ఉడిపి -మంగుళూరు యాత్ర

-రాచపూటి రమేష్

1982లో తిరుపతిని ఎస్వీ యూనివర్సిటీ కేంపస్ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల బృందం ప్రతి ఏడు దర్శనీయ స్థలాలకు ఉల్లాస యాత్ర నిర్వహిస్తూ వుంటుంది. 2021 ఫిబ్రవరి 26, 27, 28 మార్చ్ 1వ తారీఖులలో అలా మంగుళూరు, ఉడిపిలకు యాత్ర నిమిత్తం మేము 20 మందిమి వివిధ ప్రదేశాలనుండి బయలుదేరాం. చెన్నై నుండి ఫ్లైట్లో 26వ తారీఖు మంగుళూరు చేరుకున్నాము.

మంగుళూరు బీచిని ఆనుకొని వున్న పీటర్ అండ్ పాల్ రిసార్ట్ లో మాకు విడిది ఏర్పాటు చేయబడింది. కనుచూపు మేరలో అరేబియా సముద్రం కనిపిస్తున్న ఆ బస విశాలంగా ఎంతో ఆహ్లాదంగా వుంది.

ఫిబ్రవరి 27వ తారీఖు ఉదయాన్నే సముద్రం ఒడ్డున నడకకి వెళ్లి మా బసనుండి దాదపు ఒక కిలోమీటరు దూరంలో వున్న తీర ప్రదేశానికి చేరుకున్నాం. నందినీ నది, అరేబియా సముద్రంలో కలుస్తున్న ఆ ప్రాంతం చూపరులకు కనువిందు చేస్తూ వుంది. ఇసుకలో బొరియలు కట్టుకొని, అటు ఇటు తిరుగుతున్న ఎండ్రకాయలు, అక్కడక్కడా ఈత కొడ్తున్న మత్యకారుల పిల్లలు దర్శనమిచ్చారు. అక్కడ కొంతసేపు సరదా కబుర్లతో కాలక్షేపం చేసి స్నానాదికాల తరువాత మంగుళూరులోని మంగళాదేవి గుడికి మినీ బస్ లో బయలుదేరాం.

మంగళాదేవి విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. 10వ శతాబ్దంలో తులునాడును పరిపాలించే ఆలూప వంశరాజు కుందనవర్మ మంగళాపురం (మంగుళూరు)ను తన రాజధానిగా చేసుకున్నాడు. నేపాల్ నుండి వచ్చిన మచ్చీంద్రనాథ్, గోరకనాథ్ అనే సన్యాసులు నేత్రావదినది తీర సమీపంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని వుండగా కుందనవర్మ వారిని కలసి, కానుకలు సమర్పించి పూజించారు. అప్పుడు వారు ఆ రాజుకు పరశురాముని వృత్తాంతాన్ని తెలిపి, ఒక ప్రదేశంలో తవ్వకాలు జరిపించారు. వాటిలో దొరికిన మంగళాదేవి విగ్రహానికి దేవాలయం కట్టించి, ఘనంగా పూజలు జరిపించాడు రాజు. పెళ్లికావలసిన అమ్మాయిలు మంగళాదేవిని పూజించి, మంగళధారావ్రతాన్ని ఆచరిస్తే, మంచి భర్తలు లభిస్తారని ఇక్కడి ప్రజల నమ్మకం. శుక్రవారం, మంగళవారం దేవాలయంలో విశేష పూజలు జరుగుతాయి. స్వర్ణ గోపురాలు, కనువిందైన శిల్పాలు ఇక్కడ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మంగళాదేవిని దర్శించుకున్న తరువాత మేము 1880లో జీసూట్ మిషెనరీలచే నిర్మించబడ్డ సెంట్ ఆలూసియాచాపెల్ ను దర్శించాము.

మంగుళూరులో చూడవలసిన మరొక ప్రదేశం సెంట్ అలూసియా చర్చి. ఇటలీకి చెందిన ఆంటోనియా యోశ్చనీ 1899లో ఈ చర్చిలోని గోడలు, పైకప్పుపై వేసిన అపురూప ఫ్రెస్కో, తైల వర్ణ చిత్రాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ చర్చి కప్పుపై మధ్య భాగంలో వేసిన చిత్రాలు ‘సెంట్ ఆలోసియ గొంజాగ’ అనే క్రైస్తవ సన్యాసి జీవితం గురించి తెలుపుతాయి. ప్రజాబాహుళ్యానికి అనేక వైద్య, ఇతర సేవలందించిన సెయింట్ థామస్, ఫ్రాన్సిస్, పీటర్ క్లవర్, రొడాల్ఫ్, జాన్ డీ బ్రిట్ట్ వంటి మహానుభావుల జీవిత విశేషాలు కొన్ని చిత్రాలు తెలుపుతాయి. ఏసుక్రీస్తు జీవితం గురించి కూడా అనేక చిత్రాలు తెలుపుతాయి. తడి సున్నం ప్లాస్టర్, అనిశనూనె మిశ్రమంతో వేసిన ఈ చిత్రాలు ఫ్రెస్కో రకానికి చెందినవి. ఈ చిత్రాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇంటాక్ (INTACH) అనే ప్రభుత్వరంగ సంస్థకు చెందిన నిపుణులు ఈ చిత్రాలను 1991 నుండి 1994 వరకు పునరుద్ధరించారు. ఈ చర్చికి అనుబంధంగా పెద్ద కళాశాల, మైదానం వున్నాయి. చర్చిలో ఫోటోగ్రఫీ నిషేధం. ఈ చర్చిని చూసిన తరువాత అక్కడకు దగ్గరలో వున్న అలోసియం మ్యూజియంను చూసాము. ఇక్కడ పాతకాలం నాటి పాత్రలు, నాణాలు, పాతకాలం ఆటోలు, అడవి పంది, పులుల అస్థిపంజరాలు వగైరా చూడవచ్చు.

మధ్యాహ్నం రిసార్ట్ లో భోజనము, విశ్రాంతి తరువాత సముద్ర తీరంలో వ్యాహ్సాళి ముగించుకొని, సూర్యాస్తమయాన్ని తిలకించి మేము పబ్బాస్ ఐస్క్రీం పార్లర్ కు చేరుకున్నాము. ఇక్కడ ఐస్క్రీం తినాలంటే కనీసం ఇరవై నిమిషాలు వేచి వుండవలసినదే. అతి పెద్దదైన ఈ పార్లర్ ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ వుంటుంది. కానీ ఇక్కడి ఐస్క్రీములు ప్రత్యేకమైన రుచితో మా మిత్ర బృందంలోని వారందరినీ మైమరిపించాయి.

ఫిబ్రవరి 28వ తారీఖు ఉదయం మేము రిసార్టు నుండి మినీ బస్సులో బయలుదేరి గంటన్నర ప్రయాణం తరువాత ఉడిపికి చేరుకున్నాము. పడమటి కనుమలు, అరేబియా సముద్రం నడుమన వుండే గొప్ప పుణ్యస్థలం ఉడిపి. మధ్యాచార్యుల వారు 13వ శతాబ్దంలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ విగ్రహం ఇక్కడి మందిరంలో ప్రత్యేకం. ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి మధ్యచార్యుల వారు ఎనిమిది మఠాలను స్థాపించారు. ఉడిపికి దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణ సంతతి వారు చాలామంది అప్పుడు వలసకు వచ్చారు. అందుకే ఇక్కడ జనాభా 10% బ్రాహ్మణులే. మకర సంక్రాంతి, కృష్ణ జన్మాష్ఠమి ఇక్కడ వైభవంగా జరుగుతాయి. కృష్ణ మందిరంలో నిర్మాణాలు మధ్యసాంప్రదాయం ప్రకారం ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కనకదాసు అనే నిమ్నజాతికి చెందిన భక్తుడిని ప్రధాన మందిరంలోకి అనుమతించక పోతే, కనకదాసు ప్రార్థించగా శ్రీకృష్ణమూర్తి, పక్కకు తిరిగి కనకదాసుకు ఒక కిటికీ గుండా దర్శనభాగ్యం ప్రసాదించాడని ఇక్కడి ప్రజలంటారు. ఇప్పటికీ భక్తులందరు కనగనె కంటే కిటికీ ద్వారానే కృష్ణ దర్శనం చేసుకుంటారు. యక్షగానం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండుగలలో పులివేషాలు ఆకట్టుకుంటాయి.

ఉడిపి అనగానే గుర్తుకొచ్చేవి ఉడిపి హోటళ్లే. ఇక్కడే జన్మించిన మసాలాదోశ ప్రత్యేకంగా దొరుకుతుంది. కృష్ణుడికి కూడా రోజూ రకరకాల ప్రసాదాలు, నైవేద్యం సమర్పిస్తారు. చతుర్మాస కాలంలో నాలుగు నెలలు మాత్రం కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. తుళువ, మంగళోరియన్ వంటకాలకు కూడా ఉడపి ప్రసిద్ధి. రకరకాల సముద్రపు చేపల వంటకాలు ప్రత్యేకం.

సిండికేట్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే వుంది. ఇక్కడకి సమీపంలోని మణిపాల్ ఉన్నత విద్య, వైద్య రంగానికి ప్రసిద్ధి చెందినది. జీడిపప్పు, ఆహార పరిశ్రమలనేకం ఈ ప్రాతంలో వున్నాయి.

ఉడిపి దగ్గరలోని మల్పే బీచి నుండి మా మిత్రబృందం అరేబియా సముద్రంలో వుండే ‘సెయింట్ మేరీస్ ద్వీపానికి’ అర్థగంట పాటు బోటు ప్రయాణం చేసింది. రకరకాల ఫలవృక్షాలు, పూలమొక్కలు ఈ ద్వీపంలో చూడవచ్చు. పిత్రోలి ద్వీపం ఇక్కడ దగ్గరలోని మరొక ఆకర్షణ.

చంద్రమౌళీశ్వర దేవాలయం, అనంతేశ్వర స్వామి గుడి, అన్నే గుడ్డే వినాయక స్వామి దేవస్థానం ఉడిపిలో చూడదగ్గ ప్రధాన దేవాలయాలు. ఉడిపి సమీపంలో ‘కెరబాసడి, నేమీనాథ్’ వంటి జైన దేవాలయాలనూ, తుళు గిరిజనులు కొరిచే తుళువేశ్వర స్వామి దేవాలయాన్ని చూడవచ్చు. మూకాంబిక దేవి కలువైవున్న కొల్లూరు ఉడిపి జిల్లాలోనే వుంది. తల్లిని దర్శించుకోవడానికి దేశ విదేశాలనుండి భక్తులు తరలి వస్తారు. ఇక్కడే ముకాంబికా అభయారణ్యం వుంది. ఇక్కడి అటవీ సౌందర్యం సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా ఫైవ్ స్టార్ హోటళ్లు వున్న ఈ ప్రాంతంలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతాయి. సౌపర్ణిక నది తీర ప్రాంతంలో వున్న ఈ దేవాలయం 12000 సంవత్సరాల క్రితం కట్టారని చరిత్రకారులు చెబుతారు. కొల్లూరు నుండి 43 కి.మీ దూరంలో ప్రపంచంలోనే పెద్ద శివ విగ్రహం సముద్రపు ఒడ్డులో వెలసియున్న మురుడేశ్వర్ కూడా వుంది. ముకాంబిక దేవిని దర్శనం చేసుకొని మేము మంగళూరుకు తిరిగి వచ్చాము.

తక్కువ బరువుగల చేనేత చీరలు, ఆర్ట్ బుటాలతో నేసిన పట్టు చీరలు ఉడిపిలో దొరుకుతాయి. మంగళూరు విమానాశ్రయం నుండి ఉడిపి 58 కి.మీ దూరంలో వుంది. NH 66, 169 A పై వుండే ఉడిపికి బెంగళూరు, ముంబాయి నుండి నేరుగా చేరుకొనే రైళ్లు వున్నాయి. ఉడిపి సమీపంలో దర్మస్థల, శృంగేరి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.

ఆటపాటలు, సముద్ర స్నానాలతో బాటు యాత్రా ప్రదేశాలు దర్శించుకొని మేము మార్చి 1వ తారీఖు చెన్నై నుండి ఫ్లైటులో తిరుపతికి చేరుకున్నాము.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.