మా కథ

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          అప్పుడు వాళ్లో ఉత్తరం పట్టుకొచ్చారు. అది చాల కుదురుగా, అందంగా రాసి ఉంది. నార్ బెల్టి నాకు చాలమంచి స్నేహితురాలు గనుక ఆవిడ రాత నాకు బాగా తెలుసు. ఆ ఉత్తరంలో ఉన్నది మాత్రం కచ్చితంగా ఆవిడ రాతకాదు. ఆ ఉత్తరంలో నార్బెర్టా – ది ఆగిలార్ నైన తాను తన పిల్లల మీద ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఫలితంగా తనకు తెలిసిన విషయాలు ప్రకటిస్తున్నాననీ, ఇంతీ చెప్పిన ప్రకారం తాను నాకు నూట ఇరవై మిలియన్ పిసోలు అందజేశాననీ, ఈ డబ్బు గనుల నుంచి జనాన్ని ఏరి గెరిల్లా దళంలోకి పంపడానికి ఇచ్చాననీ రాసింది. సంవత్సరాంతాని కల్లా యాభై మందిని గెరిల్లాలుగా మార్చడానికి నేను వాగ్దానం చేశానని కూడా రాసి ఉంది. తానీ వివరాలన్నీ తన పిల్లల జీవితాలు రక్షించుకోవడానికే ప్రకటిస్తున్నాననీ, “నా దేశం నన్ను అర్థం చేసుకొని, క్షమిస్తుందనే ఆశిస్తున్నాను” అని రాసి ఉంది. చివరన నార్ బెర్టా అని సంతకం చేసి చనిపోయిన ఆగిలార్ భార్య అని రాసి ఉంది.

          “చూశావా, నీ మంచి స్నేహితురాలే నీకు ద్రోహం చేసింది” అన్నాడు సార్జెంట్.

          “ఆమె నా మంచి స్నేహితురాలు కనుకనే నాకామె చేతి రాతా, సంతకమూ, బాగా తెలుసు. ఇది ఆమె రాతా కాదనీ, సంతకమూ ఆమెది కాదనీ నేను కచ్చితంగా చెప్ప గలను” అన్నాను. వాడికి చాల కోపం వచ్చింది.

          “అయితే రుజువు చూపాక కూడ కాదనే అంటున్నావన్నమాట. నీకింకా తగిన శాస్త్రి కావాల్సి ఉందిలే.”

          అప్పుడు వాడు నాకు కొన్ని రికార్డ్ చేసిన మాటలు వినిపించాడు. దాంట్లో ఒక స్త్రీ యూనివర్సిటీ విద్యార్థిని అట – ఎవరో నెగ్రాన్ అనే ఆయన చెప్పిన ప్రకారం నాకు 150 మిలియన్ పిసోల డబ్బు అందజేశానని చెప్పింది. అంటే, మొత్తం మీద వాళ్ళు నా లెక్కలో ఇప్పటికి 270 మిలియన్ పిళల డబ్బు వేశారు.

          “ఆ డబ్బంతా ఎక్కడ పెట్టావు? అమ్మయ్యో, అంత డబ్బు… ఎక్కడ దాచావు…” అని వాడు తర్కించి అడిగాడు. “జవాబు చెప్పవేం…” అంటూ కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. ఎనిమిది నెలల గర్భిణిని, నన్ను వాడు యమ యాతన పెట్టాడు.

          వాడు నన్ను కొడుతున్న పద్ధతి చూసి నా పక్కన సబ్ మెషిన్ గన్ పట్టుకొని నిలుచున్న సైనికుడొకతను కూడ . ఆందోళన పడ్డాడు. కాని ఈ కర్కోటకుడు మాత్రం, నాలాంటి నాస్తికులమీద, కమ్యూనిస్టుల మీద జాలి చూపనవసరం లేదన్నాడు. కమ్యూనిస్టులకు ఏ నీతి నియమాలు ఉండవనీ, పశువులకంటె హీనమైన వాళ్ళనీ తిడుతూ వాడు నన్ను ఎడతెగకుండా కొడూ పోయాడు.

          నేను కాచుకోగలిగినంత సేపు వాడి దెబ్బలు కాచుకున్నాను. నేనలా కాచు కుంటున్న కొద్దీ వాడి కోపం ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఎక్కువగా కొట్టడం సాగించాడు. వాడసలు అప్పుడు తాగి ఉన్నాడు.

          కొంత సేపటికి వాడు తన మోకాలితో నా కడుపు మీద వత్తడం మొదలెట్టాడు. ఓ వైపు అలా నా పొత్తికడుపు మీద కూచుని మరోవైపు నా గొంతు పిసికెయ్యడానికి ప్రయత్నించ సాగాడు. నేను నొప్పితో, బాధతో మూలిగాను, అరిచాను. వాడు అలా నా కడుపును అణగదొక్కి చీల గొద్దామనుకున్నాడేమో! వాడింకా ఎక్కువగా నొక్కిన కొద్దీ ఊపిరాడడమే కష్టమైపోయింది. అప్పుడు నా రెండు చేతులూ ఉపయోగించి నాకున్న శక్తి అంతా తెచ్చుకుని, నా గొంతు మీది నుంచి వాడి చేతులు పక్కకి లాగేసాను. నాకా సమయంలో అది ఎట్లా తట్టిందో, ఆ పని ఎలా జరిగిందో నాకిప్పుడు సరిగా గుర్తులేదు గాని అకస్మాత్తుగా నేను వాడి చేతిని మణికట్టు దగ్గర పట్టుకొని లాగి పదేపదే కొరికాను. అప్పుడు నేనెంత కోపంగా ఉన్నానో, ఎంత ఉద్వేగంలో ఉన్నానో, నేను నరమాంసాన్ని కొరుక్కుతిన్నానని కూడ తట్టలేదు. అంటే నేనప్పుడు అంతగా మనసులో మనసులేకుండా, తోచకుండా ఉన్నాను.

          అప్పుడు అకస్మాత్తుగా నా నోటికి వేడిగా, ఉప్పగా ఏదో ద్రవం తాకింది. ఏమిటా అని నేను నోరు తెరిచి చూసేసరికి వాడి చెయ్యి ఊగులాగుతోంది. వాడి చేతిలో మణికట్టు దగ్గర కొంత మాంసం ఊడిపోయి వేలాడుతోంది. నేను నా నోటితో మనిషి రక్తం రుచి చూసినందుకు చాల అసహ్యంగా, వెగటుగా అనిపించింది. అప్పుడు నాకున్న కోపమంతటితోనూ వాడి రక్తం వాడి ముఖం మీదే ఊశాను.

          అది నాకిక అంతం… అంతే అంతమదే..

          వాడు ‘అబ్బా’, అని అరిచాడు. ఇక నా మీద భయంకరమైన హింస మొదలైంది. తన్నాడు, అరిచాడు, మొత్తుకున్నాడు. సైనికుల్ని పిలిచి నన్ను పట్టుకోమన్నాడు. వాడో పెద్ద రింగ్ తీసుకుని అది నా చుట్టూ పెట్టి బిగించడం మొదలెట్టాడు. అది బిగుస్తూ పోయినా కొద్దీ నేను నొప్పితో అరచాను. నేను మొత్తుకున్నప్పుడల్లా వాడు నా ముఖం మీద గుద్దాడు. తర్వాతేం జరిగిందో నాకు స్పృహ లేదు. నా తల పగిలి పోయినట్టనిపించిందన్న దొక్కటే నాకు గుర్తుంది. నా చుట్టూ ఏవో మంటలు కమ్ముకున్నట్టనిపించడమే నాకు గుర్తుంది అంతే.

          కలలోంచి లేచినట్టు నేను మేలుకుని చూసేసరికి నా పుక్కిటినిండా నా పళ్ళు ఉన్నాయి. కొన్ని పళ్ళు గొంతులో ఇరుక్కు పోయాయి కూడా. వాడి దెబ్బలకు ఆరు పళ్ళు విరిగిపోయాయి. నా ఒంట్లోంచి ఎక్కడ పడితే అక్కడ రక్తం ఎగజిమ్ముక వస్తోంది. నేను కళ్ళు కూడ పూర్తిగా విప్పార్చి చూడలేకపోయాను. ముక్కులోంచి సరిగా ఊపిరి పీల్చుకోలేక  పోయాను. కళ్ళు వాచి మూసుకుపోయి ఉన్నాయి. ఇది చూడడానికే మేలుకున్నానేమో మళ్లీ స్పృహ తప్పి పడిపోయాను.

          ఆ తర్వాత వాళ్ళు నా మీద నీళ్లు చల్లినప్పుడు నాకు మళ్ళీ స్పృహ వచ్చింది. అప్పుడక్కడ వేరే సైనికులున్నారు. కల్నల్ కొడుకును గాయపరచినందుకు ఫలితం అనుభవించవలసి ఉంటుందని వాళ్లు నాకు చెప్పారు.

          ‘ఈ ముండను లోపలికి తీసుకెళ్ళండి’ అని వాళ్లలో ఒకడు అరిచాడు. వాళ్లు నన్ను కొడుతూ తంతూ, అరుస్తూ మరో కొట్టులోపలికి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఇది పాత కొట్టుకంటె మరీ చీకటి గుయ్యారంలా ఉంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనబడడం లేదు.

          చాలా సేపటి తర్వాత కొట్లో మరోవైపు నుంచి ఒక నీడ నా వైపు రావడం కనిపించింది.

          అమ్మో – నాకప్పుడు బాగా భయం వేసింది. ఒళ్ళు జలదరించింది, వణికిపోయాను. మొత్తుకోవాలనుకున్నాను. నన్ను బలవంతాన అనుభవిద్దామనుకున్న ఆ వెధవ గుర్తొచ్చి వెన్నె ముకలోంచి చలిపాకింది. ఇప్పుడు మరో వెధవతో తలపడాల్సి వస్తోందను కున్నాను. నేనున్న చోటునుంచి వెనక్కి, వెనక్కి జరిగాను. ఛివరికి నా వీపుకి గోడ తగిలింది. ఆ నీడ నాకు దగ్గరగా వచ్చేస్తోంది. చాల కష్టంగా నేలమీద పాకుతూ ఆ మనిషి నా దగ్గరికి చేరాడు. ‘ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు?’ అని నేను ఆలోచించాను.  నన్ను లొంగదీయడానికి మరెవడన్నా వస్తున్నాడేమోననుకున్నాను. కాని అలానూలేడు. చిత్రహింసలనుభవించిన మరో కార్మికుడేమో ననిపించింది. అతికష్టం మీద పాకి వస్తున్నాడు.

          నేనింక వెనక్కి పోలేక ఆగిపోయాక అతను నా మీద చెయ్యివేసి “ధైర్యంగా ఉండు కామ్రేడ్, మనం గొప్ప పోరాటం చేస్తున్నాం. మహత్తరమైన ఉద్యమం నడుపుతున్నాం. బలహీనపడకు. మన భవిష్యత్తులో విశ్వాసం ఉంచు” అని సైగ్లో – 20 లో ప్రముఖమైన ఒక విప్లవగీతాన్ని మృదువుగా పాడడం మొదలెట్టాడు.

          నేను ఎంతగా భయంలో మునిగిపోయానంటే ఏమీ మాట్లాడలేక పోయాను. నేను చేయగల్గిందల్లా అతని చేతిని గట్టిగా పట్టుకోవడం. అలా ఒకరి చేతులు ఒకరం నొక్కు కుంటూ చాల సేపు కూచున్నాం. నేనెవరినో చెప్పే ధైర్యం లేకపోయింది నాకు. కనీసం స్త్రీ ననే విషయం కూడ చెప్పలేకపోయాను.

          “ధైర్యంగా ఉండు. భవిష్యత్తుమీద విశ్వాసం ఉంచు. మనం ఇతరులకు ఉత్సాహం ఇవ్వాలి. మనం ఒంటరిగా లేం కామ్రేడ్, మనం మనకోసంఏమీ చేయడం . లేదు. ఒక మహత్తర ఆశయం కోసం చేస్తున్నాం. అది ఎన్నటికీ చావదు…”

          ఆయన నాతో అలా ఎన్నో విషయాలు చెప్తూ పోయాడు. ఆ మాటలన్నీ నా మనసులో అచ్చు గుద్దినట్టు నిలిచిపోయాయి. ఆ నిరాశామయ సమయంలో ఆయన మాటలు నా శక్తినీ, ధైర్యాన్ని ఇనుమడింపజేశాయి. ఇప్పటికీ ఆయనెవరో నాకు తెలియదు.

          అలా ఎన్ని గంటలు గడిపామో!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.