వ్యంగ్య బాణం.
మొత్తానికి అందరి కవిత్వాన్ని ఫేస్బుక్ లో శ్రద్ధగా విన్నాను. అవసరం అనిపించినా వాక్యాలు మాత్రమే తిరిగరాశాను  
 – అయితే నాకు కొన్ని సందేహాలున్నాయి, ఈ కవిత సాకుతో అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను.  అసలు రమాదేవి లానే  widowhood గురించి ఎవరమయినా గుండె ద్రవించేలానే రాస్తాం . కానీ మనలో అనేకమంది ఇంకా ఈ  పసుపు  కుంకాల  కేంద్రం గా   వుండే అయిదోతనం   నోములు చేస్తున్నారా  లేదా? స్త్రీలను సుమ౦గళులుగా వితంతువులుగా విభజించి  పాలించే మూఢత్వానికి తెలియకుండానే తల వంచుతున్నారా లేదా ? మనం బొట్టు పెట్టించుకుంటున్న ప్రతిసారీ ఒక బొట్టు లేని మహిళని అవమానించడం కాదా . బొట్టు అనేది కేవలం ఒక అలంకారం. అలంకరణ మన హక్కు అది   వద్దనుకోవదమూ  హక్కే. కంచంలో గోంగూర  పచ్చడి నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే  మానుకోవచ్చు అంతకుమించి విలువ దానికి ఆపాదించడం ఎందుకు ? దానికి పాతీవ్రత్యాన్ని  అయిదో తనాన్నో ఆపాయిస్తే అది పోయిందనుకున్న  కొ౦దరి    అలంకరణ హక్కుని  మనం లాక్కున్నట్టు కాదా . అసలు నాకు తేలికే అడుగుతాను. ఈ నోముల్లో ఎవరయినా విత౦తువులని పిలిచి బొట్టు ఎందుకుపెట్టడంలేదు ? విభజన ఎందుకు పాటిస్తున్నారు ?
సరే పోనీ ఈ నోములు నోచిన  వారి భర్తలకి  నూటికి నూరేళ్ళు Durability వుందని చెబితే నమ్మే దశలోనే వున్నామా ? లేక అలవాటుగా ఆలోచనతో సంబ౦ధం  లేకుండా  చేస్తున్నామా ?  అప్పుడు మనం ఎన్నళ్లు పోయినా జస్ట్ ఫాలోయర్స్ మాత్రమే కదా చేంజర్స్  ఎలా అవుతాం  . మనలో లేని ధిక్కారం కవిత్వంలోకి ఎలా వస్తుంది .ఇది వంద డాలర్ల ప్రశ్న .  నోముల్లో ఏదో మహత్యం వుందని చెప్పే వారిమీద మహత్యం లేదని తెలిసన క్షణాన  అలా నమ్మించిన వారిమీద నమ్మక ద్రోహం నేరం కింద   వినియోగదారుల కోర్టుకి ఎండకు వెళ్లకూడదు ?  కోపం వస్తోంది కదూ మీరెమైనా మైన పెద్ద పు డిం గా మాకు చెప్పడానికి అనుకోండి ఫరవాలేదు . ఇంతకు నేను చెప్పడం లేదు అడుగుతున్నాను తెలుసుకోవాలనుకుంటున్నాను. . త్వరలోనే  దీని మీద చర్చ పెట్టుకుందాం .

*****

Please follow and like us:

2 thoughts on “సంతకం కవయిత్రుల కవిసమ్మేళనం”

  1. బాగా చదుకుని మెడిసిన్ ఇంజనీరింగ్ చదివిన స్త్రీ లే పూజలు నోములపేరిట ఇలా అవమానిస్తున్నారు
    అసలు శాస్త్రాలన్నీ ఎవరో ఒకరు రాసినవే
    తోటి వారిని తొక్కేయ్యడానికి
    మొగుడు వదిలేసినా పారిపోయినా మరోపెల్లి చేసుకున్నా పుణ్యస్త్రీలే
    అసలు ఎవరికిఞ్చచిన రీతిలో వారు బ్రతగ్గలిగే వేళ కూపస్థ మండూకాలను వదిలెయ్యండి

  2. .. , వితంతువులకు బొట్టును ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు…అది నిజమే.. ఇప్పుడు వితంతువులు కూడా బొట్టు ,నేను రాసిన కవితలో స్త్రీ ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది…. వాటని ఉటంకించడాన్ని మీరు ప్రోగ్రెసివ్ గా ఆలోచించడం లేదు,ఆరవ శతాబ్దంలో ఉన్నామా అన్నారు,మీరు వితంతువులు బొట్టు ను అందుకోవడంలో వివక్ష ఉంది, దాన్ని ఖండించాలి అన్నారు, నిజమే …మరి స్త్రీ నే రాసిన వివక్షలు ఇంకా ఎదుర్కొంటూనే ఉంది అనడం, రచయిత్రి అవగాహనా లోపం అనడం సరియైనదేనా…సమాజం ఇంకా చాలా మూఢాచారాలను పాటిస్తూనే ఉంది… స్ర్తీ తలకొరివి పెడుతోందని అన్నారు,నిజమే ..కానీ స్త్రీ ఇంకా ఏ వివక్షలు ఎదుర్కోవడం లేదా..

Leave a Reply

Your email address will not be published.