సరిత్సాగరం( కవిత్వం ఒక సముద్రం)

   -వురిమళ్ల సునంద

                     

 కవయిత్రి అక్షరాన్ని దారి దీపంగా చేసుకుంది
కవిత్వాన్ని ఆయుధంగా ధరించింది. సమాజంలోని రుగ్మతలపై పోరాడేందుకు నేను సైతం అంటూ  తన కవిత్వంతో  సాహిత్య రంగంలో అడుగుపెట్టి , తన కవిత్వంతో  ఉనికిని చాటుకుంటున్న వర్థమాన కవయిత్రి సరితా నరేష్.
అనేక సందర్భాలను , సమాజంలో తనకు ఎదురైన సంఘటనలను కవిత్వంగా మలిచి భేష్ అనిపించుకుంటోంది. “కవి అంటే అంటే కాలం వెంట కాదు. కాలంతో పాటు నడిచే కవి అంటే వర్తమానాన్ని పట్టించుకునే కవి.కాలాన్ని గుడ్డిగా అనుసరించడం కాక మంచి చెడులను బేరీజు వేసే కవి, అంటే భవిష్యత్తును కలలు కనే కవి”
 అంటారు ప్రముఖ కవి నానీల నాన్న డా.ఎన్ గోపిగారు.
“కవిత్వం రాయడం అంటే నిన్ను నీవు ధ్వంసం చేసుకుని
కొత్తగా నిర్మించుకోవడం” అంటారు ప్రముఖ స్త్రీవాద రచయిత్రి శిలాలోలిత గారు. 
కవిత్వంలో చలన శీలత ముఖ్యం.సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును వాక్యాల వెంట  ఆసక్తిగా పరుగులు తీయించే శక్తి ఉంటే అది ఖచ్చితంగా మనసుకు నచ్చిన కవిత్వం అవుతుంది.అలాంటి కవితలు ఈ సరిత్సాగరంలో చాలా ఉన్నాయి. కవులకు ప్రాపంచిక దృక్పథం ఉండాలి. నవ్యత,క్లుప్తత,గుప్తత,సాంద్రత ఆధునిక వచన కవిత్వ లక్షణమని ఓ ప్రముఖ విమర్శకుడు అంటారు.
 అలాంటి నవ్యతను క్లుప్తత గుప్తత, సాంద్రతతో కూడిన సలక్షణ కవితలు ఎన్నో ఈ కవితా సంపుటిలో ఉన్నవి. ” వచన కవిత్వ సాధన కత్తి మీద సామే.ఎందుకంటే దానికి ఛందస్సు లేదు, అలంకారం ఆఫ్షనల్,కథలేదు,పునాది కూడా లేదు.ఆధునిక వచన కవిత్వం అంటే కనిపించని పునాదుల మీద కట్ట వలసిన రంగుల హార్మ్యం” అంటారు ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి గారు.కవికి ఒక తాత్విక పునాది, శైలి పునాది ఉండాలి.కవిత్వంలో ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు .ఇవి సరిగా ఉండటంతో పాటు తీసుకున్న వస్తువుతో కవిత్వీకరించిన తీరు కవిని విజయ పథంలో నడిపిస్తాయి.ఇందులో తీసుకున్న వస్తువులు, కవిత్వీకరించిన తన అనుభవాలు చదువరులకు అనుభూతి అయ్యేట్లు చేయగలిగితే కవిగా తాను విజయం సాధించినట్లే..
ఇందులో మనల్ని అనుభూతింప జేయగల కవితలు ఎన్నో ఉన్నాయి. ఇందులో కవయిత్రి గారు కూడా కవిత్వం అంటే “చిత్తం నుండే మొలకెత్తుతూ/ చిత్తముల నేలు రసరాజు కవిత్వం” అనీ” కవిత్వమంటే కాగితం పై పోసే అక్షరాల కుప్పా కాదు/అచ్చుయంత్రం ఒలకబోసే సిరా మరకలూ కాదు/ అక్షముల తెరిపించే ఒజ్జ బోధ/ సలక్షణాలు పెంచే జ్ఞాన సుధ” అంటారు.
ఇక సరితా నరేష్ గారి కవితా సరిత్సాగరం లోకి ప్రవేశిద్దాం.ఇందులో 56 కవితలు ఉన్నాయి. 
 కొత్తగా కవిత్వం రాసే ప్రతి కవి అమ్మా నాన్నా గురువులను  స్మరించుకోకుండా, కవిత్వంతో వారికి మనఃసుమాలు  అర్పించుకోకుండా ఉండరు.  కవయిత్రి సరితా నరేష్ గారు కూడా వారిని వినమ్రంగా కవితా సుమాలతో కొలుస్తూ ముందుకు సాగారు.
ఇందులో మానవ సంబంధాలు, కుటుంబ బంధాలు, మానవీయ విలువలు, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు, పండుగలు, చారిత్రక అంశాలతో కూడిన కవితలు ఉన్నాయి.
మొట్టమొదటి కవిత ” మా అమ్మ” ను చూద్దాం”చదువుతుంటే  మళ్ళీ ఒకసారి మన అమ్మను ఆసాంతం పరిశీలనగా బాల్యాన్ని తడుముకుంటూ చూడాలి అనిపిస్తుంది.” అమ్మ చెవులకు రాళ్ళ దిద్దులు/ నక్షత్రాల్లా తళతళ మెరుస్తూ ఉంటే/ అమ్మ ముక్కుపుటాలకిరువైపులా ఉన్న రెండు ముక్కు పడకలు/ సూర్య చంద్రులిద్దరూ చెరోవైపు ఒదిగినట్టుగా ఉంటుంది” ఈ పదాలు చాలు ఎంత చక్కని ప్రతీకలతో కవిత్వీకరించారో… 
“అమ్మను పరిశీలిస్తున్నప్పుడల్లా/
అలుపెరుగని శ్రామికురాలిలా గొప్ప గానే కనిపిస్తుంది”
.”,.  మా అమ్మ నడక/ సాక్షాత్ గర్భగుడిలోని శ్రీమహా లక్ష్మీ అమ్మవారు వచ్చి/ మా నట్టింట్లో తిరుగాడినట్టే ఉంటుంది.” అని మన అందరి అమ్మలను గుర్తు తెచ్చుకునేలా రాసిన గొప్ప కవిత ఇది.
 ఇక ” మా నాన్న” కవితలో
 “విశ్వ రక్షణకు విష్ణుమూర్తి దశావతారాలే ఎత్తితే/
 మా కోసం నాన్న అంతకన్నా ఎక్కువ అవతారాలే ఎత్తాడు” అంటారు.అద్భుతమైన ఈ కవితా పంక్తులు హృదయాన్ని తాకి నాన్నకు  సాష్టాంగ నమస్కారాలు చేయిస్తాయి. నిజంగా  నాన్న కష్టం పిల్లల భవిష్యత్తు కోసం బతుకంతా కొవ్వొత్తిలా కరగదీసుకుంటూ 
ఎన్ని రూపాలు ఎత్తుతాడో.. ఇప్పటి యువత చదవాల్సిన కవిత . ఇలాంటి కవిత చదివితే వాళ్ళ నాన్న పడే కష్టం గురించి ఆలోచించే అవకాశం తప్పకుండా ఉంటుంది. కవయిత్రికి అభినందనలు.
 అమ్మా నాన్నలు ఇచ్చిన జన్మ సార్థకం అయ్యేలా తీర్చి దిద్దేది గురువే.. అందుకే ” గురువులారా వందనం” అనే శీర్షికతో గురువుల గొప్ప తనం గురించి చక్కని కవిత చదువరులకు అందించారు.
ఇందులో మరొకటి చూద్దాం. ఆలోచింపజేసే  రాయడానికి సందేహించే మహిళలకు సంబంధించిన కవిత ” మైల రక్తం” ప్రతి ఆడపిల్ల యుక్త వయస్సుకు వచ్చిన వేళ, అమ్మతనంగా  రూపాంతరం చెందేటప్పుడు శరీరంలో వచ్చిన మార్పు.. నెలసరి రావడం. అలాంటి సమయంలో ఆమెను అంటుకో రాదని, పూజలకు శుభ కార్యాలకు పనికిరాదని దూరంగా ఉంచడం చూస్తుంటాం.
అలాంటి మైల రక్తాన్ని గురించి
కవయిత్రి” చిట్టి చిన్నారులను కలికి కన్యగా మార్పు/ శుభ సూచక పన్నీటి రసం అది”,… అండమే పిండమై ప్రాణం పోసుకునేది/ ఆ మైల రక్తంలోనే,…
” ముట్టరాదని చెప్పే మైల రక్తం కాదది/
ఆయువిచ్చి ప్రాణ ప్రతిష్ట చేయు/
పరమ పావన సంజీవని తైలమది/ 
మన దేహపు చిత్రానికి రూపునిచ్చే/ అమూల్యమైన మైల రక్తమది” అంటూ స్త్రీని ఆ సమయంలో అంటరాని వ్యక్తిని చేయడం తగదని హితవు చెబుతున్నారు. ఆ కవిత చదివినప్పుడు స్త్రీవాద కవయిత్రులు రాసిన నీలిమేఘాలు కవితా సంకలనంలోని కవితలు గుర్తుకు వస్తాయి.
మరో కవిత ” మహిళా ఉద్యోగి” ఆమెను ఆమె పడే సంఘర్షణను  పూర్తిగా అర్థం చేసుకుంటుందా ఈ సమాజం. గృహిణిగా, ఉద్యోగిగా
 “అటు కుటుంబం..ఇటు వృత్తి/రెంటి నడుమ కొవ్వొత్తిలా కరుగుతూ/పైకి ప్రశాంతతా గంధం కాస్త పూసుకుని/ అరనవ్వుల అరువు పూలను అధరాలపై అల్లి/ తన విద్యుక్త ధర్మాలను విరామమెరుగక/నిర్వర్తించే విధికి ఎదురీత ఈ వనిత అని ఉద్యోగి అయిన స్త్రీ గురించి రాసిన కవిత. మొదట్లో అంటారు ” అందరికన్నా ముందు లేచే పల్లె కోడి కూత/ అందరినీ తన స్వర తడితో నిద్ర లేపే అలారం మోత”  అక్షర సత్యాన్ని అందంగా కవిత్వీకరిస్తూ ఆమె అరనవ్వుల అరువు పూలను తెచ్చుకోవడం అని రాసిన పదబంధం చదువుతుంటే కవిత్వం పై ఉన్న పట్టు తో పాటు ఉద్యోగి అంత వత్తిడిలో సహజమైన నవ్వు నవ్వే స్థితి లేదన్న వాస్తవం అర్థమవుతుంది.
మరో కవిత” బాల బిచ్చగత్తెలు” చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. ” ఏ అమ్మ పొత్తిళ్ళ నుండో పురిటిలోనే/ చెత్తకుండీల నీడలోకి చేర్చిన పురుషాధిక్య గుర్తులో?” అంటారు. ఆడపిల్ల కడుపులో ఊపిరి పోసుకున్న మరుక్షణం భ్రూణ హత్య చేస్తున్న సమాజంలో బతుకుతున్నాం. పొరపాటున గురితప్పి ఈ లోకంలో కళ్ళు తెరుస్తుందనగానే. వడ్లగింజతో ప్రాణం తీయడమో. చెత్తకుండీ నీడల్లోకీ చేర్చడమో లాంటి దారుణాలను నిత్యం ప్రసార మాధ్యమాల్లో వింటున్నాం చదువుతున్నాం.
మరో కవిత”అక్షరమే నా చిరునామా” నిజంగా కవయిత్రి చిరునామా అదే ‍..
చిన్ననాడు/ చెక్క పలక మీద చిక్కగా దిద్దితే/ చక్కని నా జీవిత నావకి చుక్కానియై / నన్నో సజీవ శిల్పంగా మార్చిందీ అక్షరమే” అన్న పంక్తులు చదువుతుంటే నా  బాల్యం తడుముకున్నట్టయ్యింది.
అక్షరంతో దోస్తీ కట్టాకే తనలో జ్ఞాన ఛక్షువు తెరుచుకుందని, బతుకుదెరువు చూపిందని, ” ఇపుడు కూడా మీ ముందు నన్నిలా ప్రత్యక్షీకరిస్తున్నవీ/ నే రాసిన ఈ నాలుగు అక్షరాలే/ అందుకే అక్షరమే నా చిరునామా” అని వినయంగా తన  గురించి తెలియ జేస్తారు.
కొత్త కోణంలో ఆవిష్కరించిన కవిత ” దీపాలు”  దీపం ఏం చేస్తుంది చీకట్లు తొలగిస్తుంది.దాని నైజం అది కానీ ఇక్కడ దీపాలు
” బడుగు జనుల జీవితాల్లో/ వెలుగు నింపలేని ఉత్తుత్తి దీపాలు… ఏం ఒక్క అభాగ్యుడి దారిద్య్రాన్ని బాపలేని మా దొడ్డ దీపాలు,.
 చూరు రంద్రాల నుండి ఆశగా చూసే/ నిరుపేదల కరువును తరమలేని/ కమురు వాసన కొట్టే ఖరీదైన దీపాలు/ చమురు అవసరమే లేని సరికొత్త దీపాలు”  పాఠకులను ఆలోచించే దిశలో రాసిన కవితా దీపాలు ఇవి. మరో కొత్త వస్తువు జేబు.. దీనిని వస్తువుగా తీసుకోవడం గొప్ప విషయం అయితే కవిత్వీకరించిన తీరు అద్భుతం. ” కేవలం రూపాయల కట్టనే కాదు/ పాపాల పుట్టనూ మోస్తుంది జేబు/ పర్సుకు నిఖార్సయిన అడ్రస్/ సోకు దువ్వెన దాక్కునే అలమరా../ అంగీ ముందర ఉన్నా/ ప్యాంటు వెనుక ఉన్నా జేబు దర్జా జేబుదే” అనడం అంతేగా మరి.. 
” ఓ క్షణం “కవితలో అంటారు మరణమే శరణమైతే/ మానవ జాతి మిగిలేదా ఈ ఇల పైన? క్షణికావేశ పరులు నిర్ణయం తీసుకునే ముందు ఇలాంటి కవిత చదివితే తప్పక మార్పు వస్తుంది. ఇంకా ఇందులో “అఖండ నిధి” పేరుతో పుస్తకం గురించి కవిత  ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపమని హెచ్చరిస్తూ “తస్మాత్ జాగ్రత్త” కవిత . తల్లిదండ్రులను నిర్దయగా వృద్ధాశ్రమంలో చేరుస్తున్న వారి గురించి  ఆడపిల్లలను అంగడి సరుకుగా మార్చే వారి గురించి. ఇలాంటి దురాగతాలు “ఇంకెన్నాళ్ళు” అంటూ అనేక సామాజిక , కుటుంబ అంశాలను తీసుకుని అద్భుతంగా కవిత్వీకరించి కవితా సరిత్సాగరంలో కవితలు అలల పడవలపై ఊరేగించి ఆలోచనలు ఆచరణలు సమస్యా పరిష్కార దిశలో నడిచేలా పాఠకులను సరికొత్త అనుభూతులు కలిగేలా చేసి తీరాన్ని ఆనందంగా చేరుకుని కర్తవ్యాన్ని  నిర్వర్తించేలా ” చివర్లో “కవిత్వం  కడుపు నింపకపోవచ్చు / మనసు నింపుతుంది- మనిషిగా నిలబెడుతుంది₹ అంటూ గొప్ప సందేశం ఇచ్చిన
సరితా నరేష్ గారికి మరోసారి హృదయ పూర్వక అభినందనలు.. మరెన్నో సందేశాత్మక రచనలు మీ నుండి జాలువారాలని కోరుకుంటున్నాను…
 
తేదీ:11-09-2021
వురిమళ్ల సునంద, ఖమ్మం
సమీక్షా వ్యాసం
పుస్తకం పేరు: సరిత్సాగరం( కవిత్వం ఒక సముద్రం)
 ( కవిత్వం)
రచయిత్రి: సరితా నరేష్
ప్రచురించిన సంవత్సరం: 2019
వెల 89/రూ
ప్రతులకు
సరితా నరేష్
H. NO. 4-530,VB Nagar,
HALIA
Anumula Mandal,
Nalgonda District-508377
Phone :9966393456

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.