వెనుతిరగని వెన్నెల

(డా||కె.గీత నవలపై సమీక్ష)

  -శ్రీదేవి యెర్నేని  

నెచ్చెలి పాఠకులందరికీ డా|| కె. గీత గారి బహుముఖ ప్రజ్ఞ తో పాటు, ఆవిడ వ్రాసిన మొట్టమొదటి నవలవెనుతిరగని వెన్నెలకూడా ఆడియో రూపంలో సుపరిచితమే. నవలకౌముదిఅంతర్జాల మాసపత్రికలో ఆరు సంవత్సరాలు ధారావాహికగా ప్రచురితమై ఎంతోమంది అభిమానాన్ని చూరగొందిఇప్పుడు అందమైన నవల మరింత అందమైన పుస్తకంగా ముస్తాబై  మన ముందుకు వచ్చింది.  

జీవితం మనకు లభించిన అద్భుతమైన వరం. దాన్ని అందంగా మలచుకోవడం మన  చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలకు కృంగిపోకుండా, చదువే ఆలంబనగా చేసుకుని, విజయతీరాలకు చేరిన ఒక ధీర వనిత కథ వెనుతిరగని వెన్నెల“.   

కథలో ముఖ్య పాత్రతన్మయి“. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా పుట్టి, పల్లెటూరిలో గారాబంగా పెరిగిన పిల్ల. సంధ్య వేళ, డాబా మీద సన్నజాజి పందిరి గూడు కింద కూర్చుని, నారింజ రంగులో మారుతున్న ఆకాశాన్ని చూస్తూ, జీవితం ఎంతో అందంగా ఉంటుందనుకునే భావుకురాలు. మంచు ఉదయాన గాలికి తలలూపే గరికపూలనూ, ప్రతి పువ్వులోనూ ప్రపంచపు అందమంతా అల్లుకున్న దేవగన్నేరు పూలనూ, గులాబీ రేకులమీద ముత్యపు చినుకుల్లా నిలిచిన నీహారికలను చూసి పరవశించిపోయే ముగ్ధమోహన. చక్కని వ్యక్తిత్వం, సాహిత్యం అంటే అభిమానం ఉన్న అమ్మాయి

ఇంటర్మీడియట్ చదివే లేత వయసులో, ఒక అందమైన బంధువులబ్బాయి తనని ఇష్టపడుతున్నానని చెప్తాడు. వెన్నెట్లో గోదారి మీద విహారానికి వెళ్దామని ఆమె అంటే పగలెళ్ళొచ్చు కదా, చీకట్లో పడి గోదారెంట తిరగడమెందుకు అనే అబ్బాయి అతను. సాయంత్రపు వెలుగులో చిన్ని నక్షత్రాల్లాంటి పూలపందిరి మధ్య కూచుని వ్రాసుకోవడమంటే ప్రాణం ఆమెకి. కొక్కిరి బిక్కిరి రాతలే గానీ, కనీసం అక్షరాల్లో తప్పులు లేకుండా చిన్న ఉత్తరం కూడా వ్రాయలేని వ్యక్తి అతను. అతని అందానికి మురిసిపోతూ, తన్మయత్వంలో తేలిపోయే తన్మయి ఇవన్నీ పట్టించుకోదు. అతను తనని ప్రేమిస్తున్నాడన్న భావనని ప్రేమిస్తుంటుంది. కుటుంబ పరిస్థితుల వల్ల, అతనితో పెద్దగా మాట్లాడడానికి కూడా వీలు కాదు. చదువు సంధ్యలు లేని అతన్ని ఇంట్లో పెద్దగా ఇష్టపడకపోయినా వాళ్లని ఒప్పించి పెళ్ళి చేసుకుంటుంది.  

అందరి ఆశీస్సులతో అందంగా మొదలుపెట్టాలని కలలుకన్న వివాహబంధం పెద్దవాళ్ళ కట్నాలు, లాంఛనాల గొడవలతో మొదలవుతుంది. పెళ్ళైన మొదటిరోజే భర్త ఎంత మూర్ఖుడో, సంస్కారహీనుడో అర్ధమవుతుంది. కోరి చేసుకున్న వ్యక్తి గురించి ఎవరితోనూ చెప్పుకోలేక, పెద్దవాళ్ళ పంతాలు, పట్టింపులతోనూ, భర్త నిరాదరణతోనూ సతమతమవుతుంది. భర్త నిజస్వరూపం పూర్తిగా తెలుసుకునేసరికి తను తల్లి కాబోతుందన్న విషయం తెలుస్తుంది.  

తన బిడ్డను భర్తలా కాకుండా సంస్కారవంతుడిగా పెంచాలనుకున్న తన్మయి కలలు నిజమయ్యాయా? తన జీవితంలో ఎదురయిన ఒడిదుడుకులను తన్మయి ఎలా ఎదుర్కొంది? కుటుంబం నుండీ, సమాజం నుండీ తగినంత ఆదరణ లేకపోయినా, తన కాళ్ళ మీద తను ఎలా నిలబడగలిగింది? జీవన పయనంలో తనకెదురైన వ్యక్తులనుంచీ, అనుభవాల నుంచీ ఏమి పాఠాలు నేర్చుకుంది? మనకేమి పాఠాలు నేర్పింది? ఒక కష్టం తీరేలోపు మరో కష్టం ఎదురవుతుంటే, ఎక్కడా గుండె నిబ్బరం కోల్పోకుండా, అరికాళ్ళను ముళ్ళు చీరేస్తున్నా శిఖరారోహణ ఎలా చెయ్యగలిగింది? ప్రశ్నలన్నిటికీ సమాధానంవెనుతిరగని వెన్నెల“.     

మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఆర్ధిక అవసరాలు, కులాలు, కట్నాల పట్టింపులు, అనవసర ఇగోలుపరువు ప్రతిష్టల కోసం తాపత్రయాలుఇలాంటివన్నీ అంతర్లీనంగా స్పృశిస్తూ ఎంతో సహజమైన సంభాషణలతో అచ్చ తెలుగు లోగిళ్ళలో నడిచే కథకథలోని చాలా  పాత్రలు మనకు నిజజీవితంలో పరిచయమున్నట్లే అనిపిస్తుంది. చదువుతున్నంతసేపూ మనం కూడా పాత్రలతో పాటు వాళ్ళ ఇళ్ళకి, కాలేజీలకి, హాస్టళ్ళకి, క్యాంటీన్లకి వెళ్ళి పక్కన నిలబడి చూస్తున్నట్లుంటుంది. రచయిత్రికి ఇదే మొట్టమొదటి నవల అంటే నమ్మశక్యం కాదు. ఎన్నో పాత్రలు, ప్రతి పాత్రకు తనదైన స్వభావం, అది తన్మయి జీవితం మీద చూపే ప్రభావం, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, వీటన్నిటినీ గుదిగుచ్చి ఎంతో సహజంగా, ఆయా  పాత్రల యాసల్లో సంభాషణలు పలికిస్తూ కథ నడిపించారు. సమాజం పట్ల, సమస్యల పట్ల లోతైన అవగాహన, సునిశితమైన పరిశీలన ఉంటే తప్ప, ఇది సాధ్యమయ్యే పని కాదు. మంచిని స్వీకరిస్తూ, చెడును వదిలేస్తూ, విజయాలను అపజయాలను సరిసమానంగా మెట్లుగా పేర్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో తన్మయి చేసే ప్రయాణం ఒక అందమైన మజిలీకి చేరుకునేసరికి, తన్మయి వ్యక్తిత్వం తోనే కాదు, రచయిత్రి రచనా శైలితో కూడా ప్రేమలో పడిపోతాం.

తెలిసీ తెలియని వయసులో వేసిన తప్పటడుగులు జీవితాన్ని తలకిందులు చేసినా, జీవితం మీద ఆశ ఎక్కడా కోల్పోకుండా, ‘ప్రపంచమా! నువ్వు సముద్రమై ఉవ్వెత్తున నన్ను నిలువునా ముంచేసినా సరే, ఎదిరిస్తాను. నిలబడతాను. దృఢంగా నిలబడతాను.’ అనుకుంటూ తన్మయి చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతూ, జీవితాలను అంతం చేసుకుంటున్న నేటి తరం పిల్లలు తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం ఇదిగులాబీ రేకులు, సన్నజాజి మాలలు పేజీల మధ్య దాచుకోకుండానే, భావుకత్వం నింపుకున్న ముఖ్య పాత్ర వల్ల, రచయిత్రి స్వీయ కవితలతో పాటు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఠాగూర్, దేవులపల్లి, శేషేంద్రశర్మ, తిలక్ గార్ల కలాల నుండీ జాలువారిన అమృతపు చినుకులతోను, కాళిదాసు నుండీ కిరణ్ ప్రభగారి వరకూ వెదజల్లిన సాహితీ పరిమళాలతోను గుబాళిస్తూంటుంది పుస్తకం.  

పుస్తకం చదివేటప్పుడు పక్కన రెడ్ ఇంక్ పెన్ గానీ, హైలైటర్ గానీ పెట్టుకోవడం మర్చిపోకండి, మనం అండర్ లైన్ చేసుకుని మళ్ళీ మళ్ళీ తరచి చూసుకునే స్ఫూర్తిదాయకమైన వాక్యాలు చాలా ఉన్నాయి మరి! 

“దుఃఖం నిన్ను దుర్బలం చేసి ఎటూ తేల్చుకోలేని అశనిపాతమై ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వదు.”

“శబ్దం కన్నా నిశ్శబ్దం ఎక్కువ ప్రతిభావంతమైనది.”

“ఈ లోకంలో దుఃఖానికి మూలం కోరికలు, దుఃఖాన్ని జయించాలంటే కోరికల్ని జయించాలి” – గౌతమ బుద్ధుడు

“Strength is Life, Weakness is Death. Expansion is Life, Contraction is Death” – స్వామి వివేకానంద

“అనర్హులకోసం  కన్నీరు కార్చడం కూడా వృధానే”

“తన సుఖం మాత్రమే కోరే మనిషి చెడ్డవాడు, ఇతరుల అభిప్రాయమే తనది అని చెప్పేవాడు బలహీనుడు, ఇతరుల సుఖాన్ని కోరేవాడు ఉత్తముడు, అన్నిటా భగవంతుడే అని భావించేవాడు మహా గొప్పవాడు” – టాల్ స్టాయ్ 

“జీవితం ఎంత సౌందర్యవంతమైందో అంత క్లిష్టమైంది. ఎంత క్లిష్టమైందో అంతకంతా సౌందర్యవంతమైందీను!”

 మరి జీవన సౌందర్యాన్ని ఎలా ఆస్వాదించాలో, జీవితాన్ని ఎలా అందంగా మలుచుకోవాలో చెప్పే పుస్తకాన్ని, ఆలస్యం లేకుండా అందరం కొని చదివేద్దాం.  

****

Book your copy today. Limited copies only available:

Book Price: Rs. 300.00 (India) (Hard Bound)

US $ 25.00 (USA) (Hard Bound)

*Postal/Courrier Charges Extra

For Books  Contact:

నెచ్చెలి వనితా మాస పత్రిక:

editor@neccheli.com

ఫోన్: +91 79957 33652 (INDIA)

(or)

ఫోన్:+1408-483-7700 (USA)

పుస్తకాలు దొరుకు ఇతర చోట్లు:

J.V. Publications (Jyothi Valaboju)

Phone: 80963 10140

(or)

Vanguri Foundation of America: Vamsee Ramaraju (Hyd.)

Satya Sai Puram, Kuntloor, Abdullapurmet (M),

R.R. Dist.-501 505. T.S. India

Ph: +91 98490 23852, E-mail : ramarajuvamsee@yahoo.co.in

(or)

Navodaya Book House, Hyderabad. 040-2465 2387

(or)

E-Book: Kinige and Amazon

or)

Vanguri Foundation

Tax Deductible U.S Federal tax ID: 76-0444238

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.